తెలంగాణ దళితోద్యమాలు
ఉద్దేశం: షెడ్యూల్డ్ కులాల వారి పట్ల జరుగుతున్న సామాజిక అణచివేత, ఆర్థిక దోపిడి, హక్కుల తిరస్కరణ వల్ల వ్యవస్థలోని లోపాలకు వ్యతిరేకంగా నడిపిన ఉద్యమాలే దళిత ఉద్యమాలుగా పేర్కొనవచ్చు. తెలంగాణ ప్రాంతంలో జరిగిన దళిత ఉద్యమాలు రెండు రకాలుగా వర్గీకరించవచ్చు.
1) నిజాం పాలనలో దళిత ఉద్యమాలు
2) స్వాతంత్య్రానంతర దళిత ఉద్యమాలు
మొదటి దశ ఉద్యమం (1950-80), రెండవ దశ ఉద్యమం (1980-90), మూడవ దశ ఉద్యమం (1990-నేటి వరకు)
నిజాం పాలనలో జరిగిన దళిత ఉద్యమాలు
– తెలంగాణలో నిజాం నిరంకుశ పాలనకు ఫ్యూడలిజం తోడవడం వల్ల నాటి సమాజంలో నిమ్న వర్గాల సామాజిక స్థితి అతి దీన, దయనీయమైన పరిస్థితిలో ఉండేది. ఆర్థిక స్థితి దళితులకు స్వేచ్ఛ, స్వాతంత్య్రం, రాజకీయ హక్కులు, సామాజిక స్థాయిని, ఆర్థిక స్థాయిని అన్ని రకాల సాధికారతలను కల్పించేందుకు చాలా మంది మేధావులు, సంఘ సంస్కర్తలు ఎనలేని కృషి చేశారు. దీని ప్రాముఖ్యత గురించి, కృషి చేసిన ప్రముఖుల గురించి తెలుసుకుందాం.
భాగ్యరెడ్డి వర్మ
– దళిత కులంలో పుట్టిన భాగ్యరెడ్డి వర్మ పసితనం నుంచే తీవ్రమైన వివక్ష, అవమానాలకు గురైయ్యాడు. చదువు ద్వారా సామాజిక చైతన్యం, తద్వారా అంటరానితనం నుండి బయటపడవచ్చని భాగ్యరెడ్డి వర్మ బలంగా నమ్మాడు. భాగ్యరెడ్డి వర్మ అసలు పేరు భాగయ్య. భాగయ్య పేరు సామాజిక హోదాను ఇచ్చే విధంగా తనపేరును భాగ్యరెడ్డిగా మార్చుకున్నాడు. అనంతరం ఆర్యసమాజం ‘వర్మ’ బిరుదు నివ్వడంతో అతనిపేరు భాగ్యరెడ్డి వర్మగా మారింది. దళిత అభ్యున్నతికి విశేషంగా కృషి చేశాడు.
ఆది హిందూ ఉద్యమం
భాగ్యరెడ్డి వర్మ చేసిన సామాజికాభివృద్ధి కార్యక్రమాలు
– ఈ ఉద్యమం దళితుల్లో సామాజిక రాజకీయ చైతన్యం నింపింది. భారతదేశంలో దళితులే మూలవాసులని వారికి ఆది హిందువులుగా పేరు పెట్టి దళిత సమాజం సమస్యల పరిష్కారానికి పోరాడాడు. తమిళనాడులోని ఆత్మగౌరవ ఉద్య మం ప్రేరణే ఈ ఆది హిందూ ఉద్యమం. భాగ్యరెడ్డి వర్మ ఆది హిందూ ఉద్యమానికి ఆద్యుడు, పితగా వ్యవహరింస్తారు.
జగన్ మిత్రమండలి
-1906లో జగన్ మిత్రమండలిని స్థాపించి హరికథలు, బురకథలు ఇతర జానపద మాధ్యమాల ద్వారా దళితుల్లో సామాజిక చైతన్యానికి కృషి చేశారు. ఈ సంస్థ ద్వారా సభలు, సమావేశాలు నిర్వహించడం విద్యావ్యాప్తికి పుస్తకాల ముద్రణ, పంపకం ద్వారా దళితుల్లో ఆత్మవిశ్వాసం, చైతన్యం పెంపొందించారు.
పాఠశాలలు
– విద్య ద్వారానే చైతన్యం వస్తుందని బలంగా నమ్మిన వ్యక్తి భాగ్యరెడ్డి వర్మ. దీని ఫలితమే 1910లో ఇస్లామియా బజార్, లింగంపల్లిలో పాఠశాలల ఏర్పాటు. మరో 25 పాఠశాలలు స్థాపించి 2500 మంది దళిత విద్యార్థులకు ఉచిత విద్యను అందించారు.
మాన్య సంఘం
– 1911లో జగన్ మిత్ర మండలిని మాన్యసంఘంగా మార్చారు. ఈ సంస్థ లక్ష్యాలు మద్య నిషేధం.
-ఉత్సవాల్లో జంతువధను నిర్మూలించడం (జీవ దయ- ప్రచార సభ ద్వారా).
– జోగిని, బసివిని, వెట్టిచాకిరీకి వ్యతిరేకంగా పోరాటం.
-బాల్య వివాహాలను అరికట్టడం.
– సహపంక్తి భోజనాలను ప్రోత్సహించడం.
-వైదిక వ్యవస్థను నిరసించడం, బౌద్ధ ధర్మాన్ని ప్రచారం చేయడం.
-సామాజిక రుగ్మతలు రూపుమాపడం వంటివి అనేకం ఉన్నాయి
అహింసా సమాజం (1912)
– ఈ సంస్థను ప్రజల్లో మానవతా విలువలు, నైతిక విలువలు పెంపొందించడం లక్ష్యంగా స్థాపించారు. సత్యం అహింసా సిద్ధాంతం పట్ల చైతన్యం కలిగించడం మరో ముఖ్య ఉద్దేశం. ఈ సంస్థ మరుసటి సంవత్సరమే దక్కన్ మానవతా సంఘంగా మార్పు చెంది తన కార్యకలపాలు విస్తృతం చేసింది.
విశ్వగృహ పరిచారక సమ్మేళనం (1916)
– విశ్వగృహ పరిచాకుల అభివృద్ధి కోసం వారి సామాజిక, ఆర్థిక స్థాయి పెంపొందించటానికి కృషి చేశారు.
స్వస్తిక్ దళం (1923)
-సమాజంలో మానవతా విలువలు పెంపొందించడం, పేదలు, అనాథలు, ఆస్వస్థుల కోసం సేవ చేయడం లక్ష్యంగా ఈ స్వస్తిక్ దళంను 1923లో భాగ్యరెడ్డి వర్మ స్థాపించారు. వామన్ నాయక్ ఘన్ శ్యాం వంటి ప్రముఖులు ఇందులో సభ్యులుగా చేరారు.
-ఆది హిందూ సోషల్ సర్వీస్ లీగ్ (1911) ద్వారా ఆది హిందువుల చైతన్యం, అభివృద్ధి కోసం అనేక స్వచ్ఛంద కార్యక్రమాలు చేపట్టారు.
ఆది హిందూ చేతి వృత్తుల ప్రదర్శన (1925)
– ఆది హిందువుల్లో చేతి వృత్తుల నైపుణ్యాన్ని ప్రపంచానికి చాటేందుకు ఈ ప్రదర్శన నిర్వహించారు.
సంఘ సంస్కరణ నాటక మండలి
-1915 వరకు ఆర్యసమాజంలో ఉన్న భాగ్యరెడ్డి వర్మ ఆ తర్వాత బ్రహ్మసమాజంలో చేరారు. వివిధ సాహిత్య ప్రక్రియల ద్వారా సంఘ సంస్కరణకు కృషి చేశారు. ఇందులో సత్య హరిశ్చంద్ర నాటకం ప్రధానమైంది.
ఆరోగ్య సేవా దళం (1925)
-హైదరాబాద్‌లో ప్లేగు వ్యాధి తీవ్రంగా వ్యాప్తి చెందినప్పుడు వ్యాధిగ్రస్తులకు సేవలు అందించడానికి ఈ సేవా దళం ఏర్పాటు చేశారు.
రాజకీయ ప్రాతినిథ్యం
– అలహాబాద్‌లో 1930 నవంబర్ 16న జరిగిన అఖిల భారత హిందూ మహాసభలో ఆది హిందువులకు రాష్ట్రస్థాయిలో కేంద్ర స్థాయిలో శాసన సభల్లో తగిన రాజకీయ ప్రాతినిధ్యం ఉండాలని తీర్మానించారు.
జనగణనలో ఆది హిందువులు
-1931లో నిజాం రాష్ట్ర ఆది హిందూ రాజకీయ సదస్సు బొల్లారంలో భాగ్యరెడ్డి వర్మ అధ్యక్షతన జరిగింది. జనాభా లెక్కల్లో దళితుల జనగణన కూడా ఉండాలని డిమాండ్ చేయగా ప్రభుత్వం 1931 జనగణనలో దళితులను ఆది హిందువులుగా నమోదు చేయడం జరిగింది.
అంటరానితనం నిర్మూలన హరిజనాభివృద్ధి తీర్మానాలు
– 1930లో తొలి ఆంధ్రమహాసభలో భాగ్యరెడ్డి వర్మ అంటరానితనం నిర్మూలన, హరిజన విద్యాభివృద్ధికి సంబంధించి తీర్మానాలు ప్రతిపాదించారు. 1931లో భాగ్యరెడ్డి వర్మ హైదరాబాద్‌లో హరిజన సేవక్‌సంఘ్ స్థాపించారు.
న్యాయ పంచాయతీలు
-దళితుల సమస్యలు పరిష్కరించటానికి వర్మ హైదరాబాద్‌లో న్యాయ పంచాయతీలు ఏర్పాటు చేశారు. ఇవి న్యాయస్థానాలుగా వ్యవహరించేవి. వీటికి భాగ్యరెడ్డి వర్మ ప్రధాన న్యాయమూర్తిగా ఉండేవారు.
పత్రికలు
– హైదరాబాద్ పేరుతో వర్మ తెలుగు వార పత్రికను నడిపారు. 1936లో భాగ్యనగర్ అనే మాస పత్రిక స్థాపించి విజ్ఞానం అందించారు. 1937లో ఇది ఆదిహిందూ మాసపత్రికగా మారింది. ఆది హిందూ లైబ్రరీ కూడా స్థాపించారు.
ఆది హిందూ యూత్ జిమ్నాస్టిక్ పోటీలు
-1925 ప్రేమ్ థియేటర్ మైదానంలో ఆది హిందూ యూత్ జిమ్నాస్టిక్ పోటీలు నిర్వహించారు.
సదస్సులు.. సమావేశాలు
-1927లో అలహాబాద్‌లో జరిగిన అఖిల భారత దిగువ కులాల సదస్సులో దక్షిణ భారతదేశ ప్రతినిధిగా పాల్గొన్నారు
– 1930లో లక్నోలో జరిగిన ఆది హిందూ జాతీయ సమావేశాలకు అధ్యక్షుడిగా వ్యవహరించారు.
వెట్టిమాదిగ (1932)
-భాగ్యరెడ్డి వర్మ తెలుగులో రాసిన వెట్టి మాదిగ (1932) కథను తెలుగు సాహిత్యంలో దళితుడు రాసిన తొలి దళిత కథగా పేర్కొనవచ్చు.
-అణగారిన వర్గాల కోసం అహర్నిశలు కృషి చేసి తన జీవితం మొత్తం దళిత అభ్యున్నతికి పాటు పడిన భాగ్యరెడ్డి వర్మ 18-02-1939 లో క్షయవ్యాధితో తుదిశ్వాస విడిచారు.
అరిగె రామస్వామి
– 1922లో ఆది హిందూ జాతి ఉన్నతి సభను స్థాపించారు. సునీత బాల సమాజం స్థాపించి స్త్రీ విద్యను ప్రోత్సహించారు. 1927, 1929ల్లో ఆది హిందూ మహాసభలకు ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1 జూన్ 1931న అరుంధతీయ మహా సభను రామస్వామి ప్రారంభించారు. 23 జూన్ 1944లో indep endent scheduled caste Fede ration కు అరిగె రామస్వామి అధ్యక్షులుగా ఎన్నికయ్యారు.
-దళితుల్లో చైతన్యానికి కృషి చేసిన రామస్వామి రాజకీయాల్లో కూడా రాణించారు. 1957 నుంచి 1972 వరకు 15 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కాసు బ్రహ్మానంద రెడ్డి ప్రభుత్వంలో మూడేళ్లు మంత్రిగా కొనసాగారు.
– దళితోన్నతికి అవిరళంగా పనిచేసి ఏ పదవిలో ఉన్నా నిజాయితీపరుడుగా, సమర్థుడుగా పేరు తెచ్చుకున్న దళిత జాతి రత్నం అరిగె రామస్వామి. 1973లో తనువు చాలించారు.
బి.ఎస్. వెంకట్రావ్
– వీరు హైదరాబాద్ అంబేద్కర్గా, రావు సాహెబ్‌గా సుపరిచితులు. ఆది ద్రావిడ సంఘాన్ని, డిప్రెస్డ్ క్లాస్ అసోసియేషన్‌ను ఏర్పాటు చేశారు. లాయక్ అలీ మంత్రి వర్గంలో విద్యాశాఖ మాత్యులుగా కొనసాగారు. 1936 మే 30న బొంబాయిలో జరిగిన ప్రథమ మహర్ సదస్సుకు అధ్యక్షత వహించే అరుదైన గౌరవం దక్కింది. సామాజిక న్యాయశిల్పి బి.ఎస్. వెంకట్రావ్ 1953 నవంబర్ 4న కన్ను మూశారు.
ఇతర ప్రముఖులు
-తెలంగాణలో దళితోద్యమానికి పునాదులు వేసిన దళిత త్రయం (భాగ్యరెడ్డి వర్మ, అరిగె రామస్వామి, బి.ఎస్. వెంకట్రావ్)తో పాటు మరికొంత మంది దళిత చైతన్యానికి కృషిచేశారు. బి.ఎస్. వెంకట్రావ్, శ్యామ్ సుందర్, సుబ్బయ్య వంటి నాయకుల కృషి ఫలితంగా అణగారిన వర్గాల సంస్థను ఏర్పాటు చేశారు,
-హరిశ్చంద్ర హేడ, అతని భార్య జ్ఞాన కుమారి హేడ దళితులకు విద్యను అందించడం ద్వారా సామాజిక సంస్కరణలు తీసుకువచ్చారు.
– 1944 సెప్టెంబర్ 24న సికింద్రాబాద్‌లో జరిగిన షెడ్యూల్డ్ కులాల సమాఖ్య సమావేశంలో బి.ఆర్. అంబేద్కర్ పాల్గొన్నారు. దళితులు రాజకీయాల్లో క్రియాశీలకంగా పాల్గొనడం అలవర్చుకోవాలని తద్వారా దళిత హక్కులు పరిరక్షించబడతాయని బి.ఆర్. అంబేద్కర్ ఈ సమావేశంలో ప్రసంగించారు.
పాక్టీస్ బిట్స్
1. 1925లో భాగ్యరెడ్డి వర్మ ఆది హిందూ యూత్ జమ్నాస్టిక్ పోటీలను ఎక్కడ నిర్వహించారు?(బి)
ఎ) విజయ థియేటర్
బి) ప్రేమ్ థియేటర్
సి) బసంత్ థియేటర్
డి) శాలిమర్ థియేటర్
2. కింది వాటిలో సరైన దానిని గుర్తించండి?(సి)
1) 1925లో హైదరాబాద్‌లో ప్లేగ్ వ్యాధి సంభవించినపుడుభాగ్యరెడ్డి వర్మ ఆరోగ్య సేవదళం అనే సంస్థను స్థాపించారు.
2) ప్రజల్లో అహింస సిద్ధాంతాల ప్రచారం కోసం భాగ్యరెడ్డి వర్మ అహింసా సమాజాన్ని ప్రాంరభించారు.
ఎ) 1 మాత్రమే సరైంది
బి) 2 మాత్రమే సరైంది
3) 1,2 సరైనవి
4) ఏవీకాదు
3. ‘వెట్టి మాదిగ’ పుస్తక రచయిత ఎవరు?(ఎ)
ఎ) భాగ్యరెడ్డి వర్మ
బి) అరిగె రామస్వామి
సి) బి.ఎస్. వెంకట్రావ్
డి) డా.బి.ఆర్. అంబేద్కర్
4. 1906లో జగన్ మిత్రమండలిని ఎవరు ప్రారంభించారు? (సి)
ఎ) అరిగె రామస్వామి
బి) బి.ఎస్. వెంకట్రావ్
సి) భాగ్యరెడ్డి వర్మ
డి) డా.బి.ఆర్. అంబేద్కర్
5. డా.బి.ఆర్ అంబేద్కర్ దళితుల మహాసభలో ప్రసంగించడానికి ఏ సంవత్సరంలో హైదరాబాద్‌ని సందర్శించాడు. (బి)
ఎ) 29 అక్టోబర్ 1944
బి) 29 సెప్టెంబర్ 1944
సి) 27 సెప్టెంబర్ 1944
డి) 27 సెప్టెంబర్ 1945
6. 1936లో భాగ్యనగర్ అనే పత్రికను స్థాపించింది ఎవరు? (బి)
ఎ) బాలాజీ కృష్ణారావు
బి) భాగ్యరెడ్డివర్మ
సి) అరిగే రామస్వామి
డి) బి.ఎస్. వెంకట్రావ్
ఎం. ప్రవీణ్ కుమార్
విషయ నిపుణులు
21st సెంచరీ అకాడమీ
హైదరాబాద్
9704686009
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు