హైదరాబాద్ రాష్ట్రంలో ప్రభుత్వాలు
పోలీస్‌చర్య (ఆపరేషన్ పోలో) తర్వాత హైదరాబాద్ రాష్ట్రంలో జేఎన్ చౌదరి నేతృత్వంలో మిలటరీ ప్రభుత్వం ఏర్పడింది. అనంతరం ఎంకే వెల్లోడి ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏలుబడిలోకి వచ్చింది. 1952లో జరిగిన సాధారణ ఎన్నికల్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అత్యధిక స్థానాలు సాధించింది. బూర్గుల రామకృష్ణారావు నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది. ఈ చారిత్రక ఘట్టాలకు సంబంధించిన అంశాలు..
మిలటరీ ప్రభుత్వం
తన పాలనా కాలంలో చెరువుల నిర్మాణంతోపాటు, పారిశ్రామీకరణ కోసం కృషిచేసిన ఏడో, చివరి నిజాం అయిన మీర్ ఉస్మాన్ అలీఖాన్ భారత ప్రభుత్వానికి లొంగిపోయిన తర్వాత హైదరాబాద్‌లో జేఎన్ చౌదరి నేతృత్వంలో మిలటరీ ప్రభుత్వం ఏర్పడింది. ఇది 1948, సెప్టెంబర్ 18 నుంచి అమల్లోకి వచ్చింది. (చౌదరి బెంగాల్‌కు చెందినవారు.)
ప్రభుత్వం మిలటరీ గవర్నర్ ఆధ్వర్యంలో నడిచినప్పటికీ పరిపాలన సివిల్ పద్ధతుల్లోనే జరిగింది.
ప్రభుత్వంలో సభ్యులు
పరిపాలనలో మిలటరీ గవర్నర్‌కు సహాయం చేయడానికి ఐదుగురు సభ్యులు నియమితులయ్యారు. వారు..
1. పీఎన్ బాఖ్లే (సివిల్ అడ్మినిస్ట్రేటర్)
2. నవాబ్ జైన్‌యార్ జంగ్
3. రాజా దొండేరాజా
4. సీపీఎన్ రావు
5. సీహెచ్ కృష్ణారావు
ఫ్యూడల్ శక్తుల ప్రాబల్యం తగ్గించి, పేద రైతుల అభిమానాన్ని పొందడం, కమ్యూనిస్టు పార్టీని అంతంచేయడం వంటి మొదలైన లక్ష్యాలను ఏర్పర్చుకొని వాటి కోసం మిలటరీ ప్రభుత్వం పనిచేసింది. ఈ లక్ష్యాల సాధనకోసం ప్రభుత్వం వేలాదిమంది పోలీసులను, సైనికులను మోహరించింది. గెరిల్లా దళాలున్న గ్రామా ల్లో సైనిక శిబిరాలను నెలకొల్పడమే కాకుండా, వైర్లెస్ సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. భారత యూనియన్ సైన్యాలకు, గెరిల్లా దళాలకు జరిగిన నిరంతర ఘర్షణల వల్ల ఉభయవర్గాలవారు మరణించారు.
హైదరాబాద్‌లోని యువకులను రజాకార్లుగా అనుమానించి దారుణంగా హతమార్చాడనే ఆరోపణలను జేఎన్ చౌదరి ఎదుర్కొన్నారు.
చౌదరి ఫర్మానా
1949, ఫిబ్రవరి 6న ఈ ఫర్మానాను జారీచేశారు. దీనిప్రకారం
ఎ. సర్ఫేఖాస్ (నిజాం సొంత ఆస్తి) వదులుకోవాలి
బి. జాగీర్దార్ల రద్దు
సి. హోలిసిక్కా రద్దు
డి. శుక్రవారం స్థానే ఆదివారం సెలవు
(నిజాం కాలంలో ప్రభుత్వ కార్యాలయాలకు శుక్రవారం సెలవుదినంగా ఉండేది)
ఫరీద్‌మీర్జా, పండిత సుందర్‌రామ్, ఖాజీ అబ్దుల్ గఫూర్ మొదలైనవారు మిలటరీ పాలనను రద్దుచేయాలని కేంద్ర హోం మంత్రి సర్దార్ పటేల్‌ను విజ్ఞప్తి చేశారు.
ఎంకే వెల్లోడి ప్రబుత్వం
కేరళకు చెందిన ఇండియన్ సివిల్ సర్వీసెస్ సీనియర్ అధికారి అయిన ముల్లర్ కాడింగ్ వెల్లోడి నాయకత్వంలో 1949, డిసెంబర్ 1న తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. ఈ ప్రభుత్వంలో స్టేట్ కాంగ్రెస్‌కు ప్రాతినిథ్యం కల్పించారు.
వెల్లోడి మంత్రివర్గం
1. నవాబ్ జైన్ యార్జంగ్
2. ఎం శేషాద్రి
3. సీసీఎన్ రావు
4. బూర్గుల రామకృష్ణారావు
5. వీబీ రాజు
6. ఫూల్చంద్గాంధీ
7. వినాయక్‌రావు విద్యాలంకార్
ప్రభుత్వంలో స్టేట్ కాంగ్రెస్‌కు ప్రాతినిథ్యం కల్పించి పరిపాలనను ప్రజాస్వామికం చేయడానికి తొలిసారిగా ప్రయత్నం చేశారు. బూర్గుల రామకృష్ణారావుకు రెవెన్యూ, విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. తన పదవీకాలంలో జిల్లాకు ఒక కళాశాలను ఏర్పాటు చేయడమే కాకుండా మాతృభాషను బోధనాభాషగా చేశారు.
ఆంధ్రుల వలసలు
-చౌదరి, వెల్లోడిల పాలనాకాలంలో ఆంగ్లభాష తెలిసినవారిని బొంబాయి, మద్రాస్ ప్రావిన్సుల నుంచి తీసుకువచ్చి ఉద్యోగాలిచ్చారు. ఇలా ఆంధ్రా వలసలు ప్రారంభమయ్యాయి. మద్రాస్ ప్రావిన్స్‌లోని ఆంధ్రులు ఇంగ్లిష్ నెపంతో తెలంగాణలోకి రావడం ప్రారంభించారు. ఆ తర్వాత తమ బంధువులు, స్నేహితులను పిలిపించుకొన్నారు. అత్యున్నత స్థాయిలోని ఉద్యోగాలతోపాటు చిన్న ఉద్యోగాలను కూడా వదిలిపెట్టలేదు. ముల్కీ నిబంధనలు ఉండటంతో దొంగ సర్టిఫికెట్లు సంపాదించుకొని స్థానిక ఉద్యోగాలు కొల్లగొట్టారు. 1952 నాటికి హైదరాబాద్ ఉన్న ఉద్యోగుల్లో స్థానికేతరులే మెజారిటీ స్థానాల్లో ఉన్నారు.
రాజ్ ప్రముఖ్‌గా నిజాం
-హైదరాబాద్ నిజాం, భారత ప్రధాని నెహ్రూల మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం నిజాంకు భరణం చెల్లించడంతోపాటు హైదరాబాద్‌కు రాజ్ ప్రముఖ్‌గా నిజాం అలీఖాన్ నియమితుడయ్యారు. రాజ్ ప్రముఖ్ అంటే నేటి గవర్నర్ అని అర్థం. నిజాం పేరుతోనే పరిపాలన సాగింది.
-భారత రిపబ్లిక్ 1950, జనవరి 26న అమల్లోకి వచ్చింది. అదేరోజు మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ రాజ్ ప్రముఖ్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి ఆంధ్రప్రదేశ్ అవతరణ వరకు (1956, నవంబర్ 1 వరకు) ఆయన ఆ పదవిలో కొనసాగారు. హైదరాబాద్ రాష్ట్రం ఉనికి కోల్పోవడంతో నవంబర్ 1న రాజీనామా చేసిన ఆయన 1967, ఫిబ్రవరి 24న మరణించారు.
కౌలుదారి చట్టం
-నాటి ప్రభుత్వం 1950-51లో కౌలుదార్ల హక్కుల్ని రికార్డు చేసే విధానాన్ని ప్రవేశపెట్టింది. భూస్వామి తన సొంత సేద్యం కోసం ఉంచుకోదగిన భూ విస్తీర్ణాన్ని ఈ చట్టం నిర్ణయించింది. ఈ సంస్కరణల్లో బూర్గుల ముఖ్యపాత్ర పోషించారు. ఈ చట్టం కౌలుదారు తన కబ్జాకింద ఉన్న భూమిని, భూస్వామి నుంచి క్రమం చేసుకునేందుకు సమంజస ధరల్ని నిర్ణయించింది.
భాషాభివృద్ధి చర్యలు
-ప్రాథమికోన్నత పాఠశాలలను స్థాపించారు. మెట్రిక్యులేషన్ పరీక్షలను తెలుగులో రాయడానికి 1951లోనే అనుమతించారు.
భూదానోద్యమం-వినోబాభావే
-1951, ఏప్రిల్ 15న శివరాంపల్లిలో శాంతియాత్రను ప్రారంభించిన ఆచార్య వినోబాభావే ఏప్రిల్ 18న నల్లగొండ జిల్లాలోని పోచంపల్లికి చేరుకున్నారు. అక్కడ వెదిరె రామచంద్రారెడ్డి హరిజనులకు పంచడం కోసం 100 ఎకరాల భూమిని దానం చేశారు. ఈ విధంగా పోచంపల్లిలో (దీంతో భూదాన్ పోచంపల్లిగా ప్రసిద్ధి చెందింది) భూదానోద్యమం ప్రారంభమైంది. రెవెన్యూ మంత్రి బూర్గుల రామకృష్ణారావు చల్లేపల్లి వచ్చి యాత్రలో ఉన్న వినోబాభావేను కలిసి భూదానోద్యమాన్ని సమర్థించారు.
-నాటి రాష్ట్రపతి రాజేంద్రప్రసాద్ హైదరాబాద్ రాష్ట్రంలో పర్యటించినప్పుడు పాలమాకుల, మాధవరావు పల్లె (పాలమూరు జిల్లా)లో వినోబాభావేను కలుసుకోవడమే కాకుండా భూదానోద్యమం గురించి తెలుసుకున్నారు.
ముగిసిన సాయుధ పోరాటం
-హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణలో రహస్యంగా స్థాపించిన కమ్యూనిస్టు పార్టీని ప్రజలు ఆదరించారు. భూస్వాములకు వ్యతిరేకంగా కమ్యూనిస్టులు పోరాటం చేశారు. 1948, సెప్టెంబర్ 18 తర్వాత కూడా భూస్వామ్య వ్యతిరేకపోరాటాన్ని హింసాత్మక పద్ధతిలోనే కొనసాగించింది. చివరకు 1951, అక్టోబర్ 21న సాయుధ పోరాటాన్ని కమ్యూనిస్టు పార్టీ విరమించుకుంది.
సాధారణ ఎన్నికలు-1952
-స్వతంత్ర భారతదేశంలో 1952లో తొలిసారిగా ఎన్నికలు జరిగాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ రాష్ట్రంలో ఎన్నికలను నిర్వహించారు. ఈ ఎన్నికల్లో కమ్యూనిస్టులు కూడా పాల్గొన్నారు.
-నాటి హైదరాబాద్ రాష్ట్రంలో 16 జిల్లాలు ఉన్నాయి. ఇందులో తెలంగాణలో 8 జిల్లాలు (వరంగల్, నల్లగొండ, కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, ఆత్రాఫ్బల్దా), మరఠ్వాడాలో 5 జిల్లాలు (నాందేడ్, పర్బనీ, బీడ్, ఔరంగాబాద్, ఉస్మానాబాద్), కన్నడ ప్రాంతంలో 3 జిల్లాలు (బీదర్, రాయచూర్, గుల్బర్గా) ఉండేవి. మొత్తం నియోజకవర్గాల సంఖ్య 175 (33 ద్విసభ్య నియోజకవర్గాలతో కలిపి).
నోట్: వరంగల్ జిల్లాలో ఖమ్మం అంతర్భాగంగా ఉండేది, హైదరాబాద్, రంగారెడ్డిలు అత్రాఫ్బల్దాలో ఉండేవి.
కమ్యూనిస్టులు
-పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ పేరుతో పోటీచేసిన కమ్యూనిస్టులు మొత్తం 42 సీట్లు గెలుచుకొని రెండో స్థానంలో నిలిచారు. నల్లగొండ జిల్లాలో 14 సీట్లకుగాను 14 సీట్లు గెలుచుకున్నారు. 11 స్థానాల్లో విజయం సాధించిన సోషలిస్టు పార్టీ మూడో స్థానంలో నిలిచింది.
రావినారాయణ రెడ్డి విజయం
-నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి పోటీచేసిన రావి నారాయణరెడ్డి దేశంలోనే అత్యధిక మెజార్టితో విజయం సాధించారు. అలాగే భువనగిరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. నారాయణరెడ్డి భువనగిరి తాలుకా బొల్లేపల్లి కి చెందినవారు.
సీఎంగా బూర్గుల
-దిగంబరరావు బిందూకు ముఖ్యమంత్రి పదవిని ఇప్పించడానికి స్వామీ రామానందతీర్థ కృషిచేశారు. కానీ ఆయన దానికి ఒప్పుకోలేదు. జవహర్ లాల్ నెహ్రూ, గోపాల స్వామి అయ్యంగార్లను కలిసిన బిందూ బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రి పదవికి సమర్థుడని తెలిపారు.
-మహబూబ్‌నగర్ జిల్లాలోని షాద్‌నగర్ నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన రామకృష్ణారావు 1952, మార్చి 6న రాజ్‌ప్రముఖ్ నిజాం ఉస్మాన్ అలీఖాన్ కింగ్ కోఠిలోని రాజభవనంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
బూర్గుల మంత్రివర్గం
ముఖ్యమంత్రి – బూర్గుల రామకృష్ణారావు
హోం మంత్రి – దిగంబర్‌రావు బిందూ
ఆర్థిక శాఖ – జీఎస్ మేల్కోటే
పౌర సరఫరా, వ్యవసాయ శాఖ – మర్రి చెన్నారెడ్డి
ఎక్సైజ్, కస్టమ్స్, అటవీశాఖ – కొండా వెంకటరంగారెడ్డి
కార్మిక, సమాచార శాఖ – వీ బసవరాజు
పరిశ్రమలు, వాణిజ్య శాఖ – వినాయకరావు విద్యాలంకార్
పబ్లిక్ వర్క్స్ శాఖ – మెవాదీ నవాజ్ జంగ్ బహదూర్
గ్రామీణాభివృద్ధి శాఖ – దేవీసింగ్ చౌహాన్
సామాజిక సేవ – శంకర్ దేవ్
విద్య, ఆరోగ్యం – ఫూల్‌చంద్ గాంధీ
న్యాయశాఖ – జగన్నాథరావు
స్థానిక పాలన – అన్నారావు గణముఖి
హైదరాబాద్ రాష్ట్రం-ప్రముఖులు
రాజ్ ప్రముఖ్ – నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్
ముఖ్యమంత్రి – బూర్గుల రామకృష్ణారావు (ఎన్నికైన తొలి ముఖ్యమంత్రి)
స్పీకర్ – కాశీనాథరావు వైద్య
డిప్యూటీస్పీకర్ – పంపన్న గౌడ
ప్రొటెం స్వీకర్ – ఎం నర్సింగరావు (195)
ప్రతిపక్షనాయకుడు – వీడీ దేశ్‌పాండే
హైదరాబాద్ నగర మేయర్- మాడపాటి హనుమంతరావు
ఎన్నికల్లో పాల్గొన్న పార్టీలు- చిహ్నం పోటీ చేసిన స్థానాలు గెలిచినవి
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాడితో గల జోడెద్దులు 173 93
పీపుల్ డెమొక్రటిక్ ఫ్రంట్ మొక్కజొన్న కంకి కొడవలి 77 42
సోషలిస్టు పార్టీ మర్రిచెట్టు 97 11
పీపుల్స్ అండ్ వర్కర్స్ పార్టీ ఆఫ్ ఇండియా కొడవలి, సుత్తి, 3 నక్షత్రాలు 21 10
షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్ ఏనుగు – 5
ఇతరులు – – 14
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు