హైదరాబాద్ రాష్ట్రం – నీటిపారుదల (తెలంగాణ ఉద్యమ చరిత్ర)
నీటిపారుదల శాఖ ఏర్పాటు
# 1897లో పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్ నుంచి శాశ్వతంగా నీటి పారుదల శాఖను వేరుచేసింది ప్రభుత్వం. త్వరితగతిన చెరువుల పునరుద్ధరణ జరగడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతి జిల్లాలో ఒక ఇరిగేషన్ ఇంజినీర్‌ను, అతని కింద అవసరమైన సిబ్బందిని, వ్యవస్థను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. హైదరాబాద్ నీటిపారుదల శాఖకు చీఫ్ ఇంజినీర్‌ను అత్యున్నత అధికారికగా నియమించారు.
# మద్రాస్ ప్రభుత్వంలో పనిచేస్తున్న ‘రోస్ అలేన్’ అనే నైపుణ్యం కలిగిన అధికారిని రప్పించి చీఫ్ ఇంజినీర్ ఇరిగేషన్‌గా నియమించారు. 1903 నాటికి చీఫ్ ఇంజినీర్ హోదాను ‘సూపరింటెండింగ్ ఇంజినీర్’గా మార్పు చేశారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో సంభవిస్తున్న కరువు, కాటకాల నుంచి ప్రజలను రక్షించడానికి బ్రిటిష్ ప్రభుత్వం 1901లో ‘ఇండియన్ ఇరిగేషన్ కమిషన్’ను నియమించినప్పుడు నిజాం ప్రభుత్వం ఆ కమిషన్ విచారణలో భాగం కాకుండా తమ సొంత విచారణ చేపట్టింది.
బావుల కింది సేద్యం
# 20వ శతాబ్దం ప్రారంభంలో నిజాం ప్రభుత్వం ‘ఇరిగేషన్ డిపార్ట్ మెంట్’ చెరువులు, కుంటల పునరుద్ధరణ, నిర్వహణ, నీటి వసతి విస్తరణ వంటి పనులకే తెలంగాణలో ప్రాధాన్యం ఇచ్చింది. తెలంగాణలో వ్యవసాయ బావులు కూడా పెద్ద సంఖ్యలో ఉండేవి. ఆదిమ కాల పద్ధతుల్లో ఎడ్లు, మోట బొక్కెనతో బావుల నుంచి నీరు తోడి సాగుకు వినియోగించేశారు.
# 19వ శతాబ్దం చివరి నాటికి వ్యవసాయ బావుల అభివృద్ధిపై కూడా నిజాం ప్రభుత్వం దృష్టిపెట్టి ఒక విధానాన్ని రూపొందించింది. అంతకు పూర్వం 1884లోనే బావుల వ్యవసాయంపై అధ్యయనం చేయడానికి ఆరో నిజాం ప్రభుత్వం ఒక కమిటీని నియమించింది.
# నిజాం పాలనలో బావుల కింద సేద్యంపై కొన్ని రాయితీలను రైతులకిచ్చినా, శిస్తు కూడా వసూలు చేయడం జరిగింది. 1903 నాటికి సరాసరి ఒక గ్రామానికి 78 వ్యవసాయ బావులుండేవి. హైదరాబాద్ సంస్థానంలోని 16,097 ఖాల్సా గ్రామాల్లో 1,25,639 వ్యవసాయ బావులుండేవి. వీటిలో 28,557 బావులు 1890 తర్వాత నిర్మించినవే. సంస్థానంలోని మొత్తం వ్యవసాయ బావుల్లో 53,084 తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి. ఒక్క వరంగల్ జిల్లాలోనే 1903 నాటి వ్యవసాయ బావుల సంఖ్య 14,001. 1903లో హైదరాబాద్ ప్రభుత్వానికి భూమి శిస్తు ద్వారా వచ్చిన ఆదాయం రూ.2,43,06,000.
#ఇతర రంగాల నుంచి వచ్చే మొత్తం ఆదాయం కంటే ఇది రెండు రెట్లు ఎక్కువ. నీటి వసతిగల భూమిపైనే ఎక్కువ శిస్తు వచ్చేది. కరువు నివారణ కోసం సాగునీటి వసతిని పెంచినా, భూమి శిస్తు ద్వారా ప్రభుత్వ ఆదాయం బాగా పెరుగుతుండటంతో 6వ, 7వ నిజాంలు తమ పాలనలో అన్ని రంగాల కంటే ఎక్కువ ప్రాధాన్యం సాగునీటి రంగానికి ఇచ్చారు.
ఇండియన్ ఇరిగేషన్ కమిషన్ నివేదిక
# 1901లో సర్ కొల్లిన్ స్కాట్ మోన్రీఫ్ చైర్మన్‌గా ఇండియా ప్రభుత్వం నియమించిన ‘ఇండియన్ ఇరిగేషన్ కమిషన్’ తమ నివేదికను 1903లో సమర్పించింది. ఈ నివేదికలో చేసిన సిఫారసులు, సూచనలకు నిజాం ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. కృష్ణా, గోదావరి నదుల నీరు వృథాగా సముద్రం పాలవుతున్నదని కమిషన్ పేర్కొంది. హైదరాబాద్ సంస్థానంలోని నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలతోపాటు కొన్ని కన్నడ, మరాఠ్వాడా ప్రాంతాలు తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే భవిష్యత్తులో ఎడారిగా మారే ప్రమాదం ఉందని కమిషన్ హెచ్చరించింది.
# కమిషన్ సూచనలను పరిగణలోకి తీసుకున్న ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్, దివాన్ మహరాజా కిషన్ పెర్షాద్లు సాగునీటి రంగానికి సంబంధించి పలు మార్పులకు శ్రీకారం చుట్టారు. నీటి పారుదల శాఖ అధికారులతో ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించింది ప్రభుత్వం. 20వ శతాబ్దం ప్రారంభం నుంచి చిన్న నీటి వనరులైన బావులు, కుంటలు, చెరువులు, కత్వల అభివృద్ధికి అత్యంత ఎక్కువ ప్రాధాన్యమిచ్చింది నిజాం ప్రభుత్వం.
# 1927లో ‘ఫర్మాన్-ఇ-ముబారక్’ ద్వారా ‘వెల్ సింకింగ్’ డిపార్ట్మెంట్ను నెలకొల్పింది ఏడో నిజాం ప్రభుత్వం. ఆ తదుపరి కాలంలో ప్రతి ఏటా రెండు, మూడు వేల బావులను ఈ శాఖ ద్వారా హైదరాబాద్ సంస్థానంలోని దుర్భిక్ష ప్రాంతాల్లో నిర్మించారు. నల్లగొండ జిల్లాలో బావుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యమిచ్చారు.
చెరువుల మరమ్మతు
# చెరువుల మరమ్మతులకు, అభివృద్ధికి నిజాం ప్రభుత్వం కోట్లాది రూపాయలను ప్రతి ఏటా ఖర్చుచేసేది. 1903-07 మధ్య కాలంలో తెలంగాణలోని దాదాపు అన్ని పెద్ద చెరువులకు మరమ్మతులు చేశారు. వీటిలో కాకతీయుల కాలంలో నిర్మించిన రామప్ప, పాకాల, లక్నవరం, ధర్మసాగర్ వంటి పెద్ద చెరువులు కూడా ఉన్నాయి. 1906లో కేవలం ఒకే ఏడాది తెలంగాణలో, గుల్బర్గాలో రూ.78,19,046 ఖర్చుచేసి 463 చెరువులు, కుంటలకు మరమ్మతులు చేసింది ఆరో నిజాం ప్రభుత్వం.
చీఫ్ ఇంజినీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్ కృషి
# తెలంగాణలో 20వ శతాబ్దపు పూర్వార్థ భాగంలో ప్రాజెక్టులు, రిజర్వాయర్ల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసి, అమలుపర్చిన మహనీయుడు హైదరాబాద్ నివాసి అప్పటి చీఫ్ ఇంజినీర్ నవాబ్ అలీ నవాజ్ జంగ్. నిజాం ప్రభుత్వ స్కాలర్‌షిప్‌పై 1896లో ఇంగ్లండ్ వెళ్లి లండన్‌లోని ‘కూపర్స్ హిల్ కాలేజీ’లో ఇంజినీరింగ్ విద్యనభ్యసించారు. 1899లో తిరిగి వచ్చి పీడబ్ల్యూడీలో అసిస్టెంట్ ఇంజినీర్‌గా చేరి 1918లో చీఫ్ ఇంజినీర్ అయ్యారు.
ప్రాజెక్టులు
ఘన్పూర్ ఆనకట్ట
# కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగంలో భాగంగా మంజీరా నదిపై మెదక్ జిల్లాలో 2,446 అడుగుల పొడవుగల ఘన్పూర్ (గున్నవరం) ఆనకట్టను 1900లో ప్రారంభించారు. మంజీరా గోదావరికి ఉపనది. ఈ ఆనకట్ట నుంచి మహబూబ్‌నహర్, ఫతేనహర్ కాల్వల ద్వారా సుమారు 17 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీటి వసతి సమకూరింది. మెదక్ జిల్లాలో మంజీరా నదిపై నిర్మించిన ఈ ఘన్పూర్ ఆనకట్ట కుడివైపు మహబూబ్‌నహర్ కాల్వను 1900లో ప్రారంభించి 1904లో పూర్తిచేశారు. దీని ద్వారా 10 వేల ఎకరాలకు సాగునీటిని అందించారు.
# ఎడమవైపు ఫతేనహర్ కాల్వను నిర్మించి మరో ఏడువేల ఎకరాలకు సాగునీరందించారు. కుడి కాల్వకు రూ.31.40 లక్షలు, ఎడమ కాల్వకు రూ.4.5 లక్షలు ఖర్చచేసింది మీర్ ఉస్మాన్ అలీఖాన్ ప్రభుత్వం. ఫతేనహర్ కాల్వ పొడిగింపుతో ఐదువేల ఎకరాలు 1926 నాటికి సాగులోకి వచ్చాయి. ఘన్పూర్ ఆనకట్ట కింద ఈ రెండు కాల్వల ద్వారా 20 వేల ఎకరాలు కృష్ణా ఉపనది అయిన మూసీ నదిపై హైదరాబాద్, నల్లగొండ జిల్లాల్లో 30కి పైగా కత్వలు ఉన్నాయి.
# ఆసిఫ్ నహర్: వలిగొండ సమీపంలో మూసీపై నిర్మించిన ఆసిఫ్ నహర్ కత్వ నుంచి నల్లగొండలోని పానగల్ చెరువు వరకు కాల్వను నిర్మించారు. దారి పొడవునా ఉన్న 308కి పైగా చిన్న, పెద్ద చెరువులను మూసీ నీటితో నింపుతారు. ఈ ప్రాజెక్టుకు 1910లో రూ.6,25,349 వ్యయం చేశారు.
#పోచారం: నిజామాబాద్ జిల్లాలో ఉన్న పోచారం చెరువును మహబూబ్‌నహర్ కాల్వతో కలిసి రూ.32 లక్షల వ్యయంతో 1922లో పోచారం ప్రాజెక్టును నిర్మించారు. దీని ద్వారా సుమారు 13,000 ఎకరాలకు సాగునీరందుతున్నది.
# నిజాంసాగర్: 1923లో మంజీరా నదిపై 30 టీఎంసీల నీటిని నిల్వ చేయగల సామర్థ్యంతో నిజాంసాగర్ ప్రాజెక్టును ప్రారంభించి 1931లో పూర్తిచేశారు. ఇది ఆసియా ఖండంలోనే ఆ తరహా నిర్మాణాల్లో మొదటిది. 1916లోనే అలీ నవాజ్ జంగ్ దీనిపై సర్వే ప్రారంభించారు. 58 టీఎంసీలతో నిజాంసాగర్ 3,20,000 ఎకరాలకు సాగునీరందించాలనుకున్నారు. ఆ తర్వాత 52 టీఎంసీలతో రెండు లక్షలకు సాగునీరందించారు. అలీనవాజ్ జంగ్ జన్మదినమైన జూలై 11ను 2014 నుంచి ‘తెలంగాణ ఇంజినీర్స్ డే’గా నిర్వహిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. మద్రాస్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి తుంగభద్ర డ్యాం ద్వారా నీటిని వినియోగంలోకి తెచ్చిన ఘనత కూడా నవాజ్ అలీ జంగ్‌దే (ఢిల్లీలో హైదరాబాద్ హౌస్ ఈయన సృజనే).
# తుంగభద్ర ప్రాజెక్టు: తుంగభద్ర జలాలను సమష్టిగా వినియోగించుకోడానికి మద్రాస్, హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంప్రదింపులు జరిగాయి. హోస్పేటకు 3 కి.మీ. దూరంలో మల్లాపురం వద్ద తుంగభద్ర రిజర్వాయర్‌ను నిర్మించి 20 లక్షల ఎకరాలు సాగులోకి తేవాలని ఆర్థర్ కాటన్ 1861లోనే సర్వే చేశారు. హైదరాబాద్ సంస్థానానికి చెందిన 145 చ.మైళ్ల విస్తీర్ణపు భూమి తుంగభద్ర ప్రాజెక్టు కింద ముంపునకు గురవుతుందని, 44 గ్రామాల్లోని 26 వేల మంది నిరాశ్రయులవుతారని రూ.90 వేల ఆదాయాన్ని ప్రభుత్వం ఏటా నష్టపోతుందని నిజాం తుంగభద్ర ప్రాజెక్టు నిర్మాణానికి అభ్యంతరాలు తెలిపారు. 75 వేల ఎకరాలకు మాత్రమే సాగునీరందించాలని నిర్ణయించారు.
# 1908లో మూసీ నది వరదలు హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తినప్పుడు మైసూర్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను పిలిపించి ఉస్మాన్‌సాగర్ (గండిపేట), హిమాయత్సాగర్లను నిర్మించారు. సంస్థానంలో విశ్వేశ్వరయ్య పనిచేసిన కాలాన్ని ‘ఎరా ఆఫ్ రిజర్వాయర్స్’గా పిలిచారు. 1920లో ఉస్మాన్‌సాగర్, 1926లో హిమాయత్‌సాగర్‌లు పూర్తయ్యాయి. నిజాంసాగర్ నిర్మాణంతోపాటు పాలేరు, వైరా, డిండి, అప్పర్ మానేరు ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టింది నిజాం ప్రభుత్వం.
సాసాల మల్లికార్జున్
అసిస్టెంట్ ప్రొఫెసర్
ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, కోరుట్ల
9492 575 006
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు