Indian History | ‘శాద్వాద చలసింహ’ అనే బిరుదు కలిగిన కవి?
జైనమతం
- జిన అనే పదం నుంచి జైనం ఆవిర్భవించింది. జైనులను నిగ్రంథులు, శ్రమణులు అని పిలుస్తారు. వేదాలు శ్రమణుల గురించి ప్రస్తావించాయి. జైన మతాన్ని అధికారికంగా గుర్తించింది లిచ్ఛవి రాజ్యం.
తీర్థంకరులు - తీర్థంకర అనే పదానికి అర్థం వారధిని నిర్మించినవాడు లేదా మార్గం చూపేవాడు. జైన సాహిత్యం ప్రకారం మొత్తం 24 మంది తీర్థంకరులు కూడా క్షత్రియ కులానికి చెందినవారు. మొదటి 22 మంది తీర్థంకరుల గురించి చారిత్రక ఆధారాలు లేవు. 23, 24వ తీర్థంకరుల గురించి చారిత్రక ఆధారాలు ఉన్నాయి. రుగ్వేద మంత్రంలో రుషభనాథుడు, అరిష్టనేమిల ప్రస్తావన ఉంది. విష్ణు, భాగవత పురాణాల్లో నారాయణుని అవతారంగా రుషభనాథుడిని ప్రస్తావించారు. అరిష్టనేమిని కృష్ణుడికి బంధువుగా భావించారు.
పార్శనాథుడు (క్రీ.పూ.8వ శతాబ్దం) - చారిత్రకంగా ఇతడే జైనమత స్థాపకుడు. ఇతడు ఇక్ష్వాక వంశానికి చెందినవాడు.
- ఇతడి తండ్రి అశ్వసేన, తల్లి రాణి వామదేవి. శతాయువుగా జీవించిన తీర్థంకరుడిగా ప్రసిద్ధి చెందాడు.
- ఇతడి శిష్యులు ఇతడిని పురుషదనియ అనే బిరుదుతో సత్కరించారు. పురుషదనియ అంటే ప్రజలతో ప్రేమించబడేవాడు అని అర్థం.
- ఈయన తీర్థంకర దశకు వచ్చి నిగ్రంథులు అనే మతం తెచ్చాడు. నిగ్రంథులు అంటే ప్రాపంచిక సుఖాలను త్యజించినవారు.
వర్ధమాన మహావీరుడు (క్రీ.పూ.540-468) - మహావీరుని కంటే ముందు జైనులను నిగ్రంథులుగా పేర్కొనేవారు. తర్వాత వీరిని జైనులుగా పేర్కొన్నారు. అందువల్ల చారిత్రకంగా వర్ధమాన మహావీరుడినే జైనమత స్థాపకుడిగా పేర్కొంటారు.
- ఈయన జ్ఞాత్రిక తెగకు చెందినవాడు. ఈయన వైశాల సమీపంలోని కంద అనే గ్రామంలో సిద్ధార్థుడు-త్రిశాల రాజదంపతులకు జన్మించాడు.
- ఇతడికి సమకాలికులు బౌద్ధమత స్థాపకుడు గౌతమ బుద్ధుడు, మగధ రాజులైన బింబిసారుడు, అజాత శత్రువు.
- ఇతడి 30 సంవత్సరాల వయస్సులో తల్లిదండ్రులు మరణించారు. తర్వాత ఇతడు 12 సంవత్సరాలు సంచార జీవనం గడిపాడు.
- 42 సంవత్సరాల వయస్సులో రుజుపాలిక నదీ తీరంలో జ్వంభిక గ్రామ సమీపంలోని సాలవృక్షం కింద తపస్సు చేస్తూ కైవల్యాన్ని పొందారు.
- కైవల్యం అంటే పూర్తి జ్ఞానోదయం. సుఖ దుఃఖాలను జయించి మహావీరుడు లేదా జినుడు అయ్యాడు.
జైనమత సిద్ధాంతాలు - జైన మతం పంచసూత్రాలను బోధించింది. అవి..
1) హింస చేయవద్దు (అహింస)
2) అసత్యం చెప్పవద్దు (అసత్య)
3) దొంగనతం చేయవద్దు (అపరిగ్రహ)
4) ఆస్తిని సంపాదించవద్దు (అనస్తేయ)
5) బ్రహ్మచర్యాన్ని పాటించాలి (బ్రహ్మచర్యం) - పై వాటిలో మొదటి నాలుగింటిని 23వ తీర్థంకరుడు పార్శనాథుడు చెప్పాడు. 5వ దాన్ని వర్ధమాన మహావీరుడు పై వాటిలో కలిపాడు.
- అదేవిధంగా 1) సమ్యక్ క్రియ (సరైన పని), 2) సమ్యక్ జ్ఞానం (సరైన జ్ఞానం), 3) సమ్యక్ విశ్వాస్ (సరైన నమ్మకం) అనే
త్రిరత్నాలను బోధించింది జైనమతం.
జైనతత్వం
1) శాద్వాదం- అంటే ఇతిమిద్దంగా ఏ విషయాన్ని తేల్చి చెప్పకపోవడం
2) అనేకాంతరవాదం- జ్ఞానాన్ని సమగ్రంగా గ్రహించాలి. ఈ తత్వం సాంఖ్యవాదానికి దగ్గరగా ఉంది.
జైనమత లక్షణాలు - వేదాలను, బ్రాహ్మణాధిక్యతను నిరసించింది.
- దేవుడి అస్థత్వంలో నమ్మకం లేనిది.
- సమానత్వాన్ని చాటి చెప్పింది.
- మోక్షం పొందడానికి కావాల్సింది కైవల్యం పొందడం
- అహింసకు అత్యంత ప్రాధాన్యతనిచ్చింది.
- వర్ణ వ్యవస్థను ఖండించలేదు.
- వీరు పోసదను పాటిస్తారు. అంటే పౌర్ణమి రోజున ఉపవాసం ఉండటం.
- ప్రపంచమంతా చేతన, అచేతన జీవులతో నిండి ఉందని నమ్మడం.
- జైనమతం హిందూ దేవుళ్లను అంగీకరించింది. కానీ హిందూ దేవుళ్లకు తీర్థంకరుల తర్వాత స్థాయిని కల్పించింది.
- జైనమతం విపరీతమైన అహింసను బోధించింది. అవి.. క్రిమి కీటకాలను చంపకూడదు. కాబట్టి వ్యవసాయాన్ని నిషేధించింది. రాత్రుళ్లు దీపాలు వెలిగించకూడదు, నడిచేటప్పుడు వంగి విసనకర్ర లాంటి దాన్ని ఊపుతూ కాళ్ల కింద కీటకాలు లాంటివి లేకుండా చూసుకొని నడవటం మొదలైనవి.
- 23వ తీర్థంకరుడైన పార్శనాథుడు తన అనుచరులను తెల్లని వస్ర్తాలను ధరించమన్నాడు. అందుకే వారిని శ్వేతాంబరులు అన్నారు. వర్ధమాన మహావీరుడు తన అనుచరులను వస్ర్తాలను ధరించవద్దన్నారు. అందుకే వారిని దిగంబరులు అన్నారు.
సాహిత్యం - జైనమత సాహిత్యాన్ని అర్ధమాగధి, ప్రాకృతంలో రాశారు. జైనమత ప్రచార భాషగా ప్రాకృతం ఉండేది. ప్రాకృత భాష నుంచి అనేక ప్రాంతీయ భాషలు ఉద్భవించాయి.
ఉదా: సౌరసేని (యూపీ), మరాఠీ (మహారాష్ట్ర). - జైనులు అపభ్రంశ భాషలో తొలి ప్రధాన గంథాలను, వ్యాకరణాన్ని కూడా రాశారు. కన్నడ భాషలో కూడా సాహిత్యాన్ని అందించారు.
- తర్వాత కాలంలో జైన సన్యాసులు సంస్కృతంలో గ్రంథాలను రాశారు. జైనమత గ్రంథాలను ‘అంగాలు’ అంటారు. వీటి సంఖ్య 12 (ద్వాదశ అంగాలు).
- వీటిని అర్ధమాగధి భాషలో రచించారు. వీటికి మరో పేరు ఉపాంగాలు. వీటిపై రాసిన వ్యాఖ్యలను ‘నిరూక్తులు’ అంటారు. ఇవి మొదట 14 ఉన్నాయి.
- వీటినే పూర్వములు అనే వారు. వీటినే 12 గ్రంథాలుగా మొదటి జైన పరిషత్తులో సంకలనం చేశారు.
చీలికలు - క్రీ.పూ.300లో జైనమతం దిగంబరులు, శ్వేతాంబరులుగా విడిపోయింది. జైనమతం విడిపోవడానికి గల కారణాలను హేమచంద్ర సూరి రచించిన ‘పరిశిష్ట పర్వన్’ లేదా ‘స్థవిరవళి చరిత్ర’ అనే పుస్తకం తెలుపుతుంది. దీని ప్రకారం చంద్రగుప్త మౌర్యుడు రాజుగా ఉన్నప్పుడు మగధలో 12 సంవత్సరాల పాటు కరువు వచ్చింది. గంగానది లోయలో కరువు సమయంలో 12,000 మంది జైన సన్యాసులు భద్రబాహు నాయకత్వంలో దక్షిణ ప్రాంతానికి వలస వెళ్లారు. ఈ 12,000 మంది జైన సన్యాసులు, చంద్రగుప్త మౌర్యుడు, మహావీరుడు బోధించిన విధంగా దిగంబర జైనాన్ని ఆదరించారు.
- కానీ మగధలోనే ఉండిపోయిన స్థూలభద్ర నాయకత్వంలోని జైన సన్యాసులు తెల్లని వస్ర్తాలను ధరించడం వల్ల శ్వేతాంబరులు అయ్యారు. ఈ విధంగా జైనమతంలో దిగంబర, శ్వేతాంబరులుగా చీలిక వచ్చింది. దిగంబర శాఖకు భద్రబాహు నాయకుడు కాగా, శ్వేతాంబర శాఖకు స్థూలబాహు నాయకుడు.
యాపనీయ శాఖ - తర్వాతి కాలంలో జైనమతంలో యాపనీయ అనే మరొక శాఖ వచ్చింది. వీరికి మరో పేరు గోప్యులు. ఇది దిగంబరులకు, శ్వేతాంబరులకు మధ్య సమన్వయం సాధించడానికి కృషి చేసింది. ఈ శాఖ వారు ‘వర్జ్యం’ చూసే సంప్రదాయాన్ని ప్రవేశపెట్టారు. తాంత్రిక విద్య, యక్షణి ఆరాధన యాపనీయ లక్షణాలు.
సల్లేఖన వ్రతం లేదా సంతార - అన్న పానీయాలు మానేసి శరీరాన్ని శుష్కింపజేసి మరణించడం. మహావీరుడు తన 72వ సంవత్సరంలో మల్ల రాజధాని పావాలో సల్లేఖన వ్రతాన్ని మల్ల రాజు షష్టిపాలుని ఇంట్లో ఆచరించి మరణించాడు. ఇదిలా ఉండగా, సల్లేఖన వ్రతాన్ని ఆచరించి మరణించిన మొట్టమొదటి చక్రవర్తి చంద్రగుప్త మౌర్యుడు.
జైన పరిషత్తులు - మొత్తం రెండు జైన పరిషత్తులు జరిగాయి. ఈ రెండింటిని శ్వేతాంబరులు నిర్వహించారు. మొదటి జైన పరిషత్తు క్రీ.పూ.300లో పాటలీపుత్రంలో స్థూలభద్రుని అధ్యక్షతన నిర్వహించారు. ఈ పరిషత్తులోనే 12 అంగాలను క్రోడీకరించారు.
- రెండో జైన పరిషత్తు క్రీ.శ.512లో వల్లభిలో ‘దేవర్ధగనక్షనుశ్రమణ’ అధ్యక్షతన జరిగింది.
ప్రముఖ జైన సన్యాసులు
1) భద్రబాహు: ఇతడు కల్ప సూత్ర అనే గ్రంథాన్ని రచించాడు. కల్ప సూత్రలో 3 భాగాలు ఉన్నాయి. అవి..
ఎ. జిన చరిత: జైన తీర్థంకరుల చరిత్ర
బి. థేరావళి చరిత: 11 మంది గణధారుల గురించి
సి. సమాచారి: నియమాలు, నిబంధనల గురించి
2) సోమదేవ సూరి (క్రీ.శ.10వ శతాబ్దం): వేములవాడ చాళుక్యుల ఆస్థానంలో ఉండేవాడు. ఇతడి బిరుదు శాద్వాద చలసింహ. ఇతడు యశస్తిలక (సంస్కృతం), నీతివాక్యామృతం అనే గ్రంథాలను రచించాడు.
3) హేమచంద్ర సూరి (క్రీ.శ.12వ శతాబ్దం): ఇతని బిరుదు కలకాల సర్వజ్ఞ. ఇతను పరిశిష్ట పర్వన్ అనే గ్రంథాన్ని రచించాడు.
జైనమతం విస్తరణ, క్షీణత - జైనమతం బ్రాహ్మణీయ హిందూమతం నుంచి స్పష్టంగా వేరు పడలేకపోవడంతో అది సామాన్య ప్రజానీకాన్ని ఆకర్శించలేకపోయింది. చంద్రగుప్త మౌర్యుడు కర్ణాటక ప్రాంతంలో జైనమతాన్ని ప్రారంభించడానికి జైన సన్యాసిగా మారి కర్ణాటకకు వలస వచ్చాడు. కర్ణాటక ప్రాంతంలో ‘బసది’ అనే వసతి కేంద్రాల పేరుతో జైన మఠాలను అసంఖ్యాకంగా స్థాపించారు. వీటికి రాజులు భూదానాలు చేశారు. ఆ విధంగా అక్కడ జైనమతం విస్తరించింది.
- అలాగే ఒరిస్సాను పరిపాలించిన ఖారవేలుడు జైనమతాన్ని పోషించాడు. తర్వాతి కాలంలో జైనమతం మాళ్వా, గుజరాత్, రాజస్థాన్ ప్రాంతాల్లోకి ప్రవేశించింది. తెలంగాణ పాలించిన శాతవాహనులు, కాకతీయులు మొదట జైనులు. జైనమతాన్ని పోషించిన రాష్ట్రకూటులు సామంతులుగా తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలించిన వేములవాడ చాళుక్య కాలంలో ఈ ప్రాంతంలో జైనమతం ఉజ్వల స్థితిలో వర్ధిల్లింది.
క్షీణత - పూర్తి అహింసకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల కొన్ని వృత్తుల వారు జైనమతానికి దూరమయ్యారు. ముఖ్యంగా వ్యవసాయ కులాల వారు జైనమతాన్ని స్వీకరించలేకపోయారు. అలాగే వర్ణ వ్యవస్థను ఆదరించడం వల్ల శూద్ర, అతి శూద్ర కులాల నుంచి జైనమతంలోకి ఎక్కువ సంఖ్యలో ప్రజలు రాలేకపోయారు. హైందవ ఆచారాలు కూడా జైనంలో చోటు చేసుకోవడం, మధ్య, ఆధునిక యుగాల్లో జైనమతానికి చెప్పుకోదగ్గ లేదా ఆశించదగ్గ రాజాదరణ లేకపోవడం వల్ల జైనమతం క్షీణించిందని చెప్పవచ్చు.
- జైనమతానికి బౌద్ధమతం లాగా రాజాదరణ లభించలేకపోయినా, త్వరత్వరగా వ్యాపించకపోయినా అది విస్తరించిన ప్రాంతాల్లో ఈ నాటికీ నిలిచి ఉంది. ప్రధానంగా వ్యాపార వర్గాల్లో జైనమతం నేటికీ నిలిచి ఉంది.
మాదిరి ప్రశ్నలు
1. ‘స్థవిరవళి చరిత్ర’ అనే గ్రంథాన్ని రచించింది?
1) స్థూల బాహు 2) హేమచంద్ర సూరి
3) సోమదేవ సూరి 4) భద్రబాహు
2. వర్ధమాన మహావీరుని బిరుదు ‘అరిహంత్’ అర్థం?
1) మోక్షాన్ని సాధించేవాడు
2) దేహాన్ని జయించినవాడు
3) ఇంద్రియాలను జయించినవాడు
4) సన్యాసుల్లో సింహం లాంటివాడు
3. కింది వాటిలో సరైనవి?
ఎ. తీర్థంకర అనే పదానికి అర్థం ‘వారధిని నిర్మించినవాడు లేదా మార్గాన్ని చూపేవాడు’
బి. జైన సాహిత్యం ప్రకారం జైనమతంలో 24 మంది తీర్థంకరులు ఉన్నారు
3) ఎ 4) ఎ, బి
4. పురుషదనియ అంటే ప్రజల చేత ప్రేమించబడేవాడు అని అర్థం. ఈ బిరుదు కలిగిన జైనమత తీర్థంకరుడు?
1) రుషభనాథుడు
2) వర్ధమాన మహావీరుడు
3) పార్శనాథుడు 4) అరిష్టనేమి
5. ‘త్రిషష్టి శలాక చరిత్ర’, ‘అభిదాస చరిత్ర’ అనే జైనమత గ్రంథాలను రాసింది ఎవరు?
1) హేమచంద్ర సూరి
2) మునిచంద్రుడు
3) సోమదేవ సూరి 4) మహావీరుడు
6. ‘త్రిరత్నాలు’ ఏ మతానికి సంబంధించినవి?
1) బౌద్ధమతం 2) జైన మతం
3) అజీవక మతం 4) చార్వాక
7. కింది వాటిని జతపర్చండి.
తీర్థంకరులు చిహ్నం
1. రుషభనాథుడు ఎ. వృషభం
2. అరిష్టనేమి బి. సముద్ర గవ్వ
3. పార్శనాథ సి. పాము
4. మహావీర డి. సింహం
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3) 1-ఎ, 2-బి, 3-డి, 4-సి
4) 1-ఎ, 2-సి, 3-బి, 4-డి
8. కింది వాటిలో జైన తత్వానికి సంబంధించి సరైనవి?
1) శాద్వాదం 2) అనేకాంతరవాదం
3) నియతి 4) 1, 2
9. ‘శాద్వాద చలసింహ’ అనే బిరుదు కలిగిన జైనమత కవి?
1) కొండ కుందాచార్య
2) సోమదేవ సూరి
3) ముని చంద్రుడు 4) ధనపాలుడు
10. జైనమతాన్ని ఆదరించిన రాజులు?
1) బింబిసారుడు
2) మహాపద్మనందుడు
3) 4వ ఇంద్రుడు 4) పై అందరూ
11. కింది వారిలో జైనమతాన్ని స్వీకరించి, సల్లేఖన వ్రతాన్ని ఆదరించి మరణించిన రాజు?
1) శ్రీముఖుడు 2) ఇంద్ర-4
3) ఉదయనుడు 4) ఖారవేలుడు
ANS 1-2, 2-1, 3-4, 4-3, 5-1, 6-2, 7-1, 8-4, 9-2, 10-4, 11-2.
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ,
కోరుట్ల
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు