UPSC versions | యూపీఎస్సీ సంస్కరణలు
బ్రిటిష్ వలస పాలనలో ఏర్పాటైన సివిల్ సర్వీసు వ్యవస్థ కాలానుగుణంగా దాని ప్రాధాన్యాన్ని పెంచుకుంటూ సమాజాన్ని క్రమానుగత శ్రేణిలో నిర్మించే దిశలో ప్రభుత్వాన్ని వెనుక నుంచి నడిపిస్తుంది. ఎన్ని అవరోధాలు, ఆటంకాలు, రాజకీయ ఒత్తిడులు వచ్చినా మొక్కవోని దీక్షతో తమ కృషిని కనబరుస్తూ నవ సమాజాన్ని నిర్మించడంలో సివిల్ సర్వీసుల పాత్ర అత్యంత కీలకం. జాతీయ, అంతర్జాతీయ సంబంధాలు దృఢతరమై, ఆర్థిక, వాణిజ్య కార్యక్రమాలు, అంతర్గత శాంతిభద్రతలను కాపాడటంలో వీరి పాత్ర అద్వితీయం. ప్రజలందరికీ సుపరిపాలన ఫలాలు అందించేందుకు ప్రభుత్వం వెనుక నైపుణ్య పరిజ్ఞానంగా తమ తమ హస్తాన్ని అందిస్తూ ఉంటుంది.
-గొప్ప చరిత్ర కలిగిన ఈ సివిల్ సర్వీసుతో క్యాడర్‌ను నియమించడంలో ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం కొత్త ఆలోచనలు మొదలుపెట్టింది. ఇటీవల ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) సివిల్ సర్వీసు, క్యాడర్ కేటాయింపులో సవరణను సూచిస్తూ సిబ్బంది, శిక్షణ శాఖకు ఒక లేఖను పంపింది. అఖిల భారత సివిల్ సర్వీసు (యూపీఎస్సీ) మెరిట్ లిస్ట్‌ను సిబ్బంది, శిక్షణ శాఖకు సిఫారసు చేసిన తర్వాత అభ్యర్థులు 15 వారాల ఫౌండేషన్ కోర్సుకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ కోర్సులో వారి ప్రతిభకు కొంత ప్రాధాన్యమిచ్చి వారి సర్వీసును నిర్ధారించాలని పీఎంవో సూచించింది.
-దేశ సమగ్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు పీఎంవో తెలిపింది. సివిల్ సర్వీసు పరీక్షలో ప్రిలిమినరీ, మెయిన్స్ రాసే ముందు మనం ఇష్టమొచ్చిన రాష్ట్రం (మొదటి, రెండో, మూడో) ప్రాధాన్యతలుగా ఉండేది. అయితే, పీఎంవో ప్రాధాన్యతలో రాష్ర్టాలకు ప్రత్యామ్నాయంగా జోన్లను ఏర్పాటు చేయాలని భావిస్తుంది. దేశాన్ని ఐదు జోన్లుగా ఏర్పాటు చేసి, అందులో ప్రాధాన్యతను ఎంచుకోవాలని పీఎంవో సూచించింది.
-జోన్-1లో అరుణాచల్‌ప్రదేశ్, గోవా, మిజోరం, కేంద్రపాలిత ప్రాంతాలు, జమ్ముకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, రాజస్థాన్, హర్యానా
-జోన్-2లో ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, ఒడిశా
-జోన్-3లో గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్
-జోన్-4లో పశ్చిమబెంగాల్, సిక్కిం, అసోం, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్
-జోన్-5లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళ ఉన్నాయి.
-అఖిల భారత సర్వీసు కమిషన్ సివిల్ సర్వీసు పరీక్షను మూడు పద్ధతుల్లో నిర్వహిస్తున్నది. మొదటిది ప్రిలిమినరీ, రెండోది మెయిన్స్, మూడోది మౌఖిక పరీక్ష. అయితే, ప్రస్తుతం పీఎంవో నివేదికవల్ల 15 వారాల ఫౌండేషన్ కోర్సు నిర్వహిస్తారు. ఈ పద్ధతిని చాలామంది వ్యతిరేకిస్తున్నారు.
విమర్శ
-యూపీఎస్సీ ఇచ్చే మెరిట్ ఆధారంగా సిబ్బంది వ్యవహారాల శాఖ సాధారణంగా సర్వీసు, క్యాడర్లను నిర్ణయిస్తుంది. అయితే, ఫౌండేషన్ కోర్సు నిర్వహించడం డైరెక్టర్, సిబ్బంది ప్రలోభాలు, రాజకీయ ఒత్తిడులు ఎదుర్కొనే అవకాశం ఉంది. దీనివల్ల పారదర్శకత లోపించి కొందరికి వత్తాసు పలకడం ద్వారా సమాజానికి నైపుణ్యం కలిగిన, నిజమైనపాలన స్వభావం కలిగిన, చాకచక్యంగా పనిచేయగలవారికి ఉన్నత సర్వీసు రాకపోవచ్చు. దీంతో అభ్యర్థి నిస్పృహకు లోనుకావచ్చు. అందులో సవరణలు ప్రతిపాదించే ముందు ప్రభుత్వం ముందుగా దూరదృష్టితో ఆలోచించాల్సి ఉంది. ఫౌండేషన్ కోర్సు నిర్వహించే డైరెక్టర్, సిబ్బంది తమ చేతిలో దేశ భవిష్యత్తు ఉందని గ్రహించాలి.
-ఇప్పటికే యూపీఎస్సీ నిర్వహించే మౌఖిక పరీక్షలో విషయ నిష్టత, సత్ప్రమాణత తదితర అంశాలపై విమర్శలున్నాయి. అందుకే మౌఖిక పరీక్షల మార్కుల సాంద్రత తగ్గించాలని సివిల్స్ ప్రిపేరయ్యే అభ్యర్థులు కోరుతున్నారు. అందులో అనేకసార్లు మౌఖిక పరీక్షకు హాజరయ్యే ఒక్కొక్కరికి మార్కుల మధ్య తేడాలు ఉంటున్నాయి. ఉదాహరణకు ఒక అభ్యర్థి మూడుసార్లు మౌఖిక పరీక్షకు హాజరు అయినట్లయితే అతనికి ఒక్కోసారి వచ్చిన మార్కుల్లో వ్యత్యాసంవల్ల అభ్యర్థి స్వభావం మారిపోతుంది. అయితే, ఇప్పుడు ఈ పద్ధతి అమల్లోకి రావడంవల్ల నైపుణ్యం ఉన్నా మౌఖిక పరీక్ష మార్కులు, ఫౌండేషన్ కోర్సుల్లో వ్యత్యాసంవల్ల అతనికి సివిల్ సర్వీసు అందని ద్రాక్షగానే మిగిలిపోతుంది.
-అఖిల భారత సర్వీసు రాజ్యాంగబద్ధమైన సంస్థ. దీనికి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. 320(1) అధికరణ ప్రకారం యూపీఎస్సీ సిలిల్ సర్వీస్ పరీక్షలను నిర్వహిస్తుంది. అయితే ఇప్పుడు ఫౌండేషన్ కోర్సుల్లో కొంతవరకు యూపీఎస్సీ ప్రాధాన్యం తగ్గి కేంద్రప్రాధాన్యం పెరుగుతుంది. కేంద్రం జోక్యం కారణంగా దీని భవితవ్యం ప్రశ్నార్థకంగా మారనుంది. కాబట్టి సివిల్స్ ప్రిపరేషన్ కొనసాగించాలనే భావన చాలామంది అభ్యర్థుల్లో ఆదిలోనే చచ్చిపోతుంది. సివిల్ సర్వీసులు ప్రిపేరయ్యేవారందరికీ సర్వీసులు రాకపోయినప్పటికీ సంసిద్ధంవల్ల దేశం పట్ల, దేశ చరిత్ర పట్ల, దేశం ఎదుర్కొంటున్న నిరుద్యోగిత తదితర అనేక అంశాలపట్ల అవగాహన కలుగుతుంది. ప్రభుత్వాలు మారినా సివిల్ సర్వీసులు మారవు. కాబట్టి ప్రభుత్వం తీసుకునే నిర్ణయం దేశం భవిష్యత్తుపై ప్రభావం చూపేలా ఉండకూడదు.
-ఫౌండేషన్ కోర్సు నిర్వహించే డైరెక్టర్, సభ్యులు ధర్మబద్ధంగా వ్యవహరించకపోవచ్చు. తన ఆధీనంలో కొంత మార్కులున్నాయని గ్రహించి అభ్యర్థుల పట్ల అసభ్యంగా వ్యవహరించే అవకాశం లేకపోలేదు. కొన్ని సందర్భాల్లో అభ్యర్థులను శారీరకంగా, మానసికంగా హింసించవచ్చు. ఈ విధంగా వీరి నిర్వహణవల్ల ఐఏఎస్ రావాల్సినవారికి ఐడీఎస్, ఐఈఎస్ రావాల్సినవారికి ఐపీఎస్ వచ్చే అవకాశం ఉంది. లాల్‌బహదూర్‌శాస్త్రి నేషనల్ అకాడమీ ఫర్ అడ్మినిస్ట్రేషన్‌కు వెళ్లే అభ్యర్థులకు హైదరాబాద్, భోపాల్‌లో కూడా శిక్షణ సంస్థ ఉండటంతో ఒక్కోచోట అభ్యర్థులకు శిక్షణనిచ్చే అధికారులు వేర్వేరుగా ఉంటారు. కాబట్టి అభ్యర్థులను పరీక్షించే విధానం ఒకటే అయినప్పటికీ మెరిట్లో తేడా ఉంటుంది.
మద్దతు
-ప్రపంచంలో జనాభాపరంగా రెండో పెద్ద దేశం. కాబట్టి ఇంతపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని రక్షించడంలో సివిల్ సర్వీసులో 3 దశల ద్వారా ఉత్తీర్ణులైనవారు ఫౌండేషన్ కోర్సు ద్వారా దేశం పట్ల మరింత అవగాహన పెరిగి అన్ని విషయాల్లో చురుకుగా, చాకచక్యంగా వ్యవహరిస్తారు. దీనివల్ల ప్రజాస్వామ్యం మరింత వర్ధిల్లుతుంది. 15 వారాల కోర్సువల్ల నైతికపరమైన భావన అభ్యర్థుల్లో వస్తుంది. దానివల్ల అసమానతగల సమాజం అభ్యర్థులకు కనిపించదు. ద్వితీయ, మౌఖిక పరీక్షల్లో తక్కువ మెరిట్ వచ్చినవారికి ఫౌండేషన్ కోర్సుల్లో మార్కులు అధికంగా ఉండటం వారిని ఆనందపరిచే విషయం.
సివిల్ సర్వీసులపై గత కమిటీలు
-1976లో నియమించిన కొఠారి కమిటీ ప్రకారం రాజ్యాంగం గుర్తించిన భాషల్లో సివిల్ సర్వీసులను రాయవచ్చని సూచించింది. అయితే ఈ కమిటీ ఇచ్చిన సిఫారసుల ఆధారంగా ప్రస్తుతం 22 భాషల్లో అభ్యర్థి ఎంచుకున్న భాషలో పరీక్ష రాయగలుగుతున్నారు. 1989లో సంతోష్చంద్ర కమిటీ సిఫారసుల ప్రకారం సివిల్ సర్వీసు పరీక్షలను నిర్వహించడంలో ఒక జనరల్ ఎస్సే, మౌఖిక పరీక్షలో 250 నుంచి 300 మార్కులకు పెంచాలని సూచించింది. ఈ కమిటీ ప్రకారం నేటి సివిల్ సర్వీసు పరీక్షలో జనరల్ ఎస్సే పేపర్ తప్పనిసరైనది. అయితే మార్కులు పెంచలేదు.
-అభ్యర్థులకు రాష్ర్టాలపరంగా కాకుండా జోన్లలాగా కేటాయిస్తే దేశ సమగ్రత పెరుగుతుంది. ఎందుకంటే జోన్‌వల్ల అధికారి దేశం మొత్తం తిరగాల్సి వస్తుంది. పాలనపట్ల మరింత అవగాహన కలుగుతుంది. దీన్ని కొంతమంది రాష్ట్ర ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయడంగా కొందరు భావిస్తున్నారు. ఇదేగానీ జరిగితే ఏకకేంద్ర లక్షణాలు భారత్‌పై దృఢంగా పడుతాయని వాదిస్తున్నారు. సమాఖ్య భావన పూర్తిగా దెబ్బతింటుంది. రాజ్యాంగంలో సమాఖ్య అనే పదం లేకపోయినా మనది సమాఖ్య దేశం కాబట్టి రాజకీయపరంగా కాకుండా ప్రజాశ్రేయస్సునే పరిగణనలోకి తీసుకోవాలి.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
తాత్వికతను తెలిపేది.. రాజ్యాంగానికి గుండెలాంటిది
ఎలకానిక్ రికార్డులు.. ప్రాథమిక సాక్ష్యాలు
శుక్రకణాలు తాత్కాలికంగా నిల్వ ఉండే ప్రాంతం?
సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్‌కు మరోపేరు?
‘వెయ్యి ఉరిల మర్రి’ గా పేరుగాంచిన ఊడలమర్రి ఏ జిల్లాలో ఉంది?
రక్షణ దుర్గాలు – నాటి పాలనా విభాగాలు
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?