దేశ చరిత్రలో అరెస్టయిన తొలి మేయర్? ( తెలంగాణ హిస్టరీ )
గ్రూప్స్ ప్రత్యేకం
జస్టిస్ వాంఛూ కమిటీ
# ఏప్రిల్ 11న ప్రధాని లోక్‌సభలో ప్రకటించిన అష్టసూత్ర పథకంలో భాగంగా ఒక న్యాయ నిపుణుల బృందాన్ని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ వాంఛూ చైర్మన్‌గా కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 19న నియమించింది.
# రాష్ట్ర ప్రభుత్వంలో, స్థానిక సంస్థల్లో ఉద్యోగాలకు సంబంధించి తెలంగాణ ప్రాంతానికి హామీ ఇచ్చిన రక్షణలను పటిష్టంగా అమలు చేసే విషయాన్ని కూలంకషంగా పరిశీలించే నిమిత్తం కేంద్ర ప్రభుత్వం ఈ న్యాయవేత్తల కమిటీని నియమించింది. దీనిలో మాజీ అటార్నీ జనరల్ ఎంసీ సెతల్వాడ్, అప్పటి అటార్నీ జనరల్ నిరన్ డే సభ్యులుగా ఉన్నారు.
నివేదిక
# ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు రక్షణలు కొనసాగించే అవకాశం న్యాయశాస్త్ర రీత్యా గాని, రాజ్యాంగ రీత్యా గాని లేదని వాంఛూ కమిటీ తమ 31 పేజీల నివేదికలో వెల్లడించింది.
# రాష్ట్ర ఉద్యోగాల్లో ఆ రాష్ట్రానికి ప్రాధాన్యం లభించేటట్లు చట్టం చేసే అధికారం పార్లమెంట్‌కు ఉంది. కానీ రాష్ట్రంలో ఒక ప్రాంతం వారికి ప్రాధాన్యం లభించేటట్లు చట్టం చేసే అధికారం పార్లమెంట్‌కు లేదు. తన నివేదికలో ముల్కీ నిబంధనలను కొనసాగించడానికి వీలు లేదని, రాజ్యాంగ సవరణకు కూడా అవకాశం లేదని పేర్కొంది. అయితే తెలంగాణ ప్రాంతంలోని సబార్డినేట్ సర్వీసులపై అధికారాన్ని తెలంగాణ ప్రాంతీయ సంఘానికి అప్పగించాలని వాంఛూ కమిటీ ముఖ్యమైన సూచన చేసింది.
వశిష్ట భార్గవ కమిటీ
#1969, ఏప్రిల్ 11న ప్రధాని ఇందిరాగాంధీ ప్రకటించిన ఎనిమిది సూత్రాల పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ మిగులు నిధులను తేల్చడానికి సుప్రీంకోర్టు న్యాయమూర్తి వశిష్ట భార్గవ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది. ఈ కమిటీ 1969, మే 31లోపు నివేదిక సమర్పించాలని ప్రభుత్వం జస్టిస్ భార్గవను కోరింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి 1968, మార్చి 31 మధ్య కాలంలోని మిగులు నిధులకు సంబంధించిన అంచనాలను కమిటీ పరిశీలించాలి. ఈ కమిటీలో భార్గవతో పాటు విహారి మాథూర్, హరిభూషణ్ భార్ ఉన్నారు. కార్యదర్శిగా కృష్ణస్వామిని నియమించారు.
నివేదిక
# భార్గవ కమిటీ మిగులు నిధులను రూ.28.34 కోట్లుగా అంచనా వేసి తమ నివేదికలో పేర్కొన్నది. ఇది లలిత్ కమిటీ అంచనాల కంటే రూ.5.75 కోట్లు తక్కువ. భార్గవ కమిటీ నివేదికను తెలంగాణ ప్రజాప్రతినిధులు, రీజినల్ కమిటీ వ్యతిరేకించింది. తెలంగాణ ఉద్యమం ఉధృతంగా నడుస్తున్న కారణంగా ఫిబ్రవరి 18, 1970న కేంద్ర ప్రభుత్వం ఈ కమిటీ రిపోర్టును ఆమోదించింది. 10 సంవత్సరాలుగా తెలంగాణ ప్రాంత మిగులు నిధులు పేరుకుపోయినందున తెలంగాణలో అభివృద్ధి ఆ మేరకు మందగించింది. దీన్ని పరిగణనలోకి తీసుకొని అదనపు నిధులను తెలంగాణ ప్రాంతానికి ఇవ్వాల్సి ఉంటుందని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. 1-4-1968 నుంచి ప్రారంభమై 4వ పంచవర్ష ప్రణాళిక ముగిసే లోగా రూ.45 కోట్లు తెలంగాణ అభివృద్ధిపై ఖర్చు చేయడానికి బడ్జెట్లో వెసులుబాటు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.
అష్టసూత్ర అమలుకు ఉన్నతాధికార సంఘం
#ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్లానింగ్ కమిషన్ సభ్యుడు ఆర్ వెంకట్రామన్, రెవెన్యూ మంత్రి వీబీ రాజు, మంత్రులు జేవీ నర్సింగరావు, పీవీ నర్సింహారావు, గురుమూర్తి, కేవీ నారాయణ రెడ్డి, మహ్మద్ ఇబ్రహీం అలీ అన్సారీ, అరిగె రామస్వామి, ప్రాంతీయ సంఘం అధ్యక్షుడు జే చొక్కారావు సభ్యులుగా ఉన్నతాధికార సంఘాన్ని 1969, ఏప్రిల్ 25న రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది . దీన్ని ‘తెలంగాణ అభివృద్ధి కమిటీ’గా వ్యవహరిస్తారు.
తెలంగాణ ప్రజాసమితి అధ్యక్షుడిగా చెన్నారెడ్డి
# 1969 జనవరి నుంచే కొందరు తెలంగాణ రాజకీయ నాయకులు చెన్నారెడ్డిని ఉద్యమ బాధ్యతలు చేపట్టాలని అడుగుతున్నారు. ఉద్యమం ఉధృతమవుతున్న కొద్దీ చెన్నారెడ్డిపై ఒత్తిడి పెరిగింది. ముఖ్య మంత్రి బ్రహ్మానంద రెడ్డి కుట్రలు, కుతంత్రాలను, అణచివేత చర్యలను సమర్థవంతంగా ఎదుర్కొంటూ, ఉద్యమానికి బాధ్యతాయుతంగా దిశానిర్దేశం చేయాలంటే చెన్నారెడ్డి నాయకత్వమే మేలని ఉద్యమ నేతలంతా భావించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ప్రధాని ఇందిర, అగ్రనాయకులను ఒప్పించాలంటే వారితో సన్నిహిత సంబంధాలున్న చెన్నారెడ్డికే సాధ్యమని వారంతా విశ్వసించారు. మే 22న ప్రజాసమితి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన చెన్నారెడ్డి మే 26న రెండో దశ ఉద్యమం ప్రారంభమవుతుందని ప్రకటించారు.
పోటీ ప్రజాసమితి
# ఉద్యమంలో రాజకీయ నాయకుల జోక్యాన్ని మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న విద్యార్థి కార్యాచరణ సంఘం, తెలంగాణ ప్రజాసమితి నాయకుడు శ్రీధర్ రెడ్డి, చెన్నారెడ్డికి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడాన్ని నిరసిస్తూ ‘పోటీ తెలంగాణ ప్రజాసమితి’ని అదే రోజు (మే 22)న ప్రకటించారు.
రెండో దశ ఉద్యమంలో ముఖ్య సంఘటనలు
#జూన్ 3న ప్రభుత్వం నిర్వహించ తలపెట్టిన పరీక్షలను బహిష్కరించాలని విద్యార్థి నేతలు, ప్రజాసమితి నిర్ణయించింది. జూన్ 3న తెలంగాణ బంద్‌కు శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలోని పోటీ తెలంగాణ ప్రజాసమితి పిలుపునిచ్చింది. అయితే పీవీ రంగారావు నాయకత్వంలో ఏర్పాటైన ‘రాష్ట్ర సమైక్యతా సంరక్షణ సమితి’ విద్యార్థులు పరీక్షలకు హాజరుకావాలంటూ మే 28న బషీర్‌బాగ్‌లోని ‘లేడీ హైదరీ క్లబ్’ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియం వరకు సర్కారు మద్దతుతో ఊరేగింపు నిర్వహించింది.
#తెలంగాణ విద్యార్థి కార్యాచరణ సమితి అధ్యక్షుడు మల్లికార్జున్ విద్యార్థులు పరీక్షలు బహిష్కరించాలని, హాల్‌టికెట్లను చింపి పారేయాలని పిలుపునిచ్చారు. ఉపాధ్యాయ సంఘం ప్రధాన కార్యదర్శి రామబ్రహ్మం పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
వెంకటస్వామి రాజీనామా
#తెలంగాణ ఉద్యమం పట్ల కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం గూండాలను దించి వ్యవహరిస్తున్న తీరు, ఆందోళనకారులను చంపడం, తలలు పగలగొట్టడం వంటి దురాగతాలను చూసి మనసు చలించి అప్పటిదాకా బ్రహ్మానందరెడ్డి అనుచరుడిగా ఉంటూ, ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ వచ్చిన జీ వెంకటస్వామి ‘సమైక్యసంఘం’ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు.
హైదరాబాద్‌కు ప్రధాని ఇందిరాగాంధీ రాక
# జూన్ 2 నుంచి 4 మధ్య జరిగిన కాల్పుల్లో అధికారికంగా 20 మందికి పైగా మరణించడం, గాయపడిన వారిలో కొందరు ఆ తర్వాత మరణించడం రీజినల్ కమిటీ అధ్యక్షుడు జే చొక్కారావు, ఇంటెలిజెన్స్ వారు తెలంగాణలో విషమిస్తున్న పరిస్థితి గురించి వివరించడంతో ప్రధాని ఇందిరాగాంధీ అకస్మాత్తుగా జూన్ 4 రాత్రి హైదరాబాద్‌కు వచ్చారు.
# తెలంగాణ సమస్యను పరిష్కరించడానికే వచ్చి ఉంటుందనుకున్న చెన్నారెడ్డి ప్రధాని ఇందిరతో ‘ఒక్క రోజు ముందుగా వచ్చి ఉంటే ఎందరో బతికేవారు కదా’ అని అన్నారు.
1969, జూన్ 17న తెలంగాణ మహిళా దినోత్సవం
# ఢిల్లీలో జూన్ 19న జరుగనున్న కాంగ్రెస్ జాతీయ కార్యవర్గ సమావేశం ఎజెండాలో ‘తెలంగాణ’ అంశం ఉండటంతో చెన్నారెడ్డి ఉద్యమాన్ని ఉధృతం చేశారు. జూన్ 16న బంద్‌తో పాటు జూన్ 17న ‘తెలంగాణ మహిళా దినోత్సవం’ జరపాలని పిలుపునిచ్చారు.
దేశ చరిత్రలో తొలిసారి మేయర్ అరెస్ట్
#హైదరాబాద్ మేయర్ కుముద్ నాయక్ అబిడ్స్‌లో నెహ్రూ విగ్రహం వద్దకు వస్తుంటే నిషేధాజ్ఞలు ధిక్కరించారనే ఆరోపణతో ఆమెను, సహచర మహిళలను అరెస్ట్ చేశారు. ఒక మేయర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సత్యాగ్రహం చేసి అరెస్ట్ కావడం దేశ చరిత్రలో అదే ప్రథమం. మేయర్ అరెస్టుకు నిరసనగా అప్పటికప్పుడే రెండువేల మంది కార్పొరేషన్ సిబ్బంది, కార్మికులు సమ్మెకు దిగారు. చెన్నారెడ్డి భార్య సావిత్రీదేవి, కేవీ రంగారెడ్డి కూతుళ్లు స్నేహలతా రెడ్డి, సుమిత్రా రెడ్డి సుల్తాన్ బజార్లో నిర్వహించిన సత్యాగ్రహాల్లో పాల్గొని అరెస్టయ్యారు.
# సచివాలయం వద్ద రిపబ్లికన్ కార్యదర్శి జే ఈశ్వరీబాయి (ఎమ్మెల్యే) సత్యాగ్రహం జట్టుకు నాయకత్వం వహించి అరెస్టయ్యారు. మోజంజాహీ మార్కెట్ వద్ద జరిగిన మరో సత్యాగ్రహ జట్టుకు మాజీ మంత్రి సదాలక్ష్మి నాయకత్వం వహించారు. తెలంగాణ ప్రజాసమితి మహిళా విభాగానికి చెందిన లక్ష్మీరెడ్డి చార్మినార్ క్రాస్‌రోడ్ వద్ద సత్యాగ్రహ జట్టుకు నాయకత్వం వహించి అరెస్టయ్యారు. జంట నగరాల్లో సికింద్రాబాద్, బొల్లారం, కంటోన్మెంట్ తదితర ప్రదేశాల్లో, జిల్లాల్లో వేలాది మంది మహిళలు తెలంగాణ రాష్ట్రం కోసం సత్యాగ్రహాల్లో పాల్గొన్నారు.
ప్రాక్టీస్ బిట్స్
1. ప్రధాని ప్రకటించిన అష్టసూత్ర పథకంలో భాగంగా నియమించిన కమిటీలు?
1) జస్టిస్ వాంఛూ కమిటీ
2) జస్టిస్ వశిష్ట భార్గవ కమిటీ
3) లలిత్ కుమార్ కమిటీ 4) 1, 2
2. ప్రధాని ఎనిమిది సూత్రాల పథకంలో భాగంగా తెలంగాణ మిగులు నిధులపై నియమించిన కమిటీ?
1) జస్టిస్ వశిష్ట భార్గవ కమిటీ
2) జస్టిస్ వాంఛూ కమిటీ
3) గిర్గ్లానీ కమిషన్
4) కుమార్ లలిత్ కమిటీ
3. ‘తెలంగాణ ప్రజాసమితి’ అధ్యక్షులుగా మరి చెన్నారెడ్డి బాధ్యతలు చేపట్టింది?
1) 1970, మే 22
2) 1969, మే 22
3) 1969, ఏప్రిల్ 22
4) 1970, ఏప్రిల్ 22
4. అష్టసూత్ర పథకం అమలులో భాగంగా రాష్ట్రప్రభుత్వం తెలంగాణ అభివృద్ధి కమిటీని ఎప్పుడు ఏర్పాటు చేసింది?
1) 1969, ఏప్రిల్ 25
2) 1970, ఏప్రిల్ 25
3) 1968, ఏప్రిల్ 25
4) 1971, ఏప్రిల్ 25
5. 1969, మే 22న ‘పోటీ తెలంగాణ ప్రజాసమితి’ని స్థాపించినది?
1) మల్లికార్జున్ 2) బీ శ్రీధర్‌రెడ్డి
3) మదన్ మోహన్ 4) పై అందరూ
6. 1969, జూన్ 17న తెలంగాణ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని అరెస్టయిన హైదరాబాద్ నగర మేయర్?
1) సదాలక్ష్మి 2) లక్ష్మీరెడ్డి
3) కుముద్ నాయక్ 4) ఈశ్వరీబాయి
7. కింది వాటిలో సరైనది?
1) భార్గవ కమిటీ మిగులు నిధులను రూ.28.34 కోట్లుగా అంచనావేసి తమ నివేదికలో పేర్కొన్నది
2) ఇది అంతకుముందే నియమించిన లలిత్ కమిటీ అంచనాల కంటే రూ.5.75 కోట్లు తక్కువ
3) 1 4) 1, 2
8. కింది వారిలో వాంఛూ కమిటీలో సభ్యులు?
1) ఎంసీ సెతల్వాడ్ 2) నిరన్ డే
3) విహారి మాథుర్ 4) 1, 2
9. తెలంగాణ మహిళాదినోత్సవాన్ని పురస్కరించుకొని సచివాలయం వద్ద జరిగిన సత్యాగ్రహ జట్టుకు నాయకత్వం వహించినది?
1) జే ఈశ్వరీబాయి 2) సదాలక్ష్మి
3) కుముద్ నాయక్ 4) సావిత్రీదేవి
10. 1969, జూన్ 4న రాత్రి హైదరాబాద్‌కు వచ్చిన ప్రధాని ఇందిరాగాంధీని ఉద్దేశిస్తూ ఒక్కరోజు ముందుగా వచ్చి ఉంటే ఎందరో బతికేవారు కదా అని అన్నది?
1) కొండా లక్ష్మణ్ బాపూజీ
2) మరి చెన్నారెడ్డి
3) మదన్ మోహన్ 4) చొక్కారావు
సమాధానాలు
1-4, 2-1, 3-2, 4-1, 5-2, 6-3, 7-4, 8-4, 9-1, 10-2.
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ,
కోరుట్ల
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు