తెలంగాణపై వలస పడగనీడ
1952, సెప్టెంబర్ 3, 4 తేదీల్లో సిటీ కళాశాల, ఉస్మానియా ఆస్పత్రి ప్రాంతాల్లో జరిగిన పోలీసు కాల్పులపై విచారణ చేయడానికి హైకోర్టు న్యాయమూర్తి శ్రీ పింగళి జగన్మోహన్రెడ్డి కమిటీని నియమించింది.
-సెప్టెంబర్ 9న ఈ కమిటీ నియామకం జరిగింది.
-వ్యక్తిగతంగా లేదా ప్రతినిధి ద్వారా ఎవరైనా విచారణలో పాల్గొనాలంటే సెప్టెంబర్ 15, 18న ఆయన చాంబర్లో కలుసుకోవచ్చునని నోటిఫికేషన్లో పేర్కొనడమే కాకుండా దీన్ని అన్ని వార్తా పత్రికల్లో ప్రచురించారు.
-ప్రజల్ని చెదరగొట్టడానికి గాల్లోకి కాల్పులు జరపాల్సి ఉండగా, వారు అలా చేయలేదని డాక్టర్ జయసూర్య విచారణ కమిషన్ ముందు పేర్కొన్నాడు.
-హైదరాబాద్ డిస్ట్రిక్ట్ పోలీస్ మాన్యువల్ ఆర్టికల్ 287 ప్రకారం పోలీసులు కాల్పులు జరపడం నిషేధం. ఈ విషయాన్నే పోలీస్ కమిషనర్ విచారణ సంఘం ముందు చెప్పారు.
-కళాశాల యూనియన్ తరపున వాసుదేవ హాజరయ్యాడు.
-అతాదుల్ రెహమాన్ ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ ఫెడరేషన్, దేశ్‌ముఖ్, ఓంకార్ ప్రసాద్‌లు పీడీఎఫ్ తరఫున హాజరయ్యారు.
-విచారణకు హాజరయ్యే సాక్షుల్లో సీఎం బూర్గుల, పోలీస్ కమిషనర్ శివకుమార్ లాల్, కాంగ్రెస్ నాయకుడు హయగ్రీవాచారి, అసిస్టెంట్ కమిషనర్ బాలరాజ్ ఉన్నారు.
కమిటీ నివేదిక (డిసెంబర్ 28)
-జస్టిస్ జగన్మోహన్రెడ్డి కమిటీ తన నివేదికను 1952, డిసెంబర్ 28న ప్రభుత్వానికి సమర్పించింది. సెప్టెంబర్ మూడో తేదీన 30 నుంచి 40 వేల మంది జనం ఆందోళనలో పాల్గొనడం, పోలీసు ఆదేశాల్ని ధిక్కరించడం, ఊరేగింపునకు ప్రయత్నించడం, హెచ్చరికల్ని లెక్క చేయకపోవడం, లాఠీచార్జీ, టియర్‌గ్యాస్ ప్రయోగించినా ఫలితం లేకపోవడం,ఆందోళనకారులు పోలీసులపై రాళ్లవర్షం కురిపించడం, వైర్లెస్ వ్యాన్‌ను తగులబెట్టడం, వంటి పరిస్థితుల్లో పోలీసు కాల్పులు జరపడం సమర్థనీయమని కమిటీ అభిప్రాయపడింది. ప్రజాస్వామ్యంలో తమ సమస్యల్ని రాతపూర్వకంగా ప్రభుత్వానికి సమర్థించవచ్చునని అదేవిధంగా చట్టసభలకు ఎన్నికైన తమ ప్రతినిధుల ద్వారా ప్రభుత్వం దృష్టికి తెచ్చిపరిష్కరించుకోవచ్చని, చట్ట విరుద్ధంగా ఇష్టమొచ్చినట్టు రోడ్లపైకి రావడం సరైందికాదని కమిటీ పేర్కొంది.
(వి. ప్రకాశ్ రచించిన తెలంగాణ ఉద్యమాల చరిత్ర- రాష్ట్ర ఆవిర్భావం పుస్తకం నుంచి)
-ప్రాణనష్టం జరగడం, పలువురు గాయపడటం దురదృష్టకరమని కమిటీ అభిప్రాయపడింది.
-కొందరు పాదచారులు, అమాయకులు పోలీసు తూటాలకు గురయ్యారు. మరణించిన వారిలో అమాయకులు ఉన్నారనే కారణంగా చట్టబద్ధంగా జరిగిన పోలీసు కాల్పుల్ని చట్టవిరుద్ధమైనవిగా పరిగణించలేమని కమిటీ పేర్కొంది.
-పోలీసు కాల్పుల్లో మరణించిన, గాయపడిన వారిని ప్రభుత్వం దృష్టిలో ఉంచుకుని న్యాయమైందని, సరైందని భావిస్తే దానికి తగిన విధంగా పరిహారం చెల్లిస్తుందని భావించాలి.
-సెప్టెంబర్ ఫస్ట్‌వీక్‌లో మీటింగ్ పెట్టాలని అంతా ప్లాన్ చేసుకుని, అందరం హైదరాబాద్ సిటీ కళాశాల అఫ్జల్‌గంజ్ ఏరియాలో మీటింగ్ పెట్టుకుని నాన్ ముల్కీ గోబ్యాక్ అని స్లోగన్స్ ఇచ్చినం. ఇడ్లీసాంబార్ గో బ్యాక్, ఇడ్లీసాంబార్ అంటే మద్రాస్‌లో అప్పుడుండే గద గోంగూర పచ్చడి గోబ్యాక్ అనే స్లోగన్స్ జాజుతో రాసేది. దీన్ని బిగిన్ చేసింది మోస్ట్లీ స్టూడెంట్స్ అండ్ ఎన్జీవోస్- దానికి ట్రిగ్గర్ ఏది ? వరంగల్ ఇన్సిడెంట్. ట్రిగ్గర్ అయింది ఇగలాభం లేదనుకొని, సరే వెనుక ఇక్కడ టీచర్స్ ఉండిరి. కానీ ఆ రోజుల్లో కమ్యూనికేషన్స్ లేవు. మీడియా లేదు. అయితే స్ప్రెడ్ అయింది. బాగా స్ప్రెడ్ అయింది. ఇవి జయశంకర్ సార్ అనుభవాలు.
తెలంగాణ రాష్ట్ర డిమాండ్
-ఏడో నిజాం కాలంలో తెలంగాణలోని పాకాల, లక్నవరం (వరంగల్ జిల్లా), నిజాంసాగర్ (నిజామాబాద్), వైరా (ఖమ్మం), కడెం (ఆదిలాబాద్ జిల్లా) మొదలైన ప్రాంతాలకు ఆంధ్రప్రాంతం వారు ముఖ్యంగా కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వలసవచ్చారు. ఆయా ప్రాంతాల్లో పెద్ద చెరువుల కింద మిర్చి, పత్తి మొదలైన వాణిజ్య పంటలకు ఆనుకూలమైన నల్లరేగడి భూముల్ని కొనుగోలు చేసి లేదా ఆక్రమించి లేదా ప్రభుత్వం ద్వారా పొంది వ్యవసాయం చేయడం మొదలుపెట్టారు. కొందరు ఆంధ్రప్రాంతీయుల ఆధిపత్య దోరణితో వ్యవహరించడం, అనేక సందర్భాల్లో స్థానిక భాషా సంస్కృతుల్ని హేళన చేయడం మొదలైన అంశాలు ఆంధ్రప్రాంతీయుల పట్ల వ్యతిరేకభావాల్ని స్థానికులు పెంచుకోవడానికి దారీతీశాయి. స్థానికులు మాట్లాడేది తెలుగేకాదని, వారు బద్ధకస్థులని, తాగుబోతులని, వారికి వ్యవసాయం ఎలా చేయాలో తెలియదని మాట్లాడి తమపట్ల స్థానికులు వ్యతిరేకత పెంచుకోవడానికి వలస వచ్చిన కొందరు ఆంధ్రాప్రాంతీయులు కారణమయ్యారు.
గుంటూరు పల్లెల ఏర్పాటు
-ఇక్కడికి (తెలంగాణకు) వచ్చి, కొన్ని గ్రామాల్లో స్థిరపడిన ఆంధ్రాప్రాంతీయులు స్థానికులతో కలిసిమెలిసి ఉండకపోగా, స్థానిక ప్రజల భాషా సంస్కృతుల్ని గౌరవించలేదు. తెలంగాణ ప్రజలు ఎంతో ఇష్టంగా జరుపుకునే ఆచార, సంప్రదాయ పండుగల్లో వారు పాల్గొనకపోగా, వాటిని తప్పుపట్టే ప్రయత్నం చేశారు. వీరు ప్రజల మధ్య తమ నివాసాలు ఏర్పర్చుకోలేదు. గుంటూరు పల్లెలు, రెడ్డిపాలెం (రెడ్డిగూడెం) పేర్లతో గ్రామాలు ఏర్పాటు చేసుకున్నారు. స్థానిక ప్రజలకు, ఆంధ్రాప్రాంతీయులకు మధ్య దూరం పెరగడానికి ఇది మరో కారణం అయింది.
నాన్‌ముల్కీ- వ్యతిరేక ఉద్యమం
-1952లో నాన్ ముల్కీ వ్యతిరేక ఉద్యమం ప్రారంభమైంది. ఇడ్లీసాంబార్ గోబ్యాక్, నాన్ ముల్కీ గోబ్యాక్, గోంగూర పచ్చడి గోబ్యాక్ మొదలైన నినాదాలు ఉద్యమకాలంలో మార్మోగాయి. ఆంధ్ర, మద్రాసు ఇతర ప్రాంతాలకు చెందిన నాన్‌ముల్కీ ఉద్యోగులు, వ్యాపారుల పట్ల స్థానిక ప్రజల్లో పెరిగిన వ్యతిరేకత, తెలంగాణ ప్రజల్లో ప్రత్యేక రాష్ట్రం కావాలనే బలమైన కోరికకు పునాదులయ్యాయి.
టీచర్ల నియామకాలు, బదిలీల్లో అన్యాయం
-ఆంధ్రప్రాంతం నుంచి అనేక మందిని ఉపాధ్యాయులుగా నియమించడంతో అనేక పాఠశాలల్లో 50 నుంచి 60 శాతం ఉపాధ్యాయులు నాన్‌ముల్కీ (స్థానిక) సర్టిఫికెట్లను ఇచ్చేవారు. పట్టణాల్లోని పాఠశాలల్లో నాన్‌ముల్కీ (ఆంధ్రులు)లను నియమించుకోవడం కోసం ఈ పోస్టుతో అప్పటికే గల ఉపాధ్యాయుల్ని మారుమూలల్లో ఉన్న సింగిల్ టీచర్ స్కూల్‌కు పంపించేవారు. ఈ చర్యల వల్ల ఆంధ్రా అధికారులు, ఉపాధ్యాయులపై సహజంగానే స్థానిక ఉపాధ్యాయులకు కోపం ఏర్పడింది.
మిలటరీ ప్రభుత్వ కాలంలో అకృత్యాలు
-రజాకార్లు తమకాలంలో అనేక దుశ్చర్యలకు, అకృత్యాలకు, మానభంగాలకు, దోపిడీలకు పాల్పడ్డారు. ఎదురు తిరిగినవారిని, ప్రశ్నించివారిని కాల్చి చంపారు. రజాకార్ల దుశ్చర్యలు అన్నిఇన్నీ కావు కోకొల్లలు. అయితే 1948లో మిలటరీ ప్రభుత్వం ఏర్పడి నప్పటి నుంచి క్రీ.శ 1952లో ఎన్నికైన ప్రభుత్వం బూర్గుల నాయకత్వంలో ఏర్పడే వరకు కూడా తెలంగాణ ప్రాంతంలో అనేక అకృత్యాలు జరిగాయి. ఈ అకృత్యాలకు పాల్పడిన మిలటరీ ప్రభుత్వం పోలీసు, అధికారుల అడుగులకు మడుగులొత్తింది. ఆ పోలీస్ల్లో కూడా ఆంధ్రప్రాంతం నుంచి వచ్చినవారు ఉన్నారు.
త్యాగధనులు కొందరు ఆంధ్రులు
-తెలంగాణ ప్రాంతంలోని పోరాటయోధులకు, కమ్యూనిస్ట్ నాయకులకు ఆశ్రయం కల్పించారనే కారణంతో అనేక మందిని పోలీసులు చిత్రహింసలకు గురి చేశారు. కృష్ణా, గుంటూరు, విజయవాడ పట్టణానికి చెందిన కొందరిని కాల్చిచంపారు. వీరి ఆత్మత్యాగం గొప్పది, అజరామరమైంది. ఇలాంటి త్యాగధనులైన కొందరు, తెలంగాణ ప్రజల్ని కాపాడే మూలంగా తమ ప్రాణాలు కోల్పోయారు. ఇలాంటి విషయాల్ని మినహాయిస్తే తెలంగాణ భాషా సంస్కృతుల్ని అవహేళన చేస్తూ, బోగస్ముల్కీ(స్థానిక) సర్టిఫికెట్లలో తెలంగాణ వారికి రావాల్సిన అవకాశాల్ని కొల్లగొట్టిన వారే ఎక్కువగా కన్పిస్తారు.
విశాలాంధ్ర ఉద్యమం
-మద్రాసు ప్రెసిడెన్సియల్ నిజాం సంస్థానంలో ఉన్న తెలుగువారందరినీ సమైక్యం చేసి ఒకే రాష్ట్రంగా రూపొందించాలని సాగిన ఉద్యమమే విశాలాంధ్ర ఉద్యమం.
-కమ్యూనిస్టు, కాంగ్రెస్ పార్టీల్లోని కొందరు నాయకులు, కొందరు సాహితీవేత్తలు విశాలాంధ్ర నిర్మాణమే ఆంధ్రజాతికి శరణ్యమని ప్రచారం చేశారు.
-అయితే తెలంగాణలో విశాలాంధ్ర, తెలంగాణ వాదులు అనే భేదాలు ఏర్పడ్డాయి.
రక్షించమంటే దోపిడి చేసిన వైనం
చివరి నిజాం పాలనాకాలంలో రజాకార్లు అనేక దౌర్జన్యాలకు పాల్పడ్డారు. రజాకార్ల దాడుల నుంచి తమ కుటుంబ సభ్యుల్ని, తమను రక్షించుకోవడానికి అనేక కుటుంబాలు నిజాం రాష్ట్ర సరిహద్దుల దాటి తలదాచుకోవాల్సి వచ్చింది. షోలాపూర్, పూణె, ముంబాయి, నాగ్‌పూర్ ప్రాంతాలకు వెళ్లిన కుటుంబాల్ని అక్కడి వారు దయతలచి బాగానే చూసుకున్నారు. అయితే కృష్ణా జిల్లా, విజయవాడ పట్టణం, గుంటూరు, ఇతర తెలుగు ప్రాంతాలకు వెళ్లిన అనేక తెలంగాణ కుటుంబాల వారికి చేదు అనుభవాలు మిగిలాయి. తెలంగాణ ప్రజల్ని ఆదరించినట్లే ఆదరించి వారివద్ద గల వస్తువుల్ని నగల్ని, నగదుల్ని లాక్కున్నారు. లేదా తీసుకుని తిరిగి ఇవ్వలేదు. నిజాం రాజ్యంలో జీవించే ప్రజలు ధనవంతులని, హోటల్, లాడ్జి ధరలు పెంచి వసూలు చేయడం జరిగింది. అయితే కొందరు చేసిన ఇలాంటి పనుల వల్ల ఆంధ్ర ప్రజలంతా ఇలాంటి మనస్తత్వాన్నే కల్గి ఉంటారనే అనవసరపు ఆలోచనలు రావడానికి ఈ సంఘటనలు పురికొల్పాయి. ఈ విధంగా నష్టపోయి, సర్వసం కోల్పోయిన తెలంగాణ చెందిన కుటుంబాలు, తిరిగి వచ్చిన తర్వాత వాటిని ఇక్కడి వారికి చెప్పారు.
అడ్మిషన్లు ఇవ్వని ఆంధ్రావర్సిటీ
1938లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వందేమాతర ఉద్యమం జరిగింది. పీవీ నరసింహారావుర, అచ్యుతరెడ్డి, రామచంద్రారెడ్డి, హాయగ్రీవాచారి మొదలైన వారు ఈ ఉద్యమాల్లో ప్రధానపాత్ర పోషించారు. ఇతర ప్రాంతాలకు ఈ ఉద్యమం వ్యాపించింది. గుల్బర్గా, మహబూబ్‌నగర్, సిటీ కళాశాలల్లోని విద్యార్థుల్ని విశ్వవిద్యాలయం బహిష్కరించింది. ఈ నేపథ్యంలో కొంతమంది తెలంగాణ విద్యార్థులు మత చదువుల్ని ముందుకు కొనసాగించాలన్న ఉద్దేశంతో ఆంధ్రావిశ్వవిద్యాలయ వైస్ ఛాన్స్‌లర్‌ను సంప్రదించగా.. అడ్మిషన్లు ఇవ్వడానికి నిరాకరించారు. ఎందుకంటే నిజాం ఆంధ్రా విశ్వవిద్యాలయానికి విరాళం ఇచ్చాడు. చివరకు తెలంగాణ విద్యార్థుల పట్ల కనికరం చూపించిన నాగపూర్ విశ్వవిద్యాలయం వైస్‌ఛాన్స్‌లర్ తెలంగాణ విద్యార్థులకు అడ్మిషన్లు ఇప్పించడంలో తోడ్పడినాడు, సాటి తెలుగువారి పట్ల ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఇతర నాయకులు కానీ ఆదరణ చూపలేదని తెలంగాణ విద్యార్థులు చాలా బాధపడ్డారు. ఈ అంశం కూడా ప్రజల్లో నాటుకుపోయింది. తెలంగాణ ప్రజల్లో తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష పెరగడానికి ఈ సంఘటన కూడా దోహదం చేసిందని చెప్పవచ్చు.
పోలీస్ చర్యానంతరం వలసలు
భారతప్రభుత్వం క్రీ.శ 1948 సెప్టెంబర్‌లో పోలీస్‌చర్య(ఆపరేషన్ పోలో) జరిపి హైదరాబాద్‌ను ఇండియన్ యూనియన్‌ల్లో కలిపింది. ఆ తర్వాత ముస్లింలు అనేక కారణాలతో అనేక మందిని రెవెన్యూ ఉద్యోగాల నుంచి హైదరాబాద్ మిలటరీ ప్రభుత్వం తొలగించింది. తెలుగుభాష తెల్సిన వారనే నెపంతో పరిపాలనలో తమకు సహకరించడానికి ఆంధ్రప్రాంతం వారికి పెద్ద ఎత్తున ప్రభుత్వం ఉద్యోగాలిచ్చింది. తెలంగాణ ప్రాంతంలోని పాఠశాలల్లో తెలుగు బోధనాభాషగా క్రీ.శ 1949లో ప్రవేశపెట్టారు. ఇక్కడి పాఠశాలల్లో బోధించడానికి తెలుగు మాధ్యమంలో చదివి ఉండాలనే నిబంధన ఉండటంతో అనేక మందిని ఉపాధ్యాయులు ఆంధ్రప్రాంతం నుంచే నియమించారు.
బీఎన్ శర్మ
-విశాలాంధ్ర రాష్ట్ర నిర్మాణంతో తెలంగాణ ప్రజలకు ఎట్టి కష్ట, నష్టాలు వచ్చునో, ఆర్థిక, సామాజిక రంగాల్లో తెలంగాణ వాదులు ఎలాంటి సంకుచిత స్థితిలో ఉంటారో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఎలా మనగలుగుతుందో వివరిస్తూ బీఎన్ శర్మ మన తెలంగాణం, రెండు తెలుగు రాష్ర్టాలు ఎందుకు ? అనే గ్రంథాలు రాశారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు