సకల జనులు సమ్మెలోనే..
సకల జనుల సమ్మె
# రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా చేపట్టిన ‘సకల జనుల సమ్మె’లో తెలంగాణ సమాజం మొత్తం భాగస్వామ్యమైంది. ఇది శాతియుతంగా 42 రోజులపాటు కొనసాగింది. తెలంగాణ బిల్లును పార్లమెంట్లో కేంద్రం ప్రవేశపెట్టే విధంగా ఒత్తిడి పెంచడంతోపాటు తెలంగాణ భావజాలాన్ని పెంపొందించడానికి రాజకీయ జేఏసీ దీన్ని ప్రారంభించింది. 2011, జూలై 15న అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డికి తెలంగాణ ఉద్యోగ సంఘాలు సమ్మె నోటీసు అందించాయి. అందులో 2011, ఆగస్టు 1 నాటికి తెలంగాణ రాష్ట్ర ఏర్పా టు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు స్పష్టమైన ప్రకటన చేయాలని, లేకపోతే సమ్మె మొదలుపెడుతామని అల్టిమేటం ఇచ్చారు. అయితే తెలంగాణపై కేంద్రం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడంతో 2011, సెప్టెంబర్ 6న సకల జను ల సమ్మె ప్రారంభించాల నుకున్నప్పటికీ గణేష్ ఉత్సవాలను దృష్టిలో ఉంచుకుని సెప్టెంబర్ 13కు మార్చారు.
# అయితే సకల జనుల సమ్మెలో ప్రజలను భాగస్వాములను చేయడానికి సెప్టెంబర్ 12న సన్నాహకంగా కరీంనగర్‌లోని ఎస్ఆర్ఆర్ కాలేజీలో ‘జనగర్జన’ పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఉద్యమానికి మార్గ నిర్దేశం చేయడంతోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు స్పష్టమైన హెచ్చరిక చేయడానికి ఈ సభను జేఏసీ ఏర్పాటు చేసింది. దీనికి వివిధ రాజకీయ పార్టీలు, ఉద్యోగ సంఘాలను తెలంగాణ జేఏసీ ఆహ్వానించింది. ఈ సందర్భంగా సెప్టెంబర్ 13 నుంచి సకల జనుల సమ్మె ప్రారంభమవుతుందని కేసీఆర్ ప్రకటించారు.
# సెప్టెంబర్ 12న రాత్రి 12 గంటలకు సమ్మె ప్రారంభమైంది. ఇందులో పాల్గొనే ప్రభుత్వ ఉద్యోగుల పట్ల కఠినంగా వ్యవహరించాలని సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. విధులకు హాజరుకాని ఉద్యోగుల వేతనాల్లో కోత విధించేందుకు జీఓ నం. 177ని అమ లు చేయాలని పేర్కొన్నారు.
జేఏసీలోని ప్రధాన భాగస్వా మ్య పక్షాలైన టీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ (ఎంఎల్) న్యూడెమొక్రసీలు సమ్మెకు మద్దతిచ్చాయి. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగ సంఘాలు సమ్మె సైరన్ మోగించడంతోపాటు దాదాపు 4 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులు సమ్మెలో పాల్గొన్నారు. వీరితోపాటు విద్యార్థులు, కవులు, కళాకారులు ఇలా యావత్ తెలంగాణ సమ్మెలో పాల్గొన్నది. ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు పడ్డాయి. బడిపిల్లలు రోడ్డెక్కారు. ఉద్యోగులు విధులు, లాయర్లు కోర్టులు బహిష్కరించారు. సమ్మె నాలుగో రోజైన సెప్టెంబర్ 16న టీఎన్జీఓ అధ్యక్షుడు స్వామిగౌడ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ చర్యపై తెలంగాణవాదుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆయనను విడుదల చేశారు. నోవర్క్ నో పే అని ప్రభుత్వం ఉద్యోగులను బెదిరించింది. దీనికి బదులుగా టీఎన్జీఓ ప్రధాన కార్యదర్శి దేవీప్రసాద్ స్పందిస్తూ ‘ఇప్పుడు సమ్మెలో ఉన్న మేమే పెండింగ్ ఫైళ్లు క్లియర్ చేయాలి. అప్పుడు అదనపు జీతం ఇవ్వరు కదా’ అని ప్రభుత్వాన్ని ప్రశించారు. సమ్మె కారణంగా జీతాలు కోల్పోయే ఉద్యోగులకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆ సొమ్మును వడ్డీతో సహా చెల్లిస్తామని, నెల జీతం బోనస్‌గా ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు.
# సమ్మెలో ఆర్టీసీ భాగస్వామ్యం కావడంతో మరింత ఉధృతం అయ్యింది. 2011, సెప్టెంబర్ 19న ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెలోకి దిగారు. అదేరోజు సుమారు 1.90 లక్షల వరకు ఉన్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్, ఎన్ఎంఆర్, ఎన్ఆర్ఈజీఎస్, కాంట్రాక్ట్ లెక్చరర్లు సమ్మెలో పాల్గొన్నారు.
# మరోవైపు ఉస్మానియా యూనివర్సిటీని పోలీసులు రణ రంగంగా మార్చారు. శాంతియుతంగా ర్యాలీ తీసిన విద్యార్థులపై భాష్పవాయు గోళాలు ప్రయోగించారు. మానవ హక్కుల సంఘం ఆదేశాలను బేఖాతరు చేసి హాస్టళ్లలోకి ప్రవేశించి విద్యార్థులను లాఠీలతో చితకబాదారు. డీసీపీ అకున్ సబర్వాల్ నిజాం కాలేజీ విద్యార్థులను రెచ్చగొట్టి వారిని అకారణంగా చితకబాదారు. ఈ లాఠీ చార్జీలో చాలా మంది విద్యార్థులు గాయపడ్డారు. డీసీపీ స్టీఫెన్ రవీంద్ర సమ్మెలో చురుగ్గా పాల్గొంటున్న నాయకులను లక్ష్యంగా చేసుకుని వారిని అరెస్ట్ చేసి చిత్ర హింసలకు గురిచేశాడు.
# తెలంగాణ వైద్య ఆరోగ్య జేఏసీ సెప్టెంబర్ 21 నుంచి సమ్మెలో పాల్గొంటున్నట్లు ప్రకటించింది.
# 2011, సెప్టెంబర్ 22న సకల జనుల సమ్మె పదిరోజులు పూర్తిచేసుకున్న సందర్భంగా సమ్మెకు మద్దతుగా ఖమ్మంలో న్యూడెమొక్రసీ ఆధ్వర్యంలో పోరుగర్జన సభ జరిగింది. తెలంగాణ ఉద్యమ వేడి కేంద్రానికి తెలపాలనే ఉద్దేశంతో రాజకీయ జేఏసీ సెప్టెంబర్ 24న రైల్ రోకో కార్యక్రమాన్ని నిర్వహించింది. వివిధ కులాల వారు వివిధ రూపాల్లో పాల్గొన్నారు.
#2011, అక్టోబర్ 2న తెలంగాణ విషయంలో కేంద్ర నాన్చుడు ధోరణిని నిరసిస్తూ రాజకీయ జేఏసీ భాగస్వామ్య పక్షాలు ఢిల్లీలోని ‘రాజ్‌ఘాట్’లో మౌనదీక్ష చేపట్టారు. అక్టోబర్ 23న సమ్మెలో పాల్గొంటున్న పాలిటెక్నిక్ అధ్యాపకులు ఆందోళన వీడి విధులకు హాజరయ్యారు. ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వం మధ్య చర్చలు జరిగిన తర్వాత జేఏసీతో సంప్రదింపులు జరిగి అర్ధరాత్రి సమయంలో సమ్మె విరమిస్తున్నట్లు స్వామిగౌడ్ ప్రకటించారు. ఈ సందర్భంగా తమకు తెలంగాణ తెచ్చే సత్తా లేదని తొలి నుంచి చెబుతూనే ఉన్నామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తట్టిలేపడమే లక్ష్యంగా సకల జనుల సమ్మె చేశామని ఆయన పేర్కొన్నారు. ఇలా 2011, సెప్టెంబర్ 13 నుంచి అక్టోబర్ 24 వరకు 42 రోజులు ఒక అద్భుతమైన చరిత్రలో నిలిచిపోయే సమ్మె జరిగింది. ఈ సమ్మె ద్వారా ప్రపంచానికి తెలంగాణ అస్తిత్వ పోరాటాన్ని తెలపగలిగాం అని కోదండరాం తెలిపారు. ఈ సమ్మెవల్ల తెలంగాణ ద్రోలెవ్వరో ప్రజలు స్పష్టంగా తెలుసుకోగలిగారు. సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో 80 శాతం మంది సీమాంధ్ర ప్రాంతానికి చెందినవారేనని ఈ సమ్మె ద్వారా తెలిసిపోయింది. ఉద్యోగ నియామకాల్లో ఎంత దోపిడి జరిగిందో దీనిద్వారా తెలుస్తున్నది.
సాగరహారం
# రాష్ట్ర సాధన కోసం రాజకీయ జేఏసీ 2012 సెప్టెంబర్ 30న హైదరాబాద్‌లో తెలంగాణ మార్చ్ (సాగరహారం) నిర్వహించింది. కేంద్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టాలనే ఒకే ఒక్క డిమాండ్‌తో తెలంగాణ మార్చ్ కి జూలై 7న పిలుపునిచ్చింది. అయితే దీన్ని సాగరహారంగా పేరు మార్చారు. ‘ఇంటికో మనిషి, చేతిలో జెండా- చలో హైదరాబాద్’ నినాదంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దీనికోసం గ్రామాల్లో చైతన్య కార్యక్రమాలను రూపొందించింది.
#సెప్టెంబర్ 9న మాణికేశ్వర్‌నగర్ నుంచి ర్యాలీ, 13వ తేదీన సకల జనుల సమ్మె జరిగి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా అన్ని జిల్లా, మండల కేంద్రాల్లో పునరంకిత దీక్షలు, 16న కరీంనగర్ కవాతు పేరుతో ర్యాలీ, 17న తెలంగాణ వ్యాప్తంగా విలీన దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించారు.
# సెప్టెంబర్ 29న గణేష్ నిమజ్జనంతోపాటు, అక్టోబర్ 1న ఐక్యరాజ్యసమితి జీవవైవిద్యం సదస్సుకు హైదరాబాద్ ఆతిథ్యం ఇవ్వనుండటంతో ప్రభుత్వం తెలంగాణ మార్చ్‌కి అనుమతించలేదు. అయితే తెలంగాణ మార్చ్ సందర్భంగా ఎలాంటి హింసాత్మక సంఘటనలు జరగవని, జేఏసీ లిఖిత పూర్వక హామీ ఇవ్వడంతోపాటు తెలంగాణప్రాంత పెద్దమనుషులు, మంత్రుల జోక్యంతో ప్రభుత్వం అనుమతిచ్చింది. తెలంగాణ మార్చ్ వేదికను ట్యాంక్‌బండ్ నుంచి నెక్లెస్ రోడ్డుకు మార్చుకోవాలని సూచించింది.
# తెలంగాణ మార్చ్ హైదరాబాద్‌లో పలుచోట్ల నుంచి ప్రారంభమైంది. గన్‌పార్క్ స్థూపం, ఇందిరాపార్క్, ఖైరతాబాద్ ఫ్లెఓవర్, సికింద్రాబాద్ క్లాక్ టవర్ ఇలా అనేక చోట్ల నుంచి ఊరేగింపులు, ర్యాలీలు ఉదయం 11 గంటల నుంచే ప్రారంభయ్యాయి. నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన సాగరహారానికి పోలీసులు ఎన్ని నిర్భందాలు విధించినప్పటికి బారికేడ్లు, ఇనుప కంచెలను తెంచుకుని తెలంగాణ ఉద్యమ కారులు లక్షలాదిగా తరలివచ్చారు. తెలంగాణలో ఉన్న కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు తప్ప అన్ని రాజకీయ పార్టీలు సాగరహారానికి వచ్చాయి. గద్దర్, విమలక్క వంటి ఉద్యమకారులు జేఏసీలో భాగం కానప్పటికీ తెలంగాణ మార్చ్ కి తమ కార్యకర్తలు, కళాకారులతో వచ్చారు. వివిధ ప్రజా సంఘాలు, విద్యార్థులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, మహిళలు ర్యాలీగా సాగరహారానికి వచ్చారు. అయితే ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి తెలంగాణ మార్చ్ కి ర్యాలీగా వెళ్లడానికి ప్రయత్నించిన విద్యార్థులను పోలీసులు అడ్డుకోవడంతో పోలీసులు, విద్యార్థుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. దీంతో రాళ్లు విసరడం, భాష్పవాయు గోళాలు ప్రయోగించడం లాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రభుత్వం ఇచ్చిన సమయం రాత్రి 7 గంటలు దాటినప్పటికి ఎవ్వరూ కదల వద్దని, ఇక్కడే శాంతియుతంగా నిరసన తెలపాలని వేదిక పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ఉద్యమకారులపై పోలీసులు భాష్పవాయువులను ప్రయోగించారు. అయితే రాత్రి భారీ వర్షం కురవడంతో తెలంగాణ మార్చ్ ని నిలిపివేస్తున్నట్లు 11గంటల 30 నిమిషాలకు జేఏసీ నేతలు ప్రకటించారు. తర్వాత తెలంగాణ మార్చ్ ఘటనలపై నిర్వాహకులపై పీడీ యాక్ట్ ప్రయోగించిన ప్రభుత్వం 35 కేసులను నమోదు చేసింది. దీనికి నిరసనగా గాంధీ జయంతి రోజున బాపూఘాట్ వద్ద జేఏసీ ‘మౌన దీక్ష’ చేపట్టింది.
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కోరుట్ల
9492 575 006
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు