వ్యవసాయ అనుబంధ రంగాలు పశు సంపద..
భారతదేశం అనాదిగా వ్యవసాయ ఆధారిత దేశం. దేశంలోని అత్యధిక మంది ప్రజలు వ్యవసాయరంగంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వ్యవసాయంతోపాటు పశుపోషణ భారతీయ రైతుల విశిష్ట లక్షణం. పాడి పశువులు, మాంసాన్నిచ్చే గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకాన్ని మన రైతులు ఒక పరిశ్రమగా కాకుండా జీవన విధానంలో భాగంగా మల్చుకొన్నారు. దేశంతో పశు సంపద అత్యధికంగా ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటి. రాష్ట్రంలోని రైతాంగం అదనపు ఆదాయం కోసం పశు పోషణపై ఆధారపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక ప్రోత్సాహక పథకాలను అమలుచేస్తున్నది. టీఎస్పీఎస్సీ గ్రూప్స్ సిలబస్‌లో వ్యవసాయ అనుబంధ రంగాల అంశాన్ని చేర్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పశు సంపదపై సమగ్ర సమాచారం అందిస్తున్నాం..
వ్యవసాయంతో ముడిపడి ఉన్నరంగాలను వ్యవసాయ అనుబంధరంగాలుగా పిలుస్తారు. పశువుల పెంపకం, కోళ్ల పరిశ్రమ, చేపల ఉత్పత్తి, అటవీ సంపదను వ్యవసాయ అనుబంధరంగాలుగా పిలుస్తారు. ప్రాథమిక రంగం వాటాను-17.9 శాతం, ఇందులో వ్యవసాయం వాటా 9.3 శాతం, పశు సంపద వాటా 7.1 శాతం, అడవులు, కలప వాటా 0.9 శాతం, చేపల వాటా 0.6 శాతంగా ఉన్నాయి.
పశుగణాభివృద్ధిరంగం కిందకు ఆవులు, బర్రెలు, గొర్రెలు, మేకలు, పందులు, కోళ్లు, కుక్కలు, కుందేళ్లు మొదలైనవి వస్తాయి. వీటిలో ఆవులు, బర్రెలను పాడి పశువులుగా, గొర్రెలు, మేకలను గొర్రెజాతి జంతువులుగా స్థూలంగా వ్యవహరిస్తుంటారు. వీటిని పెంచడం ద్వారా రైతులకు అదనపు ఆదాయం వస్తుంది. దీంతో మిశ్రమ వ్యవసాయం సాధ్యమై రైతు వ్యవసాయంలో తగినంత మూలధన వృద్ధిని సాధించగలరు. జీవ సంపద (పశుసంపద) వనరుల్లో తెలంగాణ సుపంన్నమైనది. ముఖ్యంగా దేశంలోని పాడి పశువులు, గొర్రెల్లో 5.52% తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయి. మొత్తం జీవ సంపద పరంగా రాష్ట్రం దేశంలో పదో స్థానంలో ఉండగా, 2007 జీవ సంపద లెక్కలను అనుసరించి, గొర్రెల పెంపకంలో మొదటిస్థానంలో, మేకల పెంపకంలో 12వ స్థానంలో, కోళ్ల పెంపకంలో 5వ స్థానంలో, పాడి పశువుల పెంపకంలో 13వ స్థానంలో, పందుల పెంపకంలో 17వ స్థానంలో ఉంది.
-జీవనోపాధి కోసం తెలంగాణలో దాదాపు 29 లక్షల కుటుంబాలు జీవోత్పత్తుల మీద ఆధారపడి ఉన్నాయి.
-జీవోత్పత్తుల విలువ వర్తమాన ధరల్లో రూ. 30,584 కోట్లు ఉంటుందని అంచనా. స్థూల రాష్ర్టోత్పత్తి (జీఎస్డీపీ)లో
-జీవోత్పత్తుల భాగం 7.1 శాతం. ఇది 2014-15 ముందస్తు అంచనాల ప్రకారం వ్యవసాయ రంగంలో 39.69 శాతం. జీవ సంపదలో ఆవులు, గేదెలు, తదితరాల పరిమాణం
-2012 జీవ సంపద లెక్కల ప్రకారం రాష్ట్రంలో 92.28 లక్షల పాడి పశువులు ఉండగా, వాటిలో ఆవులు 50.34 లక్షలు, గేదెలు 41.94 లక్షలు, రాష్ట్రంలోని గొర్రెలు, మేకల సంఖ్య 175.49 లక్షలు కాగా, వాటిలో గొర్రెలు 128.74 లక్షలు, మేకలు 46.75 లక్షలు. వీటిలో 10,09,575 పశువులతో ఆదిలాబాద్ ప్రథమ స్థానంలో ఉండగా తర్వాత స్థానంలో మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లా ఉన్నాయి. 17,913 పశువులతో హైదరాబాద్ చివరి స్థానంలో ఉంది. ప్రపంచంలో అత్యధిక పశు జనాభా కలిగిన దేశాల్లో 31.21 శాతంలో భారత్ మొదటిస్థానంలో ఉంది. బ్రెజిల్ రెండో స్థానంలో ఉండగా, చైనా, అమెరికా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
-తెలంగాణలో వివిధ రకాల పశువుల నిష్పత్తి సంఖ్య (లక్షల్లో) : ప్రస్తుత లెక్కల ప్రకారం గొర్రెలు – 128.74, మేకలు – 46.75, ఆవులు – 50.34, బర్రెలు – 41.94, పందులు – 2.51, కోళ్లు – 691.58.
-బర్రెలు : రాష్ట్రంలో మొత్తం బర్రెల సంఖ్య 41,94,319. ఇందులో నల్లగొండ గరిష్టంగా 7,90,063తో ప్రథమ స్థానంలో నిలవగా, ఖమ్మం, వరంగల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. చివరి స్థానంలో హైదరాబాద్ ఉంది.
-గొర్రెలు: తెలంగాణలో నమోదైన మొత్తం గొర్రెలు 1,28,74,859. ఇందులో ప్రథమస్థానంలో మహబూబ్‌నగర్ జిల్లా ఉంది. జిల్లాలో గొర్రెలు 37,30,689 ఉండగా, నల్లగొండ, వరంగల్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అయితే హైదరాబాద్ జిల్లాలో 13,657 గొర్రెలు ఉన్నాయి.
-ప్రపంచంలో గొర్రెపాల ఉత్పత్తిలో చైనా, టర్కీ, గ్రీస్, దేశాలు తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఉన్ని కోసం పెంచే గొర్రెల జనాభాలో చైనా ప్రథమ స్థానంలో ఉంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. తెలంగాణలో సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులకు చెందిన సుమారు 4.5 లక్షల గ్రామీణ కుటుంబాలు గొర్రెలు, మేకల పెంపకంలో ఉన్నాయి.
-మేకలు : రాష్ట్రంలో నమోదైన మొత్తం మేకలు 46,75,620 ఇందులో 6,87,066తో మహబూబ్‌నగర్ ప్రథమ స్థానంలో ఉంది. ఆదిలాబాద్, మెదక్ జిల్లాలు తర్వాత స్థానంలో ఉన్నాయి. 40,275 మేకలతో హైదరాబాద్ చివరి స్థానంలో ఉంది. పేదవాడి ఆవుగా (poor mans cow) పేరొందిన మేక పాల ఉత్పత్తిలో ప్రపంచ దేశాల్లో ఇండియా మొదటిస్థానంలో ఉంది. బంగ్లాదేశ్, పాకిస్థ్తాన్ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.
-పందులు: పశు సంపదలో భాగమైన పందుల సంఖ్య రాష్ట్రవ్యాప్తంగా 2,51,663 ఉంది. ఇందులో మహబూబ్‌నగర్ 55,048 కలిగి ఉండగా, తర్వాత స్థానాల్లో వరంగల్, కరీంనగర్ ఉన్నాయి.
-కోళ్లు: తెలంగాణలో నమోదైన మొత్తం కోళ్ల సంఖ్య 6,91,58,605. ఇందులో గరిష్టంగా రంగారెడ్డి జిల్లాలో 1,50,44,578 ఉన్నాయి. రంగారెడ్డి తర్వాత మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాలు ఉన్నాయి. 42,941తో హైదరాబాద్ చివరి స్థానంలో నిలిచింది.
-కుందేళ్లు : రాష్ట్రంలో మొత్తం 17,166 కుందేళ్లు నమోదయ్యాయి. ఇందులో వరంగల్‌లో గరిష్టంగా 5,849 నమోదయ్యాయి. తర్వాత స్థానంలో రంగారెడ్డి, హైదరాబాద్ ఉన్నాయి.
-కుక్కలు : తెలంగాణలో 3,47,015 కుక్కలు నమోదయ్యాయి. ఇందులో గరిష్టంగా రంగారెడ్డి జిల్లాలో ఉన్నాయి.
-మొత్తం పశుసంపద : తెలంగాణలో మొత్తం పశు సంపద 2,70,39,909గా నమోదయింది. ఇందులో గరిష్టంగా మహబూబ్‌నగర్ జిల్లాలో 57,13,886 నమోదయ్యాయి. తర్వాత స్థానంలో నల్లగొండ, వరంగల్ ఉన్నాయి.
మన ఊరు – మన పాడి ప్రణాళిక
నిధులను, మానవశక్తిని వివిధ ప్రభుత్వ పథకాల కూర్పును ఉపయోగించుకొని ప్రభుత్వ మన ఊరు – మన పాడి ప్రణాళిక పేరుతో మరొక సృజనాత్మక కార్యక్రమాన్ని ప్రారంభించింది. ప్రాథమికంగా 425 పాడి ఉత్పత్తిదారుల సహకార సంఘాలను గుర్తించింది. ఎలాంటి అవాంతరం లేకుండా తెలంగాణ రాష్ట్ర పాడి సామాఖ్యకు చెందిన గ్రామ పాల సేకరణ కేంద్రానికి (V.M.C.C) పాలను సరఫరా చేయాలనే షరతుతో రాష్ట్రంలోని రైతులు పాడి పశువులను కొనుగోలు చేయడానికి రుణాలు ఇవ్వడం ద్వారా పాడి కార్యక్రమాలను పెంచడానికి స్త్రీనిధి, క్రెడిట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్ ముందుకు వచ్చింది. పాల సేకరణ 26 జనవరి 2015 నాటికి రోజుకు 2.01 లక్షల లీటర్లకు పెరగడం జరిగింది. ఈ పథకాన్ని ప్రకటించడానికి ముందు, తెలంగాణలో రోజుకు 1.27 లక్షల లీటర్ల పాల సేకరణ జరిగింది. తెలంగాణలో మొత్తం పాల ఉత్పత్తి 2012-13 వరకు 3.9 మిలియన్ల టన్నులు (39,24,14,000 టన్నులు) నమోదయింది. ఇందులో కరీంనగర్లో గరిష్టంగా 6,15,000 టన్నులు ఉండగా తర్వాత స్థానంలో నల్లగొండ, ఖమ్మం ఉన్నాయి.
ప్రపంచంలో పాల ఉత్పత్తిలో అమెరికా ప్రథమ స్థానంలో ఉండగా, రెండో స్థానంలో భారతదేశం ఉంది. ఆ తర్వాత చైనా, న్యూజిలాండ్ ఉన్నాయి. మొత్తం పాల ఉత్పత్తిలో భారత్ 17 శాతం వాటాను కలిగి ఉంది. వైట్ రివల్యూషన్ కోపరేటివ్ మోడల్ ద్వారా గణనీయమైన ప్రగతిని సాధించింది. వైట్ రివల్యూషన్ (శ్వేత విప్లవం) పితామహుడు వర్గీస్ కురియన్ నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు (NDDB) గుజరాత్‌లోని ఆనంద్‌లో ఉంది.
-మాంసం : 2014 అక్టోబర్ 31 వరకు రాష్ట్రం 294 లక్షల మెట్రిక్ టన్నుల మంసాన్ని ఉత్పత్తి చేసింది
-చికెన్ : తెలంగాణలో 216 వేల టన్నుల చికెన్ ఉత్పత్తి అవుతున్నది. ఇందులో మెదక్ ప్రథమస్థానంలో ఉండగా, తర్వాత స్థానంలో రంగారెడ్డి, నల్లగొండ ఉన్నాయి.
-14 రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా చేపలను అత్యధికంగా ఉత్పత్తిలో చైనా మొదటిస్థానంలో ఉండగా, ఇండోనేషియా, అమెరికా తర్వాత స్థానంలో ఉన్నాయి. భారత్ ఏడో స్థానంలో ఉంది.
-పశు ఆరోగ్య సంరక్షణ కార్యక్రమం : జీవోత్పత్తుల పరిశ్రమ వృద్ధిలో పశువుల ఆరోగ్యం చాలా ముఖ్య పాత్ర పోషిస్తుంది. శస్త్ర చికిత్సలు, వ్యాధి పరిశోధన, చికిత్స సదుపాయాలను సమాకూర్చడం ద్వారా పశు ఆరోగ్య సేవల నాణ్యతను మెరుగుపరచడానికి ఇప్పుడున్న సంస్థలను పటిష్టం చేసే చర్యలను పశుగణాభివృద్ధి శాఖ చేపట్టింది. దీని కోసం ప్రతి జిల్లా ప్రధాన కార్యాలయంలోనూ పాలిక్లినిక్‌లను నెలకొల్పింది. పశు ఆరోగ్య సేవలను పటిష్టంగా అందించడానికి, ఉత్పత్తి కార్యక్రమానికి, జీవరాశి వ్యాధుల నివారణ, అదుపునకు అండగా నిలవడానికి ప్రతి మండలానికి ఒక పశు వైద్య పట్టభద్రుడిని సమకూర్చింది.
-మేత, దాణా అభివృద్ధి : జీవోత్పత్తులను, ముఖ్యంగా సంకర జాతి వాటిని శాస్త్రీయంగా, గిట్టుబాటయ్యే విధంగా పెంచాలంటే ఇతోధికమైన దిగుబడినిచ్చే పుష్టికరమైన మేత అత్యవసరం. పాలను, మాంసాన్ని ఇతోధికంగా పెంచాలంటే జీవరాశులకు శాస్త్రీయంగా ఆహారాన్నివ్వడం తప్పనిసరి. దీని కోసం అందుబాటులో ఉన్న పంట భూముల్లోనూ, బీడు భూముల్లోనురైతులు అధికోత్పత్తినిచ్చే గ్రాస పంటలను వేయాల్సి ఉంటుంది. వీటిని బాగా ప్రచారం చేయడానికి, వీటికి ప్రజాదరణ తేవడానికి ప్రభుత్వం పూనిక వహించింది. ఈ కార్యకలాపాలను ముమ్మరం చేయడానికి దాణా స్లిప్పలనూ, దాణా పచ్చికల మెరుగుపరిచిన విత్తనం రకాలను ఇస్తోంది.
-పశువుల మేతను పెంచడానికి 2013-14లో 4.64 లక్షల హెక్టార్ల పొలాన్ని, 2014-15లో 31.12.2014 వరకు 2.69 లక్షల ఎకరాల పొలాన్ని పశువుల మేత సాగు కోసం వినియోగించడం జరిగింది. రాష్ట్రంలో పాల ఉత్పత్తిని పెంచాలనే ధ్యేయంతో క్రమపద్ధతిలో వచ్చిన ప్రణాళిక పథకాల కిందనే మేత అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపట్టడం జరుగుతున్నది.
-రాష్ట్రంలోని కోళ్ల ఫారాలకు సాయం : రాష్ట్ర కోళ్ల ఫారాలకు సాయం అనే పథకం అమలులో ఉంది. 2008-09లో ప్రభుత్వ లైవ్‌స్టాక్ ఫారమ్, మామ్నూర్, వరంగల్ జిల్లాలో ఈ పథకం అమలు జరిగింది. వనరాజ గ్రామప్రియ కోళ్ల నిర్వహణ సభ్యుల సామర్థ్యాన్ని పెంపొందించడానికి, పథకం ప్రయోజనాల పంపిణీకి కూడా అవసరమైన ఏర్పాటు జరిగాయి. క్షేత్రంలో ఈ ఫారమ్ 2,39,985 కోడి పిల్లలను ఉత్పత్తి చేసి, సరఫరా చేసింది. పెరటిలో కోళ్ల పెంపకం సాగించడంలో 22,292 మంది రైతులకు శిక్షణ ఇచ్చింది.
రాష్ట్రీయ కృషి వికాస్ యోజన (R.K.V.Y) :
కేంద్ర సహాయంతో రాష్ట్రంలో అమలవుతున్న పథకం రాష్ట్రీయ కృషి వికాస్ యోజన. 2014-15లో జీవోత్పత్తుల రంగం నుంచి మొత్తం మీద 8శాతం వార్షిక వృద్ధిరేటును సాధించడం ఈ పథకం లక్ష్యం. నిరంతరమైన రెండేండ్ల ఆడదూడల దాణా సబ్సిడీ కార్యక్రమం (సునందిని) ఈ ప్రాజక్టులో భాగం. జాతి, ఆడదూడల వివరాలను ఈ ప్రాజెక్టుల్లో నమోదు చేసుకొని, దూడమేత, దూడ ఆరోగ్య సంరక్షణ, బీమాలను 2013-14లో ఏడాది పాటు కల్పించడం జరిగింది.
తిరిగి 2014-15లో అప్పటికే నమోదై ఉన్న ఆడ దూడలకు రెండో ఎడాదిలో దూడ మేతను సమకూర్చడం జరిగింది. ఈ ప్రాజెక్టు అమలుతో దూడల మరణాల స్థాయి బాగా తగ్గుముఖం పట్టింది. త్వరగా ఎదకు రావడం, పాల ఉత్పత్తి పెరుగుదల, పునరుత్పాదకత సాధనంగా వినియోగం, ఆదాయం ఉత్పత్తిలో పెంపు మొదలైన లక్ష్యాల మీద మంచి ప్రభావం చూపింది. ఈ ఫలితాల గూర్చి రైతుల హృదయాలకు హత్తుకునేలా చెప్పడానికి, నమోదైన దూడలతో క్రమ పద్ధతిలో ఊరేగింపులను నిర్వహించడం జరిగింది.
దూడల ఊరేగింపు – ప్రాజెక్టు ప్రభావం
1. దూడల మరణాల తగ్గుదల : సమతుల్యమైన రీతిలో దూడల మేతని, ఆరోగ్య సంరక్షణను అందించడంతో ఆవుదూడల ఆరోగ్య స్థితిగతులు మెరుగుపడ్డాయి. దూడల మరణాల స్థాయి తగ్గింది.
2. త్వరగా ఎదకు రావడం : ఆడదూడల చేత పోషకాలు ఉన్న అనుబంధపు మేతను తినిపించిన కారణంగా అవి త్వరగా ఎదకట్టడానికి దోహదం చేసింది. తద్వారా అదనంగా మరో దూడను ఈనడానికి దోహదం జరిగింది.
3. బలహీనమైన వాటి స్థానంలో భర్తీ : మంచి పాడి పశువుల మందను, జాతి ఆవులనూ ఉత్పత్తి చేయడానికి ఉద్దేశించిన ప్రయత్నంలో, పాత వాటి స్థానే పోషించిన ఆవులను ఉపయోగిస్తారు.
4. పాల ఉత్పత్తి పెంపు : ఆడదూడలను సారవంతమైన ఆహారంతో మేపడం, వాటి ఆరోగ్య సంరక్షణకు జాగ్రత్త వహించడం కారణంగా అవి చూడి కట్టే వయస్సు వచ్చే నాటికి వాటి పాల ఉత్పత్తి ఇతోదికమవుతోంది.
5. ఆదాయంలో అభివృద్ధి : త్వరగా ఎదకు రావడం వంటి కారణాల వల్ల దారిద్రరేఖ కింద ఉన్న రైతులకు అదనపు పాల ఉత్పత్తి ఆదాయాన్ని పెంచుతోంది.
-క్రమబద్ధమైన సంస్థల రకాలు : తెలంగాణలో పశువుల ఆరోగ్య అవసరాలను తీర్చడానికి వెటర్నరీ, పాలిక్లినిక్‌లు (8), సూపర్ స్పెషాలిటీ వెటర్నరీ హస్పిటల్(1), వెటర్నరీ హస్పిటళ్లు (101), వెటర్నరీ డిస్పెన్సరీలు (917), సంచార వెటర్నరీ క్లినిక్‌లు (11), గ్రామీణ జీవోత్పత్తి విభాగాలు (1105) పనిచేస్తున్నాయి. ఈ సంస్థలు 2014-15లో 401.66 లక్షల కేసులకు చికిత్సలు చేశాయి. 2.24 లక్షల జంతువులకు సంతాన నిరోధక చికిత్సలు జరిగాయి. 325.94 లక్షల టీకాలను వేయడం జరిగింది.
-వెటర్నరీ బయోలాజికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్-హైదరాబాద్ (V.B.R.I) : రాష్ట్రంలో వైరల్, బయోలాజికల్ టీకాలు ఉత్పత్తికి ప్రధాన వనరు హైదరాబాద్‌లోని వెటర్నరీ బయోలాజికల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఈ సంస్థ తొమ్మిది రకాల టీకాలను ఉత్పత్తి చేస్తున్నది. V.B.R.Iలో బ్యాక్టీరియల్, పీపీఆర్, షీప్ పాక్స్ టీకాల ఉత్పత్తి ప్రయోగశాలను డ్రగ్స్&కాస్మొటిక్స్ రూల్స్ 1945ని అనుసరించి G.M.P ప్రమాణాలను నిర్వర్తించడానికి వీలుగా ఆధునీకరించడం పూర్తయింది. జీవరాశుల మేల కోసం ఈ సంస్థ 2014-15లో 2014 డిసెంబర్ వరకు వివిధ రకాల టీకాలు 202.60 లక్షల మోతాదులు ఉత్పత్తి చేసింది.
-ప్రభుత్వ జీవోత్పత్తి శాలలు : తెలంగాణలో జాతి ఎద్దులను ఉత్పత్తి చేయడానికి పాడి పశు అభివృద్ధి కార్యకలాపాలకు అండదండలు ఇవ్వడానికి తగిన ప్రాంతాలను ప్రభుత్వ శాఖ ఎంపిక చేసి, అక్కడ పాడి పశుగణాభివృద్ధికి కేంద్రాలను నెలకొల్పింది. 2014 డిసెంబర్ వరకు మెదక్‌లోని గుడ్గర్పల్లిలో దేవని పశుగణాభివృద్ధి కేంద్రంలో 22 దేవని జాతి పశువులను పెంచుతున్నారు.
-పాల ఉత్పత్తి & ఉత్పాదకత : 2014-15లో రాష్ట్రం 2354.32 లక్షల మెట్రిక్ టన్నుల పాలను ఉత్పత్తి చేసింది. రాష్ట్ర జనాభాకు పాల తలసరి లభ్యత రోజుకు 234 గ్రాములు. రాష్ట్ర పాడి సమాఖ్యకు పాలు పోసే రైతులకు లీటర్ పాలకు రూ. 4 చొప్పున నగదు ప్రోత్సహకాన్ని రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. పాడి రంగంలో రైతుల లాభాన్ని పెంచడానికి, గ్రామాల్లోని జీవనోపాధిలో వారు నిలదొక్కుకోవడానికి మద్దతు ఇవ్వడానికి ఇవ్వడానికి ఉద్దేశించిన ఈ ప్రోత్సహకాన్ని అందించడానికి 2014 నవంబర్ 1 నుంచి ఒక కొత్త పథకాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది. ప్రోత్సహక మొత్తంగా తెలంగాణ పాడి రైతులకు ఇప్పటికీ 537.49 లక్షల రూపాయాలను పంపిణీ చేసింది.
-చేపలు : చేపలు పట్టే జాలరులు గరిష్టంగా వరంగల్‌లో ఉండగా, తర్వాత స్థానంలో నల్లగొండ, మెదక్ ఉన్నాయి. కనిష్టంగా హైదరాబాద్‌లో ఉన్నారు. రాష్ట్రంలో మొత్తం చేపల ఉత్పత్తి, 2,49,633 టన్నులు. ఇందులో గరిష్టంగా ఖమ్మం జిల్లా ప్రథమ స్థానం. తర్వాత స్థానంలో మహబూబ్‌నగర్, నల్లగొండ ఉన్నాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు