1857 తిరుగుబాటు వైఫల్యానికి కారణాలు
- తిరుగుబాటు తన లక్ష్యాన్ని, విజయాన్ని సాధించడంలో విఫలమయ్యింది. కానీ భారతదేశ చరిత్రలో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. అధునాతన ఆయుధాలు కలిగిన బలమైన శత్రువుకు వ్యతిరేకంగా గెలిచే అవకాశం వారికి లేకపోయింది. తిరుగుబాట్లు మొదలైన సంవత్సరంలోపే అణచివేయబడ్డాయి. ఈ వైఫల్యానికి అనేక కారణాలున్నాయి. ఈ తిరుగుబాటు పరిమితమైంది. దేశంలోని అన్ని ప్రాంతాలకు విస్తరించలేదు. దేశంలోని చాలా ప్రాంతాలపై దీని ప్రభావం లేదు. ముఖ్యంగా దోఆబ్ ప్రాంతం, సింధ్, పంజాబ్, రాజ్‌పుతానా, కశ్మీర్, దక్షిణ భారతదేశం ఈ తిరుగుబాటులో పాల్గొనలేదు.
- వివిధ ప్రాంతాల్లో జరిగిన తిరుగుబాట్లు సమన్వయపరచబడలేదు. మొదట వచ్చిన విజయాల ద్వారా వారు తిరుగుబాటును మంచి స్థాయికి తీసుకొని పోలేకపోయారు.
- స్థానిక రాజులు వారికి సహాయ సహకారాలు అందించలేదు. ముఖ్యంగా గ్వాలియర్ సింధియాలు, ఇండోర్ హోల్కర్లు, హైదరాబాద్ నిజాం, జోధ్‌పూర్ రాజు, భోపాల్ నవాబులు, పాటియాల, సింధ్, కశ్మీర్, నేపాల్ రాజులు బ్రిటిష్ వారికి అండగా నిలిచారు. మిగతా 99 శాతం రాజులు తటస్థంగా ఉన్నారు.
- తిరుగుబాటుదారులు సమాజంలో అన్ని వర్గాలను కలుపుకొనిపోవడంలో విఫలమయ్యారు. చాలామంది జమీందార్లు వీరికి సహాయం చేయలేదు. పైగా వారు బ్రిటిష్ వారికి సహకారాన్ని అందించారు.
- ఆధునిక విద్యావేత్తలు, మధ్యతరగతి వారు తిరుగుబాటుదారులకు ఎటువంటి సహాయం చేయలేదు.
- తిరుగుబాటు ఒక పథకం ప్రకారం, వ్యూహరచన ప్రకారం జరిగింది కాదు. స్వాధీనం చేసుకొన్న ప్రాంతాల్లో వ్యాప్తిచేయడానికి వారి వద్ద సరైన భావజాలం లేదు. ఎవరికి కూడా ఎటువంటి అడుగువేయాలో, ఎటువంటి చర్యలు తీసుకోవాలో అనే విషయంపై అవగాహన లేదు.
- లక్ష్యం వైపునకు నడిపించే సరైన నాయకత్వం లేకపోవడం ఫలితంగా తిరుగుబాటు వైఫల్యానికి దారితీసింది. తిరుగుబాటు యాదృచ్ఛికంగా జరిగింది. తిరుగుబాటుదారులు చాలామందే ఉన్నా వారిని సరైన దారిలో నడిపేటంత మంది నాయకులు గాని, సైన్యాధికారులు గాని లేరు. రాణి లక్ష్మీబాయి, నానా సాహెబ్, తాంతియా తోపే గొప్ప నాయకులే కానీ వారు మొత్తం తిరుగుబాటుకు సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించలేకపోయారు. తిరుగుబాటుదారులందరినీ ఒక్కతాటిపైకి తెచ్చే లక్ష్యం దిశగా నడిపించే సమర్థవంతమైన నాయకులు లేరు.
- సిపాయిల మధ్య ఐకమత్యం లేదు. నాలుగు వర్గాల్లో రెండు వర్గాలవారు మాత్రమే తిరుగుబాటులో పాల్గొన్నారు. సిపాయిల్లో 50 శాతం మంది మాత్రమే తిరుగుబాటు చేశారు. బొంబాయి, మద్రాస్ రెజిమెంట్లు తిరుగుబాటులో పాల్గొనలేదు.
- తిరుగుబాటుదారుల మధ్య సమన్వయం లేదు. ప్రతి ఒక్కరూ వారి సొంత నిర్ణయాలు తీసుకున్నారు.
- తిరుగుబాటుదారుల కారణాలు, వారి లక్ష్యాలు వేర్వేరుగా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో స్థానిక జమీందారుల మీద, వడ్డీ వ్యాపారుల మీద తిరుగుబాటు చేశారు. వారికి అంతకంటే పెద్ద లక్ష్యం లేదు. వారిలో జాతీయత కరువైంది.
- తిరుగుబాటుదార్ల వద్ద ఆధునిక ఆయుధాలు గాని, కవాల్సినంత ధనం గాని లేదు. ఉన్న కొద్ది ఆయుధాలు కూడా కాలం చెల్లినవి. కానీ బ్రిటిష్ వారి వద్ద ఆధునిక ఆయుధాలు, రవాణా సౌకర్యాలు, సమాచార వ్యవస్థ ఉంది. అంతేకాక సామర్థ్యం కలిగిన హావ్లాక్, క్యాంప్‌బెల్, హ్యూరోజ్ వంటి సైనికాధికారులున్నారు. వారు అద్భుతమైన వ్యూహరచనతో తిరుగుబాటును పూర్తిగా అణచివేయగలిగారు.
- తిరుగుబాటు కాలంలో సమయం కూడా వారికి అనుకూలంగా ఉంది. 1856 నాటికి క్రిమియా, చైనా యుద్ధాలు ముగిశాయి. దీంతో బ్రిటిష్ ప్రభుత్వం తిరుగుబాటుపైనే దృష్టి కేంద్రీకరించగలిగింది.
- తిరుగుబాటుకు ఎవరి కారణాలు వారికున్నాయి. రాజులు, రాణులు పోయిన తమ రాజ్యం, పరువు కోసం, జమీందారులు, తాలూక్దార్లు పోయిన వారి భూమి కోసం, రైతులు తమ అసంతృప్తికి వ్యతిరేకంగా, సైనికులు తమ ఆర్థిక లాభాల కోసం వివిధ కారణాలతో తిరుగుబాటులో పాల్గొన్నారు. కానీ అందరిని కలిపి ఒకే వేదిక మీద నిలబెట్టే ఏకైక కారణం లేదు. ఫలితంగా ఎవరి కారణం కోసం వారు పోరాటం జరిపారు.
- తిరుగుబాటు దీర్ఘకాలం జరగలేదు. బ్రిటిష్ సైన్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటుదారులు తమ సైన్యాన్ని ఏకం చేయలేకపోయారు. వారంతా ప్రత్యేక కారణాల కోసం వేర్వేరు సమయాల్లో తిరుగుబాటు చేశారు. బహుశా అందరూ కలిసి తమ సైన్యాలను ఏకం చేసి పోరాడి ఉంటే గెలిచేవారేమో కానీ వివిధ సమయాల్లో జరగడం వల్ల ప్రభుత్వం వాటిని సులభంగా అణచివేసింది.
- చరిత్రకారులు తిరుగుబాటుపై భిన్నమైన అభిప్రాయాలు వెలిబుచ్చారు. కొందరు దీన్ని సిపాయిల తిరుగుబాటు అంటే కొందరు దీనికి క్రైస్తవ మతానికి వ్యతిరేకంగా జరిగిన యుద్ధమని, తెల్లవారికి-నల్లవారికి జాతి ఆధిపత్యం కోసం జరిగిన పోరాటం అని, హిందువులుకు-పాశ్చాత్యులకు మధ్య జరిగిన సంఘర్షణ అని అన్నారు.
- వినాయక్ దామోదర్ సావర్కర్ దీన్ని ‘మొదటి స్వాతంత్య్ర పోరాటం’ అని అభవర్ణించారు. ఆర్సీ మజుందార్, ఎస్ఎన్ సేన్ వంటి చరిత్రకారులు 1857 తిరుగుబాటు జాగ్రత్తగా పథకం ప్రకారం వేయబడిన ప్రణాళిక కాదని, దీనికి వ్యూహం రచించగలిగే మేధావులు లేరని చెప్పారు. బ్రిటిష్ చరిత్రకారుడు జీబీ మాలేసన్ తన గ్రంథం ‘ఇండియన్ మ్యూటినీ’లో, చార్లెస్ రైక్స్ తన గ్రంథం ‘నోట్స్ ఆన్ రివోల్ట్’లో ఇది కేవలం ఒక తిరుగుబాటు అని అన్నారు. టీఆర్ హోమ్స్ ఇది నాగరికతకు, అనాగరికతకు మధ్య జరిగిన సంఘర్షణ అన్నారు. ఎల్ఈఆర్ రెస్ ఇది క్రైస్తవ మతానికి వ్యతిరేకంగా జరిగిన మత పోరాటం అన్నాడు.
- అయితే 1857 తిరుగుబాటును జాతీయ పోరాటంగా వర్ణించలేం. రెండో బహదూర్ షా జాఫర్, ఝాన్సీ లక్ష్మీబాయి, నానాసాహెబ్ వారి సొంత కారణాల కోసం పోరాటం చేశారు. ఈ పోరాటం కొందరిని తప్ప అందరిని కలుపుకొని పోలేకపోయింది. ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈ తిరుగుబాటులో ముఖ్యంగా పాల్గొన్నది సిపాయిలే. వీరికి కూడా ఇంతకు మునుపు జరిగిన స్థానిక తిరుగుబాట్ల వలె ప్రత్యేక కారణాలున్నాయి. కాబట్టి బ్రిటిష్ వారు దీన్ని తిరుగుబాటు అన్నారు. భారతీయులు మాత్రం దీన్ని ప్రథమ స్వాతంత్య్ర పోరాటంగా భావించారు. ఇది సిపాయిలతో మొదలైనప్పటికీ అనతికాలంలోనే వివిధ ప్రాంతాలు, వర్గాల ప్రజలతో ప్రోత్సాహాన్ని నింపడమే గాక జాతీయ ఉద్యమానికి దోహదం చేసింది.
- 1857 తిరుగుబాటు అణచివేయబడినా బ్రిటిష్ సామ్రాజ్యపు పునాదులను కదిలించిందని చెప్పవచ్చు. ఈ తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ వారు విభజించు పాలించు అనే సూత్రాన్ని జాగ్రత్తగా పాటించారు. సివిల్, మిలిటరీ పాలనలోని ముఖ్యమైన ఉద్యోగ స్థానాలన్నింటిని తమ నియంత్రణలో ఉంచుకున్నారు. పరిపాలన విధానాన్ని సమూలంగా మార్చివేశారు.
- 1858, నవంబర్ 1లో వచ్చిన విక్టోరియా మహారాణి ప్రకటనతో భారతదేశ పరిపాలన ఈస్టిండియా కంపెనీ చేతుల నుంచి బ్రిటిష్ ప్రభుత్వం చేతిలోకి మారిపోయింది.
- దీంతో కంపెనీ ఏర్పాటు చేసిన పరిపాలనా విధానం మారిపోయింది. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ స్థానంలో బ్రిటిష్ పార్లమెంట్లో క్యాబినెట్ స్థాయి కలిగిన మంత్రి భారతదేశ కార్యదర్శిగా నియమితులయ్యాడు. అతడికి సహాయం చేయడానికి 15 మంది సభ్యులతో కూడిన సలహా సంఘం అనేకమంది సభ్యులతో కూడిన సచివాలయం ఉంటుంది. భారతదేశంలో పరిపాలన గవర్నర్ జనరల్ వైస్రాయ్ అనే పేరుతో కొనసాగిస్తాడు. రాణి ప్రకటన ప్రాదేశిక, రాజ్యాల, ఆస్తుల, పొడిగింపు ఉండదని, సాంఘిక సాంస్కృతిక, మత విషయాల్లో జోక్యం ఉండదని, స్వదేశీ రాజుల హక్కులు, వారి గౌరవం కాపాడబడుతుందని హామీ ఇచ్చింది.
- 1858 విక్టోరియా మహారాణి ప్రకటన నూతన విధానాలను ప్రకటించింది. ప్రాదేశిక సంస్థానం, రాజ్యాల పొడిగింపును రద్దుచేసింది. స్వదేశీ రాజుల భద్రతకు హామీ ఇచ్చింది. వారు బ్రిటిష్ ప్రభుత్వానికి సహకరించేటట్లయితే వారి హక్కులు, గౌరవం కాపాడుతామని చెప్పింది. స్వదేశీ రాజులకు, సహజ వారసులు లేకుండా దత్తత తీసుకోవచ్చని చెప్పింది. హిందూ ముస్లిం రాజులు ఏకం కాకుండా ‘విభజించు పాలించు’ అనే సూత్రాన్ని క్రియాశీలంగా అనుసరించి అమలుచేశారు.
- భారతదేశంలోని బెంగాల్, బొంబాయి, మద్రాస్ ఈ మూడు ప్రాంతీయ రాష్ర్టాల గవర్నర్లను బ్రిటిష్ ప్రభుత్వమే నిర్ణయిస్తుంది. ఇతర ప్రాంతాల్లో ఉండే లెఫ్టినెంట్ గవర్నర్లను గవర్నర్ జనరల్ నియమిస్తాడు. కంపెనీ పాటించిన కేంద్రీకృత విధానం స్థానంలోనే 1861 శాసన చట్టం ప్రకారం వికేంద్రీకరణ విధానం ఏర్పాటు చేయబడంది. దీని ప్రకారం శాసనసభను, ఆర్థిక వికేంద్రీకరణను ప్రవేశపెట్టి కేంద్ర, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను వేరు చేసింది. 1882లో రిప్పన్ తీర్మానం స్థానిక సంస్థల సాధికారతతో పాటు మరింత వికేంద్రీకరణకు దోహదపడింది.
- భారతదేశంలో బ్రిటిష్ వారి అధికారాన్ని బలోపేతం చేసే విధంగా సైన్యం పునర్వ్యవస్థీకరించబడింది. ముందు మరిన్ని తిరుగుబాట్లు జరగకుండా చర్యలు తీసుకోబడ్డాయి. ఆ సైన్యంలోని అన్ని కీలక పదవుల్లో బ్రిటిష్వారినే నియమించారు. బ్రిటిష్ సైనికుల సంఖ్య, సైనిక అధికారుల సంఖ్య పెంచారు. ఫిరంగి దళంలో భారతీయులను నియమించడం నిషేధించింది.
- తిరుగుబాటు వైఫల్యం వివిధ వర్గాల మధ్య దూరాన్ని పెంచింది. ముఖ్యంగా హిందూ ముస్లింలు తిరుగుబాటు వైఫల్యానికి ఒకరు కారణమంటే ఒకరు కారణం అని నిందించుకున్నారు. ఏదేమైనా అన్ని వర్గాల వారు బ్రిటిష్‌వారిపై తీవ్ర ద్వేషాన్ని పెంచుకున్నారు. అంతేగాక తమ దేశంలో తమ స్థాయికి ద్వితీయ స్థాయి పౌరులుగా దిగజార్చడాన్ని వారు తీవ్రంగా వ్యతిరేకించారు.
- విక్టోరియా రాణి ప్రకటన ప్రకారం ఉద్యోగులు, అధికారుల నియామకంలో జాతి వివక్ష తొలగించబడింది. ఈ నియామకాల్లో విద్య, సామర్థ్యం, సమగ్రతను పరిగణనలోకి తీసుకుంటామని తెలపబడింది. ఫలితంగా 1861లో ఇండియన్ సివిల్ సర్వీసెస్ చట్టం ప్రవేశపెట్టబడింది. తిరుగుబాటుకు ముఖ్య కారణం బ్రిటిష్ పరిపాలనకు భారతీయులకు మధ్య పరిపాలనకు సంబంధించిన భాగస్వామ్యం లేకపోవడమేనని భావించిన ప్రభుత్వం 1861లో ఇండియన్ కౌన్సిల్ చట్టాన్ని ప్రవేశపెట్టి భారతీయుల ప్రాతినిథ్యాన్ని పెంపొందించి బ్రిటిష్ వారికి భారతీయులకు మధ్య ఉన్న అపార్థాలను దూరం చేసే ప్రయత్నం చేసింది. తిరుగుబాటు కాలంలో బ్రిటిష్ వారికి సహాయం చేసిన స్థానిక రాజులను ఘనంగా సత్కరించారు. తిరుగుబాటు సమయంలో తిరుగుబాటులో పాల్గొన్న అవధ్ తాలూక్‌దార్లను తిరిగి పూర్వపు స్థానంలో ఉంచారు. వారిని అవధ్ జమీందార్లుగా పిలవడం వారికి గర్వంగా తోచింది. వారు అవధ్ మద్దతుదారులుగా మారిపోయారు.
- తిరుగుబాటు అనంతరం వచ్చిన మత భావనలు చాలా దుర్భరంగా పరిణమించాయి. తిరుగుబాటు అనంతరం జాతి తీవ్రత ఎక్కువైంది. బ్రిటిష్ వారు భారతీయులను అమానవీయ జీవులుగా భావించడమే గాక వారిపై నిరంతర తనిఖీ ఉండాలని నిర్ణయించారు. భారతీయులపై వారికి సరైన అభిప్రాయం లేదు. వారిని అనేక అవమానాలకు గురి చేశారు. బ్రిటిష్ వారు అన్ని విధాలా అధికులమని భావించారు. ఫలితంగా భారతీయులు, బ్రిటిష్ వారికి మధ్య అగాథం పెరుగుతూ వచ్చింది. 1857 తిరుగుబాటు బ్రిటిష్ వారి సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా, భారతీయుల్లో జాతీయ భావనను కల్పించడమేగాక తర్వాత జాతీయ ఉద్యమానికి దోహదపడింది.
మాదిరి ప్రశ్నలు
1. 1857 తిరుగుబాటును ‘ప్రథమ భారత స్వాతంత్య్ర సంగ్రామం’గా అభివర్ణించింది?
1) జవహర్లాల్ నెహ్రూ
2) వినాయక్ దామోదర్ సావర్కర్
3) గణేశ్ సావర్కర్
4) భగత్ సింగ్
2. తిరుగుబాటు జరిగిన ప్రాంతం, నాయకత్వం వహించిన వారిని జతపర్చండి?
1. ఢిల్లీ ఎ. భక్త్‌ఖాన్
2. కాన్పూర్ బి. నానాసాహెబ్
3. ఝాన్సీ సి. రాణి లక్ష్మీబాయి
4. బీహార్ డి. కున్వర్ సింగ్
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-బి, 2-ఎ, 3-సి, 4-డి
4) 1-డి, 2-ఎ, 3-సి, 4-బి
3. ‘ఇండియన్ మ్యూటినీ’ గ్రంథ రచయిత?
1) జవహర్ లాల్ నెహ్రూ
2) వీడీ సావర్కర్
3) జీబీ మాలేసన్
4) చార్లెస్ రైక్స్
4. 1857 తిరుగుబాటును ఉద్దేశించి ఇది నాగరికతకు, అనాగరికతకు మధ్య జరిగిన సంఘర్షణ అన్నది?
1) చార్లెస్ రెయిక్స్
2) టీఆర్ హోమ్స్
3) ఎల్ఈఆర్ రెస్
4) మాలేసన్
5. కింది వాటిలో సరైనవి?
1) ఝాన్సీలో తిరుగుబాటును అణచివేసినది- హ్యూరోజ్
2) కాన్పూర్‌లో జరిగిన తిరుగుబాటును అణచివేసినది- క్యాంప్‌బెల్
3) ఢిల్లీలో జరిగిన తిరుగుబాటును అణచివేసినది- హడ్సన్
4) పైవన్నీ సరైనవే
6. బేగం హజ్రత్ మహల్ ఏ ప్రాంతంలో జరిగిన తిరుగుబాటుకు నాయక్తవం వహించినది?
1) అవధ్
2) అలహాబాద్
3) ఫైజాబాద్
4) ఢిల్లీ
7. హైదరాబాద్‌లో జరిగిన తిరుగుబాటుకు నాయకత్వం వహించినది?
1) తుర్రెబాజ్ ఖాన్
2) మౌల్వీ అల్లాఉద్దీన్
3) ఇమాన్ కలందర్
4) 1, 2
8. ఇండియన్ సివిల్ సర్వీసెస్ చట్టం ప్రవేశపెట్టిన సంవత్సరం?
1) 1858 2) 1861
3) 1862 4) 1871
సమాధానాలు :
1-2, 2-1, 3-3, 4-2,
5-4, 6-1, 7-4, 8-2.
గతవారం తరువాయి..
- బీహార్: బీహార్ ప్రాంతంలోని జగదీశ్‌పూర్ జమీందార్ కున్వర్సింగ్.
- బ్రిటిష్ ప్రభుత్వం అతడి భూములను, ఎస్టేట్‌ను స్వాధీనం చేసుకుంది. దీంతో కున్వర్ సింగ్ తిరుగుబాటు చేశాడు. ఇతడిని బీహార్ సింహం అని కూడా అంటారు.
- ఇక్కడ జరుగుతున్న తిరుగుబాటును అణచడానికి బ్రిటిష్ ప్రభుత్వం విలియం టేలర్, విన్సెంట్ ఐర్లను పంపింది. వారు కున్వర్ సింగ్‌ను చంపి తిరుగుబాటును అణచారు.
- ఈ ప్రధాన తిరుగుబాట్లే కాక అనేక ప్రాంతాల్లో చెదురుముదురు సంఘటనలు జరిగాయి. ఉదాహరణకు అలహాబాద్, వారణాసిలో మౌల్వీ లియాఖత్ అలీ నాయకత్వంలో, రాయ్‌బరేలీ- ఖాన్ బహదూర్ ఖాన్, హైదరాబాద్- తుర్రెబాజ్ ఖాన్, మౌల్వీ అల్లాఉద్దీన్ నాయకత్వంలో, మాండసోర్- ఫిరోజ్ షా, అస్సాం- మణిరాం దత్తా, కంద పరేశ్వర్ సింగ్, కులులో రాజా ప్రతాప్ సింగ్, రాజస్థాన్‌లో జయదయాళ్ సింగ్, గోరఖ్‌పూర్ గజాధర్ పాండే, మధురలో దేవీసింగ్, కదమ్ సింగ్, పానిపట్‌లో ఇమాన్ కలందర్, సతారాలో రాజా బాపూజీ గుప్తా. ఫైజాబాద్‌లో మౌల్వీ అహ్మదుల్లా నాయకత్వంలో తిరుగుబాట్లు జరిగాయి. వీటన్నింటినీ బ్రిటిష్ ప్రభుత్వం అణచివేసింది.
- సాసాల మల్లికార్జున్: అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కోరుట్ల
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు