అంతరిస్తున్న జీవజాతులు
తెలంగాణ జీవ వైవిధ్య బోర్డు ప్రకారం రాష్ట్రంలో 23 రకాల క్షీరదాలు, 25 వృక్ష జాతులు, 27 పక్షి జాతులు, 9 సరీసృపాలు, 12 చేప జాతులు అంతరించే స్థితికి చేరుకున్నాయి.
వాటిలో ముఖ్యమైనవి…
-జంతువులు: తోడేలు, అడవి కుక్క, గుంట నక్క, పులి, చిరుత
-క్షీరదాలు: పునుగుపిల్లి, నీటిపిల్లి, నీటి కుక్క, ఎలుగుబంటి, దుప్పి, అడవి దున్న
-వృక్షాలు : బిల్లుడు, ఇరుగుడు, మారేడు కొమ్ములు, నక్షత్రాల చుక్క, నేలవేము, చక్క దుంప, కుక్క వామింత
-పక్షులు: బట్టమేక పక్షి, నేల నెమలి, కొమ్ము కసిరి, రాబందు, గద్ద, బాతు, వంకరమూతి కొంగ, ఎర్రకాళ్ల కొంగ, నల్లతల కనకం, చుక్కల ముక్కు బాతు.
– సరీసృపాలు: మొసలి, కొండచిలువ, కట్లపాము, పింజరి, బంగారు బల్లి, నలికిరి
రాష్ట్రంలో తగ్గిన శిశు మరణాల రేటు
జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2015-16 ప్రకారం తెలంగాణలో ప్రతి వేయిమందికి శిశు మరణాల రేటు 41 నుంచి 32కు తగ్గింది. రాష్ట్రంలో గర్భిణి దశలో ప్రభుత్వ దవాఖానాల్లో పూర్తిస్థాయి వైద్యసేవలు పొందుతున్నవారు 42.2 శాతం ఉన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 31 శాతం కాన్పులవుతున్నాయి. జననీ సురక్ష యోజన కింద ప్రభుత్వం మహిళలకు అందిస్తున్న రూ.1000 ఆర్థిక సాయం లబ్ధిదారులు కేవలం 12.2 శాతం మాత్రమే. రాష్ట్రంలో ఒక్కో కాన్పుకు సగటున రూ. 4,020 ఖర్చవుతుంది.
బుగ్గపాడులో భారీ ఆహారశుద్ధి కేంద్రం
ఖమ్మం జిల్లా బుగ్గపాడులో తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ (TSIIC)కు చెందిన 60 ఎకరాల్లో రూ. 112 కోట్లతో భారీ ఆహార శుద్ధి కేంద్రం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో ఏర్పాటవనున్న ఈ తొలి కేంద్రానికి కేంద్ర సర్కారు రూ. 50 కోట్లు ఇస్తున్నది. నాబార్డ్ రూ. 32 కోట్ల రుణాన్ని అందిస్తుంది. రూ. 30 కోట్లను రాష్ట్రం భరిస్తుంది. ఖమ్మం, నల్లగొండ, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల రైతులకు దీనిద్వారా లబ్ధి చేకూరుతుంది. ఈ ఐదు జిల్లాల్లో ప్రాంతీయ కేంద్రాలు (గోదాములు, శీతల గిడ్డంగులు) ఉంటాయి. ప్యాకింగ్, ప్రింటింగ్ యూనిట్లు బుగ్గపాడులో ఉంటాయి.
తొలి సేంద్రియ రాష్ట్రంగా సిక్కిం
దేశంలో తొలి సేంద్రియ రాష్ట్రంగా సిక్కింను ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు. జనవరి 18న గ్యాంగ్‌టక్‌లో జరిగిన రాష్ర్టాల వ్వవసాయ మంత్రుల సదస్సులో ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ చామ్లింగ్‌కు ధ్రువీకరణ పత్రాన్ని అందించారు. సిక్కింను సుఖిస్థాన్ (సుఖవంతమైన ప్రాంతం)గా అభివర్ణించారు. రాష్ట్రంలో అభివృద్ధిపరిచిన మూడు పూల మొక్కలకు సర్దార్, దీన్‌దయాళ్, నమో పేర్లను పెట్టారు. వాతావరణ మార్పుల నేపథ్యంలో వ్యవసాయాన్ని సాధారణ పంట సాగు, కలప పెంపకం, పశుపోషణ అని మూడు భాగాలుగా విభజించుకోవాలని ప్రధాని సూచించారు. శీతల పానియాల్లో 5 శాతం పండ్ల రసం కలపడంతో పండ్ల వృథాను నివారించవచ్చన్నారు.
నేతాజీ 100 ఫైళ్లు బహిర్గతం
నేతాజీ 119వ జయంతి సందర్భంగా ఆయన అదృశ్యానికి సంబధించి 16,600 పేజీలున్న 100 ఫైళ్లను ప్రధాని మోదీ జనవరి 23న ఢిల్లీలో విడుదల చేశారు. ఇందులో పీఎంవో నుంచి 36, హోంశాఖ నుంచి 18, విదేశాంగ శాఖ నుంచి 46 ఫైళ్లున్నాయి. 1945 ఆగస్టు 18న తైపీలోని తైహుక్లో జరిగిన విమాన ప్రమాదంలో నేతాజీ మరణించారని రెండు కమిషన్లు పేర్కొనగా, ఎంకే ముఖర్జీ కమిటీ మాత్రం ఈ ప్రమాదం తర్వాత కూడా బోస్ జీవించాడని పేర్కొంది.
ఉత్తమ దేశాల్లో భారత్ @ 22
న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ (అమెరికా), పెన్సిల్వేనియా వర్సిటీకి చెందిన వార్టన్ స్కూల్, బీఏవీ కన్సల్టింగ్లు రూపొందించిన ప్రపంచ ఉత్తమ దేశాల జాబితాలో జర్మనీ, కెనడా, బ్రిటన్, అమెరికా, స్వీడన్ తొలి ఐదు స్థానాల్లో నిలిచాయి. జాబితాలో భారత్‌కు 22, చైనాకు 17వ స్థానం దక్కింది. వర్థమాన ఆర్థిక వ్యవస్థల విభాగంలో అగ్రస్థానం పొందినప్పటికీ దేశ జనాభా కారణంగా ఆదాయం, తలసరి స్థూల జాతీయోత్పత్తి విషయంలో ప్రపంచ నిరుపేద దేశాల్లో భారత్ ఒకటని ఆ నివేదిక పేర్కొంది. 24 విభాగాల్లో 60 దేశాలకు ర్యాంకులు కేటాయించారు. విద్యుత్, ప్రభావం వంటి అంశాల్లో అమెరికా, పౌరసత్వం, పిల్లల పెంపకం, హరిత జీవనంలో స్వీడన్, సాహసాలకు బ్రెజిల్, వ్యాపార ప్రారంభానికి లక్సెంబర్గ్ అగ్రస్థానంలో నిలిచాయి. సాంస్కృతిక ప్రభావానికి ఫ్రాన్స్, వ్యాపార నిర్వహణకు జర్మనీ, జీవన నాణ్యతకు కెనడా, వారసత్వానికి ఇటలీ ప్రథమ స్థానాన్ని పొందాయి.
బాచాఖాన్ వర్సిటీపై ఉగ్రదాడి
పాక్‌లోని వాయవ్య ఖైబర్ పఖ్తున్ఖ్వా ప్రావిన్స్‌లో పెషావర్‌కు 50 కి.మీ. దూరంలో చార్సద్దా వద్ద ఉన్న బాచాఖాన్ (బాద్షా ఖాన్) వర్సిటీపై జనవరి 20న తెహ్రిక్ ఏ తాలీబాన్ పాకిస్థానీ ఉగ్రవాదసంస్థ జరిపిన దాడిలో 20 మంది మరణించారు. వీరిలో 18 మంది విద్యార్థులు, ఒక ప్రొఫెసర్ (సయ్యద్ హమీద్ హుస్సేన్), ఒక సిబ్బంది ఉన్నారు. ఆ తర్వాత పాక్ దళాల కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మరణించారు.
ఎన్‌ఐఐఎఫ్‌కు బ్రిటన్ సహకారం
జనవరి 20న లండన్‌లో భారత్, బ్రిటన్ ఆర్థిక మంత్రులు అరుణ్ జైట్లీ, జార్జ్ ఓస్బోర్న్ పాల్గొన్న 8వ బ్రిటన్-భారత్ ఆర్థిక వ్యవహారాల సమావేశం (ఈఎఫ్ఓ)లో జాతీయ పెట్టుబడులు, మౌలిక నిధి (ఎన్ఐఐఎఫ్) కింద భారత్‌లో భారీ మౌలిక ప్రాజెక్టులకు సహకారాన్ని బ్రిటన్ ప్రకటించింది. ఆర్థిక సేవల సాంకేతిక పరిజ్ఞానం, పునరుత్పాదక ఇంధన వనరులు, స్మార్ట్‌సిటీస్, రైల్వేల వంటి వాటిలో కూడా బ్రిటన్ సహకరించనుంది. పన్ను ఎగవేత సమాచార పరస్పర బదిలీకి 2017 నుంచి కామన్ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ (సీఆర్ఎస్)ను ఇరుదేశాలు అనుసరించనున్నాయి. రైల్వే రూపాయి బాండ్లలాగే, ఇతర రూపాయి ఆధారిత ఉత్పత్తులను తీసుకొచ్చేందుకు నిర్ణయించాయి. దేశీయ న్యాయసేవల విపణిలోకి విదేశీ న్యాయవాదులను అనుమతించేలా భారత్ నిబంధనలను సరళీకరించనుంది.
62 మంది చేతుల్లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ
ప్రపంచ జనాభాలోని 370 కోట్ల మంది నిరుపేదల వద్దగల 1,19,15,983 కోట్లకు సమానమైన సంపద 62 మంది సంపన్నుల వద్ద ఉందని డబ్ల్యూఈఎఫ్ జనవరి 18న వెల్లడించింది. ఆక్స్‌ఫామ్ అనే హక్కుల సంఘం అధ్యయనంతో ఒక్క శాతం వ్యక్తుల ఆర్థిక వ్యవస్థ నివేదికను విడుదల చేసింది. ప్రపంచ జనాభాలో సగం మంది వద్ద ఉన్న సంపదకు సమానమైన సంపద 2010లో 388 వద్ద ఉండగ, 2011లో ఆ సంఖ్య 177కు, 2012లో 159కు, 2013లో 92కు, 2014లో 80కి, 2015లో 62కు పడిపోయింది. 2010 నుంచి ప్రపంచ జనాభాలో సగం మంది ఆస్తి 41 శాతం తగ్గి 67,70,445 కోట్లకు చేరింది. పన్ను ఎగవేత కోసం ప్రపంచ వ్యాప్తంగా విదేశాలకు 5,14,55,382 కోట్ల సంపద తరలుతోంది. దీన్ని అడ్డుకుంటే ప్రభుత్వాలకు ఏటా రూ. 12,86,384 కోట్ల అదనపు ఆదాయం లభిస్తుంది.
డబ్ల్యూఈఎఫ్ ఉద్యోగాల భవిష్యత్తు నివేదిక
నాలుగో పారిశ్రామిక విప్లవం, సామాజిక ఆర్థిక జనాభా పరమైన మార్పులతో వచ్చే ఐదేండ్లలో ప్రపంచ వ్యాప్తంగా 51 లక్షల ఉద్యోగాలు మాయమవుతాయని డబ్ల్యూఈఎఫ్ ఉద్యోగాల భవిష్యత్తు నివేదిక వెల్లడించింది. గణితం, కంప్యూటర్, ఇంజినీరింగ్, భవన నిర్మాణ రంగాల్లో కొత్తగా 21 లక్షల ఉద్యోగాలు పుట్టుకొస్తాయి. అయితే యాంత్రీకరణ, అనావశ్యకత, మధ్యవర్తుల ప్రమేయం తగ్గడం వల్ల 72 లక్షల ఉద్యోగాలు పోతాయి. భారత్, మెక్సికో, టర్కీ, గల్ఫ్ సహకార మండలి దేశాల్లోని సామాజిక పరిస్థితుల వల్ల ఆ దేశాల్లో ఉద్యోగ అవకాశాలు తగ్గిపోవని నివేదిక వెల్లడించింది.
ఫ్రాన్స్‌లో ఆర్థిక అత్యవసరస్థితి
వృద్ధిరేటు, నిరుద్యోగ సమస్యలతో జనవరి 18న ఫ్రాన్స్ ఆర్థిక అత్యవసర స్థితిని ప్రకటించింది. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు 2.2 బిలియన్ డాలర్ల ప్రణాళికలను వెల్లడించింది. ఉపాధి కరువైన 5 లక్షల మంది కార్మికులకు శిక్షణను, యువతను ఎక్కువగా నియమించుకునే చిన్న సంస్థలకు 2 వేల యూరోల సహకారం వంటి చర్యలను ప్రకటించింది.
ఇరాన్‌పై తొలగిన ఆంక్షలు
ఇరాన్‌పై విధించిన చమురు, ఆర్థిక ఆంక్షలను అమెరికా, ఈయూ జనవరి 17న తొలగించారు. దీంతో అంతర్జాతీయ సమాజం స్తంభింపజేసిన 100 బిలియన్ డాలర్లను ఇరాన్ తిరిగి పొందగలుగుతుంది. 2015 జూలైలో అమెరికా, బ్రిటన్, రష్యా, చైనా, ఫ్రాన్స్, జర్మనీలతో కుదిరిన ఒప్పందం మేరకు ఇరాన్ మూడింట రెండొంతుల యురేనియం సెంట్రి ఫ్యూజులను తగ్గించుకోవాలి. ఆయుధ శ్రేణి ఫ్లుటోనియాన్ని ఇచ్చే అరాక్ రియాక్టర్ కోర్ భాగాన్ని తొలగించాలి. ఇవి అమలైనట్లు ఇరాన్ తమవద్ద గల అణు ఇంధనంలో 98 శాతాన్ని రష్యాకు పంపిందని, 12 వేలకు పైగా సెంట్రిఫ్యూజులను ధ్వంసం చేసిందని ఐఏఈఏ వెల్లడించింది. 2012 నుంచి ఆంక్షల వల్ల ఇరాన్ 16 వేల కోట్ల చమురు ఆదాయాన్ని కోల్పోయింది. ఇరాన్ ఎయిర్‌బస్ నుంచి 100 బిలియన్ డాలర్లతో 114 పౌర విమానాలను కొనుగోలు చేయనుంది.
వజ్ర నక్షత్ర వీధి – ట్రంప్లర్ 14
మెరుస్తున్న వజ్రం ఆకారాన్ని పోలిన నక్షత్ర సముదాయ చిత్రాలను హబుల్ టెలిస్కోప్ గుర్తించింది. దీన్ని ట్రంప్లర్ 14 అని పిలుస్తున్నారు. ఇది నక్షత్రాలు అధికంగా ఉండే కారినా నెబ్యులాకు 8 వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.
సౌరవ్యవస్థలో ప్లానెట్ నైన్
కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ పరిశోధకులు కొన్‌స్టాంటిన్ బటిజిన్, మైక్ బ్రౌన్‌లు గణిత నమూనా, కంప్యూటర్ స్టిమ్యులేషన్ల ద్వారా భూమికి పదిరెట్లు ద్రవ్యరాశిగల ప్లానెట్ నైన్‌ను గుర్తించారు. ఫ్లూటోకు 5 వేల రెట్లు ద్రవ్యరాశిగల ఈ గ్రహమార్గం సాగదీసినట్లు ఉండటంతో సూర్యుడి చుట్టూ తిరిగేందుకు సమారు 20 వేల సంవత్సరాలు పడుతుంది. నెప్ట్యూన్‌కు ఆవల ఉండే అంతుచిక్కని మంచు వస్తువులు, వ్యర్థాలకు సంబంధించిన అంశాల్ని ఈ గ్రహం వివరించే అవకాశం ఉంది.
కోతి తల మార్పిడి శస్త్రచికిత్స
2017 కల్లా మానవ తల మార్పిడి సాధ్యమని ప్రకటించిన సెర్గియో కానావెరో చైనాలోని హర్చిన్ వైద్య విశ్వవిద్యాలయంలో కోతి తల మార్పిడి చేశారు. ఆ తర్వాత 20 గంటల్లో నైతిక కారణాలతో దాన్ని చంపేశారు. 1970లో రాబర్ట్ వైట్ తొలిసారిగా కోతి తల మార్పిడి చేయగా రోగనిరోధక వ్యవస్థ తిరస్కారంవల్ల అది 9 రోజుల్లో మరణించింది. పాలీఇథిలీన్ ైగ్లెకాల్ (PEG)ను ఉపయోగించి వెన్నుపాము పొరలను రక్షించడం ఈ తల మార్పిడి చికిత్సలో అత్యంత కీలకం. ఇక తొలి మానవ తల మార్పిడి శస్త్ర చికిత్సకు వాలరీ స్పిరిరిదోనోన్ అనే రష్యా రోగి ఎంపికయ్యాడు.
IRNSS 1-E ప్రయోగం
1,425 కిలోల బరువుతో 12 ఏండ్లపాటు సేవలందించే భారత 5వ నావిగేషన్ ఉపగ్రహం IRNSS 1-E ని జనవరి 20న పీఎస్ఎల్వీ – సీ31 ద్వారా శ్రీహరికోట నుంచి కక్ష్యలో ప్రవేశపెట్టారు. ఏడు ఉపగ్రహాల ఈ సిరీస్‌లో 3 భూ స్థిర కక్ష్యలో, 4 భూ అనువర్తిత కక్ష్యలో ఉంటాయి. తాజా విజయం పీఎస్ఎల్వీ శ్రేణిలో 33వది. XL విభాగంలో 11వది. రూ. 175 కోట్ల ఖర్చుతో నిర్మించిన పీఎస్ఎల్వీ రాకెట్ పొడవు 44.4 మీటర్లు. బరువు 320 టన్నులు. ఇందులో నాలుగు దశలు ఉండగా 1,3 దశల్లో ఘన ఇంధనం, 2,4 దశల్లో ద్రవ ఇంధనాన్ని వినియోగించారు. భూమి, ఆకాశం, జలాల్లో దిశానిర్దేశ సేవలందించే IRNSS 1-E వ్యయం రూ. 125 కోట్లు. భారత్ చుట్టూ 1500 కి.మీల పరిధిలో సేవలందిస్తుంది. ప్రస్తుతం అమెరికా (GPS), రష్యా (గ్లోనాస్), యూరప్ (గెలీలియో), చైనా (బేయ్‌డోవ్), జపాన్ (క్వాసీ జెనిత్) దేశాలకు మాత్రమే సొంత నావిగేషన్ వ్యవస్థలున్నాయి.
రెండో అతిపెద్ద కృష్ణ బిలం
పాలపుంతలో రెండో పెద్ద కృష్ణ బిలం సీవో-0.4-0.22ను తొమొహరు (జపాన్) నేతృత్వంలోని శాస్త్రవేత్తలు గుర్తించారు. పాలపుంత కేంద్ర భాగానికి 200 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ బిలం ద్రవ్యరాశి సూర్యుడితో పోలిస్తే వందరెట్లు అధికం.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు