Solid waste- Management | ఘన వ్యర్థాలు- నిర్వహణ

-ఆధునికకాలంలో మనిషి అభివృద్ధి చర్యల ద్వారా అధిక మొత్తంలో ఘనవ్యర్థ పదార్థం విడుదలవుతున్నది.
-ముఖ్యకాలంలో ప్లాస్టిక్స్, పాలిథీన్ వినియోగం పెరిగినప్పటి నుంచి ఘన వ్యర్థ పదార్థాల విడుదల కూడా పెరిగింది. మానవ జనిత మురుగు మొదలు, ఎలక్ట్రానిక్ పరికరాల వ్యర్థం(ఈ-వేస్ట్) వరకు ఘన వ్యర్థాలు పెరుగుతున్నాయి.
-ప్యాకింగ్ పదార్థాల ఉత్పాదన ఇందుకు మరింత కారణమవుతున్నది. సరైన రీతిలో నియంత్రించకపోవడం వల్లే ఘనవ్యర్థ పదార్థ సమస్యలు పెరుగుతున్నాయి.
-వీటికితోడు దేశంలో సమగ్ర ఘన వ్యర్థాల సేకరణ, రీసైక్లింగ్‌ను క్రమబద్ధీకరించకపోవడం ద్వారా సమస్య తీవ్రతరం అవుతున్నది.
-ప్రజల్లో అవగాహన పెరగడం, ఉత్పత్తి అయ్యే ప్రాంతం వద్దనే వ్యర్థాన్ని వేరుచేయడం, రీసైక్లింగ్‌ను మరింత సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు.
నిర్వహణ పద్ధతులు ల్యాండ్‌ఫిల్లింగ్
-ప్రస్తుతం ఘన వ్యర్థాల నిర్వహణలో వివిధ పద్ధతులను అనుసరిస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో ఘన వ్యర్థాల నిర్వహణకు అనువైన పద్ధతి ల్యాండ్‌ఫిల్.
-ఈ విధానంలో నేలలో గోతులు తవ్వి ప్రతి రెండు మట్టిపొరల మధ్య చెత్త పొరను వేసి కాంపాక్టింగ్ చేస్తారు. ఈ విధంగా ఘన వ్యర్థ ఉపరితల ప్రభావాన్ని తగ్గించవచ్చు.
-ల్యాండ్‌ఫిల్స్ సరైన రీతిలో నిర్వహించకపోతే బొద్దింకలు, ఎలుకలు, పందికొక్కులు చేరి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉన్నది.
-ల్యాండ్ ఫిల్స్‌లో మీథేన్ పేలుళ్లు సంభవించే అవకాశం ఉన్నది. భూగర్భజల కాలుష్యం సంభవిస్తుంది. ల్యాండ్‌ఫిల్స్ నుంచి విడుదలయ్యే మీథేన్ గ్రీన్హౌస్ వాయువుగా వ్యవహరిస్తూ గ్లోబల్ వార్మింగ్‌కు కారణమవుతున్నది.
-పట్టణాలు విస్తరిస్తున్న కొద్దీ ల్యాండ్‌ఫిల్లింగ్‌కు కావాల్సిన ప్రాంతం లభ్యత బాగా తగ్గుతున్నది.
కంపోస్టింగ్
-గ్రామీణ ప్రాంతాల్లో ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణకు అనువైన విధానం కంపోస్టింగ్, పశువుల పేడ ఆహార వ్యర్థాన్ని పోగుచేసి వియోగం చెందించడమే కంపోస్టింగ్.
-దీని ద్వారా పొలాల్లో వినియోగించే సేంద్రియ ఎరువు తయారవుతున్నది. అయితే గాలిలోకి మీథేన్ అధికంగా విడుదలవుతుంది. ఇదే కంపోస్టింగ్‌ను బయోగ్యాస్ ప్లాంట్లలో నిర్వహించడం ద్వారా మీథేన్‌ను వంటకు వినియోగించడం సాధ్యమవుతున్నది.
ఇన్సినరేషన్
-నివాస, వాణిజ్య సముదాయాల్లో విడుదలయ్యే ఘన వ్యర్థాన్ని, అదేవిధంగా బయోమెడికల్ వేస్ట్‌ను ఉష్ణ భస్మీకరణం లేదా ఇన్సిరేషన్ పద్ధతి ద్వారా నిర్వహించవచ్చు.
-ఈ పద్ధతిలో ఘనవ్యర్థాన్ని అధిక ఉష్ణోగ్రత వద్ద ఆక్సిజన్ సమక్షంలో మండించి అధిక ఉష్ణాన్ని ఉత్పత్తి చేస్తారు. ఈ విధానం ద్వారా ఘనవ్యర్థ పరిమాణాన్ని బాగా తగ్గించవచ్చు.
-అయితే విపరీత గాలి కాలుష్యం సంభవించడంతోపాటు మిగిలిన వ్యర్థంలో అధిక గాఢత కలిగిన హానికర వ్యర్థాలు ఉంటాయి. దీన్ని సక్రమంగా నిర్వహించాలి. ఇన్సినరేషన్ అధిక ఖర్చుతో కూడుకున్నది.
రీసైక్లింగ్
-ఘనవ్యర్థాల సక్రమ నిర్వహణ కోసం ఉపయోగపడే పద్ధతి రీసైక్లింగ్. వినియోగించిన నిరర్థక వ్యర్థాల నుంచి తిరిగి మనిషి ఉపయోగించే సరికొత్త పదార్థాల తయారీని రీసైక్లింగ్ అంటారు.
-వ్యర్థ పదార్థాల నుంచి సింథటిక్ డీజిల్స్, అల్యూమినియం టిన్ల నుంచి ఆటో మొబైల్స్‌లో ఉపయోగించే మెటల్ ఫ్రేమ్‌లను తయారు చేస్తారు.
-ప్లాస్టిక్, పొట్టు నుంచి విద్యుత్ మొదలైనవి రీసైక్లింగ్ ద్వారా తయారు చేయవచ్చు. రీసైక్లింగ్ ద్వారా ముడిసరుకుల అవసరం, వినియోగం బాగా తగ్గుతున్నది.
-వివిధ రీసైక్లింగ్ పద్ధతులను అభివృద్ధి చేయడం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో రీసైక్లింగ్ ప్లాంట్లు పెరిగి ఉద్యోగావకాశాలు మెరుగవుతాయి. నిరుద్యోగ సమస్య తగ్గుతుంది. పరిసరాల పరిశుభ్రత పెరుగుతుంది. డబ్బు కూడా ఆదా అవుతుంది. సహజవనరులపై ఒత్తిడి తగ్గి, కాలుష్యం నియంత్రణలోకి వస్తుంది.
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు