తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం
సుదీర్ఘ పోరాటం తర్వాత సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని సర్వతోముఖాభివృద్ధి చేసుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నిర్మాణాత్మక చర్యలో నూతన పారిశ్రామిక విధానం అతి ముఖ్యమైనది. ప్రపంచ నలుమూలల నుంచి పెట్టుబడులను ఆకర్శించేందుకు, రాష్ట్రంలోని అన్ని వర్గాల పారాశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు అత్యుత్తమ పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చింది. దీనిపై పోటీపరీక్షల్లో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉన్నందున నిపుణ పాఠకుల కోసం ఈ వ్యాసం..
పారిశ్రామిక భూమి నిధి
-పారిశ్రామిక వినియోగం కోసం సుమారు 2.50 లక్షల ఎకరాల బంజరు భూమిని గుర్తించింది. రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ) సహకారంతో ఓ పారిశ్రామిక ల్యాండ్ బ్యాంక్ అభివృద్ధి కానుంది.
-కీలక రంగాలకు ప్రత్యేకమైన పారిశ్రామిక పార్కుల్ని టీఎస్ఐఐసీ ఏర్పాటు చేస్తుంది.
-రెడ్ కేటగిరీ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి సురక్షితమైన ప్రదేశాల్లో ప్రత్యేకమైన పారిశ్రామిక పార్కుల ఏర్పాటు.
-బహుళ రంగ కార్యకలాపాలకు, సాధారణ వస్తుత్పత్తి యూనిట్లకు కూడా కొన్ని పారిశ్రామిక పార్కులు అనుమతిస్తాయి.
పారిశ్రామిక జలాలు
-అందుబాటులో ఉన్న, నూతన సాగునీటి వనరుల నుంచి 10 శాతం పారిశ్రామిక వినియోగం కోసం ప్రత్యేకంగా రిజర్వు చేస్తారు. ప్రతిపాదిత వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా నీటి లైన్లను వాటికి సమకూరుస్తారు.
పారిశ్రామిక విద్యుత్
-ప్రతి పారిశ్రామిక పార్కులో నాణ్యమైన విద్యుత్, నిరంతరాయమైన విద్యుత్ సరఫరాలను ఏర్పాటు చేస్తారు.
-విద్యుత్ ఎక్సేంజీలు ఎంఎస్ఎంఈలతో సహా అన్ని రకాల పరిశ్రమలకు అందుబాటులో ఉండేందుకు ఓపెన్ యాక్సెస్ విద్యుత్ ఆంక్షలను తొలగిస్తుంది.
-పారిశ్రామిక అవసరాల కోసం సంప్రదాయేతర ఇంధన వినియోగానికి ప్రోత్సాహం లభిస్తుంది.
-భారీ పారిశ్రామిక పార్కుల్లో ప్రైవేట్ మర్చెంట్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు సహకారం అభిస్తుంది.
-చైనా, సింగపూర్‌లకు చెందిన పెట్టుబడిదారుల ద్వారా 300-500 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు రానున్నాయి. పారిశ్రామిక వినియోగదారులు, విద్యుదుత్పత్తిదారులు ధరల విషయంలో సంప్రదింపులు జరుపుకోవచ్చు. రవాణా, ట్రాన్స్మిషన్ బాధ్యతలను టీఎస్ ట్రాన్స్‌కో నిర్వర్తిస్తుంది.
ప్రైవేట్ భూముల్లో పారిశ్రామిక అభివృద్ధి – ప్రభుత్వ విధులు
-హెచ్ఎండీ, తెలంగాణలోని ఇతర పట్టణాభివృద్ధి సంస్థల స్థల వినియోగ ప్రణాళికలో పారిశ్రామిక వినియోగం కోసం గుర్తించిన ప్రైవేట్ భూములను పరిశ్రమలకు కేటాయంచడాన్ని ప్రోత్సహిస్తుంది.
-టీఎస్ఐఐసీ ప్రమాణాల మేరకు చక్కని మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయడం కోసం తమ భూముల్ని సమకూర్చుకునే ప్రైవేటు పారిశ్రామిక పార్కుల డెవలపర్లను ప్రోత్సహిస్తుంది.
-భూమి వినియోగం తీరును మార్చుకోవడానికి అనుమతిస్తుంది.
పారిశ్రామిక కారిడార్లు
-హైదరాబాద్ నుంచి వరంగల్‌ను కలిపే ముఖ్యమైన జాతీయ, రాష్ట్ర ప్రధాన రహదారుల పొడవునా పారిశ్రామిక కారిడార్లను ప్రాధాన్యతాక్రమంలో ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది.
-అభివృద్ధి చేసిన కారిడార్లు ఆ తర్వాత డీఎంఐసీ లేదా పీసీపీఐఆర్ లాంటి ప్రత్యేక పెట్టుబడి మండళ్లకు నమూనాలుగా నిలుస్తాయి.
-రాష్ట్రంలో ప్రతి జిల్లా కేంద్రాన్ని హైస్పీడ్ రైలు, రోడ్డు వ్యవస్థతో అనుసంధానిస్తారు.
-ప్రాథమికంగా అభివృద్ధి చేయబోయే పారిశ్రామిక కారిడార్లు: 1) హైదరాబాద్-వరంగల్ పారిశ్రామిక కారిడార్ 2) హైదరాబాద్-నాగసూర్ పారిశ్రామిక కారిడార్ 3) హైదరాబాద్-బెంగళూర్ పారిశ్రామిక కారిడార్. రెండో దశలో అభివృద్ధి చేసే కారిడార్లలో 1) హైదరాబాద్-మంచిర్యాల పారిశ్రామిక కారిడార్ 2) హైదరాబాద్-నల్లగొండ పారిశ్రామిక కారిడార్ 3) హైదరాబాద్-ఖమ్మం పారిశ్రామిక కారిడార్ ఉంటాయి.
హైదరాబాద్ పరిశోధన, ఆవిష్కరణ సర్కిల్ (ఆర్ఐసీహెచ్)
-నూతనావిష్కరణలను, పారిశ్రామిక స్ఫూర్తిని పెంపొందించే నిమిత్తం పరిశ్రమకు, పరిశోధన లేదా విద్యా సంస్థలకు వెంచర్ క్యాపిటలిస్టులకు మధ్య అవసరమైన అనుసంధానాన్ని ఏర్పాటు చేయడం కోసం విపణి పరిశోధన నిధిని అందిస్తుంది.
2014-15 కోసం నిర్దిష్టమైన చర్చలు
-వ్యర్థాల నిర్వహణతో సహా చక్కగా అభివృద్ధి చేసిన మౌలిక సదుపాయాలతో నూతన ఫార్మా సిటీ, కెమికల్ సిటీ.
-హైదరాబాద్-వరంగల్ పారిశ్రామిక కారిడార్ అభివృద్ధి.
-తెలంగాణకు జౌళి కేంద్రంగా వరంగల్ అభివృద్ధి.
-ఫుడ్ ప్రాసెసింగ్, విత్తన ఉత్పత్తికి చొరవ.
-పారిశ్రామిక పార్కులకు అనుబంధంగా మినీ పారిశ్రామిక టౌన్‌షిప్‌లు.
-దళిత పారిశ్రామికవేత్తలకు నేరుగా రుణ సౌకర్యాలు.
-ఒక వెంచర్ క్యాపిటల్ లేదా ఏంజిల్ ఫండ్ సృష్టి.
-పారిశ్రామిక పెట్టుబడులు, ఉత్పుత్తులపై అంతర్రాష్ట్ర వ్యాట్ హేతుబద్దీకరణ.
-పాతకాలపు పారిశ్రామిక రంగ నియంత్రణలపై సమీక్ష, సంస్కరణ.
ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక సహకారం
రాష్ట్రంలోని ప్రస్తుత పారిశ్రామిక యూనిట్లలో ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల యాజమాన్యంలో ఉన్న వాటి నిష్పత్తి చాలా తక్కువగా ఉంది. వ్యవస్థాగతమైన అవరోధాలు అనేకం ఉండటమే దీనిక కారణం. సామాజిక న్యాయం హామీ పునాదిగా నూతన రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడినందున నూతన రాష్ట్ర పారిశ్రామిక విధానం ఎస్సీ, ఎస్టీల్లో పారిశ్రామికవేత్తలను పెంచడానికి ఉద్దేశించిన అనేక అదనపు సహకార చర్యలను టీఎస్ ప్రైడ్- తెలంగాణ స్టేట్ ప్రోగ్రామ్ ఫర్ ర్యాపిడ్ ఇంక్యుబేషన్ ఆఫ్ దళిత్ ఎంటర్‌ప్రెన్యూర్స్ పథకం కింద చేపడుతున్నది.
షెడ్యూల్డ్ కులాలు, తెగల యాజమాన్యంలోని పరిశ్రమలు
-ఎస్సీ, ఎస్టీ యాజమాన్యంలోని పరిశ్రమలంటే, వారి పూర్తి యాజమాన్యంలో ఏర్పాటైనవి లేదా వారికి స్థిరంగా 100 శాతం వాటా ఉన్న భాగస్వామ్య, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు. ఈ విధానం ద్వారా ప్రోత్సాహకాలను తమకోసం వినియోగించుకోవడం కోసం షెడ్యూల్డ్ కులాలు, తెగల పారిశ్రామికవేత్తలు వివిధ తరహా కార్యకలాపాలను సాగించే సంస్థల్ని ఏర్పాటు చేసుకోవచ్చు.
list-పారిశ్రామిక వినియోగంకోసం కొనుగోలు చేసిన భూమి కోసం పరిశ్రమ చెల్లించిన స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీల మొత్తం 100 శాతం తిరిగి ఇవ్వాలి.
-భూమి, షెడ్, భవనాల లీజు, అలాగే తనఖా, తాకట్టులపై 100 శాతం స్టాంప్ డ్యూటీ తిరిగి చెల్లింపు.
-పారిశ్రామిక వాడలు, పార్కుల్లో భూమి విలువపై రూ. 10 లక్షల పరిమితితో 33.33 శాతం తగ్గింపు.
-పారిశ్రామిక వినియోగానికి 25 శాతం భూమి మార్పిడి చార్జీలు.
-వాణిజ్య ఉత్పత్తి ఆరంభించిన తేదీ నుంచి ఐదేండ్ల పాటు యూనిట్‌కు రూ. 150 చొప్పున స్థిర విద్యుత్ ధర తిరిగి చెల్లింపు.
-తొలితరం పారిశ్రామికవేత్తలు సూక్ష్మ తరహా పరిశ్రమల్ని ఏర్పాటు చేయడానికి వీలుగా యంత్రాల కొనుగోలు ఖర్చులో మూలధన సమీకరణంలో 20 శాతం సహాయం. దీనిని అర్హమైన పెట్టుబడి సబ్సిడీ నుంచి తగ్గిస్తారు.
-ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఏర్పాటు చేసే సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు స్థిర మూలధన పెట్టుబడిలో 35 శాతం సబ్సిడీని రూ.75 లక్షల పరిమితికి లోబడి అందజేస్తారు. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఏర్పాటు చేసే యూనిట్లకు అదనంగా 5 శాతం పెట్టుబడి సబ్సిడీని రూ.75 లక్షల పరిమితికి లోబడి అందజేస్తారు.
-చిన్న తరహా సూక్ష్మ పరిశ్రమలకు అవి వాణిజ్య ఉత్పత్తి ఆరంభించిన తేదీ నుంచి 5 ఏండ్ల కాలవ్యవధిలో 100 శాతం నికర వ్యాట్, సీఎస్టీ లేదా రాష్ట్ర వస్తు, సేవల పన్ను (ఎస్జీఎస్టీ) తిరిగి చెల్లింపు.
-మధ్య తరహా పరిశ్రమలు వాణిజ్య ఉత్పత్తి ఆరంభించిన తేదీ నుంచి 7 ఏండ్ల కాల పరిమితి లేదా 100 శాతం స్థిర మూలధన పెట్టుబడి వసూలు కావడాల్లో ఏది ముందు పూర్తయితే అప్పటివరకూ 75 శాతం నికర వ్యాట్, సీఎస్టీ లేదా రాష్ట్ర వస్తు, సేవల పన్ను (ఎస్జీఎస్టీ) తిరిగి చెల్లింపు.
-భారీ స్థాయి పరిశ్రమలు వాణిజ్య ఉత్పత్తి ఆరంభించిన తేదీ నుంచి 7 ఏండ్ల కాల పరిమితి లేదా 100 శాతం మూలధన పెట్టుబడి వసూలు కావడాల్లో ఏది ముందు పూర్తయితే అప్పటివరకు 50 శాతం నికర వ్యాట్, సీఎస్టీ లేదా రాష్ట్ర వస్తు, సేవల పన్ను (ఎస్జీఎస్టీ) తిరిగి చెల్లింపు.
-నూతన సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల స్థిర మూలధన పెట్టుబడిపై పావలా వడ్డీ పథకం కింద తీసుకున్న నియమిత కాలం రుణాలపై వాణిజ్య ఉత్పత్తి ఆరంభించిన తేదీ నుంచి 5 ఏండ్ల పాటు ఏడాదికి కనిష్టంగా 3 నుంచి గరిష్టంగా 9 శాతం వరకు వడ్డీ రాయితీ. ఈ పథకం కింద సేవా రంగంలో ఏర్పాటుచేసే యూనిట్లకు కూడా ఈ ప్రయోజనం వర్తిస్తుంది.
-నైపుణ్యాలను పెంచుకోవడానికి, స్థానిక కార్మికులకు శిక్షణ ఇవ్వడానికయ్యే ఖర్చులో వ్యక్తికి రూ. 2, 000 పరిమతికి లోబడి 50 శాతం తిరిగి చెల్లింపు.
-సూక్ష్మ చిన్న పరిశ్రమలకు నాణ్యత ధ్రువీకరణ, పేటెంట్ల నమోదుకయ్యే ఖర్చులో రూ 3 లక్షల పరిమితికి లోబడి 50 శాతం సబ్సిడీ.
-నిర్దిష్టమైన పారిశుద్ధ్య ఉత్పత్తి చర్యలపై రూ. 5 లక్షల పరిమితికి లోబడి 25 శాతం సబ్సిడీ.
-షెడ్యూల్డ్ కులాలు, తెగలకు చెందిన పారిశ్రామికవేత్తలు ఏర్పాటు చేసే సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు ఐఐడీఎఫ్ ద్వారా మౌలిక సదుపాయాల ఖర్చులో 50 శాతం సమకూరుస్తూ పరిశ్రమల స్వయం సమృద్ధి యూనిట్ల ముంగిటికే రోడ్లు, విద్యుత్, నీరు లాంటి మౌలిక సదుపాయాలను సమకూర్చుతుంది. దీని పరిమితి రూ. కోటి ఈ అంశాలకు లోబడి ఉంటుంది. 1) పరిశ్రమ ప్రదేశం ప్రస్తుతం నడుస్తున్న పారిశ్రామిక వాడలు, ఐడీఏలకు 10 కిలోమీటర్లకు మించిన దూరంలో ఉండాలి. కేటాయించడానికి ఖాళీ భూమి, షెడ్లు ఉండాలి. 2) పరిశ్రమలో పెట్టిన అర్హమైన స్థిర మూలధన పెట్టుబడిలో మౌలిక సదుపాయాల ఖర్చు 15 శాతానికి పరిమితమై ఉండాలి. షెడ్యూల్డ్ ప్రాంతాల్లో ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఏర్పాటు చేసే యూనిట్ల విషయంలో సమకూర్చే మౌలిక సదుపాయాల ఖర్చును 50 శాతం నుంచి 75 శాతానికి పెంచుతారు.
జాతీయ పెట్టుబడి, వస్తుత్పత్తి మండళ్లు (NIMZ)
-మెదక్ జిల్లాలో 5,000 నుంచి 6,000 ఎకరాల్లో జాతీయ పెట్టుబడి, వస్తుత్పత్తి మండలి ఏర్పాటు చేసేందుకు భారత ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. జాతీయ ఉత్పాదక విధానంలో ఎన్ఐఎంజడ్ భావన ఒక భాగం. జీడీపీలో ఉత్పాదక రంగ జీడీపీని 6 నుంచి 25 శాతానికి పెంచడం దీని లక్ష్యం. అధునాతన మౌలిక సదుపాయాలతో జోనింగ్‌పై ఆధారపడే భూ వినియోగంతో పరిశుభ్రమైన, ఇంధన సామర్థ్యం కలిగిన సాంకేతికతల వినియోగంతో అవసరమైన సామాజిక మౌలిక సదుపాయాలు, నైపుణ్య అభివృద్ధి సౌకర్యాలతో సమగ్ర పారిశ్రామిక టౌన్‌షిప్‌లుగా ఎన్ఐఎంజడ్లో అంచనా పెట్టుబడి సుమారు రూ. 30,000 కోట్లుగా భావిస్తున్నారు. ప్రతి ఎన్ఐఎంజడ్ ఉద్యోగ కల్పన సామర్థ్యం 3 లక్షలని అంచనా. జాతీయ పెట్టుబడి, ఉత్సాదక మండలి ఏర్పాటు కోసం మెదక్ జిల్లాలో భూ సేకరణ జరుగుతున్నది.
పారిశ్రామిక మౌలిక సదుపాయాలు – ప్రత్యేక ఆర్థిక మండళ్లు
-ఐటీ, ఐటీఈలు, ఏరోస్పేస్, బయోటెక్, ఫార్యులేషన్స్ రంగాల్లో ఆరు సెజ్‌లను రాష్ట్రంలో అభివృద్ధి చేశారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ పార్కుల్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చొరవలో భాగంగా వరంగల్ జిల్లా మడికొండ గ్రామంలో సెజ్‌ను రాష్ట్ర ఐఐసీ అభివృద్ధి చేసింది.
నూతన పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు భూమి గుర్తింపు
-రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (టీఎస్ఐఐసీ) 10 జిల్లాల్లో సుమారు 74,133.18 ఎకరాల్లో విస్తరించి ఉన్న 150 పారిశ్రామిక పార్కులను గుర్తించింది. ప్రస్తుతం ఈ పార్కుల్లో 13,165 యూనిట్లు (పరిశ్రమలు) ఉనికిలో ఉన్నాయి. మొత్తం 74,133.18 ఎకరాల్లో పరిశ్రమలకు కేటాయించడానికి 917 ఎకరాల భూమి అందుబాటులో ఉంది.
-టీఎస్ఐఐసీ 2.5 లక్షల ఎకరాల వ్యర్థమైన, బంజరు భూమిని సర్వే చేసి పారిశ్రామిక వినియోగానికి సిద్ధంగా ఉన్న 2,34,064.35 ఎకరాలను గుర్తించింది.
నైపుణ్యాల అభివృద్ధి
-తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మిషన్ పరిధి కింద సాధారణంగాను, పరిశ్రమలు, వాణిజ్య శాఖ చేపట్టిన రాష్ట్ర యాక్సెలరేటెడ్ ఎస్ఎస్ఐ నైపుణ్యాల శిక్షణ (టీ అసిస్ట్) కార్యక్రమం ద్వారా పారిశ్రామిక రంగ ఉద్యోగాల సృష్టి లక్ష్యంగా నైపుణ్యాల అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం సహకారం అందిస్తుంది.
రాష్ట్రం విధులు
-ప్రవేశ స్థాయి ఉద్యోగాలను పొందడానికి వీలైన శిక్షణను యువతకు అందిస్తుంది. పరిశ్రమల అవసరాల కోసం నిపుణులైన ఉద్యోగులు అందుబాటులో ఉండేలా చూస్తుంది.
-పరిశ్రమలను సంప్రదించి వాటి అవసరాలకు సరిపడేలా ప్రస్తుత ఉద్యోగులు తమ నైపుణ్యాలను మెరుగుపర్చుకోవడానికి కార్యక్రమాలను రూపొందిస్తుంది.
-మెగా పరిశ్రమలు తమ పారిశ్రామిక పార్కుల్లోనే సొంతంగా నైపుణ్య అభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసుకోవడాన్ని ప్రోత్సహిస్తుంది.
-నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనలో, అమలులో పారిశ్రామిక ప్రాంత సొసైటీల భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తుంది. టీ ఐడియా (తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధి, ఎంటర్ప్రెన్యూర్ అడ్వాన్స్మెంట్) ప్రభుత్వం పారిశ్రామికవేత్తల కోసం కింది అంశాల్లో ప్రోత్సాహక పథకం కింద ప్రోత్సాహకాలను అందించాలని నిర్ణయించింది.
-స్టాంప్ డ్యూటీ తిరిగి చెల్లింపు
-భూమి ధరలో తగ్గింపు
-భూ మార్పిడి
-విద్యుత్ ఖర్చులు తిరిగి చెల్లింపు
-పెట్టుబడి సబ్సిడీ
-వ్యాట్ తిరిగి చెల్లింపు
-వడ్డీ సబ్సిడీ
-మొదటి తరం పారిశ్రామికవేత్తల కోసం మూలధన సమీకరణ
-శిక్షణ, నైపుణ్యాల అభివృద్ధి ఖర్చు తిరిగి చెల్లింపు
-నాణ్యత, పేటెంట్లకు సహకారం
-స్వచ్ఛమైన ఉత్పాదక చర్యలు
-మౌలిక సదుపాయాల అభివృద్ధి ఖర్చులు తిరిగి చెల్లింపు
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు