తెలంగాణ చారిత్రక చిహ్నాలు.. ఈ కోటలు

కొన్ని కోటలను, కోటల శిల్పసంపదను చూస్తున్నప్పుడు, అటువంటి చాతుర్యాన్ని కలిగిన ఆనాటి శిల్పుల ప్రతిభ అబ్బురపరుస్తూనే ఉంటుంది. రాజులు పోయినా, రాజ్యాలు పోయినా, శిథిలాల్లో మాత్రం మిగిలే ఉంటాయి. తెలంగాణలో కూడా అటువంటి కోటలు ఎన్నో ఉన్నాయి. శాతవాహనులు, చాళుక్యులు, కాకతీయుల కాలం నాటి కోటలు శిథిలాలుగా కొన్ని ఉంటే, మరికొన్ని శిథిలావస్థలో ఉన్నాయి. కానీ ఆనాటి వైభవాన్ని మాత్రం ఎక్కడా కోల్పోయినట్లు ఇసుమంత కూడా అనిపించదు ఎందుకంటే ఆనాటి శిల్పుల ప్రతిభ అలాంటిది మరి. తెలంగాణ రాష్ట్రం గొప్ప సంస్కృతికి, సంప్రదాయాలకు, వారసత్వానికి ప్రసిద్ధి చెందింది. రాజకీయ-రక్షణ వ్యవస్థను తెలిపే కోటలు రాష్ట్రంలో చాలా ఉన్నాయి. శాతవాహనుల నుంచి సంస్థానాధీశుల కాలం వరకు వివిధ ప్రాంతాల్లో నిర్మించి న గిరి, జల, స్థల వనదుర్గాలపై పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. గిరి దుర్గాల్లో హన్మకొండ, భువనగిరి, గోల్కొండ, ఉదయగిరి, రాతికోటలు ముఖ్యమైనవైతే స్థల దుర్గాల్లో దంతపురం, ధరణికోట, ధూళికట్ట, బోధన్, వరంగల్, మట్టికోటలు, జలదుర్గాల్లో నిజాంకొండ కోట ముఖ్యమైనవి.
చారిత్రక ప్రదేశాలు, సందర్శనా స్థలాలు భారతదేశానికి ఎంతో గర్వకారణం. అదేవిధంగా తెలంగాణలో ఉన్న చారిత్రక ప్రదేశాలు, వారసత్వ కట్టడాలు అద్భుతం అనే చెప్పాలి. గత వైభవాలకు, దేశ చరిత్రకు ప్రత్యక్ష నిదర్శనంగా ఈరోజుకు ఎన్నో కోటలు దర్శన మిస్తున్నాయి. ఆ కోటల్లో ఆనాటి రాజుల వైభవం స్పష్టంగా తెలుస్తుంది. ఆనాటి సంస్కృతికి దృష్టాంతంగా శిథిలాలు, పాలనా విధానాల శిలాశాసనాలు మనల్ని ఎప్పటికీ ఉత్తేజితులను చేస్తూనే ఉంటాయి
స్థల దుర్గాలు
ధూళికట్ట: ధూళికట్ట తెలంగాణ రాష్ట్రంలో పెద్దపల్లి జిల్లా, ఎలిగేడు మండలంలోని గ్రామం. ధూళికట్ట 1975-76 కాలంలో పురావస్తు శాఖ తవ్వకాల్లో ఇక్కడ శాతవాహనుల కాలం నాటి కోటలు, బౌద్ధస్థూపం బయటపడ్డాయి. కట్ట వద్ద శాతవాహనుల కాలంనాటి స్థూపంతోపాటు మట్టికోట కూడా ఉంది. ఇక్కడ తవ్వకాల్లో శాతవాహన కాలం నాటి రాజప్రాసాదం, నాణేలు, మట్టిపాత్రలు, ఇతర పురాతన వస్తువులు బయటపడటంతో స్థూపానికి, కోటకు ప్రాముఖ్యత పెరిగింది.
బోధన్: బోధన్ పట్టణం బయట ఎత్తైన మట్టికోట గోడ శాతవాహనుల కాలానికి చెందింది. చుట్టూ కందకం, దానివెంట దాదాపు 100 అడుగుల విశాలమైన 50 అడుగుల ఎత్తైన మట్టిగోడ చారిత్రక తొలియుగం నాటి రక్షణ వ్యవస్థను తెలియజేస్తుంది. కోట లోపల కాకతీయుల కాలం నాటి ఆలయాలు, కుతుబ్‌షాహీల కాలం నాటి దేవళ్ మాస్క్‌లు ఇతర ఆకర్షణలు ఉన్నాయి.
వరంగల్ : వరంగల్ కోట కాకతీయుల శౌర్య పరాక్రమాలకు మారుపేరుగా ప్రసిద్ధి చెందింది. ఈ కోటను కాకతీయ వంశానికి చెందిన చక్రవర్తి గణపతి దేవుడు 1199లో (12వ శతాబ్దంలో) ప్రారంభిస్తే, ఆయన కుమార్తె రాణి రుద్రమదేవి పూర్తి చేశారు. ఈ కోటలో మధ్యయుగం నాటి రక్షణ వ్యవస్థ కోసం నిర్మించిన విశాలమైన మట్టికోట, దాని చుట్టూ కందకం, లోపలి వైపు రాతి గోడలు, అదేవిధంగా పటిష్టమైన, వ్యూహాత్మకమైన ప్రవేశ ద్వారాలు, శత్రువుల ప్రవేశానికి వీలులేని విధంగా నిర్మించిన కోటగోడలు, కోటలోపలి కీర్తి తోరణాలు, ఆలయ శిథిలాలు, శంభుని గుడి, ఏకశిల, సితాబ్ ఖాన్ ప్యాలెస్‌లు వంటివి విశేషమైనవి.
గిరి దుర్గాలు
హనుమకొండ: కాకతీయుల తొలి రాజధాని హనుమకొండ. ఈ ప్రదేశంలో కొండపై రాతితో నిర్మించిన అందమైన కోట పర్యాటకులను ఆకర్షిస్తుంది. రాష్ట్ర కూటుల కాలానికే హన్మకొండపైన రాతికోట ఉన్నట్లు చారిత్రక ఆధారాలు దొరికినా, తొలి కాకతీయ రాజులు ఆ కోటను విస్తృతం చేయలేదు. నేటి బస్టాండ్ వెనుక కొంతదూరంలో అప్పటి తోరణ ద్వారం నుంచి ప్రవేశించి, కొండమీదకు వెళ్లిన వారికి రెండంచెలుగా, అందంగా చెక్కిన రాళ్లతో కట్టిన కోట గోడలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.
భువనగిరి: కళ్యాణి చాళుక్య రాజైన త్రిభువన మల్లుడు నిర్మించిన ఈ కోట కాకతీయులు, కుతుబ్‌షాహీలు, మొగల్, అసఫ్‌జాహీల కాలంలో తన వంతు పాత్రను పోషించింది. ఇది ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్నది. రెండు అంచెల ఈ కోట లోపల, కొండ మీద కుతుబ్‌షాహీల బారాదరి, అప్పటి నీటిని తోడుకొనే విధానం ఆసక్తికరంగా ఉంటాయి. తెలంగాణ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ కొద్దిరోజులు ఈ కోటనుంచి తన కార్యకలాపాలను కొనసాగించాడు.
గోల్కొండ : గోల్కొండ కోట కాకతీయుల కాలంలో ప్రారంభమైనా, కుతుబ్‌షాహీల కాలంలో విస్తరించబడి, దృఢతరం చేయబడింది. ఇది హైదరాబాద్ నగర శివారులో ఉంది. నాలుగు దిక్కుల్లో నాలుగు ప్రవేశ ద్వారాలు, పైన రెండు వరుసల్లో కోట గోడలు, లోపలి రాజప్రాసాదం, ఇతర కట్టడాలు, కొండపైన భవంతులు మొగల్ సైన్యం కోటను ముట్టడించిన తీరు చరిత్ర నేటికీ కళ్లముందు కదలాడుతూనే ఉంటుంది.
వనదుర్గాలు
అడవుల్లో ఉండే కోటలను ‘వనదుర్గాలు’ అంటారు. పెద్దపల్లిజిల్లాలోని రామగిరి కోట వనదుర్గాలకు చక్కటి ఉదాహరణ. ఈ కోటను
‘రామనగర్ ఖిల్లా’ అని కూడా అంటారు.
చార్మినార్
హైదరాబాద్ అనగానే మొదట గుర్తొచ్చే ప్రాచీన చారిత్రక కట్టడాల్లో చార్మినార్ ఒకటి. చార్మినార్ అంటే నాలుగు మీనార్లు కలిగిన ఒక కట్టడం. ఇది హైదరాబాద్‌లోని పాత బస్తీలో ఉన్న ఒక స్మారక చిహ్నం. అంతే కాదు ఈ ప్రదేశం దేశంలోనే అత్యంత గుర్తింపు పొందిన నిర్మాణాలతో కూడిన జాబితాలో హైదరాబాద్ గ్లోబల్ ఐకాన్‌గా అవతరించింది. నాలుగు వందల సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ కట్టడం ఎత్తు 180 అడుగులు. ప్రసిద్ధి చెందిన బజార్లు, ముఖ్యంగా పలు వర్ణాల లక్కగాజులు అమ్మే లాడ్ బజార్ చార్మినార్‌కు అతి దగ్గరలోనే ఉన్నాయి. నగరంలో ముత్యాల వర్తకం కూడా ఇక్కడ నుంచే ప్రారంభమవుతుంది. ప్రపంచ ప్రసిద్ధి చెందిన కోహినూర్ వజ్రాలకు జన్మస్థానం ఇదే. ఇక్కడ అరవైవేల మంది కార్మికులు ముత్యాల తయారీలో నిమగ్నమయి ఉండగా తాను కళ్లారా చూసినట్లు 1645లో ఫ్రాన్స్ నగల వర్తకుడు టావెర్నియర్ రాశాడు. ఈ నగరం నుంచి దుష్టశక్తులను (ప్లేగు వ్యాధితో కొన్ని వేల మంది ప్రజలు మరణించిన తరువాత) తరిమివేయడానికి చిహ్నంగా సుల్తాన్ మహ్మద్ కులీ కుతుబ్ షా చార్మినార్‌ను నిర్మించాడు. గతించిన వైభవానికి ప్రతీకగా చార్మినార్ నేటికీ సజీవంగా నిలిచి ఉంది.
పైగా సమాధులు
మొగల్, రాజస్థానీ వాస్తు కళారీతుల సమ్మేళనం ఈ పైగా సమాధుల నిర్మాణంలో కనిపిస్తుంది. ఈ సమాధుల నిర్మాణం 1786 సంవత్సరం నుంచి ప్రారంభించారు. పాలరాయి, ఎర ఇసుకరాయికి బదులుగా సున్నం, నాపరాయి, ఇటుక, కలపలను వినియోగించారు. సమాధుల పిట్టగోడలపై కొమ్ముల వంటి చెక్కడాలు ఇక్కడ మాత్రమే కనిపిస్తాయి. నిజాం పరిపాలనలో పైగాలు అత్యున్నతస్థాయి కులీనులు.
గద్వాల్ కోట
గద్వాల్ కోట మహబూబ్‌నగర్ జిల్లాలో ఉంది. కోటలన్నిటిలో ప్రసిద్ధి చెందినది. ఇది గద్వాల్ పట్టణం నడిబొడ్డున ఉంది. ఈ కోటను రాజా పెద్దసోమభూపాలుడు 1662లో నిర్మించాడు. ఇతనికి నల్లసోమాద్రి అనే పేరు కూడా ఉంది. 17వ శతాబ్దంలో కృష్ణా నది ఒడ్డున ఉన్న గద్వాల్ పట్టణం చెన్నకేశవ స్వామి ఆలయాన్ని గద్వాల్ రాజులు నిర్మించారు. దేవాలయ గోడలపై ఉన్న శిల్పకళ, దేవాలయం ఎదుట ఉన్న 90 అడుగుల గాలిగోపురం వంటి నిర్మాణాలు ప్రసిద్ధి చెందాయి. కోటలోపల ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాల నడుస్తున్నాయి. గద్వాల్‌కు 20 కిలోమీటర్ల దూరంలోని కనుమర్తిలో గుట్టపైనున్న శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం కూడా సుపరిచితమైనదే. ఈ ఆలయాన్ని పేదవాడి తిరుపతిగా వర్ణిస్తారు. గద్వాల్ పట్టణం చేనేత నూలు, పట్టు చీరెలకు కూడా ప్రసిద్ధి. ఈ చీరల అంచుకు, పల్లుకు సుసంపన్నమైన సంప్రదాయక డిజైన్లు వేస్తారు. చీరలకు మామిడి రంగు వేస్తారు.
ఖమ్మం కోట
ఖమ్మం ఖిల్లా ఖమ్మం నగరం మధ్యలో స్తంభాద్రి అనే కొండపై ఉంది. కాకతీయుల పాలనకాలం శా.శ. 950లో ఖమ్మంమెట్టు నిర్మాణానికి పునాదులు పడ్డాయి. 400 ఏళ్లు ఈ కోట కాకతీయుల ఆధీనంలో ఉంది. ఆ తరువాత వచ్చిన ముసునూరి రాజులు, కుతుబ్‌షాహీ వంశస్థులు కూడా ఈ కోటను మెరుగుపరచడంలో ప్రశంసనీయమైన పాత్ర పోషించారు. మొదట దీని పేరు ‘ఖమ్మంమెట్టు’గా ఉంది. కుతుబ్‌షాహీ వంశస్థులు దీని పేరు ‘ఖమ్మం ఖిల్లా’గా వ్యవహారంలోకి తీసుకొచ్చారు. సుల్తాన్ కులీ కుతుబ్ ముల్క్ 1531లో అప్పటి ఖమ్మం పాలకుడైన సితాబ్ ఖాన్‌ను ఓడించి ఖమ్మం కోటను స్వాధీనం చేసుకున్నాడు. అప్పటి నుంచి ఈ దుర్గం కుతుబ్‌షాహీల పాలనలో ఉంది. 17వ శతాబ్దంలో తక్కిన తెలంగాణ వలె అసఫ్‌జాహీల పాలనలోకి వచ్చింది. అరవై అడుగుల పొడవు, ఇరవై అడుగుల వెడల్పు ఉన్న జాఫర్ బౌలీ అనే బావి కూడా ఉంది. కోటపై ముట్టడి జరిగినప్పుడు తప్పించుకోవడానికి ఒక రహస్య సొరంగం ఉంది. వర్షపు నీటిని నిల్వ చేయడానికి నీటి కాలువలు కూడా ఉన్నాయి. నాపరాయితో నిర్మించిన ఈ కోట పట్టణం నడిబొడ్డున ఒక గుట్టపై ందాగా కనిపిస్తుంది.
ప్రాక్టీస్ బిట్స్
1. ఉత్తర, దక్షిణ భారతదేశాలకు ముఖద్వారంగా ఉన్న సంస్కృతి ?
1) మహారాష్ట్ర 2) ఆంధ్రప్రదేశ్
3) తెలంగాణ 4) మధ్యప్రదేశ్
2. ఎవరు లేకుంటే పల్లెల్లో సంప్రదాయ పనులు జరుగవు?
1) చాకలి 2) మంగలి
3) కుమ్మరి 4) కమ్మరి
3. ఎవరి పనికి ప్రతిఫలంగా ‘మేర’ అనే వరి మోపు ఇచ్చేవారు?
1) చాకలి 2) మంగలి
3) కమ్మరి 4) కుమ్మరి
4. కపిలి అనే బానలను తయారు చేసేవారు?
1) కుమ్మరి 2) కమ్మరి
3) మేదర 4) సాలె
5. బంగారు, వెండి, కంచు లోహాలను తయారు చేయడంలో సిద్ధహస్తులు.
1) కుమ్మరి 2) కంసాలి
3) సాలెవారు 4) కమ్మరి
6. తెలంగాణలో కనిపించే ఒక సంచార జాతి?
1) దొమ్మర 2) వడ్డెర
3) కటిక 4) కురమ
జవాబులు
1.3 2.1 3.4 4.4 5.2 6.1
విజేత కాంపిటీషన్స్ సౌజన్యంతో..
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు