మలిదశ ఉద్యమం ఇలా మొదలైంది
తెలంగాణ నేలలో జరిగిన పోరాటాలు ప్రపంచ విముక్తి పోరాటాలకు ప్రేరణగా నిలిచాయి. తెలంగాణలో జరిగిన ఉద్యమాలు దేశంలోని పలు ఉద్యమాలకు బాటలు వేశాయి. భూమి, భుక్తి, విముక్తి కోసం సాగిన పోరాటాలు దేశంలో భూసంస్కరణలకు కారణమయ్యాయి. ఈ నేలపైన సాగిన ఉద్యమాలు చరిత్రకే కొత్త పాఠాలు నేర్పాయి. రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఆంధ్రప్రదేశ్ అవతరణ నుంచే మొదలైంది. వలస వాదులు పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు అన్యాయం జరిగింది. వనరుల దోపడీ యథేచ్ఛగా జరిగింది. తెలంగాణ ప్రజలు సొంత రాష్ట్రంలోనే కూలీలుగా మారారు. సీమాంధ్ర పెట్టిబడిదారుల కబంధ హస్తాల్లో తెలంగాణ నేల బంధీగా మారింది. తెలంగాణ కళలు, సంస్కృతి, నాగరికత, తెలంగాణ సాహిత్యం, తెలంగాణ ఆట, పాట, మాటలను వలస పాలకులు నిర్లక్ష్యం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే ఈ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని తెలంగాణ ప్రజానీకం పోరుబాట పట్టింది. అదే మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది. ఆ ఉద్యమం కేసీఆర్ దీక్షతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నాంది పలికింది. మలిదశ తెలంగాణ ఉద్యమం గురించి గ్రూప్స్ విద్యార్థుల కోసం తెలంగాణ రచయితల వేదిక మాజీ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ అందిస్తున్న ప్రత్యేక వ్యాసం..
ఏపీ ఏర్పాటుతోనే తెలంగాణ అస్తిత్వ పోరాటం
వందల ఏండ్లుగా స్వతంత్ర రాజ్యంగా, స్వతంత్ర దేశంగా ఉన్న తెలంగాణ దక్కన్ పీఠభూమి తనకు తానే స్వతంత్రం కోసం ప్రత్యేక రాష్ర్టం కోరే సుదీర్ఘ పోరాటం చేయడం చరిత్రకే చరిత్ర. 1956 నవంబర్ 1 తెలంగాణకు విద్రోహ దినంగా మారింది. ఆంధ్రప్రదేశ్ అవతరణలో తెలంగాణ అస్తిత్వం ప్రశ్నార్థకమైంది. అదే 2014 జూన్ 2 దాకా నడిచి ఒక సుదీర్ఘ పోరాటం మహా పర్వమైంది. తెలంగాణ చరిత్ర సామాజిక ఉద్యమాలతో మొదలైంది. ఒక మనిషిపై మరో మనిషి ఆధిపత్యం చెలాయించడాన్ని నిరసించిన మానవతా ఉద్యమాలకు ఈ నేల ఊపిరి పోసింది. 1956లో ఆంధ్రప్రదేశ్ అవతరణ తెలంగాణ ప్రజల నిరసనతో మొదలైంది. ఆవిర్భావం నుంచే ప్రత్యేక రాష్ర్ట ఉద్యమానికి అంకురార్పణ జరిగింది. భాషా ప్రయుక్త రాష్ర్టం అన్నది తెలంగాణ గొంతుపై కత్తిగా మారింది. ఒకే జాతి, భాష పేరుతో తెలంగాణ దగాకు, దోపిడీకి గురైంది. ఇదే 1969లో అగ్నిపర్వతంగా మారి బద్ధలవడానికి కారణమైంది. ఈ ఉద్యమంలో 369 మంది తుపాకీ గుండ్లకు బలయ్యారు. తెలంగాణ తిరుగులేని పోరాటశక్తిని ప్రదర్శించింది కానీ ఆధిపత్యవలసవాదుల మోసాలు, కుట్రలు, కుతంత్రాలు, కేంద్రంలోని పాలకుల నిర్ణయాలు మొత్తంగా తెలంగాణ అస్తిత్వ చైతన్యాన్ని అణచివేశాయి. తెలంగాణ ఉద్యమాన్ని నెత్తుటేర్లలో ముంచగలిగారు కానీ ప్రజల గుండెల్లో గూడుకట్టుకున్న ఆకాంక్షను మాత్రం చెరపలేకపోయారు. అదే 610 జీవో సమయంలో సమరంగా మారింది. 1983 తర్వాత తిరిగి తెలంగాణ రాష్ర్ట సాధన ఉద్యమానికి బీజాలు పడ్డాయి. ట్యాంక్‌బండ్‌పై వైతాళికుల పేరుతో ఆధిపత్య సంస్కృతి ప్రతిష్ఠించబడింది. తెలంగాణ కళలు, సంస్కృతి, నాగరికత, తెలంగాణ సాహిత్యం, తెలంగాణ ఆట, పాట, మాటలను వలస పాలకులు నిర్లక్ష్యం చేశారు. తెలంగాణ భాషను సినిమాల్లో గేలిచేస్తూ చూపారు. తన కళ్ల ముందే తన భాషా సంస్కృతులపై దాడి జరుగుతుంటే తెలంగాణ కన్నెర్ర చేసింది. నీళ్లు, నిధులు, నియామకాల్లో జరుగుతున్న దగాను చూసి తెలంగాణ ఆగ్రహించింది. తెలంగాణ అన్న పదాన్నే అసెంబ్లీలో ఉచ్చరించొద్దని స్పీకర్ హుకుం జారీ చేసేదాకా వచ్చింది. దీంతో ఆధిపత్యంపై ప్రజల ఆగ్రహం కట్టలు తెగింది. అదే మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసింది. మలిదశ తెలంగాణ ఉద్యమానికి నిప్పురాజేసిన కొందర్ని ఆధిపత్య సంస్కృతి భిన్న రూపాల్లో అణచివేసింది. మలిదశ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన ఉద్యయకారులపై తీవ్రవాదులని ముద్ర కూడా వేశారు. మలిదశ ఉద్యమం భిన్న రూపాల్లో, విభిన్న ఆలోచనలతో మొదలైంది.
రియల్ ఎస్టేట్‌గా తెలంగాణ నేల
1990 తర్వాత ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఆర్థిక సరళీకరణల విధానాలను తెలంగాణ రైతాంగాన్ని తీవ్రంగా దెబ్బతీశాయి. చేతివృత్తులు, పల్లెలు ఆర్థికంగా చితికిపోయాయి. దీనికి తోడుగా వలసాధిపత్యం తెలంగాణను దోచుకోవడం మొదలుపెట్టింది. తెలంగాణ అన్ని రంగాల్లో వెనుకబడింది. ఈ నేల తెలంగాణది ప్రయోజనం పొందేవారు మాత్రం వలసాధిపత్యవాదులు. దీంతో ఫ్యాక్టరీలు, సినిమాలు, పరిశ్రమలు, వ్యాపారాలు అన్నీ కోస్తాంధ్ర పెట్టుబడిదారుల చేతుల్లోకి పోయాయి. తెలంగాణ ప్రజలు అందులో కూలీలుగా మారిపోయారు. పెట్టుబడిదారులు కోట్లల్లో లాభాలు దండుకున్నారు. తెలంగాణ సంపదను దోచుకున్నారు. తెలంగాణ నేలను రియల్ ఎస్టేట్ వ్యాపారంగా మార్చేశారు. తెలంగాణకు రావల్సిన నీటి వనరులను దోచుకున్నారు. దీంతో భూగర్భ జలాలపై ఆధారపడాల్సి వచ్చింది. అయితే ఆ నీటిని తోడుకోవడానికి కావల్సిన విద్యుత్‌ను అందించకపోవడంతో తెలంగాణలో వ్యవసాయం సంక్షోభంలో కూరుకుపోయింది. ఈ బాధలు భరించలేని తెలంగాణ ప్రజలు ఆగ్రహానికి గురయ్యారు.
ఉద్యోగాల్లో సీమాంధ్రులదే పైచేయి
చంద్రబాబు ప్రభుత్వ హయాంలో విద్యుత్ వ్యతిరేక మహా పోరాటంలో ముగ్గురు కాల్పుల్లో మరణించారు. చేతివృత్తులు దెబ్బతినడంతో ఉపాధిరంగం కుదేలయ్యింది. ప్రయివేటు రంగం విస్తరించినప్పటికీ ఇందులో కూడా సీమాంధ్రులదే పైచేయిగా మారింది. ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక, సాహిత్య రంగాల్లో సీమాంధ్ర ఆధిపత్యం పెరిగిపోవడంతో ఇక్కడి ప్రజల్లో తీవ్ర నైరాశ్యం ఏర్పడింది. సబ్బండ వర్ణాలు తమ అస్తిత్వం కోసం ఉద్యమ బాటపట్టాయి. కులసంఘాలు తమ మనుగడ కోసం పిడికిలి బిగించాయి. దీంతో తెలంగాణ రాష్ట్రం సాకారమైతేనే తమ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కులవృత్తులన్నీ మమేకమయ్యాయి.
ఎన్టీఆర్‌కు తెలంగాణ సెగ
మలిదశ ఉద్యమం తిరిగిన మలుపులు అన్నీ ఇన్నీ కావు. పెద్దమనుషుల ఒప్పందాల దగ్గరనుంచి 610 జీవో అమలు వరకు జరిగిన ఉల్లంఘనలు అన్నీ క్రమంగా ఉద్యమ రూపాన్ని సంతరించుకున్నాయి. ఆ క్రమంలోనే ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో నల్లగొండ జిల్లాలో పులిచింతల బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పైలాన్‌ను ప్రారంభించేందుకు వచ్చాడు. తెలంగాణ ప్రజల నుంచి ఆయన తీవ్ర నిరసనను ఎదుర్కొన్నాడు. పులిచింతల ప్రాజెక్టు నిర్మాణాన్ని తెలంగాణ ప్రజలు వ్యతిరేకించారు. ఇదే సమయంలో నిర్లక్ష్యానికి గురవుతున్న తెలంగాణ విద్యావంతులు, మేధావులు ఏకమయ్యారు. 1988లో ప్రొ.హరనాథ్ నేతృత్వంలో తెలంగాణ జాగృతి పేరుతో పర్స్పెక్టివ్స్ ఆన్ తెలంగాణ అనే డాక్యుమెంటరీని నిర్మించారు. 1988లో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్టు టి.ప్రభాకర్ ఆధ్వర్యంలో ఏర్పడింది. ఇందులో ప్రొ. కొత్తపల్లి జయశంకర్, టి.ప్రభాకర్, కేశవరావ్ జాదవ్, పలాస హరనాథ్, ఎ.వినాయకరెడ్డి ట్రస్టీలుగా ఉన్నారు. 1989లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను బయటపెట్టేందుకు తెలంగాణ సమాచార ట్రస్టును ఏర్పాటు చేశారు. 1997లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఫిలాసఫీ ప్రొఫెసర్ జి.లక్ష్మణ్ సెమినార్‌ను ఏర్పాటు చేశారు. ఆ సెమినార్లో తెలంగాణకు సంబంధించిన అనేక సమస్యలను విభిన్న కోణాల్లో విశ్లేషించారు. అది ఒక రకంగా బుద్ధి జీవుల ఆలోచనల్లో మంటలు రేపింది. అక్కడి నుంచే మలిదశ ఉద్యమానికి బీజాలు పడ్డాయి. ఆ తర్వాత ఉద్యోగులు, విద్యార్థులు, రచయితలు, కళాకారులు, పౌరహక్కుల ఉద్యమ నాయకులు తెలంగాణ భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు.
ఉద్యమానికి విప్లవ సంఘాల బాసట
తెలంగాణలో అప్పటికే ఎగుస్తున్న ఉద్యమాలు, 1969 ఉద్యమాన్ని నెత్తుటేరులో ముంచిన తర్వాత యువత విప్లవ బాట పట్టింది. అప్పటికే నక్సల్బరీలో ఎగిసిన విప్లవోద్యమాల ప్రభావం తెలంగాణపై బలంగా పడింది. ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాల్లో విప్లవ విద్యార్థి సంఘాలు బలంగా నిలిచాయి. తెలంగాణ మట్టిలో సహజంగా ఉన్న పోరుతత్వానికి నక్సల్బరీ ఉద్యమ మంటలు తోడయ్యాయి. తెలంగాణ నేల పోరుకెరటంగా మారింది. ఈ ఉద్యమ ప్రభావంతో సిరిసిల్ల, జగిత్యాలలో పోరాటాల కోలాటాలు మొదలయ్యాయి. 1978లో జగిత్యాలలో రైతాంగం, అన్ని వర్గాల ప్రజలు కలిసి జైత్రయాత్ర నిర్వహించారు. 1990లో వరంగల్‌లో జరిగిన రైతు కూలీ సంఘం సభ ఆ నాటికి దేశంలోనే అతి పెద్ద సభగా రికార్డయ్యింది. అన్నం రాశులు పోసి నిర్వాహకులు ఈ సభను నిర్వహించారు. వరంగల్‌లో జరిగిన రైతు కూలీ సంఘం మహాసభకు 20 లక్షల దాకా జనం వచ్చారనే అంచనాలున్నాయి. వందల సంఖ్యలో ఉద్యమ పాటలు ఉసిళ్ల పుట్టల్లా పుట్టుకొచ్చాయి. తెలంగాణ సాహిత్యం, తెలంగాణ పాటల సీడీలు, ఉద్యమానికి సంబంధించిన చిన్న చిన్న పుస్తకాలు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లాయి. ఏ గడపలో కాలుపెట్టినా తెలంగాణ పాటలే వినిపించేవి. తెలంగాణ జన పరిషత్తు, తెలంగాణ మహాసభ, తెలంగాణ జన సభ, తెలంగాణ ఐక్య వేదిక వంటి అనేక సంస్థలు రాజకీయ పరిపక్వతతో, చైతన్యంతో ఏర్పడ్డాయి. ఇవి ఉద్యమ సంస్థలుగానే కొనసాగాయి తప్ప ఉద్యమ పార్టీలుగా ఏర్పడలేదు.
ఊపిరిపోసిన ఉత్తరాఖండ్ రాష్ట్ర ఏర్పాటు
1988 ఆగస్టు నెలలో బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ (టీఎస్ఎఫ్) ఏర్పడింది. దీనికి కిషోర్‌రెడ్డిని కన్వీనర్‌గా ఎన్నుకున్నారు. 1994లో అశోకా ఫంక్షన్ హాలులో జరిగిన ఒక సభలో పర్స్పెక్టివ్స్ ఆన్ తెలంగాణ డాక్యుమెంటరీని తెలుగులోకి అనువదించి పుస్తకంగా ముద్రించారు. 1996 ఆగస్టు 15న అప్పటి ప్రధానమంత్రి దేవగౌడ ఉత్తరాఖండ్ రాష్ర్టాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రకటన దేశంలోని ప్రత్యేక రాష్ర్టాల కోసం ఉద్యమించే సంస్థలకు ఊపిరి పోసింది. తెలంగాణలో పలు జిల్లాల్లో న్యాయవాదులు, విద్యావంతులు అనేక సెమినార్లను నిర్వహించారు. ఈ సెమినార్లకు తెలంగాణ పెద్ద తల కాళోజి నారాయణరావు, డా. కొత్తపల్లి జయశంకర్‌లను ఆహ్వానించి తెలంగాణ ఆకాంక్షను చాటారు.
భువనగిరి సభతో చైతన్యం
1996 నవంబర్ ఒకటిన విద్రోహదిన సభ వరంగల్‌లో భూపతి కృష్ణమూర్తి, జయశంకర్ ఆధ్వర్యంలో జరిగింది. 1997 జనవరిలో హైదరాబాద్ జాంబాగ్‌లోని అశోక టాకీస్‌లో జరిగిన సభలో గద్దర్ అమ్మా తెలంగాణమా అన్న పాట కొన్ని చరణాలను పాడారు. ఆ తరువాత అదే సంవత్సరం మార్చి 8, 9 తేదీల్లో భువనగిరిలో జరిగిన తెలంగాణ సదస్సు కదలిక తీసుకొచ్చింది. జయశంకర్‌తో చర్చల అనంతరం గద్దర్ అమ్మా తెలంగాణమా… ఆకలి కేకల గానమా అన్న పాటను పూర్తి చేసి భువనగిరి సభలో పాడారు. 1997 ఆగస్టు 17న సిద్దిపేటలో మంజీరా రచయితల సంఘం ఏర్పాటు చేసిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సదస్సులో నందిని సిధారెడ్డి రాసిన నాగేటి సాళ్లల్ల నా తెలంగాణ అన్న పాటను తొలిసారిగా షేక్ బాబా, దేశపతి శ్రీనివాస్‌లు కలిసి పాడారు. 1996లో పీపుల్స్‌వార్ అగ్రనేత నల్లా ఆదిరెడ్డి ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమించబోతున్నట్లు ప్రకటించారు. 1996లో సీపీఐ (ఎంఎల్) పీపుల్స్‌వార్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఆకాంక్షిస్తూ ఓ విధానపత్రాన్ని విడుదల చేసింది. 1997 ఆగస్టు 11న మారోజు వీరన్న నేతృత్వంలో నల్లగొండ జిల్లా సూర్యాపేటలో తెలంగాణ మహాసభ 30 వేల మంది సమక్షంలో ఆవిర్భవించింది. ఈ తెలంగాణ మహాసభ ఆధ్వర్యంలో అనేక సభలు జరిగాయి. 1997 ఆగస్టు 13, 14 తేదీల్లో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ మేధావులతో రెండు రోజుల సెమినార్ జరిగింది. 1997 అక్టోబర్ 28న జయశంకర్, కేశవరావ్ జాదవ్‌ల నేతృత్వంలో 28 సంస్థలు కలిసి తెలంగాణ ఐక్య వేదికగా ఏర్పడ్డాయి. 1997లోనే మాజీ హోంమంత్రి ఇంద్రారెడ్డి నేతృత్వంలో జై తెలంగాణ పార్టీ ఏర్పడింది.
వరంగల్ డిక్లరేషన్
1996-1997లో అనేక సభలు సమావేశాలు జరిగాయి. 1997 డిసెంబర్ 28 న విప్లవ రచయితల సంఘం, ఇతర ప్రజాసంఘాల నేతృత్వంలో అతి పెద్ద సభ వరంగల్‌లో జరిగింది. ఆ సభలోనే కాళోజి వంటి కవులు, కొన్ని సంస్థలు కలిసి వరంగల్ డిక్లరేషన్‌ను విడుదల చేశాయి. 1998లో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్టు ఆధ్వర్యంలో మా తెలంగాణ మాసపత్రిక వెలువడింది. ఈ పత్రికను నగరంలోని బసంత్ టాకీస్‌లో జస్టిస్ కొండా మాధవరెడ్డి ఆవిష్కరించారు.1998లో ఆకుల భూమయ్య కన్వీనర్‌గా తెలంగాణ జనసభ ఏర్పడింది. తెలంగాణ ఇన్ఫర్మేషన్ సెంటర్ (టిక్), తెలంగాణ జనసభ, తెలంగాణ మహాసభలాంటి అనేక సంస్థలు తెలంగాణ ప్రజలను జాగృతం చేసేందుకు కృషి చేశాయి. ఈ సమయంలో తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న వారిపై ఆనాటి ప్రభుత్వం నక్స్‌లైట్ల ముద్రవేసింది. అప్పటికే మారోజు వీరన్న, కనకాచారి ఎన్కౌంటర్లకు గురయ్యారు. ఈ సందర్భంగా జరిగిన భువనగిరి సభ తర్వాత గద్దర్‌పై కాల్పులు జరిగాయి. 2000 సంవత్సరం ఆగస్టు 11న 41 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్రం కావాలని కోరుతూ ఆ పార్టీ అధినేత, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీకి విన్నవించారు. ఈ 41 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతికి మెమొరాండవ్ు సమర్పించారు.
ఉద్యమ తీవ్రతతో పార్టీల వైఖరిలో మార్పు
మలిదశ ఉద్యమం మొదలైన తర్వాత ఉద్యమ తీవ్రతను చూసిన తర్వాత కొన్ని రాజకీయపార్టీలు తమ ఆలోచనను మార్చుకొని ఉద్యమంలోకి దూకాయి. 1996లో ప్రారంభమైన మలిదశ ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని వరంగల్ డిక్లరేషన్ ద్వారా పీపుల్స్‌వార్ పార్టీ ముందుకు తీసుకువచ్చింది. సీపీఐ (ఎంఎల్) ప్రజాపంథా పార్టీ తనపాత అవగాహననే కొనసాగిస్తూ వచ్చింది. ప్రజాపంథా పార్టీ 2008లో తెలంగాణకు అనుకూలంగా కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత 2009 ఆగస్టు 6న ప్రజాపంథా నిర్వహించిన సదస్సులో తెలంగాణ రాష్ట్రం కోసం పనిచేయాలని నిర్ణయించి రాష్ట్ర కమిటీ ప్రత్యక్ష కార్యాచరణకు దిగింది. సీపీఐ కూడా 1969 నాటి అవగాహనను మార్చుకుని 2011లో ఉద్యమంలోకి ప్రత్యక్షంగా దూకింది. సీపీఎం మాత్రం తన విధానాన్ని మార్చుకోలేదు. భాషా ప్రయుక్త రాష్ర్టాల విధానాలకు కట్టుబడి ఉన్నామని ఆ సిద్ధాంతాన్నే చెప్పుకుంటూ వచ్చింది.
టీఆర్ఎస్ ఆవిర్భావం
విభిన్న రూపాల్లో విభిన్న మార్గాల్లో మొదలైన మలిదశ ఉద్యమం ఒక రాజకీయ రూపు దిద్దుకొని తిరుగులేని మలుపుగా మారింది. 1969 ఉద్యమానికి తెలంగాణ ప్రజా సమితి దిశానిర్దేశం చేసి రాజకీయంగా ఒక ఊపునిచ్చింది. తిరిగి మలిదశ ఉద్యమానికి తెలంగాణ రాష్ర్ట సమితి ఒక ఉద్యమ సంస్థగా పొడుచుక వచ్చింది. టీఆర్ఎస్ ప్రస్థానమంతా ఉద్యమ ప్రస్థానంగానే కొనసాగడంతో అది ఉద్యమానికి ఊపిరైంది. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గెలిపించేందుకు రాజకీయ ప్రక్రియ రూపంలో ముందుకు సాగింది. తెలంగాణ ప్రజలందరూ గెలిచారు. ఆ ప్రజల ఆకాంక్షల గెలుపు వెనుక అమరుల త్యాగం, ఉద్యమ ఆకాంక్షలతో దూసుకుపోయిన ప్రజలు, ఒంటి చేత్తో టీఆర్ఎస్ను నడిపించిన కేసీఆర్ ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మొత్తం తెలంగాణ చరిత్రను ఒక మలుపు తిప్పాయి. ఉద్యమాన్ని రాజకీయ ప్రక్రియగా మలిచి కేంద్రంపై ఒత్తిడి తేవడానికి టీఆర్ఎస్ బలమైన రాజకీయ సాధనంగా పనిచేసింది. తెలంగాణ మహోన్నతమైన సంకల్పాన్ని గాంధేయ మార్గంలో రాజకీయ ప్రక్రియగా మలిచి దాన్ని లక్షలాది మంది సింహగర్జనగా, జనగర్జనగా మార్చగలిగాడు కేసీఆర్.
కేసీఆర్ దీక్షతో కేంద్రంలో కదలిక
కేసీఆర్ 2009 నవంబర్ 29న సిద్దిపేటలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించారు. దీంతో ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి మద్దతుగా, కేసీఆర్ దీక్షకు సంఘీభావంగా నవంబర్ 16న తెలంగాణ విద్యార్థులు ఐక్య కార్యాచరణ సంఘంగా ఏర్పడ్డారు. ఈ ప్రభావంతో కాకతీయ, పాలమూరు, శాతవాహన, మహాత్మాగాంధీ విశ్వవిద్యాయాల్లో ఐక్య కార్యాచరణ సమితులు ఏర్పడ్డాయి. నవంబర్ 29న ప్రభుత్వం దీక్షను అడ్డుకునేందుకు కేసీఆర్‌ను అరెస్టు చేయడంతో తెలంగాణ అట్టుడికిపోయింది. అయినా ఆయన దీక్షను ఆస్పత్రిలో కొనసాగించారు. కేసీఆర్ దీక్షకు అన్నివర్గాల ప్రజలు మద్దతు తెలిపారు. 2009 నవంబర్ 29 నుంచి డిసెంబర్ 9 వరకు 10 రోజుల పాటు కేసీఆర్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మొత్తం తెలంగాణ సమాజాన్ని కదిలించింది. ఇదే సమయంలో శ్రీకాంతాచారి ఆత్మాహుతి చేసుకోవడంతో తెలంగాణ మొత్తం భగ్గుమంది. కేసీఆర్ దీక్ష ఒక పక్క, అందుకు మద్దతుగా ప్రజలు ప్రజా ఉద్యమంగా నిరసన తెలపడంతో కేంద్రం కదిలిపోయింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన చేయకపోతే 2009 డిసెంబర్ 10న శాసనసభను ముట్టడిస్తామని విద్యార్థి ఐక్య కార్యాచరణ సమితి చేసిన ప్రకటన అత్యంత కీలకమైనది. మొత్తం తెలంగాణ జిల్లాల నుంచి విద్యార్థులు, యువకులు అసెంబ్లీ ముట్టడి కోసం హైదరాబాద్‌కు ముందుగానే భారీ సంఖ్యలో చేరుకున్నారు. తెలంగాణ నిప్పుల కుంపటయ్యింది. కేసీఆర్ దీక్షను విరమించనని తెగేసి చెప్పాడు. కేంద్రం నుంచి యూపీఏ ప్రభుత్వం దూతలను పంపినా ఆయన దీక్ష విరమించలేదు. మరోపక్క ఆగ్రహంతో ఉన్న తెలంగాణ ప్రజలు ఏ నిమిషానికి ఏ రకంగా స్పందిస్తారోన్న ఆందోళన కేంద్ర ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేసింది. అమరుల త్యాగాలతో తెలంగాణ తల్లడిల్లుతుంటే తన ఆమరణ నిరాహారదీక్షతో కేంద్రంతో 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ర్ట ప్రక్రియ ప్రారంభం అన్న ప్రకటన తెప్పించగలిగాడు.
మాదిరి ప్రశ్నలు
1. 1996 నవంబర్ ఒకటిన విద్రోహదిన సభ వరంగల్‌లో ఎవరి ఆధ్వర్యంలో జరిగింది ?
1) భూపతి కృష్ణమూర్తి, జయశంకర్
2) గద్దర్, కాలోజి
3) భూపతి కృష్ణమూర్తి, గద్దర్
4) పై ఎవరూ కాదు
2. అమ్మా తెలంగాణమా పాటను రాసిందెవరు?
1) గద్దర్ 2) గూడ అంజయ్య
3) కాలోజి 4) అందెశ్రీ
3. 1997 అక్టోబర్ 28న ఎవరి నేతృత్వంలో 28 సంస్థలు కలిసి తెలంగాణ ఐక్య వేదికగా ఏర్పడ్డాయి ?
1) జయశంకర్, కేశవరావ్ జాదవ్‌ల
2) గద్దర్, కేశవరావ్ జాదవ్
3) కాళోజి, జయశంకర్
4) జయశంకర్, కాళోజి
4. 1997, డిసెంబర్ 28న పలు సంఘాలు కలిసి ఒక డిక్లరేషన్‌ను విడుదల చేశాయి. దాని పేరు?
1) వరంగల్ డిక్లరేషన్ 2) కరీంనగర్ డిక్లరేషన్
3) భువనగిరి డిక్లరేషన్ 4) పైవేవీకాదు
5. 1998లో తెలంగాణ ఇన్ఫర్మేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వెలువడిన మాసపత్రిక ఏది?
1) జై తెలంగాణ 2) మా తెలంగాణ
3) వీర తెలంగాణ 4) నమస్తే తెలంగాణ
6. తెలంగాణ జనసభ ఎప్పుడు ఏర్పడింది?
1) 1996 2) 1999
3) 1998 4) 2000
7. 2000 సంవత్సరంలో ఎంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం రాష్ట్రపతికి మెమొరాండం సమర్పించారు?
1) 31 2) 51 3) 21 4) 41
8. తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ ఏ సంవత్సరంలో ఏర్పడింది?
1) 1999 2) 1997 3) 1988 4) 1989
9. జై తెలంగాణ పార్టీని ఇంద్రారెడ్డి ఎప్పుడు ప్రారంభించారు?
1) 1996 2) 1997 3) 1998 4) 1999
10. రాష్ట్ర ఉద్యమంలో భాగంగా తెలంగాణ రాజకీయ జేఏసీ మిలియన్ మార్చ్‌ను ఏ రోజున నిర్వహించింది?
1) 2010, మార్చి 10 2) 2011, మార్చి 10
3) 2012, మార్చి 10 4) 2013, మార్చి 10
11. సడక్ బంద్ ఆందోళనా కార్యక్రమాన్ని తెలంగాణలో ఏ ప్రదేశం నుంచి ఏ ప్రదేశం వరకు నిర్వహించారు?
1) శంషాబాద్ నుంచి పటాన్చెరు
2) కోదాడ నుంచి హైదరాబాద్
3) శంషాబాద్ నుంచి నల్లగొండ
4) శంషాబాద్ నుంచి అలంపూర్
12. 2013, జూన్ 14న జరిగిన అసెంబ్లీ ముట్టడి ఆందోళనా కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎన్సీసీ గేట్ దగ్గర ఒంటికి నిప్పంటించుకొని ఆత్మబలిదానం చేసుకొన్న విద్యార్థి ఎవరు?
1) శ్రీకాంతాచారి 2) వేణుగోపాల్‌రెడ్డి
3) ఇషాన్ రెడ్డి 4) యాదయ్య
జవాబులు
1) 1 2) 1 3) 1 4) 1 5) 2 6) 3 7) 4 8) 3 9) 2 10) 2 11) 4 12) 4
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు