తెలుగు సినిమాలో తెలంగాణం
తెలుగు సినిమా చరిత్రకు సుమారు 85 ఏండ్లు. భక్తరామదాసు అంటే నాగార్జున అని, రుద్రమదేవి అంటే అనుష్క అని అనేంతగా సినిమా మాధ్యమం ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. 1931లో ప్రారంభమైన సినిమా రంగంలోకి 1961 వరకు (మూడు దశాబ్దాల కాలం) తెలంగాణకు చెందిన కవులు, రచయితలు ప్రవేశించలేదు. ఆ తర్వాత క్రమంగా తెలంగాణ వారి ప్రాతినిధ్యం పెరిగింది. తెలుగు సినిమా పుట్టుక నుంచి దాని అభివృద్ధికి తెలంగాణ వారు చేసిన సేవపై ప్రత్యేక కథనం…
తెలంగాణ సినీ కవులు
చందాల కేశవదాసు: 1876 జూన్ 20న లక్ష్మీనారాయణ, పాపమ్మ దంపతులకు ఖమ్మం జిల్లా జక్కేపల్లిలో జన్మించారు. కేశవదాసు తెలుగు సాహిత్యంలో వివిధ ప్రక్రియల్లో అనేక రచనలు చేశారు. వీరు రచించిన కనకతార (1911) నాటకాన్ని సరస్వతీ టాకీసువారు 1937లో సినిమా తీశారు. హెచ్వీ బాలు దర్శకుడిగా తీసిన ఈ సినిమాలో కేశవదాసు రెండు సీసపద్యాలు, మూడు పాటలను మాత్రమే తీసుకున్నారు. ఇదే కనకతార పేరుతో 1955లో మరో సినిమా తీశారు. 1931లో హెచ్ఎం రెడ్డి తీసిన భక్తప్రహ్లాదలో కేశవదాసుతో పాట రాయించారు. అదే పరితాప భారంబు భరియింపుతరమా! కటకట నేనిది గడువంగ జాలుదు పతి ఆజ్ఞను మీరగలనా! అనే పాట. లీలావతి పాత్రకు ఈ పాటను ఉపయోగించారు. తెలుగు చలనచిత్ర చరిత్రలో తొలి సినిమా పాట రాసిన ఘనత ఈయకు దక్కింది.
1935లో సతీ అనసూయ చిత్రానికి మాటలు, పాటలు రాశారు. స్టడీ క్రానికల్ ప్రెస్, మౌంట్ రోడ్ మద్రాస్వారు ఈ సినిమాపై వేసిన పుస్తకంలో సతీ అనసూయ బ్యానర్లో కేశవదాసు ఫొటో వేశారు. గొప్ప బెంగాలీ దర్శకుడు అహిన్ చౌదరి దీనికి దర్శకుడు. 1936 చివరలో లంకాదహనం చిత్రానికి కేశవదాసు స్క్రిప్ట్ రాశారు. 1939లో లక్ష్మీసినీ టౌన్ రాధాకృష్ణ సినిమాకు కేశవదాసు కొన్ని పాటలు రాశారు. 1945లో బాలరాజు సినిమాలో కూడా పాట రాశారు. 1922లో ముత్తరాజు సుబ్బారావు రచించిన శ్రీకృష్ణ తులాభారం నాటకంలో ఆయన రాసిన పాటల్లో భలే మంచి చౌకబేరము ఇది సమయము మించినన్ దొరకదు త్వరన్ గొనుడి సుజనులారా అనే పాటను 1955లో రాజరాజేశ్వరి ఫిల్మ్ కంపెనీవారు తీసిన శ్రీకృష్ణతులాభారం సినిమాలో వాడుకున్నారు. సీఎస్ రావు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో కేశవదాసు పేరు వేయకుండా దైతా గోపాలం పేరు వేశారు. నాటకాలను సినిమాలకు అనుగుణంగా మార్చిన ఘనత కేశవదాసుదే. 1966లో సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డీ రామానాయుడు శ్రీకృష్ణతులాభారం తీసి కేశవదాసు పేరు వేయకపోయేసరికి ఆయన కుమారుడు కృష్ణమూర్తి ఖమ్మం కోర్టులో కాపీరైట్ కింద దావా వేయగా (నం-1966), ఆరుద్ర, శ్రీశ్రీ, దాశరథి సాక్ష్యం ఇచ్చారు. మూడు పాటలను వాడుకున్నారు. అవి.. 1) భలే మంచి చౌకబేరము 2) మునివరా తుదకిట్లు 3) కొట్టుకోండిరా. 1971లో కొన్ని రీప్రింట్లు వేసి దాసు పేరు వేశారు. భలే మంచి చౌకబేరము రాసింది తానేనని స్థానం నర్సింహారావు నటస్థానం అనే ఆత్మకథలో పేర్కొనడం దురదృష్టకరమని ప్రముఖ తెలంగాణ చరిత్రకారుడు జితేంద్రబాబు రాశారు. 1956లో నాయకన్‌గూడెంలో దాసు మరణించారు. ఎం పురుషోత్తమాచార్యులు (నీలగిరి) ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి కేశవదాసు సాహిత్యంపై పరిశోధన చేసి గ్రంథాన్ని ప్రచురించారు.
మూడున్నర దశాబ్దాలు విభిన్న పాత్రలు పోషించి విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నిర్మాతగా, దర్శకుడిగా, హీరోగా పేరుతెచ్చుకున్న విలక్షణ నటుడు ప్రభాకర్‌రెడ్డి. మిర్యాలగూడెంకు దగ్గరలోని తుంగతుర్తిలో 1936 జూలైలో లకా్ష్మరెడ్డి, కౌలస్య దంపతులకు జన్మించారు. 1961లో రామినీడు దర్శకత్వంలో చివరకు మిగిలేది చిత్రం ద్వారా పరిచయమై 500 సినిమాల్లో నటించారు. నిర్మాతగా పచ్చని సంసారం, పండంటి కాపురం, గాంధీపుట్టిన దేశం, మాకూ స్వాతంత్య్రం వచ్చింది, ధర్మాత్ముడు, గృహప్రవేశం, కార్తీకదీపం సినిమాలు నిర్మించారు. మండలాధీశుడు, గండికోట రహస్యం, ప్రతిభావంతుడు, ప్రచండ భారతం సినిమాలకు దర్శకత్వం వహించారు. 21 చిత్రాలకు కథలు రాశారు. పండంటి కాపురం సినిమాకు ఉత్తమ జాతీయచిత్రంగా అవార్డు వచ్చింది. గృహప్రవేశం సినిమాలో మోహన్‌బాబును హీరోగా పరిచయం చేశారు. వృద్ధ కళాకారుల సంక్షేమం కోసం తీసిన కామ్రేడ్ సినిమా విడుదల కాకముందే (1997) మరణించారు.
బీ నర్సింగరావు
గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్‌లో 1946, డిసెంబర్ 26న జన్మించారు. సినిమా రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఈయనకు దక్కింది. 1940-48లో సారథి స్టూడియోస్ జీ రవీంద్రనాథ్‌తో కలిసి సంచలన చిత్రం మా భూమి తీశారు. తెలంగాణ సాయుధ పోరాటం ఇతివృత్తంగా తీసిన చిత్రం ఇది. దీనికి బెంగాల్‌కు చెందిన గౌతంఘోష్ దర్శకుడు. ఇందులో భూపాల్‌రెడ్డి, కాకరాల, నర్సింగరావు, యాదగిరి, ఎంబీవీకే ప్రసాదరావు, గోపీచంద్ కుమారుడు సాయిచంద్ నటించారు. డైలాగులు తెలంగాణ భాషలో ఉన్నాయి. స్క్రిప్ట్ బీ నర్సింగరావు, ప్రాణ్‌రావు తయారుచేశారు. కథా రచయిత ఉర్దూ కిషన్‌చందర్. రజాకార్లు, పోలీసుల వల్ల జరిగిన హింసాకాండతో తెలంగాణ ఎలా రక్తసిక్తం అయిందో ఈ సినిమా తెలియజేస్తుంది. ఇందులో గద్దర్, సంధ్య, కేబీకే మోహన్‌రాజు పాటలు పాడారు. 1983లో తన స్వీయ దర్శకత్వంలో రంగుల కల సినిమా తీశారు. ఇది జాతీయస్థాయిలో ఉత్తమ చిత్రంగా అవార్డు దక్కించుకుంది. ఇంకా దాసి సినిమా కూడా తీశారు. దీనికి 1989లో 5 జాతీయ అవార్డులు వచ్చాయి. ఇందులో అర్చన, మోయిన్ అలీబేగ్, నీనాగుప్తా నటించారు. జాతీయస్థాయి ఉత్తమ తెలుగు చిత్రంగా అవార్డు వచ్చింది. నర్సింగరావు రష్యా, జర్మనీ, చెకోస్లోవేకియా, ఇటలీ, అమెరికా, కెనడా వంటి దేశాలు తిరిగి తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పారు. ఈయన 1984లో నిర్వహించిన ఇండియన్ పనోరమా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో పాల్గొన్నారు.
కుమ్రంభీమ్
ఆదిలాబాద్ గిరిజన వీరుడు. ఈ చిత్ర దర్శకుడు అల్లాణి శ్రీధర్. సంగీత దర్శకుడు గౌతంఘోష్. ఆదివాసి చిత్ర బ్యానర్‌పై ఇంటిగ్రేటెడ్ ట్రైబల్ డెవలప్మెంట్ ఏజెన్సీ నిర్మించింది.
అజిత్ హమీద్ అలీఖాన్
1922, జనవరి 22న గోల్కొండలో జన్మించారు. ఈయన తండ్రి బషీర్ అలీఖాన్. బాలీవుడ్లో ఐదున్నర దశాబ్దాలు హీరోగా, విలన్‌గా నటించారు. పుస్తకాలు అమ్ముకొని 1943లో బొంబాయి వెళ్లాడు. జంజీర్, యాదోంకి బారాత్‌లో నటించాడు. నాస్తిక్, మొఘల్ -ఏ- ఆజం, టవర్హౌస్, బర్మారోడ్ (1962), షికారి (1963), నమస్తేజీ, మైహుం, అలాదిన్, హిమాలయ్కీ గోద్మే (1965) చిత్రాల్లో నటించారు. 1998, అక్టోబర్ 21న హైదరాబాద్‌లో మరణించారు. మొత్తం 57 చిత్రాల్లో నటించారు.
హైదరాబాద్‌లో బండి కథ (1928-57)
1910 ప్రారంభంలో తోపుడు బండిలో ప్రొజెక్టర్ సాయంతో తెరపై బొమ్మ వేసేవారు. మహిమూద్మియా సినిమా బండి హైదరాబాద్ సినిమా చరిత్రకు తొలి రోజులు. 1908లో మూసీ నది వరదలను చిత్రీకరించారు. సినిమా బండి టికెట్ అర్ధణా (మూడు పైసలు) ఉండేది. 1931 తరువాత మాటల సినిమాలు రావటం, థియేటర్ల నిర్మాణంతో తోపుడు బండి పోయింది.
కత్తి కాంతారావు
పాత తరం హీరో, జానపద కథానాయకుడు కాంతారావు అసలు పేరు తాటికొండ లక్ష్మీకాంతారావు. 1923 సెప్టెంబర్ 21న నేటి సూర్యాపేట జిల్లా కోదాడ దగ్గరలో ఉన్న గుడిబండ గ్రామంలో జన్మించారు. 450 చిత్రాల్లో నటించారు. నటప్రపూర్ణ బిరుదు పొందారు. రఘుపతి వెంకయ్య అవార్డు అందుకున్నారు. రేపాల గ్రామ వెలుగు నాట్యమండలి ద్వారా వెలుగులోకి వచ్చారు. సురభి కళాకారుడు కూడా. చలనచిత్ర పితామహుడు రోహినీ సంస్థ అధినేత హెచ్ఎం రెడ్డి తీసిన ప్రతిజ్ఞలో హీరోగా నటించారు. నిర్మాతగా సప్తస్వరాలు, గుండెలు తీసిన మొనగాడు, గండరగండడు, ప్రేమజీవులు, స్వాతిచినుకులు సినిమాలు తీశారు. ఈయన భార్య హైమావతి. గుడిబండలోని 400 ఎకరాల భూమిని దానం చేసిన దాత. నారదుడు, లక్ష్మణుడు, శివుడు, అర్జునుడి పాత్రల్లో జీవించారు.
సుద్దాల హనుమంతు
సినీ కవి. పల్లెటూరి పిల్లగాడా పసులు కాసే మొనగాడా పాటను రాశారు. 1908 డిసెంబర్లో పాలడుగు గ్రామంలో జన్మించారు. నిజాం వ్యతిరేకోద్యమంలో పాల్గొన్నారు. 1982, అక్టోబర్ 10న మరణించారు.
హైదరాబాద్‌లో సినిమాల సెన్సార్
1924లో హైదరాబాద్‌లో సెన్సార్షిప్ మొదలైంది. ఏడో నిజాం దీన్ని ఏర్పాటు చేశాడు. విదేశీ మూకీల్లోని ముద్దు సన్నివేశాలు, అర్ధనగ్న దృశ్యాల పట్ల అభ్యంతరాలు మొదలయ్యాయి. దీంతో కలకత్తా మదన్ థియేటర్ నిర్మించిన పతిభక్తి (1922), హేర్రాండు సినిమాలు సెన్సార్‌షిప్‌నకు గురయ్యాయి. అవి ముద్దు దృశ్యాలపై. 1924లో ధీరేన్ గంగూలీ నిర్మించిన రజియాబేగం హైదరాబాద్‌లో విడుదలయింది. ఇది సెన్సార్‌షిప్‌నకు గురైంది.
ఎంవీ రాజు (సుస్వరాల రాజు)
ఇతని పూర్తిపేరు మందపాటి వెంకటరాజు. నేటి సూర్యాపేట జిల్లాలోని హుజూర్నగర్ వాసి. 1919, డిసెంబర్ 18న జన్మించారు. మొదట సంగీత దర్శకుడు పీ చలపతిరావు వద్ద సహాయకుడిగా పనిచేశారు. భక్త కనకదాసు కన్నడ సినిమాతో సంగీత దర్శకులయ్యారు. జాతీయ ఉత్తమ సంగీత దర్శకులయింది ఈ సినిమాతోనే. అప్పటి రాష్ట్రపతి బాబు రాజేంద్రప్రసాద్ ద్వారా అవార్డును అందుకున్నారు. ఈయన తెలుగు, కన్నడ భాషల్లోని స్వర్ణగౌరి, ధర్మస్థల మహత్యం, రాజు, నాగమోహిని వంటి 60కి పైగా సినిమాలకు సంగీతాన్ని అందించారు.
అల్లాణి శ్రీధర్
జిన్నారం వాసి. కుమ్రంభీమ్ చిత్ర దర్శకుడు.
గద్దర్
ఈయన అసలు పేరు గుమ్మడి విఠల్‌రావు. మా భూమి సినిమాలోని బండెనక బండి కట్టి పాటను పాడారు. జైబోలో తెలంగాణ సినిమాలో పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పాట పాడారు. అమ్మా తెలంగాణమా, నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా వంటి పాటలను రాశారు. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మ పాటకు ఉత్తమ గీతంగా నంది అవార్డు వచ్చింది. గద్దర్ పేరుతో ఈయన రాసిన పాటలు జనాదరణ పొందాయి.
సినారె
ఈయన పూర్తిపేరు సింగిరెడ్డి నారాయణరెడ్డి. 1931, జూలై 29న సిరిసిల్ల తాలూకా హన్మాజీపేటలో జన్మించారు. గుమ్మడి వెంకటేశ్వరరావు ద్వారా సినీ రంగ ప్రవేశం చేశారు. ఎన్టీఆర్ గులేబకావళికథ సినిమాకు పాటలు రాయడంతో సినీ ప్రస్థానం మొదలయింది. నన్ను దోచుకువందువటే వన్నెల దొరసాని, కలల అలలపై తేలెను మనసు మల్లెపూవై వంటి ఎవర్గ్రీన్ పాటలు రాశారు. ఎక్కువగా లలిత గీతాలు రాశారు. ఘంటసాల పాడిన వాటిల్లో ఎక్కువగా సినారె పాటలే ఉన్నాయి. దాదాపు 300 సినిమా పాటలు రాశారు. 2003లో ఉత్తమ గేయరచయితగా నంది అవార్డును అందుకున్నారు. సినారె రాసిన మరికొన్ని సూపర్‌హిట్ పాటలు 1) పగలే వెన్నెల జగమే ఊయల 2) చిగురులు వేసిన కలలన్నీ సిగలో పూలుగా మారినవి 3) మాయదారి సిన్నోడు మనసే లాగేసిండు (అమ్మపాట) 4) మనసు పాడింది సన్నాయి పాట (పుణ్యవతి) 5) నా మది నిన్ను పిలిచింది గానమై (ఆరాధన) 6) కనుల ముందు నీవుంటే (చెల్లిలి కాపురం) 7) తోటలో నా రాజు తొంగిచూసెను (ఏకవీర).
హైదరాబాద్‌లో సినిమాలు
హైదరాబాద్‌లో మూకీ సినిమాలకు మూల కారకుడు ధీరేన్ గంగూలీ. హైదరాబాద్‌లోని నిజాం రాజు ఆర్ట్స్ కాలేజీలో (ఓయూ కాదు) చిత్రకళా బోధకుడిగా పనిచేశాడు ధీరేన్ గంగూలీ. ధీరేన్ కలకత్తా వెళ్లి అక్కడి మిత్రులతో ఇండో-బ్రిటిష్ ఫిల్మ్ కంపెనీ పెట్టి ది ఇంగ్లండ్ రిటర్న్ (1921) పేరుతో హాస్య సినిమా తీశాడు. ఆ తరువాత ఆయన హైదరాబాద్‌కు వచ్చి 1922లో లోటస్ ఫిల్మ్ కంపెనీ పేరుతో చిత్ర నిర్మాణ సంస్థను స్థాపించారు. 1922 నుంచి నిజాం రాజు సహాయసహకారాలతో 8 సినిమాలు నిర్మించారు. తొలి చిత్రం చింతామణి (1922), ఇంద్రజిత్, ది లేడీ టీచర్ (1922), హరగౌరి, యయాతి, స్టెప్‌మదర్ (1923) మొదలైన మూకీ చిత్రాలు తీశారు. రజియా బేగం (1924) సినిమాలోని కథ నిజాంకు నచ్చకపోవడంతో దాన్ని ఆపివేయాలని ఆజ్ఞాపించాడు. దీంతో ధీరేన్ గంగూలీ హైదరాబాద్ వదిలివెళ్లిపోయాక 1929లో మహావీర్ ఫొటోప్లేస్ సంస్థ ప్రారంభమైంది. 1929 నుంచి 1931 సంవత్సరాల మధ్య 7 మూకీ సినిమాలు వెలువడినాయి. అలాగే సికింద్రాబాద్‌లో మహావీర్ ఫొటోప్లేస్ అండ్ థియేటర్స్ లిమిటెడ్ సంస్థను 1931లో సరోజ్‌కుమార్ స్థాపించారు.
-దేశంలో టాకీ సినిమాలు నడుస్తున్న కాలంలో హైదరాబాద్‌లో నేషనల్ ఫిల్మ్ కంపెనీ అనే మరో సంస్థ ఏర్పడి రెండేండ్లలో 4 మూకీ సినిమాలు నిర్మించింది.
దాశరథి కృష్ణమాచార్య
మహబూబాబాద్ చిన్నగూడూరు గ్రామంలో 1925, జూలై 22న జన్మించారు. ఉమ్మడి రాష్ట్ర ఆస్థాన కవి. నా తెలంగాణ రత్నాల వీణ అన్న కవి. ఈయన రాసిన సినిమా పాటలు 1) నా కంటి పాపలో నిదురపోరా (వాగ్దానం 1960) 2) ఖుషీ ఖుషీగా నవ్వుతూ (ఇద్దరు మిత్రులు 1961) 3) ఒహో గులాబీ బాల అందాల ప్రేమ మాల (మంచిమనిషి 1964) 4) తిరుమల మందిర సుందర (మేనకోడలు 1972) 5) కలిసిన హృయాల్లోన (ప్రేమ పగ 1978) 6) ఓ బంగరు రంగుల చిలకా (తోటరాముడు 1975) 7) మదిలో వీణలు మోగే (ఆత్మీయులు 1969) 8) మనసే కోవెలగా (మాతృదేవత 1969). 1987 నవంబర్ 5న మరణించారు. సినీ పరిశ్రమలో సినారె, దాశరథి సూర్యచంద్రుల్లా వెలిగారు. దాశరథి 1961-87 మధ్యకాలంలో 2000 సినిమా పాటలు రాశారు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు