తెలంగాణలో18వ శతాబ్దపు సాహితీవేత్తలు
కానూరి వీరభద్ర కవి: ఇతడు నల్లగొండ జిల్లా కొలనుపాక నివాసి. ఇతడి రచన బసవ మహిమామృత విలాసం అనే యక్షగానం. బసవేశ్వరుడు బలదేవ దండనాథ కూతురైన గంగమను, బిజ్జలుని సోదరి అయిన నీలను పెండ్లి చేసుకోవడం ఇందులోని వృత్తాంతం.
-ముని పంతులు (క్రీ.శ. 1820 ప్రాంతం): ఈయన ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ తాలూకా మామెడ గ్రామ నివాసి. ప్రజాకవిగా పరిగణించదగినవాడు. ఇతడి రచనలు వత్సల పరిణయం, బబ్రువాహన చరిత్ర, చంద్రహాస చరిత్ర, హరిశ్చంద్రోపాఖ్యానం, భారతం, రామాయ ణం, మొహర్రం పాటలు మొదలైనవి. ఈయన రచించిన భారతానికి గోండి భారతం అని పేరు. వ్యాస భారతాన్ని జానపదుల కోసం సంక్షిప్తంగా వ్యవహారిక భాషలో పద్యగేయంగా రాశాడు.
-చిత్తారు గంగాధరయ్య: ఇతడు నల్లగొండ సమీపంలోని చర్లపల్లి గ్రామ నివాసి. జంగమ కులానికి చెందిన మల్లమాంబ, వీరయ్యల కుమారుడు. ఇతడి రచనలు కొలిపాక మహాత్మ్యం, శృంగార భళ్లాణ చరిత్ర, శృంగార సిరియాళ చరిత్ర, గంగా శుకసప్తతి, వివాహం. శుకసప్తతి మాత్రమే వచన రచన. మిగిలినవన్నీ ద్విపద రచనలు. కొలనుపాకలో వెలసిన వీరభద్రస్వామి మహాత్మ్యాన్ని వర్ణించే గ్రంథం కొలిపాక మహాత్మ్యం.
-మరింగంటి వేంకట నరసింహాచార్యులు (క్రీ.శ. 1800-1880): ఇతడు నల్లగొండ జిల్లాలోని కనగల్లు ప్రాంతానికి చెందినవాడు. ఇతడి రచనలు తాలాంక నందినీ పరిణయం, ఇందిరాల గోదాపారిజాతం చాటువులు, తాలాంక నందినీ పరిణయంలో బలరాముని కూతురు శశిరేఖ వివాహ వృత్తాంతం ఉంది.
-చెన్నూరి శోభనాద్రి (క్రీ.శ. 1830 ప్రాంతం): ఇతడి పూర్వీకులది నల్లగొండ జిల్లా మఠంపల్లి మండలం యాతవాకిళ్ల గ్రామం. ఇతడు మాత్రం కోదాడ సమీపంలోని చిలుకూరులో ఉండేవాడని సాహిత్య చరిత్రకారుల అభిప్రాయం. ఈయన శృంగార సుధాసముద్ర, పూర్ణ చంద్రోదయం అనే ప్రబంధాన్ని రచించి గుమ్మడపు పాపయ్య నృపుడికి అంకితమిచ్చాడు.
-చింతపల్లి దున్నా ఇద్దాసు (క్రీ.శ 1811-1919): ఇతడు మాదిగ కులంలో పుట్టి మహాయోగిగా ప్రసిద్ధిగాంచాడు. ఈయన అసలు పేరు ఇద్దన్న తల్లిదండ్రులు దున్నా రామయ్య, ఎల్లమ్మలు. సాధువులవెంట తిరిగి తత్త గీతాలను నేర్చుకొని మోటగొడుతూ ఆశువుగా తత్తగీతాలను పాడేవాడు. పోతులూరి వీరబ్రహ్మం, ఈశ్వరమ్మలు ప్రచారం చేసిన రాజయోగమార్గంలో పయనించి పలు తత్తాలను రాశాడు. ఈయన పాటలు దున్నా ఇద్దాసుగారి తత్తాల పేరుతో ప్రసిద్ధిగాంచాయి. ఇతడిని తొలి దళిత కవిగా పరిగణించొచ్చు.
-కాకుత్సం నరసింహదాసు (క్రీ.శ. 1820-1880): కరీంనగర్ జిల్లా ధర్మపురి నివాసి. శేషాచల కవి మనుమడు. ఇతడి రచనలు శ్రీకృష్ణ శతకం, మైరావణ చరిత్ర, మిశ్రిత రామాయణం, గంగపాట మొదలైనవి. శ్రీకృష్ణ శతకం మాత్రమే ముద్రితం. రావణుని మేనమామ మైరావణుడు రామ, లక్ష్మణులను ఎత్తుకుపోయి కాళికి బలివ్వతలపెట్టగా హనుమంతుడు అతన్ని చంపడం మైరావణ చరిత్రలోని ఇతివృత్తం.
-తూము రామచంద్రారెడ్డి (19వ శతాబ్దం): ఈయన మహబూబ్నగర్ జిల్లాలోని మానాజిపేట గ్రామ దేశ్ముఖ్. వనపర్తి సంస్థాన రాజు బంధువు. శ్రీ అలివేలుమంగా పరిణయం అనే ప్రబంధాన్ని రాశాడు.
-భాగవతుల కృష్ణదేశికుడు (1823-1876): అచల సంప్రదాయాన్ని ఆంధ్రదేశంలో ప్రవేశపెట్టినవాడు రామడుగు శివరామదీక్షితులైతే ఆయన శిష్య పరంపరలోనివాడైన భాగవతుల కృష్ణదేశికుడు ఆ సంప్రదాయాన్ని మరింత సులభతరంగా వ్యాఖ్యానం చేసి సామాన్య ప్రజల మధ్యకు తీసుకెళ్లాడు. నల్లగొండ జిల్లా కొలనుపాకలో జానకి, నారాయణ యోగి దంపతులకు జన్మించాడు. పరశురామ సీతారామస్వాములు, పరశురామ వెంటక నరసింహదాసుల వద్ద దీక్ష పొందాడు. ఇతడి రచనలు ఆధ్యాత్మ తత్త కీర్తనలు, శక్తి ద్వయ నిరాసక శుద్ధ నిర్గుణతత్త కందార్థ దరువులు, భగవద్గీత సారాంశ జ్ఞానం, వేదాంత వార్తికం, హంస సంచార క్రమ వివరం.
-తడకమళ్ల కృష్ణారావు (క్రీ.శ. 1830-1890): మునగాల ప్రాంతంలోని బేతవోలు జమీందారు సీతారామచంద్రారావు కొడుకు కృష్ణారావు. ఈయన సంస్కృతం, తెలుగు, పార్శీ, ఉర్దూ, ఆంగ్లం, తమిళం, కన్నడ భాషల్లో ప్రావీణ్యుడు. సంస్కృతంలోని లీలావతి, రామావతార కాలనిర్ణయం, కంబుకంధర చరిత్ర, తెలుగు వెలుగు ముగుద కథ, కామరూప కథ, కామందకం, చిత్రకథా వివరణ మొదలైనవి ఇతని రచనలు. ఇతడు రచించిన కంబుకంధర చరిత్ర తొలి తెలుగు నవల అయ్యే అవకాశం ఉంది.
-రంగరాజు కేశవరావు (1835-1905): సర్వాయి పాపన్న కోట నిర్మించిన ఊరు వరంగల్ జిల్లా ఖాలాషాపురం ఇతడి స్వస్థలం. ఈయన రచనలు ఇంద్రద్వుమ్నీయం, విక్రమాదిత్యీయం, రామాభ్యుదయం, లీలా పరిణయం, కల్కి పురాణం, దాశరథీ శతకం, ఆధ్యాత్మ రామాయణం, హనుమద్విజయం, మేలుకొలుపు పాటలు మొదలైనవి.
-శ్రీరామ భూపాలుడు (1845-1901): గద్వాల సంస్థానాన్ని సుదీర్ఘకాలం పాలించిన ప్రభువు శ్రీరామ భూపాలుడు. తిరుపతి వెంకటకవులు ఇతడిచే సన్మానం పొందారు. కవి పోషకుడేకాక స్వయంగా కవి. ఈయన ఛందోముకురం అనే గ్రంథాన్ని రాశాడు.
-గోవర్ధనం వెంకట నృసింహాచార్యులు (క్రీ.శ. 1845-1937): ఇతడి జన్మస్థలం నల్లగొండ జిల్లా నిడమనూరు మండలంలోని ఇబ్రహీంపేట. ఇతడి రచనలు అజామిళోపాఖ్యానం, ప్రతాపగిరి రాణ్మాహాత్మ్యం, సారంగశైల మహాత్మ్యం, జాంబవతీ చరిత్రం, వామన చరిత్ర, శంకర విజయం, సిరసనగండ్ల శతకం, దాశరథీ శతకం మొదలైనవి.
-ఫీల్ఖానా లక్ష్మణ దేశికుడు (1846-1914): ఈయన భాగవతుల కృష్ణదేశికుని ప్రియ శిష్యుడు. ఇతడి తమ్ముడు శంకర్రావు అచలమార్గ ప్రవర్తకుడై శివరామదీక్షతుల పేర బేగంపేటలో అచలగురు మందిరాన్ని నిర్మించాడు. ఈయన రచనల్లో ముఖ్యమైనవి సుబోధ రత్నాలు, అచలతత్త శిరోమణి అఖండమాల.
-ఫీల్ఖానా శంకర ప్రభువు (1855-1897): భాగవతుల కృష్ణదేశికుని శిష్యుడు. నిజాం ప్రభువుల వద్ద మంత్రిగా పనిచేసిన రాజా కిషన్ప్రసాద్ ఇతని శిష్యుల్లో ఒకడు. ఇతడి రచనలు భక్తజన ముక్తావళి, నిజగురుస్తవం, సుజ్ఞానదీపం అనే గురుగీతాలు, జ్ఞానామృతం, భక్తానంద సాగరం.
-తూము రామదాసు: ఇతడు వరంగల్ ప్రాంతవాసి. రుక్మిణీ కల్యాణం, గోపికా విలాసం, నిర్వచన మిత్రవిందోద్వాహం, కాళిదాసు (నాటకం) ఆంధ్రపద విధా న నిఘంటువు ఇతడి రచనలు.
-వెల్లూరు నరసింగ కవి (క్రీ.శ. 1860-1920): ఇతడు మహబూబ్నగర్ జిల్లాలోని వెల్లూరు గ్రామ నివాసి. భర్తృహరి సుభాషిత త్రిశతిని కంద పద్యాల్లో వెల్లూరి వెంకటాచల రమణ అనే మకుటంతో అనువదించా డు. చూతపురి దీవి విలాసం, రాచకన్యకా పరిణయం ఇతర రచనలు. శ్రీకృష్ణుడు నరకాసురుడిని వధించి వాని చెరలో ఉన్న పదహారువేలమంది రాకుమార్తెలను వివాహమాడటం రాచకన్యకా పరిణయంలోని ఇతివృత్తం.
-తిరుమల బుక్కపట్నం శ్రీనివాసాచార్యులు(బాల సరస్వతి) (క్రీ.శ. 1862-1920): ఇతడు మహబూబ్నగర్ జిల్లా ఆత్మకూరు సంస్థానాధిపతి సీతారామ భూపాలుని ఆస్థాన కవి, పండితుడు. సంస్కృత, ఆంధ్ర, ప్రాకృత భాషల్లో పండితుడు. మైసూరు రాజు చామ రాజేంద్ర నుంచి బాల సరస్వతి బిరుదును పొందాడు. నవద్వీప మండలివారి నుంచి తర్కతీర్థ బిరుదును పొందాడు. దేశంలోని ప్రముఖ పండితులను ఓడించి సమస్త భారత జైత్రయాత్ర చేశాడు. ఈయన రచనలు నంజరాజ చంపువు, దుర్మదనిర్మధనం, జాంబవతీ పరిణయం, రాజశేఖర చరిత్రం, రాజవంశ రత్నావళి, శతఘంటావధానం, లక్ష్మీసరస్వతి దండకం, గంగస్తుతి, ఆంగ్లేయ జర్మనీ యుద్ధ వివరణం మొదలైనవి.
-బోయినపల్లి వెంకటాచార్యుడు (క్రీ.శ. 1869-1929): ఈయన పూర్వీకులు మైసూరు నుంచి వచ్చి మహబూబ్నగర్ జిల్లాలోని బిజినేపల్లి గ్రామంలో స్థిరపడ్డారు. నరసమాంబ, కృష్ణమాచార్యులు తల్లిదండ్రులు. ఇతడి మొదటి రచన జానకీ పరిణయం అనే ప్రబంధం దీనిని చింతామణి యమునాచార్యులతో కలిసి రాశాడు. రెండోది రాజలేఖ అనే ఖండకావ్యం. దీనిని సోదరుడగు కృష్ణమాచార్యులతో కలిసి రాశాడు. ఇతర రచనలు సత్యనారాయణ వ్రతం, రామపూజా విధానం.
-వారణాసి రామయ్య (క్రీ.శ. 1870 ప్రాంతం): సికింద్రాబాద్ నివాసి. కొండా వెంకటరెడ్డి ఆస్థాన కవి. ఇతడి రచనలు శ్రీరామాచల పూర్ణబోధ, దత్తాత్రేయ పంచవింశతి, శ్రీరామ మానసిక పూజ, బమ్మెర పోతరాజు విజయం, అచల హరిశ్చంద్రోపాఖ్యానం, అభినవ ప్రహ్లాదోపాఖ్యానం, సర్వమత సార సంగ్రహ చరిత్ర మొదలైనవి.
-కసబ కృష్ణమాచార్యులు (క్రీ.శ. 1870 ప్రాంతం): ఇతడు మహబూబ్నగర్ జిల్లా బలుమూరు నివాసి. కామసానిపల్లె ప్రతాపరెడ్డి, రంగారెడ్డిల ఆస్థాన కవి. ఇతడి సంస్కృత రచనలు గోపాల పంచవింశతి నిరోష్ఠ్య దాశరథీ తారావళి, రామాక్షర మాలిక, లక్ష్మీనృసింహ పంచాశత్తు. తెలుగు రచనలు హనుమత్తారావళి, వెంకటేశ్వర తారావళి, చిత్తవృత్త శతకం, చిత్తబోధ శతకం మొదలైనవి.
-వేపూరు హనుమద్దాసు (19వ శతాబ్దం): ఈయన భక్తకవి, తత్తకవి. మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి తాలూకా వేపూరు గ్రామ నివాసి. ఇతడికి పరాంకుశుడు అనే పేరు కలదు. ఈయన రచనలు శారదా రామాయ ణం, సీతా కల్యా ణం, కృష్ణలీలలు, రామమూర్తి శతకం, పుత్రకామేష్ఠి, బతుకమ్మ పాట, బొబ్బిలి బుర్రకథ మొదలైనవి.
-కైరం భూమదాసు (1875-1950): ఈయన అసలు పేరు పురుషోత్తమ కవి. కరీంనగర్ జిల్లా రాయికల్ గ్రామ నివాసి. గౌడ కులంలో పుట్టి రామానుజ మతం స్వీకరించి కవిత్వం రాసి భూమదాసుగా ప్రసిద్ధిగాంచాడు. ఇతడి రచనల్లో ముఖ్యమైనది రావికంటి రామచంద్ర శతకం.
-గడ్డం రామదాసు: ఇతడి స్వస్థలం సిద్దిపేట. మిట్టదొడ్డి ఇతడి నివాసమని మరొక అభిప్రాయం కూడా ఉంది. ఈయన రచనలు కాళింగ మర్థనం, విప్రనారాయణ చరిత్రం, ప్రభావతీ విలాసం, కుచేలోపాఖ్యానం, సత్యవర్మ, ఇంద్ర సభ, మాంధాత చరిత్రం మొదలైనవి.
-పుల్లంరాజు నరసింగరావు (19వ శతాబ్దం): ఈయన బూర్గుల రామకృష్ణారావు ముత్తాత. ఇతడి రచనలు నృపకేసరీ శతకం, రామానుజ సుప్రభాతం.
-పెద్దమందడి వెంకట కృష్ణకవి (19వ శతాబ్దం): ఈయన స్వస్థలం మహబూబ్నగర్ జిల్లా బిజినేపల్లి మండలంలోని ఖానాపురం. ఇతడికి కవి శరభ అనే బిరుదు కలదు. ఇతడి రచనలు తిరుమనాథ శతకం, వీరాయపల్లె చెన్నకేశవ శతకం, కేశవ విలాసం, మారుతీ విలాసం మొదలైనవి.
-పరశురామ నృసింహదాసు కవి (19వ శతాబ్దం): అచల గురు పరంపరలో పరశురామ నృసింహదాసు ఒకడు. ఇతడి రచన భద్రాద్రి రామశతకం.
మాదిరి ప్రశ్నలు
1) తాలాంక నందినీ పరిణయం గ్రంథ రచయిత?
1) చిత్తారు గంగాధరయ్య
2) మరింగంటి వెంకటనరసింహాచార్యులు 3) కానూరి వీరభద్రకవి
4) చెన్నూరి శోభనాద్రి
2) మహాయోగి అయిన కవి ఎవరు?
1) ధర్మపురి శేషయ్య 2) దున్నా ఇద్దాసు
3) తూము రామచంద్రారెడ్డి
4) కాకుత్సం నరసింహదాసు
3) భాగవతుల కృష్ణదేశికుడి రచన?
1) ఆధ్యాత్మ తత్త కీర్తనలు
2) శుద్ధ నిర్గుణ తత్త కందార్థ దరువులు
3) వేదాంత వార్తికం 4) పైవన్నీ
4) కిందివాటిలో సరైనది కానిది?
1) కంబుకంధర చరిత్ర – తడకమళ్ల కృష్ణారావు
2) సుబోధ రత్నమాల – ఫీల్ఖానా లక్ష్మణ దేశికుడు
3) భక్తజన ముక్తావళి – ఫీల్ఖానా శంకర ప్రభువు
4) భక్తానందసాగరం – తూము రామదాసు
5) పరాంకుశుడు అనే పేరుగల కవి?
1) వారణాసి రామయ్య
2) వేపూరు హనుమద్దాసు
3) కైరం భూమదాసు 4) గడ్డం రామదాసు
6) భద్రాద్రి రామ శతకం రచించిన అచల గురువు?
1) పరశురామ నృసింహదాసు
2) కంచర్ల గోపన్న
3) వేపూరు హనుమద్దాసు
4) దున్నా ఇద్దాసు
జవాబులు: 1-2, 2-3, 3-4, 4-4, 5-2, 6-1
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు