బూర్గుల మంత్రివర్గం, సంస్కరణలు
బహుభాషా కోవిదుడు, గొప్పవక్త అయిన బూర్గుల రామకృష్ణారావు హైదరాబాద్ రాష్ర్టానికి ముఖ్యమంత్రి కావడం, అతని రెవెన్యూ, విద్యా సంస్కరణలు, విశేషాలు, ఖమ్మం జిల్లా ఏర్పాటు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు ప్రారంభం కావడం, అతని ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం, విశాలాంధ్రకు బూర్గుల మద్దతు పలికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు దోహదపడటం, అతని సాహిత్య సేవ మొదలైన విశేషాలను తెలుసుకుందాం….
-హైదరాబాద్ ముఖ్యమంత్రిగా 1952 మార్చి 6న బూర్గుల రామకృష్ణారావు కింగ్‌కోఠిలోని రాజ్‌ప్రముఖ్ మీర్ ఉస్మాన్ అలీఖాన్ రాజ భవనంలో ప్రమాణస్వీకారం చేశారు.
బాల్యం, విద్యాభ్యాసం, వృత్తి
-రామకృష్ణారావు 1899, మార్చి 13న మహబూబ్‌నగర్ జిల్లాలోని కల్వకుర్తి తాలూకాలో ఉన్న పడకల్లు గ్రామంలో జన్మించారు.
-తండ్రి పేరు నరసింగరావు, తల్లి పేరు రంగనాయకమ్మ. రామకృష్ణారావు ఇంటిపేరు పుల్లంరాజు. కానీ ఆ తర్వాత బూర్గుల రామకృష్ణారావుగా ప్రసిద్ధిచెందారు.
-ధర్మపంత్ స్కూలు (హైదరాబాద్)లో ప్రాథమిక విద్యను అభ్యసించారు.
-బూర్గుల మెట్రిక్ పరీక్షలో 1915లో ఉత్తీర్ణులయ్యారు.
-ఫెర్గూసన్ కళాశాల (పూణె)లో బీఏ (హానర్స్) డిగ్రీ చదివారు.
-బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి ఎల్ఎల్బీ (లా డిగ్రీ) చేశారు.
-హైదరాబాద్‌లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు.
గమనిక : బూర్గుల రామకృష్ణారావు దగ్గర పీవీ నరసింహారావు జూనియర్ లాయర్‌గా పనిచేశారు.
బూర్గుల – వివిధ ఉద్యమాలు
-మహారాష్ట్రకు చెందిన వామన్ నాయక్ స్థాపించిన హైదరాబాద్ యంగ్మెన్స్ యూనియన్‌లో సభ్యుడిగా చేరాడు రామకృష్ణారావు. ఈ విధంగా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
-నాటి నుంచి తెలంగాణ ప్రాంతంలో జరిగిన సామాజిక, రాజకీయ ఉద్యమాల్లో పాల్గొన్నారు బూర్గుల
-గ్రంథాలయోద్యమంలో, ఆంధ్రజన సంఘం కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు.
-వయోజన విద్య, స్త్రీ విద్యావ్యాప్తి కోసం కృషి చేశారు.
-శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయానికి (1901లో స్థాపించిన) కార్యవర్గ సభ్యులుగా పనిచేశారు.
-అంతేగాకుండా ఆంధ్రమహాసభ (1930లో ఏర్పడింది)లో సభ్యుడై ఆ సభల కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 1931 మార్చి 3, 4, 5 తేదీల్లో దేవరకొండ (నల్లగొండ జిల్లా)లో జరిగిన రెండో ఆంధ్ర మహసభకు అధ్యక్షుడిగా వ్యవహరించారు.
జాతీయోద్యమంలో బూర్గుల పాత్ర
-బూర్గుల రామకృష్ణారావు తెలంగాణలో జరిగిన వివిధ ఉద్యమాలతో పాటు, జాతీయోద్యమంలో కూడా పాల్గొన్నారు.
-మౌలానా మహమ్మద్ అలీ అధ్యక్షతన కాకినాడలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ మహసభలో బూర్గుల పాల్గొని ముఖ్యపాత్ర పోషించారు.
(ఐ.ఎన్.సి సమావేశం 1923లో జరిగింది)
-ఈ సమావేశంలో ఉత్తరభారతానికి చెందిన నాయకుల ప్రసంగాలను తెలుగులోకి అనువదించారు బూర్గుల.
-ఈ సమావేశంలో తీర్మానాలను రాయడంలో బూర్గుల తోడ్పడ్డారు.
-బూర్గుల బహుభాషాకోవిదుడు (తెలుగు, ఉర్దూ, మరాఠి, కన్నడ, ఇంగ్లిష్, హిందీ భాషలు తెలుసు)
-స్వామి రామానంద తీర్థ 1938లో స్థాపించిన హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్‌లో బూర్గుల రామకృష్ణారావు సభ్యత్వం తీసుకున్నారు.
-1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నారు.
-హైదరాబాద్, ఇతర ప్రాంతాల్లో రజాకార్లు చేసిన వికృత చర్యల్ని ఖండించడమే కాకుండా, రజాకార్ల చర్యలతో బాధలనుభవించిన గ్రామాలను సందర్శించి ప్రజలకు ధైర్యం చెప్పారు.
-రజాకార్ల వికృత చేష్టల నుంచి ప్రజల్ని కాపాడాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
-ముల్లత్ కాడింగ్ వెల్లోడి మంత్రివర్గంలో సభ్యుడిగా ఉన్నారు. (రెవెన్యూ, విద్యాశాఖలు)
1952 ఎన్నికలు
-స్వతంత్ర భారతదేశంలో మొదటిసారిగా 1952లో ఎన్నికలు జరిగాయి. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో ఎన్నికలు జరిగాయి.
శాసనసభ్యునిగా ఎన్నిక
-1952లో బూర్గుల రామకృష్ణారావు మహబూబ్‌నగర్ జిల్లాలోని షాద్‌నగర్ నియోజకవర్గం నుంచి హైదరాబాద్ శాసనసభకు ఎన్నికయ్యారు.
-ఇతడు భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి. ఇతని ఎన్నికల గుర్తు కాడితో గల జోడెద్దులు (కాడెడ్లు)
-కాంగ్రెస్ ఒక సంస్థగా కనిపించినప్పటికీ లోపల రెండు సంస్థలుగా చీలింది. అవి ఒకటి స్వామి రామానందతీర్థ వర్గం, మరొకటి రామకృష్ణారావు వర్గం. రామానంద తీర్థ వర్గం మరాఠా ప్రాంతంలో బలీయంగా ఉంది. తెలంగాణలో పోటీ కాంగ్రెస్ ప్రముఖ నాయకుడైన కొండా వెంకటరంగారెడ్డి (కేవీ రంగారెడ్డి) తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడయ్యాడు. స్వామిరామనందతీర్థ, దిగంబరరావు బిందూకు ముఖ్యమంత్రి పదవిని ఇప్పించడానికి ప్రయత్నం చేశారు. కానీ చివరకు నెహ్రూ, పటేల్‌లు బూర్గులను సీఎం పదవికి ఎంపిక చేశారు.
-ముఖ్యమంత్రి పదవిని స్వీకరించిన తర్వాత హైదరాబాద్ ఆల్ ఇండియా రేడియో కేంద్రం ద్వారా ప్రజలనుద్దేశించి బూర్గుల రామకృష్ణారావు మాట్లాడారు. భారతదేశంలో హైదరాబాద్ విడదీయరాని భాగమని, స్వతంత్ర ప్రతిపత్తితో ఆలోచించడం, వ్యవహరించడం హైదరాబాద్ ప్రజలకు తగదని, బాధ్యతాయుత ప్రభుత్వం కావాలన్న ప్రజల కోరిక నేటికి నెరవేరిందని పేర్కొన్నారు.
మంత్రివర్గం-వివరాలు
-బూర్గుల మంత్రివర్గంలో తెలంగాణ ప్రాంతానికి చెందినవారు నలుగురు, మరఠ్వాడా ప్రాంతానికి చెందినవారు ముగ్గురు, కర్ణాటక ప్రాంతానికి చెందినవారు ఒక్కరు, మొత్తం 8 మంది మంత్రులుగా ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ నుంచి నలుగురు, మరఠ్వాడా నుంచి ముగ్గురు, కర్ణాటక నుంచి ఒక్కరు ఉపమంత్రులుగా ఉన్నారు.
-మొదటి శాసనసభా సమావేశం: హైదరాబాద్ శాసనసభ మొదటి సమావేశం1952, మార్చి 21 నుంచి 1952, ఏప్రిల్ 7 వరకు జరిగింది.
-గొప్ప వక్త: హైదరాబాద్ శాసనసభలో గౌరవ సభ్యులు. తెలుగు, ఉర్దూ, మరాఠి, కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో మాట్లాడేవారు. ఎవరు ఏ భాషలో మాట్లాడినా ఆయా భాషల్లో సామెతల్ని ప్రయోగిస్తూ సమాధానాలు చెప్పేవారు.
బూర్గుల ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం
-1952, డిసెంబర్ 17న జీ రాజారాం అనే సభ్యుడు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. భూ సంస్కరణలు, సిల్క్ పరిశ్రమ, అమ్మకం పన్ను మొదలైన విషయాల్లో ప్రజాభిప్రాయానికి విరుద్ధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని, ప్రభుత్వం ప్రజావిశ్వాసాన్ని కోల్పోయిందని పేర్కొంటూ ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతిపక్ష పీపుల్స్ డెమొక్రటిక్ ఫ్రంట్ నాయకుడైన వీడీ దేశ్‌పాండే (నాటి సభలో ప్రతిపక్ష నాయకుడు), మఖ్దూం మొహియుద్దీన్ (అభ్యుదయ కవి, వక్త) మొదలైనవారు అవిశ్వాస తీర్మానంపై మాట్లాడుతూ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. అవిశ్వాస తీర్మానంపై డిసెంబర్ 19న ఓటింగ్ జరిగింది. 77 మంది సభ్యులు తీర్మానానికి అనుకూలంగా, 95 మంది వ్యతిరేకంగా ఓటేయడంతో తీర్మానం వీగిపోయింది.
భూ సంస్కరణలు
-వ్యవసాయ భూముల చట్టం (1950), హైదరాబాద్ కౌలుదారు చట్టం (1951)లు ఆమోదం పొందాయి. కౌలుదారు హక్కుల్ని రికార్డుచేసే విధానాన్ని ప్రవేశపెట్టారు. ఈ చట్టంలో భూస్వామి తన సొంత సేద్యం కోసం తన కింద ఉంచుకోవాల్సిన భూ విస్తీర్ణ కమతాన్ని 5 రెట్లుగా నిర్ణయించారు. ఈ చట్టాన్ని బూర్గుల ప్రభుత్వం కొంత సవరించింది. ఈ చట్టానికి సంబంధించిన బిల్లు 1954 ఏప్రిల్‌లో హైదరాబాద్ శాసనసభలో చర్చకురాగా.. బూర్గుల ఉర్దూలో సుదీర్ఘ ప్రసంగం చేశారు.
రక్షిత కౌలుదార్ల చట్టం (1950)
-ఈ చట్టం 1950 నుంచే అమల్లో ఉంది. ఇది విప్లవాత్మకమైన చట్టం. తమ కింద భూములు ఉంచుకోవడాన్ని నిరోధించి, సొంత సేద్యం చేసుకునేవారి కిందకు భూమిని తెచ్చి వ్యవసాయ ఉత్పత్తుల్ని పెంచడమే ఈ చట్టం ఉద్దేశం. గరిష్ట ఆదాయానికి మించి ఉంటే భూస్వామికి నష్టపరిహారమిచ్చి మిగులు భూమిని తీసుకొనేవారు. కుటుంబ కమత నికర ఆదాయం రూ.800. భూముల నుంచి కౌలు భూములు కొనడానికి చట్టంలో భూ విలువను నిర్ధారించారు.
భూ కమతాలపై గరిష్ట పరిమితి
-దేశంలోనే భూకమతాలపై గరిష్ట పరిమితి విధించిన మొదటి ముఖ్యమంత్రిగా బూర్గుల ప్రసిద్ధిచెందారు.
బేదాఖలు బదలాయింపు నిరోధం
-బూర్గుల కాలంలో 1952లో హైదరాబాద్ కౌలుదారీ ఆర్డినెన్స్.. 1952-53లో చట్టంగా రూపొందింది. భూస్వాములు బేదాఖలు చేయకుండా (భూముల నుంచి వెళ్లగొట్టకుండా) ఈ చట్టాన్ని రూపొందించారు.
విద్యా సంస్కరణలు
-అనేక గ్రామాల్లో విద్యాసంస్థలు ఏర్పాటయ్యాయి. జిల్లాల్లో ఉపాధ్యాయులకు శిక్షణా సౌకర్యాలు కల్పించారు. మాతృభాషలో విద్యాబోధనను ప్రవేశపెట్టారు. మొదటి తరగతి నుంచి మాతృభాష, 3వ తరగతి నుంచి హిందీని రెండో భాషగా, 5వ తరగతి నుంచి ఆంగ్లాన్ని తృతీయ భాషగా ప్రవేశపెట్టారు. అంటే త్రిభాషా సూత్రాన్ని అనుసరించారు. ప్రాథమిక పాఠశాలల సంఖ్య 4 వేల నుంచి 14 వేలకు పెరిగింది. రాధాకృష్ణ కమిషన్ సిఫారసును అనుసరించి కళాశాలల్లో 3 ఏండ్ల డిగ్రీ కోర్సును ప్రవేశపెట్టారు. వరంగల్, హైదరాబాద్ నగరాల్లో విశ్వవిద్యాలయ స్థాపనకు అసెంబ్లీలో బిల్లులను ప్రవేశపెట్టారు. హైదరాబాద్ రాష్ట్రంలోని మూడు భాషా ప్రాంతాల్లో శిక్షణా కళాశాలలు, వ్యవసాయ కళాశాలలు, పశుసంవర్థక కళాశాలలు, ఇంజినీరింగ్ కళాశాలలను స్థాపించారు. వెల్లోడి మంత్రివర్గంలో రెవెన్యూ, విద్యాశాఖల మంత్రిగా ఉన్న బూర్గుల.. జిల్లాకు ఒక కళాశాలను ఏర్పాటు చేశారు.
అసఫియా స్టేట్ లైబ్రరీ:-హైదరాబాద్‌లోగల అసఫియా స్టేట్ లైబ్రరీ పేరును హైదరాబాద్ స్టేట్ సెంట్రల్ లైబ్రరీగా మార్చారు.
ఫ్రీడం స్ట్రగుల్ ఇన్ హైదరాబాద్:-బూర్గుల కాలంలోనే ఫ్రీడం స్ట్రగుల్ ఇన్ హైదరాబాద్ ఆంగ్లంలో నాలుగు సంపుటాలుగా ప్రచురితమైంది.
ఖమ్మం జిల్లా ఏర్పాటు: -బూర్గుల కాలంలో వరంగల్ జిల్లా భౌగోళికంగా చాలా పెద్దదిగా ఉండేది. ఖమ్మం ప్రాంతం వరంగల్ జిల్లాలో అంతర్భాగంగా ఉండేది. ప్రజల సౌకర్యార్థం వరంగల్ జిల్లా నుంచి ఖమ్మం ప్రాంతాన్ని వేరుచేసి ఖమ్మం జిల్లాగా ఏర్పాటు చేశారు. 1953 అక్టోబర్ 1న ఖమ్మం జిల్లా ఏర్పాటైంది.
అవినీతి నిరోధక శాఖ ఏర్పాటు:-1955 జూలై 1న హైదరాబాద్ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖను ఏర్పాటు చేశారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు
-ఈ ప్రాజెక్టు గురించి ఊహించినవారు నవాబు అలీయార్జంగ్ (ఇతడు హైదరాబాద్‌లోని ప్రముఖ ఇంజినీర్) ఇది హైదరాబాద్, ఆంధ్రరాష్ట్రంల ఉమ్మడి స్కీమ్‌గా ఆరంభమైంది. నాగార్జునసాగర్ కంట్రోల్ బోర్డు ఏర్పాటైంది. దీనిలో బూర్గుల రామకృష్ణారావు, వినాయకరావు విద్యాలంకార్, జి.ఎస్.మేల్కొటే (హైదరాబాద్ రాష్ట్రం తరపున), బెజవాడ గోపాలరెడ్డి (నాటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి), నీలం సంజీవరెడ్డి, గౌతులచ్చన్న (ఆంధ్ర రాష్ట్రం తరపున) మొదలైనవారు సభ్యులుగా ఉన్నారు.
భూదానోద్యమం – సమర్థన
-ఆచార్య వినోబాభావే ప్రారంభించిన శాంతియాత్ర కాలినడకన శివరాంపల్లి నుంచి పోచంపల్లి (నల్లగొండ జిల్లా)కి చేరుకుంది. హరిజనుల కోసం 100 ఎకరాల్ని వెదిరే రామచంద్రారెడ్ది దానం చేశాడు. ఈ విధంగా పాదయాత్ర ఫలితంగా రెండు నెలల సమయంలోనే 12 ఎకరాల భూమి దానంగా లభించింది. ఈ భూదానోద్యమాన్ని నాటి రెవెన్యూ మంత్రి బూర్గుల సమర్థించారు. దానంగా ఇవ్వబడిన భూమిని పేదలకు పంచడం కోసం వినోబాభావే సర్వోదయ భూయజ్ఞం హైదరాబాద్ లాండ్ రెవెన్యూ స్పెషల్ రూల్స్ తయారుచేయించి గెజిట్ ప్రకటింపజేయడం జరిగింది. (15 ఆగస్టు 1951) దేశంలోనే తొలిసారిగా భూదాన సేకరణకు సంబంధించి, ప్రభుత్వం ఈ విధంగా నియమావళిని రూపొందించింది.
విశాలాంధ్ర ఉద్యమం
-తెలుగు భాష మాట్లాడే తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్ని కలపాలా? వద్దా? అనే విషయంలో అనేక తర్జనభర్జనలు జరిగాయి. కొండా వెంకటరంగారెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జె.వి.నరసింగరావులు ప్రత్యేక తెలంగాణ రాష్ర్టాన్ని వెంటనే ఏర్పాటుచేయాలని కాంగ్రెస్ హైకమాండ్‌కు స్పష్టం చేసింది. మామిడిపూడి వెంకటరంగయ్య తెలుగు మాట్లాడే ప్రజలకు ఒకే రాష్ట్రం ఉండాలని 1937లో పేర్కొన్నారు. ఆచార్య ఎన్‌జిరంగా తెలుగు ప్రజలు ఒకే రాష్ట్రంగా ఉండనవసరం లేదని, రెండు రాష్ర్టాలుగా ఉన్నా పరవాలేదని పేర్కొన్నాడు.
-అక్టోబర్ 28, 1955 బూర్గుల పత్రికల వారితో మాట్లాడుతూ, విశాలాంధ్ర వెనువెంటనే ఏర్పడాలనేది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు.
(ఆధారం : 30-11-1955 ఆంధ్ర పత్రిక)
సీఎం వరంగల్ పర్యటన
-ఈ ప్రకటన అనంతరం టి.బి ఆస్పత్రి (హన్మకొండ, వరంగల్ జిల్లా) ప్రారంభోత్సవానికి సీఎం బూర్గుల వెళ్లగా, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కాంక్షిస్తూ వరంగల్‌లో విద్యార్థులు ప్రదర్శనల్ని నిర్వహించగా, వారి అభిప్రాయాల్ని కేంద్రానికి తెలియజేస్తానని బూర్గుల వారికి చెప్పారు. (ఆధారం : 03-11-1955 ఆంధ్రపత్రిక)
చిత్రాటాకీస్ వద్ద నిరసనలు
-విశాలాంధ్రను సమర్థించిన ముఖ్యమంత్రి బూర్గులకు చిత్రాటాకీస్వద్ద నల్ల జెండాలు చూపి నిరసన తెలిపారు. విశాలాంధ్ర ముర్దాబాద్ అంటూ సీఎం కారును అడ్డగించి రాళ్లు విసిరారు. (ఆధారం: 06-11-1955. గోలకొండ పత్రిక)
విశాలాంధ్ర-కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ
-కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ 1955 నవంబర్ 8,9 తేదీల్లో ఢిల్లీలో రెండు రాష్ర్టాల ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులతో సమావేశమై ఫజల్ అలీ సిఫారసులపై చర్చించింది. తెలంగాణవాళ్లను ఒప్పించి విశాలాంధ్ర ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. అందుకోసం ఒక కమిటీ కూడా ఏర్పాటైంది. కమిటీలో జవహర్లాల్ నెహ్రూ, గోవింద్ వల్లభ్‌పంత్, దేబర్, మౌలానా ఆజాద్‌లు సభ్యులుగా ఉన్నారు.
-విశాంధ్ర ఏర్పాటుకు అనుకూల వాతావరణం కల్పించాలని, తెలంగాణవాదుల్ని ఒప్పించాలని పార్టీ హైకమాండ్ మనకు చెప్పింది. అందువల్ల సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని మనం పాటించాలి అని బూర్గుల కోరారు. (ఆధారం: 17-11-1955. ఆంధ్రపత్రిక)
విశాలాంధ్రపై సీఎంల ఏకాభిప్రాయం
-ఢిల్లీలో జరిగిన హైదరాబాద్, ఆంధ్ర రాష్ర్టాల సీఎంల సమావేశంలో విశాలాంధ్రపై ఏకాభిప్రాయం కుదిరింది. (ఆధారం: 24-10-1955. ఆంధ్రపత్రిక)
బూర్గుల-సాహిత్యసేవ
-తెలుగు, హిందీ, ఇంగ్లిష్, కన్నడ, మరాఠీ, ఉర్దూ, పారశీక, సంస్కృత భాషల్లో బూర్గులకు ప్రావీణ్యం ఉంది. మహారాష్ట్రలో చదివే రోజుల్లోనే ఆంగ్లంలో కవితలు రాసేవారు.
-గోలకొండ పత్రికలో ఖండాకృతులు రాశారు.
-ఆయన రాసిన కృష్ణ శతకాన్ని ఆంధ్రసారస్వత పరిషత్ ప్రచురించింది.
-రచనలు: కృష్ణ శతకం, శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం, పండితరాజ పంచామృతం, రెడ్డి రాజుల కాలం-మత సంస్కృతులు (పరిశోధనా వ్యాసం), శ్రీ కృష్ణాష్టకం, పారశీక వాజ్మయ చరిత్ర.
మంత్రులు – శాఖలు
-బూర్గుల రామకృష్ణారావు (ముఖ్యమంత్రి)-
సాధారణ పరిపాలన, రెవెన్యూ శాఖ
-శంకర్‌దేవ్ (డిప్యూటీ మంత్రి)- సమాచార శాఖ, సాంఘికసేవా శాఖ
-దిగంబరరావు బిందూ- హోంశాఖ, న్యాయశాఖ, పునరావాస శాఖ
-శ్రీనివాసరావు ఎఖ్లేకర్ (డిప్యూటీ మంత్రి)
-కొండా వెంకటరంగారెడ్డి- ఎక్సైజ్ శాఖ, కస్టమ్స్ శాఖ, రెవెన్యూ శాఖ (సీఎంకు లేని విభాగాలు), అటవీ శాఖ
-పల్లెర్ల హనుమంతరావు (డిప్యూటీ మంత్రి)
-డా. మర్రి చెన్నారెడ్డి – వ్యవసాయ శాఖ, పౌర సరఫరాల శాఖ, అభివృద్ధి ప్లానింగ్ శాఖలు
-అరిగె రామస్వామి (డిప్యూటీ మంత్రి)
-వినాయకరావు కొరాట్కర్ విద్యాలంకార్-
ఆర్థిక శాఖ, పరిశ్రమల శాఖ, వాణిజ్య శాఖ, గణన శాఖ
-విరూపాక్షప్ప (డిప్యూటీ మంత్రి)
-గోపాల్ సుబ్బుకృష్ణ మెల్కోటే- పరిశ్రమల శాఖ
-ఎం.ఎస్. రాజలింగం (డిప్యూటీ మంత్రి)-
కార్మిక శాఖ, ప్రజాపనుల శాఖ
-మెహదీ నవాబ్‌జంగ్ బహదూర్- వైద్య శాఖ, ఆరోగ్య శాఖ, సహకార శాఖ, పశువైద్య శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ
-భగవంతరావు గాధే- పశువైద్య శాఖ, సహకార శాఖ
-గోపాలరావు ఎక్బోటే- విద్యాశాఖ, స్థానిక పరిపాలనా శాఖ
-శ్రీమతి సంగెం లక్ష్మీబాయి (డిప్యూటీ మంత్రి)
-వి.బి. రాజు- కార్మిక శాఖ, సమాచార శాఖ
నోట్: బూర్గుల క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన వీబీ రాజు గుంటూరు ప్రాంతానికి చెందినవారు. సికింద్రాబాద్ నియోజవర్గం నుంచి గెలిచారు. తెలంగాణ ప్రాంతం నుంచి హైదరాబాద్ శాసనసభకు ఎన్నికైన తొలి ఆంధ్రనాయకుడు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు