The 1969 movement | అన్యాయంపై అంకుశం 1969 ఉద్యమం
1969 ప్రత్యేక తెలంగాణ ఉద్యమం
-ఉద్యమాన్ని ప్రారంభించి తెలంగాణ రాష్ట్రం సాధించేదాకా ఆపకూడదనే ఆలోచనతో కార్యాచరణకు మొదటిసారిగా పూనుకున్నది ఖమ్మం జిల్లా ఇల్లందు దగ్గరలోని గేటుకారేపల్లికి చెందిన కొలిశెట్టి రామదాసు. ఆంధ్ర ఆధిపత్యవాదులచే ఇబ్బందులకు, వివక్ష, నిర్లక్ష్యానికి, అవమానాలకు గురైన తెలంగాణ వారికి 1954-56లో విశాలాంధ్ర వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని విఫలమై అసంతృప్తికి, అశాంతికి గురైన ఇంకెందరికో తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనే ఆలోచన 1956 నుంచే ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ ఆ ఆలోచనను అమలుచేయడానికి, కష్టాలనెదుర్కోవడానికి సిద్దమై ఒక్కొక్కరిని చేరదీసి, జిల్లాలన్నీ తిరిగి నాయకులు, కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులను కలిసి 1969 జనవరిలో ఖమ్మంలో డిగ్రీ విద్యార్థి రవీంద్రనాథ్‌తో రెండు వారాలు ఆమరణ దీక్ష చేయించిన మార్గదర్శి కొలిశెట్టి రామదాసు.
తెలంగాణ ప్రాంతీయ సమితి ఏర్పాటు
-1968 ఎండాకాలంలో తెలంగాణ ప్రాంతీయ సమితిని సుమారు 20మంది యువకులతో ఇల్లందులో ఏర్పాటు చేశారు. దానికి రామదాసు అధ్యక్షునిగా, ముత్యం వెంకన్న ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. కొద్దిరోజుల్లోనే వెయ్యి మంది యువకులు ఇందులో చేరి చురుగ్గా పనిచేయడం మొదలుపెట్టారు. ఏయే ప్రభుత్వ కార్యాలయాలు, సింగరేణిలో ఎంతమంది దొంగ ముల్కీలున్నారో లెక్కలు తీయడం మొదలుపెట్టారు. సేకరించిన పేర్లు ఆయా కార్యాలయాల్లోని ఉన్నతాధికారులకు ఇచ్చి విచారణ జరిపి దొంగముల్కీలను ఉద్యోగాల్లోంచి తొలగించాలని రామదాసు అడిగేవారు. అయితే వీరి మాటలనెవ్వరూ పట్టించుకోలేదు. తమ డిమాండ్లను సాధించడానికి ఇల్లందు సెంటర్లో ప్రభుత్వ కార్యాలయాల ముందు తెలంగాణ ప్రాంతీయ సమితి ధర్నాలు, నిరాహారదీక్షలు నిర్వహించింది. స్థానిక ఉద్యోగులు, పెద్దలు చందాలిచ్చి సహకరించేవారు. 1969 తెలంగాణ ఉద్యమానికి ముందు 1968లో మొదటిసారి హైదరాబాద్‌కు అవతల ముల్కీ సమస్యలపై ఇల్లందులోనే ఉద్యమం మొదలైంది.
-సమైక్య రాష్ట్రంలో ముల్కీలకు న్యాయం జరగలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితేనే తెలంగాణ వారికి ఉద్యోగాలు లభిస్తాయి. పొలాలకు సాగునీరు వస్తుందని భావించిన రామదాసు తెలంగాణ ఉద్యమ నిర్మాణానికి ఇల్లందు నుంచి సన్నాహలు మొదలుపెట్టారు.
కొత్తగూడెం తదితర ప్రాంతాల్లో నిరసనలు
-1968 ఏప్రిల్ 30న ప్రభుత్వం వివిధ శాఖలను తెలంగాణ ప్రాంత స్థానికులకు కేటాయించిన ఉద్యోగాలు అర్హులైన స్థానికులకు లభించకపోతే ఆ ఖాళీలను అలాగే ఉండనివ్వాలని ఆదేశించింది. అంతేగాక స్థానికులకు కేటాయించిన ఆ ఉద్యోగాల్లో షరతులతో నియమించి స్థానికేతరులను 3నెలల్లోపు తొలగించి ఆ స్థానాల్లో అర్హతలున్న స్థానికులను నియమించాలని ప్రభుత్వం ఆదేశించింది.
-ఈ కారణాల వలన ఆంధ్ర ప్రాంతానికి చెందిన చాలామంది ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులు తమ ఉద్యోగాలను పోగొట్టుకున్నారు. అదే సమయంలో ఈ ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలక్ట్రిసిటీ బోర్డులో కూడా అమలుచేసింది ప్రభుత్వం. పర్యవసానంగా కొత్తగూడెం థర్మల్ ప్లాంటులో గతంలో నియమింపబడిన స్థానికేతరులు ఉద్యోగాల నుంచి తొలగించబడ్డారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోమని ఈ స్థానికేతర ఉద్యోగులకు సలహా ఇచ్చినట్లు తెలంగాణ నాన్-గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అభిప్రాయపడింది.
-కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్లో తొలగించబడిన ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన జస్టిస్ అల్లాడి కుప్పుస్వామి 1969, జనవరి 3న తీర్పునిస్తూ ఏపీఎస్ఈబీ స్వతంత్ర సంస్థ కావడంతో ఈ సంస్థ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ పరిధిలోకి రాదని స్పష్టం చేశారు. అయితే తీర్పు వెలవడక పూర్వమే కొత్తగూడెం థర్మల్ పవర్‌ప్లాంట్‌లోని నాన్-ముల్కీ ఉద్యోగులందరినీ 1969 జనవరి 10లోగా తొలగించాలని కార్మిక సంఘం ఆందోళనకు సిద్దమైంది.
-1969, మార్చి 7న జస్టిస్ పీ జగన్మోహన్ రెడ్డి, జస్టిస్ ఆవుల సాంబశివరావులతో కూడిన డివిజన్ బెంచ్ ఈ అప్పీల్‌ను విచారించి సింగిల్ జడ్జి అల్లాడి కుప్పుస్వామి 1969, జనవరి 3న ఇచ్చిన తీర్పును సమర్ధించింది. అంటే విద్యుచ్చక్తి బోర్డుకు ముల్కీ రూల్స్ వర్తించవు. కేటీపీఎస్ కార్మిక సంఘ కార్యదర్శి సీవై గిరి విడుదల చేసిన ప్రకటన ఇలా ఉన్నది..
-ఖమ్మం జిల్లా పాల్వంచలో దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రధానమైన విద్యుత్ కేంద్రాన్ని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ అనే పేరుతో 1961లో స్థాపించారు. తెలంగాణ నిధుల నుంచి ఈ ప్రాజెక్టుకు డబ్బును కేటాయించారు. స్థానిక రైతులు 1300ఎకరాల భూమిని దీని నిమిత్తం కోల్పోయారు. ప్రాజెక్టు పనుల నిమిత్తం అనేకమంది ఉన్నతాధికారులు కావాలని ఆంధ్ర ప్రాంతీయులను నియమించారు. ఎంతో అనుభవమున్న తెలంగాణ వారిని మొదటి నుంచే పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రాంతీయ అభిమానం వల్ల ఆంధ్ర అధికారులు తమ ప్రాంతానికి చెందిన అనేక మందిని ఇక్కడికి పిలిపించి, పూర్తిగా ముల్కీ నిబంధనలను ఉల్లఘించి ఉద్యోగాలు ఇచ్చారు.
-స్థానికంగా భూములు కొల్పోయిన వారికి కూడా ఉద్యోగాలివ్వలేదు. ప్రతి చిన్న పనులకు కూడా అంటే ఎన్ఎంఆర్ రోజువారీ కూలి పనులకు కూడా ఆంధ్రా జిల్లాల నుంచి పిలిపించడం మరీ ఘోరమైన విషయం. ఇప్పటికీ ఈ పని జరుగుతూనే ఉన్నది.
-ఇప్పుడు ఆంధ్రా అధికారులు తమ ప్రాంతీయులకు ఉద్యోగాలు కట్టబెట్టడానికి వారిని మొదట ఎన్‌ఎంఆర్‌గా తీసుకొని 2, 3 నెలల తర్వాత అనుభవం పేరుతో ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతున్నది. దాదాపు 1200 ఉద్యోగాల్లో తెలంగాణ వారు 200లోపు మాత్రమే ఉన్నారు. ప్రాజెక్టు కోసం భూములు కొల్పోయిన వారిపై కూడా ఉన్నతాధికారులు సానుభూతి చూపకపోవడం చాలా విచిత్రం.
-తెలంగాణలో అన్ని రకాలుగా అంటే ఇంజినీరింగ్ డిప్లొ మా, డీఈఐ, ఇతర డిగ్రీలు, హెచ్ఎస్సీ వరకు చదివిన వారు 80వేల వరకు ఉన్నప్పటికీ ఈ ఉద్యోగాలు ఇవ్వడానికి మనసొప్పలేదు. తెలంగాణ రక్షణలను భూస్థాపితం చేశారు. వీరు చేసిందే సబబన్నట్లు అటు ప్రభుత్వం కానీ, ఇటు ఏపీఎస్ఈబీ కానీ ఏమీ తెలియనట్లు వ్యవహరించారు. అధికారుల ప్రాంతీమాయాభిమాన వైఖరులను ఎప్పటికప్పుడు బోర్డు అధ్యక్షునికి, ప్రభుత్వం దృష్టికి తెచ్చినా ఫలితం లేకపోయింది. ప్రభుత్వం, బోర్డు మొండి వైఖరులను విడనాడి తెలంగాణ ప్రజలకు న్యాయం, ధర్మం చేకూర్చేందుకు ముల్కీ నిబంధనలు అమలు చేయాలని ప్రార్థ్ధించిన ప్రయోజనం లేకపోయింది.
-అనేక రకాలుగా ఇచ్చటి అధికారులతో, బోర్డు అధ్యక్షులతోనూ సంప్రదింపులు జరిపి విసిగిపోయి చివరికి అత్యంత బాధతో తెలంగాణ రక్షణలు ఈ ప్రాజెక్టులో తూ.చా తప్పకుండా అమలుపరచేందుకు ప్రభుత్వం పూనుకోకపోతే 1969, జనవరి 10 నుంచి ఆమరణ నిరాహారదీక్షలు కొనసాగించాలని నిర్ణయించారు. కాబట్టి తెలంగాణ ప్రజలందరికి సవినయంగా మనవి చేసేదేమిటంటే, తెలంగాణ రక్షణలకోసం మేము చేస్తున్న ఈ పోరాటానికి చేయూతనిచ్చి, ధర్మంగా మనకు రావాల్సిన ఉద్యోగాలు పొందవలసినదిగా యువతరానికి విజ్ఞప్తి చేస్తున్నాం. (జనధర్మ వారపత్రిక 1969, జనవరి 2, వరంగల్)
-ఈ విధంగా పై ప్రకటన వెలువడిన తర్వాత హైకోర్టు తీర్పు (నాన్‌ముల్కీ) తొలగించబడిన కేటీపీఎస్ ఉద్యోగుల పక్షాన రావడం తెలంగాణవాదులకు మరింత ఆగ్రహం తెప్పించింది.
రవీంద్రనాథ్ ఆమరణ నిరాహారదీక్ష
-తెలంగాణ రక్షణల అమలు, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం విద్యార్థులు ఉద్యమంలోకి రావాలనే ఆలోచనలో భాగంగా ఖమ్మంలో అన్నాబత్తుల రవీంద్రనాథ్‌తో ఆమరణ నిరాహారదీక్ష మొదలుపెట్టించారు కొలిశెట్టి రామదాసు. 1968లో 18 నెలల పాటు టీఎన్జీవోలు, కార్మికులు, నిరుద్యోగుల ఆందోళనలు నిర్వహించిన తర్వాత విద్యార్థులను ఉద్యమంలోకి దించాలనే ఆలోచన వచ్చింది.
-1968 అక్టోబర్ 20-28ల మధ్య తెలంగాణ జిల్లాల్లో పర్యటించి నాయకులు, ప్రజలు, విద్యార్థుల మనోభావాలను గ్రహించారు. తెలంగాణ ఉద్యమాన్ని ప్రజ్వలింపజేయాలంటే ఎక్కడో ఒక దగ్గర నిప్పురవ్వలు రాజేయాలి, ఆ నిప్పురవ్వే దావానలమై తీరుతుంది. పల్లెపల్లె పట్టణాలు చుట్టుముట్టి తీరుతుందని భావించి ఖమ్మం పట్టణాన్ని కార్యక్షేత్రంగా మలుచుకున్నారు కొలిశెట్టి రామదాసు. అంతకు కొన్నేళ్ల ముందు రామదాసు చదువుకున్నది ఖమ్మం కాలేజీలోనే కావడం వలన తన స్నేహితుల సహాయంతో విద్యార్థులను ఉద్యమంలోకి సమీకరించగలిగారు. 1968 నవంబర్, డిసెంబర్ నెలల్లో ఖమ్మంలోనే స్నేహితుల ఇళ్లల్లో ఉంటూ కాలేజీలకు వెళ్లి విద్యార్థులను రామదాసు కలిసేవాడు. సుధాకర్‌రాజుతో కలిసి డిగ్రీ కాలేజీలో విద్యార్థులను కలిసినప్పుడు విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఓటమిపాలైన బీఏ రెండో ఏడాది విద్యార్థి రవీంద్రనాథ్ ఆమరణదీక్షకు తాను సిద్ధమేనని వారికి చెప్పారు. ఆ తర్వాత నెలపాటు రామదాసు, సుధాకర్‌రాజు వరంగల్, హైదరాబాద్, ఇతర జిల్లాల విద్యార్థులు, నాయకులతో మాట్లాడి దీక్ష 1969 జనవరి 8న మొదలుపెట్టాలనుకున్నారు.
తొలిసారి ప్రత్యేక తెలంగాణ నినాదం
-1968 డిసెంబర్ 30న కొత్తగూడెంలో జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల ప్రవేశోత్సవ సభల్లో పాల్గొనడానికి శాసనమండలి అధ్యక్షుడు పిడతల రంగారెడ్డి, తెలంగాణ ప్రాంతీయసంఘం అధ్యక్షులు జే చొక్కారావు వచ్చినప్పుడు తెలంగాణ హక్కుల రక్షణ సమితి పెద్దఎత్తున ఊరేగింపు ప్రదర్శనలు చేసి ప్రత్యేక తెలంగాణ నినాదాలిచ్చారు..
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు