తెలంగాణ సమాజం-భక్తి ఉద్యమాలు
దక్షిణ భారతదేశంలో ప్రాచీన, మధ్యయుగాల్లో పుట్టుకొచ్చిన భక్తి, మత ఉద్యమాల్లో శైవ మత శాఖలకు ఎనలేని ప్రాధాన్యం ఉంది. శైవ భక్తి ఉద్యమాలు ఒకరకంగా భారతదేశ చరిత్రను నిర్దేశించాయని చెప్పవచ్చు. మధ్యయుగంలో వీరశైవం, పాశుపత శైవం తదితర శాఖలు సమాజాన్ని తీవ్రంగా ప్రభావితం చేశాయి. తెలంగాణలో పూర్వకాలం నుంచి శైవానికి రాజాస్థానాల్లో విశేష ఆదరణ లభించింది. తెలంగాణలో ప్రస్తుతం దాదాపు ప్రతి గ్రామంలో శివాలయం కనిపించడానికి నాటి శైవ ఉద్యమాలే కారణం. అందువల్ల తెలంగాణ చరిత్రను సమగ్రంగా అధ్యయనం చేయాలంటే శైవ ఉద్యమాల గురించి కూడా తెలుసుకోవాలి. ఈ నేపథ్యంలో శైవ భక్తి ఉద్యమాలు, తెలంగాణలో శైవాలయాలు, శైవ సాహిత్యంపై ప్రత్యేక వ్యాసం నిపుణ పాఠకుల కోసం..
తెలంగాణ అనే పేరు శైవం నుంచి పుట్టింది. త్రిలింగ నుంచి తెలంగాణ వచ్చింది. త్రిలింగాలు 1 శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం. శైవం భారత ఖండంలోని ప్రాచీన మతం. శివం అంటే శుభం, సౌమ్యం అని అర్థం. వేదాల్లో శివపదం చాలాసార్లు ఉంది. ఉపనిషత్తుల్లో ఈ పదాలను రుద్రగా ఉపయోగించారు.
శైవమతంలో పది భేదాలు
-1. సామాన్యశైవం, 2. వీరశైవం, 3. మిశ్రమశైవం, 4. శుద్ధశైవం, 5. పూర్వశైవం, 6. శ్రౌతశైవం, 7. మార్గ శైవం, 8. విశేష వీరశైవం, 9. సామన్య వీరశైవం, 10. నిరాభార వీరశైవం.
-వీరశైవ మత స్థాపకులు శ్రీమద్ జగద్గురు ఆది రేణుకాచార్యులు. ఆయన అగస్త్య మహర్షికి ఉపదేశించారు. వీరశైవులకు మూల గ్రంథం సిద్ధాంత శిరోమణి. దీనిని శివయోగి శివాచార్యులు రచించారు. అద్వైతం అంటే రెండు కానిది. శివ దీక్షలన్నింటిలో లింగ ధారణ ఉత్తమమైనది. లింగమం ఆరు విధాలు. 1. ఆచారలింగం, 2. చరగురు లింగం, 3. శివలింగం, 4. జంగమ లింగం, 5. సత్యప్రసాద లింగం, 6. మహాలింగం.-వీర శైవం 7 విధాలు. అవి.. 1. అనాది శైవం, 2. ఆది శైవం, 3. మహాశైవం, 4. అనుశైవం, 5. అవాంతర శైవం, 6. అన్యశైవం, 7. వీరశైవం.
శైవం విభజన:
కాలాముఖ, కాపాలిక, పాశుపత, ఆరాధ్య, కాశ్మీర, వీరశైవం, శాక్తేయం, గోళకీయం, గోరక్షనాథం, రామేశ్వరం.
పంచ శివాచార్యులు
1.శ్రీ రేవణ సిద్ధశివాచార్యులు: కొలనుపాకలో జననం. ఇక్కడి సోమేశ్వరాలయంలో వీరశైవులే అర్చకులు. వీరు కర్ణాటకలోని చిక్మగళూరులో పీఠం స్థాపించారు. దీనికి వీర సింహాసన పీఠం అని పేరు.
2.మరుల సిద్ధశివాచార్యులు: వట క్షేత్రం జననం, ఉజ్జయినీలో పీఠం స్థాపించారు (నేటి బళ్లారి జిల్లా). సద్ధర్మసింహాసన పీఠం అంటారు.
3.ఏకోరామాధ్య శివాచార్యులు: వీరు ద్రాక్షారామంలో జన్మించారు (రామనాథలింగం). హిమాలయాల్లో పీఠం స్థాపించారు. దీనిని వైరాగ్య సింహాసన పీఠం అంటారు.
4.పండితారాధ్య శివాచార్యులు: శ్రీశైలంలో జననం (ప్రాచీన నామం సుధామ కుండం). పీఠం ఇక్కడే వెలిసింది. దీనిని శ్రీజగద్గురు పండితారాధ్య పీఠం పేరుతో స్థాపించారు. దీనిని సూర్యసింహాసన పీఠం అని కూడా పిలిచేవారు.
5.విశ్వారాధ్య శివాచార్యులు: కాశీలో జన్మించి అక్కడే పీఠం స్థాపించారు. దీనికి జంగమవాడి పీఠం, జ్ఞాన సింహాసన పీఠం అని పేర్లు.
వీరశైవ శాఖలు
1.కాలాముఖులు: దీని స్థాపకుడు కుహ్వరుడు. కాకతీయ రాజులు రెండో బేతరాజు, అతని కుమారుడు దుర్గరాజు, మొదటి ప్రతాపరుద్రుడు ఈ శాఖకు చెందినవారే. కాలాముఖ మఠాధిపతి ఆజన్మ బ్రహ్మచారిగా ఉండాలి. వీరికి శివారాధనతోపాటు శక్తి ఆరాధన కూడా ఉండాలి. వీరు కులాన్ని అంగీకరిస్తారు. కానీ అన్యమత ధూషణ చేయరు. వేరు మతస్థులను శివాంగభవులు అంటారు. ఈ శాఖకు లకులీశ తెగ అనే మరొక పేరు ఉంది.
2.కాపాలికులు: కపాలం ధరించేవారు కాపాలికులు. ఈ శైవమత చిహ్నాలు మొహంజొదారో తవ్వకాల్లో బయటపడ్డాయి. ఇది దక్షిణం నుంచి అటు వెళ్లిందని, శ్వేతాశ్వేతరోపనిషత్తు కాలం వరకూ శివుడు ఆర్యుల దైవం కాదని కొందరు పాశ్చాత్యుల అభిప్రాయం. ఈ శాఖకే గోళకీయం అని మరొక పేరు ఉంది. విశ్వేశ్వర శివాచార్యులు కాకతీయ గణపతి దేవచక్రవర్తి గురువు. మల్కాపురం శాసనంలో విద్యామంటప వర్తినం గణపతికా్ష్మపాల దీక్షాగురు శ్రీ విశ్వేశ్వర శంభు మీక్షితవతాంతే చక్షుషీచక్షుషీ అని ఉంది.
3.పాశుపతశాఖ: కాకతీయ గణపతిదేవుని కాలం నుంచి చివరి చక్రవర్తి రెండో ప్రతాపరుద్రుని వరకు ఈ శాఖ చాలా అభివృద్ధి దశలో ఉంది. దీన్ని స్థాపించింది సద్భావశంభుడు. పశు-పాశ-పతి అంటే మనిషిలోని ఆత్మబంధంలో ఉంది. పాశం అంటే అవిద్య. ఈ శాఖ సన్యాసుల పేర్ల చివర శివ, శంభు, పండిత, రుషి మొదలైనవి ఉన్నాయి. విశ్వేశ్వర శివదేశికుడు గణపతి దేవునికి, రుద్రమదేవికి గురువు. గణపతిదేవ చక్రవర్తి కాలంలో గోళకీమఠం బాగా ఆదరణ పొందింది. శ్రీశైలం, మందడం ప్రధాన కేంద్రాలు. ఇది కాకతీయుల రాజమతం.
4.ఆరాధ్యశైవం: ఇది వీరశైవంలో నుంచి చాలా కాలం తర్వాత వచ్చిన శాఖ. బసవేశ్వరుడే దీని స్థాపకుడు. వీరిని లింగధారులని అని అంటారు (కర్ణాటకలో లింగాయత్‌లు). పండితత్రయం శ్రీపతి పండిత, మల్లికార్జున పండిత, మంచన పండితులు ఈ శాఖ ప్రచారకర్తలు. కాకతీయులు ఈ శాఖను పెద్దగా ఆదరించలేదు.
5.వీరశైవం: దీన్ని బసవేశ్వరుడు స్థాపించారు. సాకార లింగరూపుడైన బసవేశ్వరుడు వీరశైవులకు పరమప్రాణం. బసవేశ్వరుడు అంటే శివుని వాహనం నంది అవతారమని ప్రజల విశ్వాసం. ఇతడు కర్ణాటకలోని బిజ్జలుని మంత్రి (కాలచూరి). వీరశైవానికి ప్రవక్త. భక్తి వీరి మతానికి ప్రాణం. ఆత్మరక్షణకు ఖడ్గం ధరిస్తారు. పాశుపతి శాఖవలే కాకుండా వీరు మత సహనం కలిగి ఉంటారు.
6.9వ శతాబ్దంలో కాశ్మీరశైవం కొద్ది మార్పులతో వీరశైవంగా మారిందని కొందరి అభిప్రాయం. వీరశైవుల దార్శనిక సిద్ధాంతం- శివ విశిష్టాద్వైతం. క్రీ.శ 12వ శతాబ్దం నుంచి 14వ శతాబ్దం వరకు వీరశైవమతం ప్రచారం ఎక్కువగా జరిగింది. శ్రీశైలం, ద్రాక్షారామం, కాళేశ్వరం మూడు భాగాలు ఓంకారానికి ప్రతీకలు.
తెలంగాణలో శైవాలయాలు
2కరీంనగర్ జిల్లా నగ్నూర్లో (నాలుగునూర్లు) 400 దేవాలయాల్లో నేడు ఒక శివాలయం ఉంది.
-కరీంనగర్ జిల్లా మంథని తాలూకా మహదేవ్పూర్కి 20 కి.మీ.ల దూరంలో కాళేశ్వరాలయం (11 శివలింగాలు) ఉన్నది. దీనిని దక్షిణ కాశి అని పిలుస్తున్నారు.
-హుజూరాబాద్‌కు 10 కి.మీ.ల దూరంలోని గొడిశాలలో పురాతన శివాలయం ఉంది.
-కరీంనగర్ జిల్లా వేములవాడ రాజరాజేశ్వరాలయం (చాళుక్యులు నిర్మించారు), భీమేశ్వరాలయం, నగరేశ్వరస్వామి ఆలయం (వైశ్యులు ఆరాధించేవారు).
-కేదారేశ్వరాలయం: వేములవాడలో రాజరాజేశ్వరాలయానికి దగ్గర్లో ఉంది. కేదారం= పంటపొలం (పాడిపంటలకు ఆది దేవత)
-నిజామాబాద్ జిల్లాలో నీలకంఠేశ్వరాలయం, కంఠేశ్వరాలయం, శ్రీనగరేశ్వరాలయం ఉన్నాయి.
-మహబూబ్‌నగర్ జిల్లాలో అలంపురం బ్రహ్మేశ్వరాలయం. శివుడు బ్రహ్మకిచ్చిన లింగం కనుక బ్రహ్మేశ్వర లింగం అయింది. దీనిని జోగుళాంబ ఆలయం అంటారు (పార్వతీ దేవికి మరోపేరు). ఈ బ్రహ్మేశ్వరాలయం చుట్టూ 8 దేవాలయాలు ఉన్నాయి.
1. కుమార బ్రహ్మేశ్వరాలయం, 2. వీరబ్రహ్మేశ్వరాలయం, 3. అర్క (సూర్య) బ్రహ్మేశ్వర, 4. పద్మబ్రహ్మేశ్వర, 5. విశ్వబ్రహ్మేశ్వర, 6. గరుడ బ్రహ్మేశ్వర, 7. స్వర్గ బ్రహ్మేశ్వర, 8. తారక బ్రహ్మేశ్వరాలయం.
-అలంపురంలో గణేశ్వర, పార్వతి, భైరవ, కార్తికేయ మొదలైన శైవ మత ఆలయాలున్నాయి. ఈ అలంపురాన్ని దక్షిణ కాశి అంటారు.
-రంగాపురానికి 3 కి.మీ. దూరంలో ఉన్న ఉమామహేశ్వర స్వామి ఆలయం.
-దిగువ మహేశ్వరం: కాకతీయు గణపతిదేవ చక్రవర్తి సామంతుడు చెరుకు బొల్లయ్యరెడ్డి, కరణ రామయ్య అనేవారు ఈ ఆలయాన్ని నిర్మించారు.
-మెదక్‌జిల్లా వీరభద్రస్వామి ఆలయం నర్సాపూర్ దారిలో బొంతపల్లి గ్రామంలో ఉంది. ఇది మెదక్ జిల్లాలోనే ప్రధాన శైవ క్షేత్రాల్లో ఒకటి.
-కొండపాక మండలం ఎల్లారెడ్డిపేటలోని త్రిలింగేశ్వరాలయం. ఇది హన్మకొండ వేయిస్తంభాల గుడిని పోలి ఉంటుంది.
-శ్రీకేతక సంగమేశ్వరస్వామి ఆలయం జహీరాబాద్‌కు 16 కి.మీ. దూరంలో ఉంది. ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశి అంటారు.
-స్వయంభూ దేవాలయం దుద్దెడ. ఇక్కడ ప్రతాపరుద్రుని సామంతుడు నాచిరెడ్డి కుమారుడు మాధవరెడ్డి వేయించిన దాన శాసనం ఉంది.
-శివంపేట మండలం గోమారంలో రామలింగేశ్వరాలయం ఉంది. వర్గల్లో శనేశ్వరాలయం ఉంది.
-పటాన్చెరువు మండలం బీరంగూడ అమీన్పూర్లో మల్లికార్జున స్వామి ఆలయం ఉంది. ఇది 13వ శతాబ్దంలో వెలిసింది. దీన్ని రెండో శ్రీశైలం అంటారు. 10వ శతాబ్దంలో నిర్మించిన సిద్దిపేటలోని భోగేశ్వరాలయం.
-వేల్పుగొండ తుంబురేశ్వరాలయం పెద్దశంకరంపేట వద్ద ఉన్న నార్సింగి నుంచి 8 కి.మీ. దూరంలో ఉంది. దుబ్బాక మండలంలోని కూడెల్లిలో రామలింగేశ్వరాలయం ఉంది. జోగిపేటకు 6 కి.మీ. దూరంలోని డాకూర్‌లో వీర భద్రేశ్వరాలయం ఉంది.
-వరంగల్ జిల్లా వేయిస్తంభాల గుడిని మొదటి ప్రతాపరుద్రుడు 1163లో నిర్మించాడు.
-1234లో రేచర్ల రుద్రుడు నిర్మించినది రుద్రేశ్వరాలయం.
-పాలంపేట రామప్ప దేవాలయం (1215లో)
-వరంగల్ రైల్వే స్టేషన్ సమీపంలోని త్రికూటాలయం
-రంగారెడ్డి జిల్లా కీసరగుట్ట రామలింగేశ్వరాలయం
-నల్లగొండ జిల్లా పానగల్లులో ఛాయాసోమేశ్వరాలయం, పచ్చల సోమేశ్వరాలయం, పిల్లలమర్రి ఆలయం.
-నాగులపాటి అన్నారంలో శైవాలయం
-అనంతగిరి, మేళ్లచెర్వు, తొగర్రాయి, గణపవరం శివాలయాలు
-పేరూర్ శివాలయం, కొలనుపాక శివాలయం (వీరశైవమఠం)
-పరడ, తాటికల్లు, నడిగూడెం, ఆలేరు, వడపర్తి, బొల్లేపల్లిలో మైలారు దేవాలయం, చిలుకగూడెం, సోమవరం, చందుపట్ల-విఘ్నేశ్వరాలయం, ఇంద్రపాలనగరం, వలిగొండ, ఆరూరు, నాగారం, పంతంగి, చాడ, మోత్కూరు, సదల్షాపూర్, దుప్పల్లి, కూరెళ్ల, మునగాల, మట్టపల్లి, అడవి దేవులపల్లి, ఆలగడప, నందిపాడు, చండూరు, దోమలపల్లి, చెరువుగట్టు, రామలింగాలగూడెం, కనగల్లు, ఆకారం, ఉర్లుగొండ, సిరికొండ, ఉండ్రుగొండ, ఆత్మకూరు, సూర్యాపేట మొదలైన చోట్ల శివాలయాలున్నాయి.
శైవ నృత్యం
కాకతీయ గణపతి దేవుని కాలంలో శైవనృత్య సంప్రదాయం ప్రారంభమైంది. గణపతి దేవుని బావమరిది జాయప నృత్యరత్నావళిలో అనేక విషయాలు ఉన్నాయి. అంతకుముందున్న నృత్యసంప్రదాయాలతో పాటు, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వీరశైవుల నర్తనం పేరిణి శివతాండవం వెలుగులోకి వచ్చింది. ఈ నృత్యం ఓరుగల్లులోని ప్రతీ ఆలయంలో రోజుకు మూడు పర్యాయాలు ఉండేది. ఈ వీరశైవ నృత్యం యుద్ధప్రేరణ కోసం, ప్రజల ఆహ్లాదం కోసం కూడా ప్రదర్శించేవారు. కాకతీయుల కాలంలో శ్రీశైలంలో 60 నాట్య బృందాలుండేవి. వీరశైవం బాగా ఉధృతంగా ఉన్న రోజుల్లో ప్రతిగ్రామంలో ప్రభుత్వం తరఫున ఒక నాట్యకారుడు ఉండేవాడు. ప్రభుత్వం, ఆ గ్రామ ప్రజలు అతనిని పోషించేవారు.
యుద్ధ సమయాల్లో గానీ, లేదా ఆ ఊరికి వచ్చే ఆపద సమయాల్లోగానీ, ఆ నర్తకుడు శివుని ముందు వీరనాట్యం చేసి తన ఖడ్గంతో తానే శిరస్సు ఖండించుకొని ఆత్మార్పణం చేసేవాడు. ఇటువంటి వారి శిల్పాలే వీరగల్లు శిల్పాలు (Hero stones) అంటారు. ఇవి తెలంగాణలో ప్రతిగ్రామంలోనూ కన్పిస్తాయి. ఈ వీరనాట్యం తెలుగు యువకులు అనేక ప్రదేశాల్లో, రాజ్యాల్లో ప్రదర్శించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ నృత్యం కాకతీయ ప్రతాపరుద్రుని కాలం వరకే ఉండి తరువాత అంతర్దానమయ్యింది.
శైవకవులు
-12వ శతాబ్ది ప్రత్యేకంగా శైవయుగమని పిలువవచ్చు. ప్రసిద్ధులైన ముగ్గురు కవులు ప్రచారం చేశారు. 1. పాల్కురికి సోమనాథుడు 2. పండితారాధ్యుడు 3. నన్నెచోడుడు.
-పాల్కురికి సోమనాథుడు: ఇతన్ని The Brain Of The Veera Shaiva Cult అంటారు. తెలంగాణలో పాల్కురికి గ్రామంలో (వరంగల్ జిల్లా) జన్మించాడు. ఇతని శైవ రచనలు చాలా ఉన్నాయి.
1.అనుభవసారం: ఇది అతని ప్రథమ కృతి. దీన్ని దొడగి త్రిపురారి అనే శివభక్తునికి అంకితం ఇచ్చాడు.
2.బసవపురాణం: ఇది ద్విపదం. 6,288 ద్విపదలు. శ్రీశైలం వెళ్తూ దారిలో దీన్ని రాసినట్టుగా పండితారాధ్య చరిత్రలో ఉంది. శ్రీశైలానికి శ్రీగిరి, శ్రీపర్వతం, శ్రీశైలం, సింగిరి అనే పేర్లు ఈ గ్రంథంలో వాడినారు.
3. వృషాధిప శతకం (108 పద్యాలు), 4. అక్షరాంక గద్యం, 5. అక్షరాంక పద్యాలు, 6. నమస్కార గద్యం, 7. పంచప్రాకార గద్యం, 8. శరణు బసవ గద్యం, 9. అష్టోత్తర శతనామ గద్యం, 10. సద్గుణ రగడ, 11. గంగోత్పత్తి రగడ, 12. బసవోదారణం, 13. చతుర్వేద సారం (ఇది వీరశైవ స్తోత్ర గ్రంథం), 14. సోమనాథ భాష్యం, 15. పద భాష్యం, 16. వృషభాష్టకం, 17. చెన్నమల్లు సీసాలు, 18. సోమనాథస్తవం, 19. మల్లయరేచ పురాణం, 20. పండితారాధ్య చరిత్రం (చివరి రచన)
-పండితారాధ్యుడు: వీరశైవ కవుల్లో ప్రథముడు. శివతత్తసారం అనే గ్రంథాన్ని రచించాడు. ఇతని శిష్యుడు నామయ్య పానగల్లువాసి. 12వ శతాబ్దంలో పానగల్లు గొప్ప వీరశైవ క్షేత్రంగా విలసిల్లిందని ఈ గ్రంథం తెలుపుతున్నది.
-నన్నెచోడుడు- కుమార సంభవం, శరభాంకుడు- లింగధారణ చంద్రిక, యధావాక్కుల అన్నమయ్య- సర్వేశ్వర శతకం (1242), కొలను గణపతిదేవ కవి- మనోబోధ,శివయోగసారం, నీలకంఠ రంగనాథ నాథాచార్యులు- వీరమహేశ్వరాచార్య సంగ్రహం (సంస్కృతంలో). దీన్ని ద్విపదలో లింగనామాత్యుడు రచించాడు, మారన (తిక్కన శిష్యుడు)- మార్కండేయ పురాణం (దీనిని ఓరుగల్లు తలారి గోన గన్నయ్యకు అంకితం ఇచ్చాడు). కేతన, మంచన రచనలు, శివదేవయ్య (గణపతిదేవుని గురువు)- పురుషార్థసారం, శివదేవాభిమాని శతకం (గణపతిదేవునికి అంకితం), శివయోగసారం, పోతన- వీరభద్ర విజయం, శివరాత్రి కొప్పయ్య రచనలు (ప్రతాపరుద్రునిచే డొకిపర్రు అగ్రహారం పొందాడు), శ్రీగిరి అయ్యగారు- నవనాథచరిత్ర.
కొలిచాల మల్లినాథసూరి- సాకల్యమల్లు (ప్రతాపరుద్రుని కాలం), పండితయ్య- శివతత్తసారం, మారన- మార్కండేయ చరిత్ర, శ్రీగిరికవి, రావిపాటి తిప్పన్న, నవచోళ చరిత్ర- పొలిశెట్టి లింగకవి, బసవ విజయం- నల్లనగండ్ల నరనరాధ్యుడు, బచ్చు సిద్ధకవి- బసవపురాణం, మరింగంటి వెంకటాచార్యుడు- మల్లాది చరిత్ర (1700), పిడుపర్తి సోమనాథుడు- ప్రభులింగ లీల, భద్రకవి లింగకవి (1530-42)- సానంద చరిత్ర, వింటి నేబళకవి- శివ రహస్య ఖండం, యాదాటి వెంకటనారాయణ- బ్రహ్మోత్తర ఖండం, గురవయ్య- సురభాండేశ్వరం, పులిగడ్డ యయ్యన పుత్రుడు- సురభాండేశ్వరం, శ్రీగిరి మల్లికార్జునస్వామి- సోమవార మహాత్మ్యం, కాలుపల్లి అర్చనమంత్రి- ఘటికాచల మహాత్మ్యం, సిద్ధేంద్రయోగి (దూదేకుల సిద్ధప్ప)- యోగీశ్వర విలాసం, కొలని గణపనారాధ్యుడు- మనోబోధ, పరమానందతీర్థ- శివ జ్ఞానమంజరి, యోగానంద అవధూత- ఆత్మైకబోధం, సోమన- గురుబోధ, నీలకంఠ నాగనాథాచార్యుడు- రుద్రాక్ష మహాత్మ్యం, చెన్నాప్రగడ నాగేశ్వరకవి- శైవ సిద్ధాంత శిఖామణి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు