‘అష్టసూత్ర’ అబ్రకదబ్ర
పెద్దమనుషుల ఒప్పందంలో భాగంగా తెలంగాణ ప్రాంతానికి ప్రకటించిన రక్షణల అమలుకోసం ఖమ్మంలో రవీంద్రనాథ్ ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారు. దీంతో ఉద్యమం తెలంగాణలోని అన్ని జిల్లాలకు విస్తరించింది. తెలంగాణలోని మధ్యతరగతి కుటుంబాల నుంచి అప్పుడప్పుడే వస్తున్న తొలితరం కాలేజీ విద్యార్థులకు తమ ప్రాంతంలోని ఉద్యోగాల్లో చట్టబద్దంగా తమకు దక్కాల్సిన వాటిని ఆంధ్రులు కాజేస్తున్నారని, వారి మూలంగా తమకు రావాల్సిన ఉద్యోగాలు తమకు దక్కకుండా పోతున్నాయని భావించిన విద్యార్థులు ఉద్యమంలోకి ప్రవేశించారు. దీంతో ఉద్యమ రూపురేఖలు మారి తెలంగాణలోని విద్యాసంస్థలన్నీ ఉద్యమ కేంద్రాలుగా మారాయి. ఉద్యమానికి కేంద్రబిందువుగా ఎదిగిన ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి సంఘం నాయకులు ఉద్యమానికి దిశానిర్దేశం చేసే నాయకత్వ బాధ్యతలను పోషించారు.
-ఉద్యమం పూర్తిగా విద్యార్థి నాయకుల అదుపు ఆజ్ఞల్లో ఉండటాన్ని గమనించిన నాటి ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘం నాయకుల్లో చీలికలు తేవడానికి పావులు కదిపారు. ఇందులో భాగంగా ఉస్మానియా యూనివర్సిటి విద్యార్థి సంఘం అధ్యక్షుడైన ఆర్ వెంకట్రాంరెడ్డిని తనకు అనుకూలంగా మలుచుకున్నారు. అతని ద్వారా ఉద్యమాన్ని కేవలం తెలంగాణకు ప్రకటించిన రక్షణల అమలుకు పరిమితం చేయాలని, అది తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ ఉద్యమంగా ఎదగకుండా చూసేందుకు ప్రయత్నించారు. దీంతో విద్యార్థుల్లో రెండు వర్గాలు ఏర్పడ్డాయి.
-ఒక వర్గం విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడేటప్పుడు తెలంగాణకు ప్రకటించిన రక్షణల అమలు గురించి ఉద్యమించాలని వాదించేవారు. దీనికి ఉస్మానియా యూనివర్సిటి విద్యార్థి సంఘం అధ్యక్షుడు, ముఖ్యమంత్రి అనుచరుడైన ఆర్ వెంకట్రాంరెడ్డి నాయకత్వం వహించారు.
-రెండో వర్గం విద్యార్థులు ఉమ్మడి రాష్ట్రంలో రక్షణలు అమలు జరుగుతాయని ఆశించడం అత్యాశే అవుతుందని, తెలంగాణ ప్రజలకు కేవలం ప్రత్యేక రాష్ట్రంలోనే న్యాయం జరుగుతుందని భావించేవాళ్లు. ఉస్మానియా యూనివర్సిటి విద్యార్థి సంఘం ప్రధాన కార్యదర్శి మల్లిఖార్జున్, విద్యార్థి నాయకులు శ్రీధర్‌రెడ్డి, పుల్లారెడ్డి తదితరులు నాయకత్వం వహించారు.
-రోజురోజుకు బలపడుతున్న తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమాన్ని దృష్టిలో ఉంచుకొని నాటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి 1969, జనవరి 18, 19న తెలంగాణకు ఇచ్చిన రక్షణల అమలు నిమిత్తం చర్చించడానికి అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న అన్ని పార్టీల సభ్యులు పెద్ద మనుషుల ఒప్పందంలో పేర్కొన్న అంశాల అమలులో ప్రభుత్వం నుంచి తప్పులు జరిగినట్లు నిర్ధారించారు. వాటిని సరిదిద్దే క్రమంలో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. దాన్నే అఖిలపక్ష ఒప్పందం అంటారు.
ఒప్పందంలో తీసుకున్న ముఖ్య నిర్ణయాలు
1) తెలంగాణ మిగులు నిధుల లెక్క తేల్చడానికి, వివాద రహితంగా ఈ అంశాన్ని పరిష్కరించడానికి కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాను సంప్రదించి ఆయన సూచించిన అధికారిని నియమించాలని అన్ని పార్టీల సభ్యులు అంగీకరించారు.
2) పూర్వపు హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న ఇండస్ట్రియల్ ట్రస్ట్ ఫండ్ తెలంగాణ ప్రాంతానికే ఉపయోగించబడుతుంది.
3) రాష్ట్రంలోని చట్టబద్దమైన బోర్డులు, కార్పొరేషన్లను ప్రభుత్వశాఖలతో సమానంగా పరిగణించి వాటి ఆదాయ, వ్యయాలను 2:1 నిష్పత్తిలో ఉభయ ప్రాంతాలు పంచుకోవాలి.
4) 1956, నవంబర్ 1 తర్వాత తెలంగాణ ప్రాంతంలోని స్థానికులకు రిజర్వ్ చేసిన ఉద్యోగాల్లో నియమితులైన స్థానికేతరులందరిని 1969, ఫిబ్రవరి 28లోగా తొలగించి, వారిని ఆంధ్రకు బదిలీ చేయాలని, ఆంధ్రలో ఖాళీలు లేకుంటే అదనపు ఉద్యోగాలు సృష్టించి వారిని నియమించాలని, తెలంగాణలో ఏర్పడే ఖాళీలలో స్థానిక తెలంగాణ వారిని నియమించాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి అఖిలపక్ష ఒప్పందాన్ని అమలు చేయడానికి జీవో నెం. 36ను జారీ చేశారు.
అఖిలపక్ష ఒప్పందం-ప్రధాన నిర్ణయాలు
1. 1956, నవంబర్ 1 నుంచి 1968, మార్చి 31 వరకు తెలంగాణ ప్రాంతానికి వివిధ పన్నుల ద్వారా వచ్చిన ఆదాయమెంత? ఆ ఆదాయాన్ని తెలంగాణలోనే ఖర్చు చేశారా లేక కొంత మొత్తాన్ని ఆంధ్ర ప్రాంత అభివృద్ధికి తరలించారా? ఒకవేళ ఆంధ్రప్రాంత అభివృద్ధికి తరలిస్తే అది ఎంత? దీన్ని నిర్ధారించేందుకు ఒక నిపుణుల కమిటీని నియమించాలి
2. తెలంగాణలోని ఉద్యోగాల్లో పనిజేస్తున్న నాన్ముల్కీలందరిని తొలగించి, ఎవరి ప్రాంతానికి వారిని పంపి ఏర్పడే ఖాళీలను తెలంగాణ స్థానికులతో (ముల్కీలతో) నింపాలి. వీటి అమలుకు 1969, ఫిబ్రవరి 28ని గడువుగా నిర్ణయించారు.
అఖిలపక్ష ఒప్పందం అమలులో భాగంగా ముఖ్యమంత్రి అభ్యర్థన మేరకు భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ తెలంగాణ మిగులు నిధులు లెక్కతేల్చడానికి కుమార్ లలిత్‌ను సూచించగా, 1969, జనవరి 23న కుమార్ లలిత్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. 1956, నవంబర్ 1 నుంచి 1968, మార్చి 31 వరకు తెలంగాణ మిగులు నిధులను నిర్ధారించి 1969, మార్చి 5లోగా నివేదిక ఇవ్వాలని కోరింది. సకాలంలోనే తమ నివేదికను ప్రభుత్వానికి అందజేసిన కుమార్ లలిత్ తెలంగాణ మిగులు నిధులు రూ. 34.10 కోట్లు ఉన్నట్లు నిర్ధారించారు.
3. తెలంగాణలో అమలులో ఉన్న ముల్కీ నిబంధనల ప్రకారం ఈ ప్రాంతంలోని ఉద్యోగాల్లో నియమితులైన నాన్ ముల్కీల తొలగింపునకు సంబంధించిన జీవో 36ను సవాల్ చేస్తూ నల్లగొండ జిల్లాలో వివిధ పాఠశాలల్లో పనిచేస్తున్న 37 మంది నాన్‌ముల్కీ ఉపాధ్యాయులతోపాటు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కు చెందిన 46 మంది నాన్‌ముల్కీలు హైకోర్టులో రిట్‌పిటిషన్ దాఖలు చేయగా కేసును విచారించిన జస్టీస్ చిన్నపరెడ్డి 1969, ఫిబ్రవరి 3న ముల్కీ రూల్స్ చెల్లవని తీర్పునిచ్చారు.
-దీనిపై ప్రభుత్వం డివిజన్ బెంచ్‌కి అప్పీల్ చేసింది. విచారణకు స్వీకరించిన జస్టీస్ పింగళి జగన్మోహన్రెడ్డి, ఆవుల సాంబశివరావులు ముల్కీ నింధనలు చెల్లుతాయని తీర్పునిచ్చారు. డివిజన్ బెంచ్ తీర్పు రాకముందే 1969, ఫిబ్రవరి 4న ఏవీఎస్ నరసింహరావుతోపాటు మరికొందరు జీవో 36ను సవాల్‌చేస్తూ నేరుగా సుప్రీంధర్మాసనాన్ని ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన సుప్రీం ధర్మాసనం 1969, ఫిబ్రవరి 17న జీవో 36 అమలును నిలిపివేస్తూ స్టే ఇచ్చింది. ఈ ఉత్తర్వులతో హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు అమల్లోకి రాకపోవడంతో జీవో 36 అమలు ప్రశ్నార్థకమైంది.
-అఖిలపక్ష ఒప్పందంలో తీసుకున్న నిర్ణయాల అమలుకు 1969, ఫిబ్రవరి 28ని గడువుగా విధించినందున తాము ప్రారంభించిన తెలంగాణ రక్షణల అమలు ఉద్యమాన్ని విరమిస్తున్నట్లు రక్షణల ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న ఆర్ వెంకట్రామారెడ్డి ప్రకటించారు.
-దీనికి తోడు 1969, జనవరి 22న ముఖ్యమంత్రి నా కోరికలు అంగీకరించారు కాబట్టి నేను దీక్ష విరమిస్తున్నాను అని రవీంద్రనాథ్ తాను ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్షను విరమించారు.
-ఉద్యమ విరమణను తీవ్రంగా వ్యతిరేకించిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రవాదులు ఉద్యమాన్ని తీవ్రతరం చేసేందుకు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
-ప్రత్యేక రాష్ట్ర ఆందోళనను కొనసాగించాలని మల్లిఖార్జున్ నేతృత్వంలోని ఉస్మానియా యూనివర్సిటి విద్యార్థుల సంఘం కార్యాచరణ సమితి నిర్ణయించింది.
-ఆమోస్ నేతృత్వంలోని టీఎన్జీవోలు, జర్నలిస్టులు ప్రతాప్ కిశోర్, రఘువీర్‌రావు, ఆదిరాజు వెంకటేశ్వరరావు, రమాకాంతరావు, స్వామి, డా. గోపాలకృష్ణ, ఈవీ పద్మనాభం, న్యాయవాదులు జీ నారాయణరావు, మదన్మోహన్ మొదలైనవారు విద్యార్థుల ఉద్యమానికి మద్దతు పలికారు.
-1969, జనవరి 24న సదాశివపేటలో విద్యార్థులపై జరిగిన పోలీస్ కాల్పుల్లో శంకర్, కృష్ణ అనే విద్యార్థుల మరణంతో ఉద్యమం తీవ్రమైంది.
-ఈ కాల్పుల తర్వాత 1969, మార్చి 3న తలపెట్టిన తెలంగాణ బంద్ విజయవంతమైంది. 1969, మార్చి 8న రెడ్డి హాస్టల్లో నిర్వహించిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సదస్సుతో ఉద్యమం తారాస్థాయికి చేరుకుంది.
-విద్యార్థుల ఉద్యమం రోజురోజుకు తీవ్రం కావడం, పరీక్షలు రాయడానికి విద్యార్థులు ఆసక్తి చూపకపోవడంతో మార్చి 25 నుంచి జూన్ 9 వరకు అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది.
-మదన్మోహన్ అధ్యక్షతన కొనసాగుతూ వచ్చిన తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్‌ను 1969, మార్చి 25న తెలంగాణ ప్రజాసమితిగా మార్చారు. మదన్మోహన్ అధ్యక్షులుగా ఎస్. వెంకట్రాంరెడ్డి ప్రధాన కార్యదర్శిగా 17 మంది అడహక్ కమిటి సభ్యులతో ప్రజాసమితి ఏర్పడింది.
-కొండాలక్ష్మణ్ బాపూజీ తెలంగాణ సమస్యపై 1969, మార్చి 28న మంత్రి పదవికి రాజీనామా చేసి ఉద్యమంలోకి ప్రవేశించడంతో రాజకీయ నాయకులపై వొత్తిడి పెరిగి ఒకరి తర్వాత ఒకరు ఉద్యమబాట పట్టారు.
-కొనసాగుతున్న ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకుని 1969, ఏప్రిల్ 10న ప్రధాని ఇందిర తెలంగాణ, ఆంధ్ర ప్రాంత నేతలతో, పార్లమెంటులోని వివిధ రాజకీయపార్టీల నేతలతో తెలంగాణ సమస్యపై చర్చించి ఏప్రిల్ 11న లోకసభలో ఒక ప్రకటన చేశారు.
-తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణ ప్రజల ఉద్యోగ అవకాశాల మెరుగుపర్చేందుకు చర్యలు చేపట్టాలని తను జరిపిన చర్చల సారాంశంగా ప్రధాని ప్రకటిస్తూ తెలంగాణ సమస్య పరిష్కారం కోసం 8 సూత్రాల పథకాన్ని ప్రకటించారు.
-ప్రధాని ప్రకటించిన అష్టసూత్ర పథకం అమలులో భాగంగా ప్రభుత్వం రెండు ప్రధాన నిర్ణయాలు తీసుకుంది.
1.1969, ఏప్రిల్ 19న తెలంగాణ ఉద్యోగుల సమస్యలను అధ్యయనం చేసి రాజ్యాంగ పరమైన పరిష్కారాలను సూచించడానికి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి వాంఛూ అధ్యక్షతన ఒక న్యాయ నిపుణుల కమిటీని కేంద్ర ప్రభుత్వం నియమించింది.
2. 1969, ఏప్రిల్ 22న తెలంగాణ మిగులు నిధులను అంచ నా వేయడానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి వశిష్ట భార్గవ నేతృత్వంలో ఒక ఉన్నతాధికార సంఘాన్ని నియమించి 1969, మే 31లోగా నివేదిక సమర్పించాలని కోరింది.
-మిగులు నిధుల లెక్కలు తేల్చిన జస్టిస్ భార్గవ, కుమార్ లలిత్ కమిటీ అంచనాలకన్నా తక్కువగా రూ. 28.34 కోట్ల తెలంగాణ మిగులు నిధులున్నాయని తేల్చారు.
-భార్గవ కమిటీ రిపోర్టును కేంద్ర హోంశాఖ ఆమోదిస్తూ 10 ఏండ్లుగా తెలంగాణ ప్రాంత మిగులు నిధులు పేరుకుపోవడంతో తెలంగాణలో అభివృద్ధి కుంటుపడిందని, దాన్ని పరిగణనలోకి తీసుకుని అదనపు నిధులను తెలంగాణ ప్రాంతానికివ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది.
-1968, ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమై 4వ పంచవర్ష ప్రణాళిక ముగిసేలోగా రూ. 45 కోట్లు తెలంగాణ అభివృద్ధిపై ఖర్చు చేయడానికి బడ్జెట్లో వెసులుబాటు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రం ఆదేశించింది. ఈ రూ. 45 కోట్లను కేంద్ర ప్రభుత్వం గ్రాంటుగా రాష్ర్టానికి ఇచ్చింది. దీంతో ఆ కాలానికి సంబంధించిన (1956, నవంబర్ 1 నుంచి 1968, మార్చి 31 వరకు) మిగులు నిధుల వివాదం సమిసిపోయింది.
-తెలంగాణ మిగులు నిధులకు సంబంధించిన సమస్య పరిష్కరింపడ్డా, తెలంగాణ ఉద్యోగులకు రక్షణలు కొనసాగించే అవకాశం న్యాయ రీత్యాగానీ, రాజ్యాంగ పరంగాగానీ లేదని కేంద్ర ప్రభుత్వం నియమించిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వాంఛూ తమ 31 పేజీల నివేదికలో అభిప్రాయపడటంతో తెలంగాణ ఉద్యోగులకు కల్పించబడ్డ రక్షణలు ప్రశ్నార్థకమయ్యాయి.
-ఈ నివేదికలో ఒక రాష్ట్రంలో లేదా కేంద్రపాలిత ప్రాంతంలో భాగంగా వున్న ఒక ప్రాంతంలోని ప్రజలకు ఉద్యోగ రంగంలో ప్రత్యేక రక్షణలు కల్పించడం సముచితం కాదని పేర్కొంటూ, తెలంగాణ నిరుద్యోగులకు సబార్డినేట్ సర్వీసుల్లో ఉద్యోగాలు ఇచ్చేందుకు తాలుకా, జిల్లా లేదా శాఖాధిపతుల స్థాయిలో నియామకాలు చేసుకోవచ్చని సూచించింది.
-తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షునిగా మర్రి చెన్నారెడ్డి 1969, మే 22న బాధ్యతలు చేపట్టడంతోనే ప్రజాసమితి ఒక రాజకీయశక్తిగా, పార్టీగా ఎదిగింది. శాసనమండలి ఎన్నికలో ఎస్ వెంకట్రాంరెడ్డి గెలుపుతో పాటు, ఖైరతాబాద్, సిద్ధిపేట ఉప ఎన్నికల్లో నాగం కృష్ణారావు, మదన్మోహన్ల వరుస విజయాలతో ప్రజాసమితి ప్రజల మన్ననలందుకుంది. దీనికి తోడు కొండా లక్ష్మణ్ బాపూజీ అధ్యక్షునిగా ప్రత్యేక తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఏర్పడింది. ఇందులో సంగం లక్ష్మీబాయి, సదాలక్ష్మి, బాగారెడ్డి, జగన్నాథరావు, రాజారాం, రాజమల్లు, హయగ్రీవాచారి, అచ్యుతరెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, కే. రాంచంద్రారెడ్డి క్రియాశీలపాత్ర వహించారు.
-చెన్నారెడ్డి ప్రజాసమితి అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన రోజే శ్రీధర్‌రెడ్డి పోటీగా ప్రజాసమితిని ప్రారంభించారు.
-ప్రభుత్వ ఉద్యోగుల, విద్యార్థుల, మున్సిపల్, విద్యుత్ ఉద్యోగుల సమ్మెకు మద్దతుగా విద్యాసంస్థల బంద్, పరీక్షల బహిష్కరణ బంద్‌లతో పోలీస్ లాఠీచార్జీలు, కాల్పులతో తెలంగాణ అంతటా ఉద్రిక్త వాతావరణం ఏర్పడ్డది. కేవలం మూడురోజుల వ్యవధిలో 1969, జూన్ 2 నుంచి 4 మధ్య జరిగిన పోలీస్ కాల్పుల్లో 20 మంది విద్యార్థులు మరణించారు. తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిణామాలను తీవ్రంగా పరిగణించిన ప్రధాని ఇందిర, దేశీయాంగ మంత్రి వైబీ చవాన్ క్షేత్ర స్థాయిలో పరిస్థితిని అధ్యయనం చేయడానికి హైదరాబాద్‌కు వచ్చి వివిధ వ్యక్తులతో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి పూనుకున్నారు. ఇంతలో లోక్‌సభకు మధ్యంతర ఎన్నికలు రావడంతో ఉద్యమం కొంత చల్లబడింది. మధ్యంతర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దేశమంతటా విజయం సాధించినా తెలంగాణలో మాత్రం డీలాపడింది. 1971లో జరిగిన ఈ ఎన్నికల్లో తెలంగాణలోని 14 లోకసభ స్థానాల్లో తెలంగాణ ప్రజాసమితి పదింటిని కైవసం చేసుకుని తనసత్తా చాటుకుంది. తెలంగాణలో ప్రజాసమితికి ఉన్న ప్రజల మద్దతును, 1972లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ప్రజాసమితిని కాంగ్రెస్‌లో విలీనం చేసుకునేందుకు ప్రధాని ఇందిరాగాంధీ పావులు కదిపారు. అందులో భాగంగా ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డితో రాజీనామా చేయించి, తెలంగాణీయుడైన పీవీ నరసింహారావును సీఎంగా నియమించారు. ఆ తర్వాత ప్రజాసమితి కాంగ్రెస్‌లో విలీనమైంది. దాని కథ అంతటితో ముగిసింది.
జీవో 36లోని ముఖ్యాంశాలు
1. 1959, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ నియమ నిబంధనల ప్రకారం స్థానిక తెలంగాణ వాసులకు కేటాయించిన ఉద్యోగాల్లో 1956 నవంబర్ 1న గానీ, ఆ తర్వాతగానీ నియమించబడ్డ స్థానికేతర (నాన్‌ముల్కీ) ఉద్యోగులందరూ 1969 ఫిబ్రవరి 28 లోపు తొలగించబడతారు.
2. నాన్‌ముల్కీల తొలగింపుతో ఏర్పడే ఖాళీలను అర్హులైన ముల్కీతో నింపుతారు.
3. అర్హులైన ముల్కీలు లభించనప్పుడు వారు లభించే వరకు ఏర్పడ్డ ఖాళీలను యధావిధిగా ఉంచుతారు.
4. ఉద్యోగాలు కోల్పోయిన నాన్ముల్కీలందరికి సర్వీస్ బ్రేక్ లేకుండా ఆంధ్రప్రాంతంలో ఉద్యోగాలివ్వబడుతాయి. దీనికోసం అవసరమైతే అదనపు ఉద్యోగాలు సృష్టించబడుతాయి.
-పై ఉత్తర్వుల తక్షణ అమలు కార్యకలాపాల పర్యవేక్షణ బాధ్యతలను రెవెన్యూ బోర్డు సభ్యులు ఐజే నాయుడు, ఆర్ విఠల్‌రావుకు అప్పగించారు.
తెలంగాణ అభివృద్ధికి, తెలంగాణ ప్రజల ఉద్యోగ అవకాశాల మెరుగులకు అన్ని చర్యలు చేపడుతాం
1969, ఏప్రిల్ 11న 8 సూత్రాల పథకాన్ని ప్రకటించిన సందర్భంగా నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఇచ్చిన హామీ..
1.పదవీ విరమణ చేసిన లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి అధ్యక్షతన ఉన్నతాధికార సంఘాన్ని నియమించాలి. ఇందులో రాష్ట్ర ఆర్థిక వనరులకు సంబంధించిన విషయాలపై అవగాహన ఉన్న ఒక ఆర్థికవేత్తను, కంట్రోలర్ ఆడిటర్ జనరల్ సీనియర్ ప్రతినిధిని సభ్యులుగా నియమిస్తారు. ఈ సంఘం తెలంగాణ మిగులు నిధులను నిర్థారిస్తుంది. వచ్చే నెలాఖరుకే తమ నివేదికను సమర్పిస్తుంది.
2. తెలంగాణకు సంబంధించిన మిగులు నిధులు ఖర్చుచేసే విషయమై కేంద్ర ఆర్థిక, దేశీయాంగ మంత్రిత్వశాఖల ప్రణాళికా సంఘం రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధుల మధ్య వెంటనే చర్చలు జరగాలి. తెలంగాణకు జరిగిన నష్టాన్ని పూరించడానికి అవసరమైన నిధులను సమకూర్చాలి.
3. ముఖ్యమంత్రి సూచనపై వెంటనే తెలంగాణాభివృద్ధికి సంబంధించి ఉన్నతాధికార సంఘం ఏర్పాటు చేయడానికి అంగీకరించింది. ముఖ్యమంత్రి అధ్యక్షుడిగా ఉండే ఈ సంఘంలో ప్రణాళికాసంఘం సభ్యుడు, తెలంగాణ ప్రాంతానికి చెందిన మంత్రులు, తెలంగాణ ప్రాంతీయ సంఘం అధ్యక్షులు సభ్యులుగా ఉంటారు. పంచవర్ష ప్రణాళికలో అభివృద్ధి కార్యక్రమాలు, తెలంగాణలో వివిధ రంగాలలో అభివృద్ధి లక్ష్యాల నిర్ణయం, నిర్వహణ కార్యక్రమాల అమలును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైన నిర్ణయాలు తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇవ్వడం ఈ ఉన్నతాధికార సంఘం విధులు.
4. నిర్ణయించిన ప్రణాళికలను అమలు చేయడానికి ప్రణాళికా సంఘం సలహాదారుని అధ్యక్షతన ఒక అధికారుల కమిటీని ఏర్పాటు చేస్తారు. ఆ కమిటీలో కేంద్రహోంశాఖ, ఆర్థిక శాఖల ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు.
5. తెలంగాణ ప్రాంతీయ సంఘానికి తరువాత ఆ ప్రాంత అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన యంత్రాంగానికి ఇంకా ఎక్కువ అధికారాలు ఇవ్వడం.
6. తెలంగాణ ప్రాంతం వారికి ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో రాజ్యాంగ సంబంధమైన రక్షణలు సమకూర్చే అవకాశాలను ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఈ విషయంలో న్యాయశాస్త్రవేత్తలతో కూడిన ఒక సంఘాన్ని సంప్రదిస్తుంది.
7. ముఖ్యమంత్రి సూచనపై యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధ్యక్షుని ఆధ్వర్యంలో కేంద్ర సలహా సంఘం హైదరాబాద్‌ను సందర్శించి ప్రభుత్వ ఉద్యోగుల సాధక బాధకాలను, కోరికలను సాధ్యమైనంత త్వరలో పరిశీలించి వాటిని పరిష్కరించడానికి తగిన సూచనలను దేశీయాంగ మంత్రికి సూచించాలి. కేంద్ర రాష్ట్ర సలహా సంఘాల సూచనలపై కేంద్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా రాష్ట్ర ప్రభుత్వం దాన్ని అమలు చేస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు ప్రధాని తమ ప్రకటనలో తెలిపారు.
8. తెలంగాణ సమస్యలపై కేంద్ర ప్రభుత్వం నిరంతరం తమ దృష్టిని సారించే నిమిత్తం ప్రధానమంత్రి సంవత్సరానికి రెండుసార్లు ముఖ్యమంత్రితోనూ, పైన పేర్కొన్న సంఘాలలోని ఆయన సహచరులతోనూ సమీక్షా సమావేశాలు నిర్వహించాలనే ముఖ్యమంత్రి సూచనను ఆమోదిస్తున్నట్లు ప్రధాని తెలిపారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు