ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనకున్నా వచ్చే ఆదాయాన్ని ఏమంటారు? (అన్ని పోటీ పరీక్షలకు..)
ఒక సంవత్సర కాలంలో, ఒకదేశంలో ఉత్పత్తి అయిన అంతిమ వస్తుసేవల విలువల మొత్తాన్ని జాతీయాదాయం’ అంటారు.
జాతీయాదాయం – భావనలు
స్థూలజాతీయోత్పత్తి (GNP-Gross National Product)
ఒక సంవత్సర కాలంలో ఒకదేశ పౌరుల ద్వారా ఉత్పత్తి చేయబడిన (స్వదేశంలోగాని విదేశాల్లో గాని) అంతిమ వస్తుసేవల విలువల మొత్తాన్ని ‘స్థూల జాతీయోత్పత్తి’ అంటారు.
ఈ భావనలో జాతీయాదాయాన్ని ఎవరు ఉత్పత్తి చేశారు అనేది ముఖ్యం. అంటే ఇది పౌరులకు ప్రాధాన్యం ఇస్తుంది.
ఇది ఒక విశాలమైన భావన (Border Concept)
ఇది సాధారణ నివాసితుల (Narmal Residents) అనుభవాలకు ప్రాధాన్యం ఇస్తుంది.
GNP ని మార్కెట్ ధరలలో స్థూల జాతీయోత్పత్తి అని కూడా అంటారు.
GNP= C+I+G+(X-M) +(R-P) లేదా GNP = GDP+R-P
స్థూల దేశీయోత్పత్తి (GDP-Gross Domestic Product)
ఒక సంవత్సర కాలంలో ఒక దేశ భౌగోళిక సరిహద్ధుల్లో ఉత్పత్తి అయిన అంతిమ వస్తుసేవల విలువల మొత్తాన్ని ‘స్థూల దేశీయోత్పత్తి’ అంటారు.
ఈ భావనలో జాతీయాదాయం ఎక్కడ ఉత్పత్తి అయింది అనేది ముఖ్యం. అంటే ఇది ప్రదేశానికి ప్రాధాన్యం ఇస్తుంది.
ఇది ఒక సంకుచిత భావన (Narrow Concept)
ఇది భౌగోళిక సరిహద్దులకు ప్రాధాన్యం ఇస్తుంది.
ఇది భౌగోళిక అనుభవాలకు ప్రాధాన్యం ఇస్తుంది
GDP = C+I+G+(X-M)
నికర జాతీయోత్పత్తి (NNP- Net National Product)
స్థూల జాతీయోత్పత్తి నుండి తరుగుదలను తీసివేస్తే వచ్చే విలువను ‘నికర జాతీయోత్పత్తి’ అంటారు. దీనిని ఎన్ఎన్పీ గా సూచిస్తారు.
నికర జాతీయోత్పత్తి = స్థూల జాతీయోత్పత్తి – తరుగుదల
NNP = GNP -D (Depreciation-తరుగుదల)
జీఎన్పీ, ఎన్ఎన్పీ మధ్య తేడానే తరుగుదల. ఈ తరుగుదలనే యూజర్కాస్ట్ అంటారు.
నికర దేశీయోత్పత్తి (NDP- Net Domestic Product)
స్థూల దేశీయోత్పత్తి నుండి తరుగుదలను తీసి వేయగా వచ్చే విలువను నికర దేశీయోత్పత్తి అంటారు.
దీనిని ఎన్డీపీగా సూచిస్తారు.
నికర దేశీయోత్పత్తి = స్థూల దేశీయోత్పత్తి – తరుగుదల
NDP = GNP -D
ఎన్డీపీ, జీడీపీ మధ్య తేడానే తరుగుదల.
ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయాదాయం (NNP at Factor Cost )
వస్తుసేవల ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్న ఉత్పత్తి కారకాలకు (భూమి, శ్రమ, మూలధనం, వ్యవస్థాపన) వాటి ప్రతి ఫలాలు (బాటకం, వేతనం, వడ్డీ, లాభం) చెల్లిస్తారు.
ఈ చెల్లింపులు ఉత్పత్తి సంస్థలకు ఉత్పత్తి వ్యయం అవుతుంది.
ఈ ఉత్పత్తి కారకాల ప్రతిఫలాలను కలపడం ద్వారా జాతీయ ఆదాయం తెలుస్తుంది.
ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయం =బాటకం+ వేతనం+ వడ్డీ +లాభం
ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయం అంటారు.
జాతీయాదాయం మొత్తం ఉత్పత్తి కారకాల మధ్య పంపిణి కాదు. అందుకు కొంత భాగం పరోక్ష పన్నుల రూపంలో ప్రభుత్వానికి చెల్లిస్తారు.
ఈ పన్నులను జాతీయాదాయం నుంచి మినహాయించి, మిగిలిన ఆదాయాన్ని పంపిణి చేస్తారు. అంతేకాక ప్రభుత్వం కొన్ని వస్తు సేవల ఉత్పత్తికి సబ్సిడీ కూడా ఇస్తుంది. దీన్ని జాతీయాదాయంలో కలపాలి.
ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా జాతీయాదాయం = మార్కెట్ ధరలలో నికర జాతీయోత్పత్తి + సబ్సిడీలు- పరోక్ష పన్నులు – ప్రభుత్వ సంస్థల లాభాలు.
వ్యష్టి ఆదాయం (Personal Income)
ఒక సంవత్సర కాలంలో దేశంలోని వ్యక్తులకు వివిధ రూపాల్లో లభించిన ఆదాయ మొత్తాన్ని వ్యష్టి ఆదాయం అంటారు.
వ్యష్టి ఆదాయాన్ని ‘వ్యక్తిగత ఆదాయం’ అని వైయక్తిక ఆదాయం అని కూడా అంటారు .
వస్తు సేవల ఉత్పత్తిలో పాల్గొనడం వల్ల లభించిన ఆదాయం, వస్తుసేవల ఉత్పత్తిలో పాల్గొనక పోవడం వల్ల కూడా వచ్చే ఆదాయాన్ని కలిపితే వచ్చే ఆదాయాన్ని వ్యష్టి ఆదాయం అంటారు.
వ్యష్టి ఆదాయం= వస్తుసేవల ఉత్పత్తిలో పాల్గొనడం వల్ల వచ్చే ఆదాయం + బదిలీ చెల్లింపులు
వ్యష్టి ఆదాయం = ఆర్జిత ఆదాయం + అనార్జిత ఆదాయం
జాతీయాదాయంలో కార్పొరేటు లాభాలు, లాభాలపై పన్నులు, సాంఘిక భద్రత విరాళాలు మినహాయించి, కుటుంబాలకు లభించిన బదిలీ చెల్లింపులు కలపాలి.
వ్యష్టి ఆదాయం = జాతీయాదాయం – (కార్పొరేటు లాభాలు + లాభాలపై పన్నులు + సాంఘిక భద్రత విరాళాలు) + బదిలీ చెల్లింపులు.
l P1=NI -(UP+T+SSC) +TP
సబ్సిడీలు (Subsides) :
ఉత్పత్తి సంస్థలు వారు అమ్మే వస్తువుల ధరను తగ్గించి ప్రజలకు అందించే విధంగా ప్రభుత్వం అందించే పొత్సాహకాన్ని/ సహాయాన్ని సబ్సిడీలు అంటారు.
ప్రభుత్వం వస్తుసేవలను కొనుగోలు చేయకుండానే ఉత్పత్తి సంస్థలకు ఇచ్చే ఆర్థిక సహాయాన్నే సబ్సిడీలు అంటారు. దీన్ని రాయితీలు అని కూడా అంటారు.
ఉదా: అయిల్, గ్యాస్, ఎరువులు
బదిలీ చెల్లింపులు
ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనక పోయినా వచ్చే ఆదాయాన్ని బదిలీ చెల్లింపులు అంటారు.
ఉత్పత్తికి ఎటువంటి తోడ్పాటు/ సహకారం ఇవ్వకుండా పొందిన ఆదాయాన్ని బదిలీ చెల్లింపులు అంటారు.
ఎటువంటి ప్రతిఫలం/సహకారం అశించకుండా ఉచితంగా లభించేవి బదిలీ చెల్లింపులు
ఉదా: పెన్షన్లు, సబ్సిడీలు, నిరుద్యోగభృతి స్కాలర్షిప్స్, కానుకలు, విరాళాలు రుణాలపై వడ్డీ.
బదిలీ చెల్లింపులనే ‘ఏకపక్ష బదిలీలు’ (Unilateral Payments) అని కూడా అంటారు.
సాధారణ నివాసి (Normal Resident):
ఒక దేశంలోపల నివసిస్తూ తమ ఆర్థిక ఆసక్తులన్నింటిని ఆ దేశంపై కనబరిచే వారిని సాధారణ నివాసితులు అంటారు. సాధారణంగా సాధారణ నివాసితులు కలిగి ఉండి ఉత్పత్తి కారకాల చేత జాతీయాదాయం ఉత్పత్తి చేయబడుతుంది.
దేశీయ భూభాగం (Domostic Territory):
ఒక దేశ, ఒక జాతి భౌగోళిక సరిహద్దులతో కూడిన ప్రాంతం. ఇందులో ప్రాదేశిక జలాలు అంటే అందులో గల చమురు బావులు, ఓడలు, విదేశీ రాయబార కేంద్రాలు, మిలిటరీ కేంద్రాలు కూడా భాగమే.
ఇది మొత్తం సముద్రంలోపలికి 200 నాటికల్మైళ్ల దూరం వరకు విస్తరించి ఉంటుంది.
అంతిమ వస్తుసేవలు (Final goods & Services)
అంతిమ వినియోగానికి సిద్ధంగా ఉండి మానవుని కోరికలను, అవసరాలను తీర్చగలిగే వస్తువులను అంతిమ వస్తుసేవలు అంటారు. ఇందులో వస్తువులు, సేవలు కూడా ఉంటాయి.
వస్తువుల్లో వినియోగ వస్తువులు, ఉత్పాదక వస్తువులు ఉంటాయి.
మాధ్యమిక వస్తువులను పరిగణనలోకి తీసుకోరాదు.
ఉదా: సిమెంట్, ఇటుకలు
జాతీయాదాయంలో/జాతీయదాయ లెక్కింపులో అంతిమ వస్తుసేవలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి.
వినియోగ వస్తువులు (Consumer goods) :
మానవుడి కోరికలను ప్రత్యక్షంగా తీర్చే వస్తువులను వినియోగ వస్తువులు అంటారు.
ఉదా: ఆహారం, పండ్లు, పాలు, వస్త్రం, పెన్ను, ఫోన్, టీవీ.
ఒకసారి వినియోగంతో నశించే వినియోగ వస్తువులు
ఉదా: పండ్లు, పాలు, ఆహారం, నీరు
ఒకటి కంటే ఎక్కువసార్లు వినియోగించి తర్వాత నశించే వినియోగ వస్తువులు
ఉదా: పెన్ను, టీవీ, సెల్
ఉత్పాదక వస్తువులు (Producer goods):
మానవుడి కోరికలను పరోక్షంగా తీర్చే వస్తువులను ఉత్పాదక వస్తువులు అంటారు. వీటినే మూలధన వస్తువులు (Capital goods) అని కూడా అంటారు.
ఉదా: భూమి, భవనాలు, యంత్రాలు, యంత్రపరికరాలు
చర మూలధన వస్తువులు (Variable capital goods)
ఒకసారి వినియోగంతో నశించే మూలధన వస్తువులు.
ఉదా: ముడి పదార్థాలు, విద్యుత్, పెట్రోల్, బొగ్గు
స్థిర మూలధన వస్తువులు (Fixed capital goods):
ఉత్పత్తి ప్రక్రియలో ఒకసారి కంటే ఎక్కువ, కొంతకాలంపాటు ఉపయోగపడే మూలధన వస్తువులు.
ఉదా : భవనాలు, యంత్రాలు, పరికరాలు
తరుగుదల (Depreciation):
ఉత్పత్తి ప్రక్రియలో ఉపయోగించే స్థిర మూలధన వస్తువులు వాడే కొద్ది అరిగిపోతాయి, తరిగిపోతాయి. (Wear and Tear) దీనినే తరుగుదల లేదా స్థిర మూలధనం వినియోగం (Consumption of fixed capital) అని అంటారు. దీనినే యూజర్ (User cost)కాస్ట్ అని కూడా పిలుస్తారు.
మాధ్యమిక వస్తువులు (Intermediary goods):
పూర్తిగా తయారు కాకుండా ఇంకా తయారీలో ఉన్న వస్తువులను మాధ్యమిక వస్తువులు అంటారు.
ఉత్పత్తి ప్రక్రియలో వివిధ దశల్లో ఉన్న వస్తువులను మాధ్యమిక వస్తువులు అంటారు.
ఉదా: బొగ్గు, నూలు, ఉక్కు, సిమెంటు, ఇటుకలు
పరోక్ష పన్నులు (Indirect Taxes) : వస్తుసేవలపై విధించే పన్నులు.
పరోక్ష పన్నులు పన్ను భారాన్ని ఇతరులపైకి బదిలీ అవుతాయి. పరోక్ష పన్నులు వస్తు సేవల ధరలను పెంచుతాయి.
ప్రాక్టీస్ బిట్స్
1. ఈ కింది వాటిలో సరైనది ఏది?
ఎ) GNP = C + I + G+(X-M)+(R-P)
బి) GDP = C + I + G+(X-M)
సి) NNP = GNP – D
డి) పైవన్నీ
2. జాతీయాదాయాన్ని ఎవరు ఉత్పత్తి చేశారు అనేది?
ఎ) స్థూల జాతీయోత్పత్తి (GNP)
బి) స్థూల దేశీయోత్పత్తి (GDP)
సి) నికర జాతీయోత్పత్తి (NNP)
డి) నికర దేశీయోత్పత్తి (NDP)
3. యూజర్ కాస్ట్ అని దేనిని పిలుస్తారు?
ఎ) పెరుగుదల బి) తరుగుదల
సి) జీఎన్పీ డి) జీడీపీ
4. స్థూల దేశీయోత్పత్తి నుండి తరుగుదలను తీసివేస్తే వచ్చే విలువను?
ఎ) స్థూల జాతీయోత్పత్తి
బి) నికర జాతీయోత్పత్తి
సి) స్థూల దేశీయోత్పత్తి
డి) నికర దేశీయోత్పత్తి
5. ఉత్పత్తికారకాలు, వాటి ప్రతిఫలాలు భూమికి బాటకం, శ్రమకు వేతనం, మూలధనానికి వడ్డీ, వ్యవస్థాపకుడికి లాభం/ నష్టం లను కలపగా వచ్చే ఆదాయం ఏమిటి?
ఎ) ఉత్పత్తి కారకాల ఖరీదు దృష్ట్యా ఆదాయం
బి) వ్యష్టి ఆదాయం
సి) వ్యయార్హ ఆదాయం
డి) తలసరి ఆదాయం
6. జాతీయాదాయం ఎక్కడ ఉత్పత్తి అయింది అనేది?
ఎ) జీఎన్పీ బి) జీడీపీ
సి) ఎన్ఎన్పీ డి) ఎన్డీపీ
7. స్థూల జాతీయోత్పత్తి (జీఎన్పీ) అనేది?
ఎ) Normal Residences అనుభవాలకు ప్రాధాన్యత ఇస్తుంది.
బి) భౌగోళిక అనుభవాలకు ప్రాధాన్యం ఇస్తుంది సి) ఎ. బి
డి) భౌతిక అంశాలకు ప్రాధాన్యత ఇస్తుంది
8. స్థూల దేశీయోత్పత్తి అనేది?
ఎ) విశాలమైన భావన
బి) సంకుచిత భావన
సి) సంతులిత భావన డి) పైవన్నీ
9. స్థూల ఉత్పత్తికి – నికర ఉత్పత్తికి తేడాను ఏమంటారు?
ఎ) నికర ఎగుమతులు
బి) నికర దిగుమతులు
సి) తరుగుదల డి) పెరుగుదల
10. వ్యష్టి ఆదాయానికి మరొక పేరు?
ఎ) వ్యక్తిగత ఆదాయం
బి) వైయక్తిక ఆదాయం
సి) సమష్టి ఆదాయం డి) ఎ, బి
11. సబ్సిడీలకు ఉదాహరణ.
ఎ) ఆయిల్ గ్యాస్
బి) ఎరువులు
సి) సంక్షేమ చెల్లింపులు
డి) పైవన్నీ
12. ఒక సంవత్సర కాలంలో ఒక దేశంలో వ్యక్తులకు లభించే ఆదాయాన్ని ఏమంటారు?
ఎ) వ్యష్టి ఆదాయం
బి) వ్యయార్హ ఆదాయం
సి) సమష్టి ఆదాయం
డి) పైవన్నీ
13. ప్రభుత్వం వస్తుసేవలను కొనుగోలు చేయకుండానే ఉత్పత్తి సంస్థలకు ఇచ్చే ఆర్థిక సహాయాన్ని ఏమంటారు?
ఎ) బదిలీ చెల్లింపులు బి) సబ్సిడీలు
సి) రాయితీలు డి) బి, సి
14. వ్యష్టి ఆదాయం అనేది ?
ఎ) ఆర్జిత ఆదాయం
బి) అనార్జిత ఆదాయం
సి) బహుముఖ బదిలీలు డి) పైవన్నీ
15. బదిలీ చెల్లింపులకు మరొక పేరు?
ఎ) ఏక ముఖ బదిలీలు
బి) ద్విముఖ బదిలీలు
సి) బహుముఖ బదిలీలు డి) పైవన్నీ
16. కిందివాటిలో సరికానిది?
ఎ) GNP + GDP + R-P
బి) BDP = GDP -D
సి) NNP= GNP-D
డి) GDP = C+I+G+X+M
17. బదిలీ చెల్లింపులకు ఉదాహరణ.
ఎ) నిరుద్యోగ భృతి పెన్షన్లు
బి) కానుకలు, విరాళాలు, రుణాలపై వడ్డీ
సి) సబ్సిడీలు, స్కాలర్షిప్లు డి) పై అన్నీ
18. ఒక ప్రదేశానికి ప్రాధాన్యత ఇచ్చేది?
ఎ) జీఎన్పీ బి) జీడీపీ
సి) ఎన్ఎన్పీ డి) ఎన్డీపీ
19. ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొనక పోయినా వచ్చే ఆదాయాన్ని ఏమంటారు?
ఎ) సబ్సిడీలు బి) బదిలీ చెల్లింపులు
సి) ఏకపక్ష బదిలీలు డి) బి, సి
20. జాతీయాదాయం అనేది?
ఎ) ప్రభుత్వ ఆదాయం
బి) ప్రభుత్వ బడ్జెట్
సి) ఉత్పత్తి కారకాల మొత్తం ఆదాయం
డి) ప్రభుత్వ సంస్థల లాభాలు
సమాధానాలు
1-డి 2-ఎ 3-బి 4-డి 5-ఎ 6-బి 7-ఎ 8-బి 9-సి 10-డి 11-డి 12-ఎ 13-డి 14-సి 15-ఎ 16-డి 17-డి 18-బి 19-డి 20-సి
పానుగంటి కేశవరెడ్డి
లెక్చరర్
గోదావరిఖని,పెద్దపల్లి జిల్లా
9949562008
RELATED ARTICLES
Latest Updates
దేశంలో ‘జీవన వీలునామా’ నమోదు చేసిన మొదటి హైకోర్టు?
క్యారెట్ మొక్క ఎన్ని సంవత్సరాలు జీవిస్తుంది?
ప్రపంచ ప్రసిద్ధి అగాధాలు – ఐక్యరాజ్యసమితి లక్ష్యాలు
అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించేందుకు ఉపయోగించే రసాయనం?
దేశాల అనుసంధానం.. వాణిజ్య అంతఃసంబంధం
కణ బాహ్య జీర్ణక్రియ
ఇంటి పని వద్దన్నవారు.. స్వీయ శిక్షణ ఉండాలన్నవారు
జీవావరణ వ్యవస్థకు కావలసిన మూలశక్తి దారులు?
మౌజియన్ అనే గ్రీకు పదానికి అర్థం?
సమాజ మేధో కేంద్రాలు.. నాగరికతకు చిహ్నాలు