Vishnu Kundinu | విష్ణుకుండినుల మతపరిస్థితులు
వైదిక మతావలంబికులు
విష్ణుకుండినులు వైదిక మతావలంబికులు. శ్రీపర్వతస్వామి వారి కులదైవం. పరమ మహేశ్వర, పరమ బ్రాహ్మణ్య వంటివి వారి బిరుదులు. వారు శివభక్తులని, బ్రాహ్మణ మతావలంబికులని శాసనాలు తెలియజేస్తున్నాయి. వీరు కట్టించిన ఆలయాలు ఎక్కువగా వారి తొలి రాజధాని అమ్రాబాద్ మండలంలో గల నల్లమల అడవుల్లోని లోయల్లో, జలపాతాల కింద గుహల్లో ఉన్నాయి. మనం గమనించాల్సిన విచిత్రమైన విషయమేమంటే అక్కన్న-మాదన్న గుహలు, అక్కన్న-మాదన్నలు కట్టించినట్లుగా చెప్పబడుతున్న దేవాలయాలన్నీ విష్ణుకుండిన రాజు రెండో మాధవ వర్మ కట్టించినవే. ఇలాంటి వాటిల్లో బెజవాడ (ఇంద్రకీలాద్రి) కనకదుర్గ ఆలయ సముద్రంలోని అక్కన్న-మాదన్న గుహలు, కీసరగుట్టలో అక్కన్న-మాదన్నలు కట్టించినట్లుగా చెప్పబడుతున్న మందిరాలు, హైదరాబాద్ శివార్లలోని మహేశ్వరం ఆలయం పేర్కొనదగినవి. రెండో మాధవవర్మ ఎక్కువగా రామలింగేశ్వరాలయాలను కట్టించాడు. ఆయన యుద్ధంలో విజయం సాధించిన ప్రతిచోటా ఈ ఆలయాలను కట్టించాడు. అంతేకాకుండా తను సాధించిన అనేక విజయాలకు గుర్తులుగా, ఒక్కొక్క విజయానికి ఒకటి చొప్పున, కీసరగుట్టపైన రామేశ్వర లింగ ప్రతిష్టలు చేశాడు. విష్ణుకుండినులు వైష్ణవులు కాబట్టి శివలింగాలను రామ లింగాలన్నారు. రెండో మాధవవర్మ స్నానపు పుణ్యోదక పవిత్రీకృత శీర్షః (పుణ్య స్నానాలచే పవిత్రమైన శిరస్సు కలవాడు) అని వర్ణించబడ్డాడు. విష్ణుకుండినులు అనేక యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించారు.
బౌద్ధమతం
విష్ణుకుండిన రాజులు వైదిక మతస్తులైనప్పటికీ బౌద్ధమతాన్ని పోషించారు. గోవిందవర్మ తన 37వ రాజ్య సంవత్సరం, వైశాఖ పూర్ణిమ నాడు పద్దెనిమిది శాఖల బౌద్ధధర్మం తెలిసిన దశబలబలికి 14వ ఆర్య సంఘాన్ని ఉద్దేశించి తన రాణి ఇంద్రపాలనగరంలో కట్టించిన పరమ భట్టారికాదేవి విహారానికి పేణ్కవతి, ఎన్మదల గ్రామాలను దానం చేశాడు. అదే విహారానికి తర్వాత వచ్చిన విక్రమేంద్రవర్మ ఇరుణ్డెరో గ్రామాన్ని దానం చేశాడు. అంతేకాకుండా విక్రమేంద్రవర్మ అశనపుర ఆర్య సంఘానికి త్రిలోకాశ్రయ రాజమహా విహారాన్ని కట్టించి, దాని ప్రతినిధి సంఘదాసునికి గ్రామాలను, వాటి తోటలతో సహా దానం చేశాడు. ఆనాటి బౌద్ధమతంలో చోటుచేసుకున్న ముఖ్య పరిణామమేమంటే ఆ మత సంఘాలు, ఆరామ-విహారాల్లో బ్రాహ్మణాధిక్యం చోటుచేసుకోవడం గోవిందర్మ శాసనంలో అనంత బ్రాహ్మణ సంభారస్య అనే విహార ప్రతిష్టాపన సందర్భంలో చెప్పబడటం ఇందుకొక నిదర్శనం. ఈ బ్రాహ్మణులు క్రమంగా బుద్ధుడిని, విష్ణువు తొమ్మిదో అవతారంగా చిత్రించారు. కాబట్టి కొన్ని బౌద్ధ క్షేత్రాలు వైష్ణవ క్షేత్రాలుగా మారాయి. అయితే బౌద్ధమతాన్ని పోషించిన చివరి తెలుగు రాజులు విష్ణుకుండినులు.
బౌద్ధమతానికి సంబంధించిన చివరి గొప్ప తత్వవేత్తలు విష్ణుకుండినుల రాజ్యంలో నివసించారు. ఐదో శతాబ్దానికి చెందిన తర్క పండితుడు దిగ్నాగుడు కొంతకాలం వేంగిలో నివసించాడు. అక్కడ ఆయన సాంఖ్యకారికా రచయితలైన ఈశ్వర కృష్ణుడితో వాగ్వాదాలు జరిపాడు. మరికొంత కాలం ఆయన పెద్దపల్లి జిల్లా రామగిరి, జగిత్యాల జిల్లాలోని మునులగుట్ట ప్రాంతంలో జీవించినట్టు కాళిదాసు రచన మేఘసందేశం వల్ల తెలుస్తుంది. దిగ్నాగుడు వందకుపైగా రచనలు చేశాడు. ప్రమాణ సముచ్ఛయం అనే ప్రసిద్ధ గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు. యోగాచార పంథాను బోధించాడు. తెలుగు ప్రాంతానికి చెందిన బౌద్ధ మహా పండితుల్లో ఇతనిని చివరివాడుగా చెప్పవచ్చు. క్రీ.శ. ఐదో శతాబ్దం నాటికి అమరావతి, నాగార్జునకొండ ప్రాంతాల్లో బౌద్ధమతంలో మరో ప్రధాన శాఖ అయిన వజ్రయానం రూపుదిద్దుకుంది. ఈ శాఖలోని బౌద్ధ సంఘంలోకి స్త్రీలు, మద్యమాంసాలు, మాయామంత్రాలు ప్రవేశించి క్రమక్రమంగా పవిత్రతను, తద్వారా ప్రజాభిమానాన్ని కోల్పోయాయి.
సారస్వతాభివృద్ధి
విష్ణుకుండినులు ఘటికా స్థానాలను ఏర్పాటుచేసి, వాటిల్లో వేద విద్యలను పోషించారు. వేదాభ్యసన అధ్యయనాలు చేసే బ్రాహ్మణులకు విష్ణుకుండినులు అగ్రహారాలిచ్చారు. ఈ అగ్రహారాల్లో వ్యవసాయాభివృద్ధి కూడా జరిగింది. హైదరాబాద్ శివార్లలోని ఘట్కేసర్, విష్ణుకుండినుల నాటి ఘటికాస్థానమే అనడానికి నిదర్శనంగా, దానికి దగ్గరలోని కీసరగట్టుపై వీరి కాలపునాటి కట్టడాలు బయల్పడ్డాయి. బ్రాహ్మణులు అగ్రహారాలు, దానధర్మాలు పొందారు. అనేక విద్యా సారస్వతాల్లో నిష్ణాతులు. బౌద్ధమత గురువు దశబలబలి నాలుగు వేదాల్లో విశారదుడు. సర్వశాస్ర్తాల్లో పారంగతుడు. పద్దెనిమిది బౌద్ధ ధర్మాలు తెలిసినవాడు. సకల జ్ఞాని అని శాసనం ద్వారా తెలుస్తుంది. గోవిందవర్మ షడభిజ్ఞ అని వర్ణించబడ్డాడు.
విక్రమేంద్ర వర్మకు మహాకవి, పరమ సోగతస్య (బుద్ధుని అంతటి జ్ఞాని) అనే బిరుదులున్నాయి. ఇంద్రభట్టారక వర్మకు ఘటికావాపు పుణ్య సంచయ అనే బిరుదు ఉంది. రెండో మాధవ వర్మ విద్వద్విజగురు విప్రావృద్ధ తపస్వీ జనాశ్రయం అని కీర్తించబడ్డాడు. ఈ బిరుదులు విష్ణుకుండిన రాజులందరూ స్వయంగా కవి పండితులని, కవి పండిత పోషకులని తెలియజేస్తున్నాయి. వీరి కాలం ప్రత్యేకత ఏమిటంటే వీరి కాలం నాటికి ప్రాకృతం తెరమరగై, దాని స్థానంలో సంస్కృతం రాజభాష అయింది. బౌద్ధమతం కనుమరగు కావడంతో పాటే బౌద్ధ భాష ప్రాకృతం కూడా కనుమరుగైంది. అయితే సామాన్య ప్రజల భాష మాత్రం తెలుగు విక్రమేంద్ర వర్మ చిక్కుళ్ల శాసనంలో (సంస్కృతం) విజయరాజ్య సంవత్సరంబుళ్ అనే మాట ఉంది. అందులో ంబుళ అనే పద భాగం తెలుగుది. అలాగే కీసరగుట్టపై ఉన్న ఒక గుండుకు తొలుచువాండ్లు అనే అచ్చ తెలుగు పదం చెక్కబడింది. అంతేగాకుండా విష్ణుకుండినుల శాసనాల్లో పేర్కొన్న గ్రామాల పేర్లన్నీ తెలుగువే. ఉదా.. కుడవాడ, వెలిమ్చలి, మరొకకి, కళిక, పెరువాటిక, పెణ్కపర, తుండి, నేత్రపాటి విషయం జనాశ్రయ చంధోవిచ్ఛిత్తి అనే సంస్కృత చంధో గ్రంథంలో కూడా తెలుగు భాషా ప్రస్తావనలు చాలా ఉన్నాయి.
వాస్తు, శిల్ప కళాభివృద్ధి
వీరి కాలంలో వాస్తు నిర్మాణాలు కొత్త శైలిని సంతరించుకున్నాయి. విష్ణుకుండినుల రాజధానులైన అమ్రాబాద్, ఇంద్రపాలనగరం, కీసరగుట్టల్లో వీరి కోటలున్నాయి. కీసరగుట్ట కింద చెరువుని ఆనుకొని విశాల భవనాలు, అంతఃపురాలు, శివాలయాలు, శక్తి ఆలయాలు ఎన్నో ఇటుకలతో నిర్మితమై ఇప్పటికీ వెలుగు చూస్తూనే ఉన్నాయి. భువనగిరి కోటను కూడా మొదట వీరే కట్టించినట్టు తెలిపే వారి రాజ చిహ్నం, లంఘిస్తున్న సింహం శిల్పాలు ఆ కోటగోడల మీద కనిపిస్తాయి. విష్ణుకుండినుల కాలంలో రాజులు, రాజ బంధువులు, ఇతర ధనికులు కట్టించి అభివృద్ధి చేసిన బౌద్ధ విహారాలు, ఆరామాలు ప్రధానంగా హైదరాబాద్లోని చైతన్యపురి, నల్లగొండ జిల్లాలోని ఇంద్రపాలనగరం, ఫణిగిరి, తిరుమలగిరి, గాజులబండ, నేలకొండపల్లి ప్రాంతాల్లో వెలుగుచూశాయి. చైతన్యపురిలో గోవిందవర్మ రాజ విహారాన్ని కట్టించగా, అతని పట్టపురాణి ఇంద్రపాలనగరంలో తన పేరుమీదనే పరమభట్టారికా మహాదేవి విహారాన్ని కట్టించింది. అలాగే మంథని పట్టణం చుట్టుపక్కల ఉన్న ఎల్ మడుగుపై ఉన్న గుహలు, గౌరీగుండం జలపాతంపై ఉన్న గుహల్లో కనిపించే మంటప స్తంభాలపై వీరి కాలపు చైత్యాలంకరణలు కనిపిస్తున్నాయి. వీరి కాలంలో ఉమామహేశ్వరం, సలేశ్వర గుహలు, అలంపుర శైవ, శక్తి ఆలయాలు వెలుగొందాయి. ఉమామహేశ్వరం తర్వాతి కాలంలో శ్రీశైల క్షేత్రానికి ఉత్తర ద్వార క్షేత్రంగా ప్రసిద్ధి. ఉమామమహేశ్వరంలో పల్లవులు చెక్కించిన శివలింగం, విష్ణుకుండినులు వేయించిన నగరభేరి ఇప్పటికీ ఉన్నాయి.
అయితే అలంపురం విష్ణుకుండినుల కాలం కంటే ముందువారైన ఇక్షాకుల కాలం నుంచే మనుగడలో ఉందనే శాసనాధారం దొరికింది. ప్రకాశం, నెల్లూరు జిల్లా సరిహద్దులో ఉన్న భైరవకోనలో విష్ణుకుండినుల కాలపు గుహలు ఉన్నాయి. అంతేకాకుండా వీరు ఉండవల్లి, మొగల్రాజపురం, ఇంద్రకీలాద్రి అనే గుట్టల్లో కూడా అంతస్థులుగా చెక్కి, బౌద్ధ ఆరామ, విహారాలను నిర్మించారు. వీటి గోడలు లేదా స్తంభాల అడుగుభాగంలో శ్రీఉత్పత్తి పిడుగు అని రాసి ఉంది. ఈ విధంగా విష్ణుకుండినులు కృష్ణానదికి ఎగువ ఉన్న యావత్ తెలుగు దేశాన్ని రెండు శతాబ్దాలకుపైగా పాలించి, అంతకు ముందు మనుగడలో ఉన్న మిశ్రమ సంస్కృతి స్థానంలో హైందవ ప్రధాన సంస్కృతిని ప్రవేశపెట్టి, ఆ తర్వాత కాలపు రాజులకు మార్గదర్శకులయ్యారు. వీరి వాస్తు శిల్పకళా రీతులను పల్లవులు, చాళుక్యులు అనుసరించడం వీరి గొప్పతనంగా చెప్పవచ్చు.
మెక్గ్రాహిల్ ఇండియా 2017
ప్రామాణికమైన మెటీరియల్ను అందించే ప్రముఖ పబ్లిషర్స్ మెక్గ్రాహిల్ ఎడ్యుకేషన్ మరో విలువైన పుస్తకాన్ని విడుదలచేసింది. రాష్ట్రస్థాయి నుంచి సివిల్స్ సిద్ధమయ్యే వారికోసం హోం సెక్రటరీ రాజీవ్ మహర్షి రాసిన ఇండియా 2017 ఇయర్బుక్ని విడుదల చేసింది. ఈ పుస్తకంలో కరెంట్ అఫైర్స్, రాష్ట్ర పాలసీలు, పబ్లిక్స్కీమ్స్, ఎకానమీ, ప్రధాన సంఘటనలు, అవార్డులు, హిస్టరీ, కల్చర్, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి అన్ని అంశాలను సమగ్రంగా అందించారు. దీంతోపాటు వసుంధరరాజే, పనగరియా, అరవింద్ సుబ్రమణియన్, రిచిర్శర్మ వంటి ప్రముఖల వ్యాసాలు, విశ్లేషణలు దీనిలో పొందుపర్చారు. మార్చి 2017 వరకు అప్డేట్ చేసిన సమాచారాన్ని ఇచ్చారు. అంతర్జాతీయ అంశాలను కూడా సృ్పశించారు. పోటీపరీక్షలకు సిద్ధమయ్యేవారికి ప్రామాణిక మెటరీయల్గా ఉపయోగించుకొనేలా తీర్చిదిద్దారు. పుస్తకాలు అన్ని ప్రముఖ బుక్సెంటర్స్లో లభిస్తాయి.
వివరాలకు వెబ్సైట్: www.mheducation.co.in
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు