Judicial review authority | న్యాయసమీక్ష అధికారం
భారత రాజ్యాంగకర్తలు దేశంలో శాసన, కార్యనిర్వాహక వ్యవస్థలతోపాటుగా న్యాయశాఖ కూడా సమాన ప్రాధాన్యం కల్గి ఉండేలా కట్టుదిట్టమైన నియమాలను రూపొందించారు. ఒక్కోసారి మొదటి రెండు వ్యవస్థలు తమ పరిధిలు దాటే ప్రయత్నం చేసినప్పుడు తప్పులను సరిదిద్దేందుకు న్యాయశాఖలో అత్యున్నతమైన సుప్రీంకోర్టుకు అధికారాన్ని కట్టబెట్టారు. అదే న్యాయసమీక్ష. అమెరికా రాజ్యాంగం నుంచి స్వీకరించిన ఈ భావన భారత్‌లో స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో పెద్దగా ఉపయోగించనప్పటికీ తర్వాత కాలంలో సుప్రీంకోర్టు అనేకసార్లు ఉపయోగించి కీలకమైన తీర్పులను వెల్లడించింది. పోటీపరీక్షల్లో న్యాయసమీక్ష అధికారాలపై తప్పనిసరిగా ప్రశ్నలు అడుగుతున్నందున ఆ అంశంపై నిపుణ పాఠకులకోసం ప్రత్యేకం..
-న్యాయసమీక్ష అనే భావన అమెరికా రాజ్యాంగం నుంచి వచ్చింది. 1803లో మార్బరీ, మాడిసన్‌ల మధ్య జరిగిన వివాదంలో అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జాన్ మార్షల్ చేసిన ప్రసిద్ధ నిర్ణయం నుంచి న్యాయసమీక్ష సూత్రం పుట్టింది.
-రాజ్యాంగ పరిషత్తు సభ్యులు కేఎం మున్షీ అభిప్రాయం ప్రకారం శాసనం చేత నిర్ణయించిన పద్ధతిలో ప్రాథమిక హక్కుల పరిరక్షణకు న్యాయసమీక్షాధికారం అనివార్యం. రాజ్యాంగంలోని ప్రకరణ 13(2)లో న్యాయ సమీక్షాధికాన్ని న్యాయవ్యవస్థకు కల్పించారు. శాసనాలు, ఆదేశాలు, ఇతర నోటిఫికేషన్లు ప్రకరణ 13 ప్రకారం ప్రాథమిక హక్కులకు విరుద్ధమైతే సుప్రీంకోర్టు వాటిని కొట్టివేస్తుంది. దీనినే న్యాయసమీక్షాధికారం అంటారు. కేంద్ర చట్టాలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలు రాజ్యాంగవిరుద్ధంగా ఉన్నట్లయితే వాటిని చట్టవిరుద్ధమైనవిగా తీర్పు ఇచ్చి వాటిని కొట్టివేసే అధికారాన్ని న్యాయసమీక్షాధికారం అంటారు.
న్యాయసమీక్ష -ముఖ్యవివాదాలు
-1951లో ఉమ్మడి మద్రాస్ రాష్ట్రంలో వైద్య కళాశాలలో కొన్ని కులాలకు రిజర్వేషన్ కోసం చేసిన చట్టాలను హైకోర్టు కొట్టివేస్తే హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. కొన్ని కులాలకు సాయం చేసే ఉద్దేశంతో ఇతర కులాలకు అన్యాయం జరుగకుండా చూడాలని పేర్కొంది. 1951లో ఏకే గోపాలన్ VS స్టేట్ ఆఫ్ మద్రాస్ వివాదంలో సెమినార్ పత్రిక సంపాదకుడైన రమేశ్థాపర్ను కారణాలు చెప్పకుండా నిర్బంధించడం వ్యక్తి స్వేచ్ఛకు భంగమని, వెంటనే విడుదల చేయమని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
-1952లో శంకరీప్రసాద్ వివాదం, 1956లో సజ్జన్‌సింగ్ వివాదంలో పార్లమెంట్‌కు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం ఉందని, తద్వారా జమిందారీ, జాగీర్దారీ విధానాలను రద్దు చేసిన పార్లమెంటరీ అధికారాన్ని కోర్టు సమర్థించింది.
-1967లో గోలక్‌నాథ్, స్టేట్ ఆఫ్ పంజాబ్ వివాదంలో ప్రధాన న్యాయమూర్తి కోకా సుబ్బారావు ఆధ్వర్యంలో ప్రకరణ 13కు సంబంధించిన సవరణ గురించి తీర్పు చెబుతూ నిబంధన 368 ప్రకారం చేసే రాజ్యాంగ సవరణలు, ప్రకరణ 13 పరిధిలోకి వస్తాయి కాబట్టి అవి చెల్లవని తీర్పు చెప్పింది. పార్లమెంట్‌కు రాజ్యాంగాన్ని సవరించే అధికారం లేదని పేర్కొంది.
-1969లో బ్యాంకుల జాతీయీకరణ, రాజాభరణాల రద్దు కోసం చేసిన ఆర్డినెన్సులు ప్రాథమిక హక్కుల పరిరక్షణ దృష్ట్యా చెల్లవని తీర్పు చెప్పింది.
-1973లో కేశవానందభారతి VS స్టేట్ ఆఫ్ కేరళ వివాదంతో రాజ్యాంగానికి చేసిన 24, 25వ సవరణలు పరిశీలనకు వచ్చాయి. ఈ కేసులో సుప్రీంకోర్టు గోలక్‌నాథ్ వివాదంలో ఇచ్చిన తీర్పును మార్పు చేసి పార్లమెంట్‌కు ప్రాథమిక హక్కులను సవరించే అధికారం ఉందని, అయితే రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చరాదని 13 మంది న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనంలో 9 మంది న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తి ఎస్ఎస్ సిక్రీ ఆధ్వర్యంలో తీర్పు ఇచ్చారు.
-1980లో మినర్వామిల్స్ వివాదంలో 42వ రాజ్యాంగ సవరణ సుప్రీంకోర్టు పరిశీలనకు వచ్చినప్పుడు రాజ్యాంగ మౌలిక సూత్రాన్ని మళ్లీ నొక్కి చెప్పి, రాజ్యాంగాన్ని సవరించడానికి పార్లమెంట్‌కు పరిమిత అధికారమే ఉందని స్పష్టం చేసింది. అలాగే న్యాయసమీక్షాధికారం రాజ్యాంగ మౌలిక లక్షణాల్లో అంతర్భాగమని, దానిని పరిమితం చేయడం లేదా మొత్తానికి తీసేయడం జరుగదని సుప్రీంకోర్టు తన తీర్పును వెలువరించింది.
-చంద్రకుమార్ కేసు (1997)లో న్యాయసమీక్షాధికారం అనేది మౌలిక స్వరూప సిద్ధాంతంలో అంతర్భాగమేనని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది.
న్యాయ సమీక్షకు అవకాశం లేని అంశాలు
-షెడ్యూల్-IIలో పేర్కొన్న జీతభత్యాలు
-షెడ్యూల్-IV ప్రకారం రాజ్యసభలో రాష్ర్టాలకు కల్పించే ప్రాతినిధ్యం.
-షెడ్యూల్-IX లో పేర్కొన్న భూసంస్కరణలకు సంబంధించిన విషయాలు.
-ప్రకరణ 53 ప్రకారం రాష్ట్రపతి సర్వోన్నత కార్యనిర్వణాధికారిగా ఉండటం.
-ప్రకరణ 74(1) ప్రకారం దేశ పాలనలో ప్రధానమంత్రి అధ్యక్షతన ఉండే మంత్రిమండలి రాష్ట్రపతికి ఇచ్చే సలహాలు.
-ప్రకరణ 77 (1) ప్రకారం దేశ పరిపాలన మొత్తం రాష్ట్రపతి ద్వారానే నిర్వహించడం.
-ప్రకరణ 105 ప్రకారం పార్లమెంట్ సభ్యులకు, సభకు కల్పించిన ప్రత్యేక సౌకర్యాలు/ హక్కులు.
-ప్రకరణ 122 ప్రకారం పార్లమెంట్ వ్యవహారాలపై న్యాయస్థానాలు విచారణ జరుపరాదు.
-ప్రకరణ 154 ప్రకారం రాష్ర్టాల పరిపాలన మొత్తం గవర్నర్ల పేరు మీదుగా నిర్వహించడం.
-ప్రకరణ 163(1) ప్రకారం ముఖ్యమంత్రి అధ్యక్షతన ఉండే మంత్రిమండలి రాష్ట్రపాలనలో గవర్నర్లకు ఇచ్చే సలహాలు.
-ప్రకరణ 166(1) ప్రకారం రాష్ర్టాల పరిపాలన మొత్తం గవర్నర్ల పేరు మీద నిర్వహించటం.
-ప్రకరణ 194 ప్రకారం శాసనసభ సభ్యులకు, సభకు కల్పించిన ప్రత్యేక సౌకర్యాలు/హక్కులు.
-ప్రకరణ 212 ప్రకారం రాష్ట్ర శాసనసభ ముందు చర్చించిన సభా వ్యవహారాలకు సంబంధించిన అంశాలు.
-ప్రకరణ 361 ప్రకారం రాష్ట్రపతి, గవర్నర్లకు కల్పించిన ప్రత్యేక మినహాయింపులు.
-ప్రకరణ 392(2) ప్రకారం 1935 చట్టానికి సంబంధించి ఏవైనా అంశాలను ప్రస్తుత రాజ్యాంగంలోకి తీసుకోవడానికి సంబంధించిన రాష్ట్రపతి జారీ చేసే ఉత్తర్వులను పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి సంబంధించిన విషయాలు.
న్యాయవ్యవస్థ – క్రియాశీలత
-న్యాయశాఖ క్రియాశీలత అనేది న్యాయసమీక్ష అధికారంలో అంతర్భాగం. న్యాయశాఖ క్రియశీలత అంటే న్యాయవ్యవస్థ తన అధికార విధులను మరింత చొరవగా, క్రియాశీలకంగా, ఉదారంగా వినియోగించడం. న్యాయాన్ని ప్రజలకు అందించే క్రమంలో అనేక నూతన పద్ధతులను, ప్రక్రియలను వినియోగించి సమన్యాయ పాలనకు అవసరమైన అన్ని చర్యలను చేపడుతుంది. సామాజిక హక్కులను రక్షిస్తూ సామాన్య ప్రజలకు న్యాయం అందుబాటులోకి తేవడానికి అమెరికాలో ఉద్బవించిన ప్రజాప్రయోజన వ్యాజ్యాలు ఆస్ట్రేలియాలో మరింత ప్రజామోదం పొందాయి. ఇవి జస్టిస్ పీఎన్ భగవతి (1985), జస్టిస్ వీఆర్ కృష్ణయ్యర్, జస్టిస్ చంద్రచూడ్‌ల హయాంలో విస్తృతంగా వాడుకలోకి వచ్చాయి.
కారణాలు
-శాసన, కార్యనిర్వాహక శాఖలు తమ విధుల నిర్వహణలో వైఫల్యం చెంది ప్రజల నమ్మకాన్ని కోల్పోవడం.
-ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల దీర్ఘకాలిక, నిర్మాణాత్మక, కఠినమైన నిర్ణయాలు చేయకపోవడం వల్ల ప్రజల కనీస అవసరాలు కూడా మెరుగుపర్చని స్థితిలో ప్రభుత్వాలు కొనసాగడం.
-ప్రజాప్రయోజనాల వ్యాజ్యం ద్వారా మూడో వ్యక్తి కూడా కోర్టును ఆశ్రయించే అవకాశాన్ని కల్పిచడం ద్వారా స్వచ్ఛంద సంస్థలు, పౌర హక్కుల సంఘాలు వందల సంఖ్యలో ప్రజాప్రయోజనాలు ఉన్న కేసులను హైకోర్టు, సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువచ్చాయి.
-న్యాయస్థానాలు స్వయంప్రేరిత (సుమోటో) కేసులను ప్రవేశపెట్టి ప్రజల హక్కుల కోసం తగిన ఆదేశాలను జారీ చేయడం.
ముఖ్య వివాదాలు
-ఫరీదాబాద్ గనుల్లో పనిచేసే బాలకార్మికుల స్థితిగతులపై బందువా ముక్తి మోర్చా వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు.
-లక్ష్మీకాంత్ VS యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో స్వచ్ఛంద సంస్థలు చేస్తున్న మోసాలు, చిన్నపిల్లల దత్తత వివాదంలో సుప్రీంకోర్టు తీర్పులు.
-తాజ్‌మహల్ పరిసర ప్రాంతాల్లో కాలుష్యం, తద్వారా తాజ్‌మహల్‌కు ఉన్న ముప్పు కేసులు
-బీహార్ పశుగ్రాసం కేసు
-జార్ఖండ్ ముక్తి మోర్చా అవినీతి వివాదం
-కర్ణాటక ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మై కేసులో 356వ ప్రకరణ దుర్వినియోగాన్ని అరికట్టడానికి సూచనలు.
న్యాయ ప్రవర్తన
-న్యాయ ప్రవర్తన అనే ప్రక్రియ ఇటీవల కాలంలో ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నది. సమాచార హక్కు చట్టం, రాజకీయ ప్రక్రియలపై అధ్యయనంలో ప్రవర్తనా పద్ధతిని అనుసరించడం వల్ల న్యాయమూర్తులను ప్రభావితం చేస్తున్న అంశాలైన క్రమశిక్షణ, పనితీరు, నిబద్ధత మొదలైన విషయాలు ప్రజా సమీక్షకు గురవుతున్నాయి. న్యాయమూర్తులు శీఘ్రగతిన కేసులను విచారించడం, విచారణ సమయంలో విపరీత జాప్యానికి బాధ్యత వహింపజేయడం, న్యాయమూర్తుల ప్రవర్తన ఆదర్శంగా ఉండేలా చేయడం మొదలైన అంశాల పరిశీలనను న్యాయవ్యవస్థ ప్రవర్తన అంటారు. న్యాయమూర్తులు రకరకాల ప్రభావాలకు, ప్రలోభాలకు దూరంగా ఉండటం, వృత్తి నిబద్ధతను, నిష్పాక్షికతను అత్యున్నతమైన వ్యక్తిత్వాన్ని, జాతి, మత, కుల ప్రాంతాలకు అతీతంగా తీర్పులను వెలువరించే గొప్ప లక్షణాలను కలిగి ఉండాలి. అప్పుడే ప్రజలకు న్యాయవ్యవస్థపైన విశ్వాసం ద్విగుణీకృతం అవుతుంది.
కొన్ని కీలకాంశాలు
-భారత ప్రభుత్వ చట్టం (1935), భారత స్వాతంత్య్ర చట్టం (1947)ల కింద చేసిన శాసనాల అన్వయార్థాన్ని వివరిస్తుంది.
-ప్రకరణ 135 ప్రకారం ఫెడరల్ కోర్టు అధికారాలన్నింటిని సుప్రీంకోర్టుకు బదలాయించారు.
-ప్రకరణ 138 ప్రకారం పార్లమెంట్ ఒక చట్టం ద్వారా సుప్రీంకోర్టు అధికార పరిధిని విస్తృతం చేయవచ్చు.
-ప్రకరణ 139 ప్రకారం ప్రాథమిక హక్కులకు సంబంధించిన ఇతర అంశాలపై కూడా రిట్లను జారీ చేసే అధికారాలను పార్లమెంట్ సుప్రీంకోర్టుకు సంక్రమింపజేయవచ్చు.
-ప్రకరణ 139ఏ ప్రకారం సుప్రీంకోర్టులో ఉన్న ఒకే అంశానికి సంబంధించిన కేసులను, అలాగే రాష్ట్ర హైకోర్టుల్లో విచారణలో ఉన్న ఒకే అంశానికి చెందిన వివిధ కేసులన్నింటిని సమీకృతం చేసి విచారించవచ్చు.
-ప్రకరణ 140 ప్రకారం సుప్రీంకోర్టుకు గల అధికారాలను సమర్థవంతంగా నిర్వర్తించటానికి అవసరమైన ఇతర అధికారాలను సుప్రీంకోర్టుకు సంక్రమింపజేస్తూ పార్లమెంట్ తగిన శాసనాలను రూపొందించవచ్చు.
-ప్రకరణ 141 ప్రకారం సుప్రీంకోర్టు ధ్రువీకరించిన లేదా ప్రకటించిన అన్ని అంశాలను దేశంలోని దిగువ న్యాయస్థానాలు తప్పనిసరిగా పాటించాలి.
-ప్రకరణ 142 ప్రకారం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు, ఆదేశాలు అమలయ్యే విధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంటుంది. వాటికి సంబంధించి పార్లమెంటు విధి విధానాలను రూపొందించాలి. అంతవరకు రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా వివరించిన విధానంలో చర్యలు తీసుకోవాలి.
-ప్రకరణ 144 ప్రకారం దేశంలో ఉన్న అన్ని అధికార సంస్థలు, సివిల్, క్రిమినల్ కోర్టులు, సుప్రీంకోర్టుకు సహాయపడేలా వ్యవహరించాలి.
-ప్రకరణ 145 ప్రకారం పార్లమెంటు రూపొందించిన చట్టాలకు అనుగుణంగా సుప్రీంకోర్టు రాష్ట్రపతి పూర్వానుమతితో న్యాయప్రక్రియలో తాను పాటించాల్సిన నియమాలను, పద్ధతులను నిర్దేశించుకోవచ్చు.
-ప్రకరణ 146 ప్రకారం సుప్రీంకోర్టులో పనిచేసే అధికారులు, ఇతర సిబ్బంది ప్రధాన న్యాయమూర్తి నియంత్రణలో పనిచేస్తారు. వీరి జీతభత్యాలను కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.
-ప్రకరణ 147 ప్రకారం రాజ్యాంగాన్ని వ్యాఖ్యానించే అధికారం, దాని అర్థ వివరణను తెలిపే అధికారం సుప్రీంకోర్టుకు మాత్రమే ఉంటుంది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు