1950 జనవరి 26న ఆమోదించిన భారత రాజ్యాంగంలోని రాష్ర్టాల బి కేటగిరీ జాబితాలో హైదరాబాద్ రాష్ర్టాన్ని చేర్చారు. అదే రోజు ఆఖరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ హైదరాబాద్ రాజ్యప్రముఖ్‌గా ఆరోజు వరకు హైదరాబాద్ రాజ్య ప్రధానమంత్రిగా ఉన్న సివిల్ సర్వీస్ అధికారి వెల్లోడి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ రాజ్యంపై భారత ప్రభుత్వం 1948 సెప్టెంబర్ 17న సైనిక చర్య జరిపి, నిజాం కేబినెట్ రాజీనామాకు కారణమై రాజ్యాన్ని తమ నియంత్రణలోకి తెచ్చుకున్నా ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో నిజాం ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ కారణంగా మీర్ ఉస్మా న్ అలీఖాన్ని 1950 జనవరి 26వరకు హైదరాబాద్ రాజ్‌ప్రముఖ్‌గా కొనసాగనిచ్చింది. వెల్లోడి హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా 1952 మార్చి 6న ఎన్నికల ద్వారా బూర్గుల రామకృష్ణారావు ప్రభుత్వం ఏర్పడేవరకు కొనసాగారు.
హైదరాబాద్ రాష్ట్రంలో తొలి ఎన్నికలు
హైదరాబాద్ శాసనసభకు మొదటిసారి 1952లో జరిగిన ఎన్నికల్లో భారతజాతీయ కాంగ్రెస్ మొత్తం 175 స్థానాలకు గాను, 173 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. తెలంగాణ ప్రాంతంలోని గ్రామీణ ప్రాంతాల్లో కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువగా ఉండటం వల్ల కాంగ్రెస్‌కు ప్రతికూల పరిస్థితి ఎదురైంది. కన్నడ, మరాఠీ భాషలు మాట్లాడే ప్రాంతాల్లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలను గెలుచుకుంది. పోటీచేసిన 173 స్థానాల్లో 93 గెలుచుకున్న కాంగ్రెస్ పూర్తి మెజారిటీ సాధించడంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 42 స్థానాల్లో కమ్యూనిస్టుల ఆధ్వర్యంలోని ప్రోగ్రెసివ్ డెమొక్రటిక్ ఫ్రంట్ ప్రతిపక్ష కూటమిగా నిలిచింది. పోలైన ఓట్లలో కాంగ్రెస్‌కు 41.86శాతం ఓట్లు రాగా పీడీఎఫ్‌కు 20.76శాతం ఓట్లు వచ్చాయి.బూర్గుల ముఖ్యమంత్రిగా కొనసాగిన కాలమంతా రాజ్‌ప్రముఖ్‌గా మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఆ బాధ్యతల్లో ఉన్నారు. కొంతకాలం తర్వాత తన దగ్గరున్న ల్యాండ్ రెవెన్యూ శాఖను బూర్గుల కె.వి రంగారెడ్డికి బదిలీ చేశారు.
1952 ముల్కీ ఆందోళన
ముల్కీ సమస్య 1868వ సంవత్సరం నుంచి హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నది. పోలీసు చర్యకు పూర్వం నిజాం పాలనలో ఉత్తరభారతదేశ ముస్లింలకు వ్యతిరేకంగా హైదరాబాద్ ముస్లిం మేధావులు, ముస్లిం విద్యావంతులు వారి హిందూ స్నేహితులైన రాజకీయ నాయకులు ప్రధానంగా ఈ సమస్యపై దృష్టి పెట్టి ఆందోళన, భావజాల వ్యాప్తి, సమావేశాలు జరిపేవారు. పాలకులకు, అధికారులకు వినతిపత్రాలు ఇచ్చేవారు. కాని పోలీసు చర్య తర్వాత ఎక్కువగా హిందూ నాన్ ముల్కీలను మదరాసు రాష్ట్రంలోని ఆంధ్రప్రాంతాల నుంచి హైదరాబాద్ ఉద్యోగాలలో నియమించడంతో ముల్కీ సమస్య స్వభావంలో కొద్దిగా తేడా వచ్చింది. ఉత్తరభారతదేశ ముస్లింలకు హైదరాబాద్ ముస్లింలకు మధ్య ఉన్న సమస్య కాస్త ఆంధ్ర హిందూ ఉద్యోగులకు, తెలంగాణ విద్యార్థులకు మధ్య సమస్యగా మారింది.
వరంగల్‌లో ప్రారంభమైన విద్యార్థుల ముల్కీ ఆందోళన
1952 జులై, సెప్టెంబర్ నెలల్లో తెలంగాణలోని అన్ని ప్రధాన పట్టణాల్లో రాజధాని హైదరాబాద్‌లో, అప్పటి హైదరాబాద్ రాష్ట్రంలో అంతర్గతంగా ఉన్న మరాఠ్వాడ, కన్నడ జిల్లాలోని పట్టణాల్లోని విద్యార్థులంతా ముల్కీ ఉద్యమంలో పాల్గొన్నారు. ఈ ఆందోళన ముందుగా వరంగల్‌లో ప్రారంభమైంది. దీనికి ఒక నేపథ్యమున్నది. తెలంగాణ రాష్ట్ర సాధనోద్యమంలో 1952 నుంచి 2011 వరకు మార్గదర్శకంగా ఉంటూ నాలుగు తరాల ఉద్యమకారులతో కలిసి నడిచిన కాకతీయ విశ్వవిద్యాలయం మాజీ వైస్ చాన్స్‌లర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ మాటల్లోనే..
పోలీస్ యాక్షన్ తర్వాత ఆంధ్రప్రాంతం నుంచి వచ్చిన ఉద్యోగులు, ఆఫీసర్లు తెలంగాణను చాలా అవహేళన చేసుకుంటూ మాట్లాడేవారు. ఆగస్టు 1952లో అప్పటికే నా ఇంటర్మీడియట్ కాలేజీ(వరంగల్)లో ఇంగ్లిష్, తెలుగు లాంగ్వేజ్ చెప్పేవాళ్లంతా ఆంధ్ర నుంచి వచ్చేసిండ్రు. వాళ్లందరు కూడా విశాలాంధ్ర గావాలే అనేవారు. దానికి తోడు అప్పడు ఏ గెస్ట్‌లను పిలిచినా వరంగల్‌కు ఆంధ్ర నుంచే పిలిచేది. ఒకసారి ఒక పెద్ద పబ్లిక్ మీటింగ్ పెట్టి వాళ్లు అయ్యదేవర కాళేశ్వరరావును విజయవాడ నుంచి పిలిపించిండ్రు (అప్పటికి బూర్గుల రామకృష్ణారావు గవర్నమెంట్ వచ్చింది). ఆయన ఉపన్యాసం మొదలు పెట్టిండు.మీరు విడిగా ఉంటే అభివృద్ధి చెందలేరు, మీకు తెలుగు రాదు, మీకు తెలవాలే అని డెరిగేటివ్గా మాట్లాడిండు. అంటే మీకు ఏం రాదు, మీరు దద్దమ్మలు. మిమ్మల్ని సంస్కరించాలి అంటే మాతో గలవాలే అని పెట్టిండు. బాగా అల్లరి జేసినం. మీటింగంతా అల్లరి అయితుంటే పోలీసులను పిలిపిచ్చిండ్రు. అపుడు కలెక్టర్, పోలీసులంతా అక్కడ్నించి (ఆంధ్ర) వచ్చినోళ్లే ఉన్నారు. లాఠీచార్జి అయింది. లాఠీచారిలో దెబ్బలు తిన్నవాళ్లలో నేను ఒకన్ని. అప్పటికే మొత్తం తెలంగాణ జిల్లాల నుంచి వచ్చిన ఎన్జీవోలు, ఆఫీసర్లు, టీచర్లు, అందరిది ఇదే ధోరణి ఉండేది. అప్పటికే తుకతుక అంటుండే మొత్తం తెలంగాణ. ఇదేదో ఘోరమైందని, ఊరుకోవద్దని అనుకున్నాం.దీన్ని (ముల్కీ ఉద్యమాన్ని) బిగిన్ చేసింది చాలావరకు విద్యార్థ్ధులు, ఎన్జీవోలు. దానికి ట్రిగ్గర్ ఏంది? వరంగల్ ఇన్సిడెంట్ ట్రిగ్గర్ అయ్యింది. వెనుక ఇక్కడి టీచర్స్ ఉండిరి. ఆరోజు కమ్యూనికేషన్స్ లేవు, మీడియా లేదు. అయినా స్ప్రెడ్ అయ్యింది.
హైదరాబాద్ అసెంబ్లీలో ముల్కీపై ప్రశ్నలు
వరంగల్‌లో జూలై 1952లో ముల్కీ ఆందోళనను విద్యార్థులు ప్రారంభించడానికి పూర్వం ఆచార్య జయశంకర్ పేర్కొన్న పై సంఘటనతోపాటు శాసనసభలో వివిధ పక్షాల సభ్యులు ముల్కీ సమస్యపై బూర్గుల ప్రభుత్వాన్ని పలు ప్రశ్నలతో నిలదీశారు.
పార్థసారధి అక్రమాలపై జూన్ 28, జూలై 15న వరంగల్ సెంట్రల్ మిడిల్ స్కూల్‌కు చెందిన 9మంది ఉపాధ్యాయులు, హయగ్రీవాచారి ప్రభుత్వానికి చేసిన ఫిర్యాదులపై డిప్యూటీ డైరెక్టర్ (విద్యాశాఖ) డా.షెండార్కర్ 1952 జూలై 26న వరంగల్‌లో విచారణ జరిపారు. ఈ విషయం తెలుసుకున్న వరంగల్ విద్యార్థులు సుమారు నాలుగువేల మంది హన్మకొండ చౌరస్తా నుంచి విచారణ జరుపుతున్న ఆఫీసు పక్కన సుబేదారి వరకు నాన్ ముల్కీ గోబ్యాక్, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ నినాదాలతో పెద్ద ఎత్తున ఊరేగింపు తీశారు. ఆ తర్వాత పబ్లిక్ పార్క్‌లో సమావేశాన్ని నిర్వహించారు. 1952 ముల్కీ ఉద్యమంలో తొలి ప్రదర్శనగా ఈ ర్యాలీ చరిత్రలో నిలిచిపోయింది.
జూలై 27-29 వరకు వరంగల్ విద్యార్థులు తరగతులను బహిష్కరించి సమ్మె చేశారు. జూలై 28న విద్యార్థులంతా సమావేశమై యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసుకోని కన్వీనర్‌గా బుచ్చయ్యను ఎన్నుకొన్నారు. ముల్కీ సమస్యపై ముఖ్యమంత్రి ఒక తీర్మానాన్ని పంపాలని నిర్ణయించారు. జూలై 29న వరంగల్‌లో మరోసారి పెద్దఎత్తున ఊరేగింపు నిర్వహించారు.
వరంగల్‌లో ప్రారంభమైన ముల్కీ ఉద్యమం రెండు, మూడు రోజుల్లోనే జిల్లాలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. 1952 నాటికి ఇప్పటి ఖమ్మం జిల్లా (భద్రాచలం డివిజన్ మినహా) వరంగల్ జిల్లాలో భాగంగా ఉండేది. 1952 ఆగస్టు ఒకటి, రెండు తేదిల్లో ఖమ్మం మెట్, మహబూబాబాద్‌లో, 3న మధిరలో, 4న ఇల్లందులో విద్యార్థులు పెద్దసంఖ్యలో నాన్-ముల్కీ గోబ్యాక్ నినాదాలతో ఊరేగింపులు నిర్వహించారు.
బూర్గులతో విద్యార్థుల భేటీ
బోగస్ ముల్కీలను ఉద్యోగాల్లోంచి తొలగించాలని, ముల్కీ రూల్స్ అమలుకు మంత్రి వర్గ సబ్ కమిటీని నియమించాలని ఆగస్లు 6న వరంగల్ విద్యార్థుల యాక్షన్ కమిటీ సభ్యులు కన్వీనర్ బుచ్చయ్య నాయకత్వంలో హైదరాబాద్ ముఖ్యమంత్రి బూర్గులను కలిసి విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల కోర్కెలు న్యాయమైనవి అంటూ త్వరలోనే సబ్-కమిటీని ఏర్పాటు చేస్తానని బూర్గుల రామకృష్ణారావు హామీ ఇచ్చారు. ఈ మేరకు వెంటనే పత్రిక ప్రకటన ఇవ్వాలని విద్యార్థులు సీఎంను కోరారు. ఈ నిర్ణయం కేబినెట్ మీటింగ్‌లో తీసుకోవాల్సిఉందని, త్వరలోనే నిర్ణయం తీసుకుని పత్రికా ప్రకటన ఇస్తానని ఈ లోగా సమ్మెను విరమించాలని బూర్గుల విద్యార్థులను కోరారు. సమావేశం సంతృప్తికరంగా జరగడంతో ఆనందంతో విద్యార్థులు సమ్మె విరమించి మరునాటి నుంచి తరగతులకు హాజరయ్యారు.
బూర్గుల సారథ్యంలో మంత్రివర్గం
1952 మార్చి 6న బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా హైదరాబాద్‌లో తొలి ప్రజాప్రభుత్వం ఏర్పడింది. పూర్వపు వెల్లోడి ప్రభుత్వంలో వీరు రెవెన్యూ మంత్రిగా పని చేశారు. మహాబూబ్‌నగర్ జిల్లాలోని షాద్‌నగర్ శాసనసభ నియోజకవర్గం నుంచి బూర్గుల ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి బూర్గుల మరో 12 మంది మంత్రులు జూబ్లీహాల్లో ప్రమాణస్వీకారం చేశారు. వీరందరిని రాజ్‌ప్రముఖ్ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ నియమించారు.
శాఖలు:
బూర్గుల రామకృష్ణారావు- ముఖ్యమంత్రి, సాధారణ పరిపాలన, ల్యాండ్ రెవెన్యూ
ఫూల్‌చంద్ గాంధీ- విద్య, ఆరోగ్యం
వినాయకరావు విద్యాలంకార్- వాణిజ్యం, పరిశ్రమలు
వీబీ రాజు- కార్మిక, పునరావాసం
దిగంబరరావు బిందూ- హోం
డీఎస్ మేల్కోటే- ఆర్థికశాఖ
చెన్నారెడ్డి- ఆహార, వ్యవసాయ శాఖలు
కేవీ రెడ్డి- కస్టమ్స్, ఆబ్కారీ, అడవులు
నవాజ్ మెషీ నవాజ్‌జంగ్ బహుదూర్- పబ్లిక్ వర్క్స్
అన్నారావు- స్థానిక స్వపరిపాలన
దేవీసింగ్ చౌహాన్- సాంఘిక సేవ
సుకర్ దేవ్- హరిజన అభ్యుదయ
జగన్నాథరావు- న్యాయశాఖ
ముల్కీ ఉద్యమం మొదలైంది ఇలా
వరంగల్‌లో డివిజనల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్‌గా నియమితిలైన పార్థసారధి 1952 జూన్-జూలై నెలల్లో సుమారు 180 మంది ఉపాధ్యాయులను మూకుమ్మడిగా బదిలీ చేశారు. వీరిలో కొందరిని దూరప్రాంతాలకు బదిలీ చేశారు. మరికొందరిపై క్రమశిక్షణా చర్యల పేరుతో ఇబ్బందులకు గురి చేశారు. వరంగల్‌లోని విద్యార్థులు, ఉపాధ్యాయులు, రాజకీయ నాయకులు, అధికారులు ఇతన్ని నాన్ ముల్కీగా పరిగణిస్తారు. పార్థసారధి మాత్రం తాను హైదరాబాద్ నివాసినని, ముల్కీనని చెప్పుకునేవారు. వరంగల్‌లో బదిలీ అయిన కొందరు ఉపాధ్యాయుల స్థానంలో నాన్‌ముల్కీలను నియమించినట్లు విపరీతంగా ప్రచారం జరిగింది. బహుశా తప్పుడు ధృవీకరణ పత్రాలు పొందినవారుండవచ్చు. పార్థసారధి మాత్రం తాను ముల్కీ నియమాలను ఉల్లంఘించలేదని, హయగ్రీవాచారి (కాంగ్రెస్ కార్యదర్శి) సిఫారసు చేసిన ఇద్దరు అధ్యాపకులకు పదోన్నతి కల్పించనందునే తనపై దుష్ప్రచారం చేయించాడని, పై అధికారులకు ఫిర్యాదు చేశాడని, వరంగల్ విద్యార్ధులను రెచ్చగొట్టినాడని ముల్కీ ఉద్యమకారులపై సెప్టెంబర్ 3, 4 తేదీల్లో పోలీసులు జరిపిన కాల్పుల సంఘటనపై నియమించిన హైకోర్టు న్యాయమూర్తి మొగిలి జగన్మోహన్ రెడ్డి కమిషన్ ముందు పార్థసారధి వెల్లడించారు.
150 నుంచి 180 వరకు ఉపాధ్యాయుల మూకుమ్మడి బదిలీలు, ఉపాధ్యాయులపై కక్షపూరితంగా వ్యవహరించడం, రషీద్-ఉల్-హసన్‌ను వేధించడం, దానిని తట్టుకోలేక ఆయన మరణించడం, నాన్ ముల్కీలను ఉపాధ్యాయులుగా నియమించడం వంటి కారణాలతో వరంగల్ ఉపాధ్యాయులు, విద్యార్థులు ముల్కీ ఉద్యమాన్ని ప్రారంభించారు.