ఆర్థిక సంక్షోభానికి కారణాలు ఇవే ..
శ్రీలంక రుణ ఎగవేత- ఆర్థిక సంక్షోభం
శ్రీలంకకు బ్రిటిష్ పాలన నుంచి 70 ఏళ్ల క్రితం స్వాతంత్య్రం లభించిన తర్వాత ఎన్నడూ లేనంత దారుణమైన ఆర్థిక సంక్షోభంలో ప్రస్తుతం ఆ దేశం చిక్కుకుంది. ఆ కారణంగా 2022 మే 19న దేశ చరిత్రలో మొదటిసారిగా రుణాల వడ్డీ చెల్లింపులు చేయలేక ప్రభుత్వం చేతులెత్తేసి రుణ ఎగవేతకు పాల్పడింది.
ఆర్థిక సంక్షోభ నేపథ్యం
శ్రీలంక ఆర్థిక వ్యవస్థలో చెల్లింపుల సంక్షోభం ఏర్పడటం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దారుణమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. దేశ విదేశీమారక నిల్వలు రోజురోజుకు దారుణంగా పడిపోతున్నాయి. అందువల్ల నిత్యావసర వస్తువులు, మందులు, ఇంధనం, ఇతర వస్తువులను దిగుమతి చేసుకోవడం కష్టంగా మారింది.
శ్రీలంక ప్రస్తుత ఆర్థిక సంక్షోభం ఆ దేశంలో నియంతృత్వ పోకడలతో పరిపాలన సాగిస్తున్న పాలకుల విధానాల వల్ల, అంతర్జాతీయ ద్రవ్య నిధి ఇచ్చిన రుణాలకు సంబంధించిన కఠిన షరతుల వల్ల, చెల్లింపుల సంక్షోభం, దేశ ఆర్థిక నిర్మాణంలో చారిత్రకంగా సమతుల్యత లేకపోవడం మొదలైన కారణాల వల్ల ప్రస్తుత ఆర్థిక పరిస్థితి దారుణంగా దిగజారింది.
తక్షణ కారణాలు
శ్రీలంకలో దాదాపు 26 ఏళ్లపాటు సాగిన అంతర్యుద్ధం 2009లో ముగిసింది. అనంతరం ఆ దేశ జీడీపీ వృద్ధి రేటు ఏడాదికి 8-9 శాతం చొప్పున 2012 సంవత్సరం వరకు పెరిగింది. అయితే 2013లో అంతర్జాతీయంగా వివిధ వస్తువుల ధరలు భారీగా పడినప్పుడు ఎగుమతులు తగ్గి దిగుమతులు పెరిగాయి. అప్పుడు దేశ జీడీపీ వృద్ధి రేటు దాదాపు సగానికి పడిపోయింది.
2013లో మళ్లీ సంక్షోభం ఏర్పడిన తరువాత 2016లో శ్రీలంక ప్రభుత్వం తిరిగి అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి మరో 1.5 బిలియన్ డాలర్ల రుణాలను తీసుకుంది. ఈ రుణాలు ఇచ్చినప్పుడు అంతర్జాతీయ ద్రవ్య నిధి కఠినమైన షరతులు పెట్టింది. వీటివల్ల శ్రీలంక ఆర్థిక పరిస్థితి దెబ్బతిన్నది.
2019 ఏప్రిల్ నెలలో శ్రీలంక రాజధాని కొలంబోలోని పలు చర్చిల్లో బాంబు పేలుళ్ల కారణంగా 253 మంది గాయపడ్డారు. ఈ పేలుళ్ల అనంతరం శ్రీలంకకు పర్యాటకులు రావడం తగ్గిపోయింది. దాంతో విదేశీ మారక నిల్వలు కూడా దారుణంగా పడిపోయాయి.
ప్రభుత్వ వ్యయం పెరగడం వల్ల 2020-21లో ద్రవ్యలోటు 10 శాతం దాటిపోయింది. జీడీపీలో రుణాల వాటా 2019లో 94 శాతం నుంచి 2021లో 119 శాతానికి పెరిగింది.
మరోవైపు 2021లో శ్రీలంక ప్రభుత్వం
దేశంలోకి ఎరువుల దిగుమతులను పూర్తిగా నిషేధించింది. దేశంలో 100 శాతం సేంద్రియ వ్యవసాయ పద్ధతులు అమలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అందువల్ల ఎరువుల దిగుమతులపై నిషేధం విధించారు. ఈ కారణంగా ఆహారోత్పత్తుల దిగుబడి తగ్గిపోయింది.
ఈ నేపథ్యంలో శ్రీలంక
అధ్యక్షుడు 2021లో దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించారు. తద్వారా పెరుగుతున్న ఆహార వస్తువుల ధరలను అదుపు చేయాలని, కరెన్సీ విలువ పడిపోకుండా ఆపాలని, విదేశీమారక నిల్వలు అడుగంటకుండా నిలుపాలని ప్రయత్నించారు. కానీ, ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువుల ధరలు దారుణంగా పెరిగిపోయాయి. ద్రవ్యోల్బణం 15 శాతానికి ఎగబాకింది. అందువల్ల అనేక లక్షల మంది శ్రీలంక ప్రజలు పేదరికంలో కూరుకుపోయారు.
భారత్ సాయం
2022లో మొట్టమొదట భారత్ శ్రీలంకకు 1.4 బిలియన్ డాలర్ల రుణాన్ని అందించింది. ఇందులో 400 మిలియన్లు కరెన్సీ మార్పిడి పద్ధతిలో, 500 మిలియన్ డాలర్లు రుణాల చెల్లింపుల కోసం, మరో 500 మిలియన్ డాలర్లను ఇంధన దిగుమతుల కోసం చవక వడ్డీ రుణాలుగా ఇచ్చింది. తర్వాత 2022 ఏప్రిల్లో శ్రీలంక ఆర్థిక పరిస్థితి మెరుగు పరిచేందుకు మరో బిలియన్ డాలర్లను స్వల్పకాలిక రుణాలుగా అందించింది.
2020లో వచ్చిన కొవిడ్-19 సంక్షోభం శ్రీలంక ఆర్థిక సమస్యలు మరింత క్షీణించేలా చేసింది. తేయాకు, రబ్బర్, మసాలా ద్రవ్యాలు, వస్ర్తాల ఎగుమతులు బాగా తగ్గిపోయాయి. మరోవైపు పర్యాటకుల రాక బాగా తగ్గిపోవడంతో ఆ రంగం నుంచి ఆదాయం పడిపోయింది. దేశ ఆర్థిక వ్యవస్థలో పర్యాటకం కీలకమైంది కాబట్టి అది ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసింది.
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు