భారత ఎన్నికల వ్యవస్థ నిర్మాణం – సంస్కరణలు
ప్రజాస్వామ్య విజయం నిష్పాక్షికంగా జరిగే ఎన్నికలపైనే ఆధారపడి ఉంటుంది. శతాబ్దాల పరాయి పాలననుంచి ప్రాణత్యాగాలకు వెరువక పోరాడి స్వాతంత్య్రం సాధించుకున్న భారతీయులు అందరికీ సమాన హక్కులు, స్వేచ్ఛకోసం కొంగొత్త ఆశలతో ప్రజాస్వామ్యం బాట పట్టారు. ఆ ప్రజాస్వామ్యం మనుగడ కోసం రాజ్యాంగంలో కట్టుదిట్టమైన ఎన్నికల వ్యవస్థను ఏర్పాటుచేశారు. కాలగమనంలో దేశ రాజకీయాల్లో ప్రవేశించిన అవాంచిత పరిస్థితులతో ఎన్నికల వ్యవస్థలో కూడా మార్పులు అనివార్యమయ్యాయి. ఎన్నికలను నిష్పక్షపాతంగా, స్వేచ్ఛగా నిర్వహించేందుకు అనేక సంస్కరణ చేపట్టారు.
ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిర్వ పోటీ పరీక్షల్లో భారత రాజ్యాంగం విభాగంలో ఎన్నికల వ్యవస్థ అంశానికి కూడా ప్రధాన్యం ఉంది. ఈ నేపథ్యంలో దేశంలో ఎన్నికల వ్యవస్థ, కేంద్ర ఎన్నికల సంఘం నిర్మాణం, ఎన్నికల సంస్కరణలు, సవాళ్లపై ఈ వారం నిపుణ పాఠకులకు ప్రత్యేకం.
– భారత ఎన్నికల సంఘం ముగ్గురు సభ్యులతో కూడి ఉంటుంది.
– భారత రాజ్యాంగంలో XV వ భాగం ప్రకరణ 324 నుంచి 329 వరకు మొత్తం 6 ప్రకరణల్లో ఎన్నికల సంఘం నిర్మాణం, అధికార విధులను గురించి వివరించారు.
– ఎన్నికల సంఘం 1950 జనవరి 25న ఏర్పడింది.
నోట్: 2010, జనవరి 25 నాటికి భారత ఎన్నికల సంఘం ఏర్పడి 60 ఏండ్లు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలు నిర్వహించి, 2011 జనవరి 25న తొలి జాతీయ ఓటర్ల దినంగా ప్రకటించారు.
నోట్: 2015, జనవరి 25న ఐదో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని నిర్వహించారు.
– ప్రజాస్వామ్యానికి ఎన్నికలు వెన్నెముక లాంటివి. పాలనా విధానానికి పునాదిలాంటివి. ప్రభుత్వ జోక్యంలేని స్వేచ్ఛాయుత ఎన్నికల నిర్వహణకు భారత రాజ్యాంగ నిర్మాతలు రాజ్యాంగ బద్ధంగా ఒక శాశ్వత, స్వతంత్ర ప్రతిపత్తి గల యంత్రాంగాన్ని రూపొందించారు. దీన్నే ఎన్నికల సంఘం అంటారు.
– ఎన్నికల సంఘం భవనాన్ని నిర్వాచన్ సదన్ అంటారు.
భారత ఎన్నికల సంఘం నిర్మాణం
– కేంద్ర ఎన్నికల సంఘం శాశ్వత, స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న రాజ్యాంగబద్ధ సంస్థ
– ప్రకరణ 324: ఎన్నికల సంఘం అధికారాలు, విధులను తెలియజేస్తుంది.
– ప్రకరణ 324(1): ప్రకారం పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతుల ఎన్నికలను నిర్వహించడం, నియంత్రించడం, పర్యవేక్షించడంతో పాటు ఓటర్ల జాబితాను తయారు చేయడం దీని విధి.
నోట్: కేంద్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించదు.
– ప్రకరణ 324(2): ప్రకారం ఇందులో ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్, రాష్ట్రపతి నిర్ణయించిన సంఖ్యలో ఇతర కమిషనర్లు ఉంటారు.
– ప్రధాన ఎన్నికల కమిషనర్, ఇతర కమిషనర్లు రాష్ట్రపతి చేత నియమించబడతారు.
– నియామకానికి రాజ్యాంగపరంగా ప్రత్యేక అర్హతలు ఏమిలేవు.
– వీరందరి పదవీకాలం 6 ఏండ్లు లేదా 65 ఏండ్లు వయసు నిండే వరకు ఏది ముందు అయితే అది వర్తిస్తుంది.
– జీతభత్యాలను పార్లమెంట్ నిర్ణయిస్తోంది. కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. ఆదాయపు పన్ను ఉండదు.
– ముగ్గురూ సుప్రీంకోర్టు సాధారణ న్యాయమూర్తి వేతనంతో సమానమైన వేతనాన్ని పొందుతారు. ప్రస్తుతం వీరి వేతనం 90 వేల రూపాయలు.
– ప్రకరణ 324(5): ప్రకారం ప్రధాన ఎన్నికల అధికారిని, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించే విధంగానే పార్లమెంట్ తొలగిస్తుంది. కానీ ఇతర కమిషనర్లు మాత్రం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సలహా మేరకు అవినీతి, అసమర్ధత అనే కారణాలపై రాష్ట్రపతి తొలగిస్తాడు.
– ప్రకరణ 325 ప్రకారం,మతం, కులం, జాతి, లింగ, ప్రాంత ప్రాతిపదికపై ఏ పౌరునికి ఓటుహక్కు నిరాకరించరాదు. (ఐదు వివక్షలను రద్దు చేస్త్తుంది.)
– ప్రకరణ 326 ప్రకారం లోక్‌సభకు లేదా రాష్ర్టాల శాసనసభలకు ఎన్నికలు వయోజన ఓటుహక్కు ప్రాతిపదికపై జరుగుతాయి. 18 ఏండ్లు నిండిన వయోజనులు ఓటరుగా పేరు నమోదు చేయించుకోవడానికి అర్హులు.
నోట్: 61వ రాజ్యాంగ సవరణ చట్టం-1988 ద్వారా ఓటింగ వయస్సు 21 ఏండ్ల నుంచి 18 ఏండ్లకు అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ ప్రభుత్వం తగ్గించింది. ఇది 1989, మార్చి 28 నుంచి అమల్లోకి వచ్చింది.
– ప్రకరణ 327 ప్రకారం, పార్లమెంట్ ఎన్నికలకు, రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించిన విషయాలపై పార్లమెంట్ చట్టాలను రూపొందిస్తోంది.
ఉదా: నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ, ఓటర్ల జాబితా మొదలైన అంశాలు
– ప్రకరణ 328 ప్రకారం రాష్ట్ర శాసనసభ, రాష్ట్రంలో జరిగే శాసనసభ ఎన్నికలకు సంబంధించిన అంశాలపై చట్టాలు రూపొందిస్తున్నది.
– ప్రకరణ 329 ప్రకారం ఎన్నికల చిహ్నాల వివాదాలపై కోర్టులు జోక్యం చేసుకోరాదు. అంటే ఎన్నికల చిహ్నాల వివాదాలను ఎన్నికల సంఘం పరిష్కరిస్తుంది.
– రాజకీయ పార్టీలకు కూడా చిహ్నాలను కేటాయిస్త్తుంది.
– ఎన్నికల వివాదాలపై పార్లమెంట్ లేదా శాసనసభలచే ఏర్పాటు చేసిన ఆథారిటీల ఎదుట కేసు వేయాలి.
నోట్: రాష్ట్రం సాధారణ కోర్టులకే ఈ అధికారాలను బదలాయించింది.
– ప్రధానమంత్రి, లోక్‌సభ స్పీకర్ల ఎన్నికలను ఏ న్యాయస్థానంలోనూ ప్రశ్నించరాదు.
– రాయ్‌బరేలీ నియోజకవర్గంలో ఇందిరాగాంధీపై రాజ్‌నారాయణ్ సింగ్ పోటీచేసి ఓడిపోయాడు. ఈ ఎన్నికల్లో ఇందిర ఆక్రమాలకు ప్పాలడిందని రాజ్‌నారాయణ్ సింగ్ అలహాబాద్ హైకోర్టులో కేసు దాఖలు చేశారు. విచారణ జరిపిన న్యాయస్థానం ఆమె ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. ఈ తీర్పునుంచి తనను తాను రక్షించుకోవడానికి 39వ రాజ్యాంగ సవరణ చట్టం-1975 ద్వారా 329(A) ప్రకరణను రాజ్యాంగంలో చేర్చారు. ఈ ప్రకరణ ప్రధాన అంశం ప్రధానమంత్రుల ఎన్నికను న్యాయస్థానాల్లో ప్రశ్నించకుండా చేయడం. అయితే అది చట్ట సమానత్వానికి (Rule Of Law) విరుద్ధమని, ఎన్నికలు అనేవి రాజ్యాంగ మౌలిక స్వరూపంలో భాగమని, అందువలన 39వ రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చిన 329(A) ప్రకరణలోని 4వ క్లాజ్ చెల్లదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
– మక్కల్శక్తి ఖచ్చిఫ్ V/S ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా-2011 కేసులో ఎన్నికల తేదీని ప్రకటించడం మొదలగు అంశా లు పూర్తిగా ఎన్నికల సంఘం విశిష్ట అధికారాలు. ఇందులో న్యాయస్థానం జోక్యం చేసుకోలేదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
– 1989 వరకు ఇండియాకు ఏకసభ్య ఎన్నికల సంఘం ఉండేది. అయితే రాజీవ్‌గాంధీ ప్రభుత్వం 1989 అక్టోబర్ 16న ఏకసభ్య ఎన్నికల సంఘాన్ని రద్దుచేసి త్రిసభ్య ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసింది.
– నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం (V.P.సింగ్ ప్రధాని) 1990 జనవరిలో త్రిసభ్య ఎన్నికల సంఘాన్ని రద్దుచేసి ఏకసభ్య ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసింది.
– పీవీ నరసింహారావు ప్రభుత్వం 1993 అక్టోబర్‌లో తిరిగి ఏకసభ్య ఎన్నికల సంఘాన్ని రద్దుచేసి త్రిసభ్య ఎన్నికల సంఘాన్ని ఏర్పాటు చేసింది.
రాష్ట్రస్థాయిలో ఎన్నికలు
– రాష్ట్రస్థాయిలో ఎలక్షన్ కమిషన్‌కు సహాయకారిగా ఎన్నికల ప్రధాన అధికారి (చీఫ్ ఎలక్ట్రోరల్ ఆఫీసర్) ఉంటారు. ఇతన్ని కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించి నియమిస్తుంది. ఈ పదవికి రాజ్యాంగ ప్రతిపత్తి లేదు. సాధారణంగా సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమిస్తారు. రాష్ట్రంలో జరిగే పార్లమెంట్, శాసనసభ ఎన్నికలు ఇతని పర్యవేక్షణలో జరుగుతాయి.
– జిల్లాస్థాయిల్లో జిల్లా కలెక్టర్ ముఖ్య ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తారు.
డిపాజిట్లు
– అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు జనరల్, బీసీలు అయితే రూ.10,000, ఎస్సీ, ఎస్టీలయితే రూ.5,000 డిపాజిట్‌గా చెల్లించాలి.
– లోక్‌సభకు పోటీచేసే అభ్యర్థులు జనరల్, బీసీలయితే రూ.25,000, ఎస్సీ, ఎస్టీలయితే రూ.12,500లు డిపాజిట్‌గా చెల్లించాలి.
– ఉపరాష్ట్రపతి అభ్యర్థిని 20 మంది ఎలక్ట్రోరల్ కాలేజీ సభ్యులు ప్రతిపాదించాలి. మరొక 20 మంది సభ్యులు బలపర్చాలి. రూ.15,000 డిపాజిట్ చేయాలి.
– రాష్ట్రపతిగా పోటీచేసే అభ్యర్థిని కనీసం 50 మంది ఎలక్ట్రోరల్ కాలేజీ సభ్యులు ప్రతిపాదించాలి. మరొక 50 మంది సభ్యులు బలపర్చాలి. రూ.15,000 డిపాజిట్ చేయాలి.
– రాజ్యసభకు పోటీచేసే అభ్యర్థులు జనరల్, బీసీలయితే రూ.25,000, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.12,500 డిపాజిట్ చేయాలి.
– రాష్ట్ర శాసనమండలికి పోటీచేసే అభ్యర్థులు జనరల్, బీసీలయితే రూ.10,000, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.5,000 డిపాజిట్ చేయాలి.
– డిపాజిట్లు కోల్పోవడం: దేశంలో జరిగే ఏ ఎన్నికల్లో అయినా పోలై చెల్లుబాటైన ఓట్లలో కనీసం 1/6 వంతు ఓట్లు పొందిన అభ్యర్థికి మాత్రమే డిపాజిట్ తిరిగి చెల్లిస్తారు. అంతకన్నా తక్కువ వస్తే డిపాజిట్ కోల్పోవడం అంటారు.
ఎన్నికల వ్యయ పరిమితులు
– 2014 ఎన్నికల్లో ఎన్నికల సంఘం జారీచేసిన మార్గదర్శక సూత్రాల ప్రకారం అభ్యర్థుల ఎన్నికల వ్యయానికి సంబంధించి పరిమితులు విధించింది.
– అరుణాచల్‌ప్రదేశ్, గోవా, సిక్కిం రాష్ర్టాల పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థుల గరిష్ఠ వ్యయ పరిమితి- రూ. 54 లక్షలు. మిగిలిన 26 రాష్ర్టాల పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థుల వ్యయపరిమితి రూ. 70 లక్షలు.
– అసెంబ్లీ ఎన్నికల్లో అరుణాచల్ ప్రదేశ్, గోవా, సిక్కిం, త్రిపుర రాష్ట్రాల సెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థుల గరిష్ట వ్యయపరిమితి రూ.20 లక్షలు. కాగా మిగిలిన 25 రాష్ర్టాల్లో (జమ్ము, కశ్మీర్లో ఆ రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయిస్త్తుంది) రూ.28 లక్షలు.
– కేంద్రపాలిత ప్రాంత పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థుల గరిష్ట వ్యయపరిమితి రూ.54 లక్షలు నోట్: ఢిల్లీకి మాత్రం రూ.70 లక్షలు
రాజ్యాంగ సమీక్షా కమిషన్ సిఫార్సులు
– ఈ కమిషన్‌కు అధ్యక్షుడు జస్టిస్ ఎం.ఎన్ వెంకటాచలయ్య.
– వీలైనంత త్వరగా దేశంలోని అన్ని నియోజకవర్గాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను ప్రవేశపెట్టాలి.
– ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలను రొటేషన్ పద్ధతిలో మార్చాలి.
– ప్రధానమంత్రిని, ముఖ్యమంత్రిని చట్ట సభల సభ్యులు నేరుగా ఎన్నుకోవాలి.
– ఏ పార్టీకి గాని లేదా ఎన్నికలకు ముందే ఏర్పడిన కూటమికి గాని స్పష్టమైన మెజార్టీ రానప్పుడు స్పీకర్‌ను ఎన్నుకున్నట్లు, సభా నాయకుడిని కూడా సభ్యులే ఎన్నుకోవాలి.
– మంత్రుల సంఖ్యను మొత్తం సభ్యుల సంఖ్యలో 10 శాతానికి మించకుండా చూడాలి.
టీఎన్ శేషన్ సిఫార్సులు
– టీఎన్ శేషన్ ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా అనేక సంస్కరణలను ప్రవేశపెట్టాడు. ఎన్నికలను సజావుగా, సక్రమంగా నిర్వహిస్తూ తన సామర్థ్యాన్ని నిరూపించుకున్నాడు.
– నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు నిర్ణయించిన తేదీ నుంచి ప్రచార సమయాన్ని 14 రోజులు నిర్ణయించారు. ఇది 1997 నుంచి అమల్లోకి వచ్చింది.
– ఒక అభ్యర్థి రెండు కంటే ఎక్కువ నియోజకవర్గాల నుంచి పోటీ చేయరాదు.
– ఒక వ్యక్తి ఏదైనా నేరంలో కనీసం రెండు ఏండ్లు శిక్ష అనుభవిస్తే 6 ఏండ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలి.
– ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థి మరణిస్తే ఎన్నిక వాయిదావేయాలి. కానీ రద్దు చేయకూడదు.
– ప్రచార సమయం పూరైన తర్వాత 48 గంటల వరకు సారా అమ్మకాలు, పంపిణీ చేయడాన్ని నేరంగా పరిగణిస్తారు.
ఎన్నికల కమిషన్- ముఖ్యాంశాలు
– మొదటి ఎన్నికల కమిషనర్- సుకుమార్ సేన్ (1950-58)
– ఎక్కువ కాలం ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా పనిచేసింది- కేవీవీ సుందరం
– తక్కువ కాలం ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన వ్యక్తి- నాగేంద్రసింగ్
– ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన తొలి తెలుగువాడు – ఆర్వీఎస్ పేరిశాస్త్రి
– మొదటి (తెలుగు) మహిళా తాత్కాలిక ప్రధాన ఎన్నికల కమిషనర్- వీఎస్ రమాదేవి
– ఓటరు గుర్తింపు కార్డులను ప్రవేశపెట్టిన ప్రధాన ఎన్నికల కమిషనర్- టీఎన్ శేషన్
– రామన్మెగసేసే అవార్డు పొందిన ఎన్నికల కమిషనర్లు- 1. టీఎన్ శేషన్(1996), 2. జేఎం లింగ్డో (2003)
నోట్: ప్రస్తుతం ప్రధాన ఎన్నికల కమిషనర్- సయ్యద్ నసీమ్ అహ్మద్ జైదీ (2015 నుంచి 2017 జూలై 6 వరకు)
– ఇతర కమిషనర్లు: 1. అచల్‌కుమార్ జ్యోతి 2. ఓంప్రకాశ్ రావత్
– తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం మొదటి కమిషనర్- వి.నాగిరెడ్డి (2014 నవంబర్ నుంచి)
– ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్- రమాకాంత్ రెడ్డి
– తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ఉమ్మడి ఎన్నికల ప్రధానాధికారి- భన్వర్‌లాల్
– ఎన్నికల నిర్వహణలో సహకారానికి సంబంధించి ఇండియా, జార్జియా దేశంతో 2015, జూలై 13న ఒప్పందం కుదుర్చుకుంది.
– ఎన్నికల్లో ఓటర్ల ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్ర్తాన్ని సెఫాలజీ అంటారు.
– ఎన్నికల్లో ఎగ్జిట్‌పోల్ ఫలితాలపై ఎలక్షన్ కమిషన్ 2004లో నిషేధం విధించింది.
– ఎన్నికల్లో ఎన్నికలకు ముందు జరిపేది ప్రీపోల్ సర్వే.
– ఎన్నికల రోజు జరిపేది ఎగ్జిట్‌పోల్ సర్వే
– ఎన్నికల అనంతరం జరిపేది పోస్ట్‌పోల్ సర్వేలు.
తిరస్కరించే ఓటు NOTA (None Of The Above)
– 2013లో పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా దీన్ని ప్రవేశపెట్టారు.
– NOTA అనేది వ్యక్తి భావప్రకటన స్వేచ్ఛలో భాగమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
– NOTA ఐచ్చికాన్ని మొదటిసారిగా ఢిల్లీ, మిజోరాం, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో (2013లో) ప్రవేశపెట్టారు.
– ప్రపంచంలో 13 దేశాల్లో NOTA విధానం అమల్లో ఉందని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
– NOTA అనేది కేవలం ఓటరుకున్న ఐచ్చికం మాత్రమే. అభ్యర్థి ఓటమి, గెలుపును ప్రభావితం చేయదు.
– అత్యధిక ఓటర్లు NOTA ఉపయోగించుకున్నా పోలైన ఓట్లలో మెజార్టీ ఓట్లు పొందిన అభ్యర్థిని గెలిచినట్టుగా ప్రకటిస్తారు.
– NOTA సంప్రదాయాన్ని ప్రవేశపెట్టిన 14వ దేశంగా భారత్ అవతరించింది.
నోట్: 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీరంగు, లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంలపై తెలుపు రంగులో నోటా ఐచ్చికాన్ని ముద్రించారు.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్ (ఈవీఎం)
– మొదటిసారిగా ఈవీఎంలను మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో 1989-90లో ప్రయోగాత్మకంగా ఉపయోగించారు. దీనికి అనుగుణంగా ప్రజాప్రాతినిధ్య చట్టం- 1951కి సవరణలు చేశారు.
– 1999లో గోవా శాసనసభకు జరిగిన ఎన్నికల్లో ఈవీఎంలను పూర్తిస్థాయిలో ఉపయోగించారు. దీంతో ఈవీఎంలను పూర్తిస్థాయిలో ఉపయోగించిన రాష్ట్రంగా గోవా రికార్డులకెక్కింది.
– ఇండియాలో ఈవీఎంలను డిజైన్ చేసిన వాడు ఎంబీ హానిఫ్ (1980)
– దేశంలో ఈవీఎంలను BEL (భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్), ECIL (ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్-హైదరాబాద్) అనే రెండు సంస్థలు తయారు చేస్తున్నాయి.
ఎన్నికల సంస్కరణలపై వేసిన వివిధ కమిటీలు
– సంయుక్త పార్లమెంటరీ కమిటీ- 1972
– తర్కుండే కమిటీ – 1974
– దినేష్గోస్వామి కమిటీ – 1990
– వోహ్రా కమిటీ – 1993
– ఇంద్రజిత్‌గుప్త కమిటీ – 1998
– లా కమిషన్ నివేదిక – 1999
– రాజ్యాంగ సమీక్షా కమిషన్ – 2000( జస్టిస్ ఎం.ఎన్ వెంకటాచలయ్య అధ్యక్షతన)
– రెండో పరిపాలనా సంస్కరణల(వీరప్పమొయిలీ) సంఘం సూచనలు- 2007
ఎన్నికలు- కోర్టు తీర్పులు
– డా॥ సుబ్రమణియన్ స్వామి కేసు-2013లో సుప్రీంకోర్టు ఓటరు తన ఓటును వినియోగించుకున్న తర్వాత తాను ఓటేసిన అభ్యర్తి పేరు, గుర్తు మొదలైన వివరాలతో కూడిన ముద్రిత పేపర్‌స్లిప్‌ను పొందడానికి వీలుగా ఈవీఎంలలో ఓటర్ వెరిఫయబుల్ పేపర్ అడిట్ ట్రయల్(VVPAT) ఏర్పాటు చేయాలని పేర్కొంది.
– పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ కేసు- 2013లో పోటీ చేస్తున్న అభ్యర్థులను కాదని వారికి ప్రతికూలంగా ఓటు వేసే అధికారం ఓటరుకు ఉంటుందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ తీర్పును అమలు చేయడానికే ఎన్నికల సంఘం నోటా మీటను ఈవీఎంల్లో పొందుపర్చింది.
– ఎం.ఎస్ గిల్ VS చీఫ్ ఎలక్షన్ కమిషనర్- 1978 కేసులో సుప్రీంకోర్టు తీర్పు చెప్పుతూ ఎన్నికలు నిర్వహించేప్పుడు తలెత్తే పరిస్థితులకు సంబంధించి పార్లమెంట్ చేసే చట్టంలో తగిన నిబంధనలు లేకపోతే ఎన్నికల సంఘం అనుబంధ చట్టాలను చేయవచ్చని పేర్కొంది.
– పీపుల్స్ యూనియన్ ఆఫ్ సివిల్ లిబర్టీస్ కేసు-2013లో సుప్రీంకోర్టు తీర్పు చెప్పుతూ పార్లమెంట్, రాష్ట్ర, శాసనసభలకు పోటీ చేసే అభ్యర్థి నేరచరిత్ర, జీవితభాగస్వామి, పిల్లలు, ఆస్తులు, అప్పుల వివరాలు, అభ్యర్థి విద్యార్హత మొదలైన అంశాలతో కూడిన ప్రమాణపత్రాన్ని తప్పనిసరిగా వెల్లడించాలని పేర్కొంది.
నమూనా ప్రశ్నలు
1. ఏకసభ్య ఎన్నికల కమిషన్‌ను ముగ్గురు సభ్యుల ఎన్నికల కమిషన్‌గా పునర్ నిర్మించిన సంవత్సరం ?
1) 1991 2) 1992 3) 1993 4) 1994
2. కేంద్ర ఎన్నికల సంఘం ఎప్పుడు ఏర్పడింది ?
1) 1950 జనవరి 25 2) 1951 జనవరి 25
3) 1952 జనవరి 25 4) 1948 జనవరి 25
3. ఎన్నికల సంఘం భవనాన్ని ఇలా పిలుస్తారు ?
1) యోజనా భవన్ 2) నిర్వచన్ సదన్
3) సమతా భవన్ 4) విజయ్భవన్
4. ఎన్నికల కమిషన్ గురించి వివరించే భాగం ఏది ?
1) 14వ భాగం 2) 16వ భాగం
3) 15వ భాగం 4) 17వ భాగం
5. ఓటుహక్కు వయోపరిమితిని 21 ఏండ్ల నుంచి 18 ఏండ్లకు తగ్గించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది ?
1) 60 వ రాజ్యాంగ సవరణ చట్టం -1988
2) 61 వ రాజ్యాంగ సవరణ చట్టం -1988
3) 62 వ రాజ్యాంగ సవరణ చట్టం – 1989
4) 59 వ రాజ్యాంగ సవరణ చట్టం – 1988
6. రాజ్యాంగంలో ఎన్నికల కమిషన్ గురించి పేర్కొనే ప్రకరణ ఏది ?
1) 123 2) 213 3) 324 4) 338
7. ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని ప్రభుత్వమే భరించాలని సిఫార్సు చేసిన కమిటీ ఏది ?
1) పార్లమెంటరీ కమిటీ – 1971-72
2) తర్కుండే కమిటీ – 1974
3) దినేష్ గోస్వామి కమిటీ – 1990
4) పైవన్నీ
8. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థుల గరిష్ఠ వ్యయపరిమితి ఎంత ?
1) రూ. 54 లక్షలు 2) రూ. 28 లక్షలు
3) రూ. 20 లక్షలు 4) రూ. 70 లక్షలు
9. 2016 జనవరి 25న ఎన్నో జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపనున్నారు ?
1) 4వది 2) 5వది 3) 6వది 4) 7వది
10. మొదటి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు ?
1) ఆర్వీఎస్ పేరిశాస్త్రి 2) కేవీకే సుందరం
3) ఆర్కే త్రివేది 4) సుకుమార్‌సేన్
11. ఓటరు గుర్తింపు కార్డులను ప్రవేశపెట్టిన ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు ?
1) టీఎన్ శేషన్ 2) జేఎం లింగ్డో
3) బీబీ టాండన్ 4) ఎన్.గోపాలస్వామి
12. ఈవీఎంలను పూర్తిస్థాయిలో ఎన్నికల్లో ఉపయోగించిన రాష్ట్రం ఏది ?
1) సిక్కిం 2) త్రిపుర 3) కేరళ 4) గోవా
13. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంలపై నోటా మీటను ఏ రంగంలో ముద్రించారు ?
1) గులాబీ 2) లేత ఆకుపచ్చ 3) తెలుపు 4) నీలం
నోట్: 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఈవీఎంలపై నోటా మీటను గులాబీ రంగులో ముద్రించారు.
14. పార్లమెంట్ లేదా రాష్ట్ర శాసనసభకు పోటీచేసే అభ్యర్థి- నేరచరిత్ర, జీవితభాగస్వామి, పిల్లల వివరాలు, ఆస్తులు, అప్పుల వివరాలు, అభ్యర్థి విద్యార్హతతో కూడిన ప్రమాణపత్రాన్ని వెల్లడించాలని సుప్రీంకోర్టు ఏకేసులో పేర్కొంది. ?
1) డా॥ సుబ్రమణియన్ కేసు -2013
2) పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ కేసు – 2003
3) మహేందర్ సింగ్ గిల్ VS చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కేసు- 1978
4) రీ సర్జెన్స్ ఇండియా కేసు – 2013
15. ఎన్నికల సంస్కరణలపై లా కమిషన్ తన నివేదికను ఎప్పుడు సమర్పించింది ?
1) 2015, మార్చి 20 2) 2015, ఏప్రిల్ 20
3) 2015, మార్చి 12 4) 2015, ఏప్రిల్ 12
జవాబులు:
1-3, 2-1, 3-2, 4-3, 5-2, 6-3, 7-4, 8-2, 9-3, 10-4, 11-1, 12-4, 13-3, 14-2, 15-3
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు