సమృద్ధ జీవనానికి ఆర్థికవృద్ధి-అభివృద్ధి
ప్రపంచంలోని దేశాలనా జాతీయోత్పత్తిని పెంచుకోవడం కోసం తలసరి ఆదాయాన్ని, ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంచడానికి నిరంతరం కృషి చేస్తున్నాయి. అయితే ఆయా దేశాల్లో ఉండే భిన్నమైన పరిస్థితులు, కారణాల దృష్ట్యా అన్ని దేశాలు ఒకే రకమైన అభివృద్ధిని సాధించలేవు. అవి సాధించిన అభివృద్ధి స్థాయిని బట్టి అభివృద్ధి చెందిన దేశాలని, అభివృద్ధి చెందుతున్న దేశాలని వర్గీకరించారు.
-ఆర్థికవృద్ధి (Economic Growth), ఆర్థికాభివృద్ధి (Economic Development) అనే పదాలను వాడుక భాషలో పర్యాయ పదాలుగా వాడుతున్నప్పటికి ఈ రెండు పదాలకు సిద్ధాంతరీత్యా వేర్వేరు అర్థాలున్నాయి. షుంపీటర్, శ్రీమతి జె.ఆర్.హిక్స్ మొదలైన ఆర్థికవేత్తలు వీటి మధ్య తేడాను చూపారు. ఆర్థికవృద్ధి అనేది ఉత్పత్తిలో గమనించదగిన పెరుగుదలను మాత్రమే సూచిస్తున్నది. ఆర్థికాభివృద్ధి అనేది ఉత్పత్తిలో పెరుగుదలనే కాకుండా ఆ పెరుగుదలను సాధించడానికి అవసరమైన సాంకేతిక, వ్యవస్థాపూర్వక మార్పులను కూడా సూచిస్తున్నది.
-అభివృద్ధి చెందుతున్న దేశాల్లో అభివృద్ధికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం, సాంఘిక వ్యవస్థలు లేకపోవడంతో ఆర్థికాభివృద్ధిలో పై మార్పులు అంతర్భాగమై ఉంటాయి. ఈ దృష్ట్యా ఆర్థికాభివృద్ధి కేవలం ఉత్పత్తిలోని పెరుగుదలనే కాకుండా మార్పులను కూడా పరిగణలోకి తీసుకుంటుంది. ఆర్థిక వ్యవస్థ సర్వతోముఖాభివృద్ధి చెందిన తర్వాత మార్పులకు ప్రాధాన్యత తగ్గి కేవలం ఆర్థికవృద్ధి మాత్రమే ప్రధానమవుతుంది.
-ఆర్థికవృద్ధి, ఆర్థికాభివృద్ధి మధ్యగల తేడాలను అర్థం చేసుకోవడానికి ఒక వ్యక్తి పెరుగుదలను ఉదాహరణగా తీసుకోవచ్చు. వ్యక్తి శారీరక పరిమాణంలో వచ్చే మార్పులను ఆర్థికవృద్ధితోను, వ్యక్తిత్వం, మేథస్సులో వచ్చే మార్పులను ఆర్థ్ధికాభివృద్ధితోను పోల్చవచ్చు.
-ఆర్థికాభివృద్ధి తొలిదశలో ఆర్థికవృద్ధి, ఆర్థికాభివృద్ధి రెండూ జరుగుతుంటాయి. ఎందుకంటే ఉత్పత్తి పెరుగుతున్నప్పుడు మార్పులు తప్పనిసరి. ఈ దశలో ఆర్థికాభివృద్ధిలోనే ఆర్థికవృద్ధి ఇమిడి ఉంటుంది. కానీ ఆర్థికాభివృద్ధి ఒకస్థాయికి చేరుకున్న తర్వాత మార్పులకు ప్రాధాన్యత తగ్గి ఉత్పత్తిలో పెరుగుదలకు ప్రాముఖ్యత పెరుగుతున్నది. అంటే ఆర్థిక పరిపక్వ దశలో ఆర్థికవృద్ధి ప్రధానమవుతున్నది. అందువల్ల ఆర్థికవృద్ధి పరిమాణాత్మకమైందే గాక సంకుచితమైన భావన, ఆర్థికాభివృద్ధి గుణాత్మకమైందే గాక విస్తృతమైన భావన. ఆర్థికవృద్ధి, అభివృద్ధి చెందిన దేశాల భావన కాగా ఆర్థికాభివృద్ధి, అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన భావనగా భావించొచ్చు.
-వృద్ధిలేకుండా అభివృద్ధిని కొనసాగించడం కష్టం. కానీ వృద్ధి సాధించినప్పటికి పేదరికం, నిరుద్యోగిత, అసమానతలు మొదలైన వాటిల్లో తగ్గుదల లేనట్టయితే అది అభివృద్ధి అనిపించుకోదు. షుంపీటర్ ప్రకారం పూర్వం నిశ్చలంగా ఉన్న ఆర్థిక వ్యవస్థలోని సమతుల్యానికి అంతరాయం కలిగించే, నిరంతరాయంగా ఉండని మార్పు. కిండల్బర్గ్ అభిప్రాయంలో వృద్ధి అంటే ఆర్థిక వ్యవస్థ ఎత్తు, బరువులపై దృష్టి సారిస్తే అభివృద్ధి అంటే ఆర్థిక వ్యవస్థ పనితీరుతెన్నుల్లో వచ్చిన మార్పులను పరిగణలోకి తీసుకుంటుంది. మాడిసన్ ప్రకారం ఆదాయ స్థాయిలోని పెరుగుదలను ధనవంత దేశాల్లో ఆర్థికవృద్ధిగా భావించగా, పేద దేశాల్లో ఆర్థికాభివృద్ధిగా భావిస్తారు.
-అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాల్లో వైవిధ్యం ఉంటుంది. అభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధిని సాధించడానికి వ్యాపార చక్రాలు, సాంకేతిక పరిఙ్ఞానం, మార్కెట్, డిమాండ్ మొదలైన ఆర్థిక అంశాలపై దృష్టి కేంద్రీకరించాల్సి ఉండగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆర్థిక అంశాలతో పాటు సాంఘిక, రాజకీయ అంశాలపై కూడా దృష్టిని కేంద్రీకరించాలి.
-ఆర్థికాభివృద్ధి బహుముఖమైన ప్రక్రియ. కాలానుగుణంగా ఆర్థికాభివృద్ధి అనే భావనపట్ల మారుతున్న దృక్పథాలకు అనుగుణంగా నిర్వచనాలు కూడా మారుతూవస్తున్నాయి.
-ఒక ఆర్థిక వ్యవస్థలో అభివృద్ధి తీరుతెన్నులను తెలుసుకోవడానికి, వివిధ దేశాల ఆర్థికాభివృద్ధి స్థాయిలను పోల్చిచూడటానికి, ఆర్థికాభివృద్ధి ఆధారంగా ఆర్థిక వ్యవస్థలను వర్గీకరించడానికి, వివిధ దేశాల ఆర్థికాభివృద్ధిని అంచనావేయడానికి ఆర్థికాభివృద్ధి సూచికలు లేదా ఆర్థికాభివృద్ధి కొలమానాలు దోహదపడతాయి.
ఆర్థికాభివృద్ధి సూచికలు
– 1. జాతీయాదాయం.
– 2. తలసరి ఆదాయం.
– 3. జీవన ప్రమాణం.
– 4. భౌతిక జీవన ప్రమాణ సూచీ.
– 5. నికర ఆర్థిక సంక్షేమ సూచీ.
– 6. మానవాభివృద్ధి సూచీ.
జాతీయాదాయం
-ఒక దేశంలో ఆర్థికాభివృద్ధి జరుగుతున్నది లేనిది తెలుసుకోవడానికి ఉపయోగించే సాంప్రదాయ సూచికల్లో జాతీయాదాయం ఒకటి. ఒకదేశ వాస్తవ జాతీయాదాయం దీర్ఘకాలం నిరంతరంగా పెరుగుతుంటే ఆర్థిక వ్యవస్థలో వృద్ధి జరుగుతున్నదని, వాస్తవ జాతీయాదాయం నిలకడగా ఉంటే ఆర్థిక వ్యవస్థలో వృద్ధిలేక స్తబ్దతతో ఉందని, అలాకాకుండా వాస్తవ జాతీయాదాయం క్రమంగా తగ్గుతుంటే అభివృద్ధి తిరోగమనంలో ఉందని భావిస్తున్నారు. అయితే జాతీయాదాయం, ఆర్థికాభివృద్ధికి సంపూర్ణ సూచిక అవుతుందని చాలామంది ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. దీనికి గల కారణాల్లో ప్రధానంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆదాయ గణాంకాలు అసమగ్రంగా ఉండటం, గృహ యజమానులు, వ్యాపారులు, సంస్థలు వారి ఆదాయ వ్యయాల గురించిన పద్దులను సక్రమంగా నమోదు చేయకపోవడం, ఉత్పత్తిలో కొంత భాగాన్ని సొంతంగా వినియోగించడం, గృహిణి సేవలను పరిగణలోనికి తీసుకోకపోవడం, కొన్ని ఉత్పత్తులను రెండు సార్లు లెక్కించడం, వస్తుమార్పిడి మూలంగా ఆర్థిక కార్యకలాపాలు ద్రవ్య రూపంలో జరుగకపోవడం మొదలైనవి. అంతేగాక ద్రవ్యోల్బణం మూలంగా ఉత్పత్త్తిలో పెరుగుదల లేకున్నా జాతీయాదాయం పెరుగుతుంది.
-అభివృద్ధి చెందుతున్న దేశాల్లో జాతీయాదాయం పెరుగుతున్నప్పటికి పేద, ధనిక వర్గాల మధ్య వ్యత్యాసం అట్లాగే కొనసాగడం వలన పేదవారి సంఖ్యలో చెప్పుకోదగ్గ మార్పు రాలేదని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అందువల్ల జతీయాదాయంలోని పెరుగుదల ఆర్థికాభివృద్ధికి సరైన సూచిక అవుతుందని ఆర్థికవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
తలసరి ఆదాయం
-ఒక దేశ వాస్తవ జాతీయాదాయాన్ని, ఆ దేశ ప్రజలచే భాగిస్తే వాస్తవ తలసరి ఆదాయం వస్తుంది. దీర్ఘకాలంలో వాస్తవిక తలసరి ఆదాయంలో పెరుగుదలను సాధించే ప్రక్రియనే ఆర్థికాభివృద్ధిగా చాలామంది ఆర్థికవేత్తలు భావించారు. అయితే తలసరి ఆదాయం పెరిగినంత మాత్రాన ప్రజాశ్రేయస్సు పెరుగుతుందని చెప్పలేం. ఆదాయ పంపిణీలో అసమానతలు ఉన్నట్లైతే, తలసరి ఆదాయం కూడా ఆర్థికాభివృద్ధికి సరైన సూచిక అవుతుంది.
జీవన ప్రమాణం
-ఒక దేశ జీవన ప్రమాణ స్థాయి అ దేశ వాస్తవ తలసరి ఆదాయంపైన ఆధారపడినప్పటికీ తలసరి ఆదాయం, జీవన ప్రమాణం భావనలు రెండూ ఒకటి కావు. జాతీయాదాయాన్ని జనాభాతో భాగిస్తే తలసరి ఆదాయం వస్తుంది, కానీ జీవన ప్రమాణం ఆ ఆదాయంలో ప్రస్తుత వినియోగానికి కేటాయించిన భాగానికే వర్తిస్తుంది. అంతేకాకుండా ప్రజల ఆయుర్ధాయం, శిశు మరణాల రేటు, విద్య, వైద్యం, ఉపాధి సౌకర్యాలు మొదలైనవాటి పైనే కాకుండా గణించడానికి వీల్లేని వ్యక్తి స్వేచ్ఛ, సాంఘిక, ఆర్థిక గమనశీలత, సమాన అవకాశాలు మొదలైన అంశాలపై ఆధారపడి ఉంటుంది.
భౌతిక జీవన ప్రమాణ సూచీ (Physical Quality of Life Index -PQLI)
-డేవిడ్ మోరిస్ 1970లో ఈ సూచీ రూపొందించారు. ఇందులో ఆయుర్ధ్దాయం, శిశు మరణాల రేటు, అక్షరాస్యత అనే మూడు అంశాలను పరిగణలోనికి తీసుకున్నారు. ఆదాయ సూచీ కంటే దీనిలో కొన్ని మెరుగైన అంశాలున్నాయి. PQLI సమాజ సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుంటుంది. ఇది అదాయ పంపిణీ అంశాలను పరిగణలోనికి తీసుకుంటుంది. ఎందుకంటే ఆదాయ పంపిణీలో అసమానతలు తగ్గినప్పుడే ఈ సూచీలోని మూడు కొలమానాల్లో గుణాత్మక మార్పు కన్పిస్తున్నది. ఈ సూచీ మెరుగైనదైనప్పటికీ జీవన ప్రమాణ స్థాయిని సూచించే అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ, మనస్తత్వ అంశాల్లో మూడు అంశాలను మాత్రమే తీసుకోవడం మూలంగా సమగ్రత లోపించిందనే విమర్శ ఉంది.
నికర ఆర్థిక సంక్షేమ సూచీ (Net Economic Welfare)
-ఆదాయ సూచీని మెరుగుపర్చి ఆర్థిక సంక్షేమ కొలమానాన్ని అభివృద్ధి సూచీగా (1992) విలియం నర్దవుస్ , జేమ్స్ టోబిన్ (William Nordhaus , James Tobin) ) రూపొందించారు. దీన్నే పాల్ సామ్యూల్సన్ నికర ఆర్థిక సంక్షేమ సూచీగా పేరు మార్చారు. జాతీయాదాయానికి విశ్రాంతి సమయం విలువను, గృహిణుల సేవల విలువలను కలపడంతో ఆధునిక పట్టణీకరణ, కాలుష్యం అసౌకర్యాల వ్యయాలను మినహాయించడం ద్వారా జాతీయాదాయాన్ని లెక్కించొచ్చు.
మానవాభివృద్ధి సూచీ (Human Development Index-HDI)
-దీన్ని 1990లో మహబూబుల్ హక్ రూపొందించారు. 1990 నుంచి ప్రతి ఏడాది UNDP మానవాభివృద్ధి నివేదికలో వివిధ దేశాల మానవాభివృద్ధిని లెక్కించడానికి, పోల్చడానికి హెచ్డీఐ సూచీని రూపొందిస్తున్నారు. దీంతోపాటు 1995 నుంచి జెండర్ అభివృద్ధి సూచీ (GDI), 1997 నుంచి మానవ పేదరిక సూచీ (HPI) లను కూడా రూపొందిస్తున్నది. మానవాభివృద్ధి సూచీలో మూడు అంశాలైన ఆయుర్ధ్దాయం, అక్షరాస్యత, తలసరి జాతీయోత్పత్తిని పరిగణలోనికి తీసుకుని HDIని రూపొందిస్తున్నారు. 2010 నుంచి పై మూడు అంశాలనే పరిగణలోనికి తీసుకొని కొత్త పద్ధతిలో HDI ని గణిస్తున్నారు. 2013కుగాను 2014, జూలై 24న UNDP మానవాభివృద్ధి నివేదికలో మొదటి స్థానం నార్వే, చివరి స్థానం(187)లో నైగర్ ఉన్నాయి. భారతదేశం 135 వ స్థానంలో ఉంది.
-2014 ఏడాదికిగాను 2015, డిసెంబర్ 14న సెలిం జహాన్ (Selim Jahan, the Director of the Human Development Report) విడుదల చేసిన 188 దేశాలకు సంబంధించిన మానవాభివృద్ధి నివేదికలో మొదటి స్థానంలో నార్వే ఉండగా ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ రెండు, మూడు స్థానాల్లో నిల్చాయి. చివరి స్థానం(188) నైగర్ పొందింది. ఇండియా ఐదు స్థానాలు మెరుగుపర్చుకొని 130 (HDI 0.609) స్థానంలో నిలిచింది. పాకిస్థాన్ 0.570 పాయింట్లతో 142వ స్థానం, శ్రీలంక 0.757 పాయింట్లతో 73వ స్థానంలో ఉన్నాయి.
2 మానవాభివృద్ధి నివేదిక పని, ఉద్యోగితలను పరిశీలించి ఉద్యోగిత కంటే పని (Work) అన్నది విస్తృతమైన అంశంగా పేర్కొన్నది. ఉద్యోగిత కేవలం వ్యక్తులు, కుటుంబాల పోషణకు, సంక్షేమానికి సంబంధించినది. పని (Work) విస్తృతమైన అర్థం కలిగి ఉంటుంది.
ఆర్థికాభివృద్ధి నిర్వచనాలు
వృద్ధి అంటే ఆర్థిక వ్యవస్థ ఎత్తు, బరువులు.. అభివృద్ధి అంటే ఆర్థిక వ్యవస్థ పనితీరు తెన్నుల్లో వచ్చిన మార్పులు.. -కిండల్బర్గర్
దీర్ఘకాలంలో వాస్తవిక తలసరి ఆదాయాన్ని పెంచే ప్రక్రియే ఆర్థికాభివృద్ధి. – గెరాల్డ్ మేయర్
ఆర్థికాభివృద్ధి అనంతంగా నిత్యం కొనసాగే ప్రక్రియ. ఉత్పాదకలో నిరంతర పెరుగుదలే ఆర్థికాభివృద్ధి. -హెగెన్ (Hagen)
జనాభా, తలసరి ఉత్పత్తిలోని నిరంతర పెరుగుదలే ఆర్థికాభివృద్ధి. -కుజ్నెట్
సాంఘిక వ్యవస్థ మొత్తం పై స్థాయికి కదలడాన్ని ఆర్థికాభివృద్ధి అంటారు. – గున్నార్ మిర్దాల్
ఏ దేశంలోనైతే పేదరికాన్ని, అసమానతల్ని, నిరుద్యోగితను వాటి అధిక స్థాయిల నుంచి తగ్గించగలుగుతారో ఆ దేశంలో ఆ కాలాన్ని అభివృద్ధి కాలంగా పేర్కొంటారు- డ్యూడ్లీ సీర్స్
వ్యవసాయ రంగం నుంచి పారిశ్రామిక, సేవల రంగాలకు నిరంతరం శ్రామికులు తరలివెళ్లడమే ఆర్థికాభివృద్ధి. -కొలిన్ క్లార్క్ (Colin Clark)
దేశంలో అనేక ఆధునీకరణ ఆదర్శాలను సాధించడమే ఆర్థికాభివృద్ధి. – సి.ఇ. బ్లాక్
ఆర్థిక వ్యవస్థలో పోషకాహార లోపాన్ని, అనారోగ్యాన్ని, అపరిశుభ్రతను, నిరక్షరాస్యతను, నిరుద్యోగితను, అసమానతలను తగ్గించడంతో పాటు, కాలక్రమంగా రూపుమాపడం ఆర్థికాభివృద్ధి. – మహబూబుల్ హక్
నమూనా ప్రశ్నలు
1. UNDP – 2015లో ప్రకటించిన మానవాభివృద్ధి నివేదికలో ఇండియా స్థానం ? (1)
1) 130 2) 132 3) 134 4) 135
2. అర్థికవృద్ధి, ఆర్థికాభివృద్ధి పదాల మధ్య స్ఫష్టమైన తేడాను తెలిపింది ఎవరు ? (1)
1) షుంపీటర్ 2) నర్క్సే
3) అమర్త్యసేన్ 4) సామ్యూల్సన్
3. కేవలం ఉత్పత్తిలో మాత్రమే పెరుగుదలను పరిగణలోనికి తీసుకునేది ఏది ? (1)
1) అర్థికవృద్ధి 2)ఆర్థికాభివృద్ధి
3) భౌతిక జీవన ప్రమాణ సూచీ
4) తలసరి ఆదాయం
4. ఆర్థిక వ్యవస్థలో మార్పులను కూడా పరిగణలోనికి తీసుకునేది ఏది? (2)
1) మానవాభివృద్ధి సూచిక 2) ఆర్థికాభివృద్ధి
3) అర్థికవృద్ధి
4) జీవన ప్రమాణం
5. వ్యక్తి పెరుగుదలను ఉదాహరణగా తీసుకొని వేటిని వివరించవచ్చు ? (3)
1) పొదుపు, పెట్టుబడులు
2) జాతీయాదాయం, తలసరి ఆదాయం
3) అర్థికవృద్ధి, ఆర్థికాభివృద్ధి
4) ఉద్యోగిత, ఉత్పత్తి
6. దీర్ఘకాలంలో వాస్తవిక తలసరి ఆదాయాన్ని పెంచే ప్రక్రియే ఆర్థికాభివృద్ధి అన్నదెవరు ? (3)
1) గున్నార్ మిర్దాల్ 2) డడ్లీ సీర్స్
3) గెరాల్డ్ మేయర్ 4) షుంపీటర్
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు