తనువు పుండై – తాను పండై అన్న కవి ఎవరు?
వరవరరావు:
పూర్తిపేరు పెండ్యాల వరవరరావు. నవంబర్ 3, 1940లో వరంగల్ జిల్లా చిన్న పెండ్యాల గ్రామంలో జన్మించారు. కళాశాలలో చదువుతున్నప్పుడే కవిత్వం, సాహితీ విమర్శలు రాయడం మొదలుపెట్టారు. 1968 నుంచి 1998 వరకు వరంగల్‌లోని సీకేఎం (CKM) కళాశాలలో తెలుగు ఉపన్యాసకులుగా పనిచేశారు. 1966 నవంబర్‌లో సాహితీమిత్రులు స్థాపించి, సృజన అనే ఆధునిక తెలుగు సాహితీ వేదికను ప్రారంభించారు. రెండు దశాబ్దాలపాటు ఒక సాహిత్య ఉద్యమంగా వెలువడిన సృజన పూర్తిగా ఒక తరం మీద ప్రభావం చూపింది. 1966 నుంచి 1992 వరకు 200 సంపుటాలుగా అచ్చయిన సృజన ప్రభుత్వం నుంచి ఎన్నోసార్లు నిషేధాన్ని ఎదుర్కొంది. జైల్లో ఉన్న సమయంలో సృజనకు ప్రచురణకర్తగా వారి భార్య హేమలత వ్యవహరించారు. అందుకుగాను ఆమె 1978 నుంచి 1984 వరకు ఆరేండ్లు జైలు జీవితం అనుభవించారు.
1970 జనవరిలో తోటి కవులైన అశోక్, లోచన్ మొదలగువారితో స్థాపించిన తిరుగబడు కవులు కొన్నాళ్లకే విప్లవ భావాలుగల మరికొందరు కవులతో చేతులు కలిపి 1970 జూలై 4న విప్లవ రచయితల సంఘం (విరసం)గా అవతరించింది. విరసం తెలుగు సాహిత్యరంగంలో విప్లవ కెరటమై ఎగసింది. వరవరరావు విరసం ప్రారంభదశ నుంచి నేటివరకు సంఘం కార్యనిర్వాహక సభ్యులుగా ఉన్నారు. విప్లవోద్యమంతోపాటు సాహిత్యరంగానికి చాలా సేవచేశారు. 1973 నుంచి ఆరేండ్లు జైల్లోనే గడిపారు. 1985-89 మధ్యకాలంలో రాంనగర్ కుట్రకేసు, సికింద్రాబాద్ కుట్రకేసులో శిక్ష అనుభవించారు. 2002 జూన్‌లో చంద్రబాబునాయుడు ప్రభుత్వం పీపుల్స్‌వార్‌తో శాంతిచర్చలు జరపాలని తలపెట్టిన సందర్భంలో ప్రజాగాయకుడు గద్దర్‌తో కలిసి మధ్యవర్తిగా వ్యవహరించారు. ఆ శాంతి చర్చలు విఫలమయ్యాయి. ఆ తర్వాత 2004-05లో కాంగ్రెస్ ప్రభుత్వం పీపుల్స్‌వార్‌తో శాంతిచర్చలు జరపాలని నిర్ణయించినప్పుడు మరోసారి మధ్యవర్తిగా వ్యవహరించారు. ఈయన రచనలు – చలి నెగళ్లు, జీవనది, ఊరేగింపు, స్వేచ్ఛ, సముద్రం, భవిష్యత్ చిత్రపటం, ముక్తకంఠం, ఆ రోజులు, ఉన్నదేదో ఉన్నట్లు, బాగ్దాద్ చంద్రవంక, మౌనం యుద్ధనేరం మొదలైనవి. ఈయన పరిశోధన గ్రంథం తెలంగాణ విముక్తి పోరాటం. తెలుగు నవల-సమాజం సాహిత్యం పరస్పర సంబంధం-ఒక పరిశీలన. 1985-89 మధ్య జైలు నిర్బంధంలో ఉండగా కెన్యా దేశానికి చెందిన గూగీ వథ్యాంగో రాసిన డెవిల్ ఆన్ ది క్రాస్, ఎ రైటర్స్ ప్రిసన్ డైరీ డిటైన్ లను తెలుగులోకి అనువదించగా వాటిని 1992, 96 లలో స్వేచ్ఛా సాహితి ప్రచురించింది. 1968లో చలినెగళ్లు గ్రంథానికి ఫ్రీవర్స్ ఫ్రంట్ బహుమతి లభించింది.
కె. శివారెడ్డి:
1943 ఆగస్టు 6న గుంటూరు జిల్లాలో కార్మూరివారి పాలెం గ్రామంలో జన్మించారు. 1967 నుంచి హైదరాబాద్‌లోని వివేకవర్ధిని కళాశాలలో అధ్యాపకులుగా పనిచేసి 1999లో ప్రధానాచార్యులుగా పదవీ విరమణ చేశారు. 2006 బుక్ ఫెయిర్ సందర్భంగా భారతదేశం తరఫున ప్రత్యేక ఆహ్వానితుల్లో ఒకరిగా వెళ్లి వివిధ నగరాల్లో, వివిధ సమావేశాల్లో కవిత్వం వినిపించారు. వేకువ అనే త్రైమాసిక పత్రికకు సంపాదకునిగా వ్యవహరించారు. వీరి రచనలు – రక్తం సూర్యుడు, చర్య, గాథ, ఆసుపత్రి గీతం, భారమితి, ఆమె ఎవరైతే మాత్రం, వృత్తలేఖిని, నేత్ర ధనుస్సు, మోహనా! ఓ మోహనా, అజేయం, నా కలల నది అంచున, వర్షం వర్షం, జైత్రయాత్ర, కవి సమయం, గగనమంత తలతో, అంతర్జనం, పొసగనివన్నీ, అతను చరిత్ర మొదలైనవి. శివారెడ్డి పీఠికలను గుడిపాటి, పెన్నా శివరామకృష్ణలు సంకలనంగా తీసుకొచ్చారు. అవార్డులు – 1974లో రక్తం సూర్యుడు కవితా సంకలనానికి ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు వచ్చింది. 1990లో మోహనా! ఓ మోహనా! కవితా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. అదేవిధంగా తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం, విశాల అవార్డు లభించాయి.
అల్లం రాజయ్య:
కరీంనగర్ జిల్లా, మంథని తాలూకా గాజులపల్లి గ్రామంలో బుచ్చమ్మ, నర్సయ్య దంపతులకు జన్మించారు. 1969 తెలంగాణ ఉద్యమంలో విద్యార్థిగా ఉన్నప్పుడే ఉధృతంగా పాల్గొన్నారు. విద్యార్థి దశలోనే భారతీయ సాహిత్యకారులే కాకుండా, ప్రపంచ సాహిత్యకారులు రాసిన సాహిత్యాన్ని బాగా చదివారు. చలం రచనలతో ప్రభావితమయ్యారు. ఎమర్జెన్సీ సమయంలో గ్రామాలకు వెళ్లి ప్రజల్ని ఉత్తేజితుల్ని చేసేవారు. ఈయన ఊరికి పీవీ నర్సింహారావు వచ్చినపుడు ఆ సభలో ఉన్న ఒక హరిజనుడు ఆ ప్రాంతానికి సంబంధించిన అన్యాయాలను గురించి అడగిన ప్రశ్నలకు స్పందించి మొదట ఎదురు తిరిగితే కథను రాశారు. క్రాంతి అనే పత్రికను కొన్నాళ్లు నడిపారు. కరీంనగర్లో మిత్రులతో కలిసి విద్యుల్లత అనే పత్రికను నడిపారు. ఈయన రాసిన తొలి నవల ముగింపులు-ముందడుగులు. ఇది అముద్రితం.
రచనలు: కథా రచనలు: మనిషిలోపలి విధ్వంసం, మధ్యవర్తులు, నీల-కమల, ప్రత్యర్థులు, అతడు, కార్మిక-కథలు మొదలైనవి.
నవలలు: కొలిమి అంటుకున్నది, ఊరు, అగ్ని కణం, కొమురం భీం, వసంతగీతం.
అల్లం వీరయ్య:
అల్లం రాజయ్య, నారాయణల సోదరుడు. విరసం సభ్యులుగా ఉంటూ పలు గీతాలను రాశారు. జగిత్యాల జైత్రయాత్ర సందర్భంగా ఈయన రాసిన పాట ఎర్ర జండె ఎర్ర జెండెన్నియలో.. అన్ని రకాల వామపక్ష ఉద్యమాలకు ఆరంభ గీతంగా, పతాక గీతంగా ప్రసిద్ధిగాంచింది. ఈయన సోదరుడు అల్లం నారాయణ ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఆశారాజు:
ప్రముఖ ఉర్దూ కవి. హైదరాబాద్‌లో పుట్టి పెరిగి హైదరాబాద్‌ను ప్రేమించిన కవి. ఆ రోజుల్లో ఉర్దూ కవులు ఏ నగరంలో ఉంటే ఆ నగరాన్ని తమ పేరుకు చివర చేర్చుకునేవారు. ఈ సంప్రదాయాన్ని స్వీకరించి ఆశారాజు రాజాహైద్రాబాద్గా తన పేరు చివరన హైదరాబాద్‌ను చేర్చుకున్నారు. ఒక్క ఉర్దూ పదం లేకుండా నాశ్నమైతరు అనే కవిత రాశారు. ఈయన వెలువరించిన కవితా సంకలనాలు-ఒగరు, ఇప్పుడు, పాగల్ షాయర్, నూతన పరిచయం, ఎ పోయెట్ ఇన్ హైదరాబాద్ మొదలైనవి. రాజాహైద్రాబాద్ పేరుతో ఆశారాజు వెలువరించిన కవితా సంకలనం పాగల్ షాయర్.
భూపాల్:
పూర్తిపేరు ఎం. భూపాల్‌రెడ్డి. పొట్లపల్లి రామారావు సాహిత్యం మీద పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. పిల్లలకు సంబంధించిన కథలను ఉగ్గుపాలు పేరుతో వెలువరించారు. భూపాల్ రచయితే కాకుండా మంచి నటుడు కూడా. కొమురం భీం, దాసి చిత్రాల్లో నటించారు. 2011 సంవత్సరానికిగాను బాలల కథా సంకలనం ఉగ్గుపాలుకు కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి లభించింది. ఐతే కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను నిరసిస్తూ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డును తిరిగి ఇచ్చేస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని ప్రకటించిన మొదటి తెలుగు రచయిత భూపాల్ కావడం విశేషం. అదేవిధంగా ఎన్కౌంటర్లకు నిరసనగా.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉగాది పురస్కారాన్ని సైతం తిరిగిచ్చేశారు.
:
కరీంనగర్ జిల్లాలోని జగిత్యాలలో 1954 జనవరి 12న జన్మించారు. 11వ ఏట తండ్రి అకాల మరణంతో కుటుంబపోషణ బాధ్యతలు స్వీకరించారు. ఆదర్శాలకు అనుగుణంగా పేదరాలైన భాగ్యం ను పెళ్లి చేసుకున్నారు. జీవిక కోసమే తప్ప ఏనాడూ సంపాదన కోసం ఆరాటపడని మనిషి. తన కళ ప్రజల కోసమే అని చివరి వరకు నమ్మారు. చిత్రకారుడుగా, ఫొటోగ్రాఫర్‌గా వృత్తి జీవితాన్ని కొనసాగిస్తూనే కవిగా ఎదిగారు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో హైదరాబాద్ నగరంపై ఆరేండ్లపాటు సీరియల్‌గా సిటీలైఫ్ పేరుతో మినీ కవిత్వం రాశారు. కవిత్వంతో పాఠకుల్లో ఆలోచనా దృక్పథాన్ని, సామాజిక చైతన్యాన్ని పెంపొందించిన అతి కొద్దిమంది కవుల్లో అలిశెట్టి ఒకరు. క్షయవ్యాధికి గురై 1993 జనవరి 12న మరణించారు.
రచనలు: ఎర్ర పావురాలు, మంటల జెండాలు, చురకలు, రక్తరేఖ, ఎన్నికల ఎండమావి, సంక్షోభ గీతం, సిటీలైఫ్ మొదలైనవి.
అలిశెట్టి సుప్రసిద్ధ కవితాపంక్తులు: తనువు పుండై తాను పండై, తాను శవమై వేరొకరి వశమై, తాను ఎడారై ఎడారిలో ఒయాసిస్సై… అంటూ వేశ్యల దయనీయ స్థితిని గురించి రాసిన కవిత ఎంతో ప్రసిద్ధిగాంచింది. అదేవిధంగా మరో కవిత – శిల్పం చెక్కక ముందు బండ, శిక్షణ పొందక ముందు మొండి, ప్రతిభ వెనకాల ఎంతో ప్రయాస, సో కాలానికి వదలకు భరోసా… అంటూ ప్రతిభ లేకపోతే జీవితం వ్యర్థమని చక్కగా చెప్పారు.
నందిని సిధారెడ్డి:
మెదక్ జిల్లా కొండపాక మండలం, బందారం గ్రామంలో 1955, జూలై 12న జన్మించారు. వీరి తండ్రి బాల సిధారెడ్డి. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్టు యోధుడు. నందిని సిధారెడ్డి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ పూర్తిచేసి ఆధునిక తెలుగు కవిత్వంలో సూర్యుడు అనే అంశంపై ఎం.ఫిల్‌ను, పరిశోధన చేసి పీహెచ్డీ పట్టా పుచ్చుకున్నారు. సిద్ధిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పనిచేసి 2012లో ఉద్యోగ విరమణ చేశారు. నవ సాహితి, మెదక్ స్టడీ సర్కిల్ అనే సంస్థలను నడిపారు. గులాబి అనే చిన్న పత్రికను ప్రారంభించారు. మంజీరా రచయితల సంఘాన్ని ఏర్పాటు చేసి పలు సాహితీ కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు.. మంజీర బులెటిన్‌కు సంపాదకత్వం వహించి ఏడు కవితా సంకలనాలను వెలువరించారు. సోయి అనే పత్రికకు సంపాదకత్వం వహించారు. 2001లో తెలంగాణ రచయితల వేదికకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1997 ఆగస్టులో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఆవశ్యకతపై వీరు రాసిన నాగేటి చాలల్ల కవిత ప్రసిద్ధిచెందింది. ఆ కవితలో తెలంగాణ సంస్కృతిని వివరించారు. ఈ కవితను పోరు తెలంగాణ సినిమాలో పాటగా తీసుకున్నారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వ నంది పురస్కారం లభించింది.
రచనలు: భూమి స్వప్నం, సంభాషణ, దివిటి, ప్రాణహిత, ఒక బాధ కాదు, నది పుట్టుబడి, ఇగురం, ఆవర్థనం, ఆధునిక తెలుగు కవిత్వం-వాస్తవికత-అధివాస్తవికత (సిద్ధాంత గ్రంథం).
అవార్డులు: భూమి స్వప్నం కవితా సంపుటికి 1986లో ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు, 1988లో ఇందూరు భారతి వారి దాశరథి అవార్డు, 2001లో ప్రాణహిత కవితా సంపుటికి తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారం, 2009లో ఒక బాధకాదు కవితా సంపుటికి విశ్వ కళాపీఠం వారి స్నేహ నిధి ఉత్తమ కవితా పురస్కారం, 2010లో నాగేటి చాలల్ల నా తెలంగాణ పాటకు ఉత్తమ గేయ రచయితగా నంది పురస్కారం లభించాయి.
మాదిరి ప్రశ్నలు
1. ఫ్రీవర్స్ ఫ్రంట్ బహుమతి పొందిన వరవరరావు రచన?
1) ఊరేగింపు 2) సముద్రం
3) చలి నెగళ్లు 4) ముక్త కంఠం
2. కిందివాటిలో కే శివారెడ్డి రచన?
1) ఆసుపత్రి గీతం 2) రక్తం సూర్యుడు
3) మోహనా! ఓ మోహనా 4) పైవన్నీ
3. సిటీ లైఫ్ పేరుతో మినీ కవితలు రాసిన కవి?
1) కె. శివారెడ్డి 2) వరవరరావు
3) అలిశెట్టి ప్రభాకర్ 4) సాహు
4. సాహుతో కలిసి అల్లం రాజయ్య రచించిన నవల?
1) కొమురం భీం 2) ఊరు
3) అగ్ని కణం 4) వసంతం
5. కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందిన ఉగ్గుపాలు అనేది?
1) బాలల కథా సంకలనం 2) నవల
3) విమర్శ 4) కావ్యం
జవాబులు: 1-3, 2-4, 3-3, 4-1, 5-1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు