విపత్తు – నిర్వహణ
మానవ దైనందిన జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తూ అధిక ప్రాణనష్టం, ఆస్తినష్టం కలిగించే వైపరీత్య సంఘటనను ‘విపత్తు’ అంటారు.
-విపత్తులు సంభవించడానికి భౌగోళిక, వాతావరణం వంటి ప్రత్యేక పరిస్థితులతోపాటు మానవుడి చర్యలు, కార్యకలాపాలు కారణమవుతున్నాయి.
-ప్రపంచంలో ప్రతిరోజు ఎక్కడో ఓ చోట ఏదో ఒక విపత్తు సంభవిస్తుంది. దీనికి భారత్ అతీతం కాదు. ప్రత్యేక భౌగోళిక పరిస్థితులైన ఎత్తయిన పర్వత శ్రేణులు, విశాలమైన ద్వీపకల్ప పీఠభూమి, వేల కిలోమీటర్లు ప్రవహించే జీవనదీ వ్యవస్థ వల్ల భారత్ విపత్తుల బారిన పడుతుంది.
-ఒకరకంగా చెప్పాలంటే ప్రకృతిలో జరిగే మార్పుల వల్ల విపత్తులు సంభవిస్తున్నాయి. ఈ మార్పులకు కారణం అడవులను నిర్మూలించడం, కాలుష్యం పెరిగిపోవడం, జీవవైవిధ్యం దెబ్బతినడం, వాతావరణం వేడెక్కడం మొదలైనవి.
-‘Nature Protects if she is Protected’ అంటే మనం ప్రకృతిని రక్షిస్తే అది మనల్ని కాపాడుతుంది. ‘ప్రకృతిని అనుసరించాలేకాని శాసించకూడదు’ అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మన కార్యకలాపాలను కొనసాగిస్తే ఈ విపత్తుల తీవ్రతను చాలా వరకు తగ్గించే అవకాశం ఉంది.
విపత్తు – నిర్వచనాలు
1. విపత్తు నిర్వహణ చట్టం – 2005 నిర్వచనం
-ఏదైనా భౌగోళిక ప్రాంతం ప్రకృతి లేదా మానవ తప్పిదాలు లేదా ప్రమాదవశాత్తు లేదా నిర్లక్షం వల్ల తనంతట తాను కోలుకోలేని విధంగా పెద్దఎత్తున ప్రాణ నష్టానికి, ఆస్తి నష్టానికి, పర్యావరణ నష్టానికి లేదా విధ్వంసానికి కారణమయ్యే ఉపద్రవాలు లేదా ప్రమాదాలు లేదా దుర్ఘటనలను ‘విపత్తు’ అంటారు.
2. UNO నిర్వచనం
-సమాజపు సాధారణ నిర్మాణానికి, సాధారణ లేదా కమ్యూనిటీ కార్యకలాపాలకు అంతరాయం కలిగిస్తూ అకస్మాత్తుగా, తీవ్రంగా సంభవించే ఆపదనే ‘విపత్తు’ అంటారు.
3. WHO పపంచ ఆరోగ్యసంస్థ) నిర్వచనం
-ఏదైనా ప్రదేశంలోని సమూహానికి వెలుపల నుంచి సాయం పొందవలసినంత తీవ్రమైన ప్రాణ, ఆస్తి నష్టాన్ని, పర్యావరణ నష్టాన్ని, ఆర్థిక విధ్వంసాన్ని, ఆరోగ్య సమస్యలను కలుగజేసే సంఘటననే ‘విపత్తు’ అంటారు.
4. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్వచనం
-సాధారణ జీవితానికి లేదా పర్యావరణ వ్యవస్థకు అంతరాయం కలిగినప్పుడు ప్రాణాలను లేదా పర్యావరణాన్ని రక్షించి, సంరక్షించడానికి.. అసాధార ణ, అత్యవసర చర్యలు అవసరమయ్యే ఉపవూదవ పరిస్థితినే ‘విపత్తు’ అని నిర్వచించారు.
విపత్తు – అర్థం
-Disaster – ఇంగ్లిష్ పదం
-Dus (దుష్ట) + aster (నక్షత్రం) – గ్రీకు పదాలు
-Des + aster (విపత్తు) – ఫ్రెంచ్ పదాలు
-Dis (దుష్ట) + astro (నక్షత్రం) – ఇటలీ/లాటిన్ పదాలు (Dis: i = italy)
ప్రాక్టీస్ బిట్స్
1. గ్రీకు, లాటిన్ భాషల్లో Disaster అంటే? (2)
1) విపత్తు 2) దుష్ట నక్షత్రం 3) బాధ 4) పైవన్నీ
2. ‘విపత్తు’ అనేమాట ఏ భాష నుంచి వచ్చింది? (2)
1) అరబిక్ 2) ఫ్రెంచ్ 3) గ్రీకు 4) లాటిన్
3. విపత్తుల తీవ్రతను వేటి ఆధారంగా లెక్కిస్తారు? (1)
1) ప్రాణనష్టం 2) ఆస్తినష్టం
3) జంతునష్టం 4) గృహనష్టం
విపత్తు సంస్థాగత చట్రం (Disaster Institutionalized Structure)
-1900, 1905, 1907, 1947లలో వచ్చిన వరుస దుర్భిక్షాలు, 1937లో సంభవించిన బీహార్-నేపాల్ భూకంపం మొదలైన వాటి నేపథ్యంలో భారతదేశ విపత్తు నిర్వహణ వ్యవస్థాగత నిర్మాణం బ్రిటిష్‌వారికాలంలో ప్రారంభమైంది.
-బ్రిటిష్ పరిపాలనలో విపత్తువల్ల వచ్చే అత్యవసర పరిస్థితులను ఎదుర్కునేందుకు పునరావాస విభాగాలను ఏర్పాటు చేశారు. ఈ విభాగాలు విపత్తు అనంతర పరిస్థితుల్లో మాత్రమే సహాయక చర్యలు చేపట్టేవి.
-స్వాతంత్య్రం అనంతరం విపత్తుల నిర్వహణ బాధ్యతను ప్రతి రాష్ట్రంలో ఉండే పునరావాస కమిషనర్లు, కేంద్రంలో కేంద్ర పునరావాస కమిషనర్లు నిర్వహించేవారు.
-ప్రపంచవ్యాప్తంగా ఐక్యారాజ్యసమితి (UNO) సాధారణసభ 1990వ దశాబ్దాన్ని ‘అంతర్జాతీయ సహజ విపత్తుల కుదింపు దశాబ్దంగా ప్రకటించింది.
-దేశంలో 1990 అనంతరం కేంద్ర వ్యవసాయ మంత్రిత్వశాఖ కింద విపత్తు నిర్వహణ సెల్‌ను ఏర్పాటు చేయడంతో ఒక శాశ్వత, వ్యవస్థాగతమైన ఏర్పాటు ప్రారంభమైంది. తదనంతరం దేశంలో సంభవించిన విపత్తులను అనుసరించి అప్పటి వ్యవసాయ మంత్రిత్వశాఖ కార్యదర్శి జేసీ పంత్ చైర్మన్‌గా విపత్తుల నిర్వహణపై సమగ్ర విధానాన్ని రూపొందించడానికి అత్యున్నతాధికార కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ నిర్ణయం ప్రకారం 2002లో కేంద్ర హోంమంత్రిత్వశాఖ పరిధిలోకి మార్చారు. దీన్ని అనుసరించి దేశంలో విపత్తు నిర్వహణకు ఒక అధికార క్రమ నిర్మాణం ఏర్పడింది.
దేశంలో విపత్తు నిర్వహణ నిర్మాణం
-విపత్తు నిర్వహణ కోసం జాతీయస్థాయిలో శాసననిర్మాణ అవసరాన్ని ప్రధానంగా పేర్కొన్న అన్ని పార్టీల సమావేశం 2005 జనవరి 9న జరిగింది.
-విపత్తు నిర్వహణ బిల్లును రాజ్యసభలో మొదటిసారిగా 2005 మే 11న ప్రవేశపెట్టారు.
విపత్తు నిర్వహణ చట్టం-2005 ప్రకారం…
1. కేంద్రంలో – జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (NDMA)
2. రాష్ట్రంలో – రాష్ట్ర విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (SDMA)
3. జిల్లాస్థాయిలో – జిల్లా విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (DDMA)
-73, 74వ రాజ్యాంగ సవరణలతో పట్టణ, గ్రామీణ స్థాయిల్లో విపత్తు నిర్వహణ సంస్థలు అవతరించాయి. విపత్తు నిర్వహణలో స్థానిక సంస్థల పాత్ర ముఖ్యమైనది.
1. జాతీయస్థాయి సంస్థలు
-విపత్తు నిర్వహణ కోసం జాతీయస్థాయిలో ప్రధానమంత్రి అధ్యక్షతన జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ (NDMA)ను ఏర్పాటు చేశారు. ఇది 2005 మే 30న జరిగింది. NDMA 2005 డిసెంబర్ 23 నుంచి అమల్లోకి వచ్చింది.
-విపత్తు నిర్వహణ చట్టం – 2005 అమల్లోకి వచ్చిన తర్వాత చట్టంలోని సెక్షన్ 3(1) ప్రకారం.. NDMAను 2006 సెప్టెంబర్ 27న ప్రధాని అధ్యక్షతన, మరో 9 మంది నామినేటెడ్ సభ్యులతో ఏర్పాటు చేశారు. నామినేటెడ్ సభ్యుల్లో ఒకరు వైస్ చైర్మన్‌గా ఉంటారు. వీరేగాక ఒక కార్యదర్శి, ఐదుగురు సంయుక్త కార్యదర్శులు, 10 మంది జాయింట్ అడై్వజర్లు, డైరెక్టర్లు, 14 మంది అసిస్టెంట్ అడై్వజర్లు, అండర్ సెక్రటరీలు, అసిస్టెంట్ ఫైనాన్షియల్ అడై్వజర్లు, డ్యూటీ ఆఫీసర్లు, సహాయక సిబ్బంది ఉంటారు.
-విపత్తు నిర్వహణ చట్టం-2005లోని సెక్షన్ 7(1) ప్రకారం 12 మంది సభ్యులతో 2007లో ఒక సలహా కమిటీని కూడా ఏర్పాటు చేశారు.
-NDMAకు విధుల నిర్వహణలో సహకరించడానికి విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ (8) కింద జాతీయ కార్యనిర్వాహక కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి ఎక్స్ అఫిషియో చైర్మన్‌గా హోంశాఖ కార్యదర్శి వ్యవహరిస్తారు.
-కింది కేంద్ర మంత్రిత్వశాఖల కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. అవి…
1. వ్యవసాయం, 2. గ్రామీణాభివృద్ధి, 3. తాగునీటి సరఫరా, 4. పట్టణాభివృద్ధి, 5. పర్యావరణం, అడవులు, 6. ఆర్థిక, 7. నీటి వనరులు, 8. ఆరోగ్య, 9. విద్యుత్, 10. సైన్స్ అండ్ టెక్నాలజి, 11. టెలీ కమ్యూనికేషన్స్, 12. రక్షణ, 13. అంతరిక్ష శాఖ, 14. అణుశక్తి.
-చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ డిఫెన్స్, చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ కమిటీ కూడా ఇందులో సభ్యులుగా ఉంటారు.
-NEC (జాతీయ కార్యనిర్వహణ కమిటీ)కి విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ 10 ప్రకారం.. విపత్తు నిర్వహణలోని జాతీయ ప్రణాళిక రూపకల్పన, జాతీయ విధాన అమలు, పర్యవేక్షణ మొదలైన వాటికి సమన్వయ సంస్థగా వ్యవహరించే బాధ్యతను అప్పగించారు.
-జాతీయస్థాయిలో జాతీయ విపత్తు నిర్వహణ చట్టం-2005 ప్రకారం.. 1. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (NIDM), 2. నేషనల్
డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (NDRF)లను ఏర్పాటు చేశారు.
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఎన్ఐడీఎం)
-నేషనల్ సెంటర్ ఫర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (జాతీయ విపత్తు నిర్వహణ కేంద్రం)ను 2003, అక్టోబర్ 16న ఎన్‌ఐడీఎంగా మార్చారు.
-విపత్తు నిర్వహణ చట్టం-2005 ప్రకారం ఎన్ఐడీఎం చట్టబద్ధమైన సంస్థ. దీని ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
-విపత్తు నిర్వహణ చట్టం-2005లోని 7వ అధ్యాయం సెక్షన్- 42 ఎన్ఐడీఎంకు అసంఖ్యాక బాధ్యతలను అప్పగించింది. అవి…
-శిక్షణ నమూనాలను అభివృద్ధిపరచడం
-శిక్షణ కార్యక్రమాలను నిర్వహించడం
-పరిశోధనలు చేపట్టడం
-డాక్యుమెంటేషన్లను చేపట్టడం
-సదస్సులు, ఉపన్యాసాలు, సెమినార్లు నిర్వహించడం
-జర్నల్స్, పరిశోధనాపత్రాలు, పుస్తకాల ప్రచురణ చేపట్టడం.
-విపత్తు నిర్వహణ చట్టంలోని సెక్షన్ – 42 (4)లోని నిబంధనల ప్రకారం కేంద్ర ప్రభుత్వం 2007, మే 3న 14 మందితో గవర్నింగ్ బాడీని ఏర్పాటు చేసింది.
నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్)
-విపత్తు నిర్వహణ చట్టం-2005లోని సెక్షన్-44 కింద 2006లో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్డీఆర్ఎఫ్)ను ఏర్పాటు చేశారు. ఈ దళాలను విపత్తులవంటి పరిస్థితులను ఎదుర్కో వడానికి రూపొందించారు. అవి…
1. సీఐఎస్ఎఫ్ (కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం)
2. బీఎస్ఎఫ్ (సరిహద్దు భద్రతాదళం)
3. ఐటీబీపీ (ఇండో-టిబెటన్ బార్డర్ పోలీస్)
4. సీఆర్పీఎఫ్ (సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్)
-ఒక్కో దళాన్ని రెండు బెటాలియన్లుగా చేసి మొత్తం ఎనిమిది బెటాలియన్లు ఏర్పాటు చేశారు.
-ప్రతి బెటాలియన్‌లో 1000 మంది ఉంటారు.
-సహజ, మానవకారక విపత్తులపై ప్రత్యేక శిక్షణ పొందిన 144 బృందాలు ఈ బెటాలియన్లలో ఉంటాయి. ఇందులో 72 బృందాలను ప్రకృతి వైపరీత్యాలతోపాటు బయోలజికల్, రసాయన, రేడియోధార్మిక, అణు వైపరీత్యాలను ఎదుర్కోవ డానికి ఉద్దేశించారు.
-దేశంలోని విభిన్న ప్రాంతాల దుర్బలత్వ (vulne-rability) చరిత్ర ఆధారంగా ప్రత్యేక బెటాలియన్లను భటిండా (పంజాబ్), గ్రేటర్ నోయిడా (ఉత్తరవూపదేశ్), వడోదర (గుజరాత్), పుణె (మహారాష్ట్ర), చ్నై (తమిళనాడు-అరక్కోణం), భువనేశ్వర్ (ఒడిశా-ముండలి), కోల్‌కతా (పశ్చిమబెంగాల్), గువాహటి (అసోం)లో ఏర్పాటు చేశారు.
-సశస్త్ర సీమాబల్ (ఎస్ఎస్బీ) ఆధ్వర్యంలో పాట్నా (బీహార్), విజయవాడ-మంగళగిరి (ఆంవూధవూపదేశ్) వద్ద కొత్తగా రెండు బెటాలియన్లను ఏర్పాటు చేశారు. వీరితోపాటు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, హోంగార్డులు, యువజన కేంద్రాల నుంచి వలంటీర్లు విపత్తు సమయాల్లో తమవంతు పాత్ర నిర్వహిస్తున్నారు.
-జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ‘డిజాస్టర్ అండ్ డెవలప్మెంట్’ అనే పత్రికను ప్రతి రెండేండ్లకు ఒకసారి (దై్వవార్షిక) ప్రచురిస్తున్నది.
-దేశంలో తొలిసారిగా ఇండియన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కాంగ్రెస్ (సభ) 2006, నవంబర్ 29న, రెండో సభ 2009, నవంబర్ 4న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జరిగింది.
-జాతీయ విపత్తు నిర్వహణ విధానాన్ని 2009, అక్టోబర్ 22న కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది.
-జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయం, సార్క్ విపత్తు నిర్వహణ సంస్థ ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది.
-2010 నుంచి జాతీయ విపత్తు నిర్వహణ సంస్థకు ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నారు.
-జాతీయ విపత్తు నిర్వహణ కమిటీ చైర్మన్ ప్రధానమంత్రి.
-అయితే జాతీయ విపత్తు కార్యనిర్వాహక కమిటీ పదవీ రీత్యా కేంద్ర హోంశాఖ కార్యదర్శి చైర్మన్‌గా వ్యవహరిస్తారు.
Latest Updates
Peut-on gagner dans les casinos en ligne ?
Quel casino en ligne est légitime ?
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?






