తెలంగాణలో గ్రంథాలయోద్యమం
తెలంగాణ ప్రాంతంలో ప్రారంభమైన గ్రంథాలయోద్యమం మహోన్నతమైనది. తెలంగాణ ప్రజల్లో ఉన్న సామాజిక చైతన్యాన్ని ద్విగుణీకృతం చేసింది గ్రంథాలయ ఉద్యమం.
అసఫ్‌జాహీల కాలంలో ప్రజలకు వాక్, పత్రికా స్వాతంత్య్రాలు, రాజకీయ హక్కులు లేవు. రాజ్యంలో వెట్టిచాకిరీ వ్యవస్థ, జాగీర్దారీ వ్యవస్థ, బాల్య వివాహాలు, అధిక పన్నులు మొదలైన పద్ధతులుండేవి. నాటి పాలకులు ప్రజల భాష పట్ల ఎంతమాత్రం సానుభూతి చూపలేదు. ప్రజల భాషతో అభివృద్ధిని వ్యతిరేకించారు. నాటి పాలకులు తెలుగు భాషను నిర్లక్ష్యం చేశారు.
-తెలంగాణ చరిత్రలో మహోజ్వలమైన, చారిత్రాత్మకమైన ఘట్టం గ్రంథాలయోద్యమం. హైదరాబాద్ రాజ్యంలోని ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడంలో ప్రముఖ పాత్ర పోషించిన ఉద్యమమే గ్రంథాలయ ఉద్యమం. తెలంగాణ ప్రజల్ని అత్యంత ప్రభావితం చేసింది ఈ ఉద్యమం. తెలుగు భాష సాంస్కృతిక, సారస్వత పునరుజ్జీవానికి మార్గాన్ని సుగమం చేసింది గ్రంథాలయోద్యమం. ఫలితంగా అనేక గ్రంథాలయాల స్థాపన జరిగింది. ఈ గ్రంథాలయాలు పత్రికలు, పుస్తకాలను పాఠకులకు అందించడమేకాకుండా సభలు, సమావేశాలకు, కవితా గోష్టులకు, వివిధ సంస్థల వార్షిక ఉత్సవాలకు వేదికను కల్పించి ప్రజలను మేల్కొల్పడంలో ప్రముఖ పాత్ర పోషించాయి.
ఉర్దూభాష ప్రభావం
నాడు హైదరాబాద్ నగరం అంటేనే ఉర్దూమయం. మాట్లాడేది, చదివేది ఉర్దూలోనే. ఉర్దూ భాషయే రాజభాష, ప్రాథమిక దశ నుంచి విశ్వవిద్యాలయ దశ వరకు ఉర్దూ బోధనా భాష కావడంతో తెలుగు భాష అజ్ఞాతవాసాన్ని అనుభవించింది. ఫలితంగా విద్యాధికుల్లో రెండు వర్గాలు ఏర్పడ్డాయి.
1. సంస్కృతం, తెలుగు భాషావర్గం
2. ఉర్దూ, పారశీక భాషావర్గం
-ఉర్దూ, ఆంగ్ల భాషా ప్రయోజనాలు పూర్తిగా భిన్నమైనవని చెప్పవచ్చు. ఉర్దూ పరిమితమైంది. కాగా ఆంగ్ల వాజ్ఞయం అపరిమతమైంది. ఆంగ్ల భాషా పరిజ్ఞానంతో ప్రపంచ సాహిత్యం, విజ్ఞానం తెలుసుకొనే వెసులుబాటు ఉండేది.
-హైదరాబాద్ రాజ్యంలోని ఉర్దూభాష తెలంగాణ, మహరాష్ట్ర, కన్నడ ప్రాంతాల్లో మాట్లాడే వివిధ భాషా వాజ్ఞయాల్లో ఎక్కువ పరిణామాల్ని కలుగజేయలేకపోయింది.
– బ్రిటీష్ ఇండియాలోని ప్రాంతాల్లో ఆంగ్లభాష ప్రజల విజ్ఞానానికి కారణమై వారిలో నూతనోత్సాహాన్ని కలిగించింది.
తెలుగు వాజ్మయ వికాసం
తెలుగు వాజ్ఞయం వికాసం చెందడానికి నాలుగు కారణాలు దోహదపడినట్లు తెలుస్తున్నది.
1) చరిత్ర పరిశోధన
2) విజ్ఞాన వాజ్ఞయాన్ని నిర్మించుకోవడం
3) కథానికల రచన
4) ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య ఏర్పడే సంఘర్షణ వల్ల ప్రేరేపితమైన కవితల రచనా సంప్రదాయం.
– అదేవిధంగా తెలంగాణలో తెలుగు వికాసానికి సంస్థానాధీశులు తోడ్పడ్డారు. గద్వాల, వనపర్తి, అమరచింత మొదలైన సంస్థానాధీశులు తెలుగు కవులను ఆదరించి, పోషించారు.
గణపతి, శివాజీ ఉత్సవాలు
– క్రీ.శ. 1893లో మహారాష్ట్ర ప్రాంతంలో గణపతి ఉత్సవాల్ని ప్రారంభించాడు బాలగంగాధర్ తిలక్. ప్రజలందరినీ ఒకే దగ్గరకు చేర్చి, వారిలో ఐక్యతను పెంపొందించి, బ్రిటీష్‌వారి పరిపాలనలో జరుగుతున్న వివిధ రకాల దోపిడీని వివరించి, వారిని స్వాతంత్య్రోన్ముఖులను చేయడానికి కృషి చేశాడు.
– క్రీ.శ. 1895లో శివాజీ ఉత్సవాలు మహారాష్ట్రలో ప్రారంభమయ్యాయి. మహారాష్ట్ర జాతి నిర్మాత, క్షత్రియ కులవసంత, సింహాసనాధీశ్వర, ఛత్రపతి బిరుదాంకితుడైన శివాజీ పేరు మీదుగా ఉత్సవాల్ని ప్రారంభించి ప్రజల్లో దేశభక్తిని పెంపొందించి, వారిలో చైతన్యం పెంపొందించడానికి ప్రయత్నాలు జరిగాయి.
వందేమాతర ఉద్యమం
క్రీ.శ. 1905లో నాటి బ్రిటీష్ ఇండియా వైస్రాయ్ లార్డ్ కర్జన్ విభజించు, పాలించు (డివైడ్ అండ్ రూల్) పాలసీలో భాగంగా బెంగాల్ విభజనకు పూనుకున్నాడు. దీనిని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా వందేమాతర ఉద్యమం జరిగింది.
తెలంగాణలో భిన్నమైన పరిస్థితి
మహారాష్ట్ర, బెంగాల్, ఆంధ్ర, మద్రాస్, పంజాబ్ మొదలైన అనేక ప్రాంతాల్లో బెంగాల్ విభజనను వ్యతిరేకిస్తూ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతుంటే, హైదరాబాద్ రాజ్యంలో నిజాం పరిపాలనలో విభిన్నమైన పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ప్రజల స్వేచ్ఛా, స్వాతంత్య్రాన్ని ప్రభుత్వం హరించింది. ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో నిజాంపాలనలో మగ్గుతున్న యువత ముఖ్యంగా విద్యాధికులైన మేధావులు విద్యావ్యాప్తి చేసి ప్రజల్లో ఉన్న అజ్ఞానాన్ని, అమాయకత్వాన్ని పోగొట్టి, రాజ్యహింసకు వ్యతిరేకంగా పోరాడటానికి వారిని సమాయత్తం చేయడానికి పఠనాలయాలు, గ్రంథాలయాలు స్థాపించారు. ఫలితంగా వారిలో చైతన్యం అధికమైంది. ఈ విధంగా తెలంగాణలో అనేక గ్రంథాలయాలు స్థాపించబడ్డాయి.
– కొమర్రాజు వెంకట లక్ష్మణరావు
– హైదరాబాద్ రాజ్యంలో తెలుగు, భాష సాంస్కృతిక పునర్వికాసానికి కృషి చేసిన వారు కొమర్రాజు వెంకట లక్ష్మణరావు
– ఆయన తెలుగు, మరాఠీ, ఆంగ్ల భాషల్లో ప్రావీణ్యం గడించారు. అంతేకాకుండా గుజరాతీ, ప్రాకృతం, సంస్కృతం, బెంగాలీ నేర్చుకున్నారు. ఆయన నాగ్‌పూర్‌లో విధ్యాభ్యాసం చేశారు.
– ఆ రోజుల్లో బి.జి.తిలక్, అగార్కర్, గోఖలే, రనడే మొదలైన జాతీయ నాయకుల ప్రభావం కొమర్రాజుపై పడింది.
– కేసరి అనే పత్రికలో వ్యాసాలు రాసేవారు.
– తెలంగాణలో సాంస్కృతిక చైతన్యానికి దోహదపడిన ప్రముఖ వ్యక్తి కొమర్రాజు.
– తెలుగు సాహిత్యం వికాసానికి గ్రంథాలయోద్యమం చేపట్టాలని పేర్కొనడమే కాకుండా, దానికనుగుణంగా కృషి చేశారు.
– ఊరూరా గ్రంథాలయాల్ని స్థాపించి, నిరక్షరాస్యత, అజ్ఞానంతో ఉన్న ప్రజలకు విజ్ఞానాన్ని ప్రసాదించాలని తెలుగు సాహిత్య రుచి గొప్పతనాన్ని వారికి తెలియజేయాలని చెప్పి గ్రంథాలయ ఉద్యమానికి గట్టి పునాదులు వేసిన మహానుభావుడు లక్ష్మణరావు.
– కొమర్రాజు చేసిన కృషితో తెలంగాణ ప్రజల్లో సామాజిక, సాంస్కృతిక, రాజకీయ చైతన్యం ద్విగుణీకృతమైంది.
– కొమర్రాజు మునగాల సంస్థానంలో రాజా నాయిని వెంకటరంగారావు వద్ద దివాన్‌గా చేరారు.
శ్రీ కృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం
– ప్రాధాన్యం: 20వ శతాబ్ది ప్రారంభంలో తెలంగాణలో స్థాపించిన తొలి గ్రంథాలయం.
– ఆశయం: సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి, తద్వారా భాషాభివృద్ధికి సాంస్కృతిక వికాసానికి కృషి చేయడం
– స్థాపకులు: మునగాల రాజా నాయిని వెంటకరంగారావు, కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావు, ఆదిపూడి సోమనాథరావు, ఆదిరాజు వీరభద్రరావు మొదలైనవారు. క్రీ.శ. 1901లో హైదరాబాద్‌లో శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం స్థాపించారు. తెలుగు భాషా వికాసానికి కృషి చేసిన విజయనగర సామ్రాజ్యాన్ని పాలించిన శ్రీకృష్ణ దేవరాయలు పేరుతో నెలకొల్పారు.
madhusudan- క్రీ.శ. 1901 సెప్టెంబర్ 1వ తేన (ఆదివా రం) రాంకోఠిలోని రావిచెట్టు రంగారావు బంగళాలో తెలుగు భాషాభిమానులు సమావేశమై భాషా నిలయానికి ప్రారంభోత్సవం చేశారు. పాల్వంచ సంస్థానం రాజా పార్థసారథి అప్పారావు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. మునగాల రాజా నాయిని వెంకటరంగరావు, రఘుపతి వెంకటరత్నంనాయుడు, ఆదిపూడి సోమనాథరావు, డాక్టర్ గోవిందరాజులు నాయుడు, శ్రీనివాసాచారి మొదలైనవారు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
– మాడపాటి హన్మంతరావు క్రీ.శ 1912లో ఈ గ్రంథాలయంలో సభ్యుడిగా చేరారు. క్రీ.శ-1914-15లో కార్యదర్శిగా ఎన్నికై శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయాభివృద్ధి కోసం కృషి చేశాడు.
– భాషా నిలయం అధ్యక్షుడిగా రాజా నాయిని క్రీ.శ. 1901 నుంచి 1939 వరకు, మొదటి కార్యదర్శిగా రావిచెట్టు రంగారావు 1906 వరకు కొనసాగారు.
– మొదట్లో రావిచెట్టురంగారావు ఇంట్లో స్థాపించిన గ్రంథాలయం, ఆ తర్వాత సొంత భవనం సమకూర్చుకున్నది. రావిచెట్టురంగారావు, పార్థసారథి అప్పారావు రూ. 750 విరాళాలు ఇచ్చారు.
చారిత్రక గ్రంథాలు
ఆంధ్రుల సాంఘిక చరిత్ర – సురవరం ప్రతాపరెడ్డి
ఆంధ్రుల చరిత్ర, సంస్కృతి – ఖండవల్లి లక్ష్మీరంజనం
ఆంధ్రుల చరిత్ర – చిలుకూరి వీభద్రరావు
సాహితి సమితులు
నవ్య సాహితి సమితి – రావి.నారాయణరెడ్డి
వైతాళిక సమితి – కాళోజీ నారాయణరావు
ఆంధ్ర సారస్వత పరిషత్ – దేవులపల్లి రామనుజరావు
బ్రిటీష్ ఇండియాతో పోల్చితే హైదరాబాద్ రాజ్యం 50 సంవత్సరాలు వెనుకబడి ఉంది – మందుముల నర్సింగరావు
గ్రంథాలయోద్యమమే తెలంగాణలో తొలి ఉద్యమం – సురవరం ప్రతాపరెడ్డి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు