సహాయ నిరాకరణోద్యమం ( తెలంగాణ ఉద్యమ చరిత్ర)
జేఏసీ పిలుపు మేరకు తెలంగాణలోని పార్టీలన్నీ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం ఉద్యోగులు చేపట్టిన సహాయ నిరాకరణకు సంఘీభావం తెలిపాయి. 10 జిల్లాల్లో సహాయ నిరాకరణోద్యమం 2011, ఫిబ్రవరి 17 నుంచి మార్చి 4 వరకు వివిధ రూపాల్లో జరిగింది. దీనిలో భాగంగా ‘పల్లె పల్లె పట్టాలపైకి’ పేరుతో మార్చి 1న రైల్‌రోకో నిర్వహించారు.
మిలియన్ మార్చ్
-జేఏసీ ఆధ్వర్యంలో కేసీఆర్ 2011, మార్చి 10న హైదరాబాద్ నలుమూలల నుంచి ట్యాంక్‌బండ్‌పైన ‘మిలియన్ మార్చ్’ నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ మిలియన్ మార్చ్ ఈజిప్ట్ (కైరో)లోని తెహ్రీక్ క్ దిగ్బంధనను ఆదర్శంగా తీసుకొని నిర్వహించారు. ట్యాంక్‌బండ్ పైకి చేరుకున్న ఉద్యమకారులు అక్కడ ఉన్న విగ్రహాల్లో ఎక్కువగా ఆంధ్రులవి ఉండటంతో తెలంగాణ చరిత్రను, గొప్ప వ్యక్తులను మరుగున పడేస్తున్నారని భావించి విగ్రహాల ధ్వంసానికి పాల్పడ్డారు.
సకల జనుల సమ్మె
– తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు లక్ష్యంతో జేఏసీ పిలుపు మేరకు యావత్ తెలంగాణ ప్రజలు పోరాటానికి సన్నద్ధమయ్యారు. 2011, సెప్టెంబర్ 13 నుంచి మొదలైన ఈ సకల జనుల సమ్మె అక్టోబర్ 24 వరకు అంటే చరిత్రలోనే అరుదైన విధంగా 42 రోజులు నిర్వహించారు. సెప్టెంబర్ 13 నుంచి నిరవధిక సమ్మె ప్రారంభించడానికి ప్రజలను ఉద్యమంలో భాగస్వాములను చేయడానికి సెప్టెంబర్ 12న కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో జనగర్జన పేరుతో భారీ సభను నిర్వహించారు. తెలంగాణ ఉద్యమానికి మార్గ నిర్దేశం చేయడంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన హెచ్చరిక చేయడానికి ఉద్యమ సమర శంఖారావాన్ని ఈ వేదిక ద్వారా పూరించి సకల జనుల సమ్మెకు ఈ సభతో శ్రీకారం చుట్టింది జేఏసీ.
– సకల జనుల సమ్మె 2011, సెప్టెంబర్ 12న రాత్రి 12 గంటల నుంచి మొదలైంది. సమ్మెలో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులకు ఆదేశాలు జారీచేశాడు. విధులకు గైర్హాజరయ్యే ఉద్యోగుల వేతనాల్లో కోత విధించేందుకు జీవో నెం-177 అమలు చేయాలని ఆదేశించాడు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగ సంఘాలు ఈ రోజున సమ్మె సైరన్ మోగించడంతో 4 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. వీరితో విద్యార్థులు, కవులు, కళాకారులు తెలంగాణ యావన్మంది పోరాటబావుటా ఎత్తారు.
-సుమారు 134 ఉద్యోగ సంఘాలు ఈ సమ్మెలో పాల్గొన్నాయి. ఈ సమ్మెతో సచివాలయంలో 80 శాతం సీమాంధ్ర ఉద్యోగులే నిండిపోయిన వైనం బట్టబయలైంది. ఉద్యోగ నియామకాల్లో ఎంత దోపిడీ జరిగిందో తెలంగాణ యావత్ ప్రజానీకం చూశారు. తొలిరోజు సమ్మెతో సర్కారీ ఖజానాకు తెలంగాణ జిల్లాల నుంచి రూ.20 కోట్ల రెవెన్యూ ఆగిపోయింది. ఐదేండ్ల పసిపాప నుంచి 80 ఏండ్ల వృద్ధుల దాకా సమ్మెకు సైదోడుగా నిలిచారు. సమ్మెవల్ల తొలిరోజు రూ.1300 కోట్ల నష్టం జరిగిందని ఉద్యోగ వర్గాలు వెల్లడించాయి.
మానవహారం
-2010, ఫిబ్రవరి 4న ఆదిలాబాద్ నుంచి మహబూబ్‌నగర్‌లోని అలంపూర్ వరకు నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల మీదుగా మానవహారం నిర్వహించారు. ఫిబ్రవరి 5న 9వ జాతీయ రహదారిపై హైదరాబాద్, కోదాడల మధ్య నిర్వహించిన మరో మానవహారం విజయవంతమయ్యింది.
తెలంగాణ మార్చ్
-2012, సెప్టెంబర్ 30ని కేంద్రానికి గడువు తేదీగా జేఏసీ నిర్ణయించింది. ఈ గడువులో తెలంగాణ ప్రకటన రాకపోవడంతో జేఏసీ సెప్టెంబర్ 30న నెక్లెస్ రోడ్డులో తెలంగాణ మార్చ్ ని నిర్వహించింది.
సడక్ బంద్
-2013, మార్చి 21న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి సడక్ బంద్ నిర్వహించారు. శంషాబాద్ నుంచి అలంపూర్ వరకు సడక్ బంద్ చేపట్టారు.
సంసద్ యాత్ర
-2013, ఏప్రిల్ 29, 30 తేదీల్లో న్యూఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జేఏసీ సంసద్ యాత్రను నిర్వహించింది. ఈ యాత్ర కోసం ఢిల్లీకి ఉద్యమకారులను తరలించడానికి ‘తెలంగాణ ఎక్స్‌ప్రెస్’ అనే పేరుతో ప్రత్యేక రైలును దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాటు చేశారు.
సత్యాగ్రహ దీక్ష
– 2013, ఏప్రిల్ 29న తెలంగాణ సత్యాగ్రహం దీక్ష ప్రారంభమయ్యింది. ఈ దీక్షను మెయిన్‌స్ట్రీమ్ సంపాదకులు ‘సుమిత్ చక్రవర్తి’ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి, బీజేపీ నాయకులు ప్రకాశ్ జవదేకర్, సుష్మాస్వరాజ్, ఉమాభారతి, స్మృతి ఇరానీ సంఘీభావం ప్రకటించారు.
శ్రీకృష్ణ కమిటీ – సిఫారసులు
– ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్ర సమస్యపై కేంద్ర హోంశాఖ 2010, ఫిబ్రవరి 3న నియమించిన శ్రీకృష్ణ కమిటీ దాని నివేదికలో ఆరు మార్గాలను సూచించింది. కమిటీ సభ్యులు- జస్టిస్ శ్రీకృష్ణ (అధ్యక్షుడు), వీకే దుగ్గల్ (కార్యదర్శి, కేంద్ర హోంశాఖ మాజీ కార్యదర్శి), రవీందర్ కౌర్ (ఢిల్లీ ఐఐటీ ప్రొఫెసర్), రణ్‌బీర్ సింగ్ (నల్సార్ వ్యవస్థాపక డైరెక్టర్, ఢిల్లీ నేషనల్ యూనివర్సిటీ వీసీ) అబూసలే షరీఫ్ (ఆర్థికవేత్త).
కమిటీ నివేదించిన ఆరు మార్గాలు
1) యథాతథస్థితి కొనసాగింపు: రాష్ట్రంలో యథాతథస్థితి కొనసాగించడం వల్ల సమస్యను ప్రాథమికంగా శాంతిభద్రతల సవాలుగా పరిగణించి కేంద్రం పెద్దగా జోక్యం చేసుకోకుండా అదుపుచేసే బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వానికి వదిలేయాలి. ఈ ప్రతిపాదనకు ప్రాతిపదిక గత 54 ఏండ్ల తెలంగాణ చరిత్రే అయితే ప్రస్తుత పరిస్థితిలో యథాతథస్థితిని కొనసాగిస్తూ ఊరుకోవడం ఆచరణలో సాధ్యం కాదు. కొంత జోక్యం తప్పనిసరి. యథాతథస్థితి ఒక ప్రతిపాదన మాత్రమే. మేం దానికి చిట్టచివరి ప్రాధాన్యం మాత్రమే ఇస్తున్నామని కమిటీ అభిప్రాయపడింది.
2) సీమాంధ్ర, తెలంగాణలుగా విడగొట్టి హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయడం: రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెలంగాణలుగా విడగొట్టి హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం. కాలక్రమంలో రెండు రాష్ట్రాలు సొంతంగా తమ రాజధానులను అభివృద్ధి చేసుకోవడం. అయితే హైదరాబాద్ కలపకుండా తెలంగాణ ఏర్పడితే ప్రత్యేక రాష్ట్రం సాధించామన్న తృప్తి తెలంగాణవాదులకు ఉండదు. తీవ్ర అసంతృప్తి చెలరేగుతుంది. ఆందోళనలు, సమస్యలు కొనసాగుతాయి. ఇది ఆచరణలో సాధ్యం కాదని కమిటీ అభిప్రాయపడింది.
3) రాయల-తెలంగాణ, కోస్తాంధ్ర రాష్ట్రాలుగా విడగొట్టాలి: రాష్ట్రాన్ని రాయల-తెలంగాణ, కోస్తాంధ్ర అనే రెండు రాష్ట్రాలుగా విడగొట్టాలి. హైదరాబాద్‌ను రాయల-తెలంగాణకు రాజధానిగా చేయాలని కమిటీ సూచించింది. దీన్ని రాయలసీమలోని కొన్ని వర్గాలు సమైక్యాంధ్ర తర్వాత రెండో ప్రతిపాదనగా పెట్టాయి. ఈ ప్రతిపాదనను ఎంఐఎం తప్ప తెలంగాణలోని అన్ని రాజకీయ పార్టీలు, వర్గాలు వ్యతిరేకిస్తాయి. తాము రాజకీయావకాశాలను దక్కించుకోవడంలో వెనుకబడటానికి సీమ నాయకత్వమే కారణమని, తమ భూవనరులను కొల్లగొడుతున్నది వారేనని తెలంగాణ నేతలు గట్టిగా నమ్ముతున్నారు. కమిటీతో మాట్లాడిన తెలంగాణ నేతల్లో ఒక్కరు కూడా ఈ ప్రతిపాదనకు సుముఖంగా లేరు. అందరూ గట్టిగా వ్యతిరేకించారు. ఈ ప్రతిపాదన ఆర్థికంగా సమర్థనీయంగా ఉన్నప్పటికీ మూడు ప్రాంతాలను సంతృప్తిపరిచే పరిష్కారం ఇవ్వలేదని కమిటీ అభిప్రాయం వ్యక్తం చేసింది.
4) సీమాంధ్ర, తెలంగాణగా విభజన–హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయడం: రాష్ట్రాన్ని సీమంధ్ర, తెలంగాణలుగా విడదీయాలి. హైదరాబాద్ మహానగరాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించాలి. నల్లగొండ-మహబూబ్‌నగర్ జిలాల సరిహద్దుల్లోని 20 మండలాలను యూటీలో భాగం చేయాలి. తద్వారా హైదరాబాద్ యూటీని సీమాంధ్రలోని గుంటూరు, కర్నూలు జిల్లాల సరిహద్దులతో భౌగోళిక అనుసంధానం చేయాలి. రెండింటికీ హైదరాబాద్ రాజధాని. ఇది రెండో ప్రతిపాదన కొనసాగింపు.
5) సీమాంధ్ర, తెలంగాణ విభజన – తెలంగాణకు హైదరాబాద్ రాజధాని, సీమాంధ్రకు కొత్త రాజధాని ఏర్పాటు: రాష్ట్రాన్ని సీమాంధ్ర, తెంగాణగా విభజించడం. తెలంగాణకు హైదరాబాద్ రాజధానిగా ఉంటుంది. సీమాంధ్రకు మరో కొత్త రాజధాని ఏర్పాటు చేయాలని కమిటీ ప్రతిపాదించింది. ప్రస్తుతానికి హైదరాబాద్ కొత్తగా ఏర్పడే రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. కాలక్రమంలో సీమాంధ్రకు వేరే రాజధానిని ఏర్పాటు చేయాలి. కొత్త రాజధాని ఏర్పాటయ్యే నిధులకు కేంద్రమూ ఆర్థిక సాయం చేయాలి.
– తీవ్ర నిర్లక్ష్యానికి, వివక్షకూ గురవుతున్నా మని అభిప్రాయపడుతున్న అధిక సంఖ్యాక తెలంగాణ ప్రజల మనోభావాలకు ప్రాధాన్యమిస్తూ వారి డిమాండ్లను ఆమోదిస్తే అవుతుంది. కమిటీ తెలంగాణ ప్రాంతంలో జరిపిన పర్యటనల్లో తెలంగాణ ప్రజలు అత్యధిక సంఖ్యలో ఈ ప్రత్యేక డిమాండ్‌ను సమర్థిస్తున్నారు. కొద్దిమంది వ్యతిరేకిస్తున్నారు. తటస్థులు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు.
పర్యవసానాలు
– కోస్తాంధ్ర, రాయల సీమల్లో తీవ్రమైన, హిం సాత్మకమైన ఉద్యమాలు చెలరేగే అవకాశం ఉంది. హైదరాబాద్ భవితవ్యం, నీటి వనరుల పంపిణీ సమస్యలపై వెంటనే ఉద్యమాలు చెలరేగుతాయి. నక్సలిజం, మత ఛాందసవాదులు పెరిగిపోతారన్న అనుమానాలున్న నేపథ్యంలో అంతర్గత భద్రత అనుమానంలో పడుతుంది.
– ప్రత్యేక తెలంగాణ ఏర్పాటును సంపూర్ణంగా సమర్థించదగ్గ ప్రథమ ప్రతిపాదనగా భావించడం లేదు. దీన్ని రెండో ఉత్తమ అవకాశంగానే భావిస్తున్నాం. పూర్తిగా అనివార్యమైతేనే మూడు ప్రాంతాల మధ్య సామరస్యంగా సయోధ్య సాధించగలిగితేనే ఈ విభజన చేయవచ్చని మేం సిఫారసు చేస్తున్నామని కమిటీ అభిప్రాయపడింది.
6) సమైక్యంగా ఉంచడం – తెలంగాణ ప్రాంతీయ మండలి ఏర్పాటు: రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడం. తెలంగాణ సామాజిక-ఆర్థిక అభివృద్ధికి, రాజకీయ సాధికారతకూ నిర్దిష్టమైన రాజ్యాంగబద్ధ చర్యలు తీసుకోవాలి. అధికారాలతో చట్టబద్ధమైన తెలంగాణ ప్రాంతీయ మండలి ఏర్పాటు చేయాలని కమిటీ ప్రతిపాదించింది. రాష్ట్రంలోని మూడు ప్రాంతాల శ్రేయస్సుకూ సమైక్యత కీలకం. రాష్ట్రాన్ని ముక్కలు చేయడం వల్ల ప్రస్తుత సమస్యలకు సుస్థిర పరిష్కారాలు లభించే అవకాశం లేదు. చట్టబద్ధ తెలంగాణ ప్రాంతీయ మండలి ఏర్పాటు ద్వారా సమైక్యతను సాధించవచ్చు. 1956 నాటి పెద్దమనుషుల ఒప్పందం స్ఫూర్తిగా దానికి తగినన్ని నిధులు, అధికారాలు కల్పించాలి. రాష్ట్ర శాసనసభ ఆయా అంశాలపై చట్టాలు చేయాలంటే ముందు ఈ మండలి సిఫారసులు చేయాలి.
పర్యవసానాలు
– ప్రత్యేక తెలంగాణ అనే చిరకాల వాంఛ నెరవేరదు కాబట్టి మొదట్లో రాజకీయ నాయకులు, ఇతర బృందాలు, సంస్థలు, తెలంగాణ ప్రజల్లో అధిక సంఖ్యాకులు తీవ్రంగా వ్యతిరేకించడం తథ్యం. తెలంగాణ వస్తే లక్షలాది ఉద్యోగాలు వస్తాయన్న భరోసాల్లో తేలియాడుతున్న విద్యార్థులు, నిరుద్యోగ యువత, పదోన్నతులు వస్తాయని ఆశపడుతున్న ఎన్జీవోలు, లాయర్లు, రైతులు తదితరులంతా ఈ ప్రతిపాదనతో ఏమాత్రం సంతృప్తి చెందకపోవచ్చు. హింసాత్మకమైన ఉద్యమాలు చేపట్టవచ్చు.
మాదిరి ప్రశ్నలు
1. కింది వాటిలో సరైనవి?
1) జేఏసీ పిలుపు మేరకు తెలంగాణ 10 జిల్లాల్లో సహాయనిరాకరణోద్యమం 2011, ఫిబ్రవరి 17 నుంచి మార్చి 4 వరకు వివిధ రూపాల్లో కొనసాగింది
2) సహాయ నిరాకరణలో భాగంగా పల్లె పల్లె పట్టాలపైకి పేరుతో 2011, మార్చి 1న రైల్‌రోకో నిర్వహించారు
3) 1 4) 1, 2
2. ఈజిప్ట్ లోని ‘తెహ్రీక్ క్’ దిగ్బంధనను ఆదర్శంగా తీసుకొని నిర్వహించిన నిరసన?
1) సకల జనుల సమ్మె
2) మిలియన్ మార్చ్
3) సడక్ బంద్
4) సంసద్ యాత్ర
3. 2013, ఏప్రిల్ 29న ఢిల్లీలో జరిగిన తెలంగాణ సత్యాగ్రహ దీక్షను ప్రారంభించింది?
1) సుమిత్ చక్రవర్తి 2) సుష్మాస్వరాజ్
3) కేసీఆర్ 4) కోదండరాం
4. ప్రత్యేక తెలంగాణ, సమైక్యాంధ్ర సమస్యపై ఏర్పడిన శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో ఎన్ని పరిష్కార మార్గాలను సూచించింది?
1) 4 2) 5 3) 6 4) 7
5. కింది వాటిని జతపర్చండి?
1. మిలియన్ మార్చ్ ఎ. 2011, మార్చి 10
2. సకల జనుల సమ్మె బి. 2011, సెప్టెంబర్ 13
3. తెలంగాణ మార్చ్ సి. 2012, సెప్టెంబర్ 30
4. సడక్ బంద్ డి. 2013, మార్చి 21
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
4) 1-ఎ, 2-డి, 3-సి, 4-బి
6. తెలంగాణ మార్చ్ ను ఎక్కడ నిర్వహించారు?
1) ట్యాంక్‌బండ్ 2) నెక్లెస్ రోడ్డు
3) జూబ్లీహిల్స్ 4) క్లాక్‌టవర్
సమాధానాలు
1-4, 2-2, 3-1, 4-3, 5-1, 6-2.
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ,
కోరుట్ల
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు