భారత ఆర్థిక వ్యవస్థ-వృద్ధి సిద్ధాంతాలు గ్రూప్స్- ఎకానమీ
న్యూ హిందూ గ్రోత్ రేట్ అనగా ?
స్వాతంత్య్రం వచ్చి దాదాపు 70 ఏండ్లు కావస్తున్నా భారత ఆర్థిక వ్యవస్థ 2000 అమెరికన్ బిలియన్ డాలర్లు జాతీయాదాయాన్నే సాధించగలిగింది. కానీ ఇదే కాలంలో చైనా 10,000 అమెరికన్ బిలియన్ డాలర్లు సాధించడం గమనార్హం. దీనికి ప్రధాన కారణం 100 శాతం విధాన లోపమే (Policy Paralysis) అనేది ఆర్థికవేత్తల అభిప్రాయం. అద్భుతమైన సహజ వనరులు, మానవ వనరులు, తడి దేశం (Wet Country), ఒక ఉప ఖండానికి కాలసిన అన్ని సౌకర్యాలు, కావలసినంత తీరరేఖ ఉన్నప్పటికీ భారతదేశం సాధించాల్సినంత అభివృద్ధికి మాత్రం నోచుకోలేదని చెప్పవచ్చు.
స్వాతంత్య్రం లభించి ఇన్ని దశాబ్దాలైనా దేశంలో 21.9 శాతం బీదరికం, నిరుద్యోగం 5.6 శాతం, అసమానతలు, పోషకాహార లోపం మొదలైన ఆర్థిక సమస్యలు ఉన్నాయి. దీనికి ముఖ్య కారణం ఆర్థిక అభివృద్ధికి కావలసిన వృద్ధి వ్యూహాన్ని పాటించలేదని చెప్పాలి.
రావ్, మన్మోహన్ నమూనా
1991కి ముందు దేశంలో డిమాండ్ సప్లయ్‌ని మించడం, కోశలోటు 8.4 శాతంగా ఏర్పడటం, ద్రవ్యోల్బణం రెండంకెలు దాటడం, విదేశీ మారక నిల్వలు పూర్తిగా అడుగంటడం, మూల్య హీనీకరణకు దారితియ్యడంతో చివరికి ఆర్థిక వ్యవస్థకూ పూర్తి మరమ్మతులు చేయాల్సి వచ్చింది. ఇందులో మన్మోహన్సింగ్, రాజా చెల్లయ్య, నర్సింహన్, పీవీ నరసింహా రావుల కృషి అద్భుతమని గమనించాలి. రావ్, మన్మోహన్ నమూనా దేశంలో ఉన్న సప్లయ్ కొరతను తీర్చే ప్రయత్నం చేసింది. కరంట్ అకౌంట్లో పాక్షిక రూపాయి.. దీనిని LERMSగా, 1994-95లో కరెంట్ అకౌంట్లో రూపాయి పూర్తి మార్పిడి వల్ల దేశంలోకి విదేశీ మారక వనరుల వరద ప్రారంభమయ్యింది.
పెట్టుబడుల ఉపసంహరణ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు అవకాశం కల్పించడం, విదేశీ సంస్థాగత మదుపుదార్లకు అవకాశం ఇవ్వడం వంటి చర్యల వల్ల మూలధన ఖాతా బలాన్ని పుంజుకొని చెల్లింపుల శేషం ధనాత్మకంగా తయారయ్యింది. ఈ నమూనా ఆర్థిక వ్యవస్థలో ఉన్న సప్లయ్ కొరతను కొంతవరకు నియంత్రించింది. కానీ ఆర్థిక వ్యవస్థలో ప్రయివేటు రంగానికి ఎక్కువ స్వేచ్ఛ ఇవ్వడం వల్ల ఆ రంగంలో శ్రమదోపిడీ జరుగుతున్నది. కుటీర, చిన్న తరహా పరిశ్రమలకు ఎక్కువగా ఉపయోగపడక పోగా చిన్న తరహా పరిశ్రమల రిజర్వేషన్‌ను Dereservationగా చివరికి పూర్తిగా చిన్నతరహా పరిశ్రమల రిజర్వేషన్‌ను ఎత్తివేశారు. అంటే ఆర్థిక సంస్కరణలు చిన్నతరహా పరిశ్రమల కంటే పెద్ద తరహా పరిశ్రమలకే లబ్ధ్ది చేకూరింది. ఈ నమూనా వ్యవసాయ రంగానికి, చిరు వ్యాపారులకు, చిన్న, సన్నకారు రైతులకు ఆశించిన స్థాయిలో ఉపయోగపడలేదు. స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో ఏర్పాటు చేసుకున్న మిశ్రమ ఆర్థిక విధానం పూర్తి స్థాయిలో ఇప్పటికీ పాటించకపోవడంవల్ల ఆర్థిక సమస్యలు తలెత్తాయి.
హరాడ్, డోమర్ నమూనా
జాతీయ ఆదాయం పెంచితే అదే ఆర్థికాభివృద్ధికి దారితీస్తుందని Harrod Domer పేర్కొన్నారు. అయితే ఈ భావన తక్కువ జనాభా ఉన్న UK లాంటి దేశాలకు వర్తిస్తుంది. అందుకే Winstun Churchill కాలంలో వీరు ఈ వృద్ధి భావాన్ని పేర్కొన్నారు. ఇలాంటి భావాన్ని మన ఆర్థిక వ్యవస్థలో మొదటి ప్రణాళికలో Copy Paste చెయ్యడం మంచిది కాదని ఆర్థికవేత్తల అభిప్రాయం. ఎందుకంటే భారత్ ఒక జనాభా ధనిక దేశం. ఇలాంటి దేశానికి సమ్మిళిత వ్యూహం అవసరం. కానీ వృద్ధి వ్యూహం కాదు.
ఈ నమూనా మొదటి ప్రణాళికలో ప్రత్యక్షంగా, రెండో మూడో ప్రణాళికలో పరోక్షంగా ఉండటం వల్ల మొదటి మూడు ప్రనాళికలను వృద్ధి కేంద్ర ప్రణాళికలుగా పిలుస్తారు.
జనాభా ధనిక దేశం అయిన భారత్‌కు కావల్సింది సమ్మిళితి కలిగిన వృద్ధి అని గమనించాలి. ప్రపంచ బ్యాంకు సూచనల మేరకు భారతదేశం వృద్ధితోపాటు సమ్మిళితిపై కూడా దృష్టి కేంద్రీకరించాల్సి వచ్చింది.
మహలనోబిస్ నమూనా
రెండో ప్రణాళికలో మహలనోబిస్ బిగ్‌పుష్ సిద్ధాంతాన్ని పాటించారు. ఇందులో పెద్ద తరహా పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చారు. కానీ భారత ఆర్థిక వ్యవస్థకు కావల్సింది చిన్న తరహా పరిశ్రమలు. ఎందుకంటే ఉపాధి అవకాశాలు చిన్నతరహా పరిశ్రమలు మాత్రమే ఇస్తాయి.
భారత ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామికీకరణ ప్రారంభం రెండో ప్రణాళికలో అయినప్పటికీ, అదే ప్రణాళికలో ద్రవ్యోల్బణం కూడా ప్రారంభమైందని గమనించాలి. సమ్మిళితి లోపించిన విధానాల వల్ల భారతదేశంలో 1973-74లో బీదరికం దాదాపు 54 శాతం నమోదైంది. మహలనోబిస్ నమూనా సమ్మిళితి సాధించలేకపోయినా, ఇనుము, ఉక్కుకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల దాదాపు 82 మిలియన్ల ఉత్పత్తిని సాధించి దాదాపు ఇనుము ఉక్కులో స్వయం సమృద్ధి సాధించడం జరిగింది.
చెల్లింపుల సమస్యను ఎదుర్కొనే వ్యూహాలు
భారత ఆర్థిక వ్యవస్థలో 1947 నుంచి 1991 మధ్యకాలంలో నాలుగు సార్లు మూల్యహీనీకరణ చెయ్యాల్సి వచ్చింది. దీనికి ప్రధాన కారణం చెల్లింపుల సమస్య. ఆర్థిక వ్యవస్థలో చోటు చేసుకున్న IDRA, MRTPA, FERA లాంటి అనవసర చట్టాల సప్లయ్‌ని నిరోధించడం జరిగింది. దీంతో సప్లయ్ కొరత, ద్రవ్యోల్బణం పెరిగిపోయింది.
కరెంట్ అకౌంట్ లోటు ద్వారా చెల్లింపుల శేషంలో లోటు ఏర్పటడం వల్ల విదేశీ మారక నిల్వలను సరైన మోతాదులో రాబట్టలేకపోవడంతో ఆర్థిక వ్యవస్థ నాలుగుసార్లు మూల్యహీనీకరణకు గురయ్యింది.
నిరుత్సాహపరిచే వృద్ధి వ్యూహాలు
1947-1991 మధ్య కాలంలో ప్రభుత్వ నియంత్రిత ఆర్థిక ధోరణుల వల్ల ప్రయివేటు రంగం జాతియీకరణకు గురయ్యింది. లైసెన్సు రాజ్, భరించరాని పన్నులకు గురవ్వడంతో డిమాండ్ సప్లయ్‌ని మించిపోయింది. నాలుగు శాతం ఉండాల్సిన ద్రవ్యోల్బణం రెండో ప్రణాళిక నుంచి భరించరాని ద్రవ్యోల్బణంగా మారి ప్రజల కొనుగోలుశక్తి కూడా తగ్గిపోయింది. 1951-81 మధ్యకాలంలో అతితక్కువ వృద్ధి 3.5 శాతంగా నమోదయింది. దీనినే Hindu Growth Rateగా Professer Raj Krishna పేర్కొన్నారు. అయితే 1980వ దశాబ్దంలో శక్తికి ప్రాధాన్యత ఇవ్వడంతో New Hindu Growth Rate నమోదు చేయడం జరిగింది.
లక్డావాల నమూనా
గాంధేయ నమూనా, Gunnar Myrdal భావనలను ఆధారం చేసుకొని Prof. Lakdawala చిన్న తరహా పరిశ్రమలకు, Tiny సంస్థలకు, అనుషంగిక పరిశ్రమలకు ప్రాధాన్యత ఇచ్చి పరోక్షంగా శ్రమ సాంద్రత పద్ధతులను అవలంబించారు. అయితే రాజకీయ అనిశ్చితి వల్ల, ప్రభుత్వ నియంత్రిత ధోరణి గల చట్టాలను కొనసాగించడంతో ఆశించిన ఫలితాలు సాధించలేకపోయింది. 1979లో అధిక ద్రవ్యోల్బణం, తక్కువ వృద్ధిని కూడా చూడాల్సి వచ్చింది. అయితే జనతా విధానం పారిశ్రామిక వికేంద్రీకరణ కోసం ప్రతి జిల్లాలో District Industries Centerలను స్థాపించారు. అయితే ఈ నమూనాను 1980లోనే రద్దు చేశారు.
శక్తికి ప్రాధాన్యత
1980లో శక్తికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ 3.5 శాతం వృద్ధి నుంచి బయటపడి New Hindu Growthను సాధించింది.
వేతన వస్తు వ్యూహం
ఏడో ప్రణాళికలో Vakeel, Brahmananda నమూనాను వస్తు వేతన వ్యూహంగా పేర్కొనవచ్చు. ఇందులో కుటీర పరిశ్రమల నుంచి ప్రక్రియను పెద్ద తరహా పరిశ్రమలకు తీసుకెళ్లడం. ఈ వ్యూహం PC Mahalanobiesకు వ్యతిరేకమని భావించవచ్చు. ఇది భారత ఆర్థిక వ్యవస్థకు సరిపోతుందని గమనించాలి.
1947-1991 మధ్య కాలం
ఈ కాలంలో భారతదేశం అవలంభించిన ఆర్థిక వ్యూహాలు సమిష్టి డిమాండ్‌ను అధికం చేసి, సమిష్టి సప్లయ్‌ని తగ్గించి చివరికి ఆర్థిక వ్యవస్థ తీవ్ర ద్రవ్యోల్బణానికి గురయ్యేలా చేశాయి. నిర్దిష్ట ప్రణాళికల అమలువల్ల ప్రయివేటు రంగం పూర్తిగా సప్లయ్‌కి దూరమవడం కూడా ద్రవ్యోల్బణానికి కారణమయ్యింది. జాతియీకరణ అనే ఆర్థిక విధానం ద్వారా ప్రయివేటు రంగం ఉత్పత్తికి దూరం కావడం, మిశ్రమ ఆర్థిక విధానం పూర్తిగా ఉనికి కోల్పోవడం జరిగింది. నాల్గో ప్రణాళికలో ముదలియార్ పేర్కొన్న ఎగుమతి ప్రోత్సాహం, దిగుమతి ప్రత్యామ్నాయాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయక పోవడంవల్ల చెల్లింపు సమస్యకు దారితీసిందని పేర్కొన్నారు.
రాజీవ్ నమూనా
1985లో రాజీవ్‌గాంధీ, శ్యాం పిట్రోడాలు ఆర్థిక వ్యవస్థలో కొన్ని మార్పులు చేశారు. ఆర్థిక వ్యవస్థలో ప్రయివేటు రంగానికి ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా ప్రయివేటీకరణకు కొంత వరకు రాజీవ్‌గాంధీ పునాదులు వేశారని చెప్పవచ్చు. అయితే ఈ సంస్కరణలు ఔషధరంగం, టెలికాం రంగాలకు కొంతవరకు ఉపయోగపడ్డాయి. అయితే IDRA, MRTPA, FERA చట్టాలను మార్చకపోవడంతో ఆశించిన ఫలితాలు రాబట్టలేకపోయాం. చివరికి 1991లో రెండుసార్లు మూల్యహీనీకరనం జరపాల్సి వచ్చింది.
వ్యవసాయం-ఆర్థిక సంస్కరణలు
ఆర్థిక విధానాల లోపంవల్ల వ్యవసాయ రంగంలో తక్కువ మూలధన సంచయనం చోటుచేసుకుంది. స్థూలసాగుబడి స్థూల సాగుభూమి మించడం, ప్రచ్ఛన్న నిరుద్యోగం, కాల నిరుద్యోగం, అధిక సాగు వ్యయం మొదలైన సమస్యలతోపాటు 48 శాతం రైతాంగం రుణ ఊబిలో ఉన్నది.
ఉత్పాదక రంగం-ఆర్థిక సంస్కరణలు
ఆర్థిక వ్యవస్థలో ముఖ్యంగా ద్వితీయ రంగంలో ఉత్పాదక రంగం బలహీనంగా ఉంది. దీనిని తగ్గించడంకోసం NMCC, NMP, NSDCతోపాటు ఇటీవలి కాలంలో Make in India ప్రవేశపెట్టారు.
జీడీఎస్, జీడీఐ
1947-2015 మధ్య కాలంలో అవలంభించిన అభివృద్ధి వ్యూహాలు దేశంలో వినియోగాన్ని పొదుపులను సమానం చేయలేకపోవడం, ఎగుమతులను దిగుమతులను ఒకే స్థాయికి తీసుకురాకపోవడం, సమిష్టి డిమాండ్ సమిష్టి సప్లయ్ సమానంగా చేయలేకపోకపోయారు. అయితే దేశంలో స్థూల దేశీయ పొదుపులు, స్థూల దేశీయ పెట్టుబడులు స్థూల దేశీయోత్పత్తిలో 30 శాతం దాటడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ EME (Emerging Marketing Economy)గా పిలువబడుతుంది.
సాంఘికాభివృద్ధి-అభివృద్ధి వ్యూహాలు
భారత ఆర్థిక వ్యవస్థలో ప్రవేశపెట్టిన వృద్ధి సిద్ధాంతాలు జాతీయ ఆదాయంలో భారత్‌ను ప్రపంచంలో 10వ స్థానంలో ఉంచినప్పటికీ, మానవ అభివృద్ధి సూచిలో మాత్రం 135వ స్థానంలో ఉంది. అంటే ఏకముఖ అంశంలో విజయం సాధించినప్పటికీ బహుముఖ అంశంలో భారత్ విజయం సాధించలేకపోయింది.
సమ్మిళిత వ్యూహం
దేశంలో జాతీయ ఆదాయం పెరగడం, ప్రపంచంలో జాతీయాదాయంలో దేశం 10వ స్థానంలో ఉండటం ఒక విజయంగా పేర్కొనవచ్చు. అయితే ఈ ఆర్థిక ఫలాలు అందరికీ అందడంలేదని భావించిన ప్రభుత్వం 11వ ప్రణాళికలో సమ్మిళితిని ప్రారంభించడం మంచి విషయంగా పేర్కొనవచ్చు.
రగ్నార్ నర్క్స్ వ్యూహం
భారత ఆర్థిక వ్యవస్థలో నర్క్స్ పేర్కొన్న బీదరిక విషవలయ ప్రభావం ఉన్నట్లు గమనించాలి. పొదుపులు జీడీపీలో 30 శాతం దాటినప్పటికీ ఇందులో భౌతిక ఆస్తులు ఉన్నాయి. కాబట్టి విత్త ఆస్తులను పెంచాల్సి ఉంది. అదేవిధంగా తారాపూర్ పేర్కొన్నట్లు డిపాజిట్‌దార్లకు అధిక వడ్డీ ఇవ్వాలి. PMJDY దాదాపు రూ. 20,000 కోట్లు బ్యాంకుల్లోకి తీసుకోవడం జరిగింది.
విస్తరణ ఫలాలు
గున్నార్ మిర్దాల్ విస్తరణ ఫలాలను అమలుచేసి ప్రాంతీయ అసమానతలను నిర్మూలించాలి. దాదాపు 272 జిల్లాలు వెనుకబడినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పారిశ్రామిక రంగంలో మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు ముందంజలో ఉన్నాయి. అదేవిధంగా వ్యవసాయంలో పంజాబ్, హర్యానా, తూర్పు ఉత్తరప్రదేశ్, కోస్తాంధ్ర ముందున్నాయి. ఇలాంటి అసమానతలను నిర్మూలించే వ్యూహాన్ని పాటించాల్సి ఉంది.
జీడీపీ – స్త్రీశక్తి
పురుషుల్లో 50 శాతం కార్మికులుగా ఉంటే స్త్రీలలో 25 శాతం మాత్రమే కార్మికులుగా ఉన్నారు. అంటే జీడీపీని ఇంకా పెంచడంలో స్త్రీలకు అవకాశం కల్పించాల్సిన అవసరం ఉంది.
ముగింపు
భారత ఆర్థిక వ్యవస్థలో విస్తరణ ఫలాలను వేతన వస్తు వ్యూహం, గాంధేయ నమూనాను పాటించి ఆర్థిక ఫలాలు అందరికీ అందించాలి. వ్యవసాయ ప్రధాన ఉత్పాదకం సాగునీరుగా గమనించి GSAను GIAతో సమానంగా చేయాలి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు