భిన్న శీతోష్ణస్థితుల భారతం.. పసిడి పంటల నిలయం!
దేశంలో వివిధ ప్రాంతాల్లో వివిధ వ్యవసాయ విధానాలు అమల్లో ఉన్నాయి. దేశంలో వ్యవసాయం ఒక పురాతనమైన ఆర్థిక కార్యకలాపం. అనేక సంవత్సరాలుగా సాగుతున్న వ్యవసాయం భౌతిక పరిసరాలు, సాంకేతిక ఆవిష్కరణలు, సామాజిక సాంస్కృతిక కారణాల వల్ల మార్పునకు గురవుతున్నది. ప్రస్తుతం దేశంలో రెండు రకాల వ్యవసాయ విధానాలు అమల్లో ఉన్నాయి. అవి సాధారణ జీవనాధార వ్యవసాయం, సాంద్ర జీవనాధార వ్యవసాయం.
సాధారణ జీవనాధార వ్యవసాయం (Simple Subsistence Farming)
ఇది చిన్న కమతాల్లో పురాతన పనిముట్లు అయిన పార, గుల్లకర్ర సహాయంతో కుటుంబానికి మాత్రమే పరిమితమైన పద్ధతి.
ఈ వ్యవసాయక విధానంలో పంటల పెరుగుదల కింది అంశాలపై ఆధారపడి ఉంటుంది. అవి..
1) రుతుపవనాలు
2) భూమిలోని పోషక పదార్థాలు
3) అనుకూలమైన పరిస్థితులు
దీన్నే ‘నరుకు-కాల్చే వ్యవసాయం (పోడు వ్యవసాయం)’ అని కూడా అంటారు.
అధిక జనసాంద్రత కలిగిన ప్రాంతాల్లో ఈ రకమైన వ్యవసాయం అమల్లో ఉంది.
ఈ వ్యవసాయ విధానంలో అధిక దిగుబడుల కోసం అధికంగా వ్యవసాయ శ్రామికులను, అత్యధిక జీవరసాయనిక ఎరువులు, నీటి పారుదలను ఉపయోగిస్తారు.
అధిక దిగుబడి కోసం ఆధునిక ఉత్పాదకాలను విరివిగా ఉపయోగించడం దీని ప్రధాన లక్షణం. ఉదా: అధిక దిగుబడినిచ్చే విత్తనాలు, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు, తెగులు నివారణా మందులు మొదలైనవి.
ఈ వ్యవసాయ విధానం విస్తృతి ప్రాంతాన్ని బట్టి వేరుగా ఉంటుంది.
ఉదా: వరి అనేది పంజాబ్, హర్యానాల్లో వాణిజ్య పంట కాగా ఒడిశాలో జీవనాధార పంట.
తోటల సాగు కూడా ఒక రకమైన వాణిజ్య వ్యవసాయ విధానం. ఈ విధానంలో ఒకే పంటను ఎక్కువ విస్తీర్ణంలో పండిస్తారు.
ఉదా: తేయాకు, కాఫీ, రబ్బరు, చెరకు, అరటి మొదలైనవి.
దేశంలో 3 రకాల పంట కాలాలు ఉన్నాయి. అవి.. 1) ఖరీఫ్ 2) రబీ 3) జయాద్
ఖరీఫ్: నైరుతి రుతుపవనాల రాకతో దాదాపు దేశమంతటా ఖరీఫ్ కాలం ప్రారంభమై సెప్టెంబర్-అక్టోబర్ మధ్యకాలంలో పంట కోతలు ప్రారంభమవుతాయి.
వరి, జొన్న, మొక్కజొన్న, సజ్జ, కందులు, పెసలు, మినుములు, పత్తి, జనుము, వేరుశనగ, సోయాబీన్ మొదలైనవి ముఖ్యమైన ఖరీఫ్ పంటలు.
రబీ: రబీ పంటను శీతాకాలంలో అక్టోబర్-డిసెంబర్ మధ్య కాలంలో విత్తుతారు. ఏప్రిల్-జూన్ మధ్యకాలంలో పంట కోతలు ప్రారంభమవుతాయి.
గోధుమ, బార్లీ, బఠాణీ, శనగలు, ఆవాలు ముఖ్యమైన రబీ పంటలు.
పశ్చిమ విక్షోభాల వల్ల శీతాకాలంలో సంభవించే కొద్దిపాటి వర్షపాతం రబీ పంటలకు అత్యంత ఉపయోగకరం.
పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో కొన్ని చోట్ల విజయవంతమైన హరిత విప్లవం రబీ పంటల అభివృద్ధికి దోహదపడింది.
జయాద్: ఖరీఫ్, రబీ పంట కాలాల మధ్య స్వల్ప వ్యవధి గల పంట రుతువును జయాద్ అంటారు.
పుచ్చకాయ, కర్బూజ, దోసకాయ, కూరగాయలు, పశువుల మేత మొదలైన వాటిని జయాద్ కాలంలో పండిస్తారు.
దేశంలో అనేక రకాల మృత్తికలు, శీతోష్ణస్థితులు, వ్యవసాయ పద్ధతులు ఉండటం వల్ల దేశంలోని వివిధ ప్రాంతాల్లో అనేక రకాలైన ఆహార, ఆహారేతర పంటలు పండిస్తున్నారు. అందులో కొన్ని ముఖ్యమైన పంటలు.
1) వరి: దేశంలో అత్యధికులు ఉపయోగించే ముఖ్య ఆహారం వరి.
ప్రపంచంలో చైనా తరువాత భారత్‌లోనే అత్యధికంగా వరిని పండిస్తున్నారు.
ఇది ముఖ్యంగా ఖరీఫ్ కాలపు పంట.
వరి పంటకు అత్యధిక ఉష్ణోగ్రత (25 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ), అధిక ఆర్ధ్రతతో పాటు 100 సెం.మీ. కంటే ఎక్కువ సంవత్సర వర్షపాతం అవసరం.
తక్కువ వర్షపాతం కలిగిన ప్రాంతాల్లో నీటి పారుదల సహాయంతో వరిని పండిస్తున్నారు.
ఉత్తర మైదానాలు, ఈశాన్య ప్రాంత మైదానాలు, తీర ప్రాంతాలు, డెల్టా ప్రాంతాలు వరి పంటకు ప్రసిద్ధి.
తక్కువ వర్షపాతం కలిగిన పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లలో కాలువలు, గొట్టపు బావుల ద్వారా నీటిని అందించడంతో వరి పంటను సాగుచేస్తున్నారు.
2) గోధుమ: వరి తరువాత రెండో ముఖ్యమైన తృణధాన్యం గోధుమ.
ఇది ఉత్తర, వాయవ్య భారతదేశంలో ముఖ్యమైన ఆహార పంట.
రబీ కాలంలో పండే గోధుమ పంటకు మితమైన ఉష్ణోగ్రత ఉండి కోతకు వచ్చే సమయంలో వాతావరణం ప్రశాంతంగా ఉండాలి.
దీనికి 50-70 సెం.మీ. వర్షపాతం అభిలషణీయం.
దేశంలో గోధుమ పండే రెండు ముఖ్యమైన ప్రాంతాలు..
ఎ. వాయవ్య ప్రాంతంలోని గంగా -సట్లెజ్ మైదానాలు
బి. దక్కన్ పీఠభూమిలోని నల్లరేగడి ప్రాంతం.
ముఖ్యమైన గోధుమ ఉత్పత్తి రాష్ర్టాలు- పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్
3) మొక్కజొన్న: ఇది ఆహారంగాను, పశువుల దాణాగాను ఉపయోగపడే పంట.
ఖరీఫ్‌లో పండే ఈ పంటకు 21 డిగ్రీల సెంటిగ్రేడ్ నుంచి 27 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత అవసరం.
పురాతన ఒండ్రునేలలు అత్యంత అనుకూలం.
బీహార్ వంటి కొన్ని రాష్ర్టాల్లో దీన్ని రబీలో కూడా పండిస్తారు.
ఇటీవల ఆధునిక వ్యవసాయ విధానాల వల్ల పంట దిగుబడి పెరుగుతుంది.
కర్ణాటక, ఉత్తరప్రదేశ్, బీహార్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్‌లలో మొక్కజొన్న ముఖ్యమైన పంట.
4) చిరుధాన్యాలు: భారత్‌లో ముఖ్యమైన చిరుధాన్యాలు- జొన్న, సజ్జ, రాగులు
వీటినే ముతక ధాన్యాలంటారు. వీటిలో అత్యధికంగా పోషక విలువలు ఉంటాయి.
ప్రపంచ జొన్న ఉత్పత్తి, సాగు విస్తీర్ణంలో భారత్ 3వ స్థానంలో ఉంది.
అత్యధికంగా జొన్నను పండిస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర. దీని తరువాత కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్ జొన్న పండించే రాష్ర్టాలు.
సజ్జ పంట ఇసుక నేలల్లో, తేలికపాటి నల్లరేగడి నేలల్లో పండుతుంది.
రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, హర్యానా సజ్జ పండించే ప్రధాన రాష్ర్టాలు.
రాగి పంట శుష్క వాతావరణం గల అన్ని రకాల నేలల్లో పండుతుంది. ఇది కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాల్లో బాగా పండుతుంది.
రాగుల్లో ఇనుము, కాల్షియం ఇతర సూక్ష్మ పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
5) పప్పుధాన్యాలు: ప్రపంచంలో పప్పుధాన్యాల ఉత్పత్తిలో, వినియోగంలో భారతదేశం ప్రథమ స్థానంలో ఉంది.
శాకాహారుల పోషణకు కావల్సిన మాంసకృత్తులు ప్రధానంగా పప్పుధాన్యాల నుంచి లభిస్తున్నాయి.భారత్‌లో ముఖ్యమైన పప్పుధాన్యాలు- కందులు, మినుములు, పెసలు, బఠాణీ, మసూర్, శనగలుకాయధాన్యాల (Leguminous) కుటుంబానికి చెందిన ఈ మొక్కలన్నీ వాతావరణం నుంచి నత్రజనిని గ్రహించి నేలలో ప్రతిష్ఠాపన చేసి భూసారాన్ని పెంచుతాయి. అందువల్ల వీటిని ప్రధానంగా ఇతర పంటల మధ్యలో మార్పిడి పంటగా పండిస్తారు.
భారత్‌లో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక పప్పుధాన్యాల ఉత్పత్తిలో ముఖ్యమైన రాష్ర్టాలు.
1) చెరకు: ఇది అయన, ఉప అయన రేఖా ప్రాంతపు పంట.
అధిక ఉష్ణోగ్రతలు (21 డిగ్రీల సెంటిగ్రేడ్-27 డిగ్రీల సెంటిగ్రేడ్), ఆర్ధ్రత, 75-100 సెం.మీ. వర్షపాతం గల ప్రాంతాలు చెరకు పంటకు అనుకూలం.
నాటు వేయడం నుంచి కోత వరకు కూలీల లభ్యత తప్పనిసరి.
బ్రెజిల్ తరువాత భారత్‌లోనే అధికంగా చెరకు పండుతుంది.
చెరకు నుంచి చక్కెర, బెల్లం, ఖండసారి, మొలాసిస్ మొదలైన ఉత్పత్తులు లభిస్తాయి.
దేశంలో చెరకు పండించే రాష్ర్టాలు.. ఉత్తరప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్ మొదలైనవి.
2) నూనెగింజలు: ప్రపంచంలో నూనెగింజలు భారత్‌లో అత్యధికంగా పండిస్తున్నారు.
దేశ పంట విస్తీర్ణంలో నూనెగింజలు 12 శాతం ఆక్రమిస్తున్నాయి.
వీటిని ప్రధానంగా వంట నూనెలుగా వాడతారు. మరికొన్నింటిని సబ్బులు, సౌందర్య లేపనాలు, ఔషధ లేపనాల్లో ముడిపదార్థాలుగా వాడుతున్నారు.
ఖరీఫ్‌లో పండు వేరుశనగ దేశంలోని మొత్తం నూనెగింజల్లో సగభాగం ఆక్రమిస్తుంది.
వేరుశనగ పండించే ముఖ్యమైన రాష్ర్టాలు.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్.
అవిసెలు, ఆవాలు రబీలో పండించే పంటలు.
నువ్వులు ఉత్తర భారతదేశంలో ఖరీఫ్ పంటగా, దక్షిణ భారతదేశంలో రబీ పంటగా పండిస్తారు.
ఆముదాలను ఖరీఫ్, రబీ రెండు కాలాల్లో పండిస్తారు.
3) తేయాకు: ఈ పంట బ్రిటిష్‌వారి ద్వారా భారత్‌లో ప్రవేశపెట్టిన పానీయపు పంట.
తోట పంటల వ్యవసాయానికి తేయాకు మంచి ఉదాహరణ.
ఇది అయన, ఉప అయన ప్రాంతపు పంట.
లోతైన, సారవంతమైన ఏటవాలు నేలలు ఉండి నీటిపారుదల వసతులు కలిగి హ్యూమస్, సేంద్రియ పదార్థం అధికంగా గల మృత్తికలు అత్యంత అనుకూలం.
తేయాకు మొక్కలకు వెచ్చని, ఆర్ధ్ర శీతోష్ణస్థితితో పాటు హిమరహిత వాతావరణం సంవత్సరం పొడవునా ఉండాలి.
వర్షపు జల్లులు సంవత్సరం పొడవునా విస్తరించి ఉంటే నాణ్యమైన తేయాకు పెరుగుతుంది.
తేయాకు పంటకు నైపుణ్యం గల శ్రామికులు ఎక్కువమంది అవసరం.
తేయాకు పండించే రాష్ర్టాలు- అసోం, పశ్చిమబెంగాల్, తమిళనాడు, కేరళ
4) కాఫీ: భారత్‌లో ఉత్పత్తయ్యే కాఫీ ప్రపంచ ప్రసిద్ధిపొందింది.
ప్రారంభంలో యెమెన్ నుంచి తీసుకువచ్చిన అరబికా కాఫీ మొక్కను దేశవ్యాప్తంగా పండిస్తున్నారు. దీనికి ప్రపంచ వ్యాప్తంగా మంచి గిరాకీ ఉంది.
ప్రారంభంలో బాబా బుడాన్ కొండల్లో సాగైన కాఫీ పంట ప్రస్తుతం కర్ణాటక, కేరళ, తమిళనాడుల్లోని నీలగిరి పర్వతాల్లో పండిస్తున్నారు.
ప్రపంచ కాఫీ ఉత్పత్తిలో 4 శాతం భారత్‌లోనే పండుతుంది.
5) ఉద్యాన పంటలు: పండ్లు, కూరగాయల ఉత్పత్తిలో భారత్ ప్రపంచంలో ప్రథమ స్థానంలో ఉంది.
మామిడి పండ్లు- మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్
నారింజ పండ్లు- నాగపూర్, చిరపుంజి (మేఘాలయ)
అరటి పండు- కేరళ, మిజోరం, మహారాష్ట్ర, తమిళనాడు
లిచీ, జామ పంట- ఉత్తరప్రదేశ్, బీహార్
అనాస పండ్లు- మేఘాలయ
ద్రాక్ష పంట- తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర
ఆపిల్, బేరి, జల్దరు పండ్లు, ఆక్రోటు పంటలను జమ్ముకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌లో పండిస్తున్నారు. వీటికి ప్రపంచవ్యాప్తంగా అధిక గిరాకీ ఉంది.
ప్రపంచ కూరగాయల ఉత్పత్తిలో 13 శాతం భారత్‌లోనే పండిస్తున్నారు.
1) రబ్బరు: ఇది భూమధ్య రేఖా ప్రాంతపు పంట. అయినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో కూడా పండిస్తున్నారు.
రబ్బరు పంటకు అధిక వర్షపాతం (200 సెం.మీ. కంటే ఎక్కువ), అత్యధిక ఉష్ణోగ్రత (25 డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ) అవసరం.
ఈ పంటకు ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు- కేరళ, తమిళనాడు, కర్ణాటక, అండమాన్ నికోబార్ దీవులు, మేఘాలయలోని గారో కొండలు.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు