మనుగడకు ఆధారం.. ఆవరణ వ్యవస్థ
ఆవరణ వ్యవస్థ : 1935లో బ్రిటిష్ వృక్ష ఆవరణ శాస్త్రవేత్త ఎ.జి.టాన్స్లే ఎకోసిస్టమ్/ ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని మొదటగా ఉపయోగించాడు. ఆయన ప్రకృతి మూల ప్రమాణాన్ని ఆవరణ వ్యవస్థగా వర్ణించాడు.
-టాన్స్లే ఎకలాజికల్ సిస్టమ్‌ను ఎకోసిస్టమ్‌గా సమీకరించాడు. ఈయన ప్రకారం ప్రకృతిలోనే జీవులు, వాటి జాతి సమూహాలు, అనేక నిర్జీవ, వాతావరణ కారకాలు ఒకదానికొకటి చాలా ఎక్కువగా ప్రభావితం చేసుకుంటాయి.
జీవావరణం సహజ ప్రమాణం :
ఆవరణ వ్యవస్థ – ఆవరణ శాస్త్రం నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణంగా ఆవరణ వ్యవస్థను పేర్కొంటారు.
-జీవావరణంలో సంభవించే మార్పులు అంటే ఆవాసాల నుంచి జీవులు వెళ్లిపోవడం లేదా ప్రవేశించడం వంటి అంశాలను ఆవరణ వ్యవస్థ ఆధారంగా అధ్యయనం చేయడం.
-ఒక ప్రదేశంలో ఉండే జీవ, నిర్జీవ కారకాల మధ్య గల పరస్పర సంబంధాన్ని అధ్యయనం చేసేది ఆవరణ వ్యవస్థ. దీనిలో జీవ సంబంధిత అంశాలు – మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు, నిర్జీవ అంశాలు, సూర్యకాంతి, నీరు మృత్తిక, ఉష్ణోగ్రత మొదలైనవి. ఆవరణ వ్యవస్థ గురించి అధ్యయనం చేయడం అంటే జీవ, నిర్జీవ అనుఘటకాల మధ్య ఆహారం, శక్తి సంబంధాలను అభ్యసించడం,
-ఆవరణ వ్యవస్థలోని ఏ స్థాయి జీవులకైనా మనుగడకు ఆహారం ద్వారా వచ్చే శక్తి అవసరమవుతుంది. సజీవులన్నింటికీ సూర్యుని ద్వారా శక్తి లభిస్తుంది. మొక్కలు సూర్యరశ్మిలోని శక్తిని కిరణజన్య సంయోగక్రియ ద్వారా నిక్షిప్తం చేసుకుంటాయి.
-ఆవరణ వ్యవస్థలో శక్తి ఎల్లప్పుడూ ఏకదిశ మార్గంలోనే ప్రవాహం చెందుతుంది. ఇందుకు కారణం శక్తిస్థాయి ఉత్పత్తి దారుల నుంచి ప్రాథమిక వినియోగదారులు – ద్వితీయ వినియోగదారులు – ఉన్నతశ్రేణి వినియోగదారులు – విచ్ఛిన్నకారులకు చేరేసరికి అధిక మొత్తంలో తగ్గుతూపోయి ఉష్ణరూపంలోకి మారుతుంది. ఆవరణ వ్యవస్థలోకి శక్తి అనేది తిరిగి చేరదు. పునఃచక్రీయం కాదు.
-ఆవరణ వ్యవస్థలోని జీవ అనుఘటకాల్లో ఉత్పత్తిదారులు, వినియోగదారులు, విచ్ఛిన్నకారులు ఉంటాయి.
1. ఉత్పత్తిదారులు : ఆకుపచ్చని మొక్కలు సూర్యరశ్మిలోని శక్తిని వినియోగించుకొని, కిరణజన్య సంయోగక్రియ ద్వారా కార్బన్‌డైఆక్సైడ్, నీటితో ఆహారపదార్థాలను తయారుచేసుకుంటాయి.
2. వినియోగదారులు : ఆహార పదార్థాలను స్వయంగా తయారుచేసుకోలేవు. వీటిని ప్రాథమిక, ద్వితీయ, తృతీయ వినియోగదారులుగా విభజిస్తారు.
ప్రాథమిక వినియోగదారులు :
ఇవి ఆహారం కోసం ఉత్పత్తిదారులపై ఆధారపడుతాయి. వీటినే హెర్బివోర్స్/ శాకాహారులు అంటారు.
ఉదా :
మేకలు, గొర్రెలు, కుందేలు, ఆవులు మొదలైనవి.
ద్వితీయ వినియోగదారులు :
ఇవి ఆహారం కోసం ప్రాథమిక వినియోగదారులు / శాకాహారులపై ఆధారపడుతుతాయి. వీటిని కార్నివోర్స్ / మాంసాహారులు అంటారు.
ఉదా : కప్ప,
ఆమ్నివోర్స్ :
శాకాహారులు ఉత్పిత్తిదారులను ఆహారంగా తీసుకుంటాయి.
తృతీయ వినియోగదారులు :
వీటినే ఉన్నతస్థాయి మాంసాహారులు / వినియోగదారులు అని అంటారు. ఇవి ద్వితీయ వినియోగదారులు / కార్నివోర్స్పై ఆధారపడుతాయి.
ఉదా : పులి, గద్ద, సింహం
3. విచ్ఛిన్నకారులు :
వీటిని డెట్రీవోర్లు/ పరిశుభ్రకారులు (స్కావెంజర్స్) అని అంటారు. ఇవి పరిసరాల్లోని సంక్లిష్ట నిర్జీవ సేంద్రియ పదార్థాలను సరళ సేంద్రియ పదార్థాలుగా విచ్ఛిన్నం చేస్తాయి. వీటినే సూక్ష్మ వినియోగదారులు అని, పునర్ ఉత్పత్తిదారులు అని పిలుస్తారు.
ఉదాహరణ :
ఆక్టినోమైసిటీస్, శిలీంధ్రాలు, కొన్ని రకాల బ్యాక్టీరియాలు
-జీవావరణాన్ని (బయోస్పియర్) భూమిపైన ఉండే అతి పెద్ద ఆవరణ వ్యవస్థగా పేర్కొంటారు. భూ మండలాన్ని మహా ఆవరణ వ్యవస్థ (Gaint Eco system) గా భావిస్తారు.
-జీవావరణాన్ని మొత్తంగా అధ్యయనం చేయడం చాలా కష్టమైన పని. కాబట్టి ఆవరణ శాస్త్రవేత్తలు దీనిని వివిధ రకాల ఆవరణ వ్యవస్థలుగా వర్గీకరించారు. వాటిలో సహజం, కృత్రిమ, తాత్కాలిక, శాశ్వతమైన ఆవరణ వ్యవస్థలున్నాయి.
-సజీవ, నిర్జీవ కారకాల వల్ల వివిధ రకాల ఆవరణ వ్యవస్థలు వివిధ పద్ధతుల్లో అభివృద్ధి చెందుతాయి. నిర్జీవ కారకాలు, వాటి మధ్యగల పరస్పర సంబంధాలు, జీవ కారకాలతో ఉన్న సంబంధాల వల్ల వివిధ రకాల ఆవరణ వ్యవస్థలు ఏర్పడుతాయి.
మాంగ్రూవ్ ఆవరణ వ్యవస్థ :
భూమిపైన విస్తరించిన ఆవరణ వ్యవస్థలో మాంగ్రూవ్స్, మడ అడవులు ప్రత్యేకమైనవి. ఇవి నదులు, సముద్ర జలాలు కలిసే చోట విస్తారంగా పెరుగుతాయి. వీటిని మంచి ఉత్పాదక ఆవరణ వ్యవస్థగా పేర్కొనవచ్చు. ఈ రకమైన అడవులు తమకు కావాల్సిన పోషకాలను భూమి పైపొరల్లో ఉన్న మంచినీటి నుంచి, సముద్ర అలలు, ఉప్పు నీటి నుంచి గ్రహిస్తాయి. మాంగ్రూవ్స్ వాణిజ్యపరమైన ప్రాధాన్యత ఉన్న సముద్ర జీవులకు ముఖ్యమైన ఆహారంగా, నర్సరీలు, ప్రజనన స్థలంగా ఉపయోగపడతాయి. అంతేకాకుండా అంతరించిపోయే జాతులకు రక్షిత ప్రాంతాలుగా కూడా ఉపయోగపడతాయి.
-మాంగ్రూవ్స్కు నిలయం బెంగాల్‌లోని సుందర్బన్స్, ఆంధ్రప్రదేశ్‌లోని కోరింగ
-మాంగ్రూవ్స్ల్లో విత్తన అంకురణను, వివిపారస్ అంకురణ/వాయురూప అంకురణగా పిలుస్తారు.
-ఆహారపు గొలుసు : ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకు ఆహారపు శక్తి వివిధ స్థాయిల ద్వారా రవాణా అయ్యే మార్గాన్ని ఆహారపు గొలుసు అంటారు. దీనిని ప్రధానంగా రెండు రకాలుగా విభజించవచ్చు.
1. గ్రేజింగ్ ఆహారపు గొలుసు : ఇది ప్రాథమిక వినియోగదారులతో ప్రారంభమవుతుంది.
2. డెట్రిటిస్ ఆహారపు గొలుసు : ఇది విచ్ఛిన్నకారులతో ప్రారంభమవుతుంది.
ఉదా : గడ్డి – కీటకం- పక్షి- పాము
-ఆహారపు జాలకం (ఫుడ్వెబ్) : ఆహారపు గొలుసులన్నీ అంతర సంబంధితమై ఏర్పడే వల లాంటి నిర్మాణాన్ని ఆహారపు జాలకం/ ఫుడ్వెబ్ అంటారు.
-ఎకలాజికల్ పిరమిడ్ / జీవావరణ పిరమిడ్ : ఎకలాజికల్ పిరమిడ్ అనే పదాన్ని ప్రవేశపెట్టినది – చార్లెస్ ఎల్పన్
-ఆవరణ వ్యవస్థలోని వివిధ పోషక స్థాయిల నిర్మాణాన్ని రేఖా త్మకంగా సూచించడమే ఆవరణ సంబంధ పిరమిడ్. వీటిని మూడు రకాలుగా విభజించారు.
అవి. 1. సంఖ్యా సంబంధ పిరమిడ్లు 2. శక్తి సంబంధ
పిరమిడ్లు 3. జీవద్రవ్యరాశి పిరమిడ్లు
-సంఖ్యా, సంబంధ పిరమిడ్లు : ఆవరణ వ్యవస్థలోని వివిధ పోషక స్థాయిలను సంఖ్యాపరంగా తెలియజేస్తాయి. ఇది సాధారణంగా నిటారుగా ఉంటుంది.
-శక్తి సంబంధ పిరమిడ్లు : ఆవరణ వ్యవస్థలోని వివిధ పోషకస్థాయిలో ఉన్న శక్తి ఆధారంగా నిర్మించే పిరమిడ్లు. ఇది ఎల్లప్పుడూ నిటారుగా ఉంటుంది.
-ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకు చేరేసరికి శక్తి ప్రవాహం క్రమంగా తగ్గుతుంది.
-జీవ ద్రవ్యరాశి పిరమిడ్లు : వివిధ పోషక స్థాయిల్లోని ఉత్పత్తిదారులు – వినియోగదారులు- జీవ ద్రవ్యరాశుల ఆధారంగా తయారైంది.
-ఇవి సాధారణంగా నిటారుగా ఉంటుంది. కానీ కొలను ఆవరణ వ్యవస్థలో తలకిందులుగా ఉంటుంది.
-ఆవరణ వ్యవస్థలో శక్తి ప్రవాహం : జీవ ప్రపంచ మనుగడ అనేది ఆవరణ వ్యవస్థలోని శక్తి ప్రవాహం, పదార్థాల రవాణాపై ఆధారపడి ఉంటుంది. వివిధ రకాల జీవక్రియలు నిర్వహించడానికి శక్తి అవసరం. ఈ శక్తి సూర్యుని నుంచి లభిస్తుంది. సౌరశక్తి సూర్య కిరణాల రూపంలో ప్రసరిస్తుంది. దీనిలో 57 శాతం వాతావరణంలో శోషించబడుతుంది. అంతరిక్షంలో వెదజల్లుతుంది. 35 శాతం సౌరశక్తి భూమిని వేడి చేయడానికి, నీటిని ఆవిరి చేయడానికి, సుమారు 8 శాతం సౌరశక్తి మొక్కలకు చేరుతుంది. దీనిలో 80-85 శాతం సౌరశక్తిని మొక్కలు శోషిస్తాయి. శోషించిన దానిలో 50 శాతం మాత్రమే కిరణజన్య సంయోగక్రియలో వినియోగించబడుతుంది. అందులో 1-5 శాతం మాత్రమే ఆహారశక్తిగా మారి మిగిలినది ఉష్ణరూపంలో వాతావరణంలో కలుస్తుంది.
-మొక్కల్లో నిల్వ ఉన్న శక్తి ఆవరణ వ్యవస్థలో గొలుసు రూపంలో ప్రవహిస్తుంది. ఆహారపు గొలుసులో ఉత్పత్తిదారులు – ప్రాథమిక వినియోగదారులు – ద్వితీయ – తృతీయ వినియోగదారులు ఉన్నాయి. ఉత్పత్తిదారుల నుంచి వినియోగదారులకు శక్తి ప్రవహిస్తుంది. ప్రతిసారీ శక్తి బదిలీ అయ్యేటప్పుడు 80-90 శాతం స్థితిశక్తి శ్వాసక్రియ, ఇతర విధానాల ద్వారా ఉష్ణరూపంలో విడుదలవుతుంది.
5. ఆవరణ వ్యవస్థ సేవలు :
మానవ సమాజం మనుగడకు అవసరమైన అనేక విలువైన వస్తువులను సహజ ఆవరణ వ్యవస్థ నుంచి పొందుతుంది. అవి స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం ఇంధనంగా ఉపయోగించే కలప, నారలు, జన్యువనరులు, మందు పదార్థాలు మొదలైనవి. ఉదాహరణకు మొక్కలు సూర్యుని నుంచి సౌరశక్తిని, నేల నుంచి నీరు, ఖనిజ లవణాలను, వాతావారణం నుంచి కార్బన్‌డైఆక్సైడ్‌ను గ్రహించి ఆహారపదార్థాల (కార్బోహైడ్రేట్స్)ను తయారుచేసుకొంటాయి. వీటిని ఇతర జీవులు వినియోగించుకుంటున్నాయి. సహజ ఆవరణ వ్యవస్థలు జీవనానికి ఆధారంగా ఉండే మౌలిక పనులు కూడా చేస్తాయి. ఆవరణ సంబంధ సేవలు లేకపోతే జీవం ఉనికి కూడా ఆగిపోతుంది. పుష్పాల్లో పరాగ సంపర్కం కోసం పరాగ రేణువుల రవాణాకు జీవ, నిర్జీవ కారకాలు తోడ్పడటం, పరాగ సంపర్క కారకాల్లో తేనేటీగలు, మాత్‌లు, సీతాకోకచిలుకలు, ఈగలు, పక్షులు, గబ్బిలాలు, సరీసృపాలు, మిడతలు, బల్లులు, పాములు, క్షీరదాలు మొదలైనవి. ఇవి మొక్కల్లో పరాగ సంపర్కం జరగడానికి తోడ్పడటం వల్ల ఫలాలు, విత్తనాలు ఉత్పత్తి అవుతాయి.
-ఆవరణ వ్యవస్థలోని జీవులు జీవవైవిధ్యం వాటిలో ఉన్న పరస్పర సంబంధం, వాటికి భౌతిక పరిసరాలతో ఉన్న సంబంధాలు మొదలైన ఆవరణ వ్యవస్థ సేవలను నిర్వర్తిస్తాయి.
-మిలీనియం ఆవరణ వ్యవస్థ – అసెస్మెంట్ – ఆవరణ వ్యవస్థ సేవలను నాలుగు విభాగాలుగా చేసింది.
అవి. 1. ఆధార పూర్వక సేవలు 2. సరుకురూప సేవలు 3. నియంత్రణాత్మక సేవలు 4. సంస్కృతి సంబంధ సేవలు
1. ఆధార పూర్వక సేవలు : ఖనిజ లవణ వలయాలు, ఆక్సిజన్ ఉత్పాదకత మృత్తిక ఉత్పత్తి, మొక్కల పరాగ సంపర్కం మొదలైనవి.
2. సరుకురూప సేవలు : ఆహారం, నారలు, ఇంధనం, నీరు వంటి సరుకురూప సేవలు.
3. నియంత్రణాత్మక సేవలు : నీటి శుద్ధత, వరదల నివారణ, శీతోష్టస్థితుల నియంత్రణ వంటి వాటిని నియంత్రణాత్మక సేవలు అంటారు.
4. సంస్కృతి సంబంధ సేవలు : విద్య, ఆటవిడుపు, సౌందర్య విలువలు (జీవవైవిధ్య నిర్వహణ స్థానికంగా ఉద్యానవనాలను పెంచడం) మొదలైనవి.
-ఆవరణ వ్యవస్థ సంబంధిత సేవల్లో ప్రధాన అంశాలు
పరాగ సంపర్కం, కర్బనస్థాపనం, ఆక్సిజన్ విడుదల
-అడవులు co2 ప్రధాన బ్యాంకులు, వృక్షాల్లో కొయ్యరూపంలో పెద్ద పరిమాణంలో co2 నిక్షిప్తమై ఉంటుంది.
-వాతావరణంలో co2 ప్రధాన 02 వాయువుల సమస్థితి ఏర్పర్చడంలో వృక్షాలు ముఖ్యపాత్ర పోషిస్తాయి.
-సహజ ఆవరణ వ్యవస్థలు శీతోష్ణస్థితి పరిస్థితులను స్థిరంగా ఉంచుతూ, భూమి అధిక ఉష్ణోగ్రతకు లోనుకాకుండా గ్రీన్హౌస్ వాయువును (co2) వాతావరణం నుంచి తొలగిస్తాయి.
-వృక్షాలు, వృక్షప్లవకాలను ప్రపంచ ఊపిరితిత్తులు అని అంటారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు