అంతర్జాతీయ సంస్థలు-ఘటనలు-భారత్ సంబంధాలు
గ్రూప్-1, 2 పరీక్షల సిలబస్‌లో అంతర్జాతీయ సంబంధాలు, ఘటనలను పొందుపర్చారు. వివిధ అంతర్జాతీయ సంస్థలు, దేశాల్లో జరుగుతున్న ఘటనలు, వాటితో భారత్‌కు ఉన్న సంబంధాలను అధ్యయనం చేయాలి. ఈ అంశాన్ని అంతర్జాతీయ సంస్థలు, దేశాలు అని రెండు భాగాలుగా విభజించుకొని చదివితే తేలికగా గుర్తుంచుకోవచ్చు. అలాగే వివిధ దేశాల్లో అంతర్జాతీయ సంస్థల ప్రధాన కేంద్రాలు ఉన్నాయి. ఆయా దేశాల వారీగా చదువుకుంటే మంచిది. జనవరి 2022 నుంచి ఏప్రిల్ 2022 వరకు వార్తల్లో ఉన్న అంతర్జాతీయ సంస్థలను పరిశీలిద్దాం.
న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే సంస్థలు
ఐక్యరాజ్యసమితి
తరచూ వార్తల్లో ఉండే సంస్థ ఇది. 1945, అక్టోబర్ 24న ఏర్పాటయ్యింది. ఇందులో ఆరు అంగాలు ఉంటాయి. అవి ఐక్యరాజ్యసమితి సర్వ ప్రతినిధి సభ, భద్రతామండలి, సామాజిక-ఆర్థిక మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం, ధర్మకర్తృత్వ మండలి, సచివాలయం. అంతర్జాతీయ న్యాయ స్థానం నెదర్లాండ్స్‌లోని ది హేగ్ నగరంలో ఉంది. మిగతా అయిదు అంగాలు న్యూయార్క్‌లో ప్రధాన కేంద్రాలను కలిగి ఉంటాయి.
ప్రభావవంతమైన బహుళత్వపు అంశంపై ఒక ఉన్నత స్థాయి కమిటీని (హై లెవల్ కమిటీ ఆన్ ఎఫెక్టివ్ మల్టీలేటరలిజమ్) ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఏర్పాటు చేశారు. ఇందులో 12 మందికి సభ్యత్వం ఉంటుంది. భారత్‌కు చెందిన ప్రముఖ ఆర్థికవేత్త జయతి ఘోష్ కూడా ఇందులో ఉన్నారు.
ప్రపంచంలో పేదరికానికి సంబంధించి ఏప్రిల్ నెలలో ఐక్యరాజ్య సమితి ఒక నివేదికను విడుదల చేసింది. కరోనా వల్ల సుమారుగా 77 మిలియన్ల మంది ప్రజలు గతేడాది తీవ్ర పేదరికంలోకి వెళ్లారు. అలాగే పలు అభివృద్ధి చెందుతున్న దేశాలు ఇచ్చిన అప్పులను వసూలు చేసుకొనే పరిస్థితిలో లేవని ఇందులో పేర్కొంది. దీనికి తోడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సంక్షోభాన్ని మరింత పెంచిందని నివేదిక వెల్లడించింది.
ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభ
ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభలో 193 దేశాలకు సభ్యత్వం ఉంది. మార్చి 15ని ఇస్లామోఫోబియా రోజుగా ప్రకటిస్తూ సర్వ ప్రతినిధి సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దీనిని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ తరఫున పాకిస్థాన్ ప్రవేశపెట్టింది.
భద్రతామండలిలో అమెరికా, రష్యా, ఫ్రాన్స్, యూకే, చైనా దేశాలకు వీటో అధికారం ఉంటుంది. ఆయా దేశాలు దీనిని వినియోగించినప్పుడు అందుకు కారణాలను వెల్లడించాలంటూ సర్వ ప్రతినిధి సభలో ఒక తీర్మానాన్ని ఆమోదించారు. సంప్రదింపుల పద్ధతిలో దీనికి ఆమోదం లభించింది. యూరప్ ఖండంలో ఉండే లిసెస్టయిన్ అనే దేశం దీనిని ప్రవేశపెట్టగా వందకు పైగా దేశాలు మద్దతు పలికాయి. యూఎస్, యూకే, ఫ్రాన్స్‌లు కూడా అంగీకరించాయి.
ఐక్యరాజ్యసమితి భద్రతామండలి
దీనిలోని సభ్య దేశాలు 15. వీటిలో అయిదు శాశ్వత సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. మిగతా 10 దేశాలు రొటేషన్ పద్ధతిలో ఎన్నికవుతాయి. 2021, జనవరి 1న భారత్ ఎన్నికయ్యింది. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు సభ్యత్వాన్ని కలిగి ఉంటుంది. అణ్వాయుధాల విస్తరణను నిలిపివేయాలని భద్రతామండలిలోని అయిదు శాశ్వత సభ్య దేశాలు ఈ ఏడాది జనవరిలో నిర్ణయించాయి. దీనిని శుభ పరిణామంగా పరిశీలకులు పేర్కొంటున్నారు. అలాగే అణ్వాయుధ నిరోధక ఒప్పందాన్ని సమీక్షించేందుకు కూడా అంగీకరించాయి. అణ్వాయుధ ఒప్పందం 1970 మార్చి 5న అమల్లోకి వచ్చింది.
సామాజిక-ఆర్థిక మండలి
ఇందులో 54 సభ్య దేశాలున్నాయి. దీనికి వ్యవస్థాపక అధ్యక్షుడిగా భారత్‌కు చెందిన ఆర్కాట్ రామస్వామి ముదలియార్ వ్యవహరించారు. ఈ అంగానికి చెందిన నాలుగు సంస్థల్లో భారత్ సభ్యత్వ దేశంగా ఎన్నికయ్యింది. అవి..
1. ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ
2. సాంఘిక అభివృద్ధి కమిషన్
3. ఎన్జీవోల కమిటీ
4. శాస్త్ర-సాంకేతిక అభివృద్ధి కమిషన్
భారత్‌కు చెందిన రాయబారి ప్రీతి శరన్ ఆర్థిక-సామాజిక-సాంస్కృతిక మండలికి మరోసారి ఎన్నికయ్యారు.
న్యూయార్క్ కేంద్రంగా పనిచేసే ఇతర సంస్థలు
యూఎన్డీపీ
దీని పూర్తి రూపం ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం. దీనిని నవంబర్ 22, 1965లో స్థాపించారు. పేదరికాన్ని పారదోలడంతో పాటు సుస్థిర ఆర్థిక వృద్ధిని, మానవాభివృధ్ధిని సాధించే ఉద్దేశంతో దీనిని ఏర్పాటు చేశారు. ఈ సంస్థ భారత్‌లోని ఒడిశాకు చెందిన ‘ప్రజాక్త కోలి’ కి యూత్ క్లైమేట్ చాంపియన్ అవార్డ్‌ను ప్రకటించింది. సామాజిక మాధ్యమాల వేదికగా మహిళల హక్కులు, బాలికల విద్య కోసం ప్రజాక్త కోలి చేస్తున్న కృషికిగాను ఈ అవార్డ్‌ను అందజేశారు. ఆమె ఈ అవార్డును పొందిన భారత తొలి వ్యక్తి.
యూఎన్ ఉమెన్
ఇది కూడా న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. మహిళల సాధికారత, లింగ సమానత్వం కోసం కృషి చేస్తుంది. 500,000 అమెరికన్ డాలర్లు భారత్ అందించింది. ఈ సంస్థను 2010 జూలైలో ఏర్పాటు చేయగా.. 2011 నుంచి పని చేస్తుంది.
అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ
ఇది కూడా న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. భారత సంతతికి చెందిన గీతాగోపీనాథ్ ఇందులో ముఖ్య ఆర్థికవేత్తగా విధులు నిర్వహించే వారు. ఈ ఏడాది ఆమె ఇదే సంస్థలో పదోన్నతి పొందారు. జనవరి 21న అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆమె బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ముఖ్య కార్యదర్శిగా పియరీ ఒలివియర్ గౌరించాస్ బాధ్యతలు స్వీకరించారు.
ప్రపంచ బ్యాంక్
REWARD అనే కార్యక్రమంలో భాగంగా కర్నాటక రాష్ర్టానికి 60 మిలియన్ డాలర్లు, ఒడిశా రాష్ర్టానికి 49 మిలియన్ డాలర్లు, భారత ప్రభుత్వానికి 6 మిలియన్ డాలర్ల రుణాన్ని ప్రపంచ బ్యాంక్ అందించింది. REWARD పూర్తి రూపాన్ని పరిశీలిస్తే- రెజువెనేటింగ్ వాటర్‌షెడ్ ఫర్ అగ్రికల్చరల్ రెసిలియన్స్ త్రో ఇన్నోవేటివ్ డెవలప్మెంట్. అణగారిన వర్గాల సాంఘిక భద్రత కోసం పశ్చిమబెంగాల్ రాష్ర్టానికి 125 మిలియన్ డాలర్ల రుణాన్ని కూడా ప్రపంచ బ్యాంక్ అందించింది.
దక్షిణాఫ్రికా దేశంలో అంతరించే ప్రమాదంలో ఉన్న బ్లాక్ రైనో అనే జాతిని రక్షించేందుకు వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ బాండ్ (అటవీ జంతు సంరక్షణ బాండ్)ను ప్రపంచ బ్యాంక్ అందించింది. ఈ తరహా బాండ్‌ను ప్రపంచ బ్యాంక్ ఇవ్వడం ఇదే తొలిసారి.
భారతదేశంలో పేదరికానికి సంబంధించి ఇటీవల ప్రపంచ బ్యాంక్ ఒక నివేదికను విడుదల చేసింది. దీని ప్రకారం 2011లో 22.5% తీవ్ర పేదరికం భారత్‌లో ఉండగా 2019 నాటికి 10.2 శాతానికి తగ్గింది. అలాగే పట్టణ ప్రాంతాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లోనే పేదరిక తగ్గుదల శాతం ఎక్కువగా ఉంది. 2011లో గ్రామీణ ప్రాంతాల్లో 26.3% పేదరికం ఉండగా, 2019 నాటికి 11.6 శాతానికి తగ్గింది. ఇదే కాలంలో పట్టణ ప్రాంతాల్లో 14.2 శాతం నుంచి 6.3 శాతానికి తగ్గింది.
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన మిషన్ కర్మయోగికి ప్రపంచ బ్యాంక్ 47 మిలియన్ డాలర్ల సాయం అందిస్తుంది.
యూరప్ దేశాల్లోని సంస్థలు
యూరప్‌లోని స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, రోమ్ తదితర దేశాల్లో ఎన్నో అంతర్జాతీయ సంస్థలున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఈ సంస్థలు వార్తల్లో నిలవడానికి కారణాలను పరిశీలిద్దాం.
జెనీవా కేంద్రంగా పనిచేసే సంస్థలు
ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ వాణిజ్య సంస్థ, మేధో హక్కుల సంస్థ, వాతావరణ సంస్థ, మానవ హక్కుల సంఘం, శరణార్థుల సంఘం.
ప్రపంచ ఆరోగ్య సంస్థ
సాంప్రదాయ ఔషధ ప్రపంచ కేంద్రాన్ని గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేయనుంది. ఇందుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రపంచంలోనే ఈ తరహా కేంద్రం ఇదే మొదటిది. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో దీనిని నెలకొల్పనున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థను 1948 ఏప్రిల్ 7న ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దీనికి డైరెక్టర్ జనరల్‌గా టెడ్రోస్ అథనామ్ వ్యవహరిస్తున్నారు.
యూఎన్‌సీటీఏడీ
దీని పూర్తి రూపం యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్. దీనిని 1964లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఈ సంస్థకు సెక్రటరీ జనరల్‌గా రెబెకా గ్రిన్స్పాన్ వ్యవహరిస్తున్నారు. ఈ సంస్థకు నేతృత్వం వహిస్తున్న తొలి మహిళ ఆమె. కోస్టారికా దేశస్తురాలు. ప్రపంచ వాణిజ్యానికి సంబంధించి పలు అంచనాలు చేయడం ద్వారా ఈ సంస్థ వార్తల్లో నిలిచింది. ఫిబ్రవరి 17న ఈ గణాంకాలను విడుదల చేసింది. వస్తు, సేవల ప్రపంచ వాణిజ్యం 2021లో 28.5 ట్రిలియన్ డాలర్లు ఉందని, 2020తో పోలిస్తే ఇది 25% ఎక్కువ అని పేర్కొంది. 2019తో పోలిస్తే ఇది 13% ఎక్కువని తెలిపింది. అలాగే భారత్‌కు సంబంధించిన పలు గణాంకాలను కూడా వెల్లడించింది. 2022లో భారత్ 6.7% వృద్ధిని సాధిస్తుందని గతంలో పేర్కొంది. అయితే ప్రస్తుతం దీనిని సవరించింది. 4.6% మాత్రమే వృద్ధి ఉండొచ్చని అంచనా వేసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఈ మేరకు నిర్ణయించింది.
అంతర్జాతీయ కార్మిక సంస్థ
ఆఫ్రికాలోని టోగో దేశానికి చెందిన గిల్బర్ట్ హౌంగ్బో అంతర్జాతీయ కార్మిక సంస్థకు తదుపరి డైరెక్టర్ జనరల్‌గా ఎంపికయ్యారు. ఈ ఏడాది అక్టోబర్‌లో ఆయన బాధ్యతలను స్వీకరిస్తారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్‌కు నేతృత్వం వహించనున్న తొలి ఆఫ్రికా వాసి ఆయన. అయిదు సంవత్సరాల పాటు పదవిలో కొనసాగుతారు. మొత్తంగా ఈ సంస్థకు నేతృత్వం వహించనున్న 11వ వ్యక్తి. ప్రస్తుతం గిల్బర్ట్ ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్కు అధ్యక్షుడిగా ఉన్నారు. రోమ్ కేంద్రంగా పనిచేసే సంస్థ ఇది.
ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం
ఇది కూడా జెనీవా కేంద్రంగా పనిచేస్తుంది. రష్యాను సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో పౌరులను చంపిందని రష్యాపై ఉన్న ఆరోపణ. ఈ సంస్థలో నుంచి సభ్య దేశాలను సస్పెండ్ చేయడానికి ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టాలి. అయితే భారత్‌తో సహా 58 దేశాలు ఇందులో గైర్హాజయ్యాయి. మానవ హక్కుల సంఘం నుంచి సస్పెండ్ అయిన రెండో దేశం రష్యా. 2011లో లిబియా దేశాన్ని కూడా సస్పెండ్ చేశారు.
ఇయాన్ ఫ్రై
మానవ హక్కులు-పర్యావరణ మార్పునకు సంబంధించి తొలి వ్యక్తిగత నిపుణుడిగా ఇయాన్ ఫ్రైను ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల సంఘం నియమించింది. ఆయనకు తువాలు, ఆస్ట్రేలియా దేశాల ద్వంద్వ పౌరసత్వం ఉంది. ఈ పదవిని చేపట్టిన తొలి వ్యక్తి ఆయన.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు