న్యాయస్థానాలు జారీ చేసే రిట్స్ ఇవీ!
ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కుల పరిరక్షణ కోసం కొన్ని ఆదేశాలను రాజ్యాంగంలో పొందుపరిచిన న్యాయస్థానాలకు ఇచ్చారు. రిట్లు జారీచేసే అధికారం నిబంధన 32 ద్వారా సుప్రీంకోర్టుకు, నిబంధన 226 ద్వారా ఆయా రాష్ర్టాల హైకోర్టులకు ఉంటుంది.
రిట్ అంటే ఆజ్ఞ లేదా ఆదేశం అని అర్థం. ఉన్నత న్యాయస్థానం జారీచేసే ఆజ్ఞ లేదా ఆదేశాలను రిట్ అంటారు. వ్యక్తుల హక్కుల సంరక్షణ కోసం ఈ రిట్లు జారీచేస్తారు.
హెబియస్ కార్పస్ (Habeas corpus)
హెబియస్ కార్పస్ అనే పదం లాటిన్ భాష నుంచి వచ్చింది. హెబియస్ అంటే have కార్పస్ అంటే Body అనే అర్థం వస్తుంది. నిర్బంధించిన వ్యక్తిని కోర్టులో హాజరుపర్చడం.
ఈ రిట్ ప్రధాన ఉద్దేశం వ్యక్తిగత స్వేచ్ఛల పరిరక్షణ, చట్టబద్ధత లేకుండా ఏ వ్యక్తిని కూడా బందించకుండా, శిక్షించకుండా కాపాడటం. ప్రభుత్వ సంస్థలకు, ప్రైవేటు వ్యక్తులకు కూడా జారీ చేయవచ్చు. మూడో వ్యక్తికి (Third person) కూడా ఇందులో జోక్యం చేసుకునే హక్కు ఉంటుంది. బాధితుల తరఫున సామాజిక స్పృహ ఉన్న సంస్థ గాని లేదా వ్యక్తి గాని దాఖలు చేయవచ్చు. అందుకే దీనిని ఉదారమైన రిట్ అంటారు. అంతేకాదు వ్యక్తిగత స్వేచ్ఛ పరిరక్షణ సాధనం (Apostle of personal liberty), రక్షణ కవచం (Bul Wark).
జాతీయ అత్యవసర పరిస్థితి (ప్రకరణ 352) విధించినప్పుడు హైకోర్టులు ప్రకరణ 226 ప్రకారం హెబియస్ కార్పస్ రిట్ జారీ చేయలేవని A. D.M జబల్పూర్ ఎస్కే శుక్లా కేసు (1975-76)లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీన్ని హెబియస్ కార్పస్ కేసు అంటారు.
మినహాయింపులు
పార్లమెంట్ స్వాధికారులకు భంగం కలిగించిన కారణంగా వ్యక్తి నిర్బంధానికి గురైనప్పుడు అలాగే కోర్టు ద్వారా నేరారోపరణ నిరూపితం అయి ఖైదీగా శిక్షను అనుభవిస్తున్నప్పుడు ఇది వర్తించదు.
మాండమస్ (Mandamus)
మాండమస్ అంటే ఆదేశం అని అర్థం. సుప్రీంకోర్టు, హైకోర్టు జారీచేసే అత్యున్నతమైన ఆదేశంగా చెప్పవచ్చు. ప్రభుత్వాధికారిగాని, సంస్థగాని చట్టబద్ధమైన విధులను నిర్వర్తించనప్పుడు వాటిని నిర్వర్తించమని న్యాయస్థానం ఇచ్చే ఆదేశం.
ప్రభుత్వాధికారులు, సంస్థలు తమ విధులను చట్టబద్ధంగా నిర్వర్తించనప్పుడు ప్రజల హక్కులకు భంగం కలుగుతుంది. అలాంటి సందర్భాల్లో వారితో తమ విధులను నిర్వర్తింపచేయడానికి ఈ రిట్‌ను జారీచేస్తారు. మాండమస్ రిట్‌ను పబ్లిక్ సంస్థలకు, క్వాసి పబ్లిక్ (Quasi-public), జ్యుడీషియల్ సంస్థలకు, క్వాసి జ్యుడీషియల్ (Quasi Judicial) సంస్థలకు వ్యతిరేకంగా జారీ చేయవచ్చు.
మినహాయింపులు
రాష్ట్రపతి, గవర్నర్లకు ఈ రిట్ వర్తించదు. వీరు తమ అధికారాలు, విధులను నిర్వర్తించనప్పుడు వాటిని నిర్వర్తించమని ఏ కోర్టూ ఆదేశించలేదు.
ప్రైవేటు వ్యక్తులకు, ప్రైవేటు సంస్థలకు వ్యతిరేకంగా కూడా ఈ రిట్‌ను జారీచేయడానికి వీల్లేదు.
ప్రొహిబిషన్ (Prohibition)
ప్రొహిబిషన్ అంటే నిషేధించడం అని అర్థం.
ఏదైనా కింది కోర్టు లేదా ట్రిబ్యునల్ తమ పరిధిని
అతిక్రమించి కేసులు విచారిస్తున్నప్పుడు ఆ విచారణను తదుపరి ఆదేశాల వరకు ఆపివేయమని కోర్టు ఆదేశిస్తుంది. ఈ రిట్ ముఖ్య ఉద్దేశం కింది కోర్టులు తమ పరిధులను అతిక్రమించకుండా నిరోధించడమే.
ప్రొహిబిషన్ న్యాయ సంస్థలకు మాత్రమే వర్తిస్తుంది.
పరిపాలనా సంస్థలు, చట్టపరమైన సంస్థలకు వర్తించదు. ప్రైవేటు వ్యక్తులకు వ్యతిరేకంగా జారీచేయరు.
సెర్షియోరరీ (Certiorari-ఉన్నత న్యాయస్థాన పరిశీలనాధికారం)
సెర్షియోరరీ అంటే సుపీరియర్ లేదా టు బి సర్టిఫైడ్ లేదా బ్రింగ్ ది రికార్డ్స్ అని అర్థం. ఏదైనా విషయం కింది కోర్టు తమ పరిధిని అతిక్రమించి కేసును విచారించి తీర్పు చెప్పినప్పుడు, ఆ తీర్పును రద్దు చేసి కేసును పై స్థాయి కోర్టుకు బదిలీ చేయమని ఇచ్చే ఆదేశం. న్యాయస్థానాలు తమ పరిధులను అతిక్రమించకుండా నిరోధించడమే.
సెర్షియోరరీ ప్రైవేటు సంస్థలు, శాసన సంస్థలకు వ్యతిరేకంగా జారీచేయరు. ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్న పరిపాలనా సంస్థలకు జారీచేయవచ్చని ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఎన్విరో-లీగల్ యాక్షన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (1996) కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది.
కోవారెంటో (Quo-Warranto)
బై వాట్ వారెంట్ (By What Warrant) అని కూడా అంటారు. ఏ అధికారంతో అయినా ప్రశ్నిచడం అని అర్థం. ప్రజా సంబంధమైన పదవుల్లోకి అక్రమంగా వచ్చినా.. ప్రజా పదవులను దుర్వినియోగం చేసినా ఈ రిట్ ప్రకారం అతని అధికారాన్ని న్యాయస్థానాలు ప్రశ్నిస్తాయి. చట్టబద్ధత లేకపోతే ఆ పదవి నుంచి వెంటనే తొలగిపొమ్మని ఆదేశిస్తాయి. ఈ రిట్ ప్రధాన ఉద్దేశం ప్రజాపదవుల దుర్వినియోగాన్ని అరికట్టడమే.
ఈ రిట్ కోసం బాధితుడు మాత్రమే న్యాయస్థానాల్లో కేసు వేయాలనే నియమం లేదు. ప్రజా పదవులను దుర్వినియోగం నుంచి కాపాడాలనే సామాజిక స్పృహ ఉన్న ఏ పౌరుడైనా కోర్టును ఆశ్రయించవచ్చు.
మూడో వ్యక్తి కూడా ఇందులో జోక్యం చేసుకునే హక్కు (Locus Standi) ఉంటుంది.
ఇన్‌జంక్షన్ (Injunction-నిలుపుదల ఆదేశం)
ఈ రిట్ గురించి రాజ్యాంగంలో ప్రస్తావన లేదు. కేవలం సివిల్ వివాదాల్లో యథాస్థితిని (Status-Quo-Ante) కొనసాగించడానికి దీనిని జారీ చేస్తారు. ప్రాథమిక హక్కుల పరిరక్షణకు ఈ రిట్‌కు సంబంధం లేదు.
హెబియస్ కార్పస్ – బందీని హాజరుపర్చడం – వ్యక్తిగత స్వేచ్ఛల పరిరక్షన – మూడో వ్యక్తి కూడా రిట్ కోరవచ్చు.
మాండమస్ – ఆదేశం – ప్రభుత్వ అధికారుల చేత పనిచేయించడం – బాధితుడు మాత్రమే వేయాలి
ప్రొహిబిషన్ – నిషేధం – కింది కోర్టు పరిధిని నియంత్రించడం – న్యాయసంస్థలకు, పాక్షిక న్యాయ సంస్థలకు మాత్రమే వర్తిస్తుంది
సెర్షియోరరీ – సుపీరియర్ – కింది కోర్టుల పరిధిని నియంత్రించడం, తీర్పు వెలువడిన తర్వాత ఇచ్చేది – న్యాయసంస్థలకు, పాక్షిక న్యాయ సంస్థలకు మాత్రమే వర్తిస్తుంది.
కోవారంటో – ఏ అధికారం చేత – ప్రజా పదవులు దుర్వినియోగం కాకుండా కాపాడటం – మూడో వ్యక్తి కూడా కోరవచ్చు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు