దేశమంతా ఒకే పన్ను విధానం
పన్నుల విధానంలో సమూల మార్పులకు శ్రీకారం చుడుతూ జీఎస్టీకి పార్లమెంటు ఇటీవలే ఆమోదం తెలిపింది. దీంతో దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం అమలు కానుంది. జీఎస్టీ అంటే వస్తు సేవల పన్ను. జీఎస్టీ అమలుతో దేశం అంతటా ఏకరీతి పన్నుల విధానం అమల్లోకి వస్తుంది. అంటే వస్తు తయారీ, విక్రయం, వినిమయం, దిగుమతులు, సేవలకు సంబంధించి కేంద్ర, రాష్ర్టాలతోపాటు స్థానిక మండళ్లు విధించే పరోక్ష పన్నులన్నీ ఒకే గొడుగు కిందికి వస్తాయి. ఒకే వస్తువుపై అనేకసార్లు పన్ను విధించే విధానానికి స్వస్తిపలికి దేశమంతటా ఏకరూప పన్ను అమల్లోకి రానుంది.
1991లో అప్పటి ప్రధాని పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన నూతన ఆర్థిక సంస్కరణల తరువాత అతి పెద్ద సంస్కరణలుగా పరిగణించబడే బిల్లు జీఎస్టీ (వస్తు, సేవల పన్ను). దశాబ్ద కాలం కిందట 2003లో పరోక్ష పన్నుల అమలుపై నియమించిన కేల్కర్ కమిటీ సమర్పించిన నివేదికలో వస్తుసేవల పన్నుల బిల్లును గురించి తొలిసారి ప్రస్తావించారు. ఆ తరువాత యూపీఏ పాలనలో నాటి ఆర్థిక మంత్రి పీ చిదంబరం 2006 వార్షిక బడ్జెట్లో జీఎస్టీ బిల్లు ప్రతిపాద చేశారు. 2010, ఏప్రిల్ 1 నాటికి దాన్ని అమల్లోకి తెస్తామని ప్రకటించారు. 2011లో జీఎస్టీ బిల్లును ప్రవేశపెట్టడానికి అవసరమైన రాజ్యాంగ సవరణ బిల్లును మార్చి నెలలో లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దీన్ని పార్లమెంట్ స్థాయీ సంఘం పరిశీలనకు పంపించారు. 15వ లోక్‌సభ రద్దుకావడంతో జీఎస్టీ బిల్లు కాలం చెల్లింది. ఎన్డీఏ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 2014, డిసెంబర్ 19న 122వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఇది 2015, మే 6న ఆమోదం పొందింది. 2016, ఆగస్టు 3న రాజ్యసభ ఆమోదం తెలిపింది.
-దేశ వ్యాప్తంగా కేంద్రం, వివిధ రాష్ర్టాల్లో వివిధ రకాల పేర్లతో అనేక పన్నులు విధించి వినియోగదారులను గందరగోళానికి గురిచేయడంతో పాటు, వర్తకులు, వ్యాపారులు పన్ను ఎగవేతకు పాల్పడేవారు. ఇలాంటి లోపాలను తొలగించి దేశానికంతటికీ ఏకరూప పన్నుగా జీఎస్టీ అమల్లోకి వస్తుంది. దీంతో పన్నుల విధింపునకు సంబంధించి దేశమంతా ఒకే మార్కెట్ అవుతుంది. అన్ని రకాల, వస్తు వస్తు సేవలపై పన్నులు విధించారు. ఒక వస్తువుకు లేదా సేవకు వివిధ దశల్లో విలువ ఆధారంగా ఇన్పుట్ క్రెడిట్ (పన్ను మినహాయింపు) లభిస్తుంది. తుది వినియోగదారుడు తాను ఏ రిటైల్ వర్తకుడి నుంచి వస్తువు లేదా సేవలు తీసుకుంటున్నాడో ఆ వర్తకుడు చెల్లించే జీఎస్టీని భరిస్తే సరిపోతుంది.
ప్రస్తుత పన్నుల విధానం
ఒక వస్తువు తయారైతే దాని ఉత్పత్తిదారులపై కేంద్రం ఎక్సైజ్ పన్ను విధిస్తుంది. దేశంలో 1994లో సేవల పన్ను ప్రవేశపెట్టారు. ప్రారంభంలో మూడు రకాల సేవలపై మాత్రమే పన్ను విధిస్తారు. ప్రస్తుతం 119 రకాల సేవలపై పన్ను విధిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో సేవా పన్ను 15 శాతం. దీనికితోడు వ్యాట్, రాష్ర్టాలు విధించే పన్నులు ఉంటాయి. ప్రస్తుత 80 శాతం వస్తువులపై 12.5 శాతం కేంద్ర ఎక్సైజ్ పన్ను అమల్లో ఉంది. రాష్ట్రస్థాయిలో 55 శాతం వస్తువులపై 14.5 శాతం వ్యాట్ లేదా అమ్మకపు పన్ను ఉంది. వీటిలో 65 శాతం వస్తువులపై ఈ పన్నులు కలిపితే సగటున 27 శాతం పన్ను అవుతుంది. దీనికి అదనంగా సెస్, అక్ట్రాయి పన్నులు కలిపితే పన్ను 30 శాతానికి పెరుగుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఇంత మొత్తం ప్రజలకు భారంగా ఉంటుంది. మరోవైపు ప్రభుత్వం ఆదాయ అవసరాలను చూసుకుంటూ ప్రజలపై భారం పడకుండా పన్ను రేటును నిర్ణయిస్తామని ప్రకటించింది. జీఎస్టీ ముఖ్య ఉద్దేశం పన్ను రేటు క్రమంగా తగ్గించడం. దీనిద్వారా పౌరులకు మరింత మేలు జరగాలని, రాష్ర్టాలకు తగినన్ని నిధులు సమకూరేందుకు సరిపోయేలా పన్ను రేటు ఉండాలనే రెండు ప్రధాన మార్గదర్శకాలు జీఎస్టీ బిల్లుకు ఉన్నాయి.
జీఎస్టీ బిల్లు-సవరణలు
తయారీ రాష్ర్టాలకు ఆదాయ నష్టభర్తీ చేయడం కోసం అంతరాష్ట్ర లావాదేవీలపై ఒక శాతం అదనపు పన్ను విధించేందుకు అనుమతించే నిబంధనను తొలగించడం.
-జీఎస్టీ అమల్లో తొలి పదేళ్లలో రాష్ర్టాలకు ఎలాంటి ఆదాయ నష్టం జరిగినా కేంద్రం భర్తీ చేస్తుందన్న హామీని చేరుస్తూ సవరణను చేర్చారు.
-కేంద్ర, రాష్ర్టాల మధ్య వివాదాల పరిష్కారం కోసం జీఎస్టీ కౌన్సిల్ ఏర్పాటు
-రాష్ర్టాల ఆదాయానికి భద్రత కల్పిస్తూనే సామాన్యులపై పన్నుల భారాన్ని తగ్గించేందుకు రెవెన్యూ న్యూట్రల్ పన్ను రేటుపై రాష్ట్ర ఆర్థిక మంత్రుల సాధికార కమిటీ తీర్మానాన్ని పరిగణలోకి తీసుకుంటూ సవరణ చేశారు.
జీఎస్టీ బిల్లు-రకాలు
ఫెడరల్ విధానాన్ని దృష్టిలో ఉంచుకుని జీఎస్టీని మూడు రకాలుగా విభజించారు. కేంద్రం విధించే సీజీఎస్టీ, రెండోది రాష్ర్టాలు విధించే ఎస్జీఎస్టీ, ఇంటర్‌స్టేట్ జీఎస్టీ (ఐజీఎస్టీ).
-సీజీఎస్టీ కింద కేంద్రం పన్ను విధించి వసూలు చేస్తే, ఎస్జీఎస్టీ కింద రాష్ర్టాలు పన్ను విధించి వసూలు చేస్తాయి. బిల్లులో నిర్ణయించిన ప్రకారం పన్ను మొత్తాన్ని కేంద్ర, రాష్ర్టాలు పంచుకుంటాయి. ఇక ఐజీఎస్టీ రెండు రాష్ర్టాల మధ్య సరుకు రవాణా, సేవలపై పన్నును కేంద్రం వసూలు చేసి తరువాత రాష్ర్టాలకు పంచుతుంది.
జీఎస్టీ కౌన్సిల్
జీఎస్టీ కౌన్సిల్‌కు కేంద్ర ఆర్థిక మంత్రి చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ఇందులో కేంద్ర రెవెన్యూ లేదా ఆర్థిక శాఖ సహాయ మంత్రి, రాష్ర్టాల నుంచి నామినేట్ అయ్యే ఆర్థిక, వాణిజ్య శాఖ లేదా ఇతర మంత్రులు సభ్యులుగా ఉంటారు.
-జీఎస్టీ పన్ను రేటు, పరిధి, ఎప్పటి నుంచి అమలు చేయాలనే అంశాలను నిర్ణయించడంతోపాటు వివాదాలను కూడా కౌన్సిల్ పరిష్కరిస్తుంది.
-నాలుగింటా మూడొంతుల మెజారిటీతో నిర్ణయాలు తీసుకుంటుంది.
రద్దయ్యే కేంద్ర పన్నులు
జీఎస్టీ వల్ల కేంద్ర ప్రభుత్వం విధిస్తున్న ఎక్సైజ్ పన్ను, అదనపు ఎక్సైజ్ డ్యూటీ, సేవల పన్ను, అదనపు కస్టమ్స్ పన్ను, కస్టమ్స్ పై ప్రత్యేక అదనపు డ్యూటీ, కేంద్ర అమ్మకపు పన్ను, సేవా పన్ను, ఎక్సైజ్ అండర్ డ్యూటీ అండర్ మెడిసినల్ అండ్ టాయిలెట్రిస్ ప్రిపరేషన్ యాక్ట్ రద్దవుతుంది.
రాష్ర్టాలు విధించే పన్నుల్లో..
ప్రస్తుతం రాష్ర్టాల్లో అమలవుతున్న వ్యాట్ లేదా అమ్మకపు పన్ను, వినోదపు పన్ను, ఎంట్రీ ట్యాక్స్, కొనుగోలు పన్ను, లగ్జరీ పన్ను, లాటరీ, బెట్టింగ్, గ్యాంబ్లింగ్, వాణిజ్య ప్రకటనలపై పన్ను, సెస్‌లు, సర్ చార్జీల వంటి పన్నులు రద్దవుతాయి.
జీఎస్టీతోపాటు కొనసాగే పన్నులు
జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం విధించే పన్నులు కనీసపు కస్టమ్స్ డ్యూటీ, రాష్ట్రం విధించే పన్నులు మున్సిపల్ పన్ను, ఆస్తిపన్ను, మద్యంపై ఎక్సైజ్ పన్ను, స్టాంప్ పన్ను, మోటార్ వెహికల్ పన్నులు కొనసాగుతాయి.
ఏ రంగాలకు లాభం
వినిమయం, లాజిస్టిక్, గృహ నిర్మాణానికి అవసరమైన ముడిసరుకులు, ఇండస్ట్రియల్ మాన్యుఫ్యాక్చరింగ్, ఆటో, ఎంటర్టైన్మెంట్ రంగాలు ప్రస్తుతం 24-26 శాతం స్థాయిలో ఉన్న పన్నుల భారం జీఎస్టీ అమలుతో 17-18 శాతానికి తగ్గుతుంది.
భారం పొందే రంగాలు
ఆయిల్ అండ్ గ్యాస్, బ్యాంకింగ్, టెలికం, యుటిలిటీ సేవల రంగాలపై పన్ను భారం ప్రస్తుతం జీఎస్టీ రేటు కంటే తక్కువగా ఉంది. ఇది అమల్లోకి వస్తే ఈ రంగాలపై పన్ను భారం ఎక్కువగా ఉంటుంది.
జీఎస్టీ ప్రభావం
వస్తువుల ధరలన్నీ దాదాపు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం 25-30 శాతం ఉన్న పన్నులు 18-20 శాతం మధ్య ఉంటాయి.
ప్రయోజనాలు
జీడీపీ 1.5 శాతం పెరగుతుందని అంచనా
-జీడీపీపై సానుకూల ప్రభావం
-ఆర్థికరంగం వృద్ధికి తోడ్పడుతుంది
-నల్లధనాన్ని అరికడుతుంది
-సమర్ధమంతమైన పన్నుల వ్యవస్థ అమల్లోకి వస్తుంది
-దేశంలో వస్తువుల ధరలన్నీ రాష్ర్టాల్లో ఒకే విధంగా ఉంటాయి
-పన్ను ఎగవేత తగ్గుతుంది
-కేంద్ర, రాష్ర్టాల ఆదాయాలు పెరుగుతాయి. కొన్ని ఉత్పత్తుల ధరలు తగ్గుతాయి. పన్నుల చెల్లింపు సరళతరం కావడంతో ప్రజలపై పన్నుల భారం తగ్గుతుంది. దీంతో పన్నులు చెల్లించే వారి సంఖ్య పెరిగి ప్రభుత్వానికి పన్ను ఆధారిత ఆదాయం పెరుగుతుంది.
-పరోక్ష పన్నుల వసూళ్లు సాఫ్ట్వేర్ ద్వారా జరుగుతుండటంతో దేశ వ్యాప్తంగా కోటి ఉద్యోగాలు కొత్తగా లభిస్తాయి.
-దేశంలో వస్తువుల ఉత్పత్తి వ్యయం తగ్గి ఎగుమతులు పెరుగుతాయి.
-తయారీ రంగం ఊపందుకుంటుంది.
-చెక్‌పోస్టుల అవసరం ఉండదు
-గోదాముల నిర్వహణ, చెక్‌పోస్టుల వద్ద ఆలస్య భారం ఉండదు.
-అమ్మకాలపై 2 శాతం వ్యయం తగ్గుతుంది.
-ఐదేండ్లలో సరుకు రవాణా వ్యయం 30 శాతం ఆదా అవుతుంది.
-వస్తువులపై పన్నుల భారం ఉండదు.
జీఎస్టీ మార్గ సూచీ
-వచ్చే ఏడాది ఏప్రిల్ 1 నుంచి జీఎస్టీ బిల్లు అమలు లక్ష్యం
-30 రోజుల్లో కనీసం 16 రాష్ర్టాల నుంచి ఆమోదం పొందాలి
-జీఎస్టీ మండలికి రాష్ట్రపతి ఆమోదముద్ర, ఆ తర్వాత కేంద్ర మంత్రిమండలి ఆమోదం
-జీఎస్టీ మండలిలో నమూనా జీఎస్టీ చట్టాల రూపకల్పన
-సీజీఎస్టీ (కేంద్ర వస్తు, సేవల పన్ను), ఐజీఎస్టీ (అంతర రాష్ట్ర వస్తు, సేవల పన్ను) కేంద్ర మంత్రివర్గం ఆమోదం
-ఎస్జీఎస్టీకి అన్ని రాష్ర్టా ఆమోద ముద్ర
-వచ్చే శీతకాలం సమావేశాల్లో సీజీఎస్టీ, ఐజీఎస్టీ బిల్లులకు పార్లమెంటు ఆమోదం
-2017, మార్చి 31కి జీఎస్టీ నిబంధనల నోటిఫికేషన్ జారీ
-జనవరి, మార్చి నుంచి సాప్ట్వేర్ పరీక్ష అనుసంధానం
-2016 డిసెంబర్ నాటికి జీఎస్టీ కోసం సాఫ్ట్వేర్ సిద్ధం
-2016 డిసెంబర్ నాటికి కేంద్ర, రాష్ట్ర అధికారులకు శిక్షణ పూర్తి
-మార్చి 2017 నాటికి బిల్లుకు సంబంధించిన అన్ని వర్గాలతో సంప్రదింపులు పూర్తి
-జీఎస్టీ వ్యవస్థలోకి వ్యాట్/సేవా పన్ను/కేంద్ర ఎక్సైజ్ పన్నులు విలీనం
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు