ఆంధ్ర – తెలంగాణ ఏ నిజాం కాలంలో విడిపోయాయి ?
నిజాం అలీకాలంలో ముఖ్య నిర్మాణాలు
-మోతీ మహల్
-రోషన్ మహల్
-గుల్షన్ మహల్
-రెసిడెన్సీ భవనం (దీని ప్రకారం ఆర్కిటెక్ట్ – శామ్యూల్)
-గన్‌ఫౌండరీ (రేమాండ్ సహాయంతో ఏర్పాటైంది) క్రీ.శ. 1803లో నిజాం అలీ మరణించాడు.
తల్లికోట యుద్ధంతో పతనావస్థకు చేరిన విజయనగర సామ్రాజ్యం తర్వాత కోలుకోలేకపోయింది. కుతుబ్‌షాహీల కాలంలో తెలంగాణ పరిధిలోకి వచ్చిన ఆంధ్రా ప్రాంతం నిజాంల కాలంలో జరిగిన పరిణామాల ద్వా రా ఉత్తర సర్కారు ప్రాంతాలు బ్రిటీష్‌వారి ఆధీనంలోకి వెళ్లిపోయాయి. మూడవ మైసూరు యుద్ధం ద్వారా నిజాంల పరిధిలోకి వచ్చిన దత్తమండలాలు.. సైన్యసహకార పద్ధతి ద్వారా బ్రిటీష్‌వారి పరిధిలోకి వెళ్లిపోయాయి. ఫ్రెంచి వారి ప్రాబల్యాన్ని పూర్తిగా అంతమొదించిన యుద్ధం వందవాసి యుద్ధం.
తెలంగాణ చరిత్రలో ముఖ్యులైన అసఫ్‌జాహీ పాలకులు నాసర్‌జంగ్, ముజఫర్ జంగ్, సలాబత్‌జంగ్, నిజాం అలీ, సికిందర్ జాల గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా ఉత్తర సర్కారు మండలాలు, రేమాండ్ – ఫ్రెంచ్ సైన్యం, సైన్యసహకార ఒప్పందం, దత్త మండలాలు మొదలైన ముఖ్యాంశాల గురించి మీరు అర్థం చేసుకుంటారు. ఈ అంశాలు చాలా ప్రాధ్యాన్యతతో కూడుకున్నవి. వీటిలో నుంచి పరీక్షల్లో ప్రశ్నలు వచ్చే అవకాశాలున్న దృష్ట్యా చాలా లోతుగా సమాచారాన్ని ఇవ్వడం జరిగింది.
– నిజాం – ఉల్ – ముల్క్కు ఒక కుమారై, ఆరుగురు కుమారులు
1. గాజి ఉద్దీన్ ఖాన్ 2. నాసర్ జంగ్
3. సలాబత్‌జంగ్ 4. బసాలత్జంగ్
5. నిజాం అలీఖాన్ 6. అసద్ జంగ్
వారసత్వపోరు – ఫ్రెంచి, ఆంగ్ల కంపెనీల జోక్యం
మొదటి అసఫ్‌జా నిజాం మరణించిన తర్వాత దక్కన్ సుబేదారు పదవికి వారతస్వ పోటీ ఏర్పడింది. నాసర్‌జంగ్, నిజాం మనుమడైన (కూతురు కుమారుడు) ముజఫర్జంగ్ల మధ్య పోటీ వాతావరణం ఏర్పడింది. దీనిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేశారు బ్రిటీష్, ఫ్రెంచివారు. ముజఫర్‌జంగ్‌కు- ప్రెంచివారు, నాసర్జంగ్కు -ఆంగ్లేయులు మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలోనే అటు ఆర్కాట్ నవాబ్ పదవిని ఆశిస్తున్న చాంద్సాహెబ్కు డూప్లే తన మద్దతును ప్రకటించాడు. అదేవిధంగా ఆంగ్లేయులు అన్వరుద్దీన్, మహ్మద్అలీలను సమర్థించారు.
రెండో కర్ణాటక యుద్ధం
ఈ విధంగా ఆంగ్లేయులు ఫ్రెంచి వారు అటు ఆర్కాట్లో ఇటు హైదరాబాద్ రాజకీయాల్లో జోక్యం చేసుకోవడం. తమ ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని అనుకోవడం తో రెండో కర్ణాటక యుద్ధానికి దారితీసింది.
నాసర్‌జంగ్
నాసర్‌జంగ్ తల్లిదండ్రులు సయ్యద్ఉన్నీసా బేగం, నిజాం-ఉల్ – ముల్క్. ఇతడు తన ఇరవై ఒకటో సంవత్సరంలోనే వజీరున్నీసా బేగంను వివాహం చేసుకున్నాడు. తండ్రి ఢిల్లీకి వెళ్లిన సమయంలో నాసర్‌జంగ్ తండ్రికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి, తానే దక్కను సుబేదారు అని ప్రకటించుకున్నాడు. అయితే ఆ తర్వాత తండ్రిచే బంధింపబడి, వదిలివేయబడినాడు. తన ఆంతరంగికుల సహాయంతో దక్కను సుబేదారు అయ్యాడు. చివరకు క్రీ.శ.1750 చివర్లో హత్యకు గురయ్యాడు. నాసర్‌జంగ్ శవానికి అతని సైన్యాలు రక్షణ కల్పించడమేగాకుండా దానిని ఔరంగాబాద్ పట్టణానికి చేర్చారు. గవర్నర్ డూప్లేల కుట్రల ఫలితంగా ముజఫర్ జంగ్‌ను హిమ్మత్ఖాన్ హత్య చేశాడు.
ముజఫర్‌జంగ్
-నాసర్‌జంగ్ మేనల్లుడు. తల్లిపేరు ఖైరున్నీసాబేగం.
-అంతకుముందు నాసర్జంగ్చే పాండిచ్చేరి వద్ద ఓడింపబడి, బంధింపబడినాడు
-ఫ్రెంచివారు ఇతన్ని దక్కన్ సుబేదారుగా ప్రకటించి నిజాంగా పరిగణించారు. దీనికి కారణం ఇతడు మొదటి నిజాం కుమారై కుమారుడు అనగా మనుమడు.
-తనను దక్కన్ సుబేదారుగా చేసినందుకు డూప్లేకు జఫర్‌జంగ్ అనే బిరుదునిచ్చి గౌరవించాడు.
-అంతేకాకుండా మచిలీపట్నం, యానాం,కరైకాల్ మొదలైన ప్రాంతాల్ని ఇచ్చాడు. ముజఫర్‌జంగ్ ఔరంగాబాద్‌కు బయలుదేరి వెళ్తున్నప్పుడు మార్గమధ్యంలో కడప సమీపంలోని లక్కిరెడ్డిపల్లి (రాయచోటి) వద్ద హిమ్మత్ఖాన్చే హత్యకు గురయ్యాడు (క్రీ.శ.1751లో).
నిజాం అలీఖాన్ (క్రీ.శ.1761 -1803)
-నిజాం అలీఖాన్‌ను రెండో అసఫ్‌జాగా పిలుస్తారు. ఇతని తల్లిదండ్రులు నిజాం ఉల్‌ముల్క్, ఉమ్దాబేగం.
-ఇతడు 28వ ఏట నిజాం అయ్యాడు.
-నిజాం అలీఖాన్ ఉర్దూ, టర్కీ, అరబ్బీ, పార్శీ భాషల్ని అభ్యసించాడు. అలీఖాన్‌కు బీరార్ సుబేదారుగా పనిచేసిన అనుభవం కూడా ఉంది
-ఇతని కాలం నుంచే అసఫ్ జాహీ పాలకుల్ని నిజాం రాజులు అని పిలుస్తున్నారు
ఆంగ్లేయులు – నిజాం సంబంధాలు
నిజాం అలీ తీరాంధ్రలోని పిఠాపురం, పెద్దాపురం, విజయనగరం మొదలైన జమీందారుల్ని ఓడించి, వారి నుంచి కప్పాన్ని వసూలు చేశాడు. దీంతో ఈస్టిండియా కంపెనీ ఆందోళన చెందింది. నిజాం అలీ తన పూర్వపు అధికారాన్ని తిరిగి నెలకొల్పాడు. నిజాం బ్రిటీష్ వారికి ఉత్తర సర్కారుల్ని ఇచ్చాడు.
(దీని గురించి తర్వాత తెలుసుకుందాం)
మొగల్ చక్రవర్తి షా అలం ఫర్మానా – ైక్లెవ్ సంపాదించడం
-ఉత్తర సర్కారుల్ని సంపాదించాలని, తద్వారా లాభం పొందాలని ఆంగ్లేయ ఈస్టిండియా కంపెనీ చాలా ఆత్రుతతో ఉండేది. దీనికి ముఖ్యకారణాలు..
ఎ. ఉత్తర సర్కారుల్ని ఆంగ్లేయ ఈస్టిండియా కంపెనీ స్వాధీనం చేసుకోగలిగితే బెంగాల్ నుంచి మద్రాసు వరకు తమ ఆధీనంలోకి వచ్చినట్లు అవుతుంది.
బి. నిజాం ఎప్పుడైనా ఫ్రెంచివారికి దగ్గర అవుతాడేమోననే భయం ఆంగ్లేయులకు ఉండటం రాబర్ట్ ైక్లెవ్ నాటి మొగల్ చక్రవర్తి అయిన షా ఆలం నుంచి ఉత్తర సర్కారుల్ని ఫర్మానా ద్వారా పొందినాడు. అయితే ఈ ఫర్మానా ప్రకారం ఉత్తర సర్కారుల్ని ఆంగ్లేయ ఈస్టిండియా కంపెనీకి ఇవ్వడానికి నిజాం అలీఖాన్ ఇష్టపడలేదు. పైగా దీనిని లెక్కలోకి తీసుకోలేదు.
కాండ్రేగుల జోగిపంతులు సంప్రదింపులు
ఈ విషయమై నిజాం అలీఖాన్‌తో సంప్రదింపులు జరపడానికి కాండ్రేగుల జోగిపంతులును కంపెనీ ప్రతినిధి అయిన జాన్ పైబస్ పంపించాడు. కాండ్రేగుల జోగిపంతులు దుబాషి. నిజాం ఆస్థానంలోని ఉన్నతాధికారులు, బ్రిటీష్ ఉన్నతాధికార్లతో మంచి సంబంధాలు జోగి పంతులు ఏర్పర్చుకున్నాడు. చివరకు నిజాం ఆర్థిక పరిస్థితి బాగాలేదని గ్రహించిన పంతులు 9 లక్షల రూపాయలకు 5 ఉత్తర సర్కారుల్ని కంపెనీకి ఇప్పించాడు.
ఉత్తర సర్కారులు – ఆంగ్లేయ ఈస్టిండియా కంపెనీ స్వాధీనం చేసుకోవడం
ఆంగ్లేయ ఈస్టిండియా కంపెనీకి నిజాంకు మధ్య 12 నవంబర్ 1766న ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందాన్ని అనుసరించి ఉత్తర సర్కారు ప్రాంతాలు ఆంగ్లేయ కంపెనీ వశమైనవి. అవి ఏలూరు, రాజమండ్రి, ముస్తఫానగర్ (కొండపల్లి), ముర్తుజానగర్ (గుంటూరు), చికాకోల్. కంపెనీ తాను సర్కార్ జిల్లాలను అనుభవించినందుకు ప్రతిఫలంగా సంవత్సరానికి రూ. 9 లక్షలను చెల్లించాలి.
ముర్తుజానగర్ నిజాం అలీఖాన్ సోదరుడు బసాలత్జంగ్కు ఇవ్వబడింది. కాబట్టి బసాలత్జంగ్ మరణం తర్వాతనే దానిని కంపెనీకి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ఒప్పందం విషయంలో జనరల్ స్మిత్, కైలాండ్లు కంపెనీ ప్రతినిధులుగా వ్యవహరించారు. ఆ తర్వాత కాలంలో (1768లో) మద్రాస్‌లో కంపెనీకి, నిజాంకు మధ్య జరిగిన మరొక ఒప్పందాన్ని అనుసరించి ఉత్తర సర్కారులు (ఏలూరు, రాజమండ్రి, చికాకోల్, ముస్తఫా, ముర్తుజానగర్లు). అయితే 9 లక్షలకు బదులుగా సంవత్సరానికి రూ. 7 లక్షలు మాత్రమే నిజాంకు ఇవ్వడానికి కంపెనీ అంగీకరించింది.
1768లో గుంటూరు కంపెనీ వశం
బసాలత్జంగ్ మరణం తర్వాత జరిగిన సంప్రదింపుల ప్రకారం నిజాం అలీఖాన్ గుంటూరును ఆంగ్లేయులకు ఇవ్వడానికి ఒప్పుకున్నాడు. (1788 సెప్టెంబర్ 18)
మహారాష్ర్టులు, నిజాం, ఈస్టిండియా కంపెనీ త్రైపాక్షిక సంధి
ఈ సంధి 1790 జూలైలో మైసూరు ప్రభువైన టిప్పుసుల్తాన్‌కు వ్యతిరేకంగా కుదిరింది. టిప్పు సుల్తాన్‌ను ఓడించడానికి ఆంగ్లేయ కంపెనీకి శక్తిచాలదని గ్రహించిన ఆంగ్లేయులు ఈ సంధి కోసం ప్రయత్నించి, చివరకు సంధి చేసుకున్నారు. మూడో – ఆంగ్లో మైసూర్ యుద్ధంలో టిప్పుసుల్తాన్ను ఆంగ్లేయులు ఓడించారు. ఫలితంగా కడప, గండికోట, కంభం, బళ్లారి, గుర్రంకొండ ప్రాంతాల్ని తన వాటాగా పొందాడు నిజాం అలీ. వీటిపై సికిందర్జాను పాలకుడిగా నియమించారు.
మహారాష్ర్టుల చేతిలో నిజాం సైన్యాల ఓటమి (ఖర్దా ఓటమి)
నిజాం అలీ తన రాజ్యంలోని కొన్ని ప్రాంతాల్లో మహారాష్ర్టులు చౌత్, సర్దేశ్ముఖ్ పన్నులు విధించి, వసూలు చేయడం ఇష్టం లేదు. ఈ కారణంగా మహారాష్ర్టుల ఆంతరంగిక విషయాల్లో జోక్యం చేసుకున్నాడు నిజాం అలీ. చివరకు తమ మధ్య ఉన్న విభేదాల్ని మరచిన మహదాజీ సింధియా, నానాఫడ్నవీస్లు కలిసిపోయి నిజాం కుట్రల్ని ఛేదించాలని నిర్ణయించుకున్నారు. చివరకు ఖర్దా వద్ద జరిగిన యుద్ధంలో నిజాం సైన్యాలు చిత్తుగా ఓడిపోయిన తర్వాత 3 కోట్ల చౌత్‌ను, 2 కోట్ల రూపాయల నష్టపరిహారం చెల్లించి, అహ్మద్‌నగర్, షోలాపూర్, దౌలతాబాద్ మొదలైన ప్రాంతాల్ని మహారాష్ర్టులకు నిజాం అప్పగించాడు.
రేమాండ్ – ఫ్రెంచి సైన్యం
రేమాండ్ అనే ఫ్రెంచ్ సైనిక అధికారిని కొత్త సైనికదళాన్ని ఏర్పర్చమని నిజాంఅలీ అదేశించాడు. ఇతని కాలంలో తుపాకుల కర్మాగారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబడింది. ఇతడే మూసారా ముడిగా పిలువబడినాడు. ఇతని పేరు మీదుగానే మూసారాంబాగ్ ఏర్పడింది.
సలాబత్‌జంగ్ (క్రీ.శ.1751 – 1761)
ముజఫర్‌జంగ్ హత్యానంతరం నాసర్‌జంగ్ సోదరుడైన సలాబత్‌జంగ్‌ను ఫ్రెంచివారు దక్కన్ సుబేదారుగా నియమించారు. ఇతడు బుస్సీ సలహా ప్రకారం పాలించాడు. బుస్సీ కోరికను గౌరవించి సలాబత్‌జంగ్ ఫ్రెంచివారికి మచిలీపట్నాన్ని ఇచ్చాడు
-ఫ్రెంచివారి జీతభత్యాలు చెల్లించాలని బుస్సీ సలాబత్‌ను కోరగా, అతడు అప్పుచేసి జీతాలు చెల్లించాడు.
-దివాను లష్కర్ ఖాన్‌కు ఫ్రెంచివారి ఆధిపత్యాన్ని సైనిక ఖర్చుల్ని భరించడం ఇష్టం లేదు. అతడు బ్రిటీష్ వారితో రహస్య మంతనాలు సాగించాడు. ఫ్రెంచివారి ఆర్థిక పరిస్థితి బాగాలేదని భావించిన బుస్సీ, సైనిక వ్యయం కింద ఉత్తర సర్కారుల్ని పొందాడు. అవే చికాకోల్ (శ్రీకాకుళం), ఏలూరు, రాజమహేంద్రవరం, ముస్తఫానగర్. ఇతని కాలంలోనే ఆంగ్లేయులు ఫ్రెంచి వారిని ఓడించి, మచిలీపట్నాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత ఉత్తర సర్కారుల్ని ఆంగ్లేయులకు ఇచ్చారు. ఇతని కాలంలోనే చందుర్తి యుద్ధం, బొబ్బిలి యుద్ధం, కొండూరు యుద్ధం, వందవాసి యుద్ధం జరిగాయి. మొదటిసారిగా ఆంగ్లేయులతో ప్రత్యక్ష సంబంధాలు నెలకొల్పుకున్నాడు సలాబత్‌జంగ్. చివరగా సలాబత్‌జంగ్‌ను తొలగించి నిజాం అలీఖాన్ అధికారంలోకి వచ్చాడు.
సైన్య సహకార ఒప్పందం
-క్రీ.శ.1798లో సర్ లార్డ్ వెల్లస్లీ భారతదేశానికి గవర్నర్ జనరల్‌గా వచ్చాడు. వెల్లస్లీ సామ్రాజ్యవాది. ఫ్రెంచివారి ప్రాబల్యాన్ని నిర్మూలించడం, భారతదేశంలో బ్రిటీష్ సామ్రాజ్యాన్ని విస్తరించాలనే అశయంతో వచ్చాడు. వెల్లస్లీ ప్రవేశపెట్టిన విధానమే సైన్యసహకార పద్ధతి.
సైన్యసహకార ఒప్పందంలో ముఖ్యాంశాలు..
-ఈ ఒప్పందాన్ని అంగీకరించిన స్వదేశీ పాలకులు తమ రాజ్యంలో బ్రిటీష్ సైన్యాల్ని నిలుపుకోవాలి. ఆంగ్ల సైన్యాల ఖర్చును ఆ స్వదేశీ రాజులే భరించాల్సి ఉంటుంది.
-కంపెనీ ముందస్తు అనుమతితోనే ఇతర పాలకులతో ఏవైనా లావాదేవీలు జరపాలి. బ్రిటీష్ ఈస్టిండియా కంపెనీతో సంధి చేసుకున్న స్వదేశీ పాలకుడు, కంపెనీ సార్వభౌమాధికారాన్ని గుర్తించాల్సి ఉంటుం ది. నిజాం అలీ కాలంలో బ్రిటీష్ రెసిడెంట్‌గా జేమ్స్ ప్యాట్రిక్ నియమింపబడినాడు. ఈ సైన్య సహకార పద్ధతిని అంగీకరించిన మొదటి పాలకుడు నిజాం అలీ (1798). బ్రిటీష్ సైన్యాల ఖర్చు ను నిజాం భరించాల్సి ఉంటుంది.
-దత్తమండలాలు బ్రిటీష్ వారి వశం (నిజాం అలీ – కంపెనీ మధ్య ఒప్పందం) ఈ కొత్త ఒప్పందం ప్రకారం.. మరికొంత సైన్యాన్ని ఉంచడానికి కంపెనీ అంగీకరించింది. దీని ప్రకారం నిజాం అలీ, ఈస్టిండియా కంపెనీకి దత్తమండలాల్ని ఇవ్వడానికి ఒప్పుకున్నాడు (క్రీ.శ.1800లో అవే బళ్లారి, అనంతపురం, కర్నూలు, కడప). ఈ జిల్లాలనే సీడెడ్ జిల్లాలు అని లేదా దత్తమండలాలు అని పిలుస్తారు. నెల్లూరు, చిత్తూరుల్ని క్రీ.శ. 1802లో కంపెనీ వశం చేసుకుంది. నిజాం అలీఖాన్ కాలంలో సీమాంధ్ర తెలంగాణ నుంచి పూర్తిగా విడిపోయింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు