రాష్ట్రంలో అటవీ విస్తరణ
మానవుడి జీవనాధారాలు పీల్చే గాలి, తాగే నీరుల నాణ్యతను కాపాడే పర్యావరణాన్ని పరిరక్షించడంలో అడవులు ఎంతో కీలకమైనవి. గ్రామీణ పేదల జీవనోపాధి కార్యకలాపాలకు మద్దతుగా నిలవడంలో అడవులు ముఖ్యపాత్రను పోషిస్తాయి. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతాన్ని అందిస్తాయి. భూతాపం ప్రమాదాన్ని తగ్గించడానికి అడవులు పెన్నిధి. ఇంకా భూసార పరిరక్షణకు, ప్రమాదంలో ఉన్న వన్యప్రాణి జాతులను కాపాడటానికి అడవులే శరణ్యం. అటవీ సంపద, కలప కలిసి 2014-15లో రాష్ట్ర స్థూలోత్పత్తి (జి.ఎస్.డి.పి)లో వర్తమాన ధరల్లో 0.9 శాతం, మొత్తం వ్యవసాయ రంగ జి.ఎస్.డి.పిలో 5.02 శాతం ఉంటాయి. అటవీ రంగం కీలకమైన ఆశయం జీవనోపాధితో సమన్వయం చేసే రీతిలో పచ్చదనాన్ని పెంచడం. 1,14,865 చదరపు కి.మీ.ల భౌగోళిక విస్తీర్ణం కలిగిన తెలంగాణ రాష్ట్రం, సామాజిక వనాలతో కలిపి, 21,024 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం ఉన్న అడవితో అంటే 25.46 శాతం హరిత విస్తీర్ణంతో భారతదేశంలో 12వస్థానంలో ఉంది. ఈ 29,242 చదరపు కిలోమీటర్ల హరిత విస్తీర్ణంలో రిజర్వ్డ్ అటవీ ప్రాంతం. 21,024 చదరపు కిలోమీటర్లు, రక్షిత అడవులు 7,468 చదరపు కిలోమీటర్లు. మిగతా 750 చదరపు కిలోమీటర్లు అవర్గీకృత భూభాగం. 2014 డిసెంబర్ వరకు అటవీ ఉత్పత్తుల నుంచి రాష్ర్టానికి లభించిన మొత్తం రాబడి రూ. 54.16 కోట్లు.
-2,939 రకాల వృక్ష జాతులతో, 365 రకాల పక్షి జాతులతో, 103 రకాల క్షీరదాల జాతులతో, 28 రకాల సరిసృపాలు, 21 రకాల ఉభయచర జాతులతో, పెద్ద సంఖ్యలో ఉన్న అకశేరుక (వెన్నెముక లేని) జంతుజాలంతో వైవిధ్యభరితమైన రీతిలో చెట్టూచేమా, గొడ్డూగోదా ప్రకృతి ఇచ్చిన వరంగా కలిగిన రాష్ట్రం తెలంగాణ. అంతరించిపోతున్న ముఖ్యమైన జంతుజాతుల్లో రాష్ట్రంలో ఉన్నవి పెద్ద పులులు, చిరుత పులులు, అడవి దున్నలు, నాలుగు కొమ్మల జింకలు, మంచి నీటి మొసళ్లు మొదలైనవి. నిజామాబాద్ నుంచి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్‌లో మీదుగా ఖమ్మం జిల్లా వరకు గోదావరి నదీ తీరం వెంబడి ఉన్న దట్టమైన టేకు తోటలు రాష్ట్ర అడవులకు మరొక వరం.
-టేకుకి తోడు, ఏటా ఆకులు రాల్చే జాతులకు చెందిన నల్లమద్ది, ఏగిస, రోజ్‌వుడ్, నరేపా, వెదురు మొదలైన అనేక రకాల వృక్షాలకు నిలయం తెలంగాణ అడవులు. సవరించిన 2002 రాష్ట్ర అటవీ విధానం, విజన్ 2020ని అనుసరించి, ఇప్పుడున్న అడవులను పరిరక్షించడానికి, మరింత అడవిని అభివృద్ధి చేయడానికి, ఉత్పాదకతను మెరుగుపరచడానికి, ఆర్థికపరమైన విలువను పెంచడానికి రాష్ట్ర అటవీ శాఖ వివిధ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోంది. ఈ కార్యక్రమాల ప్రధాన ఆశయాలు : ప్రజలతో కలసి అటవీ నిర్వహణ, కేంద్రం ఆర్థిక సహాయంతో జాతీయ వనపోషణ కార్యక్రమం (ఎన్.ఏ.పి), ఆర్.ఐ.డి.ఎఫ్ ప్రాజెక్టులు, భూసారం-తేమ పరిరక్షణ, సామాజిక వనపోషణ, వన్యప్రాణి నిర్వహణ, మానవ వనరుల అభివృద్ధి, పలుచగా ఉన్న అడవులను దట్టంగా అభివృద్ధి చేయడం, గ్రామీణ పేదరికాన్ని తగ్గించడం, అటవీ ప్రాంతాల్లో కొండవాలు కందకాలు, రాతి ఆనకట్టలు, ఇంకుడు చెరువులు మొదలైన వాటి ఏర్పాటు. వీటిలో తెలిపిన నిర్మాణాలు భూగర్భజలాలను భర్తీ చేయడానికి, తద్వారా అడవుల్లో చెట్టూ చేమా పెంచడానికి, ఇరుగుపొరుగు ప్రాంతాల్లో వ్యవసాయ బాగోగులను నిలకడగా ఉంచేలా చేయడం.
-ఇటీవల ధోరణులను దృష్టిలో పెట్టుకొని ప్రయోగాలు చేయడానికి, తోటలను వేసే సులభోపాయాలను, నర్సరీలను మెరుగుపరచడానికి, హరిత వ్యాప్తి ప్రబోధానికి, విత్తనాల ఉత్పత్తికి, ఇంకా వనాభివృద్ధి సంస్కృతికి చెందిన అనేక కార్యకలాపాలకు అటవీ శాఖ వన పరిశోధనకు ప్రాధాన్యమిస్తోంది.
-అడవుల్లో చెట్టూచేమా, వృక్ష కవచ సాంద్రతల పర్యవేక్షణ, అడవుల్లో అగ్ని ప్రమాదం కలిగిన మండలాల గుర్తింపు, నమోదు, స్థల యోగ్యతలవారీగా వివిధ అటవీ ప్రాంతాల నమోదు, అటవీ సరిహద్దుల గుర్తింపు, మార్పుచేర్పులు, అటవీ వనరుల నమోదు మొదలైనవి. జీఐఎస్‌తో సహా ఆధునిక సమాచార సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అటవీ శాఖ చేపడుతున్న కొన్ని ముఖ్యమైన, పెద్ద కార్యకలాపాలు.
-దాదాపు అన్ని కార్యక్రమాలు/అటవీ శాఖ పథకాల్లో స్థానిక ప్రజలను అటవీ శాఖ నిమగ్నం చేస్తోంది. వన సంరక్షణ సమితి (వి.ఎస్.ఎస్)లు, పర్యావరణ అభివృద్ధి కమిటీ (ఇ.డి.సి)ల సేవలను రక్షిత ప్రాంతాల అభివృద్ధిలోనూ, జల కూడలి (వాటర్‌షెడ్) అభివృద్ధి కమిటీలు మొదలైన వాటి సేవలను రివర్ వ్యాలీ ప్రాజెక్టులోనూ స్వీకరిస్తోంది. ఒక ప్రాంతం/వన్యప్రాణి అటవీ డివిజన్ల పరిధిలో అన్ని వి.ఎస్.ఎస్లనూ కలిపిన సమాఖ్యలే సొసైటీల రిజిస్ట్రేషన్ చట్టం కింద అటవీ అభివృద్ధి ఏజెన్సీలవుతాయి. ఇవి రాష్ట్రస్థాయిలో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ (ఎస్.ఎఫ్.డి.ఏ), డివిజన్ స్థాయిలో అటవీ అభివృద్ధి సంస్థ (ఎఫ్.డి.ఏ), గ్రామస్థాయిలో వన సంరక్షణ సమితి (వి.ఎస్.ఎస్) అనే మూడంచెల వ్యవస్థలో ఈ సమాఖ్యలు పనిచేస్తాయి.
సామాజిక వనాలు
-పర్యావరణను కాపాడటానికి, మెరుగుపరచడానికి, లాభదాయకమైన ఉపాధి కల్పించడానికి రిజర్వ్ అడవుల వెలుపల వృక్ష సంపదను పెంచడానికి ప్రజలతో, రైతులతో పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. సామాజిక వనపోషణలోని ప్రధానమైన భాగాలు మొక్కల పంపిణీ, ఊరుమ్మడి భూముల్లో, సంస్థల్లో, రోడ్డు పక్క ఉన్న ఖాళీ స్థలాల్లో తోటలు వేయడం.
-బహిరంగ స్థలాల్లో పెంచే నిమిత్తం సిద్ధం చేసిన మొక్క జాతులు వేప, పొంగామియా, మేడి, మర్రి, రావి, గంగరావి, ఉసిరి, సీతాఫలం, బాదం, మామిడి, టేకు, సరుగుడు, నీలగిరి మొదలైనవి. రిజర్వ్డ్ అటవీ ప్రాంతాల్లో, అడవి వెలుపల కూడా అటవీ కార్యకలాపాలన్నీ ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ కింద ఏకీకృతమవుతాయి.
-2014-15లో మిక్స్డ్ ప్లాంటేషన్స్ పథకం కింద పెంచిన, పంపిణీ చేసిన నారు రోడ్ల పక్కన వేయడానికి ఉద్దేశించి 2014 డిసెంబర్ వరకు పెంచిన మొక్కలను, అలాగే దట్టంగా వేయడానికి ఉద్దేశించి పెంచిన దిగువ తెలిపిన విధంగా ఉన్నాయి.
పరిహార వనపోషణ నిధి నిర్వహణ, ప్రణాళికా ప్రాధికార సంస్థ
-కాంపెన్సేటరీ అఫోర్స్టేషన్ ఫండ్ మేనేజ్మెంట్ అండ్ ప్లానింగ్ అథారిటీ (కాంపా)ని భారత ప్రభుత్వ పర్యావరణ, అడవుల మంత్రిత్వ శాఖ నెలకొల్పింది. అటవీ భూములను అటవీయేతర ప్రయోజనాలను మళ్లించినప్పుడు ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి వనపోషణ, వన పునరుజ్జీవన కార్యకలాపాలను అభివృద్ధి చేయడానికి ఈ సంస్థను ఉద్దేశించారు.
-రాష్ట్రంలో 2009 నుంచి కాంపా కార్యక్రమాలు అమలవుతున్నాయి. తెలంగాణలో 2009-10 నుంచి 2013-14 వరకు వీటి కింద రూ. 233.125 కోట్లు ఖర్చు చేశారు. 2014-15కు రూ. 101.95 కోట్లు కేటాయించగా దీనిలో 2014 డిసెంబర్ వరకు రూ. 45.11 కోట్లు ఖర్చు చేశారు.
2014-15లో కాంపా విజయాలు
-నికర వర్తమాన విలువ (ఎన్.పి.వి) భాగం కింద మొక్కలు నాటిన మొత్తం విస్తీర్ణం 2,695 హెక్టార్లు
-144 బేస్ క్యాంప్‌లు, 60 ైస్ట్రెక్ ఫోర్స్ దళాలు, 57 చెక్‌పోస్టులు నెలకొల్పి నిర్వహిస్తున్నారు.
-763 కిలోమీటర్ల మేర అగ్ని ప్రమాద నిఘా మార్గాలను నిర్ణయించి, ప్రతి ప్రమాదభరితమైన రుతువులో 458 మంది నిఘా పెడుతున్నారు. అగ్ని ప్రమాదం జరిగే అస్కారమున్న మండలాల్లో 19 (ఫైర్) వాచ్ టవర్లను నిర్మించబోతున్నారు.
-అటవీ బ్లాక్‌ల చుట్టూ 5070 సరిహద్దు స్తంభాలను కట్టాలని ప్రతిపాదించారు.
-పట్టణ అటవీ బ్లాక్‌ల చుట్టూ 6 కిలోమీటర్ల పొడవున రక్షణ గోడను నిర్మించాలని తలపెట్టారు.
-రంగంలో ముందు వరుసలో పనిచేసే సిబ్బందికి 44 అధికార నివాసాలను నిర్మించాలని తలపెట్టగా, వాటిలో 20 క్వార్టర్ల నిర్మాణం పూర్తయింది. కొందరు సిబ్బంది వాటిలో ఉంటున్నారు.
-కాంపా కింద 2015లో మొక్కలు నాటడానికి సంబంధించి ఎన్.పి.వి కింద 5030 హెక్టార్లలో ముందస్తు కార్యకలాపాలను మొదలుపెట్టారు.
రాష్ట్రంలో వన్యప్రాణి జీవవైవిధ్య పరిరక్షణ
-సుసంపన్నమైన చెట్టూచేమా, పర్యావరణ వ్యవస్థలు తెలంగాణ రాష్ర్టానికి ప్రకృతి ఇచ్చిన వరం. రాష్ట్రంలో 2939 వృక్షజాతులు, 365 పక్షి జాతులు, 103 క్షీరదాల జాతులు, 28 సర్పజాతులు పెద్ద సంఖ్యలో అకశేరుక జాతులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ప్రభుత్వ జీవ వైవిధ్యాన్ని పరిరక్షించే లక్ష్యంతో ప్రభుత్వం 12 ప్రాంతాలను ఆరక్షిత ప్రాంతాలుగా ప్రకటించింది. వీటిలో 9 వన్యప్రాణి ఆశ్రయాలు, 3 జాతీయ వన్యప్రాణి నిలయాలు 5,692.48 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నాయి. ఇది తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం అడవిలో 19.73 శాతం. ఆరక్షిత ప్రాంతాల అనుసంధాన గుచ్ఛంలో అంతరించిపోతున్న మంచి నీటి మొసళ్లకు (మార్ష్) నిలయమైన మంజీరా ఆశ్రయం, శివారామ్ వన్యప్రాణి ఆశ్రయాలకు చెందిన జల ప్రదేశాలున్నాయి.
టైగర్ ప్రాజెక్టు
-రాష్ర్టానికి రెండు టైగర్ రిజర్వ్‌లున్నాయి. ఒకటి నల్లమల కొండల్లో మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలో వ్యాపించి ఉన్న అమ్రాబాద్ టైగర్ రిజర్వ్. మరొకటి కవ్వాల్ టైగర్ రిజర్వ్. ఇది మహారాష్ట్రలోని తడోబా అంథేరీ టైగర్ రిజర్వ్ వరకు ఛత్తీస్‌గఢ్‌లోని ఇంద్రావతి టైగర్ రిజర్వ్ వరకు వ్యాపించిన అడవులతో కలసి ఉంది. పులులు కవ్వాల్కు, మిగతా రెండు టైగర్ రిజర్వ్‌ల మధ్య అటూఇటూ వలస వెళ్తుంటాయి. కావున మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ డివిజన్ల మీదుగా మూడు టైగర్ రిజర్వ్‌లను అనుసంధానం చేస్తూ కారిడార్లను అభివృద్ధి చేయడం అంతరించి పోతున్న పులి జాతులను కాపాడటానికి అత్యంత కీలకం.
తెలంగాణ స్టేట్ బయో డైవర్సిటీ బోర్డు
-జీవ వైవిధ్యాన్ని కాపాడటానికి, మనగలిగేలా జీవ వైవిధ్యాన్ని ఉపయోగించడానికి, జీవ వనరులను సంబంధితులందరి మధ్య న్యాయంగా, సమానంగా పంపిణీ చేసే లక్ష్యంతో తెలంగాణ బయోడైవర్సిటీ బోర్డు (టి.ఎస్.బి.డి.బి) ఏర్పడింది. ఏటా మే 22న బయో డైవర్సిటీబోర్డు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. 170 జీవ వైవిధ్య నిర్వహణ కమిటీలను తెలంగాణలో ఏర్పాటు చేశారు. 10 జిల్లాల్లో, 66 మండలాల్లో, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఈ కమిటీలు విస్తరించి ఉన్నాయి. జీవ వైవిధ్యం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడానికి, జీవ వైవిధ్య పర్యవసానాలపై అప్రమత్తం చేయడానికి ప్రతి జిల్లాలో జీవ వైవిధ్య పార్కులను నెలకొల్పాలని జీవ వైవిధ్య బోర్డు ప్రతిపాదించింది.
తెలంగాణకు హరిత హారం
-రాష్ట్రం మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో ఇప్పుడున్న 25.16 శాతం నుంచి హరిత కవచాన్ని 33 శాతానికి పెంచాలని ఆకాంక్షిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అగ్రగామి కార్యక్రమం తెలంగాణకు హరితహారం అక్రమ రవాణా, దురాక్రమణలు, అగ్ని ప్రమాదాలు, మేత వంటి వాటి నుంచి అడవులను మరింత సమర్థంగా రక్షించడం ద్వారా, అడవుల లోపల, బయట వాటర్షెడ్ల విధానాలతో భూసారం, తేమల పరిరక్షణ చర్యలు మొదలైన వాటితో దెబ్బతిన్న అడవులను పునరుజ్జీవనం చేయడానికి బహుముఖ కృషి చేయడం ఈ పథకం లక్ష్యం.
-పైన తెలిపిన చర్యలే కాక, అటవీ ప్రాంతాల వెలుపల కూడా భారీస్థాయిలో చెట్లను పెంచడం ద్వారా సామాజిక వనపోషణకు కొత్త ఊపునివ్వాలని తలపెట్టారు. పెద్ద రోడ్ల పక్కన, నది ఒడ్డున, కాలువల ఒడ్డున, బీడుపడిన కొండల మీద, చెరువు కట్టల మీద, నది తీరాల్లో, సంస్థల ఆవరణల్లో, ధార్మిక ప్రదేశాల్లో, గృహ వాడల్లో ఖాళీగా వదిలేసిన ఊరుమ్మడి స్థలాల్లో ఈ విధమైన వనపోషణను చేపట్టాలని తలపెట్టారు. సంబంధితులు అందరినీ కలుపుకొనిపోవాలనే వైఖరితోనే హరిత వృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నారు. ప్రభుత్వ విధానాలు, చట్టం, పరిపాలనకు సంబంధించిన వ్యవహారాల్లో అవసరంగా ఉన్న సంస్కరణలు ఈ దృక్పథానికి సాయపడగలవు.
-దీనిలో భాగంగా వచ్చే మూడేండ్లలో 230 కోట్ల మొక్కలను రాష్ట్రవ్యాప్తంగా నాటాలని తలపెట్టారు. వీటిలో 130 కోట్ల మొక్కలను నోటిఫై అయిన అటవీ ప్రాంతాలకు వెలుపలే నాటించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో 10 కోట్ల మొక్కలను, మిగతా 120 కోట్ల మొక్కలను రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో నాటాలని సంకల్పించారు. నోటిపై చేసిన అడవుల్లో ముమ్మర అటవీ రక్షణ కార్యకలాపాల ద్వారా అడవుల లోపల 100 కోట్ల వృక్షాలను పునరుజ్జీవింపజేసే కార్యక్రమాన్ని కూడా తలపెట్టారు.
-ప్రభుత్వం చేపట్టిన కొత్త ప్రయత్నం మన ఊరు- మన ప్రణాళిక నుంచి లభించిన పరిశీలనల ఆధారంగా నర్సరీలు, తోట చెట్ల మొక్కలకు అనువైన తావులను గుర్తించడానికి తెలంగాణకు హరితహారం కార్యక్రమం కింద ముమ్మరమైన కసరత్తు జరిగింది.
-అటవీ శాఖ, డి.డబ్ల్యు.ఎం.ఎ, వ్యవసాయం, ఉద్యానవనాలు, గిరిజన సంక్షేమం మొదలైన సంస్థలను కూడా నిమగ్నం చేసి గ్రామాలవారిగా మొత్తం 3,888 నర్సరీలను గుర్తించారు. 2015లో 40 కోట్ల మొక్కలను సిద్ధం చేయాలని తలపెట్టారు. ఇంకా బాగా ఎత్తుగా ఎదిగే వృక్షాలకు చెందిన మరో 40 కోట్ల మొక్కలను 2016 వనపోషణ కోసం లక్ష్యంగా పెట్టుకున్నారు.
అడవులు మన భూమికి ఊపిరితిత్తులు. అవి గాలిని శుభ్రపరుస్తూ, మన ప్రజానీకానికి సరికొత్త జవజీవాలను ఇస్తాయి
– ఫ్రాంక్లిన్ డి.రూజ్వెల్ట్
సామాజిక ఆర్థిక చిత్రణ-2015 పుస్తకం నుంచి
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు