రాజపుత్రల యుగం పౌరుషమే అలంకారం
ఉత్తర భారతదేశంలో హర్ష చక్రవర్తి తర్వాత వివిధ వంశాల రాజపుత్రులు ఏర్పాటుచేసుకొన్న ప్రాంతీయ రాజ్యాలు భారతీయ సమాజాభివృద్ధికి, సాంస్కృతిక వికాసానికి ఎనలేని సేవ చేశాయి. నిరంతరం యుద్ధాల్లో మునిగితేలినప్పటికీ రాజ్యంలోని ప్రజల సుఖ సంతోషాలను నిర్లక్ష్యం చేయలేదు. రాజపుత్ర యుగంలో సామాజికంగా, ఆర్థికంగా వచ్చిన మార్పులపై నిపుణ పాఠకులకు ప్రత్యేకం..
సేనవంశం
-11వ శతాబ్దంలో బెంగాల్‌ను పాలించిన పాల రాజులకు సామంతులుగా ఉన్న సేన వంశస్థులు, పాల రాజుల రాజకీయ బలహీనతను ఆసరాగా చేసుకొని పశ్చిమ బెంగాల్లో స్వతంత్ర రాజ్యస్థాపన చేశారు. అంతేగాక చివరి పాల రాజు మదనపాలున్ని విజయసేనుడు ఓడించి సేన వంశాన్ని స్థాపించాడు.
-వీరి రాజధాని నాడియా. వీరు కూడా రాజపుత్రులు కారు. వీరు తమ శాసనాల్లో కర్ణాటక క్షత్రియులుగా చెప్పుకోవటంతో వీరు కర్ణాటక ప్రాంతం నుంచి బెంగాల్‌కు వలస వచ్చారని భావించవచ్చు. వీరి నాయకుడు స్థానిక ప్రభు కుటుంబాలతో వివాహ సంబంధాలు చేసుకొని పాల రాజులకు సామంతుడిగా పనిచేసి ఆ తరువాత స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించాడని తెలుస్తుంది.
విజయసేన (1095-1158)
-ఇతడే సేన వంశ స్థాపకుడు. ఇతని పరిపాలన గురించి మనకు దియోవీర ప్రశస్తి శాసనంలో తెలుస్తుంది.
-ఇతను ప్రద్యుమ్నేశ్వర శివాలయాన్ని కట్టించాడు (రాజ్షాహి జిల్లా).
బల్లాల సేన (1158-1179)
-విజయసేనుడి కుమారుడు.
-ఇతడు మిథిలను జయించాడు.
లక్ష్మణసేనుడు (1179-1204)
-బల్లాలసేనుడి కుమారుడు.
-ఇతడు సేన వంశంలో ప్రసిద్ధిచెందిన రాజు. అంతేగాకుండా బెంగాల్‌ను పాలించిన చివరి హిందూ రాజు.
-ఇతడు సమకాలీన గహద్వాల రాజుపై గొప్ప విజయాన్ని సాధించాడు. బెంగాల్‌తో పాటు బీహార్‌లోని చాలా భాగాన్ని ఇతని ఆధీనంలో ఉంచుకున్నాడు.
-లక్ష్మణసేనుడు పూరి, వారణాసి, ప్రయాగలను ఆక్రమించి విజయస్తంభాలను నాటాడని ప్రతీతి.
-ఇతడు కవి, పండిత పోషకుడు. ఇతడి ఆస్థానంలో పంచరత్నాలు అనే కవులు ఉండేవారు.
-వారిలో గీతాగోవిందాన్ని రచించిన జయదేవుడు కూడా ఒకరు. ఇతర కవులు ద్యోయి పవనదూతం, హాలాయుధుడు బ్రాహ్మణ సర్వస్వం, శ్రీధరదాస సదుక్తి కరుణామృతాలను రచించారు.
-లక్ష్మణసేనుడి పాలనాకాలంలో క్రీ.శ. 1204లో మహ్మద్ ఘోరీ ప్రతినిధి భక్తియార్ ఖిల్జీ సేనరాజ్యంపై దాడిచేశాడు.
-భక్తియార్ ఖిల్జీ గుర్రాల వ్యాపారిగా మారువేషం వేసుకొని కేవలం 18 మందితో సేన రాజుల రాజధాని అయిన నాడియాలోకి ప్రవేశించాడు.
-అయితే తురుష్క గుర్రపు వ్యాపారులు రావడం అనేది ఆ రోజుల్లో సాధారణ విషయం కావున ఇతడిని ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. రాజభవనంలోకి చేరగానే భక్తియార్ ఖిల్జీ హఠాత్తుగా దాడిచేసి భారీ గందరగోళం సృష్టించాడు.
-రాజు లక్ష్మణసేనుడు పేరొందిన యోధుడు. అయితే తురుష్క సైన్యం ప్రవేశించిందనే ఆందోళనతో వెనుకదారిగుండా పరారై సోనార్గావ్ చేరుకొన్నాడు. దరిదాపుల్లో ఉన్న తురుష్క సైన్యం వెంటనే ప్రవేశించి ఆయుధగిడ్డంగిని, రాజు సంపదను స్వాధీనం చేసుకుంది.
-ఈ విధంగా భక్తియార్ ఖిల్జీ ఆక్రమణతో సేనవంశం అస్తమించింది.
-ఈ విధంగా హర్షుని మరణానంతరం ఉత్తర భారతదేశంలో రాజపుత్రులు అనేక ప్రాంతీయ రాజ్యాలు స్థాపించి పాలించారు. ఈ రాజ్యాల మధ్య రాజ్య విస్తరణకాంక్షతో పరస్పర యుద్ధాలు జరగడం, సామంతులు స్వతంత్ర రాజ్యాలు స్థాపించడం జరిగింది.
-అయితే మనం గమనించాల్సిన అంశం రాజపుత్ర రాజ్యాల రాజకీయ చరిత్రలో రాజకీయ అనైక్యత ప్రధానాంశం. ఈ రాజకీయ అనైక్యతను ఆసరాగా చేసుకొని ముస్లింలు సునాయాసంగా రాజపుత్ర రాజ్యాలను ఆక్రమించారు.
-ఫలితంగా భారతదేశచరిత్రలో రాజపుత్ర యుగం ముగిసి ఢిల్లీ సుల్తానుల యుగం ప్రారంభమైంది.
రాజకీయపరిస్థితులు:
రాజు దైవాంశసంభూతుడనే సిద్ధాంతాన్ని ప్రచారం చేసినప్పటికీ ప్రజల్లో మాత్రం అంతగా ఫలించలేదు. రాచరికం వంశపారంపర్యమైంది. రాజుకు సహాయంగా మహామంత్రి, మంత్రి, సేనాపతి, దండనాయక, సంధివిగ్రహిక, దూతక, ప్రతిమార, భాండాగారిక, పురోహిత మొదలైనవారు ఉండేవారు.
-అంతేగాకుండా వీరికాలంలో పాలనా నిర్వహణకు నిర్దిష్ట ప్రభుత్వ యంత్రాంగముండేదని, కాయస్త అనే ప్రత్యేక సామాజికవర్గంగా పిలిచేవారని, వీరికి జీతాలకు బదులు గ్రామాలపై వచ్చే ఆదాయాన్ని ఇచ్చేవారని కొన్ని సాహిత్యాల వల్ల తెలుస్తుంది.
-రాజ్యం అనేక విభాగాలుగా విభజించబడి కొంతమంది సామంతులకు దత్తం చేశారు. వీరే భూస్వాములుగా చెలామణి అయ్యారు. వీరికి వారసత్వ హక్కులుండేవి. భూస్వామ్య వ్యవస్థకు పునాదులు గతంలో పడినప్పటికీ దీని సౌధం మాత్రం రాజపుత్రుల కాలంలోనే బలపడింది. రాజపుత్రయుగంలో ప్రధానాంశం పరస్పర యుద్ధాలు. యుద్ధం రాజపుత్ర జాతీయ సంప్రదాయం. ప్రతీ రాజు తనకు ఇష్టమైన వారికి పొలాలను ఇచ్చేవాడు. అందుచేతనే ఈ యుగంలో భూస్వామ్యవ్యవస్థ అమల్లోకి వచ్చింది.
-అయితే ఈ భూస్వామ్య విధానం రాజ్యానికి తీరని నష్టం కలిగించింది. భూస్వాములు రైతుల దగ్గర అధికంగా శిస్తు వసూలుచేసి రాజుకు చాలా తక్కువగా ఇవ్వడం అనివార్యమైంది. దీంతో రాజు బలహీనుడై సామంతుల ప్రాబల్యాన్ని ఎదుర్కోలేక దెబ్బతిన్నది రైతాంగం. జాగీర్దారీ భూముల్లో నివసించే రైతులు 1/3వ వంతు భూమి పన్నుతో పాటు రహదారి పన్ను, సాగునీటి పన్ను, పర్ణకర (పుల్లరి), గోకర (పశుపోషణ) మొదలైన పన్నులతో ప్రజలు బాధలకు గురయ్యారు.
-ఈ కాలంలో పెద్ద ప్రాదేశిక విభాగాలను దేశం, భుక్తి, మండలం అనేవారు. సామాన్యంగా వీటికి అధిపతులుగా రాకుమారులుగాని, రాజ బంధువులు గాని ఉండేవారు. వీరిని మహాసామంతుడు, ఉపరికుడు, మహామండలేశ్వరుడు అని పిలిచేవారు.
-ప్రాదేశిక కింది విభాగం విషయ. దీని పాలకుడు విషయపతి లేక విషయాధికారి. విషయ కింద ఉండే విభాగం పథకం. దాని కింద పటల. అన్నింటికంటే దిగువ భాగం గ్రామం. 84 గ్రామాల కూటమిని ఒక పటల అని అంటారు.
-పట్టణ పరిపాలన కోసం మధ్యక అనే అధ్యక్షుడిని నియమించేవారు. పోలీసు నిర్వహణ కోసం రణకుని నియమించేవారు. గ్రామాల్లో మహాజన అనే పేరుతో గ్రామసభలు ఉండేవి. ఈ సభ అధ్యక్షుడిని మహంత లేదా మహత్తర లేదా పట్టలిక అనేవారు.
-ఈ యుగంలో సైన్యానికి విశేష ప్రాధాన్యం ఉండేది. అందుకు కారణం తరుచుగా యుద్ధాలు జరగడమే. గహద్వాల, సేన వంశాల శాసనాల్లో కనిపించే అశ్వపతి, గజపతి, నరపతి మొదలైన బిరుదుల వలన రాజపుత్ర సైన్యం లో 3 ప్రధానమైన భాగాలు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే సైన్యపోషణ భారం అధికంగా భూస్వాములపైనే ఉండేది. భూస్వాములు పోటాపోటీగా సైన్యభారాన్ని వహించేవారు. రాజపుత్రులకు యుద్ధం అనేది ఒక వినోదంగానో, ఆటగానో ఉండేది. బలమైన కోటలు నిర్మించడంలో రాజపుత్రులు బహునేర్పరులు. గ్వాలియర్, కలంజర్, ఆసిర్ఘర్ వంటి ప్రసిద్ధిచెందిన కోటలు రాజపుత్ర కోటలు.
-వీరు సంప్రదాయకమైన విల్లంబులు, కత్తులు, ఈటెలను వినియోగించి యుద్ధం చేసేవారు. అయితే రాజపుత్రులు యుద్ధప్రియులు అయినప్పటికీ యుద్ధ వ్యూహరచనలో గాని, ఆ యుద్ధాల్లో గాని అవసరమైన మార్పులు తీసుకురాకపోవడం వలన తక్కువ సంఖ్యలో సైన్యం కలిగిన మహ్మదీయుల దాడిలో సులభంగా ఓడిపోయారు.
ఆర్థిక పరిస్థితులు:
గ్రామాలు స్వయం సమృద్ధిని సాధించినా రవాణా సౌకర్యాలు లేనందున అధికోత్పత్తిని సాధించడానికి ప్రజలు ఆసక్తి చూపలేదు. ధర్మశాస్ర్తాలు విదేశీ పర్యటనను నిషేధించడం వలన సముద్రయానం చేయగూడదనే నిబంధనల వలన విదేశీ వాణిజ్యానికి తీవ్ర నష్టం వాటిల్లింది. రాజపుత్ర రాజ్యంలో నగరాలు ఎక్కువలేకపోవడానికి ఇదే కారణం.
-అయితే అరబ్బులు తీరప్రాంతాల నుంచి చైనావారితో విదేశీ వ్యాపారం జరిపేవారు. అతి తక్కువ స్థాయిలో లోహాలు, చేనేత వస్ర్తాలు మొదలైన భారత ఓడరేవుల ద్వారా ఈ దేశాలకు ఎగుమతి అయ్యేవి. గుర్రాలు, మద్యం, సుగంధ ద్రవ్యాలు, విలాస వస్తువులు మొదలైనవి ఈ దేశాల నుంచి దిగుమతి అయ్యేవి. ఈ కాలంలో శ్రేణుల ప్రాముఖ్యత అడుగంటిపోవడం వలన వాటి కార్యక్రమాలను కొంతవరకు భూస్వాములు చేపట్టారు. వడ్డీవ్యాపారం ఎక్కువగా జరిగి వ్యాపారులు విపరీతంగా లాభాలు గడించారు. వడ్డీరేటు కూడా 15 నుంచి 30 శాతం వరకు కులాన్ని బట్టి నిర్ణయించేవారు. ఈ విధంగా ఈ యుగంలో భూస్వామ్య వ్యవస్థ అభివృద్ధి చెందడం, వ్యవసాయం క్షీణించి ఉత్పత్తులు పడిపోవడం, స్వదేశీ, విదేశీ వ్యాపారం మందగించడం మొదలైన కారణాల వల్ల ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది.
సామాజిక పరిస్థితులు:
రాజపుత్ర యుగ సమాజంలో వర్ణవ్యవస్థ స్థిరపడింది. అనేక ఉపవర్ణాలు కూడా ఏర్పడ్డాయి. ఇవి అనులోమ, విలోమ వివాహాల వలన ఏర్పడ్డాయి. ఈ చతుర్వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణులు సమాజంలో ప్రథమస్థాయిని, గౌరవాధికారాన్ని, ప్రయోజనాలను అనుభవించారు. యాగాలు, యజ్ఞాలు, వివాహాలు, కర్మకాండలు మొదలైన మతపరమైన కర్మలను నిర్వహిస్తూ మతరంగంలో, మంత్రులుగా, రాజుకు సహాయదారులుగా రాజకీయరంగంలోనూ బ్రాహ్మణులే గుత్తాధిపత్యం చెలాయించారు. రాజపుత్రులు బ్రాహ్మణాధిక్యతను మన్నించినా సామాన్య ప్రజలు దానిపట్ల నిరసన చూపారు. కులాల సంఖ్య పెరిగిన కొద్దీ సంఘంలో సహనం తగ్గి కక్షలు పెరిగిపోయాయి. బ్రాహ్మణ, క్షత్రియ వర్గాల పట్ల మిగిలిన వారికి ఈర్ష్య, అసూయ, ద్వేషాలు కలిగాయి. ఫలితంగా దేశ సమైక్యత బాగా దెబ్బతిన్నది.
-రాజుల్లో స్వయంవరాలు ఉన్నాయి. యుద్ధాల్లో స్త్రీలను ఎత్తుకొచ్చి (రాక్షస) వివాహం చేసుకునే ఆచారం ఉండేది. రాజపుత్రుల్లో బహుభార్యత్వం ఎక్కువ. స్త్రీలు విద్యావంతులు, లలిత కళల్లో ప్రభుత్వ నిర్వహణలోనే గాక ఆయుధాలు ధరించడంలో కూడా ఆరితేరినవారు. ఈ యుగంలో ప్రసిద్ధ విదూషిమణుల్లో ఉభయ మారుతి, కురుల, షీల, సుగంధ, ఇందులేఖ, దిద్దాదేవి, అక్కాదేవి, అవంతీసుందరి పేర్కొనదగినవారు.
-రాజపుత్ర స్త్రీలల్లో సతీసహగమనం ఆచారం ఉండేది. వీరు తమ ప్రాణం కంటే శీలానికే ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చేవారు. అందుకే విదేశీయులు రాజపుత్ర రాజ్యాలపై చేసిన దండయాత్రల సందర్భంలో ఎప్పుడైనా తమ సైన్యాలు ఓడిపోయేపక్షంలో పరాయి మగవాడిచేతిలో తమ శీలం కోల్పోకుండా సామూహికంగా మంటల్లో దూకి చనిపోయేవారు. దీన్నే జౌహర్ అంటారు.
-అయితే మొత్తంమీద నాటి సమాజంలో స్త్రీల పరిస్థితి హీనంగా ఉండేది. స్త్రీలు పరపురుషుడి ముఖం చూడకూడదు. అంతఃపుర స్త్రీలు సూర్యుని కూడా చూడరాదు. విడాకుల పద్ధతిలేదు. పరదా పద్ధతి వాడుకలోకి వచ్చింది. అయినప్పటికీ ధర్మశాస్ర్తాలు స్త్రీ ధనం అనే సంప్రదాయాన్ని ప్రచారంచేసి స్త్రీలకు కొంత రక్షణ కల్పించాయి. రాజపుత్రుల్లో ఆడశిశువులను పురిట్లోనే చంపేసే ఆచారం ఉంది. వీరు మగపిల్లల పుట్టకకు ఇచ్చిన ప్రాధాన్యత ఆడపిల్లల జన్మకు ఇవ్వకపోవడానికి ఆ నాటి యుద్ధాలే ప్రధాన కారణం. కన్యాశుల్కం, వరకట్నాల వలన వివాహాది కార్యక్రమాలు కష్టంగా ఉండేవి.
-ఆ నాటి సామాన్య ప్రజలు వృత్తివిద్యల్లో శిక్షణ పొందారుగానీ అక్షర జ్ఞానం తక్కువ. ప్రజల్లో నీతి, నిజాయితీ ఉండేవని, అప్పులను తీర్చడంలో శ్రద్ధ వహించేవారని మార్కోపోలో వంటి విదేశీ యాత్రికులు రాశారు. కానీ ప్రజల్లో మూఢవిశ్వాసాలు ఎక్కువ. శకునాల్లో, స్వప్నాల్లో, జాతకాల్లో విపరీతమైన నమ్మకం ఉండేవి. ఆవును ఎక్కువగా పూజించేవారు. సంగీతం, నృత్యం, నాటకం, చదరంగం, పడవ పందేలు, వేట మొదలైనవి సాధారణ వినోదాలు. స్త్రీ, పురుషులిరువురు ఆభరణాలు ధరించేవారు.
మత పరిస్థితులు:
రాజపుత్రులు హిందూమతాభిమానులు. వీరి యుగంలో మత, సాంస్కృతిక రంగాల్లో గణనీయమైన మార్పులు జరిగాయి. బౌద్ధమతం క్షీణిస్తూ దాని స్థానంలో వైదిక మతం, దాని వివిధ శాఖలు ప్రాముఖ్యతలను పొందడం ఈ కాలంలో మతరంగంలో జరిగిన ప్రధాన మార్పు. హర్ష యుగం వరకు ప్రధాన మతంగా బౌద్ధ మతం వ్యాపించింది. కానీ రాజపుత్ర యుగంలో బౌద్ధమతం విచ్ఛిన్నం కావడమే కాకుండా పతనావస్థకు చేరింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు