తెలంగాణలో వేములవాడ చాళుక్యులు
‘రాష్ట్రకూట రాజులకు సామంతులు’గా తెలంగాణ ప్రాంతంలో బోధన్, వేములవాడలను రాజధానులుగా చేసుకొని పరిపాలించిన వారు వేములవాడ చాళుక్యులు. బాదామి చాళుక్యవంశ చక్రవర్తి అయిన రెండోపులకేశి వీరి మూలపురుషుడు. కరీంనగర్ జిల్లాలోని ‘వేములవాడ’ను రాజధానిగా చేసుకొని తెలంగాణ వాయువ్య ప్రాంతాన్ని పాలించినవాడు సత్యాశ్రయ రణవిక్రముడు. కానీ వినయాదిత్య యుద్ధమల్లుడు నిజమైన స్థాపకుడుగా చెప్పుకోవచ్చు.
యుద్ధమల్లుడు (750-80ఏడీ): రాష్ట్రకూట స్థాపకుడైన దంతిదుర్గుడి సేనానిగా పలు యుద్ధాల్లో పాల్గొని అతని విజయాల్లో కీలకపాత్ర పోషించాడు. ఇతని ప్రతిభకు మెచ్చి పోతన్(బోధన్) ప్రాంతానికి సామంతుడిగా నియమించినట్లు చరిత్రకారులు భావించారు. (చరిత్రకారులంటే ప్రస్తుత తెలంగాణపై అనేక మంది చరిత్రను రచించి వ్యాపారపరంగా ఉపయోగించుకుంటున్నారు. ఇప్పుడు 100కు పైగా తెలంగాణ చరిత్రను రాసి ఉన్నారు. అభ్యర్థులు ఏది చదవాలో? ఏది నిజమైనదో ? ఏది అవాస్తవమో! తెలియక తాము నమ్మిందే వాస్తవాలనే భ్రమలో ఉంటారు. అలాంటి దశలో సివిల్స్ స్టాండర్డ్‌లో ఉన్న ప్రామాణిక గ్రంథంలోని అంశాలను వాస్తవంగా ఎంచుకోవాలి. ఉదా౹౹ బహమనీ రాజ్యం ఏర్పడిన సంవత్సరం ఏది ? అంటే పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు ఎవరైనా ఠకీమనీ 1347 ఏడీ అనిచెప్తారు. కానీ మార్కెట్లో ఉన్న పుస్తకంలో 1341 అని ముద్రితమైంది. దానిని 1347గా సరిచేసుకొని చదువుకోవాలి. ఇదంతా ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే ఈ మధ్యకాలంలో ఒకరు బహమని రాజ్యం స్థాపితమైంది 1341 అని రాశారు. 1347 కదా? ఇలా తప్పురాస్తే పిల్లల భవిష్యత్ ఏంటి? అనేది వారికి ప్రశ్న. మరొక ఉదా౹౹ శాతవాహన రాజులు 31మంది అని చివరివాడు 4వ పులోమావి అని రాశారు. వాస్తవానికి 30 మంది రాజులు.. చివరిరాజు 3వ పులోమావి. అందుకే ఎవరి పుస్తకాల్లో ఏమి వచ్చినా సరిచేసుకొని చదువుకోవాలి. అంతేగాని ఫలానా పుస్తకంలో అలా ఉంది. ఇలా ఉంది? లాంటి ప్రశ్నలు మీలో రానొద్దు. ఎన్ని పుస్తకాలు, ఎన్ని వ్యాసాలు చదివినా మీకు కావాల్సిన ముఖ్యమైన అంశాలను నోట్ చేసుకోండి. ఫలానా కోచింగ్ సెంటర్ వారు హన్మకొండ నుంచి ఓరుగల్లుకు రాజధానిని మార్చిన కాకతీయ రాజు ఎవరు? దానికి ఫలానా కోచింగ్ వారు ప్రతాపరుద్రుడు-1 అని చెప్పారు. మీరేమో గణపతిదేవుడు అని రాశారు? ఇలాంటివి ఇంకా చాలా ప్రశ్నలు అడుగుతున్నారు. అంటే ఇలాంటి ప్రశ్నలకు కూడా నిజమైన సమాధానాలు తెలియకుండా ప్రస్తుత పోటీ ప్రపంచంలో మీరు ఎలా నెగ్గుతారు? కాబట్టి ప్రామాణిక గ్రంథాలనే చదువుకోండి. మీరు వేలకు వేలు వెచ్చించి ఫంక్షన్హాల్లో కోచింగ్ తీసుకుంటే లాభం ఎవరికో ఒక్క క్షణం ఆలోచించండి.)
వినాయాదిత్య యుద్ధమల్లుడు : ఇతని కాలంలో నిజామాబాద్ జిల్లాలోని ఇందూరు బోధన్‌ను రాజధానిగా చేసుకొనెను. అనేక రాజ్యాలను జయించి చిత్రకూట దుర్గాన్ని జయించి ‘సపాదలక్ష దేశాన్ని ఏలినట్లు ‘వేములవాడ’ శాసనంలో వివరాలు ఉన్నాయి. ‘సపాదలక్ష’ (లక్ష 25వేల ఆదాయం వచ్చు ప్రాంతం). అంటే నేటి కరీంనగర్ ఆదిలాబాద్ జిల్లాలను ఆ కాలంలో సపాదలక్ష దేశమని పిలిచేవారు.
# ‘మొదటి అరకేసరి’ యుద్ధమల్లుని కుమారుడు. ఇతడు రాష్ట్రకూట రాజైన ధ్రువుని సామంతుడిగా ఉండి, తూర్పు చాళుక్యరాజైన 4వ విష్ణువర్ధనుడితో జరిపిన యుద్ధాల్లో పాల్గొన్నట్లు ‘కొల్లిపరశాసనం’ తెలుపుతుంది. ధ్రువుడు వేంగి, త్రిళింగలను జయించినట్లు కన్నడ ఆదికవి పంప రాసిన ‘విక్రమార్కవిజయం’ గ్రంథంలో పేర్కొనెను. అరికేసరి సాధించిన విజయాలకు గుర్తుగా ధ్రువుడు తెలంగాణలో జయించిన వేములవాడ, నాగర్‌కర్నూల్, దేవరకొండ, పెద్దవూర మొదలైన ప్రాంతాలను ఇచ్చివేసెను.
#అరికేసరి తర్వాత అతని పెద్దకుమారుడు నరసిండు, మనుమడు రెండో యుద్ధమల్లుడు పాలకులైనారు. మరొక మనుమడైన బద్దెగుడు వేములవాడ చాళుక్యులలో పేరెన్నిక గలవాడు. ఇతనికి ‘సొలదగండ’ అను బిరుదు ఉన్నది. సొలదగండ అనగా నలభైరెండు యుద్ధాలు చేసిన వీరుడు అని అర్థం. ఇతడు రాష్ట్రకూట రెండో కృష్ణుడికి సామంతుడు. ఇతడు తూర్పుచాళుక్యుల్లో గొప్పరాజైన గుణగవిజయాదిత్యునితో యుద్ధం చేసి ఓడిపోయేను. గుణగవిజయాదిత్యుడి మరణం తర్వాత వేంగిపై తిరిగి దండయాత్ర చేసి (రాష్ట్రకూట రాజు రెండో కృష్ణుడు సైనిక సహాయం చేసెను) మొదటి చాళుక్యభీమున్ని ఓడించి బంధించినట్లు ‘పర్బని శాసనం’లో పేర్కొనబడెను.
# రెండో నరసిండు బద్దెగుడి కుమారుడు. ఇతడు రాష్ట్రకూట రాజైన మూడో ఇంద్రుడితో కలిసి ఉత్తరదేశ దండయాత్రలలో పాల్గొనెను. ఇతడు లాట దేశమును, సప్తమాళ్వలను జయించి కాలప్రియ లేదా కల్పి అనే చోట జరిగిన యుద్ధంలో ప్రతీహార, పాలవంశం (మహిపాలుడి)లను ఓడించినాడు. తన సైన్యాలను యమునానది దాటి కన్యాకుబ్జం లేదా కనోజ్(గతంలో ఇది హర్షుడికి రాజధానిగా వెలుగొందిన పట్టణం) నగరం చేరి తన గురాలను గంగానది పవిత్ర జలాన్ని తాగించినాడు. ఇతని శక్తి సామార్థ్యాలకు మెచ్చి 3వ ఇంద్రుడు తన సోదరి జాకవ్వను ఇచ్చి పెళ్లి చేశాడు. వీరికి కలిగిన కుమారుడే రెండో అరికేసరి.
రెండో అరికేసరి (930-955): ఇతడు వేములవాడ చాళుక్యుల్లో గొప్పవాడు. చాళుక్యరాజులందరిలో అగ్రగణ్యుడు. రాష్ట్రకూట రాకుమార్తె అయిన లోకాంబికను పెళ్లి చెసుకొని రాష్ట్రకూట, వేములవాడ చాళుక్య రాజ్యాల సంబంధాలను పటిష్ఠం చేశాడు.
#రెండో అరికేసరి కాలంలో రాష్ట్రకూట రాజ్యంలో వారసత్వ యుద్ధం జరిగెను (వారసత్వ యుద్ధం అంటే సింహాసనం కోసం సోదరుల మధ్య వచ్చే విభేదాలు కావచ్చు, తండ్రి కుమారుల మధ్యనూ కానొచ్చు). ఈ వివాదంలో రెండో అరికేసరి జోక్యం చేసుకొని 4వ గోవిందుని ఓడించి (అతనికి అనుకూలురైన వారిని సింహాసనంపై కూర్చుండ బెట్టెను) ఇతని చిన్నాన్న బద్దెగుడుని సింహాసనంపై కూర్చోబెట్టాడు. రెండో అరికేసరి గొప్ప కన్నడ భాషా పోషకుడు.(రాష్ట్రకూటుల రాజభాష కన్నడం, వారి రాష్ట్ర అధికార చిహ్నం వరాహం) కన్నడ ఆదికవి పంపడు ఇతని ఆదరణలో మహాభారత కథతో అరికేసరి కథను జోడించి ‘విక్రమార్జున విజయం’ అనే కన్నడ గ్రంథం రచించెను.
#రెండో అరికేసరి తర్వాత అతని కుమారుడు వాగరాజు అతని తర్వాత లోకాంబికకు జన్మించిన మరొక కుమారుడు రెండవ బద్దెగుడు వరుసగా రాజులైనారు. బద్దెగుడు వేములవాడలో సోమదేవసూరి అనే జైన పండితుడి కోసం ‘శుభదామజీనాలయం’ నిర్మించాడు.
# వేములవాడ చాళుక్యుల్లో చివరివాడు మూడో అరకేసరి. అతడు రాష్ట్రకూట రాజైన మూడోకృష్ణుడికి సమాకాలీనుడు. ఇతడు ప్రసిద్ధ జైన సమయాచార్యుడైన శద్వాదచలసింహ్మ బిరుదాంకితుడైన ‘సోమదేవసూరి’ని ఆదరించాడు. తన తండ్రి నిర్మించిన ‘సుభదామజీనాలయం’ను ఆచార్య సోమదేవుడికి దానం చేశాడని పర్బనిశాసనంలో పేర్కొనబడెను. రాష్ట్రకూటులతోపాటు వేములవాడ చాళుక్యులు కూడా అంతరించారు.
వేములవాడ చాళుక్యుల చరిత్రకు ఆధారాలు
#మొదటి అరికేసరి – కొల్లిపర శాసనం
#రెండో అరికేసరి – వేములవాడ శిలాశాసనం
# మూడో అరికేసరి – పర్బనీ తామ్రశాసనం
సాహిత్య ఆధారాలు
పంపకవి: ఆదిపురాణం గ్రంథకర్త పంపకవిని 2వ అరికేసరి ఆదరించెను. 2వ అరికేసరి పంపకవిని కవితాగణార్ణువుడు అనే బిరుదుతో సత్కరించెను. ఆదిపురాణానికి మూలమైన గ్రంథం జినసేనుడు సంస్కృతంలో రచించిన ‘పూర్వపురాణం’ వృషభనాథుని పంచకళ్యాణాలు దీనిలోని ఇతివృత్తం.
1. పంపకవి: కన్నడత్రయంలో ఆదికవి
2. పొన్నడు : శాంతిపురాణం లేదా పురాణచూడామణి గ్రంథకర్త.
3. రన్నడు : ఇతడికి ఉభయ కవి చక్రవర్తి అనే బిరుదు ఉంది. పై ముగ్గురిని కన్నడ కవిత్రయంగా పేర్కొంటారు.
సోమదేవసూరి : యుక్త చింతామణి సూత్ర, కథాసరిత్సాగరం, యశోధర మహారాజు కథ, నీతివాక్యామృతం మొ౹౹న గ్రంథాలు రచించి, 3వ అరికేసరి రాజు ఆస్థానంలో నివసించెను. ( 3వ అరికేసరి ఇతనికి శద్వాదచలసింహ్మ, వాక్కుకల్లోలపయోనిధి, కలవికులరాజు, మొ౹౹న బిరుదులు ఇచ్చి సత్కరించారు. )
# వీరి కాలంలోనే తూర్పు చాళుక్యరాజులు వేములవాడ (కరీంనగర్)ను ప్రసిద్ధ జైన క్షేత్రంగా అభివృద్ధి చేసిరి. మొదట ఈ ప్రాంతంలో జైనమతం వ్యాపించి ఉండెను.
ముదిగొండ చాళుక్యులు
# తెలంగాణలో వర్ధిల్లిన రెండో రాజ్యం ముదిగొండ చాళుక్యరాజ్యం. వీరి రాజధాని ఖమ్మం జిల్లాలోని ముదిగొండ. అందువల్లనే వీరికి ముదిగొండ చాళుక్యులు అనే పేరు వచ్చింది. ముదిగొండ కొరవిసీమలో ఉన్నది. కొరవిసీమ ముంచికొండనాడులో ఉన్నది. వేంగికి పశ్చిమ సరిహద్దులో గోదావరి నుంచి కృష్ణానది వరకు విస్తరించిన ప్రదేశమే నాడు ముంచికొండనాడుగా పిలువబడేది. ఈ విధంగా వీరి రాజ్యం కృష్ణాజిల్లాలోని కొండపల్లి నుంచి వరంగల్ జిల్లాలోని కొరవి వరకు వ్యాపించి ఉండేది. ముదిగొండ చాళుక్యులు తూర్పుచాళుక్యులకు సామంతులు. వీరు తూర్పుచాళుక్యుల పక్షాన రాష్ట్రకూటులతో అనేక యుద్ధాలు చేశారు. ముదిగొండ చాళుక్యుల పుట్టుపూర్వోత్తరాలు తెలియవు. వీరి అధికారం బశా క్రీ.శ. 9వ శతాబ్దంలో ప్రారంభమై క్రీ.శ. 13వ శతాబ్దంలో అంతమైందని చెప్పవచ్చు.
# ముదిగొండ చాళుక్యవంశ మూలపురుషుడు కొక్కిరాజు. ఇతడు క్రీ.శ. 9వ శతాబ్దంలో ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న రణవర్ధనుని పుత్రికను పెళ్లి చేసుకొని ఆమెతోపాటు రాజ్యాన్ని కూడా పొందాడు. ముదిగొండ చాళుక్యుల్లో సుప్రసిద్ధ్దుడు మూడో కుసుమాయుధుడు. ఇతడు కొక్కిరాజు కుమారుడు. రాష్ట్రకూట చక్రవర్తి రెండో కృష్ణుడు (క్రీ.శ. 880-912) వేంగి మొదటి చాళుక్యభీముని (క్రీ.శ.892-921) బంధించినపుడు రాష్ట్రకూటులను ఓడించి మొదటి చాళుక్య భీముని బంధవిముక్తున్ని చేసి తిరిగి సింహాసనంపై ప్రతిష్ఠించాడు. ఇందుకు ప్రతిఫలంగా చాళుక్యభీముడు ఇతనికి అర్ధరాజ్యాన్ని ఇచ్చి గౌరవించాడు.
# కుసుమాయుధునికి ‘గొణగుడు’, ‘బిజయితడు’ అని ఇద్దరు కుమారులున్నారు. కుసుమాయుధుని తరువాత గొణగుడు కొంతకాలం పాలించాడు. తరువాత బిజయితడు రాజ్యానికి వచ్చాడు. ఇతనికి నిరవద్యుడు, విజయాదిత్యుడు అనే బిరుదులున్నాయి.
#నిరవద్యుడు రాష్ట్రకూట నాల్గవ గోవిందుని (క్రీ.శ. 918-935)దాటికాగలేక వేములవాడ చాళుక్యుడైన రెండో అరికేసరిని ఆశ్రయించాడు. రెండు అరికేసరి రాష్ట్రకూట గోవిందుని ఓడించాడు. గొణగుని పుత్రుడైన బద్దెగుడు పోదననాటి(బోధన్ ప్రాంతం)లో అరికేసరి సామంతుడిగా క్రీ.శ. 941లో ఒక శాసనం వేయించాడు.
#నిరవద్యుడు అతని సంతతివారు తూర్పు చాళుక్యులకు సన్నిహితులై వారి యుద్ధాల్లో తొడ్పడ్డారు. రెండో చాళుక్యభీముని రాజ్యకాలం(క్రీ.శ. 934-945)నాటికి నిరవద్యుడు ‘కొరవి’లో సుస్థిరంగా ఉన్నాడు.
#నిరవద్యుని తరువాత నాల్గవ కుసుమాయుధుడు, బేతరాజు, ఐదవ కుసుమాయుధుడు, బొట్టు బేతరాజులు వరుసగా రాజ్యం చేశారు. వీరిలో బొట్టు బేతరాజుకు వినతజనాశ్రయుడనే బిరుదు ఉన్నది . ఇతడు మిరియాల ఎర్నసేనాని సహాయంతో కాకతి నాల్గవ గుండనను చంపి అతని కుమారుడైన బేతనను రాజ్యభ్రష్టుని చేసి కొరవి రాజ్యాన్ని ఆక్రమించినట్లు, ఎరన భార్య కమసాని చిన్నవాడైన కాకతి బేతన పక్షం వహించి చాళుక్య చక్రవర్తికి చెప్పి అతనికి అనుమకొండ రాజ్యం ఇప్పించినట్లు మిరియాల మల్లన వేయించిన గూడూరు శాసనం వల్ల తెలుస్తున్నది.
# బొట్టు బేతరాజు తరువాత అతని కుమారుడు ఆరో కుసుమాదిత్యుడు రాజ్యానికి వచ్చాడు. కాకతీయ రుద్రమదేవుడు ఇతన్ని ఓడించి తరిమివేయగా ఇతడు పన్నెండేళ్లు అజ్ఞాతవాసం చేసి తిరిగి తన రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు. కానీ కాకతీయ సేనాని రేచర్ల రుద్రుడు ఇతన్ని ఓడించి తెలంగాణ నుంచి తరిమివేశాడు. తరువాత వీరు తీరాంధ్రదేశంలోని కొలని మండలం చేరి అక్కడ ప్రభువుల ఆశ్రితులైనారు.
మాదిరి ప్రశ్నలు
1. కిందివానిలో అవాస్తమైనది ఏది? (వేములవాడ రాజుల్లో) (4)
1. 2వ అరికేసరి గొప్పవాడు
2. బద్దెగుడు-సోమలగండడు
3. యుద్ధమల్లుడు రాజ్యస్థాపకుడు
4. చివరిరాజు 4వ అరికేసరి
2. పంపకవిని పోషించినది 2వ అరికేసరికి సంబంధించి అంశాలలో సరితూగనిది ఏది? (1)
1. శాంతిపురాణం రచించెను
2. ఆదిపురాణం రచించెను
3. కవితాగణార్ణవుడు అనే బిరుదు ఉన్నది
4. పంచకళ్యాణాలు ఇతివృత్తంగా తన రచనలో పేర్కొనెను.
3. సోమదేవసూరి వాక్కుకల్లోలపయోనిది అనే బిరుదు పొందిన గొప్పకవికి సత్యదూరమైన అంశం ఏది? (1)
1. రెండో అరికేసరి ఆస్థానంలో నివసించెను
2. యుక్తచింతారుణి గ్రంథకర్త
3. నీతివాక్యామృతం రచించెను.
4. యశోధర మహారాజు చరిత్ర రచించెను.
డా౹౹ మురళి
అసిస్టెంట్ ప్రొఫెసర్
నిజాం కళాశాల, హైదరాబాద్.
9701674383
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు