మస్తిష్కపు పొరలలో…
15819472925311194017
పైన పేర్కొన్న సంఖ్యలో మొత్తం 20 అంకెలు ఉన్నాయి. అంటే రెండు సెల్‌ఫోన్ నెంబర్లతో సమానం. వీటిని చదివి, గుర్తుంచుకోడానికి ఎంత సమయం పడుతుంది. చాలామంది బట్టీ పట్టడం ప్రారంభిస్తారు. మూడు అంకెల చొప్పున విభజించుకొని, నేర్చుకుంటారు. సాధారణంగా జరిగే ప్రక్రియ ఇది. అయితే, కింద పేర్కొన్న విధానాన్ని ఒకసారి పరిశీలించండి…
భారత దేశానికి స్వాతంత్య్రం ఏ తేదీన వచ్చింది – 15.
-ఏ నెల – ఆగస్ట్, అంటే ఎనిమిదో నెల – 8
-సంవత్సరం – 1947
-మొత్తం ఎన్ని రాష్ర్టాలు ఉన్నాయి-29
-29 రాష్ర్టాలను ఆంగ్ల డిక్షనరీ ప్రకారం పరిశీలిస్తే తెలంగాణ-25వ రాష్ట్రం
-తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం జిల్లాల సంఖ్య-31
-తెలంగాణలో ఉన్న మొత్తం శాసనసభ నియోజకవర్గాలు-119
-తెలంగాణ శాసన మండలి స్థానాలు-40
-తెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాలు-17
-15/8/1947/29/25/31/119/40/17. ఈ పద్ధతిలో బట్టీ పట్టాల్సిన అవసరం ఉండదు. తేలికగా నేర్చుకోవచ్చు. పైగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది.
మనిషిలో ఎడమ, కుడి మస్తిష్కాలు ఉంటాయి. ఎడమ వైపున ఉండేది భాషకు సంబంధించిందని మనస్తత్వ శాస్త్రవేత్తలు చెప్తారు. అంటే చిత్రాలతో (ఇమేజెస్) దీనికి సంబంధం ఉండదు. తార్కికంగా ఆలోచిస్తుంది. అయితే కుడి మెదడు భిన్నమైంది. దీని సాఫ్ట్వేర్ కేవలం చిత్రాలే. దీనికి అంత తార్కిక పరిజ్ఞానం ఉండదు. తరచూ చూసే వాటిని చిత్రాల రూపంలో భద్రపరుస్తుంది. చాలా మంది విద్యార్థులు కుడి మెదడును వినియోగించరు. బట్టీ విధానానికి ప్రాధాన్యం ఇస్తారు. దీంతో అస్సలు కాన్సెప్ట్ అర్థం కాదు. చదివినా ఎక్కువ ప్రయోజనం ఉండదు.
ఏ అంశాన్నయినా కాన్సెప్ట్‌ను అర్థం చేసుకొని దానిని చిత్రాల రూపంలోకి మార్చగలిగితే ఏదైనా గుర్తుంచుకోవడం చాలా తేలిక. ముఖ్యంగా కుడి మెదడును ఉపయోగించి నేర్చుకోవడం వల్ల చాలా ప్రయోజనం ఉంటుంది. వేగంగా నేర్చుకోవచ్చు. ఎక్కువ కాలం గుర్తుంచుకోవచ్చు. సాధారణంగా డార్క్ రంగులు కలిగి, పెద్దపెద్దగా ఉండే చిత్రాలను మెదడు చాలా తేలికగా గుర్తుంచుకుంటుంది. ఉదాహరణకు మీ మిత్రుల్లో ఎవరన్నా డార్క్‌గా ఉండే రంగులు వేసుకుంటే ఆ రోజంతా అతడు వేసుకున్న షార్ట్ గుర్తుంటుంది. లేదా చాలా పెద్దగా ఉండే చిత్రాలు, ఉదాహరణకు విగ్రహాలు లేదా ఎత్తైన ప్రదేశాలు… ఇలా అన్ని మనకు గుర్తుండిపోతాయి. అలాగే నిత్య జీవితానికి భిన్నంగా ఉండేవి కూడా మనిషికి తేలికగా గుర్తుంటాయి. ఉదాహరణకు పాఠశాల విద్యార్థులు టై కట్టుకుంటారు. ఒకరోజు అనుకోకుండా తిరగేసి కట్టుకుంటే అది అందరికీ గుర్తుండిపోతుంది. ఎందుకంటే సాధరణానికి అది భిన్నంగా ఉంది కాబట్టి. పెద్ద అయ్యాక కూడా అలా కట్టుకున్న వ్యక్తి తారసపడితే గత సంఘటన గుర్తుకు వస్తుంది. వాటిని అతడితో చర్చించి నవ్వుకునే సందర్భాలు కూడా ఉంటాయి. అంటే మనిషి ఏదైనా తేలికగా నేర్చుకోవాలంటే రోటీన్‌కు భిన్నంగా ఉండాలి లేదా పెద్దపెద్దగా ఉండాలి. నేర్చుకోవడంలోనే ఈ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా చాలా ప్రయోజనం ఉంటుంది.
తెలిసిన వాటితో లింక్ చేసుకోవటం: మస్తిష్కంలో మనకు తెలియకుండానే చాలా సమాచారం నిక్షిప్తమై ఉంటుంది. దానిని వినియోగించుకుంటూ కొత్త వాటిని నేర్చుకోవడం ద్వారా ఎంతో ప్రయోజనం ఉంటుంది. తల్లిదండ్రులు, తోబుట్టువులు, ఇరుగుపొరుగు, స్నేహితులు, వీరందరి చిత్రాలతో పాటు, రోజు మనం చూసే ప్రదేశాలు, సినిమాలు, చారిత్రాత్మక ప్రదేశాలు, గుళ్లు, పర్యాటక ప్రదేశాలు. ఇలా ప్రతి ప్రదేశాన్ని కొత్తవాటిని నేర్చుకొనేందుకు వినియోగించాలి.
ప్రణాళికలు-వాటి ప్రాధాన్యాలు ఎలా గుర్తుంచుకోవాలో చూద్దాం. తొలి ప్రణాళికలో వ్యవసాయానికి, రెండో ప్రణాళిక పారిశ్రామిక రంగానికి, మూడో ప్రణాళిక స్వయం సంవృద్ధి, నాలుగో ప్రణాళిక సుస్థిర వృద్ధిని సాధించడం. బట్టి విధానంలో కాకుండా, ఈ నాలుగింటిని మీకు బాగా తెలిసిన నలుగురు వ్యక్తులతో ముడి పెట్టడం ద్వారా తేలికగా గుర్తుంచుకోవచ్చు.
ఉదాహరణకు తాతయ్య, నాయనమ్మ, నాన్న, అమ్మ ఈ నలుగురిని తీసుకుందాం. తాతయ్య వ్యవసాయం చేస్తారు. అయన తొలి ప్రణాళికకు లింక్ చేశాం. నాయనమ్మ పరిశ్రమలో పని చేసింది. అంటే ఆమెను రెండో ప్రణాళికకు అనుసంధానం చేశాం. మూడో ప్రణాళికను నాన్నతో అనుసంధానం చేస్తే, ఆయన స్వయం సంవృద్ధికి ప్రాధాన్యం ఇచ్చారు. ఇక నాలుగో ప్రణాళిక అమ్మతో పోల్చడం ద్వారా ఆమె సుస్థిర వృద్ధికి తోడ్పడుతుంది. ఎప్పుడు ఒకటో ప్రణాళిక నేర్చుకోవాలన్నా, తాతయ్యతో లింక్ చేయడం ద్వారా వాటిని అధ్యయనం చేయాలి. అలాగే ఆయా ప్రణాళికలు, ఆయా వ్యక్తులతో అనుసంధానం చేయాలి. మొత్తం మనకు 12 ప్రణాళికలు ఉన్నాయి. వాటిని 12 మంది మీకు బాగా తెలిసిన వ్యక్తులతో అనుసంధానం చేయండి. అ తర్వాత ఫలితం చూడండి.
పైన పేర్కొన్న సంఖ్యలో భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తేదీ, నెలా, సంవత్సరం, మొత్తం రాష్ర్టాల సంఖ్య, డిక్షనరీ ప్రకారం అమరిస్తే తెలంగాణ స్థానం, తెలంగాణలో మొత్తం జిల్లాలు, శాసనసభ నియోజకవర్గాలు, శాసనమండలి స్థానాలు, లోక్‌సభ స్థానాలు… ఇవన్ని మీ మెదడులో ఇప్పటికే నిక్షిప్తమై ఉన్నాయి. వాటిని ఉపయోగించుకొని సంఖ్యను తేలికగా గుర్తుంచుకున్నాం. ఇదే విధానాన్ని, అంటే మనకు తెలిసిన అంశాలనే ఉపయోగిస్తూ కొత్త పరిజ్ఞానాన్ని మెదడులో నిక్షిప్తం చేస్తాం.
ఈ తరహా విధానాన్ని అనుసరించి జాగ్రఫీ (నదులు, వాటి ఉపనదులు, భారత దేశం రాష్ర్టాలు, ఏ దేశాలతో సరిహద్దును కలిగి ఉన్నాయి…ఇలా), చరిత్ర, పాలిటీ తదితర అంశాలే కాకుండా డిక్షనరీ, దేశాలు-రాజధానులు, కరెన్సీలు కూడా తేలికగా గుర్తుంచుకోవచ్చు. అది ఎలాగో ముందుముందు పరిశీలిద్దాం.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు