తూర్పు తీరంలో డెల్టాలు ఏర్పడటానికి గల కారణం? ( ఇండియన్ జాగ్రఫీ)
తూర్పు తీర మైదానాలు
– సుబర్నరేఖ నది నుంచి కన్యాకుమారి వరకు విస్తరించిన, డెల్టాలను ఏర్పరిచే మైదానాలు. వీటిని కోరమండల్, సర్కార్, ఉత్కల్ మైదానాలుగా విభజించవచ్చు.
– ఈ తీర మైదానం ఉత్తరాన పశ్చిమ బెంగాల్‌లోని హల్దియా నుంచి ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులోని కన్యాకుమారి వరకు 1800 కి.మీ. పొడవుతో, 80-100 కి.మీ. వెడల్పుతో ఏర్పడింది.
– ఇక్కడ బంగాళాఖాత సముద్ర జలాలు వెనుకకు మరలుతుండటం (తిరోగమించడం) వల్ల ఖండాంతర అంచు (Contnental Shelf) వెడల్పు 500 కి.మీ. కలిగి ఉంది.
– అందువల్ల తూర్పు తీర మైదానాన్ని ఉద్ధిత మైదానం (Emerging Coast)గా పిలుస్తున్నారు. దీనివల్ల ఓడరేవులు ఎక్కువగా ఏర్పడలేదు.
ముఖ్యమైన డెల్టాలు
1) సుందర్బన్ డెల్టా (గంగా డెల్టా)- పశ్చిమబెంగాల్
2) మహానది, సుబర్నరేఖ డెల్టాలు- ఒడిశా
3) గోదావరి, కృష్ణా డెల్టాలు- ఆంధ్రప్రదేశ్
4) కావేరి డెల్టా- తమిళనాడు
– తూర్పు తీర మైదానం ఎక్కువ వెడల్పుగా ఉంటుంది. కారణం తూర్పు కనుమలు బంగాళాఖాతం తీర రేఖకు దూరంగా విస్తరించి ఉండటం.
-అలాగే తూర్పునకు ప్రవహించే పెద్ద నదులు సుబర్నరేఖ, మహానది, గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరి నదులు తీసుకువచ్చే ఒండ్రు మట్టి నిక్షేపించడం వల్ల ఎక్కువగా వెడల్పుగా తయారైంది.
ఎ) కోరమండల్ తీరం: కన్యాకుమారి నుంచి పులికాట్ సరస్సు వరకు ఉన్న సముద్ర తీర మైదానం. ఇది తమిళనాడు రాష్ట్రంలో ఉంది.
– ఇది 673 కి.మీ. పొడవుతో, సగటు 100-120 కి.మీ. వెడల్పుతో ఏర్పడిన తీర మైదానం.
– కృష్ణా, మహానది డెల్టాల మధ్య ఉన్న తీర మైదాన ప్రాంతాన్ని ఉత్తర సర్కార్ మైదానం (North Circar Coast)గా పిలుస్తారు.
– కావేరి, కృష్ణా నదుల మధ్య తీర మైదానాన్ని కర్ణాటిక్ మైదానం (Carnatic)గా పిలుస్తారు. చరిత్ర ప్రసిద్ధి చెందిన కర్ణాటక యుద్ధాలు ఇక్కడే జరిగాయి.
– ఈ తీరం నైరుతి రుతుపవన సమయంలో వర్షాభావ ప్రాంతంగా ఉంటుంది. ఈశాన్య రుతుపవనాల వల్ల వర్షం పొందుతుంది.
-కావేరి నది డెల్టా ఇక్కడ ప్రధానమైనది. వైపర్, వైగై, పొన్నియార్ నదుల ప్రవాహాలు ఉన్నాయి.
-కలివెలి లాగూన్, ముత్తుపేట్ లాగూన్, ఉప్పకాళి ఈస్చువరీ, పాయిరత్ కాలిమర్ చిత్తడి నేలలు. పిచ్చపురం మడ అడవి ఈ తీరంలో ఉంది.
– ఈ తీరంలో చెన్నై, ఎన్నోర్, ట్యూటికోరిన్ ఓడరేవులు ఉన్నాయి.
-తీర ప్రాంతం (తీర రేఖ) వెంబడి సమాంతరంగా ఏర్పడే సముద్ర తరంగ నిక్షేపణ వల్ల ఇసుక దిబ్బలు (Sand Dunes) ఏర్పడ్డాయి. వీటినే రోధికలు అంటారు.
బి) సర్కార్ తీరం: పులికాట్ నుంచి రుషికుల్య నది (ఒడిశా) వరకు ఉన్న తీర మైదానం.
– ఈ తీరంలో కృష్ణా, గోదావరి డెల్టాలు, పులికాట్ లాగూన్, కొల్లేరు సరస్సు ప్రధానమైన భూ స్వరూపాలు. ఈ ప్రాంతం రొయ్యల పెంపకానికి ప్రసిద్ధిచెందింది.
-సర్కారు తీరం గుండా ప్రవహించే నదులు వంశధార, గోదావరి, కృష్ణా, పెన్నా.
– తూర్పు తీరంలో అత్యధిక వెడల్పు ఇక్కడ గల కృష్ణా, గోదావరి డెల్టాల వద్ద ఉంటుంది. ఈ ప్రాంతంలో సహజ వాయు నిక్షేపాలు ఉన్నాయి.
– ఈ తీరం ఉద్భవిత తీర రేఖ (Emergent) కావడం వల్ల సహజ ఓడరేవులు ఏర్పడలేదు. ఇందుకు మినహాయింపుగా విశాఖపట్నం, మచిలీపట్నం వంటి సహజ ఓడరేవులను చెప్పవచ్చు.
-ఈ తీరంలోని ప్రముఖ మడ అడవులు కోరింగ మడ అడవి (కాకినాడ). ఇది గోదావరి నది ముఖద్వారం వద్ద విస్తరించింది.
– విశాఖపట్నం తీరంలో థోరియం మూలకం ధాతువు మొనజైట్ లభిస్తుంది.
-పులికాట్ సరస్సును బంగాళాఖాతంతో వేరుపరిచే దీవి ‘శ్రీహరికోట దీవి’. ఈ దీవిలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఉంది.
సి) ఉత్కల్ తీరం: రుషికుల్య నది నుంచి కసాయ్ నది వరకు గల తీర మైదానం. ఈ తీరంలో మహానది డెల్టా
ప్రధానమైనది.
-ఈ తీర ప్రాంతం భారత్‌లోనే అధికంగా తుఫానుల తాకిడికి గురవుతుంది.
– మహానది డెల్టాకు దక్షిణాన చిల్కా లాగూన్ (సరస్సు) ఉంది. ఇక్కడ మహానదితో పాటు బ్రాహ్మణి, వైతరణి, సుబర్నరేఖ నదులు ప్రవహిస్తాయి.
– ఈ సరస్సులో పరికుడ, బెన్, హనీమూన్, బర్డ్ వంటి దీవులున్నాయి.
-చిల్కా లాగూన్ వైశాల్యం 980 కి.మీ2 కలిగి భారత్‌లోనే అతిపెద్ద లాగూన్ సరస్సు (Brackish Water).
-ఈ తీరానికి దగ్గరలో ‘వీలర్ లేదా అబ్దుల్ కలాం దీవి’ ఉంది. ఇక్కడ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ క్షిపణి పరీక్ష కేంద్రం ఉంది.
-ఇక్కడ ఉన్న బీచ్ ‘గహిర్మాత్ బీచ్’. ఈ బీచ్ మహానది డెల్టా, సుందర్బన్ డెల్టాలను వేరుచేస్తుంది.
-ఈ తీరంలో ‘బితర్కనిక మడ అడవులు’ ఉన్నాయి. ఈ అడవులు బ్రహ్మణి, బైతరణి నదుల మధ్య విస్తరించి ఉన్నాయి. ఇక్కడ ‘బితర్కనిక జాతీయ పార్క్’ ఉంది.
డి) బెంగాల్ తీరం
-ఈ తీర మైదానం గంగానది నిక్షేపణం వల్ల ఏర్పడింది. ఇక్కడ గంగానది ఏర్పర్చిన డెల్టా ‘సుందర్బన్ డెల్టా’.
– సుందర్బన్ డెల్టా ప్రాంతంలో మడ/క్షారజల/మాంగ్రూవ్ అరణ్యాలు ఉన్నాయి.
– ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా లేదా అతిపెద్ద క్షార జలారణ్యాలు గల డెల్టా.
-ఇక్కడి న్యూమూరు దీవులు భారత్-బంగ్లాదేశ్ మధ్య వివాదాస్పద దీవులు.
భారత్‌లోని ముఖ్యమైన బీచ్‌లు
– భారతదేశ సముద్రతీరంలో 43 శాతం ఇసుక బీచ్‌లతో, 11 శాతం శిలాఉపరితలంతో, 46 శాతం చిత్తడి భూములను కలిగి ఉంది.
– భారతదేశంలో ఎక్కువ బీచ్‌లు మహారాష్ట్రలో ఉన్నాయి.
-భారతదేశంలో పొడవైన బీచ్ ‘మెరీనా బీచ్’. ఇది చెన్నై నగరంలో అంటే కోరమండల్ తీరంలో 13 కి.మీ. పొడవును కలిగి ఉంది.
1) గుజరాత్- దండి, డుమాస్, సువాలి, ఉమ్భారత్ బీచ్‌లు
2) మహారాష్ట్ర- అలీబాద్, గోరాయ్, జు, మనోరి, మార్వే, వెర్సోవా ముంబై తీరంలో ఉన్నాయి
3) గోవా- అంగోడా, వర్కా, మాండ్రెమ్, చపోరా, బాగా, కొల్వా
4) కర్ణాటక- కార్వార్, కుడ్లే, పెనంబూరు
5) కేరళ- కొల్లాం, కోవలం, పాపనాశం, లైట్‌హౌస్
6) పశ్చిమబెంగాల్- గంగాసాగర్, మందార్‌మణి
7) ఒడిశా- గహిర్మాతా, పూరి, తుల్సరి
8) ఆంధ్రప్రదేశ్- భీమిలి, రుషికొండ, రామగిరి (వైజాగ్), మంగినపూడి (కృష్ణా), మైపాడు (నెల్లూరు), సూర్యలంక (గుంటూరు)
9) తమిళనాడు- మెరీనా (దేశంలో పొడవైనది- 13 కి.మీ.), బీసెంట్‌నగర్, గోల్డెన్ బీచ్, కొవెలాంగ్ (చెన్నై), ధనుష్కోటి (రామేశ్వరం)
10) పుదుచ్చేరి- కరైకాల్, యానాం, ప్యారడైజ్, ఆలోవిల్లి
11) అండమాన్, నికోబార్ దీవులు- వాండూరు (పోర్ట్ బ్లెయిర్), కాలాపత్తర్, ఎలిఫెంటా, రాధానగర్
12) లక్షద్వీప్- అగట్టి, బంగారం దీవి
తెలంగాణ నైసర్గిక స్వరూపం
– దక్షిణ భారత్‌లోని అతిపురాతన దక్కన్ పీఠభూమిలో తెలంగాణ పీఠభూమి విస్తరించింది.
– తెలంగాణ పీఠభూమి సమద్విబా త్రిభుజాకారంలో ఉండి స్పటిక, రూపాంతర, అగ్నిశిలలతో ఆవరించి ఉంది.
-దక్కన్ పీఠభూమి సముద్ర మట్టానికి పశ్చిమ కనుమల వద్ద 600 మీటర్ల నుంచి తూర్పు కనుమలకు 480 మీటర్లు కలిగి ఉంది.
– తెలంగాణ రాష్ట్ర రాజధాని సగటు సరాసరి ఎత్తు 600 మీ. ఉంది.
– గోదావరి, భీమా నదుల మధ్య అంటే హైదరాబాద్-వరంగల్-ఖమ్మం మధ్య ప్రాంతంలో తెలంగాణ పీఠభూమి సగటు ఎత్తు 730 మీ. వరకు ఉంటుంది.
-అలాగే కృష్ణా, తుంగభద్ర నదీలోయల మధ్య ప్రాంతంలో 4500-300 మీ. ఎత్తు వరకు దక్కన్ పీఠభూమి ఉంటుంది.
– గ్రానైట్, నీస్ శిలా మిశ్రమాలు తెలంగాణ రాష్ట్రం అంతటా ఉన్నాయి.
– తెలంగాణ అధిక భాగం ఎరని మృత్తికలతో, కొంత భాగం లావా శిలల నుంచి వచ్చిన నల్లరేగడి నేలతో, కొంత భాగం ముదురు గోధుమ వర్ణపు నేలలతో కనిపిస్తుంది.
– తెలంగాణ ప్రాంత నిర్మాణం, స్వరూపాన్ని బట్టి రాష్ట్రాన్ని 3 ప్రాంతాలుగా విభజించారు.
– దీని విస్తీర్ణం 59,903 కి.మీ2. ఇది ఎక్కువ విస్తీర్ణాన్ని ఆక్రమించింది.
-దీనిలో ఉన్న ఇతర పీఠభూములు..
ఎ) భైంసా-నిర్మల్ పీఠభూమి
బి) దేవరకొండ పీఠభూమి
సి) సూర్యాపేట-జూర్‌నగర్ పీఠభూమి
డి) భువనగిరి-రామన్నపేట పీఠభూమి
ఇ) నల్లగొండ-మిర్యాలగూడెం పీఠభూమి
-దీని అంతర నిర్మాణం ఆర్కియన్ శిలలైన నీస్, బయోటిటిస్ వంటి స్పటికాలతో ఉంది.
– ఈ ప్రాంతం సముద్ర మట్టం నుంచి 600-500 మీ. ఎత్తులో ఉంది.
-ఈ ప్రాంతం అంతా చిన్నకొండలు, గుట్టలను కలిగి ఉంది. వీటిని వివిధ జిల్లాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. అవి..
1) ఆదిలాబాద్- సత్నాల గుట్టలు, నిర్మల్ గుట్టలు
2) నిర్మల్- నిర్మల్ గుట్టలు, మహబూబ్ఘాట్స్
3) కుమ్రంభీం- సిర్పూర్ గుట్టలు
4) జగిత్యాల- రాఖీ గుట్టలు
5) పెద్దపల్లి- రామగిరి గుట్టలు
6) హన్మకొండ- కందికల్ గుట్టలు
7) జయశంకర్- పాండవుల గుట్టలు
8) మహబూబాబాద్- కందికల్ గుట్టలు
9) భద్రాద్రి- పాపికొండలు, కందికల్ గుట్టలు
10) నిజామాబాద్- సిర్నాపల్లి కొండలు
11) మెదక్, సిద్దిపేట- లక్ష్మీదేవునిపల్లి కొండలు, బూజు గుట్టలు
12) హైదరాబాద్- రాచకొండలు
13) యాదాద్రి- రాయగిరి గుట్టలు, రాచకొండలు
14) నల్లగొండ- నందగిరి కొండలు
15) రంగారెడ్డి- రాచకొండలు
16) వికారాబాద్- అనంతగిరి కొండలు
17) నాగర్‌కర్నూలు- నల్లమల గుట్టలు (అమ్రాబాద్ గుట్టలు)
18) మహబూబ్‌నగర్- షాబాద్ గుట్టలు, కోయిల్ గుట్టలు
19) ఖమ్మం- కనకగిరి గుట్టలు, రాజు గుట్టలు
మాదిరి ప్రశ్నలు
1. తూర్పు తీరంలో డెల్టాలు ఏర్పడటానికి గల కారణం?
1) తూర్పు తీరం సముద్రం నుంచి దూరం ఎక్కువ ఉండటం
2) దక్షిణ భారత నదులు ఎక్కువ అవశేషాలను ఇక్కడ స్థిరీకరించడం
3) తక్కువ వాలును కలిగి ఉండటం, పెద్ద నదులు ఇక్కడి నుంచి ప్రవహించడం 4) పైవన్నీ
2. ఉత్కల్ తీర మైదానం గుండా ప్రవహిస్తున్న నది?
1) కృష్ణా 2) మహానది
3) గంగానది 4) పెన్నా నది
3. కింది ఏ రాష్ట్ర తీర మైదానంలో ‘మోనోజైట్’ నిక్షేపాలు లభిస్తున్నాయి?
1) మలబార్ 2) సర్కార్
3) ఉత్కల్ 4) కెనరా
సమాధానాలు
1-4, 2-2, 3-1.
జీ గిరిధర్
సీనియర్ ఫ్యాకల్టీ
ఫైవ్ మంత్ర ఇన్స్టిట్యూట్
అశోక్‌నగర్
9966330068
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు