బ్రహ్మనీలు…గోల్కొండ కుతుబ్‌షాహీలు
బహ్మనీ రాజ్యంలో మూడో మహ్మద్‌షా 1482లో మరణంతో బహ్మనీ రాజ్య విచ్ఛిన్నత ప్రారంభమైంది. అతని తర్వాత రాజైన మహమ్మద్‌షా కాలంలో ఓరుగల్లు పాలకుడైన ఆదిల్‌ఖాన్ మరణించడంతో రాజమహేంద్రవరం పాలకుడైన కివాన్ ఉల్‌ముల్క్ ఓరుగల్లును ఆక్రమించాడు. బహ్మనీ సుల్తాన్ మహమ్మద్‌షా అతన్ని ఓడించి తరిమివేశాడు. చివరకు కలీంఉల్లా 1527లో మరణించడంతో బహ్మనీ రాజ్యం ఐదు స్వతంత్ర రాజ్యాలుగా అవతరించింది. అవి…
1. బీజాపూర్ : ఆదిల్షాహీలు- యూసఫ్ ఆదిల్షా స్థాపకుడు.
2. అహ్మద్‌నగర్ : నిజాం షాహీ -1490లో మాలిక్ అహ్మద్ స్థాపకుడు
3. బీరార్ : ఇమాద్షాహీ – 1490లో ఫాతుల్లాఖాన్ ఇమాద్-ఉల్-ముల్క్ స్థాపించాడు.
4. గోల్కొండ : కుతుబ్‌షాహీ- 1518లో సుల్తాన్ కులీ స్థాపించాడు.
5. బీదర్ : బరీద్షాహీ – 1530లో అలీబరీద్ స్థాపించాడు.
మహ్మద్‌బిన్ తుగ్లక్ కాలంలో దక్షిణ భారతదేశంలో అనేక స్వతంత్ర రాజ్యాలు ఏర్పడ్డాయి. అందులో భాగంగానే ‘కర్ణాటకలోని గుల్బర్గా’ను కేంద్రంగా చేసుకొని సుల్తాన్ అల్లావుద్దిన్ ‘హసన్ గంగూ’ బహ్మనీ రాజ్యాన్ని 1347లో స్థాపించాడు. ఇతనికి ‘సికిందర్ ఇసాని’ అనే బిరుదు ఉంది. ఇతడు 1347-58 వరకు పరిపాలించాడు.
# ఇతని స్వతంత్ర రాజ్యస్థాపనకు ‘కాపయనాయకుడు’ సహాయం చేశాడు. చివరకు చేసిన సహాయం విస్మరించి 1350లో తెలంగాణపై దండయాత్ర చేసి ‘కీలాస్’ (నిజామాబాద్) దుర్గాన్ని ఆక్రమించి అటునుంచి పానగల్లు, వాడపల్లిలను కూడా తన రాజ్యంలో విలీనం చేసుకున్నాడు. అంతేకాకుండా తుంగభద్రా నదీపరీవాహక ప్రాంత (విజయనగరం) రాజ్యాలపై దాడులు చేసి కొంకణ్ రాజ్యాన్ని ఆక్రమించాడు. 1356లో తిరిగి తెలంగాణపై దాడిచేసి భువనగిరి కోటను ముట్టడించాడు.
భువనగిరి: నల్లగొండ జిల్లాలోని గిరిదుర్గం. చాళుక్య వంశానికి చెందిన ‘త్రిభువనమల్ల విక్రమాదిత్య’ నిర్మించాడు. ఇతని పేరుమీదుగానే భువనగిరి అనే పేరు వచ్చింది. ఈ కోటలో పచ్చలకట్ల సోమేశ్వరుడు, బమ్మెదేవర ఆలయాలు, ఒక మఠం ఉన్నాయి. ఈ కోట హైదరాబాద్‌కు 47 కి.మీ దూరంలో ఉంది. నల్లగొండ జిల్లా కేంద్రానికి 71 కి.మీ దూరంలో ఉంది. ఈ కోట మొదటి ద్వారాన్ని ఉక్కు ద్వారం అంటారు.
# హసన్‌గంగూ కాలంలో గుల్బర్గా, దౌల్తాబాద్, బీదర్, బీరార్ నాలుగు రాష్ట్రాలుగా విభజన చేశారు. పశ్చిమాన గోవా (రేవతీ ద్వీపం), తూర్పున భువనగిరి సరిహద్దుగా ఉండేవి.
8 ఇతని తర్వాత మహ్మద్‌షా కూడా తెలంగాణపై దాడిచేసి గోల్కొండ దుర్గంతో పాటు పరిసర ప్రాంతాలను ఆక్రమించాడు.
గోల్కొండ కోట: ఇది హైదరాబాద్‌కు 11 కి.మీ. దూరం లో ఉంది. కాకతీయుల కాలంలో నిర్మించబడి, కుతబ్షాహీల కాలంలో ‘రాజధాని’గా వెలుగొందింది. మొద ట మహ్మద్‌బిన్ తుగ్లక్ ఈ కోటను వశం చేసుకున్నాడు. తర్వాత 1363లో ఢిల్ల్లీ సుల్తానుల నుంచి బహ్మనీ రాజుల వశం అయింది. కుతుబ్‌షాహీలు స్వతంత్ర రాజ్యస్థాపన అయ్యేవరకు (1518) ఈ కోట బహ్మనీల ఆధీనంలో ఉంది.
#గోల్కొండ కోటకు మంగళారం, మహ్మద్‌నగర్ అని పేర్లు ఉన్నాయి. తొలిసారిగా ఈ కోటపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు 2014, ఆగస్టు 15న జాతీయ పతాకం ఎగురవేసి పూర్వవైభవం తెచ్చారు.
బహ్మనీ, రేచెర్ల వంశం వారి స్నేహ సంబంధాలు
# విజయనగర రాజ్యంలో (1336లో విజయనగర సా మ్రాజ్యం హరిహరరాయలు-Iచే స్థాపించబడింది. ఇతడు తన గురువు విద్యారణ్యస్వామి పేరు మీదుగా విజయనగరం తుంగభద్రానది తీరంలో స్థాపించాడు. ప్రస్తుతం వీరి పాలనాకాలం నాటి ఆనవాళ్లు హంపి (బళ్లారి)లో చూడవచ్చు. రెండో హరిహర రాయలు రేచెర్ల వెల్మ వంశంపై దాడి చేశాడు. ప్రతిగా బహ్మనీలు, వెల్మరాజులకు అండగా నిలిచి వారి దాడులను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. బుక్కరాయలు మరోసారి ఓరుగల్లు, మెదక్, పానుగల్లులను ముట్టడించినప్పుడు కూ డా బహ్మనీలు, పద్మనాయకులు అండగా నిల్చి రేచెర్ల రాజులకు తమ స్నేహహస్తం అందించారు. చివరకు రేచెర్ల రాజులు తమ స్నేహహస్తాన్ని విజయనగర రాజులవైపు అందించారు. (బహ్మనీ, విజయనగర రాజ్యాలకు రాయ్‌చూర్ దోబ్ ‘అంతర్వేది’ ప్రాంతం కోసం యుద్ధాలు ప్రారంభం కావడంతో విజయనగర రాజులు, రేచెర్ల రాజులు పరస్పరం స్నేహితులుగా మారారు.)
దీంతో బహ్మనీ రాజైన ఫిరోజ్ షా (1397-1422) నాయకత్వంలో పానుగల్లుపై దాడి చేశారు. ఈ దాడులను విజయనగర, వెల్మరాజులు సంయుక్తంగా ఎదుర్కొన్నారు. ఈ విజయానంతరం విజయనగర, పద్మనాయక రాజ్యాలు మరింత సన్నిహితంగా మారాయి. చివరకు రేచెర్ల రాజ్యం ఇరు రాజ్యాల వైరంతో బలైంది. అహ్మద్‌షా (1422-1436) బహ్మనీ రాజు కాలంలో తెలంగాణపై దాడిచేసి అనేక దుర్గాలను ఆక్రమించాడు. వాటిలో కొన్ని ఓరుగల్లు, రాయగిరి, భువనగిరి మొదలైనవి. దీంతో ఎక్కువ భాగం (తెలంగాణ) బహ్మనీరాజ్యంలోకి వెళ్లింది. అహ్మద్‌షా తన రాజధానిని గుల్బర్గా నుంచి బీదర్‌కు మార్చాడు. చివరకు బహ్మనీ యువరాజు రాచకొండలో రాజప్రతినిధిగా నియమించబడటంతో తొలిసారిగా తెలంగాణలో బహ్మనీరాజ్య స్థాపనకు పునాదులు ఏర్పడ్డాయి. పద్మనాయకులు లేదా రేచెర్ల వెల్మరాజులు బహ్మనీ సైన్యాలను వెళ్లగొట్టేందుకు కళింగ గజపతుల కుమారుడైన ‘హాంవీరుని’ సహాయంతో 1461లో బహ్మనీలతో యుద్ధాలు చేసి భువనగిరి, ఓరుగల్లు, రాచకొండ మొదలైన దుర్గాలను విముక్తి చేశారు. తర్వాత బహ్మనీ రాజులు అనేకసార్లు తెలంగాణపై దాడులకు సిద్ధమైనప్పట్టికీ పద్మనాయకులు-గజపతులు సంయుక్త ప్రతిఘటనతో వెనుకంజ వేశారు. చివరకు గజపతుల రాజ్యంలో అంతర్గత కలహాలు బహ్మనీరాజులకు బలం చేకూర్చి తెలంగాణను స్వాధీనం చేసుకోవడానికి మా ర్గం సుగమమైంది. 1475 నాటికి తెలంగాణ పూర్తిగా బహ్మనీల వశమైంది. పద్మనాయక రాజ్యం అంతరించింది. అనంతరం తెలుగు రాజ్యాన్నంతా జయించిన బహ్మనీ రాజులు ఈ ప్రాంతాలను రెండు భాగాలుగా చేసి తెలంగాణకు ఓరుగల్లు, రెండో దానికి రాజమహేంద్రవరం (రాజమండ్రి) (గతంలో రాజమండ్రి తూర్పు చాళుక్యుల రాజధాని. ఈ పట్టణాన్ని గోదావరి తీరాన ‘అమ్మరాజు’ నిర్మించాడు.)
గోల్కొండ-కుతుబ్‌షాహీలు (1518-1687)
#‘సుల్తాన్‌కులీ’ గోల్కొండ రాజ్యాన్ని స్థాపించాడు. వీరు పర్షియాలోని ‘హందం’ వంశానికి చెందినవారు. ఈ వంశంలో ‘కరాకునేలు’ అనే తరుష్క తెగకు చెందినవారు. ‘కరాకునేలు’ అంటే పర్షియా భాషలో ‘నల్లగొరె’ అని అర్థం. వీరు ఆకునేలు (తెల్లగొరె) అనే వంశం చేతిలో ఓడిపోయి పర్షియాను వదిలి భారతదేశం వైపు వచ్చారు. ‘సుల్తాన్ కులీ’ తన పినతండ్రితో బహ్మనీ (బీజాపూర్) పాలనాకాలంలో ‘మూడవ మహ్మద్‌షా’ వద్ద సేనానిగా ఉద్యోగంలో చేరాడు.
#దారి దోపిడీ దొంగలవల్ల, సామంతుల అవిధేయత వల్ల తెలంగాణ ప్రాంతంలో ప్రబలిన అరాచకాన్ని అణచి శాంతిని నెలకొల్పాడు. 1487 సం.లో జరిగిన దక్కనీ, ‘అఫాకీ’ ముస్లింల ఘర్షణల్లో మహ్మ ద్ షా-IIIను రక్షించాడు. గోవా పాలకుడైన బహదూర్ జిలానీ (1493) తిరుగుబాటును అణిచే పనిలో ఉన్న అప్పటి తెలంగాణ పాలకుడైన ‘కుతుబ్ ఉల్ ముల్క్ డకానీ’ మరణించడంతో ఆ స్థానంలో ‘కులీ’ను మహ్మద్ షా-III నియమించాడు. సుల్తాన్ కులీ సేవలకు మెచ్చి మహ్మద్‌షా ‘కుతుబ్ ఉల్ ముల్క్’ బిరుదునిచ్చి గోల్కొండ జాగీర్దార్గా 1496 సం.లో నియమించాడు. 1518లో స్వతంత్రించి ‘సుల్తాన్ కులీ గోల్కొండకు ‘మహ్మద్‌నగర్’ పేరు పెట్టి తన రాజధానిగా చేసుకొని పాలించాడు. మొదట గోల్కొండను ‘మంగళారం’ అని పిలిచేవారు.
# గోల్కొండ కోట కాకతీయుల కాలంలో నిర్మించబడింది. మెదక్ జిల్లా ‘కోహిర్’ నుంచి ఓరుగల్లు వరకు మాత్రమే ఇతని పాలనలో ఉండేది. అప్పుడు ఓరుగల్లు నుంచి తూర్పు తీరం వరకు గజపతుల సామంతుడైన ‘చితాబ్‌ఖాన్’(సీతాపతి రాజు) పరిపాలించా డు. సుల్తాన్ కులీ సేనాధిపతి ‘ ఎనుములపల్లి పెద్దనామాత్యుడు’ చరిగొండ ధర్మన్న ‘చిత్ర భారతం’ రచనలో షితాబ్ ఖాన్ ప్రశంస ఉంది. సుల్తాన్ కులీ ఓరుగల్లుపై దాడి చేసి అతన్ని సంహరించాడు. చివరకు 1543లో కుమారుల చేతిలో హత్య చేయబడ్డాడు. ఇతని తర్వాత కుమారుడు ‘జంషీద్’ రాజ్యానికి వచ్చాడు.
గమనిక: కుతుబ్‌షాహీ సామ్రాజ్యం ప్రారంభమైన సంవత్సరం 1518. కానీ కొన్ని పుస్తకాల్లో 1512గా ప్రచురిత మైంది. సివిల్ సర్వీసెస్ పుస్తకాల్లో, నెట్లో 1518గానే ఉన్నది. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించగలరు.
జంషీద్ (1543-1550)
సుల్తాన్ కులీ 3వ కుమారుడు జంషీద్. సుల్తాన్ కులీకి మొత్తం ఆరుగురు కుమారులు. వారు వరుసగా..
1. హైదర్: ఇతడు అప్పటికే మరణించాడు.
2. కుతుబుద్దీన్: రెండో కుమారుడైన కుతుబుద్దీన్ యువరాజయ్యాడు. కానీ రాజకీయాలపై శ్రద్ధ చూపలేదు.
3. జంషీద్ 4. అబ్దుల్ కరీం 5. దౌలత్
6. ఇబ్రహీం కుత్బ్ షా
# సుల్తాన్ కులీ మరణం తర్వాత నాలుగో కుమారుడు అబ్దుల్ కరీం తిరుగుబాటు చేసి ‘బీజాపూర్ ఆదిల్ షా’తో సంప్రదింపులు చేసి గోల్కొండ ముట్టడికి ప్రయత్నించాడు. ఆ ప్రయత్నంలో అతను మరణించాడు. ఇక మూడో వాడైన జంషీద్, ఐదో వాడైన దౌలత్‌లు రాజ్య వారసత్వం కోసం కలహించుకుంటుండగా..
# జంషీద్‌ను గోల్కొండలో, దౌలత్‌ను భువనగిరిలోను వారి తండ్రి సుల్తాన్ కులీ బంధించాడు.
# అయితే జంషీద్ జైలు నుంచి తప్పించుకొని తండ్రిని చంపి, అన్న కుతుబుద్దీన్ కళ్లు తీయించి (అంధునిగా మార్చి), జైలులో పెట్టి సింహాసనం ఆక్రమించాడు. ఇతడు రాజ్యాన్ని విస్తరించడం కోసం ఎలాంటి యుద్ధాలు చేయలేదు. (అయితే చరిత్రకారుల దృష్టిలో ఇతను క్రూరుడు. తండ్రిని చంపి, సోదరులను బంధించి రాజ్యానికి వచ్చాడని పేర్కొన్నారు. రాజ్యం కోసం, సింహాసనం ఆక్రమించుకోవడానికి ఎలాంటి ‘కుటిలనీతి’ కైనా వెనుకాడకూడదని ‘కౌటిల్యుడు’ తన అర్థశాస్త్రంలో పేర్కొన్నాడు. హర్యాంక వంశంలోని రాజులు, మౌర్యుల్లో అశోకుడు, మొగలు రాజుల్లో ఔరంగజేబు ఇలాగే సింహాసనం ఆక్రమించుకొన్నారు). వారసత్వ యుద్ధాలతోనే జంషీద్ కాలం సరిపోయింది. తన అన్న జంషీద్ ప్రవర్తన తెలిసి ‘ఇబ్రహీం కుతుబ్ షా’ విజయనగరం పారిపోయాడు. చివరకు జంషీద్ క్యాన్సర్ వ్యాధితో మరణించాడు.
డా౹౹ మురళి
అసిస్టెంట్ ప్రొఫెసర్
నిజాం కళాశాల, హైదరాబాద్.
9701674383
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు