జ్ఞాన ఆవిష్కరణల స్థావరం – నీతి ఆయోగ్ (అన్ని పోటీ పరీక్షలకు..)
National Institution for Transforming India Aayog (భారత జాతీయ పరివర్తన సంస్థ)
భారతదేశంలోని ఆర్థిక పరిస్థితులకు కీలకమైన ప్రణాళికా సంఘం స్థానంలో కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ను ఏర్పాటు చేసింది. ప్రణాళికా సంఘం పేరుతో కేంద్రం అన్ని రాష్ర్టాలపై పెత్తనం చెలాయించేవిధంగా కాకుండా అన్ని రాష్ర్టాలను కలుపుకొని, అన్ని రాష్ర్టాల సమగ్రాభివృద్ధితో జాతీయ అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థను ఏర్పాటు చేశారు.
నీతి ఆయోగ్ ఏర్పాటు కోసం 13 ఆగస్టు 2014న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఒక తీర్మానం ద్వారా ప్రణాళికా సంఘాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. నీతి ఆయోగ్ భారతీయతతో కూడిన అభివృద్ధి దిశగా అంకురార్పణ చేస్తుందని మంత్రివర్గం పేర్కొంది. ఇందుకు అనుగుణంగానే ‘నీతి ఆయోగ్’ను ఏర్పాటు చేస్తున్నట్లు 1 జనవరి 2015లో ప్రధాన మంత్రి ప్రకటించారు. దాంతో ఆరున్నర దశాబ్దాలపాటు దేశ ఆర్థిక పరిస్థితులపై ప్రభావం చూపిన ప్రణాళికా సంఘం స్థానంలో ‘నేషనల్ ఇనిస్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫర్మింగ్ ఇండియా’ (నీతి ఆయోగ్)ను ఏర్పాటు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇది ఒక థింక్ ట్యాంక్ లా పనిచేస్తుంది.
కొన్ని ముఖ్యాంశాలు
- రాష్ర్టాల మధ్య పరస్పర సహకార స్ఫూర్తితో దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడంలో నీతి ఆయోగ్ కీలకపాత్ర పోషిస్తుంది.
- ప్రణాళికల రూపకల్పన నుంచి దేశాన్ని పరివర్తన మార్గంలో చేపట్టిన భారీ సంస్కరణలో భాగంగానే నీతి ఆయోగ్ ఏర్పాటు చేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.
- కేంద్ర – రాష్ర్టాల మధ్య భాగస్వామ్యం, సహకారంతో అభివృద్ధి సాధించడం
- ఇది సలహాపూర్వక సంస్థ మాత్రమే.
- మేధోనిలయంగా చెప్పవచ్చు. జ్ఞాన ఆవిష్కరణల స్థావరం (Knowledge and Innovation) గా అభివర్ణించవచ్చు.
- నీతి ఆయోగ్‌కు అనేక అర్థాలున్నా ‘పాలసీ కమిషన్ అనే అర్థం ప్రధానంగా చెప్పవచ్చు.
నిర్మాణం
- నీతి ఆయోలో ప్రధానమంత్రి ఎక్స్అఫీషియో అధ్యక్షుడిగా ఉంటాడు.
- ఒక ఉపాధ్యక్షుడిని ప్రధానమంత్రి నియమిస్తాడు (ఇతను కేంద్రమంత్రి హోదా కలిగి ఉంటాడు.)
‘పాలకమండలి’ (Governing) ని ఏర్పాటు చేశారు. ఇందులో అన్ని రాష్ర్టాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు సభ్యులుగా ఉంటారు. - నలుగురు కేంద్ర మంత్రులను ఎక్స్ అఫీషియో సభ్యులను ప్రధానమంత్రి నామినేట్ చేస్తాడు.
పూర్తికాల సభ్యులుగా ముగ్గురిని నియమిస్తాడు. (వీరు ప్రముఖ విశ్వవిద్యాలయాలు, పరిశోధనా సంస్థల నుంచి వచ్చినవారై ఉండాలి.) - అవసరం మేరకు పార్ట్ టైమ్ సభ్యులుగా ఇద్దరిని తీసుకుంటారు. (వీరికి నైపుణ్యం, పరిశోధనానుభవం ఉండాలి).
- ఈ సంస్థలో ప్రత్యేక ఆహ్వానితులుగా సంబంధిత రంగంలో కృషిచేసినవారిని ప్రధానమంత్రి నామినేట్ చేస్తాడు.
- కేంద్రప్రభుత్వ కార్యదర్శి హోదాతో సమానమైన హోదా కలిగిన వారిని నిర్దిష్ట కాలానికి ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ప్రధానమంత్రి నియమిస్తాడు.
- నీతి ఆయోగ్‌కు సెక్రటేరియట్ ఉంటుంది. నాలుగు డివిజన్లు ఉంటాయి. అవి
1. అంతర్ రాష్ట్ర మంత్రి కౌన్సిల్,
2. ప్రణాళికా మూల్యాంకనం (ప్లాన్ ఎవాల్యూయేషన్),
3. ఆఫీస్, యునిక్ అథారిటీ ఆఫ్ ఇండియా,
4. డైరెక్ట్ బెనిఫిట్ టాపర్ అనే విభాగాలు నీతి ఆయోగ్‌లో ఉంటాయి - రాష్ట్ర ప్రభుత్వాలు, పరిశ్రమలకు సంబంధించిన నిపుణులు ఆయా విభాగాల్లో ఉంటారు.
మొదటి ఉపాధ్యక్షుడు – అరవింద్ పనగారియా – 5 జనవరి 2015
రెండో ఉపాధ్యక్షుడు – రాజీవ్ కుమార్ – 6 ఆగస్టు 2017
నీతి ఆయోగ్ లక్ష్యాలు
- జాతీయ అభివృద్ధి ప్రాధాన్యతలు, ప్రధాన రంగాల అభివృద్ధి వ్యూహాలను రాష్ర్టాలతో చర్చించి వారి అభిప్రాయాలకు అనుగుణంగా సూచనలు అందించడం.
- ఆర్థిక వ్యూహాలు, విధానాల్లో భాగంగా జాతీయ భద్రతకు సంబంధించి ఏ అంశాన్నైనా తిరిగి సమీక్షించడం
- గ్రామ స్థాయిలో ప్రణాళికలను రూపొందించి అవసరమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడం
ఆర్థికాంశాలతోపాటు జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న విషయాలపై సూచనలు ఇవ్వడం
ఆర్థిక పురోగతిని అందుకోలేని సమాజ అభ్యున్నతిపై ప్రత్యేక దృష్టి సారించడం - కేంద్ర, రాష్టాల మధ్య సహకారం పెంచి ఆయా ప్రభుత్వాలు ఎదుర్కొంటున్న సమస్యల్ని ఉమ్మడిగా పరిష్కరించడం ద్వారా (Cooperative Federalism) సహకార సమాఖ్య సాధన దిశగా అడుగులు వేసేందుకు అవసరమైన సూచనలు చేయడం
- వ్యూహాత్మక, దీర్ఘకాలిక విధానాలకు సంబంధించిన ప్రోత్సాహకాలను రూపొందించి, వాటి పురోగతి, సమర్థతను పర్యవేక్షించడం.
- అందరికీ సమాన అవకాశాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు కృషి చేయడం
ప్రణాళిక తయారీలో రాష్ట్ర ప్రభుత్వాలకు విధాన నిర్ణయాలకు అవసరమైన సలహాలను, సహకారాన్ని అందించడం - మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయాన్ని ఏర్పరచి అన్ని మంత్రిత్వ శాఖలకు ఒకే విజన్ ఉండేలా ప్రయత్నం చేయడం.
- గ్రామస్థాయి నుంచి ఆచరణ సాధ్యమైన ప్రణాళికలు తయారుచేసి వాటిని కేంద్ర స్థాయికి తీసుకెళ్లి తద్వారా వెనుకబడి వారిపై ప్రత్యేక దృష్టి పెట్టేందుకు సహకరిస్తుంది.
- కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రకరకాల పథకాల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించి తగిన సూచనలు అందిస్తుంది.
- మహిళా సాధికారత, పేదలకు సంక్షేమ పథకాలు, గ్రామీణాభివృద్ధి, సుపరిపాలనకు పెద్దపీట వేయడం తదితర కార్యక్రమాలకు రూపకల్పన చేయడం
విధులు
- ఆర్థిక విధానపరమైన అంశాలకు సంబంధించి వ్యూహాత్మక సాంకేతిక సలహాలతో కూడిన జాతీయ కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు సూచనలు ఇస్తుంది.
- గ్రామస్థాయిలోప్రణాళికల రూపకల్పనకు అవసరమైన యంత్రాంగాన్ని అభివృద్ధి చేసేందుకు సలహాలు ఇస్తుంది.
- జాతీయ భద్రత, ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం
- దేశాన్ని సహకార సమాఖ్యగా మార్చడానికి అనుగుణంగా రాష్ర్టాల ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లతో మూడు ఉప విభాగాలను ఏర్పాటు చేశారు.
- కేంద్ర ప్రాయోజిత పథకాలపై నైపుణ్యాల అభివృద్ధిపై, స్వచ్ఛ భారత్ మిషన్ పై విధానపరమైన చర్చలు నిర్వహిస్తారు.
- నీతి ఆయోగ్ మొదటి సమావేశం 6 ఫిబ్రవరి 2015న జరిగింది. ఈ సమావేశంలోనే మేక్ ఇన్ ఇండియా నినాదం , సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ నినాదం వచ్చాయి. ఎంబీబీఎస్ తర్వాత లైసెన్సింగ్ పరీక్ష ఉండాలన్న నియమం, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా స్థానంలో జాతీయ మెడికల్ కమిషన్ ఏర్పాటు చేసేలా మొదటి సమావేశంలో నిర్ణయాలు జరిగాయి
నీతి ఆయోగ్, ప్రణాళిక సంఘం మధ్య తేడాలు
1. నీతి ఆయోగ్ సలహా సంఘం మాత్రమే. నిధులు కేటాయించే అధికారం దీనికి లేదు – జాతీయ, రాష్ట్ర స్థాయిలో నిధులు కేటాయించే అధికారం ప్రణాళికా సంఘానికి ఉంది.
2. నీతి ఆయోగ్ సభ్యుల సంఖ్య చాలా తక్కువ – చివరి ప్రణాళికా సంఘంలో 8 మంది సభ్యులున్నారు.
3. ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి పార్ట్‌టైమ్ సభ్యులను నియమిస్తారు – పార్ట్ టైమ్ సభ్యులు లేరు.
4. నీతి ఆయోగ్‌లో ఒక ఎక్స్ అఫిషియో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, పూర్తి కాల సభ్యులు, పాక్షిక కాల సభ్యులు, నలుగురు ఎక్స్ అఫిషియో సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు, ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉంటారు – ప్రణాళికా సంఘంలో ఒక ఎక్స్ అఫిషియో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, ఒక మెంబర్ సెక్రటరీ, కొందరు పూర్తికాల సభ్యులు ఉంటారు.
5. నీతి ఆయోగ్‌లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కీలకపాత్ర పోషిస్తాయి – రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు జాతీయాభివృద్ధి మండలి సమావేశాలకు, వార్షిక ప్రణాళిక సమావేశాలకు మాత్రమే పరిమితమవుతాయి.
6. నీతి ఆయోగ్‌లో పాలకమండలి ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ మండలిలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రపాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు సభ్యులుగా ఉంటారు – ప్రణాళికా సంఘం జాతీయాభివృద్ధి మండలికి జవాబుదారి. జాతీయాభివృద్ధి మండలిలో ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లు ఉంటారు.
7. విధానాల రూపకల్పన, నిధుల కేటాయింపు విషయాల్లో రాష్ర్టాలను, కేంద్రపాలిత ప్రాంతాలను నీతి ఆయోగ్ తప్పనిసరిగా సంప్రదించాలి. వీటి ఆమోదంతోనే అంతిమ విధానాన్ని ప్రకటిస్తుంది- ప్రణాళికా సంఘం ముందు విధానాలను రూపొందిస్తుంది. తర్వాత నిధుల కేటాయింపు కోసం రాష్ర్టాలను సంప్రదిస్తుంది.
8. నీతి ఆయోగ్ కేవలం ఒక సలహాలిచ్చే మేధో నిలయం (Think Tank) మాత్రమే. తాను రూపొందించిన విధానాలను అమలుచేసే అధికారం దీనికి లేదు- ప్రణాళికా సంఘం తన విధానాలను రాష్ర్టాల పై బలవంతంగా అమలు చేస్తుంది.
9. కోఆపరేటివ్ ఫెడరలిజం నీతి ఆయోగ్ ప్రధానాంశం. ప్రధాని మోదీ అభిప్రాయంలో విధాన ప్రక్రియ పైనుంచి కింది స్థాయికి, కింది స్థాయి నుంచి పైస్థాయికి మారాల్సిన అవసరం ఉంది- ప్రణాళిక సంఘంలో కేంద్రం నిర్ణయాలను రాష్ర్టాలు తప్పకుండా పాటించాల్సిందే.
10. నీతి ఆయోగ్ లో 1. అంతర్రాష్ట్రమండలి, 2. ప్రణాళికా మూల్యాంకనం, 3. యునిక్ ఐడెంటిఫి కేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, 4. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అనే విభాగాలుంటాయి- ప్రణాళికాసంఘంలో ఇలాంటి విభాగాలు లేవు.
ఎన్బీ చారి
ఎంఏ (పీహెచ్డీ)
పోటీ పరీక్షల నిపుణులు
9063131999
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు