European colonies | యూరోపియన్ కాలనీలు
మూడో కర్ణాటక యుద్ధం (1756-1763)
మొదటి కర్ణాటక యుద్ధం లాగానే మూడో కర్ణాటక యుద్ధం కూడా ఐరోపాలో జరిగిన సంఘటన వల్ల ఉద్భవించింది. సప్తవర్ష సంగ్రామ ఫలితంగా బ్రిటిష్, ఫ్రెంచ్‌ల వర్తక సంఘాలు యుద్ధానికి తలపడ్డాయి. బ్రిటిష్ వారి అధికారాన్ని నిరోధించటం కోసం ఫ్రెంచ్ ప్రభుత్వం కౌంట్-డీ-లాలీని ఒక నౌకాదళంతో 1757లో ఇండియాకు పంపింది. ఇతను కడలూరును ముట్టడించి, ఫోర్ట్ డేవిడ్‌ను ఆక్రమించాడు. తంజావూరును కూడా ఆక్రమించ ప్రయత్నించాడు. కాని అది వీలుపడలేదు. దీని తర్వాత లాలీ మద్రాసును ఆక్రమించతలిచాడు. అందుకు హైదరాబాద్‌లోని బుస్సీని రమ్మని ఆదేశించాడు. బుస్సీ హైదరాబాద్‌ను వీడగానే అక్కడ ఫ్రెంచి పలుకుబడి క్షీణించింది. బ్రిటిష్‌వారు అదను కనిపెట్టి ఉత్తర సర్కారులను ఆక్రమించుకున్నారు. క్రీ.శ. 1760లో వందవాశి వద్ద జరిగిన యుద్ధంలో బ్రిటిష్ సైన్యాధికారి సర్ ఐర్‌కూట్, ఫ్రెంచి నాయకులైన బుస్సీ, లాలీలను ఓడించాడు. బ్రిటిష్‌వారు పాండిచ్చేరిని ముట్టడించి ఆక్రమించుకున్నారు.
మాహె, జింజి స్థావరాలను కూడా ఫ్రెంచివారు కోల్పోయారు. హిందూ దేశంలో ఫ్రెంచి అధికారం పూర్తిగా క్షీణించింది. సప్తవర్ష సంగ్రామం 1763లో పారిస్ సంధితో ముగిసింది. సంధి షరతుల ప్రకారం పాండిచ్చేరి, ఇతర స్థావరాలను ఫ్రెంచివారికి అప్పజెప్పారు. కానీ వాటిని సైనికపరంగా అభివృద్ధి చేయడానికి వీలు లేదు. వర్తకానికి మాత్రం ఉపయోగించుకోవచ్చు. బ్రిటిష్ వారు తమ ప్రత్యుర్థులైన ఫ్రెంచివారి అధికారాన్ని నశింపజేసిన తర్వాత హిందూ దేశ ఆక్రమణకు సంసిద్ధులయ్యారు. అయితే ఫ్రెంచి వారితో వాళ్ల మిత్ర రాజులతో జరిపిన యుద్ధాల్లో ఇంగ్లిష్‌వాళ్లు కొన్ని విలువైన పాఠాలు నేర్చుకున్నారు. దేశంలో జాతీయవాదం పూర్తిగా అదృశ్యమైన పరిస్థితుల్లో స్వదేశీ రాజుల పరస్పర యుద్ధాలను స్వప్రయోజనాలకు అనుకూలంగా ఉపయోగించుకొని తమ రాజకీయ లక్ష్యాన్ని నిరభ్యంతరంగా పూర్తి చేసుకోవచ్చునన్నది ఇంగ్లిష్‌వాళ్లు నేర్చుకున్న మొదటి పాఠం. రెండోది-పాశ్చాత్య పద్ధతుల్లో సుశిక్షతమైన ఐరోపా, భారతీయ కాల్బలం ఆధునిక ఆయుధాలతో శతఘ్నులతో పాత తరహా భారతీయ సైన్యాల్ని సులువుగా ఓడించవచ్చు. మూడోది యూరోపియన్ పద్ధతిలో శిక్షణ, ఆధునిక ఆయుధాలు కలిగిన భారతీయ సైనికుడు యూరోపియన్ సైనికుడితో సమ ఉజ్జీ కాగలడని రుజువైంది.
ఫ్రెంచివారి పతనానికి గల కారణాలు
-ఫ్రెంచి వర్తక కంపెనీ ప్రభుత్వ సంస్థ. ఏ చిన్న సమస్య వచ్చినా ఫ్రాన్స్ రాజు అనుమతి పొంది సమస్యను పరిష్కరించుకోవాలి. కానీ ఆంగ్లేయ కంపెనీ స్వతంత్ర వాణిజ్య వ్యవస్థ కాబట్టి ఆ కంపెనీ తక్షణమే అన్ని సమస్యలను పరిష్కరించుకొని ఆర్థిక వనరులను పెంచుకోవడంతో ఫ్రెంచివారి మీద విజయం సాధించగలిగింది.
-ఫ్రెంచి కంపెనీకి తగిన నౌకాబలం లేదు. సైనిక వ్యవస్థ పటిష్ఠంగా లేదు.
-ఆంగ్లేయులకు తగిన నౌకాబలం పటిష్ఠంగా ఉంది. సుశిక్షితులైన సైనికులు ఉన్నారు. కాబట్టి వారు ఫ్రెంచివారిని సునాయాసంగా ఓడించగలిగారు.
-ఆంగ్లేయులకు మంచి రాజకీయ, సైనిక నాయకత్వం లభించింది. రాబర్ట్ ైక్లెవ్, వారెన్స్, సాండర్స్ గొప్ప సామర్థ్యం కలిగిన సైనికాధిపతులు. ఫ్రెంచివారికి కూడా బుస్సీ, డూప్లే వంటి సమర్థవంతమైన అధికారులు ఉన్నారు. కానీ వారి కింది ఉద్యోగులు అసమర్థలు కావడంతో వారి ప్రతిభ రాణించలేదు. కాబట్టి ఫ్రెంచివారు ఓడిపోయారు.
-ఫ్రాన్స్.. యూరప్‌లో అనేక యుద్ధాల్లో తలదూర్చడంతో వనరులన్నీ అంతరించిపోయాయి. దీంతో ఫ్రాన్స్ యూరప్‌లో ఏమీ సాధించలేకపోగా, వలసల్లో సైతం ప్రఖ్యాతిని కోల్పోయింది. ఇంగ్లండ్ యూరప్ ఖండంలో సంభవించిన యుద్ధాల్లో చాలావరకు తలదూర్చలేదు. వలసల్లో సంపదను పెంచుకొంది కాబట్టి ఇంగ్లండ్ ఫ్రెంచివారిని ఓడించగలిగింది.
-ఫ్రాన్స్‌లో నిరంకుశ రాజరిక విధానం రాజ్యమేలింది. పద్నాలుగో లూయీ అనేక యుద్ధాలు చేయడంతో ఫ్రెంచి ఖజానా వట్టిపోయింది. పద్నాలుగో లూయీ అనంతరం వచ్చిన రాజులు అసమర్థులు కావడంతో ఫ్రెంచివారి శక్తి నశించింది. ఇంగ్లండ్ రాజ్యాంగబద్దమైన రాజరికంవైపు పురోగమించి తన శక్తిని పెంచుకొంది. కాబట్టి ఫ్రెంచివారు ఓడిపోయారు. ఆంగ్లేయులు విజయం సాధించారు.
బ్రిటిష్‌వారి బెంగాల్ ఆక్రమణ
-దేశంలో బ్రిటిష్ రాజకీయాధిపత్యానికి 1757లో జరిగిన ప్లాసీ యుద్ధం నాందిపలికింది. ఆ యుద్ధంలో ఇంగ్లిష్ తూర్పుఇండియా బలాలు బెంగాల్ నవాబు సిరాజుద్దౌలాని ఓడించాయి.
-దేశంలోని రాష్ర్టాల్లో బెంగాల్ మహా సస్యశ్యామలమైన సంపన్న రాష్ట్రం. బెంగాల్లో పరిశ్రమలు, వాణిజ్యం ఉచ్ఛస్థితిలో ఉన్నాయి. తూర్పు ఇండియా కంపెనీకిగాని, కంపెనీ ఉద్యోగులకుగాని ఆ రాష్ట్రంలో అత్యంత లాభదాయకమైన వ్యాపార ప్రయోజనాలున్నాయి.
-1717లో మొఘల్ చక్రవర్తి ప్రసాదించిన ఫర్మానా పుణ్యమా అని ఇంగ్లిష్వాళ్లకి బెంగాల్లో ప్రత్యేక హక్కులు, సౌకర్యాలు సమకూరాయి. వ్యాపార సుంకాలు కట్టకుండానే బ్రిటిష్ ఎగుమతి, దిగుమతుల స్వేచ్ఛ అక్కడ ఉంది.
-ఎగుమతి, దిగుమతి సరకుల రవాణాకు పాసులు (దస్తక్‌లు) జారీచేసే హక్కు ఇంగ్లిష్వాళ్లకి ఆ ఫర్మానా ద్వారా దక్కింది. కంపెనీ ఉద్యోగులకు ప్రైవేటు వ్యాపారం చేసుకునే హక్కు ఉండేదిగాని ఈ మొఘల్ ఫర్మానా వాళ్లకి వర్తించదు.
-భారతీయ వర్తకుల మాదిరిగా కంపెనీ ఉద్యోగులు సైతం తమ ప్రైవేటు వ్యాపార కార్యకలాపాల్లో సుంకాలు చెల్లించాలి. కంపెనీకి, బెంగాల్ నవాబులకు మధ్య ఆరని చిచ్చు రగిల్చిన ఘనత ఆ ఫర్మానాదే.
-ఆ ఫర్మానా మూలంగా బెంగాల్ ప్రభుత్వం చాలా ఆదాయాన్ని నష్టపోయింది. కంపెనీ సరుకుల రాకపోకలకు సంబంధించి దస్తక్‌లు జారీచేసే హక్కు ఇంగ్లిష్ వాళ్లకు ఉండటం చేత కంపెనీ ఉద్యోగులు ఆ హక్కుని దుర్వినియోగపర్చడానికి అలవాటుపడి పన్ను ఎగవేసేవాళ్లు. ముర్షిద్ కులీఖాన్ మొదలుకొని అలీవర్దీఖాన్ దాకా బెంగాల్‌ను ఏలిన నవాబులెవరూ.. 1717 నాటి మొఘల్ ఫర్మానాకు ఇంగ్లిష్‌వాళ్లు ఇచ్చిన అర్థ వివరణతో ఏకీభవించలేదు. వాళ్లు ఇంగ్లిష్‌వాళ్ల చేత ఏటా ఒక మొత్తంగా డబ్బు కట్టించుకున్నారు. దస్తక్‌లు జారీచేసే హక్కును దుర్వినియోగపర్చకుండా కట్టడి చేశారు. అయితే కంపెనీ ఉద్యోగులు మాత్రం తమ ప్రైవేటు వ్యాపారానికి సంబంధించి అవకాశం దొరికితే చాలు పన్నులు ఎగవేసి నవాబుల అధికారాన్ని ఎదిరించారు.
-అయితే 1756లో సిరాజ్ ఉద్దౌలా తన తాతగారైన అలీవర్దాఖాన్ అనంతరం రాజ్యానికి రాగానే వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చాయి. సిరాజ్ యువకుడు. అతనికి ముక్కుమీద కోపం. ముర్షిద్ కులీఖాన్ కాలంలో ఇంగ్లిష్‌వాళ్లు ఏ ప్రాతిపదిక మీద వ్యాపారం చేసుకున్నారో, అదే ఇప్పుడూ కొనసాగాలని సిరాజ్ స్పష్టంచేశాడు. దక్షిణాదిన ఫ్రెంచి వాళ్లమీద దిగ్విజయాలు సాధించిన ఇంగ్లిష్‌వాళ్లు సిరాజ్ ఉద్దౌలా విధించిన నిర్బంధాలను ఎదిరించారు. స్వేదేశీ రాజుల రాజకీయ, సైనిక బలహీనత వాళ్లకిప్పుడు బాగా తెలుసు. అందుకే తమ సరుకుల మీద నవాబుకు సుంకాలు చెల్లించడానికి నిరాకరించడమేగాక, తమ ఆధీనంలోని కలకత్తా రేవులో ప్రవేశించే భారతీయ వర్తకుల సరుకుల మీద కంపెనీ వ్యాపార సుంకాలు పెంచింది. సహజంగానే యువ నవాబు మండిపడ్డాడు. బెంగాల్ సింహాసనం మీద తన ప్రత్యర్థులను ఎక్కించాలనే దురుద్దేశంతో కంపెనీ తన మీద కత్తికట్టిందని సిరాజ్‌కు మొదటి నుంచి అనుమానం.
-చంద్రనాగూర్‌లో బలంగా ఉన్న ఫ్రెంచివారికి వ్యతిరేకంగా ఇంగ్లిష్‌వాళ్లు బెంగాల్ అనుమతి లేకుండా కలకత్తాలో రక్షణ ఏర్పాట్లు చేసుకోవడంతో సిరాజ్ సహించలేకపోయాడు. దీన్ని తమ సార్వభౌమాధికారం మీద దాడిగా భావించాడు. ఐరోపా ప్రత్యర్థులను తన గడ్డమీద తగవులాడుకోనిస్తే కర్ణాటక నవాబుకు పట్టిన గతి తనకు పడుతుందని భావించాడు. యుద్ధ సన్నాహాలను ఆపమని ఉత్తర్వులు జారీచేశాడు. కానీ ఇంగ్లిష్‌వాళ్లు నిరాకరించారు. మొక్కై వంగనిది మానై వంగదు కాబట్టి.. ఇంగ్లిష్ వాళ్లని ఈ దేశపు చట్టాలకు బద్దులై ఉండేలా ఆదిలోనే వాళ్ల మెడలు వంచాలని సిరాజ్ నిర్ణయించాడు.
-కానీ అనవసర తొందరపాటుతో తగిన సన్నాహాలు చేసుకోకుండా ఖాసీంబజార్ను సిరాజ్ ఉద్దౌలా ముట్టడించి 1756 జూన్‌లో కలకత్తాలో ప్రవేశించాడు. కలకత్తాను ఆక్రమించుకుని అక్కడ ఖైదీలుగా దొరికిన బ్రిటిష్ వారిలో దాదాపు 146 మందిని జూన్ 20న ఒక చిన్నగదిలో బంధించాడు. మిగిలిన ఇంగ్లిష్‌వాళ్లు నౌకలు ఎక్కి పారిపోతుంటే చూసి ఊరుకొని, వాళ్ల మీద తేలిగ్గా సాధించిన విజయానికి ఉబ్బిపోయి సిరాజ్ కలకత్తా నుంచి నిష్క్రమించాడు. ఇది ఆయన చేసిన అతిపెద్ద తప్పిదం. శత్రువు బలాన్ని తక్కువగా అంచనా వేశాడు. సముద్రానికి సమీపంలో పుల్టాలో ఇంగ్లిష్ అధికారులు తలదాచుకొని మద్రాస్ నుంచి సహాయం అందే వరకు నిరీక్షిస్తూ కూర్చున్నారు.
-కలకత్తా చీకటిగది ఉదంతం: 1756 జూన్ 20న కలకత్తాలో యుద్ధ ఖైదీలుగా దొరికిన బ్రిటిష్ వారు 146 మందిని సిరాజ్ ఒక చిన్నగదిలో బంధించాడు. గాలి వెలుతురు లేని ఆ చీకటి గదిలో వేసవి రాత్రి వేడికి భరించలేక అనేక మంది ఖైదీలు మృతిచెందారు. ఈ కలకత్తా చీకటి గది ఉదంతం బ్రిటిష్ అధికారులకు భయాందోళనలు కలిగించడమే కాక, ప్రతీకార చర్యకు పురికొల్పి, భారతదేశ ఆక్రమణకు దారి తీసిందని చెప్పవచ్చు. కానీ, కొద్ది మంది చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం కలకత్తా చీకటి గది ఉదంతం బందీల్లో ఒక్కడైన వెల్ సృష్టించిన కథనం మాత్రమేనని, 146 మంది ఖైదీలను అతడు అన్నట్లు 18 అడుగుల చిన్నగదిలో బంధించడం అసాధ్యమని, ఇది పూర్తిగా అభూతకల్పన అని భావించారు.
ప్లాసీ యుద్ధం (క్రీ.శ. 1757 జూన్ 23న)
-సిరాజుద్దౌలా దర్బార్లోని ప్రముఖులతో మంతనాలు జరిపి ఇంగ్లిషు వారు ఒక విద్రోహ ముఠాను తయారు చేసి ఉంచారు. మీర్బక్షీగా మీర్ జాఫర్, కలకత్తా అధికారి మాణిక్‌చంద్, ధనవంతుడు బమినాంద్, బెంగాల్లో పేరుమోసిన బ్యాంకర్ జగల్సేఠ్, నవాబు సైన్యాధికారి ఖాదీంఖాన్ ఇంగిష్ వాళ్లతో చేరి కుట్రదారుల ముఠాగా తయారయ్యారు. అడ్మిరల్ వాట్సన్, కల్నల్ ైక్లెవ్ల ఆధ్వర్యంలో మద్రాస్ నుంచి భారీ సైనిక బలగాలు కలకత్తా చేరాయి. 1757 ప్రారంభంలో ైక్లెవ్ కలకత్తాను తిరిగి స్వాధీనం చేసుకొని, ఇంగ్లిష్ వాళ్ల కోర్కెలన్నింటికి నవాబు మెడలు వంచి ఒప్పించాడు. అయినా ఇంగ్లిష్ వాళ్లు సంతృప్తి చెందక వాళ్లు చెప్పినట్లే వినే ఒక కీలుబొమ్మను సిరాజ్ ఉద్దౌలా స్థానంలో నిలుపాలని నిశ్చయించుకున్నారు. నవాబు శత్రువులంతా కలిసి పన్నిన కుట్రతో ఇంగ్లిష్ వాళ్లు ఏకమై మీర్జాఫర్ను బెంగాల్ సింహాసనం ఎక్కించటానికి పూనుకున్నారు. క్రీ.శ. 1757 జూన్ 23న ముర్షిదాబాద్‌కు 20 మైళ్ల దూరంలో ప్లాసీ రణక్షేత్రంలో జరిగిన యుద్ధంలో సిరాజ్ ఉద్దౌలా ఓడిపోయి వధించబడ్డాడు. నవాబు సైన్యాన్ని నడిపిన కుట్రదార్లు, మీర్జాఫర్, రాయ్దుర్లబ్లు యుద్ధంలో పాల్గొనలేదు. మీర్ మదన్ మోహన్‌లాల్ అనే ఇద్దరు విశ్వాసపాత్రులైన యోధుల నాయకత్వంలో కొద్దిమంది నవాబు సైనికులు ధైర్య సాహాసాలతో పోరాడారు. ప్లాసీయుద్ధం ముగియడంతో భారతదేశానికి అంతమెరుగని విషాద కాళరాత్రి దాపురించింది అని బెంగాలీ కవి నబీన్ చంద్రసేన్ వర్ణించాడు. ఇంగ్లిషు వాళ్లు మీర్జాఫర్ను బెంగాల్ నవాబుగా ప్రకటించి, తమకు కట్నాలు, కానుకల కోసం ఎగబడ్డారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు