మేలైన విత్తన ఎంపిక.. అన్నదాతకు నష్టం ఉండదిక!
వ్యవసాయం- పంటలు
(Agriculture and Crops)
-పంటలు పండించడాన్ని వ్యవసాయం అంటారు. మనకు ఉపయోగపడే మొక్కలను అధిక సంఖ్యలో పెంచడాన్ని పంట అంటారు.
– మన రాష్ట్రంలో కొన్ని దశాబ్దాల క్రితం వరకు దాదాపు 5400 రకాల వరి వంగడాలు, 3500 వంకాయ రకాలు ఉండేవి.
వ్యవసాయ పద్ధతులు
– భారతదేశంలో వ్యవసాయంలో అనేక పద్ధతులను ఉపయోగిస్తారు.
పోడు వ్యవసాయం
– ఇది అతిపురాతనమైన వ్యవసాయ పద్ధతి. ఈ విధానం ద్వారా అటవీ ప్రాంతంలో చెట్లు నరికి వాటిని వ్యవసాయ భూములుగా మార్చి కొన్ని సంవత్సరాల పాటు, సారం కోల్పోయే దాకా సాగు చేస్తారు. అనంతరం వేరే ప్రాంతానికి వెళ్లి అక్కడ చెట్లను నరికి భూమిని చదును చేసి వ్యవసాయం ప్రారంభిస్తారు. పోడు వ్యవసాయాన్నే జూమ్ వ్యవసాయం అని కూడా పిలుస్తారు. పోడు వ్యవసాయం అటవీ ప్రాంతంలో నివసించే గిరిజనులు చేస్తారు. వీరు సంచార జీవనాన్ని గడపడం వల్ల వ్యవసాయ క్షేత్రాన్ని కూడా మారుస్తుంటారు. ప్రస్తుతం తెలంగాణలో పోడు వ్యవసాయం ఎక్కువగా ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో ఎక్కువగా చేస్తున్నారు. పోడు వ్యవసాయం వల్ల వేలాది ఎకరాల అడవి ధ్వంసం అవుతుండటంతో ప్రభుత్వం ఈ విధానాన్ని నిషేధించింది. అనేక అటవీ చట్టాలను రూపొందించి పోడు వ్యవసాయాన్ని అడ్డుకుంటుంది.
మిశ్రమ/సంకర జాతి వ్యవసాయం
– వ్యవసాయ పంటల సాగు, పశు పోషణ కలిపి చేసే విధానాన్ని మిశ్రమ వ్యవసాయం అంటారు. ఈ విధానంలో ఒకేకాలంలో ఒకే ప్రదేశంలో రెండు లేదా మూడు రకాల పంటలను సాగుచేస్తారు. ఈ సాగు విధానంలో ఎక్కువ రకాల పంటలను ఒకేసారి పండిచే అవకాశం ఉంటుంది. పంటల సాగుకు ఉపయోగించడానికి పశువులను పోషిస్తారు. వ్యవసాయంతో పాటు పశు పోషణ చేయడం వల్ల అదనపు సంపాదన ఆర్జించవచ్చు. మిశ్రమ సాగు విధానంతో వివిధ రకాల పంటల సాగు చేయడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ దిగుబడి, ఆర్జన పొందవచ్చు.
సాంద్ర వ్యవసాయం
-ఆధునిక పద్ధతుల్లో సాగు చేసి ఎక్కువ దిగుబడిని పొందే వ్యవసాయాన్ని సాంద్ర వ్యవసాయం అంటారు. తక్కువ భూ కమతాల పరిమాణంతో, అధిక నీటి పారుదల సౌకర్యాలు, క్రిమి సంహారక మందులు ఉపయోగించి ఈ వ్యవసాయం చేస్తారు. సాంద్ర వ్యవసాయం ద్వారా తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి సాధించవచ్చు. దీని ద్వారా వ్యవసాయంలో ఆధునిక పద్ధతులను ప్రవేశపెట్టవచ్చు.
సుస్థిర వ్యవసాయం
-అన్ని రకాల పంటలు పండిస్తూ, పశుపోషణ చేస్తూ, పంటలకు అవసరమైన ఎరువులను తయారు చేసుకుంటూ అధిక దిగుబడులు, లాభాలను ఆర్జించడమే సుస్థిర వ్యవసాయం. ఒక స్థిరమైన ప్రాంతంలో భూమిని వ్యవసాయానికి అనుగుణంగా తయారు చేసుకుని వ్యవసాయం చేస్తారు. నేల అనుకూలతను బట్టి వివిధ రకాల పంటలు పండిస్తారు.
నీటి వసతి: సుస్థిర వ్యవసాయంలో నీటి వసతి కీలకమైనది. ఆ ప్రాంతంలో ఉండే నీటి వసతిని బట్టి అక్కడ వేసే పంటల రకం ఆధారపడి ఉంటుంది. కాలువలు, బావులు, చెరువుల ద్వారా నీటి వసతి కల్పిస్తారు.
విత్తనాలు: పంట పండించడానికి మొదట కావల్సినవి విత్తనాలు. మేలు రకం విత్తనాలను ఎంచుకోవడం ద్వారా అధిక దిగుబడి వచ్చే పంటలను పండించవచ్చు. పెరుగుతున్న శాస్త్ర సాంకేతికతకు అనుగుణంగా అనేక మేలురకమైన విత్తనాలు ఉత్పత్తి చేస్తున్నారు. తక్కువ కాలంలో ఎక్కువ పెట్టుబడి, క్రిమికీటకాల బారి నుంచి తట్టుకునే హైబ్రిడ్ విత్తనాలు ఉత్పత్తి చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లోకి వివిధ బ్రాండ్లతో విత్తనాలు వస్తున్నాయి. నకిలీ విత్తన సంస్థలు రైతులను తీవ్రంగా నష్టాల పాలు చేస్తున్నాయి.
విత్తనాల కొరత: పంటలు పండించడానికి ఆశించిన మొత్తంలో విత్తానాలు లభించకపోవడమే విత్తనాల కొరత. అనేక ప్రాంతాల్లో విత్తన కొరత రైతులను వేధిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విత్తనాలను ఉత్పత్తి చేయడంలో ముందంజలో ఉంది. రాష్ట్రాన్ని దేశంలోనే విత్తన భాండాగారంగా తీర్చిదిద్దడానికి అడుగులు వేస్తుంది. కానీ అనేక ప్రైవేటు విత్తన సంస్థలు కృత్రిమ విత్తన కొరత సృష్టించి రూ.కోట్లలో ఆర్జిస్తున్నాయి.
పంట దిగుబడి: పంట పండించిన తర్వాత మనం ఆశించే ఉత్పత్తే పంట దిగుబడి. మేలు రకమైన విత్తనాల ఎంపిక, సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా అధిక దిగుబడి సాధించవచ్చు. చీడ పీడల నుంచి పంటను రక్షించడం ద్వారా ఎక్కువ దిగుబడి వస్తుంది.
వ్యవసాయ పనిముట్లు: నాగలి, ట్రాక్టర్, నూర్పిడి యంత్రాలు, వరి కోత మిషన్లు మొదలైనవి.
నోట్: వానపాములు నేలలో నివసించి, బొరియలు చేసి సారవంతం చేస్తాయి. అందుకే వానపాములను రైతు మిత్రులు అంటారు.
– ఫలన కాలం ఆధారంగా పంటలను రెండు రకాలుగా విభజించవచ్చు.
1. దీర్ఘకాలపు పంటలు: పంటలు పండటానికి 180 రోజులు లేదా అంతకంటే ఎక్కువ కాలం పడితే ఆ పంటలను దీర్ఘకాలపు పంటలు అంటారు.
ఉదా: పత్తి, కందులు మొదలైనవి
2. స్వల్పకాలిక పంటలు: పంటలు పండటానికి 100 రోజులు లేదా అంతకంటే తక్కువ కాలం పడితే ఆ పంటలను స్వల్పకాలిక పంటలు అంటారు.
ఉదా: పెసలు, మినుములు
పంటకాలాల ఆధారంగా పండే పంటలు మూడు రకాలు.
1. ఖరీఫ్ పంటలు: నైరుతి రుతుపవన ప్రారంభకాలంలో అంటే వర్షాకాలంలో పండే పంటలను ఖరీఫ్ పంటలు అంటారు.
ఉదా: వరి, జొన్న, మొక్కజొన్న, వేరుశనగ, పత్తి, పొగాకు, జనుము మొదలైనవి
2. రబీ పంటలు: నీటి పారుదల వసతులను కల్పించడం ద్వారా మార్చి నుంచి జూన్ నెలల మధ్య ఈ పంటలను పండిస్తారు.
ఉదా: కూరగాయలు, దోస, కర్బూజ, ఆకుకూరలు మొదలైనవి
నోట్: కొన్ని మొక్కలు రాత్రి 12:30 గంటల సమయంలోనే అధికంగా పుష్పిస్తాయి.
ఉదా: గోధుమ
– కొన్ని మొక్కలు రాత్రి 12:30 దాటాకనే బాగా పుష్పిస్తాయి.
ఉదా: పత్తి, జొన్న
-కొన్ని మొక్కలు రాత్రి, పగలులో ఎప్పుడైనా పుష్పిస్తాయి. ఉదా: సోయా చిక్కుడు
కాంగ్రెస్ వీడ్ (వయ్యారిభామ)
దీని శాస్త్రీయ నామం పార్థీనియం హిస్టోఫోరస్. ఇది ప్రమాదకరమైన కలుపు మొక్క. దీన్ని కాంగ్రెస్ కలుపు మొక్క అని కూడా అంటారు. దీని పుప్పొడి వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు, కంటి వ్యాధులు, చర్మ వ్యాధులు కలుగుతాయి. ఇవి పొలం గట్లు, ఇళ్ల ముందు ఖాళీ స్థలాల్లో పెరుగుతాయి. ఒక మొక్క ద్వారా కొన్ని వందల మొక్కలు పెరిగి పంట చేల ఎదుగుదలకు నిరోధకాలుగా తయారవుతాయి. వీటి పుష్పాల్లోని పుప్పొడి రేణువులు గాలిలో కలిసిపోతాయి. వాటిని పీల్చడం ద్వారా శ్వాస వ్యవస్థలో చేరి అలర్జీలను కలిగిస్తాయి. అస్తమా వంటి వ్యాధులు ఉన్నవారు వాటిని పీల్చడం ప్రమాదకరం.
వాణిజ్యం పరంగా పంటలు మూడు రకాలు
1. ఆహార పంటలు: వరి, గోధుమ, జొన్న, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, చిరుధాన్యాలు మొదలైనవి.
2. వాణిజ్య పంటలు: పత్తి, వేరుశనగ, చెరుకు, జనుము, పొగాకు, ఆముదాలు, నువ్వులు, కాఫీ, తేయాకు, రబ్బరు మొదలైనవి.
3. ఉద్యాన పంటలు: కూరగాయలు, పండ్లు, పువ్వులు మొదలైనవి.
ప్రాంతం పండించే వరి రకం
ఆసియా ఒరైజా సటైవా
ఆఫ్రికా ఒరైజా గ్లబెరియా
అమెరికా ఒరైజా గ్లుమపాట్యులా
నెల్లూరు మొల గొలుసులు
కర్నూలు సోనా
కీటక నాశనులు (Insecticides)
– కొన్ని కీటకాలు కాండాన్ని తింటాయి. కొన్ని ఆకులను కొరికి వేస్తాయి. కొన్ని వేళ్లను నాశనం చేస్తాయి.
– కీటక నాశనుల వల్ల కలిగే వ్యాధులు పంట దిగుబడిని ప్రభావితం చేస్తాయి.
-కీటక నాశనులు సాధారణంగా రసాయనిక పదార్థాలు. ఇవి కీటకాలను విషప్రభావానికి గురి చేస్తాయి.
– కీటక నాశనుల వినియోగం పెరిగితే కీటకాలు వాటిని నాశనం చేసే రసాయనాలకు నిరోధకతను పెంచుకుంటాయి.
ఉదా: దోమలు DDTపై నిరోధకతను సాధించడం
– కీటక నాశనులు, శిలీంధ్ర నాశకాలను, కలుపు నాశనులను అధికంగా ఉపయోగించడం వల్ల నేలలో వాటి అవశేషాలు పేరుకుపోతాయి.
– వర్షాలు పడినప్పుడు నీటిలో కరిగి నీటి వనరులను కలుషితం చేస్తాయి. నేల పొరల్లోకి చేరి నేలను కలుషితం చేస్తాయి.
– కొన్ని రసాయన పదార్థాలు పంటలపై పిచికారీ చేస్తున్నప్పుడు మనుషుల శరీరంలోకి ప్రవేశిస్తాయి.
– ఊపిరితిత్తుల్లోకి, రక్తంలోకి చేరి దీర్ఘకాలిక ప్రభావాన్ని చూపుతాయి.
నోట్: కొన్ని రకాల కీటకాలు ఇతర కీటకాలను తింటాయి. వీటిని పరభక్షకులు అంటారు.
సహజ కీటకనాశన పద్ధతులు
-కొన్ని రకాల కీటకాలు మనకు హాని కల్గించే కీటకాలను అదుపులో ఉంచుతాయి. వీటిని మిత్ర కీటకాలు అంటారు.
ఉదా: సాలెపురుగు, డ్రాగన్ ఫ్లె, క్రిసోపా, మిరిబ్స్, లేడీబర్డ్ బీటిల్ వంటివి జసిడ్స్, తొలిచే పురుగులను తింటాయి
-ట్రైకోడెర్మా బ్యాక్టీరియం కాండం తొలిచే పురుగు గుడ్లలో నివసిస్తుంది.
– పొగాకును తినే గొంగళి పురుగు, ధాన్యాన్ని తినే గొంగళి పురుగు వంటి వాటిని గుడ్ల దశలోనే నాశనం చేయవచ్చు.
-బాసిల్లస్ తురంజియెన్సిస్ (బీటీ) వంటి కొన్ని రకాల బ్యాక్టీరియాలు కీటకాలను నాశనం చేస్తాయి.
– కొన్ని మిశ్రమ పంటలు కీటకాలు, వ్యాధులను అదుపులో ఉంచుతాయి.
1. వరి సాగు చేసిన తర్వాత మినుములు, వేరుశనగ పంటను పండిస్తే వరిలో వచ్చే టుంగ్రోవైరస్ను అదుపులో ఉంచవచ్చు.
2. పత్తి పండించిన తర్వాత మొక్కజొన్న, నువ్వులు సాగుచేస్తే ధాన్యాన్ని తినే గొంగళి పురుగులను అదుపు చేస్తాయి.
3. కందులు పండించిన తర్వాత మొక్కజొన్న, జొన్న వంటి పంటలు వేస్తే కాండం తొలుచు పురుగు, ఎండు తెగులును నివారించవచ్చు. వీటినే ఆకర్షక పంటలు అంటారు.
ప్రాక్టీస్ బిట్స్
1. కింది వాటిలో ఏకవార్షిక మొక్క ఏది?
1) ఒరైజా సటైవా 2) రఫానస్ సటైవస్
3) మ్యూసా పారడైసికా
4) ట్రిబ్యులస్
2. కింది వాటిని జతపరచండి.
1. గోధుమ ఎ. ఎఫిమెరల్
2. బీట్రూట్ బి. ఏకవార్షికం
3. అరటి సి. ద్వివార్షికం
4. పల్లేరు డి. బవార్షికం
1) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి
2) 1-బి, 2-సి, 3-డి, 4-ఎ
3) 1-సి, 2-బి, 3-ఎ, 4-డి
4) 1-డి, 2-సి, 3-బి, 4-ఎ
3. కింది వాటిలో పొద ఏది?
1) గన్నేరు 2) చామంతి
3) సంపెంగ 4) పైవన్నీ
4. కింది వాటిని జతపరచండి.
1. సరుగుడు, నరమామిడి ఎ. శంక్వాకార వృక్షాలు
2. మరి, వేప, చింత బి. ఛత్రాకార వృక్షాలు
3. కొబ్బరి, ఈత సి. మాను
4. గడ్డిజాతులు, చెరుకు, వెదురు డి. తృణ ధాన్యాలు
5. అరటి, మెట్ట తామర ఇ. అనృత, మిథ్యాకాండం
1) 1-బి, 2-సి, 3-డి, 4-ఇ, 5-ఎ
2) 1-బి, 2-సి, 3-ఎ, 4-డి, 5-ఇ
3) 1-ఎ, 2-బి, 3-సి, 4-డి, 5-ఇ
4) 1-ఇ, 2-డి, 3-సి, 4-బి, 5-ఎ
5. తృణ కాండం ఏ మొక్కలో కనిపిస్తుంది?
1) గడ్డి జాతులు 2) చెరుకు
3) వెదురు 4) పైవన్నీ
6. అరటి, మెట్ట తామర మొక్కల్లో ఉండే కాండం?
1) తృణ కాండం
2) మిథ్యా కాండం
3) మాను
4) చేవదేరిన కాండం
7. మొక్కల్లోని ఆహార కర్మాగారాలు?
1) వేర్లు 2) కాండాలు
3) పత్రాలు 4) పుష్పాలు
8. ప్రపంచంలో గల పూలనిచ్చే మొక్కల జాతుల సంఖ్య?
1) 1,00,000 2) 1,25,000
3) 1,50,000 4) 1,75,000
9. రంగులు కలిగి ఉండే పువ్వులు?
1) పగలు వికసించేవి
2) రాత్రి వికసించేవి
3) మధ్యాహ్నం వికసించేవి
4) సాయంత్రం వికసించేవి
10. ప్రపంచంలో అతిపెద్ద పువ్వు?
1) మల్లెపువ్వు 2) గోబీ పువ్వు
3) రఫ్లీషియా 4) తామర
సమాధానాలు
1. 1 2. 2 3. 4 4. 3
5. 4 6. 2 7. 3 8. 3
9. 1 10. 3
- Tags
- competitive exams
- TET
- tstet
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు