నిత్య చైతన్య దీపిక ఉస్మానియా యూనివర్సిటీ
మనిషిలో విద్య చైతన్యాన్ని తట్టిలేపుతుంది. ప్రశ్నించటం నేర్పుతుంది. అన్యాయాలను ఎదిరించే తెలివిని, తెగువను ఇస్తుంది. ఆ చైతన్యదీపాల్లాంటి పౌరులను తయారుచేసే కార్ఖానాలు విద్యాలయాలే. తెలంగాణ గడ్డపై కూడా అలాంటి చైతన్య కార్ఖానా ఉంది. అదే ఉస్మానియా విశ్వవిద్యాలయం. 1918లో ఉస్మానియా యూనివర్సిటీ స్థాపనతో విద్యాచైతన్యం తెలంగాణ నలుదిశలా విస్తరించింది. ఎంతోమంది మేధావులను, పరిపాలనాధక్షులను అందించటమేకాకుండా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి కేంద్ర బిందువుగా నిలిచింది ఉస్మానియా విశ్వవిద్యాలయం.
-దేశంలోని సంస్థానాల్లో హైదరాబాద్ నిజాం సంస్థానం ఒకటి. ఇందులో మూడు ప్రాంతాలు తెలంగాణ, మరఠ్వాడ, కర్ణాటకలు ఉన్నాయి. భారత యూనియన్‌లో హైదరాబాద్ చేరేనాటికి దీని విస్తీర్ణం 82,700 చ.కి.మీ. ఇందులో తెలంగాణ ప్రజల మాతృభాష తెలుగు. వీరు 10 మిలియన్లు. తెలంగాణలో వరంగల్, మెదక్ సుభాలు ఉన్నాయి. వాటి విస్తీర్ణం 49,502 చదరపు మైళ్లు.
-అసఫ్‌జాహీ వంశ (1724-1948) నిరంకుశ పాలనలో ప్రజలకు వాక్ స్వాతంత్య్రం, సభా స్వాతంత్య్రం, విద్యాహక్కులు లేవు. చదువుకునే వారిసంఖ్య ప్రతి వందమందిలో ముగ్గురు మాత్రమే. కానీ 7వ నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ మాత్రం విద్యాభివృద్ధికి అనేక చర్యలు తీసుకున్నారు. 1908 వరకు మాత్రమే చివరి నిజాం కాలంలో ప్రాథమిక, మాధ్యమిక తరగతులను ప్రభుత్వం నడిపేది. 1887లో నిజాం కళాశాలను 6వ నిజాం స్థాపించారు. ఇది మద్రాస్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా నడిచింది. విశ్వవిద్యాలయ ఏర్పాటుపై నిజాం రాజ్య విద్యాశాఖ కార్యదర్శి సర్ అక్బర్ హైదర్ విద్యా ప్రణాళికను రూపొందించాడు.
-ప్రాచీన పాశ్చాత్య సాంప్రదాయాలకు అనుగుణమైన లౌకిక, ఆధ్యాత్మిక, నైతిక ప్రవృత్తిని, శారీరక మానసిక వికాసానికి దోహదపడే దేశ విదేశీ భాషా సాంప్రదాయ విజ్ఞాన సమ్మిళితమైన, వివిధ శాస్ర్తాల్లో పరిశోధనాదృష్టిని అలవరిచేలా, విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడే విద్యా ప్రణాళికను రూపొందించడం సమంజసం. అలాంటి విద్యాబోధన ఉర్దూలోనే జరగాలి. సమకాలీన పరిస్థితులకు అనుగుణంగా ఆంగ్లభాషా సాహిత్య పరిజ్ఞానం కోసం ఉర్దూకు ప్రథమస్థానం ఇవ్వడం మా సంకల్పం అని నిజాం రాజు 1918లో తన గెజిట్‌లో (1327 ఫసలీ) పేర్కొన్నారు.
-1918లో ఉస్మానియా విశ్వవిద్యాలయం స్థాపించారు. తాత్కాలికంగా 1919 ఆగస్టు 28న గన్‌ఫౌండ్రీలో తరగతులు ప్రారంభించారు. ఆర్ట్స్‌కళాశాల భవనం కోసం అధికమెట్ట (అడిక్‌మెట్) ప్రాంతంలో 1400 ఎకరాల భూమిని సేకరించేందుకు నిజాం రాజు సర్ ప్యాట్రిక్ జెడ్డీస్ను, కాలే జీ భవనం డిజైన్ కోసం ఇంజినీర్లు నవాబ్ జైన్‌యార్ జంగ్, సయ్యద్ అలీరాజాలను నియమించారు. బెల్జియంకు చెందిన ఇంజినీర్ మాన్ష్యూర్ జాస్ఫర్ ఇండోసర్సానిక్ లేదా ఇండో గోథిక్ శైలిలో భవన నిర్మాణం చేపట్టారు. హైదరాబాద్‌కు తూర్పున 10 కి.మీ.ల దూరంలో ఈ భవన నిర్మాణం ప్రారంభమైంది. నల్లరాతితో, రూ. 33 లక్షల ఖర్చుతో, హిందూ మహ్మదీయ శిల్పకళారీతిలో నిర్మించారు. జామే ఉస్మానియా రైల్వే స్టేషన్ ఈ భవనానికి దగ్గర్లో ఉంది.
-7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ముందుచూపుగల పాలకుడు. ఈ విశ్వవిద్యాలయాన్ని చందాబాయి మహల్లేఖ అనే జమీందారిణి జాగీరులో స్థాపించారు. తాన్సేన్ మునిమనువడు ఆమె సంగీత గురువు.
-ఆర్ట్స్ కళాశాల నిర్మాణం 1934 నుంచి 1939 నాటికి పూర్తయ్యింది. ఇక్కడ 1939లో తరగతులు ప్రారంభమయ్యా యి. మొదట ఆర్ట్స్, సైన్స్ తరగతులు ఈ భవనంలోనే జరిగేవి. విద్యార్థుల ప్రవేశాలు పెరుగుతుండటంతో బోటనీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ భవనాల నిర్మాణం చేపట్టారు. 1944లో అవి పూర్తయ్యాయి. ఆర్ట్స్ కాలేజీ భవనం ముందే ఆఫీసు, గ్రంథాలయం ఏర్పాటు చేశారు. 1944 తరువాత ఇంటర్ తరగతులు సైఫాబాద్, ఇతర కళాశాలలకు మార్చారు.
-వర్సిటీ ప్రాంగణంలోనే ఇంజినీరింగ్, టెక్నాలజీ (1924 లో), లా కాలేజీ (1923లో), బీఈడీ కాలేజీతో పాటు వైస్ చాన్సలర్ వసతిగృహం, విశ్వవిద్యాలయ ఉద్యానవనం, చూడదగినవి. ఆర్ట్స్ కాలేజీకి ఎదురుగా లా కళాశాలకు మధ్యలో గ్రంథాలయం నిర్మించారు. దీనిని సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రారంభించారు. విశ్వ విద్యాలయం ఆవరణను గురించి ఆర్ట్స్ కళాశాల సమీపంలోని మోడల్ రూమ్‌లో చక్కగా చిత్రించారు. ఈ విశ్వవిద్యాలయం 1919లో 20 మంది అధ్యాపకులు, 225 మంది విద్యార్థుల (ఇంటర్)తో ప్రారంభమైంది. 1956-57లో 6 యూనివర్సిటీ కాలేజీ లు, 10 Constuent colleges, 1975-76లో 97 కాలేజీలు అయ్యాయి. 1985-86 నాటికి పీజీ కేంద్రాలతో కలుపుకొని 38 ప్రభుత్వ, 14 వీవీ, 51 ప్రైవేట్ యాజమాన్యాల నిర్వహణలో ఉన్నాయి.
-నిజాం కాలేజీని 1887లో స్థాపించారు. దీని మొదటి ప్రిన్సిపల్ అఘోరనాథ ఛటోపాధ్యాయ (సరోజినీ నాయుడు తండ్రి). ఈ కళాశాల స్వర్ణోత్సవం 1947లో జరిగింది. నిజాం కాలేజీ మద్రాస్ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉండదని, ఉస్మానియా వర్సిటీకి అనుబంధంగా పనిచేస్తుందని నిజాం రాజు ప్రకటించారు.
-ప్రజా సంస్థలు కూడా కళాశాలలు నిర్వహించడానికి 1949 లో ప్రభుత్వం అనుమతించింది. దీంతో మొదటిసారిగా వివేకవర్దిని కళాశాల ప్రారంభమైంది. అనంతరం గాంధీ మెడికల్ కళాశాల, బద్రుకా కాలేజీ, నానక్‌రాం భగవాన్‌దాస్ సైన్స్ కాలేజీ ఏర్పడ్డాయి.
-సాయంకాలం కాలేజీలు హైదరాబాద్‌లో ఒకటి, సికింద్రాబాద్‌లో ఒకటి ప్రారంభమయ్యాయి. డిప్లొమా కోర్సులుగా మొదట ఫ్రెంచి, జర్మన్, సంస్కృతం, తెలుగు, కన్నడం, మరాఠీ, మొదలైన భాషల్లో ప్రవేశపెట్టారు. అంతేకాకుండా డిగ్రీ పరీక్షలను నిర్వహించాలని వర్సిటీ అధికారులు నిర్ణయించారు.
-అయితే మొదట ఉర్దూలోనే రాయాలనే నియమం ఉండే ది. కానీ 1948 తర్వాత సమాధానాలు ఇంగ్లిష్‌లో రాయడానికి అనుమతించారు. హిందీ, ఉర్దూలో కూడా రాయవచ్చు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఏర్పడిన తర్వాత ఇంగ్లిష్‌లో రాయడం తప్పనిసరి చేశారు. హైదరాబాద్ రాష్ట్రంలో ఉర్దూ బాగా వ్యాపించి ఉండటంతో కొన్నేండ్ల తర్వాత ఉర్దూలో పరీక్షలు రాయడానికి, తరగతులు బోధించడానికి అవకాశం కల్పించారు. కామర్స్, జాగ్రఫితోపాటు అనేక మానవ సాంఘికశాస్ర్తాలు చేర్చారు. 1950 నుంచి తెలుగు, కన్నడ, మరాఠీల్లో పరిశోధనకు అవకాశం కల్పించారు. జర్నలిజం కూడా అదే ఏడాది ప్రవేశపెట్టారు. ఆర్ట్స్ కళాశాలలో 1 లక్ష గ్రంథాలతో గ్రంథాలయం ఏర్పా టు చేశారు. ఇందులో తాళపత్రగ్రంథాలయం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. దీంతో అన్ని భాషల్లోని 6,604 తాళ పత్రగ్రంథాలు ఇక్కడ ఉన్నాయి. సాలార్జంగ్ సేకరించిన గ్రంథాలు కూడా ఉన్నాయి. సంస్కృత అకాడమీని కూడా ఇందులోనే స్థాపించారు.
ఇంజినీరింగ్ కాలేజీ :
విశ్వవిద్యాలయం ప్రారంభమైన 11 ఏండ్లకు 1929లో సివిల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్‌తో కళాశాల ప్రారంభమైంది. తర్వాత మెకానికల్ ఇంజినీరింగ్ (1940లో), ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ (1949), మైనింగ్ ఇంజినీరింగ్ (1957), ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజినీరింగ్ (1961), కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (1981) ప్రారంభించారు. మైనింగ్ ఇంజినీరింగ్ కాలేజీ మాత్రమే కొత్తగూడెంలో ప్రారంభమైంది. సివిల్ ఇంజినీరింగ్‌లో హైడ్రోమెకానిక్స్, వాటర్ మేనేజ్మెంట్స్, స్ట్రక్చరల్ ఇంజినీరింగ్, జియో టెక్నికల్ ఇంజినీరింగ్, ప్రత్యేక అంశాలుగా నిర్వహిస్తున్నది. 1982-83 నుంచి మెడికల్ ఇంజినీరింగ్‌ను కూడా నిర్వహిస్తుంది.
సాంకేతిక కళాశాల:
1969 సెప్టెంబర్ 1న టెక్నికల్ కాలేజీ ఏర్పడింది. ఇందులో ట్రాన్స్ఫర్, ప్రోరస్, ప్లాంట్ డిజైన్, ప్రాసెస్ డైనమిక్స్ అండ్ కంట్రోల్ కెమికల్ రియాక్షన్ ఇంజినీరింగ్ అనే అంశాలను, మెటీరియల్ సైన్స్ అండ్ టెక్నాలజీ, టెక్నాలజీ ఆఫ్ వెజిటెబుల్స్, టెక్నాలజీ ఆఫ్ ఆర్గానిక్ సర్ఫేస్ కోటింగ్, టెక్నాలజీ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ అండ్ వైన్ కెమికల్స్ అనే అంశాలను టెక్నాలజీ కాలేజీలో బోధిస్తున్నారు.
ఉస్మానియా మెడికల్ కాలేజీ
1925లో ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌ను ఏడో నిజాం ప్రారంభించారు. 1926-27లో విశ్వవిద్యాలయానికి అప్పగించబడి ఎంబీబీఎస్ డిగ్రీలను ఇవ్వడం ప్రారంభమైంది. అనాటమీ, ఫిజియాలజీ, ఫార్మకాలజీ, పాథాలజీ మొదలైన విభాగాలు ఏర్పాటు చేశారు. 1955లో గాంధీ మెడికల్ కాలేజీ, 1968 జూలై 15న నర్సింగ్ కాలేజీ, 1959లో డెంటల్ కాలేజీలను ఏర్పాటు చేశారు.
బోటనీ :
1924లో ప్రారంభమైంది. పీజీలో ఆల్గే, ఫంగై, బ్రయోఫైటా, టెరిడోఫైటా, జిమ్నాస్పెర్మ్, ఆంజియోస్పెర్మ్, టాక్సానమీ, అనాటమీ,ఎంబ్రియాలజీ, పోలినాలజీ, ప్లాంట్ అండ్ సెల్ బయాలజీ, ఎకాలజీ, ఎన్విరాన్మెంటల్ బయాలజీ, ఫైటో జియాగ్రఫి, సైటాలజీ, జెనెటిక్స్, ఎవల్యూషన్ అండ్ బయోమెట్రీ మైకాలజీ అండ్ ప్లాంట్ పైథాలజీ, అప్లయిడ్ప్లాంట్ ఫిజియాలజీ, సైటాలజీ, సైటోజెనెటిక్స్ అనే అంశాలను కూడా బోధిస్తున్నారు.
మైక్రోబయాలజీ:
1974లో ప్రారంభమైంది. దేశంలో మైక్రో బయాలజీ ప్రత్యేక విభాగంగా ఏర్పడటం ఓయూతోనే మొదలైంది. ఈ విభాగం పరిశోధనల వల్ల… హాంగ్‌కాంగ్ 68 రకపు వైరస్ (ఇన్ఫ్లుయంజా) కారణంగా వచ్చే చెడు ఫలితాలు తెలుసుకోవడం, వాటిని నిరోధించడంలో సీ విటమిన్ ప్రముఖ పాత్ర వహిస్తుందని రుజువైంది. వివిధ వ్యాధుల నిరోధానికి ఉపయోగించే ఔషధాల ప్రభా వం మానవ కణాలపై ఏ విధంగా ఉంటుందో కూడా తెలుసుకున్నారు. ఫంగస్ విషపదార్ధాలు (మైకోటాక్సిన్స్) ఆహా ర ధాన్యాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో, వాటివల్ల మానవ ఆరోగ్యానికి ఎలాంటి చెడు జరుగుతుందో పరిశోంధించారు. బ్యాక్టీరియా పరిమాణం ఎంత ఉంటుందనే అంశాల్లో పరిశోధనలు జరిపారు.
జెనెటిక్స్ :
దేశంలో తొలిసారిగా ఈ విశ్వవిద్యాలయం 1961, మే నెలలో ప్రారంభించింది. రేడియేషన్ జెనెటిక్స్ ప్రాజెక్ట్‌గా ప్రారంభమై భారత అణుశక్తి వారి సహాయంతో రేడియో బయాలజికల్ యూనిట్‌గా మార్పుచెంది 1966లో జెనెటిక్స్ శాఖ అయింది.
ఈ విభాగంలో సాధారణ జెనెటిక్స్, రేడియేషన్ జెనెటిక్స్, ప్లాంట్ జెనెటిక్స్, మ్యూటేషన్ బ్రీడింగ్, ప్లాంట్ బ్రీడింగ్, ప్లాంట్ సైజ్ జెనెటిక్స్, ఎన్విరాన్మెంటల్ మ్యూటా జెనిసిస్, రీప్రొడక్టివిటీ ఫిజియాలజీ, సైటాలజీ, సెల్ బయాలజీ, సైటా జెనెటిక్స్, హ్యూమన్ జెనెటిక్స్, బయోమెట్రీ, మైక్రో బయాల్ అండ్ మాలిక్యులర్ జెనెటిక్స్, ఇమ్యూనో జెనెటిక్స్ కోర్సులను ఎంఎస్సీలో ప్రవేశపెట్టారు.
ఖగోళ శాస్త్ర విభాగం
నిజాం ప్రభుత్వ కాలంలో నిజాం అబ్జర్వేటరీ 1959-60 నాటి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఒక శాస్త్రంగా చేరింది. ఖగోళశాస్త్ర ఎంఎస్సీలో అప్లయిడ్ మ్యాథ్స్, మెకానిక్స్, స్టెల్లార్ ఎస్ట్రోమాస్ఫియర్స్, ఇంటీరియల్ మిల్కీ వే అండ్ ఎక్స్టర్న్డ్ గెలాక్సీస్, ఆస్ట్రానమికల్ టెక్నిక్స్, రేడియో ఆస్ట్రానమీ అండ్ స్పేస్ ఆస్ట్రోఫిజిక్స్ అనే అంశాలను బోధిస్తున్నారు. హైదరాబాద్‌లో నిజామియా అబ్జర్వేటరీ, జాపాల్-రంగాపూర్ అబ్జర్వేటరీల్లో అత్యంత శక్తివంతమైన టెలిస్కోపులు ఉన్నాయి.
పరిశోధన అంశాలు :
ఫొటోమెట్రిక్ అండ్ స్టెక్ట్రోస్కోపిక్ స్టడీస్ ఆఫ్ బైనరీ అండ్ వేరియబుల్ స్టార్స్, సెల్లార్ డైనమిక్స్, రేడియోటివ్ ట్రాన్స్ఫర్ ఇన్ ప్లానెటరీ అట్మాస్పియర్. ఈ విభాగంలో ఎస్ఎం అల్లాద్దిన్కి 1981లో మేఘనాథ్ గుహ అవార్డ్ వచ్చింది.
జీవ రసాయన శాస్త్ర విభాగం
1972లో ఏర్పడింది. ఎంఎస్సీ కోర్స్‌లో ఆర్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ టాపిక్స్, ఎంజైమ్స్ అండ్ బయో మెంబరిన్స్ బయోలాజికల్ ఆక్సిడేషన్, ఎమినో యాసిడ్స్ ప్రొటీ న్స్, న్యూక్లిక్ యాసిడ్స్ కార్బొహైడ్రేట్స్, లిపిడ్స్, విటమిన్లు, ఫిజియాలజీ ఆఫ్ టిష్యూస్ అండ్ ఆర్గాన్స్ ప్రొటీన్ బయోమైక్రోబయాలజీ వైరస్, ఫేజస్, జెనెటిక్స్, ఇమ్యునాలజీ, జెనెటిక్ ఇంజినీరింగ్ అనే అంశాలు ఇన్ట్రాక్షన్ విత్ మాలిక్యుల్స్. ఫార్మకో థెరఫ్యూటిక్స్ ఆఫ్ వీనమ్, సర్క్యులేటింగ్ థైరాక్సిన్ లెవల్స్ ఆఫ్ బఫెలో సీరమ్ అనే విషయాలపై పరిశోధన జరిగింది.
భూ భౌతిక శాస్త్రం :
1960 వరకు భూ భౌతికశాస్ర్తాన్ని భూగర్భ శాస్త్రంలో ఒక అంశంగా బోధించారు. అది 1966 లో ప్రత్యేక శాఖగా ఏర్పడింది. 1969లో పరిశీలనా భూభౌతిక అంశాలతోపాటు థియరటికల్ జియోఫిజిక్స్ అండ్ డేటా ప్రాసెసింగ్ జియోఫిజిక్స్, రాక్ ఫిజిక్స్, జియో ఫిజికల్ ప్రాస్పెక్టింగ్ అండ్ అనలిటికల్ టెక్నిక్స్ అనే ప్రత్యేక అంశాలను బోధిస్తున్నారు. భూగర్భ భూ భౌతిక శాస్త్రం (Ground water Geo-physics), పరిశీలనా భూ భౌతిక శాస్త్రం (Exploration Geo-physics) సర్టిఫికెట్ కోర్సులు కూడా ఉన్నాయి.
భౌతిక శాస్త్రవిభాగం :
వర్సిటీ ప్రారంభం నుంచే భౌతికశాస్త్ర విభాగం పనిచేస్తుంది. 1949లో ఎస్ భగవంతప్ప ప్రొఫెసర్‌గా ఉన్నప్పట్టి నుంచి అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో సాలిడ్ స్టేట్ ఫిజిక్స్, న్యూక్లియర్ ఫిజిక్స్, థియరిటికల్ ఫిజిక్స్, స్పెక్ట్రాస్కోపీ, బయో ఫిజిక్స్ రంగాల్లో పరిశోధనలు జరుగుతున్నాయి. ప్రస్తుతం యూజీసీ, శాస్త్ర పారిశ్రామిక పరిశోధనా సంస్థ, రక్షణ శాఖ, ఎలక్ట్రానిక్ కమిషన్ల సహకారంతో మొత్తం 42 పరిశోధన ప్రాజెక్టులను నిర్వహిస్తున్నారు. ఈ డిపార్ట్మెంట్ ఎలక్ట్రానిక్ రంగంలో ముఖ్యంగా టీవీ రంగంలో కొన్ని ముఖ్యమైన సాంకేతిక ఫలితాలను పొందింది.
గ్రంథాలయం
ప్రస్తుతం ఆర్ట్స్ కళాశాలలకు ఎదురుగా ఉన్న భవంతిని మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ 1966, ఆగస్టు 3న ప్రారంభించారు. సెంట్రల్ లైబ్రరీ అని పిలిచే ఇందులో ప్రస్తుతం 6,91,664 గ్రంథాలు తెలుగు, ఇంగ్లిష్, హిందీ, సంసృ్కతం, ఉర్దూ, పర్షియన్, టర్కీ, అరబ్బీ భాషల్లో ఉన్నాయి. గ్రంథాలయం అండర్ ఫ్లోర్లో రిసెర్చ్ విభాగం, మధ్య అంతస్థులో అనేక గ్రంథాలు, మ్యాగజైన్లు, మాస, నెల, పక్ష, దిన పత్రికలు ఉన్నాయి. పై అంతస్థులో పాత వార్తా పత్రికలు, పాతకాలం నాటి పత్రికలు ఉన్నాయి. ఇది స్కాలర్స్ విద్యార్థులకు ఉపయుక్తంగా ఉంది. మొత్తం గ్రంథాలయం కంప్యూటరైజ్డ్ చేసి క్షణాల్లో కావాల్సిన గ్రంథాలను విద్యార్థులకు అందుబాటులో ఉంచుతున్నారు.
వందేమాతరోద్యమం
బెంగాల్ రాష్ట్ర విభజన ఫలితంగా వచ్చిన వందేమాతర ఉద్యమం ప్రభావం హైదరాబాద్ రాష్ట్రంలో ఆలస్యంగా కనిపించింది. 1938వ సంవత్సరం తెలంగాణ రాజకీయ చరిత్రలో చారిత్రాత్మకమైనది. ఆ ఏడాది దసరాపండుగ సందర్భంగా B హాస్టల్ విద్యార్థులు వందేమాతర గీతాన్ని తమ ప్రార్థనా మందిరంలో పాడారు. అప్పటి బ్రిటిష్ ప్రభుత్వాన్ని అనుసరించి, విశ్వవిద్యాలయ అధికారులు కూడా ఈ గీతం ఆలపించడాన్ని నిషేధించినా విద్యార్థులు లెక్కచేయలేదు. దీంతో అధికారులు వారిని 1938 నవంబర్ 29 నుంచి 1938 డిసెంబర్ 10 వరకు సస్పెండ్ చేశారు. దాంతో విద్యార్థులు సమ్మె చేశారు. సస్పెండైన విద్యార్థులు 350 మంది. వారిలో పీవీ నర్సింహారావు, నూకల రామచంద్రారెడ్డి, హయగ్రీవాచారి, దేవులపల్లి వెంకటేశ్వర్రావు, ఆరుట్ల రామచంద్రారెడ్డి మొదలైన వారు ఉన్నారు. వారికి అప్పటి జాతీయ నాయకులైన మహాత్మాగాంధీ, నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ లాంటివారి సహకారం, సానుభూతి లభించాయి. అయినా అప్పటి పరిస్థితులవల్ల పీవీ నర్సింహారావు మరికొందరు మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు వెళ్లి చదవాల్సి వచ్చింది. పక్కనే ఉన్న వాల్తేరులోని ఆంధ్రా యూనివర్సిటీ వారు ఈ విద్యార్థులను చేర్చుకోలేదు. కారణం.. పీవీ అతని అనుచరులు క్విట్ కాలేజ్ ఉద్యమం చేపట్టడమే.
తెలంగాణ ఉద్యమ కార్ఖాన
తెలంగాణ తొలి ఉద్యమ ప్రభావంవల్ల విశ్వవిద్యాలయంలో రాజకీయాలు జోరందుకున్నాయి. ప్రతిసారి తెలంగాణ ఉద్యమాలకు, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఏదో అవినాభావ సంబంధం ఉండేది. 1969లో తెలంగాణలోని ఏకైక వర్సిటీ అయిన ఓయూలో జనవరి 12న ఒక సమావేశం జరిగింది. దీనికి అధ్యక్షుడు వెంకట్రామారెడ్డి. తెలంగాణ రక్షణల కోసం జనవరి 15 నుంచి సమ్మె చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో చేసిన తీర్మానాల్లో నాన్ ముల్కీలను వెనుకకు పంపాలనేది ఒకటి. 1969 జనవరి 13న తెలంగాణ విద్యార్థుల కార్యాచరణ సమితి ఏర్పడి, వైద్యవిద్యార్థి మల్లికార్జున్ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఇదే సమయంలో అన్నాబత్తుల రవీంద్రనాథ్ ఖమ్మంలో దీక్షకు దిగడంతో ఉద్యమం రాజుకుంది. ఈ ఉద్యమానికి ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని అనేక మంది విద్యార్థులు మద్దతుగా నిలిచారు. జామై ఉస్మానియాలో రైల్వేస్టేషన్‌ను విద్యార్థులు తగులబెట్టారు. అయితే విద్యార్థులపట్ల పోలీసులు అతిక్రూరంగా వ్యవహరించారు. మీకు తెలంగాణ కావాల్రా..? అంటూ ఇద్దరు విద్యార్థులను సజీవంగా మంటల్లోకి విసిరేశారు. అలా ఆహుతైన వారిలో తొలి అమరుడు ప్రకాశ్‌కుమార్ జైన్, రెండో వ్యక్తి సర్వారెడ్డి. ప్రకాశ్‌కుమార్ జైన్‌ది ఖమ్మం జిల్లా గార్ల. ఇక మలిదశ తెలంగాణ ఉద్యమం కూడా ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా నడిచింది.
ఓయూలో చదివిన ప్రముఖులు
పీవీ నరసింహారావు:
1921, జూన్ 28న జన్మించారు. ఆయన స్వస్థలం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ తాలూకాలోని వంగర గ్రామం. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యను అభ్యసిస్తూ 1938లో జరిగిన వందేమాతరం ఉద్యమంలో పాల్గొన్నారు. దీంతో ఆయనను విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరించారు. తర్వాత నాగ్‌పూర్ యూనివర్సిటీలో ఎల్ఎల్బీ పట్టా పొందారు.
ఆరుట్ల రామచంద్రారెడ్డి :
1909లో నల్లగొండ జిల్లా భువనగిరిలో జన్మించారు. 1930లో ఇంటర్ పూర్తిచేసి, 1931-32 విద్యా సంవత్సరంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చేరారు. హైదరాబాద్‌లో రెడ్డి హాస్టల్ స్థాపించిన నగర కొత్వాల్ పింగళి వెంకట్రామిరెడ్డిని ఒప్పించి, రెడ్డి బాలికల హాస్టల్‌ను ఏర్పాటు చేయించారు. తన భార్య రుక్మిణి (కమలాదేవి)ని తొలి విద్యార్థినిగా అందులో చేర్పించారు.
మాడపాటి రామచంద్రరావు (1903-51):
1903, మే 28న ఖమ్మం జిల్లా మధిర తాలూకా ఎర్రుపాలెంలో జన్మించారు. మాడపాటి హన్మంతరావుగారు వీరికి పెదనాన్న. ఉస్మానియాలో పట్టభద్రులు.
మాదిరాజు లక్ష్మీనరసింహారావు:
1931లో ఖమ్మం జిల్లా పండితాపురంలో జన్మించారు. హైదరాబాద్ సంస్థాన ప్రజాపోరాటంలో విద్యార్థిగా ప్రముఖపాత్ర వహించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయ అనుబంధ కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా పనిచేశారు.
ముల్లా అబ్దుల్ ఖయ్యూం (1853-1906):
చెన్నై నుంచి వచ్చి హైదరాబాద్‌లో స్థిరపడిన వీరికి అఘోరనాథ్ చటోపాధ్యాయతో కలిగిన పరిచయంవల్ల హిందూ ముస్లింల మధ్య ఐక్యత ఏర్పడింది. 1915లో వీరి కృషి ఫలితంగా హైదరాబాద్‌లో ప్రథమ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ జరిగింది. ఆ ప్రయత్న ఫలితమే 1919లో ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆవిర్భావం.
కొత్తపల్లి జయశంకర్ :
1934 ఆగస్టు 6న వరంగల్ జిల్లా అక్కంపేటలో జన్మించారు. ఉస్మానియాలో డిగ్రీ పట్టా తీసుకున్నారు. 1952లో నాన్ ముల్కీ ఉద్యమంలో పాల్గొన్నా రు. 1954లో ఫజల్ అలీ కమిషన్ ముందు ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతను చెప్పారు. 1969 ఉద్యమంలో పూర్తి భాగస్వాములయ్యారు. తెలంగాణ తొలి ఉద్యమంలో రాష్ట్ర ఆవశ్యకతపై అనేక గ్రంథాలు రాశారు. 610 జీవోపై ఆయన రాసిన పుస్తకం అనేక కమిషన్లకు మార్గదర్శకమైంది. 2011 జూన్ 21న ఆయన కన్నుమూశారు.
హయగ్రీవా చారి:
1916 నవంబర్ 15న వరంగల్ జిల్లా ధర్మసాగరం గ్రామంలో జన్మించారు. 1938లో ఉస్మానియాలో బీఏలో చేరి పీవీ నర్సింహారావుతోపాటు వందేమాతర ఉద్యమంలో పాల్గొన్నారు. యూనివర్సిటీ నుంచి సస్పెండైన వారిలో ఈయన కూడా ఉన్నారు.
ఎస్ జైపాల్‌రెడ్డి:
1942 జనవరి 16న మహబూబ్‌నగర్ జిల్లా ముద్గల్‌లో జన్మించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ (ఇంగ్లిష్) పూర్తిచేశారు.
కేసీఆర్:
1954 ఫిబ్రవరి 17న సిద్దిపేటలో జన్మించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలుగు సాహిత్యంలో ఎంఏ పట్టా పొందారు.
సుశీల్ కుమార్ షిండే:
1941, సెప్టెంబర్ 4న షోలాపూర్‌లో జన్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గవర్నర్‌గా పనిచేసిన ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో విద్యనభ్యసించారు.
పీ శివశంకర్:
1929 ఆగస్టు 10న హైదరాబాద్ జిల్లా మామిడిపల్లిలో జన్మించారు. ఓయూ నుంచి లా డిగ్రీ పూర్తిచేశారు. ఈయన న్యాయమూర్తిగా, కేంద్ర మంత్రిగా, గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు