The newest agriculture | సరికొత్త వ్యవసాయం ఉద్యోగాల ఫలసాయం
ఊర్లల్లో ఉండేవారు, నిరక్షరాస్యులే వ్యవసాయం చేస్తారనేది పాతమాట. ఇప్పుడు ఇంజినీరింగ్, పీహెచ్‌డీలు చేసిన ఉన్నత విద్యావంతులు కూడా సాగుబడి వైపు కదులున్నారు. సాగులో సాంప్రదాయ విధానాలతోపాటు, సరికొత్త సాంకేతిక పద్ధతులను అవలంబించి ఆదర్శ రైతులుగా నిలుస్తున్నారు. అలాగే వ్యవసాయరంగంలో ఉండే సమస్యలను తమ వినూత్నమైన ఆలోచనలు, ఆధునిక టెక్నాలజీ సాయంతో పరిష్కారం చూపుతున్నవారూ ఉన్నారు. ఇలా ఇతరులకు మార్గదర్శకులుగా నిలవడమే కాకుండా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నారు. వ్యవసాయ విధానంలో ఉండే వివిధ దశలను ఆధారంగా చేసుకుని ఉపాధికి బాటలు వేస్తున్నారు. అసలు వ్యవసాయంలో ఉండే దశలు ఏవి, అగ్రి కోర్సులతో కొంగొత్త అవకాశాలు ఎలా అందుకోవచ్చనే విషయాలు…
-దేశంలో ఇప్పటికీ వ్యవసాయమే జీవనాధారంగా, వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఉపాధి పొందుతున్నవారి సంఖ్య ఎక్కువగానే ఉన్నది. దేశం ఇతర రంగాల్లో ఎంతగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ వ్యవసాయ రంగంపై సుమారు 60 శాతం ఆధారపడి ఉన్నారు. జీడీపీలో 25 శాతం వాటా వ్యవసాయానిదే ఉందంటే దీని ఆవశ్యకత ఎంత ఉందో అర్థమవుతున్నది. దీనికితోడు నానాటికి జనాభా అధికమవుతుండటంతో వారందరికీ సరిపోయేలా వ్యవసాయ ఉత్పత్తులను కూడా పెంచాల్సి ఉంది. దీంతో సాంప్రదాయ వ్యవసాయ పద్ధతులే కాకుండా, కొత్త వంగడాలు సృష్టించడం, అధిక దిగుబడికి అవసరమైన పరిశోధనలు చేయడం, ఆధునిక పద్ధతులను అనుసరించడం, తక్కువ వ్యయంతో ఎక్కువ ఉత్పత్తి జరిగేలా పంటలను సాగుచేయడానికి అవసరమైన మెళకువలు నేర్పుతూ అగ్రికల్చర్ కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. దీంతో యువత వ్యవసాయ కోర్సులవైపు మళ్లుతున్నది. దీనికితోడు పంటల సాగులో నూతన సాంకేతిక, శాస్త్రీయ పద్ధతులను అవలంబిస్తుండటంతో వ్యవసాయ, దాని అనుబంధ రంగాలు కొత్తరూపును సంతరించుకుంటున్నాయి. దీంతో వ్యవసాయ విద్య పరిధులు, అవకాశాలు రెండూ విస్తరిస్తున్నాయి.
ఉపాధికి తోవ..
-వ్యవసాయం అంటే కేవలం దుక్కిదున్ని, విత్తనాలు వేసి, పంట పండించి వాటిని అమ్మడమే కాదు. భూమిని చదును చేయడం దగ్గర నుంచి పంటను కోత కోసి, మార్కెట్‌కు తరలించడం వరకు అందులో అనేక దశలు ఉంటాయి. ఇవి వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఎక్కువమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. అలాంటివి కొన్ని..
ప్రొడక్షన్ అగ్రికల్చర్
-వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పత్తులను పెంచడం వంటివి ఇందులో ఉంటాయి. పంటలు, పండ్లు, కూరగాయల ఉత్పత్తి, కోళ్లు, పశు సంపదను అధికం చేయడం, డెయిరీని స్థాపించడం, మేకలు, గొర్రెలు, పందుల పెంపకం కూడా దీని పరిధిలోనే ఉంటుంది. దేశంలో పాలు, పాల పదర్థాల ఉత్పత్తి పరిశ్రమలో అధికంగా ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి.
అగ్రికల్చరల్ సేల్స్ అండ్ సర్వీస్
-పంటల సాగుకు అవసరమైన సేంద్రీయ ఎరువులు (ఫెర్టిలైజర్స్), క్రిమి సంహారక మందులు (పెస్టిసైడ్స్), వ్యవసాయ పరికరాలు, విత్తనాల విక్రయం వంటివి అమ్మకపు (సేల్స్) విభాగంలోకి వస్తాయి. అందువల్ల సేల్స్ అండ్ ప్రమోషన్ విభాగంలో ఉద్యోగాలు విరివిగా లభిస్తున్నాయి. వీటితోపాటు పంటలు కోయడం, ఉన్ని కత్తిరించడం, పశువుల గిట్టలు (hoofs) కత్తిరించడం, గుర్రాలకు నాడలు వేయడం వంటి వ్యవసాయ సంబంధ సేవల్లో ఉద్యోగ అవకాశాలు ఉంటాయి.
మార్కెటింగ్, బిజినెస్ మేనేజ్మెంట్
-వ్యవసాయానికి, వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించిన వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లపై అవగాహన, వ్యాపార అర్థశాస్త్ర అధ్యయనం, విజయవంతమైన మార్కెటింగ్ మెళకువలవంటివి సహాయపడుతాయి.
అగ్రికల్చర్ మెకానిక్స్
-వ్యవసాయ ఉత్పత్తులను పెంచడానికి, వాటిని నిలువచేసుకోవడానికి అవసరమైన కట్టడాల నిర్మాణాలు, వాటికి ప్లానింగ్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్, యంత్రాల నిర్వహణ, వెల్డింగ్, ఎలక్ట్రికల్ వర్క్, ప్లంబింగ్ వంటివి ఇందులో ఉంటాయి.
అగ్రికల్చర్ ప్రాసెసింగ్
-అగ్రికల్చర్ సైన్స్‌తో ఫుడ్ సైన్స్‌కు దగ్గరి సంబంధం ఉంటుంది. దీంతో అగ్రికల్చర్లో డిగ్రీ చేసినవారు ఎలాంటి ఆహార పరిశ్రమలోనైనా ఉద్యోగాలు పొందవచ్చు. అదేవిధంగా ఆహార పరిశ్రమలో ప్లాంట్ వర్కర్స్, ఎగ్ ప్రాసెసర్స్ వంటి నిపుణులు, సాధారణ శ్రామికుల అవసరం ఉన్నది.
ఫారెస్ట్రీ
-పచ్చదనాన్ని ఆస్వాదించేవారికి అటవీ ఉద్యోగాలు మంచి అవకాశాలు. కలప ఉత్పత్తి, పెంపకం, అటవీ భూముల అభివృద్ధి, నిర్వహణ వంటివి ఇందులో ఉంటాయి.
హార్టికల్చర్
-గార్డెన్ల సాగు, నిర్వహణకు సంబంధించిన ఉద్యోగాలు హార్టికల్చర్ కెరీర్ పరిధిలోకి వస్తాయి. ఇందులో గ్రీన్హౌస్, నర్సరీ మేనేజ్మెంట్, టర్ఫ్ మేనేజ్మెంట్, ఫ్లోరికల్చర్, ల్యాండ్‌స్కేపింగ్ వంటివి ఉంటాయి.
రూరల్ రిక్రియేషన్ అండ్ రిసోర్సెస్
-ఇది ఎప్పటికీ తరిగిపోని, పునరుత్పాదక వనరులకు సంబంధించింది. వైల్డ్‌లైఫ్, జలవనరులు, భూమితో సంబంధమున్న ఉద్యోగాలు దీనిపరిధిలోకి వస్తాయి.
నూతన ఆవిష్కరణలకు వేదిక
-వినూత్నంగా ఉండాలని కోరుకునేవారికోసం వ్యవసాయరంగంలో ఉద్యోగ అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పెరుగుతున్న ఉత్పత్తులు, కొత్తగా పుట్టుకొస్తున్న సమస్యలు వాటికి సరికొత్త పరిష్కారాలు, వ్యవసాయానికి అవసరమైన నూతన ఆవిష్కరణలు ఇలా అనేక రంగాల్లో ఉద్యోగాలు అందుబాటులోకి వస్తున్నాయి.
అగ్రిటెక్ ఎంట్రప్రెన్యూర్
-పంటల అధిక దిగుబడికి, వినియోగదారులకు అవసరమైన ఆహార పదార్థాలను వీలైనంత తొందరగా అందించడానికి మోతాదుకు మించి రసాయనాలను వాడుతుండటంతో ఇప్పటికే పర్యావరణానికి హాని జరిగింది. వ్యవసాయ రంగంలో ఉండే ఇలాంటి సమస్యలను అధిగమించడానికి సరికొత్త ఆలోచనలతో స్టార్టప్‌లు ప్రారంభమవుతున్నాయి. ఇవి ఆరోగ్యకరమైన, ఆహార పదార్థాల ఉత్పత్తి స్థిరంగా కొనసాగేలా వినూత్నమైన, సృజనాత్మక, పర్యావరణ అనుకూల పరిష్కారాలను చూపుతున్నాయి. ఉదాహరణకు పుణెలో ప్రారంభమైన ఒక ఎం-కామర్స్ సంస్థ వ్యవసాయానికి సంబంధించిన పరికరాలు, ఉత్పత్తులను నేరుగా రైతులకే అమ్ముతున్నది. ఇలా దేశంలోని సుమారు 25 వేలకుపైగా గ్రామాల్లో తమ సేవలను అందిస్తున్నది. అదేవిధంగా దక్షిణ భారతదేశానికి చెందిన ఒక స్టార్టప్ కంపెనీ సుమారు మూడువేల మంది రైతులు పండించిన పంటలను 12 గంటల్లోనే హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లోని దాదాపు నాలుగువేల రిటైల్ స్టోర్లకు చేరవేస్తున్నది. దీంతో వారికి సరైన ధరలు వచ్చేలా చూస్తున్నది. వీటితోపాటు స్టెల్యాప్స్, బాంబే హెంప్ కంపెనీ వంటి స్టార్టప్‌లు తమ కొత్త ఆలోచనలు, నూతన ఆవిష్కరణలతో రైతులకు సహాయం అందిస్తుండటంతోపాటు అనేకమందికి ఉపాధి కల్పిస్తున్నాయి.
అగ్రికల్చర్ అడ్వెంచరర్
-వ్యవసాయ రంగంలో అనునిత్యం వినూత్నమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆవిష్కరించడానికి ఆస్కారమున్నది. అది ఉపాధి అవకాశాలు సృష్టించడానికి వేదికగా నిలుస్తున్నది. అందరిలా నిర్ణీత వేళల్లో ఉద్యోగం చేయడం ఇష్టంలేనివారు ఈ రంగంలోకి ప్రవేశించి కొత్త ఆవిష్కరణలు రూపొందించే అడ్వెంచరర్‌గా మారవచ్చు.
అగ్రికల్చర్ జర్నలిస్ట్
-వ్యవసాయ జర్నలిస్ట్‌గా పనిచేయడం వల్ల ఈ రంగానికి సంబంధించిన ప్రభుత్వ పథకాలు, ఏ కాలంలో ఎలాంటి పంటలను సాగు చేయాలి, పరిశ్రమల నిబంధనలు ఎలా ఉంటాయి, నూతన పరికరాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, వ్యవసాయరంగంలో చోటుచేసుకుంటున్న కొత్త విషయాలను ఎప్పటికప్పుడు రైతులు, పాఠకులకు చేరవేయవచ్చు.
ప్రింట్ అండ్ ప్యాకేజింగ్ డిజైనర్
-వ్యవసాయ ఉత్పత్తులు, ఆహార పరిశ్రమల ఆలోచనలకు అనుగుణంగా సృజనాత్మకంగా, ఆయా ఉత్పత్తుల ప్యాకెట్లను డిజైన్ చేయగలిగే వారికి డిమాండ్ అధికంగా ఉన్నది. ఇలాంటి వారు కిరాణా దుకాణాలు, రిటైల్ వ్యాపార రంగాల్లో ఉద్యోగాలు పొందుతున్నారు.
ఎవరు చదవచ్చు
-సైన్స్, మ్యాథ్స్ అంటే ఇష్టం ఉండి, మొక్కలు, జంతువులు, భూమి, వ్యవసాయం గురించి నేర్చుకోవాలనే తపన ఉన్నవారు వ్యవసాయ కోర్సులు చేయవచ్చు. వ్యవసాయ పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలైన వినియోగదారుల అవసరాల్లో అనునిత్యం మార్పులు వస్తుండటం, రోజురోజుకు కొత్త పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వస్తున్నప్పటికీ సరికొత్త సవాళ్లు, అడ్డంకులు కలుగుతూనే ఉన్నాయి. వీటి నుంచి బయటపడటానికి వేగంగా ఆలోచించడంతోపాటు, తగిన పరిష్కార మార్గాలు చూపగలగాలి. దీంతోపాటు మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండి రైతులు, అమ్మకందారులు, తయారీదారులు, వినియోగదారులతో నేరుగా మాట్లాడగలిగే నైపుణ్యం ఉండాలి.
-కోర్సులో భాగంగా వ్యవసాయం ఏ పద్ధతుల్లో చేయాలి, ఏ భూమిలో ఎలాంటి పటలను సాగు చేయవచ్చు, పశువులకు అవసరమైన గడ్డి సాగుతోపాటు ఇతర వ్యవసాయ పద్ధతులు, పంటల సాగుకు సంబంధించిన అనేక ఆధునిక సాంకేతిక విధానాల గురించి అధ్యయనం చేయవచ్చు.
ఎక్కడ చదవచ్చు..
-దేశంలో సుమారు నాలుగు వందల కాలేజీలు వ్యవసాయం, దాని అనుబంధ రంగాలకు సంబంధించిన అంశాల్లో డిగ్రీ, పీజీ కోర్సులను అందిస్తున్నాయి. మన ఆసక్తిని బట్టి ఆ కోర్సులను ఆఫర్‌చేస్తున్న కాలేజీలు, యూనివర్సిటీలను ఎంపికచేసుకోవచ్చు. ఆయా కోర్సులను అందిస్తున్న ప్రముఖ విద్యాసంస్థలు..
-ప్రొ.జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ- హైదరాబాద్
-ఇండియన్ అగ్రికల్చరల్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఏఆర్ఐ)- న్యూఢిల్లీ
-తమిళనాడు అగ్రికల్చరల్ యూనివర్సిటీ- కోయంబత్తూర్
-సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ (సీఐఏఈ)- భోపాల్
-అంబిల్ ధర్మలింగం అగ్రికల్చరల్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఏడీఏసీ అండ్ ఆర్ఐ)- తిరుచిరాపల్లి
-ఇండియన్ అగ్రికల్చరల్ స్టాటిస్టిక్స్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐఏఎస్ఆర్ఐ)- న్యూఢిల్లీ
-నేషనల్ డెయిరీ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్- కర్నాల్
-కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ- కొచ్చి
-సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిషరీస్ ఎడ్యుకేషన్- ముంబై
-నేషనల్ బ్యూరో ఆఫ్ ఫిష్ జెనెటిక్ రిసోర్సెస్ (ఎన్బీఎఫ్జీఆర్)- లక్నో
-వైల్డ్‌లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా- డెహ్రాడూన్
కోర్సులు
-ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయాలనుకునే వారికోసం సాగులో మెళకువలు నేర్చుకునేలా పదో తరగతి, ఇంటర్ విద్యార్హతతో సర్టిఫికెట్, డిప్లొమా, బ్యాచిలర్ కోర్సులు వివిధ యూనివర్సిటీలు అందిస్తున్నాయి.
సర్టిఫికెట్ కోర్సులు
-ఈ కోర్సులు సాధారణంగా ఏడాది నుంచి రెండేండ్ల కాలవ్యవధి కలిగి ఉంటాయి. వీటిలో హార్టికల్చర్, ఫ్లోరికల్చర్, ఆక్వాకల్చర్, చేపల పెంపకం, తేనెటీగల పెంపకం, ఫ్రూట్ ప్రొడక్షన్ కోర్సులు చేయడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపుతున్నారు. ఈ కోర్సులు చేయాలంటే పదో తరగతి లేదా ఇంటర్ పాసవ్వాల్సి ఉంటుంది.
డిప్లొమా కోర్సులు
-వీటిలో అగ్రికల్చర్, డెయిరీ టెక్నాలజీ, ఫ్లోరీరికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, హార్టికల్చర్ కోర్సులు ముఖ్యమైనవి. ఈ కోర్సుల కాలవ్యవధి సాధారణంగా మూడేండ్లు ఉంటుంది. అయితే వీటిలో కొన్నింటిని ఒకటి నుంచి మూడేండ్ల కాలవ్యవధిలో కూడా చేయవచ్చు. డిప్లొమా కోర్సులు చేయాలంటే ఎంపిక చేసుకున్నదాన్ని బట్టి పది లేదా ఇంటర్ పూర్తిచేయాలి.
బ్యాచిలర్ కోర్సులు
-ఇంటర్ పూర్తి చేసినవారు వ్యవసాయ డిగ్రీ, ఇంజినీరింగ్ కోర్సులు చేయవచ్చు. ఇందులో వివిధ కాంబినేషన్లతో బ్యాచిలర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అవి..
అగ్రికల్చర్ మేనేజ్మెంట్లో బీబీఏ
-ఇంటర్లో ఏ గ్రూప్‌వారైనా ఈ కోర్సు చేయవచ్చు. ఈ కోర్సును మూండేడ్లలో పూర్తి చేయవచ్చు.
బీఎస్సీ అగ్రికల్చర్
-ఇందులో అగ్రికల్చర్, డెయిరీ సైన్స్, ప్లాంట్ సైన్స్, అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ సైన్స్, హార్టికల్చర్, ప్లాంట్ పాథాలజీ, ఫిషరీస్ సైన్స్ లేదా ఫారెస్ట్రీ అంశాల్లో కోర్సులు ఉన్నాయి. వీటి కాలవ్యవధి కూడా మూడేండ్లు. ఈ కోర్సులు చేయాలంటే ఇంటర్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ (పీసీబీ) సబ్జెక్టులు, వీటితోపాటు మ్యాథ్స్ సబ్జెక్టు చదివినవారై ఉండాలి.
బీఈ లేదా బీటెక్
-ఇందులో అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, అగ్రికల్చరల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అగ్రికల్చర్ అండ్ డెయిరీ టెక్నాలజీ, అగ్రికల్చర్ అండ్ ఫుడ్ ప్రాసెసింగ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులు చేయాలంటే ఇంటర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ లేదా బయాలజీ సబ్జెక్టులతో సైన్స్ స్ట్రీమ్‌లో ఉత్తీర్ణులై ఉండాలి. నాలుగేండ్ల కాలవ్యవధి ఉండే ఈ కోర్సులు చేయాలంటే ఆయా విద్యాసంస్థలు నిర్వహించే ప్రవేశపరీక్షల్లో అర్హత సాధించాలి
హైటెక్ ఫార్మర్
-సాగులో ఆధునిక సాంకేతిక పద్ధతులను ఉపయోగించడం ద్వారా శ్రమను, సమయాన్ని, ధనాన్ని ఆదాచేయవచ్చు. దీనిద్వారా భారతదేశ వ్యవసాయ రంగానికి కొత్త రూపు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఆధునిక పద్ధతులను ఉపయోగించడం ద్వారా హైటెక్ రైతులు గాలిలో మొక్కలను పెంచడానికి (Aeroponics), నీటిలో మొక్కలను పెంచడానికి (Hydroponics), పంటను సర్వే చేయడానికి డ్రోన్లను ఉపయోగించడం, ఉపగ్రహాల సహాయంతో ట్రాక్టర్లను నడపడానికి అవసరమైన ఉద్యోగాలు కల్పించవచ్చు. ఉదాహరణకు క్రాప్లన్ టెక్నాలజీ సొల్యూషన్స్ అనే సంస్థ పంట నష్టాన్ని గుర్తించడానికి స్మార్ట్ఫార్మ్ అనే క్లౌడ్ ఆధారిత ప్లాట్‌ఫామ్‌ను ప్రవేశపెట్టింది. భూమిలో ఉండే ఖనిజ లవణాల స్థాయిని తెలుసుకోవడానికి గ్రీన్సీకర్స్ అనే పరికరాన్ని ట్రింబుల్ అనే సంస్థ అభివృద్ధి చేసింది. పంట కాలాలను నిర్ణయించే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత వ్యవస్థను రోబోట్ బాస్చ్ ఇంజినీరింగ్ సంస్థ తయారుచేసింది. వీటిద్వారా భూసార పరీక్షలు నిర్వహించి రైతులు తమ పొలాలు ఏయే పంటల సాగుకు అనుకూలంగా ఉన్నాయి, ఎలాంటి విత్తనాలు వేయాలి, తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడి రాబట్టడానికి ఎంత మోతాదులో రసాయనాలను ఉపయోగించాలనే విషయాలను తెలుపుతున్నాయి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?